ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్న పాలమూరు

అవును నాది సహజ మరణం

నీది అసహజ మరణం

నేను అనామకుడిని

నా మరణం ఒకవార్త కాదు,

నాకే స్క్రోలింగూ రాదు

నీవు సహజంగా గుండెపోటుతో మరణిస్తేనే

బ్రేకింగ్ న్యూస్ ..

నేను ఆకాశం వైపు చూసేవాడిని

ఏ మబ్బూ నా కోసం కన్నీరు కార్చదు

నీవు ఆకాశంలో తిరిగేవాడివి

నీలిమేఘాల దొంతరలు నీవే

నా కాళ్ల క్రింద జారిన నేల వాసన

ఏ నార్త్ బ్లాక్ గోడలకూ తెలియదు

నా భార్య మెడనుంచి తెగిన పసుపుతాడు

ఏ సౌత్ బ్లాక్ కంటపడదు

నీకు భూమీ ఇచ్చి, అప్పూ ఇచ్చి

వాడు నిన్ను విదేశాలకు సాగనంపుతాడు..

 

తెలంగాణలో ఒక ఎడారి ఉంది. సముద్రమూ ఉంది. నీరు ఉన్నట్లు భ్రమకలిగించే ప్రాంతమే ఎడారి అయితే ఆ ఎడారి పాలమూరు అనే మహబూబ్ నగర్. ఆ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తుంది. కాని ఆ నదీజలాలు అక్కడి వాసులకు అందుబాటులో లేవు. అక్కడ సముద్రమూ ఉన్నది. ఎందుకంటే అక్కడ కవుల గుండెల్లో ఆగ్రహపు అలలు ఉవ్వెత్తున ఎగుస్తుంటాయి.

‘కంటినుంచి కన్నీరై కురవకపోతే అది రక్తమెలా అవుతుంది?’ అని హిందీ కవి జయశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. కాని కంటినుంచి కన్నీరై కురవకపోతే, అది కవిత్వమెలా అవుతుంది? అని  పాలమూరు కవులు ప్రశ్నిస్తున్నారు.

మనోహర్ మల్గోంకర్ అనే రచయిత రాసిన నవలలో ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, రాకపోయినా నా జీవితంలో మార్పేముంది?’ అని ఒక నిరుపేద ప్రశ్నిస్తాడట. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలో కూడా బండివాడి పాత్ర ద్వారా  ‘స్వాతంత్ర్యం వస్తే మన హెడ్ కానిస్టేబుల్ బదిలీ అవుతాడా..’ అన్న ప్రశ్నను రచయిత వేయిస్తాడు.  పాలకులు మారినా వ్యవస్థలు మారకపోతే ప్రయోజనం లేదన్న ఒక మహాసత్యాన్ని వారు ఈ ప్రశ్నల ద్వారా మన ముందుంచారు.

రచయితలు, కవులు వేసే ప్రశ్నల్లో కాలం మారినా పెద్ద మార్పుండదు.  దిగంబర కవి భైరవయ్యలా మనం సాకిన విష నాగుల విషకీలలు మన తలకే కొరివి పెట్టాయని బాధపడుతూనే ఉంటారు. మనిషి పాతబడతాడు. కాని కవిత్వం పాతబడదు. కవిత్వం ఎప్పటికప్పుడు తిరగబడుతూనే ఉంటుంది. కడుపులో రేగిన బడబానలానికి ఎవరూ అర్థం చెప్పరు. రాలిన ఆకులకు లెక్క ఉండదు. ప్రేమ్ చంద్, ఇక్బాల్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ నుంచి నేటి వరకు వేర్వేరు రచయితలు, కవులు రైతాంగ సమస్యలపై కలం ఎత్తారు. ‘ఏడాదికి రెండు సార్లు భూమి హృదయాన్ని చీల్చి నేను సమాధి అవుతున్నాను’ అని కైఫీ ఆజ్మీ ఒక కవితలో రాశారు. ‘కీలుగుర్రం మీద బాలీసు నానుకుని ప్రాణాలు లేనట్టి బగమంతుడొచ్చాడు. కూలిమాటడగండిరా,అన్నాలు చాలవని చెప్పండిరా..’ అని తెన్నేటి సూరి రాశాడు.

అయితే కరువు, ఆకలి, వలసలు అనాదిగా ఎదుర్కొంటున్న ఒక ప్రాంతంలో తమలో రేగుతున్న ఈ ప్రశ్నలను కవిత్వం రూపంలో కవులు వ్యక్తం చేయడం అనేది అరుదు. ఆ ప్రత్యేకత పాలమూరు జిల్లా కవులకు దక్కుతుంది. వారు  తమ జిల్లా రైతులు, కూలీలు, నిరుపేదలు ఎదుర్కొంటున్న కడగండ్లపై ఇప్పటికే మూడు కవితా సంకలనాలు సమిష్టిగా తెచ్చారని, అక్కడి వేర్వేరు కవులు కూడా ఇద సమస్యలపై కవితా సంకలనాలు వెలువరించారని ఇటీవల అక్కడికి వెళ్లినప్పుడు తెలిసి ఆశ్చర్యం వేసింది. దేశంలోకాని, ప్రపంచంలో కానీ  వివిధ క్షామ పీడిత ప్రాంతాల్లో కవులు ఇదే విధంగా సమిష్టిగా  స్పందించారా.. అన్న విషయం మాత్రం తెలియదు.పాలమూరును కవిత్వంవైపు నడిపించి, కవిత్వం ద్వారా ప్రపంచాన్ని ప్రశ్నించాలని పూనుకున్న ఘనత పాలమూరు అధ్యయన వేదిక , దాని సూత్రధారులు హరగోపాల్, రాఘవాచారి లదని మాత్రం చెప్పక తప్పదు.

‘తెలంగాణ గురించి కమ్మని కావ్యం రాయాలనుకున్నాను కాని కన్నీటి కథలు రాస్తాననుకోలేదు..’ అన్నాడు కవి కె. అయ్యన్న ‘పాలమూరు తెలంగానం’ అన్న సంకలనంలో. ‘వెయ్యెకురాలు పారే చెరువులున్నా ఎండిన కొబ్బరి చిప్పోలె నోర్లు తెరిచి ఆకాశం వైపు చూపు  అని రాశాడు’ వనపట్ల సుబ్బయ్య. ‘రేగడి విత్తుల్ని సల్లినోడు మన గుండెల్లో గునపాలు గుచ్చుతుండు..’ అని బాధపడ్డాడు భీంపల్లి శ్రీకాంత్.  ‘పొలంలో వేసిన గింజలు దళారుల నోట్లో మొలకెత్తుతున్నవి..’ అని  అదే బాధను పంచుకున్నాడు చిన్నగల్ల బాలరాజు. ‘నేను తెలంగానోన్ని..నను రమ్మని ప్రియంగా పిలిచిన స్మశానపు చెలి కౌగిలిలో బందీని.. నేను మోసపోయిన గోసిగాన్ని. కటికవాని దుకాణంలో కొక్కేనికి వేలాడుతున్న మాంసపు ముద్దను’ అని తన పరిస్థితిని వివరించాడు దానక్క ఉదయభాను. ‘నీల్లను నోట్లపట్టినోడే భూమిని పిడికిట్లపడ్తున్నడు.. ‘అని దోపిడీ స్వరూపాన్ని వివరించాడు పరిమళ్.

‘శవాలుజండాలైతయి.. ‘అన్నాడు వల్లభాపురం జనార్దన్ ‘పాలమూరు రైతుగోస’ అనే మరో కవితా సంకలనంలో.. ‘ఈ మట్టే కదా విత్తనాన్ని ముద్దాడి తొలకరితో తానమాడించి పైకి ఎగజిమ్మింది ఈ మట్టే కదా..’ అని ఆలపిస్తాడు నాగవారం బాల్ రాం. ‘సద్దిమూట కట్టుకున్నంత సుతారంగా శవం మూట కట్టుకున్నాడు నా రైతు తండ్రి’ అని విలపిస్తాడు జనజ్వాల. ‘అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తుంటే కలువ పువ్వుపై కవిత్వమెలా వస్తుంది.. నేనేం చేయగలను రైతు నొసటిపై అక్షర సంతకం చేయడం తప్ప’ అని బాధపడతాడు పి. కిరణ్ కుమార్. ‘కాలుకింది మట్టి, నెత్తి మీది నింగి. పండిన నాలుగిత్తులతో మార్కెట్లో శవ జాగరణ..’అంటాడు కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి. ‘కొన్ని వేలసార్లు ఘనీభవించిన త్యాగాల నెత్తురుతో నేనా రక్తంలోకి ప్రవేశించి ఒక శ్వాసను తీసుకోవాలి..’అని ప్రవహిస్తాడు షహాబాజ్ అహ్మద్ ఖాన్. ‘ప్రపంచ వాకిట్లో ఒప్పందాల ముగ్గులేసుకున్నప్పుడే కదా మన భూముల్లో చావు నాట్లు మొదలైంది.. నిజంగా నాకు ప్రాణం కనిపిస్తే రైతు తలపాగాల్లో  దాచి పెట్టేవాన్ని..’ అని మృత్యురహస్యాన్ని విప్పి చెబుతాడు ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్.  ‘వాళ్లు మట్టి పొరల్లోంచి మళ్లీ మళ్లీ జ్వలించిన వాళ్లు. మిథ్యావాదం లోతులు తవ్వి పదార్థం పిడికిట పట్టి చార్వాకం పలికిందివాళ్లు..’ అని అసలైన భౌతికవాదులు రైతులేనంటాడు రాఘవాచారి.

‘రైతులు వాన కోయిలలై మబ్బులు కురిసే తొలకరిచినుకులకోసం ఎన్నాళ్లు ఎదురు చూడాలి.’ అని ప్రశ్నిస్తాడు జలజం సత్యనారాయణ ‘పాలమూరు జలగోస’ అనే మూడో కవితా సంకలనంలో. ‘భగ్గున మండిన భూమ్మీద పిడికెడు కలల్ని ఏరుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది.. శిఖరాగ్రాల మీద కుట్ర జరుగుతున్నప్పుడు నీటికోసం దోసిలిపట్టడం ఉత్త అవివేకమే అవుతుంది’ అని వాస్తవాన్ని పలికించాడు ఉదయ మిత్ర. ‘వేల సంవత్సరాలుగా ఇక్కడ పుట్టిన పాపానికి జానెడు పొట్టకోసం వేల మైళ్లు వలస పోయిందెవరు..’ అని అడిగాడు ఉదయ్.  ‘పగిలిన నేలసందుల్లోకి నీటి చుక్కల్ని పిలుస్తూ కరువు గుండెను కాగితంలా పరిచి మబ్బులకు దుఃఖ లేఖను పంపించే నేల నా పాలమూరు..’ అని వాపోతాడు సూర్య చంద్ర. ‘మేమేమన్ననింగి కొప్పులో పూసిన నక్షత్రాలు తెంపియన్నమా..’ అని అడిగాడు బోల యాదయ్య

ఈ మూడు కవితా సంకలనాల్లో కవిత్వం రాసిన వాళ్లు పాలమూరు నేలతల్లి స్తన్యాన్ని తాగి ఆ నేల రుణం తీర్చుకోవాలనుకుంటున్నవాళ్లు. వాళ్లు భూమి పుత్రులు. తడి తెలియని మట్టి నేలలో పుట్టినా గుండెలో ఎప్పటికీ ఆరని తడి ఉన్నవారు. కళ్లలో నీళ్లు ఇంకని వాళ్లు. ‘పగుళ్లిచ్చిన పాలమూరు నేలలు ఇక రైతుల స్వేదంతో , రక్తంతో కాదు కవుల కన్నీళ్లతో తడవాలి..’ అని తెలుసుకున్నవాళ్లు. ‘ఈ భూమ్మీద కంఠనాళాలు తెగేటట్లు అరవకపోతే విస్ఫోటనం చెందకపోతే మనకు రేపటి చరిత్ర అంటూ ఏమీ మిగలదు..’ అని గ్రహించిన వాళ్లు. వీరిలో చాలా మందికి కవితా రహస్యం తెలుసు. అందరికీ జీవన రహస్యాలు తెలుసు

విచిత్రమేమంటే ఈ కవితా సంకలనాల్లో ఒకటి ‘పాలమూరు తెలంగానం’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వెలువడింది. రెండవది ‘పాలమూరు రైతు గోస’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏడాదికి వెలువడింది. చివరకు ‘పాలమూరు జలగోస’ నాలుగేళ్ల బంగారు తెలంగాణను కళ్లారా చూసిన తర్వాత  వెలువడింది. మొదటి కవితాసంకలనంలో  నిప్పులు విరజిమ్మినవాళ్లే రెండవ కవితా సంకలనంలో ఆశల కళ్లతో ఆర్థ్ర్తతను పలికించారు. మూడవ కవితా సంకలనంలో ఒక నిరీక్షణ ఆశాభంగమై ఆగ్రహంగా మారుతున్న సన్నివేశం ప్రతిఫలిస్తోంది.

అందుకే కాలమనే కత్తిపై నడుస్తూ తమ పాదాల నెత్తుటి అక్షరాలను ప్రవహిస్తూ ప్రశ్నల సూర్య కిరణాల్ని తమ కనురెప్పలపై నుంచి పరావర్తనం చేయకతప్పని వారు నేటి కవులు. ఇవాళ పాలమూరు జిల్లాయే ప్రపంచీకరణ పరిష్కరించలేని ఒక సవాలుగా పరిణమించింది. ఈ కవితలు లేవనెత్తిన ప్రశ్నలు  ప్రపంచ ఆర్థిక వేత్తలను, పాలకులను మట్టిపొరల్లో పరిష్కారాలను అన్వేషించమని చెబుతున్నాయి.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వాస్తవాన్ని కళ్ళముందు ఉంచారు సార్.ఇంకా పాలమూరు కృష్ణ జలాలతో కొట్లాడుతూనే ఉంది.అవును ప్రశ్నలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి..

  • Paalakula vidhaanaale paalamoorunu karuvu nelaga migilinchaayi. Paalamoorunu Labour reserve ga migilchaayi. Paalamooru dopidi 1 va dasa Ni jam, rendava dasa congres, 3 va dasa Tdp, 4 va dasa TRS. Ee kaalaaniki paggaalu lekunda poyaayi. Mee vyaasam sarigaane pariseelana chestundi.

  • చాలా బగరాశారు మిత్రమా . నేను 1980ల్లో కేంద్ర ప్రభుత్వ ఖనిజ అభివృద్ది జిల్లాలో ఉన్న ఇనుము, మాంగనీస్ లో పని చేసినప్పుడు , నెల్లూర్ చుట్టుపక్కలున్న మైకా గనుల్లోనూ , బెళ్ళారి జిల్లాలో ఉన్న ఇనుము, మాంగనీస్ గానుల లో పాలమూర్ నుంచి వలస వచ్చిన నిర్భంద (బాండెడ్) కార్మికుల జీవితలను ప్రత్యక్షంగా చూసి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలలో రాశాను. ఖనిజ గానుల్లో ఎంతో మండి హీనా బతుకాలను చాలా గనులలో జరుగుతోంది . అసలు అడవులలోంచి ఆదివాసులను వెల్ల గొట్టే ప్రయత్నాలు ఖనిజ వ్యాపారస్తులకోసమే .

  • చాలా బగరాశారు మిత్రమా . 1980లలో కేంద్ర ఖనిజ అభివృద్ది శేఖ లో పని చేసినప్పుడు నెల్లూర్ చుట్టుపక్కలున్న మైకా గనుల్లోనూ , బెళ్ళారి జిల్లాలో ఉన్న ఇనుము, మాంగనీస్ గానుల లోనూ పాలమూర్ నుంచి వలస వచ్చిన నిర్భంద (బాండెడ్) కార్మికుల జీవితలను ప్రత్యక్షంగా చూసి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలలో రాశాను. ఖనిజ గానుల్లో ఎంతో మండి హీనా బతుకులు చాలా గనులలో జరుగుతోంది . అసలు అడవులలోంచి ఆదివాసులను వెల్ల గొట్టే ప్రయత్నాలు ఖనిజ వ్యాపారస్తులకోసమే .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు