ఒక మామూలు అమామూలు మనిషి బక్షీ గారు!

నేనూ, మూర్తీ, రావూ 1966-68 లలో మాస్టర్స్ చేస్తున్న రెండేళ్ళలోనూ మాకు ఒక అలవాటు ఉండేది.

బొంబాయిలో ఎవరైనా మాకు చిన్నప్పటి నుంచీ తెలిసిన స్నేహితులు కానీ, బంధువులు కానీ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరించి, కబుర్లు చెప్పుకుని ఇంటి భోజనం చేసి రావడమే మా అలవాటు. విశేషం ఏమిటంటే వాళ్ళు మాలో ఒక్కరికే తెలిసినా ఎవరింటికైనా సరే మేము ముగ్గురం కలిసే వెళ్ళేవాళ్ళం. ఉదాహరణకి మా పెద్దన్నయ్య సహాధ్యాయి, టీకాల మేష్టారి పెద్దబ్బాయి ఏడిద కామేశ్వర రావు చెంబూరు లో భార్య కమల, ఇద్దరు కొడుకులతో ఉండే వాడు.

బొంబాయి లో వై.కె. రావు గా చెలామణీ అయిన అతను లెడర్లీ కంపెనీలో రామలింగ స్వామి గారి దగ్గర పని పెద్ద ఉద్యోగంలోనే పని చేసేవాడు. రామలింగ స్వామి గారయితే ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరే కాక బొంబాయి తెలుగు ప్రముఖులు. బొంబాయి వదలి పెట్టి హైదరాబాద్ వచ్చి, వెటినరేరియన్ యిన కామేశ్వర రావు కోళ్ళకి పౌష్టికాహారం తయారు చేసే కంపెనీ పెట్టి మంచి వ్యాపార వేత్త గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన  పెద్ద తమ్ముడు వేంకటేశ్వర రావు గారు నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ అయితే ఆ తర్వాతి వాడు లక్ష్మీ నారాయణ చాలా ఆప్త మిత్రుడు. ఇప్పటికీ నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా నన్ను మొదట పలకరించే వాడు లచ్చి…లచ్చి అనేది లక్ష్మీ నారాయణ ముద్దు పేరు. మంచి క్రికెట్ ఆటగాడు.

ఇలా మేము తరచూ వెళ్ళే ఇళ్ళు ముగ్గురికీ కలిపి అర డజను పైనే ఉన్నా పి.ఆర్ కె. రావు కుటుంబ మిత్రుడు బక్షీ గారు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ముందు బక్షీ అంటే ఆయన ముస్లిం అనుకున్నాం నేనూ, మూర్తీ. కానీ ఆయన అసలు పేరు వేములకొండ సత్యనారాయణ బక్షీ. ద్రావిడ బ్రాహ్మణులు. ఆయన పూర్వీకులకి ఎవరో సుల్తానులు ఎందుకో ఈ బక్షీ అని బిరుదు ఇచ్చారుట. రావు అన్నయ్య కిష్టప్పకి బక్షీ గారు  సహాధ్యాయి. అంచేత ఘాట్ కోపర్ లో ఉండే ఆయనింటికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు వెళ్ళినా “నిన్ననే టోక్యో నించి వచ్చాను. కిందటి వారం లండన్, ఫ్రాంక్ ఫర్ట్ అయ్యాక మాస్కో కూడా వెళ్ళిపుచ్చాను ” అని అచ్చు విజయనగరం మాండలీకం లో ఎడతెగని కబుర్లు చెప్పేవారు. మా రావు ది కూడా విజీనారమే మరి. ఆయన ఉద్యోగం ఎయిర్ ఇండియా వారి శాకాహార విభాగానికి అధిపతి. అంచేత ఆ ఉద్యోగం ఆయన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియా వెళ్ళే అన్ని దేశాలకీ తీసుకు వెళ్తుంది. తీరా ఆయన చదువుకున్నదేమో ఆంధ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిగ్రీ తర్వాత బొంబాయిలో  లాయర్ డిగ్రీ. అలాంటిది ఏ విధమైన సంబంధమూ లేని వెజిటేరియన్ చెఫ్ ఎలా అయ్యాడూ అనే  ఆయన జీవిత గాధ వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.

బక్షీ గారు చదువుకునేటప్పుడే మొత్తం ఇండియా అంతా చూసి తీరాలనే కోరిక బలంగా ఉండేదిట. కానీ బీద కుటుంబం. డబ్బు లేదు. అంచేత రోజూ విజయ నగరం రైల్వే స్టేషన్ కి ఒక మిత్రుడితో వెళ్లి ఏదైనా రైలు రాగానే ఆ ఇంజను డ్రైవర్ తో కబుర్లు చెప్పేవారు. అప్పుడు ”గూడ్స్ బండి లో ప్రయాణీకులు ఉండరు కదా. ఆ డ్రైవర్ ని బతిమాలుకుని ఈ పెట్టెల్లో ఎక్కడో కూచుని అన్ని ఊళ్లకీ వెళ్లి చూడవచ్చును కదా” అని అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది.

చాలా మంది డ్రైవర్లు అందుకు ససేమీరా ఒప్పుకో లేదు కానీ మొత్తానికి ఆ ఆలోచనని ఆచరణలో పెట్టగలిగారు బక్షీ గారు. అలా ఒక గూడ్స్ బండి డ్రైవర్ మరొకడికి చెప్పగా దేశం అంతా చూసి ఒక సారి అయోధ్య చేరుకున్నారు. అక్కడ శ్రీరాముడు గుప్తార్ అనే ఈ నాటి ఘాట్ ప్రాంతంలో సరయూ నదిలో ప్రాణాలు విడిచిన ప్రదేశాన్ని చూశారు. పురాణాలలో చెప్పిన అక్కడి సరయూ నదీ స్నాన మహాత్యం గురించి తెలియక పోయినా ఆయన విన్న విషయం ఏమిటంటే…అక్కడి సరయూ నదిలో మునిగి తేలిన వారి జీవితాలు అంతకు ముందు జీవితానికి సరిగ్గా వ్యతిరేకంగా మారిపోతయిట. అంటే ధన వంతుడు అక్కడ స్నానం చేస్తే దరిద్రుడు అవుతాడుట. బీద వాడు మునిగి తేలితే ఐశ్వర్య వంతుడు అవుతాడుట. మరి ఏ రోగాలూ లేని వాడు ములిగితే రోగిష్టి అవుతాడేమో తెలియదు.

అయితే “మన జీవితానికి ఇంత కన్నా ములిగేదేం ఉందిలే” అనుకుని బక్షీ గారు సరయూ నదిలో నిండా మునిగి స్నానం చేశారుట. అక్కడితో ఆ తరువాత తన జీవితమే మారి పోయింది అని బక్షీ గారు చాలా సార్లు మాకు చెప్పేవారు. ఎలా మారిందీ అంటే..ఆయన దేశం అంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడ దొరికిన కూరగాయలతో అక్కడ వంట చేసుకునే వారు. అలా శాకాహారం వంటలు  చెయ్యడంలో ముందు అవసరం, తర్వాత ఆసక్తి, ఆ తర్వాత ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఆ పరంపరలో కొత్త కొత్త వెజిటేరియన్ వంటలు చేసి అందరికీ రుచి చూపించడం, అప్పుడప్పుడు ప్రముఖుల ఇళ్ళకి పిలిపించుకోవడం జరిగేది. అలా ఒక సారి డిల్లీలో సర్వేపల్లి రాదా కృష్ణన్ గారి కి మంచి వెజిటేరియన్ భోజనం కావాలి అని ఎవరో చెప్పగా విని, ఆయన దగ్గరికి వెళ్లి అనేక రకాల శాకాహారం వంటలు చేసి రుచి చూపించారు. రాధాకృష్ణన్ గారికి అవి ఎంతో నచ్చి తను ఎక్కడికి వెళ్ళినా బక్షీ గారినే పిలిపించుకునే వారు. ఆ క్రమంలో ఆయనకీ పాక శాస్త్రంలో డిగ్రీలు లేక పోయినా ఎయిర్ ఇండియాలో వెజిటేరియన్ శాఖలో చెఫ్ గా ఉద్యోగం వచ్చింది. ఇక బక్షీ గారు వెనుతిరిగి చూడ లేదు.

ఒక సారి మారిషస్ లో జరిగిన ఒక అంతర్జాతీయ శాకాహార కన్ వెన్షన్ లో 111 రకాల వెజిటేరియన్ సాండ్ విచ్ లు చేసి రికార్డు సృష్టించారు, 600 కు పైగా శాకాహారం వంటలు, వాటి ఆరోగ్య సూత్రాలనీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ అన్ని దేశాలూ తిరిగారు. ముఖ్యంగా జపాన్ లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన ఇంచుమించు అందరు భారత రత్నలకీ ఆయనే శాకాహారం లో రుచి రూపించారు. గ్రాండ్ హెల్త్ వెజిటేరియన్ వర్క్ షాప్ అనే పేరిట ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల శాకాహారం లో రుచి, ఆరోగ్య సాధన గురించి న వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఎనలేని ఖ్యాతి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగానే ఎక్కడి నించి సంపాదించారో తెలియదు కానీ, నా ఫోన్ నెంబర్ సంపాదించి కొన్నేళ్ళ క్రితం కెనడా నించి పిలిచి హ్యూస్టన్ లో ఆ వర్క్ షాప్ పెడతావా అని అడిగారు. ఆ తర్వాత ఆయనతో కాంటాక్ట్ లేదు. కెనడా లోనే ఉండి ఉంటారు. అన్నట్టు ప్రపంచం మొత్తం లోనే శాకాహార పాక శాస్త్రంలో గౌరవ డాక్తరేట్ అందుకున్న ఏకైక వ్యక్తి బక్షీ గారు -గీతమ్ యూనివర్సిటీ నుంచి 2011 లో. అప్పుడు ఆయన వయసు 81 సంవత్సరాలు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ….నాకు పరిచయం ఉన్న కేవలం రెండేళ్ళ లోనూ నాకు తెలిసిన బక్షీ గారు ఒక మిమిక్రీ కళాకారుడు. ఆనాటి సినీ నటులు అందరినీ భలే అనుకరణ చేసే వారు. ముఖ్యంగా రేలంగి ని. ఉదాహరణకి “పక్కింటి అమ్మాయి” సిమిమాలో రేలంగి హీరో. అంజలీ దేవి హీరోయిన్. ఒక సన్నివేశంలో అంజలీ దేవి పరీక్షలు రాయడానికి వెళ్తుంటే రేలంగి ఒక పిల్లిని ఎదురు వచ్చేలా వదిలేసి, అంజలీ దేవి పిల్లిని చూడదేమో అని “పిల్లి దుశ్శకునము. పిల్లి దుశ్సకునము” అని అరుచు కుంటు ఓవర్ ఏక్షన్ చేస్తాడు. ఆ సీన్ బక్షీ గారు గొప్పగా చేసే వాడు. అలాగే అదే సినిమాలో రేలంగి హడావుడిగా ఎ.ఎమ్. రాజా దగ్గరికి వచ్చి “గురూ, గురూ, మెడ్రాస్ మైల్ కి టైమెంత?” అని అడుగుతాడు. “ఏరా, మెడ్రాస్ వెళ్తున్నావా?” అని ప్రశ్నిస్తాడు ఏ.ఎమ్. రాజా. “లేదు గురూ, మెడ్రాసూ లేదు. కలకత్తా లేదు. అసలు అదంతా నీకెందుకు. మైల్ వచ్చే టైమ్ చెప్తావా, చెప్పవా?” గదమాయిస్తాడు రేలంగి. “మరి ఎక్కడికీ వెళ్ళక పోతే ఆ వెధవ మైల్ ఎన్నింటికి వస్తే నీకెందుకురా” అంటాడు రాజా.” ఓ అదా. ఆత్మహత్య చేసుకోడానికి” అంటాడు రేలంగి. “ఆత్మహత్య చేసుకోడానికి మైల్ ఎందుకురా. ఏ రైలు అయినా సరి పోతుంది గా” అంటాడు రాజా. “కాదు గురూ, పాసింజర్ అయితే తల సగం తెగీ, సగం తెగకా చికాకయి పోతుంది. మైల్ అయితే బెటరుగుంటది” అంటాడు రేలంగి. ఈ మొత్తం సీన్ బక్షీ గారు చాలా బాగా చేసే వారు. అందుకే మేము ఐఐటి లో సాంస్కృతిక కార్యక్రమాలు పెటినప్పుడు ఆయన్ని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచి ఇలాంటి చమత్కారాలు చేయించుకునే వాళ్ళం. ఈ రోజుల్లో తమన్నా పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మహేష్ బాబు పిల్లిని ఎదురుగుండా వదిలే సీన్ ఉంటే అవకాశం లేదు. ఉన్నా ఒక వేళ ఉన్నా మనకి నవ్వు రాదేమో! ఇక పి.సుశీల ఎప్పుడు బొంబాయి వచ్చినా వాళ్ళు కుటుంబ స్నేహితులు కాబట్టి బక్షీ గారు ఎప్పుడూ పక్కనే ఉండే వారు. ఆయన తర్వాత కాలం లో అమెరికాలో కోర్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశారు….

నాకు ఆయన పరిచయం అయిన 50 ఏళ్ల క్రితం ఆయన శాకాహార నిపుణుడే కానీ ప్రపంచ ప్రఖ్యాతి ఉన్న వాడు కాదు. అప్పుడు ఆయనకి ఇద్దరు చిన్న పిల్లలు. ఆయన అమ్మ గారూ, భార్యా వంట చేసి పెట్టేవారు కానీ బక్షీ గారు వంటింట్లోకి వెళ్ళడం ఎప్పుడూ చూడ లేదు. పబ్లిగ్గా వంట చెయ్యవచ్చునేమో కానీ మన సొంత వంటింట్లో మగాళ్ళు వంట చెయ్యడం ఆ రోజుల్లో మన ఇంటా వంటా లేదు గా. ఈ రోజుల్లో కొంచెం పరవా లేదు.

అసలు ఏనాడో 50 క్రితం పరిచయం అయి, ఆ తర్వాత మళ్ళీ నేను చూడని ఆ సత్యనారాయణ బక్షీ అనే ఆయన గురించి ఇంత వివరంగా ఎందుకు వ్రాశానూ అంటే….నా జీవితానుభవాల నుంచి నేను నేర్చుకున్న ఒకానొక మంచి గుణ పాఠానికి ఆయన ఒక ప్రతీక. ఆ పాఠం ఏమిటంటే “మనకి సర్వ సాధారణంగా కనపడుతూ కబుర్లు చెప్పేవారిలో అసాధారణమైన ప్రతిభ దాగి ఉంది అని మనకి తెలియదు. అలాగే అసాధారణమైన ప్రతిభావంతులుగా సంఘంలో పేరున్న వాళ్ళు మనకి పరిచయం అయ్యాక కాస్త దగ్గర అవగానే వాళ్ళు కూడా మన లాగే అనేక విషయాలలో సర్వ సాధారణమైన వ్యక్తులే సుమా అని తెలుస్తుంది”. అనగా….ఏదో ఒక ప్రతిభతో గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం వేరు. వ్యక్తిత్వం వేరు.

   *

 

 

 

వంగూరి చిట్టెన్ రాజు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చిట్టెన్ రాజు గోరండి ! పైనున్న కుఠో లోని వారి వివరాలు :

    Dr. Bakshi in Indian Vegetarian Congress ( April 25, 2011 )

    ( From Left to Right ) Nathalie Bathurst, Canada, self-starter in the Ottawa vegetarian group; Ida Waage Nielsen, life vegetarian from Denmark, studying psychology; Jay Dinshah, President of the American Vegan Society, and editor of their lively Ahimsa newspaper; Satyanarayan Bakshi Vemulakonda, Assistant Manager of Catering, Air India who has mastered 600 Indian vegetarian dishes.

    వేములకొండ సత్యనారాయణ బక్షీ. గారి గురించి గూగులమ్మ చెప్పిన మరి కొన్ని విశేషాలు :

    Grand Chef Bakshi, famous for his 111 varieties of vegetarian sandwiches, taught about the many health benefits of that included fresh vegetables, Fenugreek, Tamarind and sesame seeds. He enlightened them about the health properties of various herbs and vegetables.

    He also compiled a recipe book “ Delicious Diet for Diabetics” for the International Congress of Diabetics at New Delhi in 1996.

    At the age of 81 Satyanarayana Bakshi Vemulakonda received a rare honor Honorary Degree of Doctor of Letters from reputed Indian University, GITAM University . This is the first D.Litt to culinary art in the World. While the Times of India and Bhavan’s Jornal called him the Culinary Wizard, Tokyo Times rated him as the Chef Extraordinary.

    http://satyanarayanabakshi.blogspot.com/

    • అవును సర్, వాటిల్లో కొన్ని నేనూ చూశాను….నా వ్యాసం లో రాసే ముందు సరి చూసుకోవాలిగా…అందుకూ

      మీ స్పందనకి ధన్యవాదాలు..

    • నిజంగానా….భలే…ఎక్కడా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు