మా కుటుంబానికి పాములపర్తి వెంకట నరసింహారావు (పీ.వీ. నరసింహా రావు) గారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది.
మా నాన్న గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పీ.వీ స్వగ్రామం వంగర లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అమ్మ ,నాన్న పీ.వీ గారింట్లోనే అద్దెకు ఉండేవారు( కానీ అద్దె ఎన్నడూ వారు తీసుకోలేదు) పి.వి. గారికి ఇద్దరు తమ్ముళ్ళు పాములపర్తి మాధవరావు గారు, పి.వి.మనోహర్ రావు గారు, ఒక సోదరి. మా అమ్మ నాన్న వాళ్ళు వారి కుటుంబం వారిలానే వారితో కలిసి ఉండేవారు. ఇప్పటికి వారి సోదరులు పీ.వీ.మనోహర్ రావు గారు మా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా వుంటారు. నా చిన్నప్పుడు పీ.వీ గారిని చాలా సార్లు మనోహర్ రావు పెద్ద నాన్న గారింట్లో చూసాను. వారుఎంతో ప్రేమగా మాట్లాడేవారు మా కుటుంబంతో.
1991 సంవత్సరం పీ.వీ గారి సోదరులు పీ.వీ మనోహర్ రావు గారు పీ.వీ గారు ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు ఢిల్లీ లో ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక సదస్సు (international spiritual conference) నిర్వహించారు. సర్వార్థ సంక్షేమ సమితి విశ్వయోగి విశ్వం జీ గురువు గారు, పి.వి.మనోహర్ రావు పెద్దనాన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు వారి కుటుంబంతో నేను కూడా వెళ్ళాను ఢిల్లీకి. మూడు రోజుల సదస్సులో పీ.వీ గారు రెండు రోజులు వచ్చారు.
ఆ కార్యక్రమానికి ఎందరో మహానుభావులు బ్యూరోక్రాట్స్, స్వామిజీలు వచ్చారు. దేశం నలుమూలల నుండి. అద్భుతమైన ఈ మూడురోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ అప్పుడే నాకు ఒక అదృష్టం పట్టింది.
పీ.వీ గారి సోదరులు మనోహర్ రావు పెద్దనాన్న గారి అబ్బాయి, పీవీ.మదన్ మోహన్ అన్నయ్య కుటుంబం నన్ను వారితోనే ఒక వారం రోజులు ఉండాలని, దగ్గరలోని పర్యాటక ప్రదేశాలు చూడొచ్చు అని చెప్పి, అది కూడా వారి పెద్దనాన్న గారు అయిన ప్రధానమంత్రి పి.వి. గారి ఇంట్లో ఉంటున్నాము అని చెప్పారు. నా ఆనందానికి అవధులే లేవు.
ఇంతకు ముందు ఎన్నో సార్లు హన్మకొండలో వారిని చూసినప్పటికీ ప్రధాన మంత్రిగా ఉన్న వారింటికి వెళ్ళి వారింట్లోనే వారం రోజులు గడపడం అనే అదృష్టం అతి తక్కువ మందికి దొరుకుతుంది అనిపించింది. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలినీ అని చెప్పవచ్చు. ఆలస్యం చేయకుండా వస్తాను అని చెప్పి నేను మదన్ అన్నయ్య కుటుంబంతో వెళ్ళాను అప్పటి ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహా రావు గారింటికి.
అప్పుడు అది 7 రేస్ కోర్స్ రోడ్(RCR,New Delhi),న్యూ ఢిల్లీ. (ప్రస్తుతం అదే, 7 లోక్ కళ్యాణ్ మార్గ్. న్యూఢిల్లీ). ప్రత్యేకంగా పీ.ఎం.హోదాలో వారికి ఇచ్చిన ఇంటికి “పంచవటి” అని పేరు ఉండేది అప్పట్లో. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఇప్పుడు వుందో లేదో నాకు తెలియదు.
అలాంటి ప్రముఖమైన ప్రదేశంలో ఉండటం ఆనందంగా అనిపించింది. ప్రధాని నిలయం ఇల్లు ఒక స్వర్గం. నేను చూడటం నా అదృష్టం.ఇక మేము వారింటికి వెళ్ళిన రోజు మొదట మెయిన్ గేట్ నుండి లోపలికి వెళ్ళడానికి ఫార్మాలిటీస్ పూర్తి చేసి గేట్ లోపలికి వెళ్ళి ఒక ఫెర్రీ కార్ లో పీ.వీ గారుండే “పంచవటి” ఇంటికి చేరుకున్నాము.
ఆరోజు ఎదో విదేశీ ప్రతినిధుల సమావేశం అయింది పక్కనే ఉన్న ఇంకో పెద్ద భవనంలో. మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి రావద్దని పి.వి. గారి పి.ఏ గారు, ప్రోటోకాల్ వారు చెప్పారు. మేము అలాగే వారు చెప్పినట్టు నడుచుకున్నాము.
తెల్లవారి ఉదయం డైనింగ్ టేబుల్ వద్ద మేమందరం ( ఏడుగురం) టిఫిన్ తింటున్నాము. హఠాత్తుగా తెల్లటి ధోతి ,తెల్లటి లాల్చీ వేసుకుని పీ.వీ గారు వచ్చారు బ్రేక్ ఫాస్ట్ కి. మేమంతా లేచి నిల్చున్నాము. వారు మమ్మల్ని కూర్చోండి ముందు టిఫిన్ తినండి అన్నారు. ఈ అమ్మాయి ఎవరు అని నన్ను చూపిస్తూ మదన్ అన్న ని అడిగారు. వంగరలో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసారు సదాశివ రావు చిన్నాన మీకు తెలుసు కదా, వారి అమ్మాయి అని చెప్పారు. పీ.వీ గారికి నాన్న బాగా తెలుసు , గుర్తుపట్టి మీ నాన గారు వాళ్ళు మా ఇంట్లోనే వున్నారు వంగర లో. మీరు అప్పటికి ఇంకా పుట్టలేదు అని చెప్పారు. మీ నాన్న గారు సదాశివరావు గారు సార్ధక నామధేయులు. నిజంగా శివుడే అన్నారు కూడా!
టేబుల్ దగ్గర కూర్చున్న మదన్ అన్నయ్య భార్య నీ,తన ఇద్దరు చెల్లెళ్లను పరిచయం చేసాక పలకరించారు వారు. మదన్ అన్నయ్య పిల్లలను దగ్గరికి పిలిచి ఆశీర్వాదం ఇచ్చారు.
ఆ తర్వాత ఎన్నిరోజులు వుంటారు? ఏమేం చూస్తారు లాంటి ప్రశ్నలు అడిగారు. ఇక్కడ సెక్యూరిటీ బాగా ఉంటుంది. మీతో పాటు సెక్యూరిటీ వారు కూడా వస్తారు అని చెప్పారు. షాపింగ్ అంటూ తిరగకుండా జాగ్రత్తగా హరిద్వార్, రిషికేశ్ చూసి రండి అని చెప్పారు మాతో. వారి పి.ఏ గారిని పిలిచి మమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత అప్పచెప్పారు. వంట చేసే అతనికి మాకు ఇష్టమైనవి చేసి పెట్టు అని పి.వి.గారు చెప్పారు.వారు మాత్రం ఇడ్లిలు తిని వెంటనే వెళ్లిపోయారు .
అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. పీ.వీ గారింట్లో వంట చేసే రాజన్న ఇంకో అతను, (పేరు గుర్తు లేదు) వారి స్వగ్రామం వంగర వారే. మేము వెళ్తే ఇష్టమైన వంటలు చేసి పెట్టారు ప్రేమగా.
మరుసటి రోజు ఉదయమే మాకు హరిద్వార్ రిషికేశ్ వెళ్ళడానికి కారు, కారుతో పాటు సెక్యూరిటీ జిప్సి కూడా వచ్చింది.
మేము మొదట హరిద్వార్ వెళ్ళాము.ముందుగానే గెస్ట్ హౌస్ బుక్ అయ్యాయి కాబట్టి. నేరుగా అక్కడికి వెళ్ళి లగేజి మాకు ఇచ్చిన రూమ్స్ లో పెట్టీ, హరిద్వార్ చూడటానికి వెళ్ళాం.రాత్రి హారతి కూడా చూసి మళ్ళీ మా గెస్ట్ హౌస్ చేరాము. మరుసటి రోజు రుషికేశ్ వెళ్ళాము.అక్కడ కూడా అన్ని చూసి మూడో రోజు ఢిల్లీ బయలుదేరాము. ప్రతి ప్రదేశం లో మా తోనే మా పక్కనే సెక్యూరిటీ వారు ఉంటూ మాకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని దగ్గరుండి చూపించారు.
మూడో రోజు ఢిల్లీ చేరాక ఒక గమ్మత్తు జరిగింది. మేము సెక్యూరిటీ వారికి చెప్పాము. కరోల్ బాగ్,చాందిని చౌక్ లాంటి ప్రదేశాలు చూపించండి మాకు ఆంధ్రాలో దొరకనివి కొనుక్కుంటాము అని. వారు మమ్మల్ని వెహికిల్సో తీసుకెళ్ళారు చాందిని చౌక్ , కరోల్ బాగ్ సెక్యూరిటీ తో సహా. కానీ మా అడుగు వెనకే వారి అడుగు. మొత్తానికి కాస్త ఇబ్బంది గా,మొహమాటంగా అనిపించి. బేరమాడలేక మన ఆంధ్రా కన్నా ఎక్కువ ధరే పెట్టి ఏవో కొనుక్కున్నాము ఢిల్లీ గుర్తుగా. రెడ్ ఫోర్ట్ కూడా చూసి రాత్రి మళ్ళీ పీ.వీ గారి ఇల్లు చేరాము. డిన్నర్ అప్పుడు మళ్ళీ పీ.వీ గారు కనిపించారు. ప్రయాణం ఎలా జరిగింది అని అడిగారు. చాలా బాగా అయింది అని చెప్పాము. వారు సంతోషించారు. ఇంకా ఏవైనా చూస్తారా అని అడిగారు. మదన్ అన్న షిమ్లా చూడాలని ఉంది అన్నారు. సరే వెల్దురుగాని అన్నారు.
కానీ నాకు అప్పుడే డిగ్రీ పరీక్షలు ఉన్నాయి. నేను వరంగల్ వెళ్తాను అని మదన్ అన్నయ్యకు చెప్పాను. వారితో శిమ్లా నేనుకూడా రావాలని మదన్ అన్నయ్యా సంధ్య వదిన ముఖ్యంగా సంధ్య వదిన చెల్లెల్లు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పావని, సునీత అయితే చాలా చాలా ప్రయత్నించారు. నేను వుండి పోవాలని వారితో శిమ్లా చూడాలని. కానీ పరీక్షలు అని చెప్పి, వారిద్దరూ, నేను కూడా మూడ్ ఆఫ్ అయినా సరే, టికెట్ బుక్ చేయమని చెప్పాను మదన్ అన్నయ్యను. తెల్లవారి సాయంత్రానికి నాకు ట్రైన్ టికెట్ బుక్ చేసారు.
తెల్లవారి భోజనాల సమయంలో మళ్ళీ పి.వి.గారు డైనింగ్ టేబుల్ దగ్గర కలిసారు. మాతోనే భోజనం చేసారు. వంగర నుండి వచ్చి వంట చేసే అతన్ని పి.వి.గారు అడిగారు వాళ్ళకు నచ్చినవి చేసి పెట్టావా అని.
ఆ తర్వాత నేను వరంగల్ వెళ్తున్నాను అని చెప్పాను పి.వి.గారికి. వారు అదేంటి అమ్మాయీ నువ్వు ఉండి , సరదా గా అందరూ కలిసి సిమ్లా వెళ్ళండి అన్నారు. అదే అదనుగా మా మదన్ అన్నయ్య, పావని,సునీత,సంధ్య వదిన వాళ్ళు కూడా నన్ను ఉండమంటున్నట్టు చెప్పారు. అప్పుడు నేను పి.వి. గారితో నాకు డిగ్రీ పరీక్షలు అండి.వెళ్ళాలి తప్పకుండా అని చెప్పాను.
అప్పుడు వారు ఒక మాట అన్నారు. చాలా సంతోషం నువ్వు చదువుకు ఇలాగే ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రదేశాలు ఎప్పుడైనా చూడొచ్చు.కానీ చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు బాగా చదువుకో. ఇంకో సారి వచ్చినప్పుడు సిమ్లా ఏంటి ఆగ్రా,మధుర చూడొచ్చు అన్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. వారు వెళ్ళే ముందు నేను లేచి వారి పాదాలకు నమస్కారం చేసాను. వారు బాగా చదువుకుని సదాశివ రావుకు మంచి పేరు తేవాలని దీవించారు. అలాగే మా నాన్న, అమ్మ వాళ్ళను గుర్తుచేసినట్టు చెప్పి మా అన్నయ్య శ్రీకాంత్ కి ఆశీర్వాదాలు అందించారు. మేమందరం కలిసి బోలెడు ఫోటోలు తీసుకున్నాం పి.వి. గారితో. (ఇప్పుడు ఒక్క ఫోటో కూడా లేదు). పి.వి.గారు ఏదో మీటింగ్ ఉందని వెంటనే వెళ్ళారు.
పీ.వీ గారు గొప్ప రాజకీయ వేత్త, బహుభాషా కోవిదులే కాదు, ప్రేమ అభిమానానికి చిరునామా. సింపుల్ అండ్ హంబుల్ అంటే నిదర్శనం పీ.వీ గారే. నిత్య విద్యార్థిగా ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవారు. 17 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు పి.వి.గారు.అతి తక్కువ రోజుల్లోనే కంప్యూటర్ వచ్చిన కొత్తలో శ్రద్దగా నేర్చుకుని ఎన్నో ముఖ్యమైనవి టైప్ చేసుకున్నారు స్వయంగా. ముఖ్యంగా వారు మాతృభాష ప్రేమికులు. మా తాతయ్య గారు ప్రముఖ కవి గొట్టుముక్కల రాధా కిషన్ రావు గారు పీ.వి.గారికి బాగా తెలుసు.వారి సాహిత్యం గురించి కూడా మాట్లాడారు భోజనాల సమయంలో. నిజం చెప్పాలంటే అప్పుడు నాకే మా తాతయ్య గారి సాహిత్యం ఎక్కువగా తెలియదు.
మరుసటి రోజు మదన్ అన్నయ్య పావని,సునీత వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి నన్ను ట్రైన్ ఎక్కించారు.
ప్రధాన మంత్రి “పంచవటి” నివాసం, అందులోని మిగతా భవనాలు,అందమైన విశాలమైన గార్డెన్, పశుపక్షాదులు, ఇంటి చుట్టూ పచ్చని తివాచీ పరిచినట్టు పచ్చని పచ్చిక బయళ్ళు వీటి అన్నింటికన్నా పున్నమి వెన్నెల లాంటి చల్లని మనసున్న మారాజు పి.వి గారి ప్రేమ,ఆప్యాయత విలువకట్టలేని అభిమానం నా మనసులో స్థిరంగా నిలిచిపోయింది.
*








మీరు రాసిన మీ అనుభూతి మాకు ఎంతో ఆనందం అనిపించింది.
Very interesting! Lucky to in PM House and thank you for sharing, C. Nagendra Prasad, Hyderabad.