పసలపూడి అందచందాలకు ఒక అద్దం

చాలా ఏళ్ల కిందట నేను చలం గారి మీద పరిశోధన చేస్తున్నానని తెలిసి కొందరు పెద్దలు ఎందుకు అని అడిగారు.
నాకు ఆయన అంటే ఇష్టం కనుక అన్నాను. ఇష్టమైన సబ్జెక్టు మీద ఎప్పుడూ పరిశోధన చేయకూడదు అని నాకు హిత బోధ చేశారు. కారణం బహుశా వారు చెప్పేరేమో గానీ ఇప్పుడు నాకు గుర్తులేదు.

ఇప్పుడు ఈ ‘వంశీ మా పసలపూడి కథల కమామిషు’ చూశాక పరిశోధన తప్పనిసరిగా బాగా తెలిసిన, చాలా ఇష్టమైన విషయం మీదే చేయాలని అర్థమైంది.

కే రామచంద్రారెడ్డి చాలా ఏళ్లుగా నాకు తెలుసు. కలిసి చాలా సాహిత్యకార్యక్రమాలు చేయడం వల్ల ఏర్పడిన ఆత్మీయత కూడా తక్కువేమీ కాదు. అందువల్ల చాలాకాలం గా ఈ పరిశోధన విషయం వింటూ వచ్చాను.

ఈ పరిశోధనా అంశాన్ని  తన మనసులో నానబెట్టి నానబెట్టి ఇప్పటికీ డాక్టరేట్ గా బయటికి తీసుకొచ్చారు. ఏ విషయం అయినా చాలా కాలం మనసులో మాగి ఉండడం వల్ల దానికి మంచి రుచి, సువాసన తో పాటు సరళత్వం కూడా అలవడుతుంది.అంటే ఎంత కష్టమైన విషయమైనా మనకు బాగా జీర్ణం అయితే సులువుగా చెప్పగలుగుతాం అన్నమాట. ఈ మాటకి ఉదాహరణగా ఈ పీహెచ్డీ థీసిస్ ఉదాహరణగా నిలుస్తోంది.

సాధారణంగా పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు కొరకరాని కొయ్యల్లాగా ఉంటాయి. ఒకవేళ ఎంత కష్టపడి చదివినా దాంట్లో విషయాలు వడపోద్దామంటే బొట్టు బొట్టుగా కూడా మిగలవు. అందుకని కేవలం పరిశోధకులు మాత్రమే ఆ పరిశోధన గ్రంథాలు చదువుతారు, తప్ప సాహిత్య పాఠకులు ఎవరూ వాటి జోలికి పోరు.

దీనికి చాలా కొద్ది మినహాయింపులు ఉంటాయి. అందులో ఈ కథల కమామిషు అన్న పుస్తకం చక్కగా అమరింది.
2005 లో మా పసలపూడి కథలు అన్న పేరుతో వచ్చిన వంశీ గారి 72 కథలు అంతకుముందే స్వాతి వార పత్రికలో వరుసగా వచ్చాయి. తర్వాత పుస్తక రూపంగా వచ్చిన తర్వాత కూడా విశేషమైన ఆదరణ పొందాయి. ఇప్పటికీ పొందుతూనే ఉన్నాయి.

అవి తూర్పుగోదావరి జిల్లా మధ్య డెల్టా ప్రాంతం ప్రజల తాలూకు కథలు. రచయిత వంశీ ఆ ప్రాంతం వారు. పరిశోధకుడు  రామచంద్రారెడ్డి కూడా అక్కడివారే. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రామచంద్రారెడ్డి తమ ప్రాంతపు పలుకుబడులు, ఆచారాలు, అలవాట్లు, ప్రజా జీవితం నేపథ్యంగా వచ్చిన విలక్షణమైన ఈ కథల పట్ల తెలియకుండానే లేదా తెలిసే ఒక ఆత్మీయతను పెంచుకుంటూ వచ్చారు.

ఇక తర్వాత పరిశోధన అంటూ చేస్తే దీని మీదే చేయాలని నిర్ణయించుకుని  ఇన్నేళ్ల పాటు దాని మీదనే మనసు పెట్టుకుని ఇప్పటికి ఇలా సిద్ధాంత గ్రంథం అనే పేరును సరళంగా సార్థకం చేస్తూ ఆసక్తికరమైన విమర్శ పుస్తకంగా తీసుకొచ్చారు. మా పసలపూడి కథల మీద ఇది ఒక అందమైన, ఆసక్తికరమైన అయినా ఏలోతులనూ కూడా వదలకుండా విశ్లేషించుకుంటూ వచ్చిన భాషా, సాహిత్య విమర్శనాత్మక పుస్తకం. దీన్ని గ్రంథం కూడా అనొచ్చు తప్పులేదు.

ఈ పుస్తకం గురించి సంక్షిప్తంగానే నాలుగు మాటలు చెప్పుకుందాం.

ఇందులో మొట్టమొదటి విషయం అధ్యాయ విభజన. విషయసూచిక లో అదొక్కటి చదవగానే మనకు మొత్తం పుస్తకంలో ప్రధాన విషయం ఏమిటో అర్థం అయిపోతుంది. అంతేకాకుండా  ఇవన్నీ చదివి తీరాలి అనే ఒక ఆసక్తి తప్పనిసరిగా కలుగుతుంది.

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధానమైన మధ్య సాగు ప్రాంతంలోని మాండలికం ప్రధాన అంశంగా తీసుకుని ఎన్ని విధాలుగా ఆ మాండలికం ఈ కథల్లో ప్రయోగించబడుతూ వచ్చిందో సవివరంగా చెప్పడమే ఈ పరిశోధనాశంలోని ప్రధాన భాగం.
దాన్ని పరిశోధకుడు సాధికారకంగా, సహేతుకంగా వివరించుకుంటూ రావడం ఈ పరిశోధనకు బలమైన వెన్నెముకగా నిలబడింది.
అసలు మొదలుపెట్టటమే శ్రీనాథుడి భీమఖండంలోని మండల పద ప్రయోగంతో మొదలైంది. సమీపంలో ఉన్న ద్రాక్షారామం లోని భీమేశ్వరుడు మీద రాసిన రెండు పద్యాలు ఉదహరిస్తూ ఈ భీమ మండల క్షేత్రం ఇంత ప్రాచీనం సుమా అని మొదలుపెడతారు.ఇందులో

ఒకే తూర్పుగోదావరి జిల్లాలో ఐదు రకాల యాసలు అక్కడి వ్యవహార భాషలో ఉన్నాయని చెప్తూ వాటిని వివరించారు. అందులో మధ్య సాగు ప్రాంతం అంటే సెంట్రల్ డెల్టా, అక్కడ వాడిన మాండలికాన్నే తీసుకొని వంశీ మా పసలపూడి కథలు రాశారు  కాబట్టి దాని మీదనే ఈ పరిశోధన ముందుకు నడుస్తుంది అని చెప్తారు.  ధవళేశ్వరం  దగ్గర నుంచి సాగర సంగమం వరకు గౌతమీపాయ ను ఆనుకొని ఉన్న ఉత్తర దిక్కు వరకు ఉన్న నల్ల రేగడి సాగు ప్రాంతం సెంట్రల్ డెల్టా. దీన్నే పరిశోధకుడు మధ్య సాగు ప్రాంతం అంటున్నాడు.

“ఈ పసలపూడి కథలు అన్నింటిలోనూ తూర్పుగోదావరి జిల్లా మధ్య సాగు ప్రాంతపు పలుకుబడితో పాత్రల పేర్లు, క్రియా పదాలు, విశేషణాలు, కొలమానాలు, స్థానిక ఆహార పదార్థాలు, స్థానిక ఉచ్చారణతో ఉండే భాషా పదాలు, భాషా పదాలు , గృహోపకరణ వస్తు సామాగ్రి, జంట పదాలు, మానవ స్వభావ రసభావాది పదాలు, తదితర కథావస్తుగతమైన సమస్త పదజాలం ఏ విధంగా రూపొందిందో వివరించడమే ఈ భాగం ఉద్దేశం”

అని రామచంద్ర రామచంద్రా రెడ్డి గారు ఎంత స్పష్టంగా చెప్పారో అంత స్పష్టంగాను వీటన్నింటి తాలూకు వివరణను, మూలాలను మరో వ్యాకరణం రాసినంత చక్కగా రాసుకుంటూ వచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే రచయిత వంశీ ఇన్ని విధాలుగా అక్కడి భాషను తన కథల్లో సందర్భానుసారంగా, పాత్రోచితంగా వాడుకుంటే ఈ పరిశోధకుడు దానికి అంతటికీ ఒక ప్రామాణికతను ఇస్తున్నట్టుగా, వ్యాకరణ సూత్రాలు రాస్తున్నంత చక్కగా ప్రతి దాన్ని విడమర్చి చెప్పుకుంటూ వచ్చారు.

ఉదాహరణకి ఒకటి చూద్దాం.

‘కర్రోరి సుబ్బులు’ అనే మాటను గురించి చెప్పేటప్పుడు ఇలా రాశారు.

“సూత్రం :  పేర్లలో పూజ్యతలో బహుత్వము మీద షష్ట్యంతమైన వారి పదంలో వాలోపం.

ఉదాహరణలు కర్రోరి సుబ్బులు, సత్తోరి బోడెమ్మ, కర్రోరి బాచి, సత్తూరు సాయిబాబు

పై పాత్రల పేర్లతో  ఇంటి పేరుతో వచ్చే పూజ్యతలు బహుత్వవాచకమైన వారు షష్ట్యంతంగా వారి  అయినప్పుడు అంతస్థవర్ణమైన వా లోపించి పూర్వ వర్ణానికి ఓత్వం వచ్చింది. ఇదీ క్రమం. కర్రి వారి సుబ్బులు అన్నది కర్రోరి సుబ్బులు అయింది.
సబ్బెళ్ళ వారు అన్నది సబ్బెళ్లోరు అయింది.  ఈ విధమైన పలుకుబడి వందలు ఏళ్లుగా కుదురుకున్న భూమంచిరెడ్ల(కులవాచకం) లో అధికంగానూ ఇతరులలో అడపాదడపా చెలామణిలో ఉంది. ”

ఈ విధంగా ప్రతి మాండలిక పదాన్ని తీసుకుని దానికి ఒక వ్యాకరణ సూత్రం రాసినట్టుగా ఆ పదాన్ని వివరించటం ఈ పరిశోధనలో ప్రధాన భాగం.

ఇటువంటి పరిశోధన ఏ ప్రాంతంలోనైనా ఆ ప్రాంతపు మాండలిక భాష మీద చేసిన వారిలో ఇప్పటికీ రామచంద్రారెడ్డి మాత్రమే మొదటి వారు. అంటే ఇంతవరకు ఇటువంటి పరిశోధన ఎవరు చేసి ఉండరు అని అర్థం.
మిగిలిన ప్రాంతాల వారు ఈ విధంగా వారి భాష మీద, మాండలికం మీద పరిశోధన చేసి ప్రయోగాలు చేయడానికి ఇది ఒక ప్రేరణ గ్రంథంగా లేదా ఆధార గ్రంధంగా నిలుస్తుంది.

ఇక ఈ పరిశోధన ద్వారా కనుగొన్న మరొక ముఖ్య విషయం  ఏమిటంటే  ఈ పసలపూడి కథలలో ఐదు పాత్రల కన్నా తక్కువ ఉన్న కథలు లేవు అని, అలాగే 16, 17 పాత్రలు ఉన్న కథలు కూడా ఇందులో ఉన్నాయని ఈ విధంగా ఇన్నిన్ని పాత్రలతో వంశీ పసలపూడి కథలు రాయటానికి కూడా ఒక విశేషం ఉందని పరిశోధకుడు చెప్తారు.

తూర్పుగోదావరి జిల్లా మధ్య సాగు ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు దగ్గరగా ఉంటూ జనసాంద్రత కలిగి ఉండడం కారణంగా ఇక్కడి ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు వాటితోపాటు మరికొన్ని విలక్షణమైన మానవ సంబంధాలు కూడా ఎక్కువగానే ఉండడం ఒక వాస్తవం. రచయిత ఈ కథలకు ఇక్కడివే వస్తువులు గా తీసుకోవడం ఒక కారణం కావచ్చు. అంతేకాక ఈ కథలలో ప్రధాన పాత్రలతో పాటు అప్రధాన పాత్రలు కూడా చాలా ఉండటం కూడా ఇందువల్లనే.

కథకి ఒకటి రెండు పాత్రలు ప్రధాన పాత్రలు అయినా అక్కడి జీవన విధానంలో ఎక్కువగా ప్రజలు కలిసి మెలిసి ఉండిన కారణంగా వారిద్దరి చుట్టూ ఉండే మిగిలిన చాలా పాత్రలు ఈ కథల్లో ప్రవేశించడం జరిగిందని పరిశోధకుడి వివరణ. ఇంతే కాకుండా ఇక్కడ ప్రధాన పాత్రతో పాటు ప్రతి అప్రధాన పాత్రకి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడం ఈ కథల తాలూకు ప్రత్యేకత. బ్రాకెట్టు ఆదిరాజు రెడ్డి గారి సత్యానందం, పడవ నడిపే తాతాలు, మేడా చెల్లాయమ్మ లాంటి పేర్లు అసంఖ్యాకంగా ఈ కథల్లో ఉంటాయి. అంతేకాకుండా ఒక కథలో అప్రధాన పాత్ర మరొక కథలో ప్రధాన పాత్ర అవుతుంది.

అంటే ఆయా ప్రాంతాల్లో ఉండే వ్యక్తులనే పాత్రలుగా తీసుకొని రకరకాల సంఘటనలు ఆధారంగా కథ చెప్పేటప్పుడు అవే అవే పాత్రలు మరికొన్ని కథల్లో కూడా వస్తూ ఉండటం జరిగింది. అలా రావటంలో ఈ ప్రధాన, అప్రధాన అనే పద్ధతిలో పాత్రల నిర్మాణం జరుగుతూ వచ్చింది. సంఘటన తాలూకు ప్రాధాన్యతను బట్టి పాత్రల ప్రాధాన్యత లు మారుతూ ఉంటాయి.

వీటి కారణాలన్నింటినీ కూడా రామచంద్రారెడ్డి చాలా వివరంగా ఈ పరిశోధనలో రాసుకుంటూ వచ్చారు. ఏ కథలో ఏ విశేషం ఉంది, ఏ కథలో ఏ వివరం ఉంది అన్నదాన్ని ఆయా కథల పేర్లు సూచిస్తూ ప్రతి చోటా చెప్పుకుంటూ రావటం పరిశోధకుడి నిమగ్నతను చెప్తోంది. ఇవి కాక ఈ కథల ద్వారా ఆ ప్రాంతంలోని ఉన్న మానవ సంబంధాలు, వ్యవసాయ సమాజం ఎలా ఉన్నాయన్నవి కథల్లోంచి చూసి పరిశోధనాత్మకంగానే చెప్పడం జరిగింది.

దీనికి కారణం ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడి భాష పట్ల, జనజీవనం పట్ల విశేషమైన ఆసక్తి కలిగి ఉండిన  వాడు కావటం, అలాగే భాషా శాస్త్రం శ్రద్ధగా చదువుకుని ఆ వెలుగులో తన ప్రాంతపు మాండలికం అయిన పసలపూడి కథలలోని మాండలికాన్ని అధ్యయనం చెయ్యడం.

ఇంకా ఇందులో పసల పూడి కథల్లోని శిల్పం గురించి, వర్ణనల గురించి కూడా ప్రత్యేక అధ్యాయాలు ఉన్నాయి.
శిల్పం గురించి చెప్తూ ‘కథకుడికి జీవితం పట్ల ఉండే దృక్పథం కూడా శిల్ప నైపుణ్యమే’ అన్నమాట వంశీ గారి కథలకు నూరు శాతం సరిపోయే మాట. ఎందుకంటే ఈ 72 కథల నిర్మాణం పనిగట్టుకుని చేసినది కాదు అని పాఠకులకు అర్థమవుతుంది.
అటువంటి కథలు రాయటం వెనుక, అవి ఆ విధంగా రూపుదిద్దుకోవడం వెనక ఉన్నది, వంశీకి జీవితం పట్ల ఉన్నటువంటి ఒక విశేషమైన, విలక్షణమైన దృక్పథమే అని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని రాంచంద్రారెడ్డి గారు సులువుగా పట్టుకున్నారు. ఇక పసలపూడి  కథలలో వర్ణనల గురించి  ఈయన ఒక సూక్ష్మమైన అంశాన్ని పట్టుకున్నారు.

ఇందులో వర్ణనలన్నీ కథ చుట్టూ ఉంటాయి తప్ప కథని దాటిన ప్రకృతి వర్ణన లాంటివి ఎక్కడ కనిపించవు. ఒక్క’ దేవాంగుల మణి’ అన్న కథలో మాత్రం దీనికి విరుద్ధంగా ఆమె నవ్వులో మూడు రుతువులు కనిపిస్తాయని వర్ణన చేయడం కనిపిస్తుంది. ఈ ఒక్కచోట మాత్రమే కథా సన్నివేశం సందర్భం నుంచి విడివడిన వర్ణన అని పరిశోధకులు చెప్పటం ఈ పరిశోధన తాలూకు సూక్ష్మ దర్శనాన్ని తెలియజేస్తుంది. పైగా దానికి సమంజసమైన కారణం కూడా చెప్తారు.

ఇక వర్ణన విషయానికొస్తే చేపల పులుసు వర్ణించే సందర్భంలో ‘కుతకుతా ఉడుకుతా బుళుకు బుళుకు మనే బుడగలతో చప్పుడు చేస్తుంది దాకలో పులుసు’. పులుసు మరగడాన్ని ఇలాంటి ధ్వన్యనుకరణ శబ్దాలతో వర్ణించటం వంశీకే సాటి. ఇలాంటి వర్ణనలు కథల నిండా అసంఖ్యాకంగా ఉంటాయని రామచంద్ర రెడ్డి కొన్ని ఉదాహరణలు చూపిస్తారు. చివరిగా తన పరిశోధన సారాంశం చెబుతూ ఆఖరిగా ఒక పేరా రాస్తారు.

‘కేవలం వర్ణనాత్మక చిత్రణా, భాష, విచిత్రమైన పేర్లు ఇత్యాది విలక్షణాలు ఉంటే మాత్రం వంశీ కథలు ఏం చెప్తాయి? అనే ప్రశ్నకు ఆ కథలలో గొప్ప మనసుతో ఎందరినో ఆదుకున్న పాత్రలు, విలువల కోసం తాపత్రయపడే పాత్రలు, స్వచ్ఛమైన ప్రేమతో ఆకట్టుకునే పాత్రలు, గొప్ప కళా నైపుణ్యంతో వెలుగొందిన జీవితాలు మొదలైనవి ఆదర్శవంతాలు.

మోసాలు ద్వేషాలు అక్రమ సంబంధాలు అన్యాపదేశంగా చెప్పే మానవ విలువల ప్రాధాన్యాలు ఈ కథల పరమావధి ‘
అని ఆయన తన పరిశోధనా గ్రంథాన్ని పూర్తి చేశాడు. అయితే మా పసలపూడి కథలు సింహావలోకనం సమీక్షలు అన్న అధ్యాయంలో అనుకరణలు లేదా అనుసరణలు అన్న చోట చేసిన ప్రశంస తో పాటు విమర్శ కూడా ఈ పరిశోధకుడి తెలుగు కథ తాలూకు విస్తృత అధ్యయనాన్ని తెలియజేస్తోంది.

మా పసలపూడి కథల పుస్తకం మొదటి ముద్రణ రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో మొదటిసారి ఆవిష్కరణ జరిగినప్పుడు నేను ఆ కథల మీద ఏకైక వక్త గా ప్రసంగం చేశాను. ఇది 2005 నాటి మాట. 72 కథలని అప్పుడు నేను చాలా శ్రద్ధగా చదివాను. ఉపన్యాసం చెప్పాలి కదా అందుకని. ఇప్పటికీ నాకు చాలా కథలు గుర్తున్నాయి. కానీ ఈ పరిశోధనా గ్రంథం చదివేక నాకు ఆ కథలలోని మరిన్ని సూక్ష్మమైన అంశాలు, విశేషాలు వివరాలు  తెలిసేయి. ఒక పరిశోధన తాలూకు ప్రయోజనం అదే కదా.

ఆ విధంగా ఇటువంటి పరిశోధన గ్రంధాన్ని తన కథల మీద సంపాదించుకున్న వంశీ గారికి, ఎంతో ప్రేమతో ఈ కథలను విశ్వవిద్యాలయానికి పరిశోధన రూపంలో అమూల్యంగా చేర్చిన రామచంద్ర రెడ్డి గారికి అభినందనలు తెలియజేయకుండా ఉండలేను.

*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మా పసలపూడి కథలు తెలుగు సాహిత్యంలో ఒక అందమైన ఘట్టం. దాని మీద వచ్చిన సిద్ధాంత గ్రంథాన్ని ఇంత అందంగా పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.
    రామచంద్రారెడ్డిగారి గ్రంథం సాధారణ పాఠకులకి లభ్యం అవుతుందాండీ ?

    • తప్పకుండా దొరుకుతుంది. మీ నెంబరు ఆయనకు పంపుతాను. మీతో మాటాడి మీకు పుస్తకం పంపుతారు. థాంక్యూ అండీ

      • మీకు కృతజ్ఞతలు ఎలా తెలియచెయ్యాలో తెలియడం లేదు.
        మంచి పుస్తకాలు పరిచయం చెయ్యడంతో ఆగకుండా పుస్తకాలు ఇచ్చి, ఇప్పించి కూడా చదువరులని ప్రోత్సహించి, ఉత్సాహపరిచి, రాయించే ప్రతిభ మీకే స్వంతం.
        నమస్సులు

  • చాలా సిద్థాంత గ్రంధాల కన్నా
    రామచంద్రారెడ్డి గారి సిథ్ధాంత గ్రంధం ఎందుకు గొప్పదో బాగా వివరించారు.. విశ్లేషణ విశదంగా ఉంది

    • థాంక్యూ రాంబాబు గారూ

  • సిద్ధాంత గ్రంథం లోని సొబగులన్నీ వివరించారు.ధన్యవాదాలండీ

  • థాంక్స్
    వీరలక్ష్మీదేవి గారూ..
    అఫ్సర్ గారూ
    🌹🌹🌹🌹🌹

  • లక్ష్మి, శేఫాలికల సుగంధం ఒక్కసారిగా చుట్టుకుంది చదువుతుంటె. ఒక శిల్పం చెక్కినట్లు చెక్కుకుంటూ వచ్చారు. సిద్ధాంత గ్రంథాన్ని ఎంత అందంగా పరిచయంచేశారు.ఒక్కొక్క ముత్యాన్ని దారంలొ గుచ్చినట్లు అందించారు. ఎంత సొగసుగా, ఎంత సున్నితంగా అందించారు. రామచంద్రారెడ్డిగారికి అభినందనలు.మీకు మనఃపూర్వక ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు