ఏది ఆధునికత?ఏది అత్యాధునికత?

తెలుగు సాహిత్యంలో కొన్ని దశాబ్దాలుగా పోస్ట్ మాడర్నిజం గురించి చర్చ జరుగుతోంది. ఆధునికానంతర వాదం అసలు కాలానికి సంబంధించిందా, అసలు అది కొత్త ప్రాపంచిక దృక్పథమా, లేక అన్ని ప్రాపంచిక దృక్పథాలను విమర్శనాత్మకంగా చూసే ఆలోచనా విధానమా  అన్నచర్చలు సాగాయి. ఆధునికానంతర వాదం ఒక ఐడెంటిటీ ను , మనిషి రకరకాల  అస్తిత్వాలను ప్రతిఫలించేదని చెప్పిన వారు ఉన్నారు. ఆధునికానంతర వాదం ఏ సత్యం శాశ్వతం కాదని,శాస్త్రీయత అన్నదానికి ఒక నిశ్చితార్థం లేదని మేధావులు విశ్లేషించారు. వెలుగులో ఉన్న చీకటిని, శబ్దం దాచిన నిశ్శబ్దాన్ని నిరంతరం అన్వేషిస్తుంది ఆధునికానంతర వాదం. సిద్దాంతాలు, పిడివాదాలు, కొటేషన్లు పోరాటాలు, విగ్రహాలు విస్మరించిన ఆక్రందనలు, అణిచివేతలు, రోదనలు, అవమానాలు, సంఘర్షణలు,చివరికి ఆత్మహత్యలు కూడా  ఆధునికానంతర వాదంలో అలలు అలలుగా ఎగిసిపడతాయి.

మిత్రుడు అఫ్సర్ 1993లో రచించిన ఆధునికత,అత్యాధునికత  తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా కవిత్వాన్నీ అప్పటికి అధునాతనంగా సమీక్షించిన విమర్శనా గ్రంథం. అప్పటి వరకూ తెలుగు సాహిత్యాన్ని ఈ విధంగా విశ్లేషించిన విమర్శకులు లేరు. ఏది ఆధునికం,ఏది అత్యాధునికం అన్న ప్రశ్న పూర్తిగా రూపానికి చెందినది కాదు. సంప్రదాయానికి చెందిన ఆలోచనా ధోరణిని వ్యతిరేకించేదేదైనా ఆధునికం అని నా అభిప్రాయం. మరి ఏది సంప్రదాయం అనేది కూడా ఒక చర్చనీయాంశం. సంప్రదాయం అనేది కాలానికి సంబంధించింది. భావజాలానికి సంబంధించింది. తర తరాలకూ సంప్రదాయ నిర్వచనం మారినట్లే ఆధునికత అనే దాని నిర్వచనం కూడా మారుతూనే ఉంటుంది. అటువంటప్పుడు అత్యాధునికత కూడా ఒక కాలానికి, ఒక భావజాలానికీ సంబంధించింది ఎంత మాత్రమూ కాదు.

అఫ్సర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆధునికత అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు అన్న పదంతో అఫ్సర్ తన పుస్తకాన్ని ప్రారంభించారు. ఆధునికత అంటే కాలానికి సంబంధించిన వివిధ పరిణామాల పర్యవసానంగా ఏర్పడిన ఒక దృక్పథంగా ఆయన చెప్పారు.

తెలుగు సాహిత్యంలో ఆధునికత ఎప్పుడు ప్రవేశించింది? 20వ శతాబ్దంలో సామాజిక పునాదుల్లో వచ్చిన మార్పులు సాహిత్య స్వభావాన్ని పూర్తిగా మార్చాయి అన్నారు అఫ్సర్. అప్పటికి వీరేశలింగం సంఘ సంస్కరణ ఒక ఆధునికత. గురజాడ భావ విప్లవం ఒక ఆధునికత. వ్యక్తి స్పృహగా మిగిలిపోతున్న కవిత్వానికి  గురజాడ సామాజిక స్పృహ అనే కొత్త విలువలనుతీసుకువచ్చాడు అని చెప్పాడు . కొత్త ఛందస్సు వెతుక్కున్నాడు.ఆనాటి ఆధునిక సామాజిక విలువల్ని కవిత్వంలో వచ్చిన మార్పులు ఇముడ్చుకోగలిగాయి..అన్నాడు.. ఇదే ఆధునిక కవిత్వానికి తొలి మెట్టు అని అఫ్సర్ భావించాడు.

గురజాడ తర్వాత వచ్చిన భావకవిత్వం ఆధునికం కాదా? అన్నది మరో చర్చ. స్త్రీపురుషుల సంబంధాలకు సంబంధించిన ఎన్నో కొత్త భావనల్ని భావకవులు ప్రచారంలోకి తీసుకు వచ్చారు. కాని స్త్రీని ఒక ఆరాధ్య వస్తువు స్థాయికి తీసుకువెళ్లడంలో భావ కవిత్వం మరో విధంగా ప్రబంధ లక్షణాలను పునరుద్దరించే స్థితికి చేరుకుంది అని అఫ్సర్ సిద్దాంతీకరించారు.స్త్రీని ఆరాధిస్తే దానికి ప్రబంధ లక్షణాలున్నట్లా? భావకవిత్వం కొద్ది కాలంలోనే ఉనికిని కోల్పోయింది అన్నాడు అఫ్సర్.. ఇది చర్చనీయాంశమైన అంశం. తెలుగు సాహిత్యంలో భావకవిత్వం ఎప్పటికప్పుడు అధునాతన రూపంలో వ్యక్తమవుతూనే ఉన్నదా..ఇవాళ ఎంతమంది భావకవిత్వంలో కొట్టుకుపోవడం లేదు? అన్నది నా ప్రశ్న. దీన్ని చర్చించాల్సి ఉన్నది.

సరే, భావ కవిత్వానికి మించిన ఆధునికతను అఫ్సర్ పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ లో చూశారు. నగర జీవితాన్ని ప్రతిబింబించిన తొలి ఆధునికకవిగా ఆయన గుర్తించారు. ఈ గుర్తించడంలో అఫ్సర్ ఒక విశ్లేషణ చేశారు.  ‘భావ కవిత్వానికి భౌతిక పునాది కనుమరుగైనప్పుడు పఠాభి దాన్ని భూ మార్గం పట్టించాడు’ అన్నాడు ఆయన .అంటే భావకవిత్వం ప్రారంభించినప్పుడు దానికి భౌతిక పునాది ఉన్నట్టా? అసలు భౌతిక పునాది లేనిది కవిత్వం కాదా?

సాహిత్యవిమర్శకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన చర్చనీయాంశమైన విషయం.

ఆ తర్వాత అఫ్సర్ గుర్తించినట్లుగా ఆధునిక కవి జాతీయోద్యమాలు, వివిధ అంతర్జాతీయ ఉద్యమాలప్రభావంలో పడ్డాడు. ‘సమకాలీన వ్యవస్థ గురించి కవిలో అస్పష్టంగా మెదులుతున్న భావాలకు అక్టోబర్ విప్లవం వంటి అంతర్జాతీయ పరిణామాలు ఒక స్పష్టమైన రూపాన్నిచ్చాయి’ అన్నాడు.అంతేకాదు. ఒకప్పుడు రాజుల గురించి, పెత్తందారుల గురించి రాసిందే సాహిత్యం తర్వాత సాహిత్యంలోఅణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఫ్రెంచి విప్లవం తర్వాత విస్మృత వర్గాల కోసం (సబాల్ట్రన్) సాహిత్యంఏర్పడింది. శ్రమజీవులు సాహిత్యంలో ప్రధానాంశంగా మారారు.

ఈ క్రమంలో శ్రీశ్రీ ఆధునిక కవిగా మనకు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. నారాయణ బాబు కూడా అక్టోబర్ విప్లవానికి ప్రభావితుడైనప్పటికీ ఆయన ది కేవలం ప్రయోగ వాద దృష్టి . పఠాభి ఫిడేల్ రాగాల డజన్ లోని అరాచకత్వాన్నీ, నారాయణ బాబు రుధిర జ్యోతిలోని వస్తు రూప పరిమితత్వాన్నీ దాటి ముందుకు వెళ్లాడు శ్రీశ్రీ. ఏమైనా తన కాలానికి ఆధునికుడు శ్రీశ్రీయే.

అయితే  మార్క్సిస్టు వాద దృక్పథంతో వెలుడిన అభ్యుదయ కవిత్వం ఆధునిక కవిత్వ లక్షణాలు ఒకే రూపంలో ఉండిపోలేదు. అభ్యుదయ కవిత్వ ప్రభావం తగ్గుముఖం పట్టి ఆధునిక కవిత్వంలో వైయక్తిక స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీశ్రీ ఖడ్గ సృష్టి వెలువడింది. ఇందులో అధివాస్తక కవిత్వం తీరుతెన్నుల కనిపిస్తాయి. శ్రీశ్రీ  స్వంతంగా మనస్ఫూర్తిగా వ్యక్తం చేయలేక కొన్ని చీకటి కోణాల్లోకి తిలక్ కవిత్వం ప్రవేశించింది. ఉద్యమ నేపథ్యం కొరవడిన సందర్భంలో వాస్తవితకూ, ఆదర్శానికీ మధ్య ఉండే సున్నితమైన సంఘర్షణ తిలక్ కవిత్వంలో కనిపిస్తుందంటారు అఫ్సర్.  పార్లమెంట్ రాజకీయాల్లో కమ్యూనిస్టులు అస్తిత్వం కోల్పోతున్న సమయంఅది. సరిగ్గా అదేసమయంలో వచన కవులు కొత్త భాషా వ్యవస్థలోకిఅడుగుపెట్టారు. సమాజంలోని స్తబ్ధతను ప్రశ్నించే దిశలో దిగంబర కవులు, తిరగబడు కవులు  వచ్చారు.  తెలుగు కవులకు స్వచ్చమైనఅనుభూతి ఎలా వ్యక్తంచేయాలో నేర్పింది దిగంబరులే. ఆధునిక జీవితంలో రకరకాల పలాయన వాదాల్ని ఆత్మవంచనల్నీ అద్దంలో చూపించారు దిగంబరకవులు.

ఆ తర్వాత విరసం ఏర్పడింది. గిరిజన రైతాంగ పోరాట రూపంలోమార్స్సిస్టు, మావో ఆచరణాత్మకసిద్దాంతం మళ్లీ కవిత్వంలో ప్రతిఫలించడం ప్రారంభించింది. ప్రజల్లోకి కవిత్వం వెళ్లడం, పాట, కవిత్వం అనే రెండు ప్రక్రియలు పరస్పర ప్రభావానికి గురి కావడం మొదలైంది. చెరబండరాజు, శివసాగర్, గద్దర్ ఒకవైపు వరవరరావు ,విప్లవ కవులు మరో వైపు పరస్పర ప్రభావితం అయ్యారు. కవికి విస్తృత జీవనానుభవాలే ప్రాతిపదిక అయ్యాయి.

 

1980 ల నుంచి పరిస్థితి మారిందని అఫ్సర్ భావించారు. భాతిక,మానసిక ప్రపంచాల మధ్య సమన్వయం సాధించడం మనిషికి కష్టమై పోయిందని,అపారంగా పెరిగిపోతున్న విజ్ఞానం సాంకేతిక సంబంధాలు మనుషుల మధ్యదూరాన్ని తగ్గిస్తున్నట్లే తగ్గించి పెంచుకుంటూ పోయాయని,ఇది కవిత్వంలో అస్తిత్వ వేదనకు గురి చేసిందని ఆయనవిశ్లేషించారు. ఈ అస్తిత్వ  వేదన ఆలూరి బైరాగి కవిత్వంలో మనకు కనపడుతుందని ఆయన చెప్పారు. ఆదునిక మానవుడి జీవితమే రణ భూమి, ప్రతి ఒక్కరూ ఏదో ఒకసందర్బంలో అర్జునుడే.. ఊహకూ, వాస్తవానికీ, క్రియకూ, కదలికకూ మధ్య వ్యవధిలో చీకటి నీడల్ని బైరాగి ప్రతిఫలించారు. ఈ అస్తిత్వ వేదన మరిత ప్రస్ఫుటంగా అజంతా కవిత్వంలో ప్రతిఫలించింది.

అత్యాధునిక కవి ఎవరు? అఫ్సర్ చాలా స్పష్టంగా నిర్వచించారు. అత్యాధునిక కవి  సామాజిక,వ్యక్తిగత జీవితాల మధ్యగొప్ప సమన్వయంసాధిస్తాడు. తన ఏకాంత గోపురంలో రాలిన కన్నీళ్లకూ, కాన్పూర్ లోనూ,మీరట్ లోనో ఏ సామాజిక దౌష్ట్యానికో రాలిన ప్రాణాలకూ ఒకే విధంగా స్పందిస్తున్నాడు. నియంతృత్వాలపై స్వేచ్ఛాసమరం సాగిస్తున్న యువతరం భావాలకు ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈసామాజిక నేపథ్యం తెలియని వాడికి ఆధునిక కవిత్వం అర్థం కాదు.

అత్యాధునిక కవి లక్ష్యం మరిచిన రాజకీయ శిబిరాలమధ్యా అవసరాల బానిసత్వంలో రక్తాన్ని చంపుకున్న సమూహాల మధ్య మనిషికి సామూహిక వ్యక్తిత్వం ఉండదు. ‘ఉండేదల్లాఅస్తిత్వ వేదన’ అంటాడు.అఫ్సర్  శిబిరాల్లో, సమూహాల్లో ఊపిరాడక పారిపోయిన సత్యాన్ని ఈ తరం వెతుక్కుంటుంది. అప్పటిఅన్నిసాధారణ ప్రమాణాల శిఖరాగ్రంపైనా ఆ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. అలాంటి సంక్షోభ తరానికి ఉత్తమ ప్రతినిధి అజంతా. వైరుధ్యాలను వెన్నుముకగా ధరించిన అక్షరం అతడిసంతకం. ఆ క్రమం వేగుంట మోహన ప్రసాద్ లోకూడా కనపడుతుంది.

1980లలో ప్రవేశించిన ఆధునిక కవుల్లో అఫ్సర్ ఒకరు. నిజంగా ఆయనతోనే అత్యాధునిక కవిత్వం రంగ ప్రవేశం చేసింది.

.‘అశాంత నేత్ర జలపాతాల్లోంచి, ఇరుక్కుంటూ, ఇరుక్కుంటూ అనంతానంత మౌన ప్రవాహంలోకి మృత్యువు చిటికెన వేలు పట్టుకుని మెల్లిగా నిశ్శబ్దాలు రాలుస్తూ వెళ్లిపోయిన నీకు చదువుతూ చదువుతూ నువ్వు సగంలోనే వదిలిపెట్టి వెళ్లిన పుస్తకం ఒంటరితనం రెక్కలు రెపరెపలాడిస్తూ మళ్లీ వస్తావని అమాయకంగా నిరీక్షిస్తుందని ఎవరు గుర్తు చేస్తారు?’

ఎవరీ కవి? అన్ని పాతదనాల్నీ ఊడ్చేసి పాత కోట బురుజుల సందుల గుండా వెచ్చటి స్వచ్చమైన కిరణంలా ప్రవేశించిన ఈ కవి ఎవరు? చదవగానే అనిపించింది తెలుగు కవిత్వంలో మరో కొత్త గొంతుక ప్రవేశించిందని. ఇది యాంత్రికతను చేధించడం కాదు. ఇది స్తబ్దతను భగ్నం చేయడం కాదు.  నాటి రోజులు పిడికిలి బిగిస్తున్న చేతులే జోహార్లు అర్పిస్తున్న రోజులు, నినాదాలు చేసిన గొంతులే విషాద గీతికలు ఆలపిస్తున్న  కాలమది.  ఒక ప్రజాకళాకారుడి నెత్తుటి జోలె విస్తరిస్తున్నసమయం అది, గజ్జెల కాళ్లు గుండెలపై నర్తిస్తున్న ఘట్టం అది. ఆ సమయంలో  ఖమ్మం నుంచి వచ్చిన ఒక స్వచ్చమైన గాలి రెపరెప అప్సర్. ప్రశ్శల ఉక్కబోతలో నే చిక్కుకున్నప్పుడు ఇటువంటి రెపరెపలతో   అఫ్సర్ దారిలో పలువురు పయనించే ప్రయత్నం చేశారు. అఫ్సర్ కొత్తదారిని ఎప్పటికప్పుడూ సృష్టించుకుంటూ ఇవాళ మళ్లీ అస్తిత్వంలోని ఆక్రందనలో అత్యాధునికతను వెతుక్కుంటున్నారు.

విప్లవ కవిత్వం సహజంగా విధించుకున్న ఉద్యమ పరిమితుల వల్ల వస్తుపరంగా మధ్యతరగతి జీవితాన్ని స్వీకరించలేక పోయిందని,ఈదశలోవ్యక్తీ,సమూహాలమధ్యఉండే అంతస్సంఘర్షణను కవిత్వం వ్యక్తం చేయగలిగిందని అఫ్సర్ అన్నారు.ఈక్రమంలో ఆత్మాశ్రయత, వస్త్వాశ్రయత వంటి మౌలిక భావనల మద్యసరిహద్దు రేఖ తొలగిపోయిందని అఫ్సర్ విశ్లేషిస్తాడు.  వ్యక్తి అనుభవం సామూహిక అనుభవంగా విస్తృతమై వ్యక్యం చేయడాన్ని అఫ్సర్ అద్భుతంగా వివరించారు. 1985 లనుంచీ స్త్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ కవిత్వం తెర ముందుకు వచ్చాయి.వైయక్తిక అనుభూతులు,అనుభవాలకూ పరిమితమైన కవిత్వం అతి తక్కువ. సంక్లిష్టసమాజాన్ని వ్యక్తం చేసిన,నిరాశా నిస్పృహలు వ్యక్తంచేసిన కవిత్వమూ తెలుగు సాహిత్యంలో చోటుచేసుకుంది.

అఫ్సర్ ఆధునికత,అత్యాధునికత గురించి రాయడానికి కొద్దిసంవత్సరాల క్రితమే ఆరుగురు కవులు ప్రశ్నలు వేసుకున్నారు. అఫ్సర్, ప్రసేన్, నీలిమా గోపీచంద్, నరసింహాచారి, కృష్ణుడు(నేను) కలిసికట్టుగా దేశ వ్యాప్తంగా,అంతర్జాతీయంగా విఫలమైన ఉద్యమాలను ప్రశ్నించాం. విగ్రహాల కూల్చివేతను తిలకించాం. తియాన్ మేన్ స్క్వేర్ ఘటన, రష్యాలో సంస్కరణలు,తూర్పుయూరప్ ఘటనలు జర్మనీ విలీనంపై ప్రశ్నలు లేవనెత్తాం. ‘క్రితం తర్వాత’ పేరుతో ఈ కవితా సంకలనం వచ్చింది.

అయితే తెలుగు సాహిత్యం ఒక సరళ రేఖలా సాగలేదు. రకరకాల ధారలు ఇందులో మనకు కనపడతాయి. శివారెడ్డి, దేవీ ప్రియ, సిద్దారెడ్డి, అఫ్సర్ ఈ క్రమాన్ని మనం విడదీయలేం. ప్రపంచ, దేశ రాజకీయ,సామాజిక ఆర్థిక పరిణామాలు,ఈ నేలపై జరిగిన సామాజిక,రాజకీయోద్యమాలు, కులసంఘర్షణలు అణిచివేతలు అడుగడుగునా సాహిత్యాన్ని ప్రబావితం చేశాయి. అదే సమయంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఉద్యమాలు తగ్గుముఖం పట్టాయి. మనిషి తనజీవితాన్ని వెదుక్కునే క్రమంలో,తన మనుగడను కాపాడుకునేందుకు ప్రయత్నించడం ప్రారంభించాడు. విద్యార్థి ఉద్యమాలు తగ్గిపోయి పోటీ పరీక్షల సుడిగుండంలో పడ్డారు. చదువుకున్న యువత దేశంలోసంస్కరణలకు తగ్గట్లుగా పెరుగుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణంలో తమ జీవితాలను వెతుక్కోవడం ప్రారంభించింది. అదే సమయంలో  విదేశాలకు తలుపులు బార్లా తెరవడంతో పొట్టకూటికి ఎక్కడికైనా వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళితులు,వెనుకబడిన వర్గాలు తమ అస్తిత్వాన్ని సంస్కరణల వెలుగులో వెతుక్కున్నారు. ప్రజాస్వామ్యం, అసమానతలపై ప్రశ్నించడం నేర్చుకున్నారు. అగ్రవర్ణాల దోపిడీని ఎదిరించారు. రాజకీయ,సామాజికాధికారంలో తమకువాటా కావాలని కోరుకున్నారు. మైనారిటీలు తమస్థితిగతుల్ని గుర్తించారు. ఇవన్నీ ఆధునికసాహిత్యంలో ప్రవేశించాయి. ఈరకంగా దళిత,బహుజన,మైనారిటీ,స్త్రీవాద సాహిత్యానికీ,ఆధునికానంతర చేతనకూ ప్రత్యక్ష సంబంధం ఉన్నది.

నారాయణ బాబు, బైరాగి,అజంతా, వేగుంట లాంటివాళ్లలోనే కాదు, దళిత,బహుజన, మైనారిటీ ,స్త్తీవాద సాహిత్యంలోనూ అఫ్సర్ అత్యాధునిక లక్షణాల్ని గుర్తించాడు. రాజకీయ నిబద్దతనుంచి విడివడి తమ జీవితాలను తమ కవిత్వంలో,తమ గానంలో,వెదుక్కునే కవులను ఆయన గుర్తించారు. అంతర్ముఖత్వం, అస్తిత్వవేదన, వ్యక్తి చేతన,అస్పష్ట కవిత్వానికీ ఉన్న సంబంధాన్ని అఫ్సర్ తన విశ్లేషించారు. చేరా అన్నట్లుగా నాడు చరిత్ర రచనకు అఫ్సర్ ఒక ఉత్తేజకరమైన తొలి ప్రయత్నం చేశారు.

ప్రస్తుత దేశరాజకీయాలు,సామాజిక పరిణామాల తీరుతెన్నులను అఫ్సర్ అప్పుడే పసిగట్టారు. సామాజిక రంగంలో పోలరైజేషన్, మతం, రాజకీయాల్లోఉనికిని వెతుక్కోవడం, మత ఛాందసత్వం కొత్త ఊపిరి పోసుకోవడాన్ని ఆయన గమనించారు. వైయక్తిక అనుభవాల మధ్యసామాజిక శక్తుల ప్రబావం పడిందని విశ్లేషించారు. అత్యాధునిక కవిత్వానికి స్పష్టమైనరూపం ఉండాల్సిందేనని అఫ్సర్అన్నారు.

ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. తెలుగు సాహిత్యానికి తిరుగుబాటు కొత్తది కాదు. ప్రశ్నలు కొత్తవి కావు. సామాజిక సంస్కరణల కవిత్వం, స్వాతంత్రోద్యమ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, ప్రగతి శీల కవిత్వం, దిగంబర కవిత్వం,  విప్లవ కవిత్వం, ఫెమినిస్టు కవిత్వం, దళిత అస్తిత్వ వాద కవిత్వం. ఒక కవిత్వానికి ఎన్ని శాఖలు? కవిత్వం చెట్టు కాదు శాఖలుగా విస్తరించడానికి?  కవిత్వం కాలం కత్తిపై నుంచి కారుతున్న రుధిరధార. రక్తానికి శాఖలు లేవు.

కాని ఏ రూపమైనా,ఏ భావజాలమైనా,ఏసిద్దాంతమైనా, ఏ ఉద్యమమైనా సమాజంలో జరుగుతున్న పరిణామాల్నిఆపగలుగుతున్నాయా..నినాదాలు ఇప్పుడు పేలవంగా కనిపిస్తున్నాయి.గొంతులు బలంగా పెగలడడం లేదు. జాతీయవాదం పేరుతో మతం వెల్లువలా దేశంలో వ్యాపిస్తోంది. ఆర్థికసంస్కరణలవల్ల ఏర్పడిన వ్యత్యాసాలు అసంతృప్తులుగా మారకుండా ఉండడం కోసంమతం వ్యాపిస్తోంది.దోపిడీని కుల, మైనారిటీ అణిచివేతను ప్రజలుగ్రహించకుండా ఉండడం కోసం వ్యక్తిఆరాధన, దైవభక్తి విస్తృతంగావ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియా మనిషిని వికృతంగా మారుస్తోంది.ఒకరకంగా మనం ఆధునిక యుగంలో ఉన్నామా,లేక మళ్లీ ఆటవిక యుగంలోకో మధ్యయుగాల్లోకో వ్యాపిస్తున్నామా అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఇప్పుడు ఏది ఆధునికత,ఏది అత్యాధునికత అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి. సమాజాన్ని వ్యక్తులుగా ఆర్థిక సంస్కరణలు విడదీస్తే ఒక మతంగా సంఘటితం చేసే శక్తులు బలం పుంజుకుంటున్నాయి. ఈ దశలోప్రత్యమ్యాయ ఆలోచన దిశగాసాహిత్యం సామూహికమైతే తప్ప, దళిత,బహుజన, మైనారిటీ,స్త్రీవాదులంతా ఏకమై ప్రతిఘటిస్తే తప్ప ఒక ప్రశ్నించేసాహిత్యం రాదు,ఒక అత్యాధునికసాహిత్యానికి ఘట్టం అవిష్కృతమయ్యే తరుణాన్ని మనం ఏర్పర్చాల్సిఉన్నది. వెనక్కి వెళ్లడాన్ని బలంగా ఆపి ముందుకు తీసుకువెళ్లేందుకు వేన వేల చేతులు ఏకం కావల్సిఉన్నది. సమూహంలో వ్యక్తిని, వ్యక్తిలో సమూహాన్ని రాజేయాల్సి ఉన్నది.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి వ్యాసం . అఫ్సర్సాబ్ కవిత్వాన్ని బాగా వివరించారు,

    ముఖ్యంగా “ప్రస్తుత దేశరాజకీయాలు,సామాజిక పరిణామాల తీరుతెన్నులను అఫ్సర్ అప్పుడే పసిగట్టారు. సామాజిక రంగంలో పోలరైజేషన్, మతం, రాజకీయాల్లోఉనికిని వెతుక్కోవడం, మత ఛాందసత్వం కొత్త ఊపిరి పోసుకోవడాన్ని ఆయన గమనించారు. వైయక్తిక అనుభవాల మధ్యసామాజిక శక్తుల ప్రబావం పడిందని విశ్లేషించారు. అత్యాధునిక కవిత్వానికి స్పష్టమైనరూపం ఉండాల్సిందేనని అఫ్సర్అన్నారు.” బాగా చెప్పరు.

    అలగే మిరు కూడా సరిగ్గా ముగింపు పలికారు. “సోషల్ మీడియా మనిషిని వికృతంగా మారుస్తోంది.ఒకరకంగా మనం ఆధునిక యుగంలో ఉన్నామా,లేక మళ్లీ ఆటవిక యుగంలోకో మధ్యయుగాల్లోకో వ్యాపిస్తున్నామా అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఇప్పుడు ఏది ఆధునికత,ఏది అత్యాధునికత అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి. సమాజాన్ని వ్యక్తులుగా ఆర్థిక సంస్కరణలు విడదీస్తే ఒక మతంగా సంఘటితం చేసే శక్తులు బలం పుంజుకుంటున్నాయి. ఈ దశలోప్రత్యమ్యాయ ఆలోచన దిశగాసాహిత్యం సామూహికమైతే తప్ప, దళిత,బహుజన, మైనారిటీ,స్త్రీవాదులంతా ఏకమై ప్రతిఘటిస్తే తప్ప ఒక ప్రశ్నించేసాహిత్యం రాదు,ఒక అత్యాధునికసాహిత్యానికి ఘట్టం అవిష్కృతమయ్యే తరుణాన్ని మనం ఏర్పర్చాల్సిఉన్నది. వెనక్కి వెళ్లడాన్ని బలంగా ఆపి ముందుకు తీసుకువెళ్లేందుకు వేన వేల చేతులు ఏకం కావల్సిఉన్నది. సమూహంలో వ్యక్తిని, వ్యక్తిలో సమూహాన్ని రాజేయాల్సి ఉన్నది.’

  • మంచి వ్యాసం. చివరగా మీ విశ్లేషణ బాగుంది. సమాజాన్ని వ్యక్తులుగా ఆర్థిక సంస్కరణలు విడదీస్తే ఒక మతంగా సంఘటితం చేసే శక్తులు బలం పుంజుకుంటున్నాయి. ఈ దశలోప్రత్యమ్యాయ ఆలోచన దిశగాసాహిత్యం సామూహికమైతే తప్ప, ఒక ప్రశ్నించేసాహిత్యం రాదు.అన్నది అక్షరాలా నిజం. అయితే వివిధ అస్తిత్వ ఉద్యమాలు ఒక గొడుగు క్రిందకు రాగలవా అన్నదే సందేహం

  • కాల ప్రవాహంలో కవిత్వ పరిమళం వెదికి పట్టుకునే ప్రయత్నం… బాగుందండీ…ఎన్నో పార్శ్వాలను స్పృశించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు