నూకాలమ్మతల్లి పూనకాలు

కొత్త శీర్షిక ప్రారంభం

బర్మాకేంపు ఒక చిత్రమైన ప్రాంతం, రెండో  ప్రపంచ యుద్ధం  వచ్చినపుడు 1939నుంచి 1945 మయన్మార్ లో తెలుగువాళ్లు ఇండియా వొచ్చేసారు  భారతదేశం నుండి ఉపాధి, వ్యాపార నిమిత్తం మయన్మార్ వలస వెళ్లిన వాళ్లంతా తిరిగి  వచ్చేసారు,రెండో  ప్రపంచ యుద్ధ కాలంలో  బ్రిటిష్ వాళ్ళు విశాఖపట్నం   తుమ్మడ పాలెంలో ఒక  మిలటరీ కేంపు, తాటిచెట్ల పాలెం దగ్గర మిలటరీ  కేంపు పెట్టారని  అంటారు, యుద్ధం అయిపోయాక  తిరిగి బర్మా వెళ్లిపోయారు, 1962 సంవత్సరo  బర్మాలో   మిలటరీ అధికారం లోకి వొచ్చింది ,  తెలుగువాళ్లను  భారతదేశం వెళ్లిపోమంది మిలిటరీ, అలా ఇండియా  ఒక వచ్చిన కాందిశీకులకోసం అప్పటి ప్రభుత్వాలు  దేశంలో ఆశ్రయం కల్పించాయి ,విశాఖపట్నంలో మూడు చోట్ల వారికి ఆశ్రయం కల్పించాయి. ఒకటి కంచరపాలెం దగ్గర బర్మాకేంపు కాగా మిగతావి  శ్రీహరిపురం ,అనకాపల్లి, మరొకటి యలమంచిలి దగ్గర ఉన్నాయి.

 కాందిశీకుల కోసమే ఉన్న ఈ కంచరపాలెం బర్మాకేంపు చుట్టూ మిగతా కుటుంబాలు కూడా చేరాయి. ఈ కాందిశీకులలో ఎ క్కువ మంది విశాఖ జిల్లా నుంచి వెళ్లిన వాళ్లే , మరికొంత మంది ఇతర జిల్లాల వాళ్లు. కాందిశీకులుగా ఇక్కడకు వచ్చినా బర్మా వాళ్లలాగా ప్రత్యేకమైన వారిగా భావిస్తూ గొప్పలు పోవడం, అక్కడి కట్టూ బొట్టూ పూర్తిగా మారకపోవడం, బర్మా సేమ్యాలు, నాను రోటీలు, బర్మా లుంగీలు, పెద్దవారికి బర్మా భాష రావడం, సాయంత్రం అయితే చాలు నీసు కూరలు, ఇళ్ల చుట్టూ ములక్కాడ చెట్లూ, బాదంచెట్లూ, ఇక్కడ దుర్గాదేవికి, సంతోషిమాతకు,నూకాలమ్మ దేవతలకు పూజలు, వినాయక చవితికి పందిర్లు, పండగలన్నీ ఒక సంబరంలాగా చేయడం. ఇంకా రోడ్ల మీద కొట్లాటలు, రౌడీయిజం ,ఆడాళ్ల బూతులు, బోరింగ్ దగ్గర గొడవలు అదో ప్రత్యేకనమైన ప్రపంచం.  

  ఈ కథలన్నీ ఎనభైయ్యో దశకం చివరి ప్రాంతానికి చెందినవి, అప్పటి మనుషులవి.


మే
మప్పుడు బర్మాకేంపులో వుండేవాళ్ళం. బర్మాకేంపంటే తూర్పుకనుమల్లో మాధవధార కొండలకి కొంచెం ముందుకు వస్తే కొండను ఆనుకున్న ఒక ఊరు. కొండల మీద సగం నుంచి కిందవరకూ ఇళ్ళు ఉంటాయి  కొండకింద రేకులతో బర్మాకాందిశీకుల కోసం కట్టిన రేకుల ఇళ్లు, వాళ్లతో పాటు మిగతా జనాల ఇళ్లు, ఎక్కువగా కమ్మలిల్లు, మరికొన్ని పెంకుటిళ్లు, ,చాలా తక్కువ డాబా ఇళ్లు.

1964లో బర్మాలో మిలటరీ ప్రభుత్వం అక్కడ ఉన్న భారతీయులను తమ దేశాలకు వెళ్లిపోమంది, అలా అక్కడ నుంచి వచ్చిన కాందిశీకుల కోసం విశాఖలో ఇళ్ళు కట్టారు. ఒకటి కంచరపాలెం మిగతావి శ్రీహరిపురం, అనకాపల్లి, యలమంచిలి లో ఉన్నాయి.

నేను నాలుగోతరగతి చదివేటపుడు దిగువన రైలు పట్టాల పక్కనున్న తుమ్మడపాలెం నుంచి మేము బర్మా కేంపుకి మారాము. మా నాన్న కొండకింద కొంత స్థలం సంపాదించి ఒక పెంకిటిళ్లు కట్టడం మొదలుపెట్టారు. ప్రతి ఆదివారం మేమంతా తుమ్మడపాలెం నుంచి వెళ్ళి ఈ కొత్త ఇంటికోసం శ్రమదానం చేసేవాళ్ళం.  కొండమీదనుంచి కొట్టుకొచ్చిన రాయిరప్పా ఏరుకురావడం, గెడ్డవాగులో పోగుపడిన ఇసుక ఓ చోట పోగెట్టడం ఇదే మా పని. మా నానమ్మ పోయాక మేము తుమ్మడపాలెం అద్దె ఇంటినుంచి బర్మా కేంపులో స్వంత ఇంటికి మారిపోయాము.

మా తాత మయన్మార్‌లో శేట్ ల   దగ్గర కలప వ్యాపారం చూసేవాడట. 1955 ఆ ప్రాంతంలోనే ఆయన గోదావరి జిల్లాకు వచ్చేశాడు. బర్మా లో బాగా  సంపాదించింది ఇండియాలో  పోగొ ట్టుకున్నాడు అట,  ఆయన పోవడంతో మానాన్న మా నానమ్మను తీసుకుని విశాఖపట్టణం చేరారు.ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ,బర్మా కేంపులో మేము కట్టుకున్న కొత్త పెంకుటిల్లు తుమ్మడపాలెంలో మేడ అద్దె ఇల్లు కంటే బావుంది. కొండదిగువన ఉంది. కొండమీదనుంచి దిగే జనం మా ఇంటి ముందునుంచే వెళతారు. నాలుగు గదుల ఇళ్లు ఇంటి ముందు ఖాళీస్థలం ఇంటికి కాస్త దూరంలోనే నూకాలమ్మ తల్లి గుడి.

పొద్దుటే పూజారి ‘శు క్లాం బరధరం.. శశివర్ణం చతుర్భుజం’ పాట రికార్డు వేసేవాడు, కొండలమీద నుంచి హాయిగా వీచే గాలీ, ఈ పాట, పనిచేసుకుని హడావుడిగా తిరిగే జనంతో చాలా అందమైన పెయింటింగ్ లాగా ఉండేది ఆ పొద్దుటి పూట బర్మాకేంపులో. ఉగాదికి ముందు అమావాస్య రోజు నూకాలమ్మ తల్లి పండుగ జరుగుతుంది. అంతకు ముందు తొమ్మిది రోజులు జనం బర్మాకేంపు దిగువన ఉన్న కొండమీద కుమారస్వామి గుడి నుంచి ఇక్కడకు ఒంటినిండా శూలాలు గుచ్చుకుని, నాలుకకు కుమారస్వామి ఆయుధం గుచ్చుకుని బయలు దేరేవారు, ఆ తొమ్మిది రోజులూ బర్మా కేంపు  వేపాకుల వాసనతో, పసుపు వాసనతో గుమ్మెత్తిపోయేది.

అప్పటి వరకు తుమ్మడపాలెంలో సైకిళ్ల మీద బుల్లెట్ల మీద వెళ్లే నేవీ, మిలటరీలో పనిచేసే వాళ్లను చూసిన నాకు పూర్తి భిన్న వాతావరణం ఇది, ఒంటి నిండా శూలాలు గుచ్చుకుని, శూలాల మీద విభూది రాసుకుని, తలమీద పసుపు, బంతిపూల రేకులతో కాళ్లకు చెప్పులు లేకుండా కొండ కింద నుంచి గుడి వరకూ వెళ్లే భక్తులు, వాళ్ల కుటుంబ సభ్యులతో ఆ పదిరోజులూ కేంప్  తెగ సందడిగా ఉండేది.

మా ఇంటి ముందు మునగచెట్టు, కొబ్బరి చెట్టు ఉండేవి, కొండ ప్రాంతం ఏమో బర్మాకేంపులో ఎక్కువగా మునగచెట్లు, బాదంచెట్లు, వేపచెట్లు ఉండేవి . మేము కేంపులోకి మారిన కొత్తలో సాయంత్రం ఒకరోజు నేను మా ఇంటి ముందు చీమలకు పంచదార వేస్తోన్న వేళ “సాయంత్రం గుడికాడకి రారా శెనగల ప్రసాదం, పొంగలి ఇస్తారు” అన్నాడు మా కప్పరాడ స్కూల్ ఫ్రెండ్ బాదంపూడి ఎల్లాజీ. సాయంత్రం చీకటికి ముందు నూకాలమ్మ గుడికాడకి చేరాను. మార్చినెలయినా చల్లగా ఉంది. ఆడాళ్లు తలకు స్నానం చేసి పసుపుబట్టలతో వచ్చారు. మగాళ్ళు పంచెకట్టు, బనీన్లుకు పసుపు పూసుకున్నారు. అందరూ అమ్మవారికి మొక్కులో ఉన్నవాళ్లు. వేపచెట్టుకింద చుట్టూ విశాలమైన దారి వదిలి ఉంటుంది వేపచెట్టుకింద చుట్టూ విశాలమైన దారి వదిలి ఉంటుంది నూకాలమ్మగుడికి, గుడిముందు పెద్ద పుట్టకూడా ఉంటుంది. అందులో మహిమగల నాగుపాము ఉంటుందని ఎల్లాజీ చెబితే నేను భయంగా పుట్టవంక చూసేను. పాము రాత్రుళ్ళు మాత్రమే ఎవరూ లేనపుడు బయటకు వెళ్తున్నట్లు, ప్రస్తుతం దర్పంగా ధైర్యంగా పుట్టలో బొజ్జున్నట్లు ఊహించుకున్నాను.

సన్నగా బక్కగా పొడుగ్గా ఉంటాడు నూకాలమ్మ గుడి పూజారి. ఆయన పేరు నాకు తెలీదు. ‘పూజారి’కి పేరుతో పనేముంది.చల్లగా  అయ్యింది ,  గుడి  దగ్గర  జనం పోగయ్యాక డప్పులు కొట్టేవాళ్ళు లెగిసి నుంచున్నారు. చిన్న దరువేశారు. పూజారి వంక చూసారు. ఆయన రెడీ అనగానే మొదలెట్టేసారు.

దరువు డం డం డం డం డం డం డం డం డం…

డమ్ డమ్ డమ్ డమ్ ఢమ్.. డం డం డం డమ్…

ఒకావిడ చేత్తో వేపమండలతో పూనకంతో ఊగిపోతోంది. పైట జారిపోయింది. చెల్లో, ఆడపడుచో పైట సరిజేసి ఆవిడ నడుముకి చుట్టింది.

ఆవిడ చాలా గట్టిగా గెంతుతోంది. “ఆవిడ మీదకు అమ్మవారు పూనింది” అన్నాడు ఎల్లాజీ “ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాన్నేను. అమ్మవారి కరుణ ఆవిడమీదుంది.” అనుకున్నానో పైకి అనేసానో తెలీదు. డప్పుల చప్పుడులో అన్నీ కలిసిపోయాయి. మిగతా ఆడవాళ్లకు కూడా పూనకాలొచ్చేశాయి. అందరూ వేపమండలో చెలరేగిపోతున్నారు. మగాళ్ల కంటే ఆడాళ్ళు పూనకాలకు భయం వేస్తోంది నాకు. మొత్తం ఒక ఇరవైమంది ఉంటారేమో. ఒకరిద్దరికి అమ్మవారు పూనలేదు. నుంచున్న చోటే కళ్ళుమూసుకుని ఉన్నారు. గుంపు మధ్యలోంచి సడన్ గా ఒకాయన చాలా గట్టిగా గెంతాడు. అతని మోచేయి వెళ్ళి పక్కనున్న భక్తుడికి తగిలింది. గెంతుతున్న భక్తుడ్ని నడుము దగ్గర పంచెవద్ద గట్టిగా పట్టుకున్నాడు బలంగా ఉన్న ఒకాయన. డప్పులు మోగుతున్నాయి. నాక్కూడా అమ్మవారు పూనుతుందేమో అని కళ్ళు మూసుకున్నాను. అమ్మవారు రాలేదు. బహుశా నేను స్నానంచేసి పసుపు బట్టలు వేసుకురాలేదు కదా అందుకే అమ్మవారు కనికరించలేదు అనుకున్నాను ఆ పూటకి.

డమ్ డమ్ డమ్… డమ్ డప్పులు ఊరంతా వినిపించే హో రుతో ఉన్నాయి. వేపచెట్టు సాక్ష్యంగా భక్తులు ఊగుతున్నారు. డప్పుల శబ్దం ఆగింది. భక్తులు ఆగారు. నేలమీద కూలబడ్డారు. వారందరికీ అమ్మవారి విబూది తలకు అద్ది పసుపు నీళ్ళు తాగించారు పూజారి. భక్తులలో మా ఇంటి పక్కన కమ్మరిల్లు కట్టుకున్న పోలిరాజు, వాళ్లావిడ కనకా ఉన్నారు. పిల్లలకి ఆరోగ్యం బావుండాలి అని., పోలిరాజుకి ఉద్యోగం రావాలనీ మొక్కుకొని మాల వేసుకున్నారని అమ్మ చెప్పింది. పూనకాల తర్వాత ప్రసాదం పంచేరు. శెనగలు తిన్నన్ని అక్కడే తినేసాను. చేతికి అంటిన నూనె పేంటెనక  రాసేసాను. తెల్లగా తెల్లారింది, పోలిరాజు సైకిలు తీసుకుని కేరేజీ కట్టుకుని పేంటు షర్టుతో డూటీకి బయలు దేరాడు. వాళ్ళావిడ కనక బోరింగు దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకుంటోంది. రాత్రి చూసిన కళ్లతో వాళ్ళను చూస్తే దేవత కరుణ ఉన్నవాళ్లు ఇలా సాధారన పనులు చేయవలసిన కర్మ ఏమిటి అని ఆశ్చర్యమేసింది.

అమ్మవారి పూనకాల గురించి నాన్నను అడిగితే అది సైన్సు అన్నారు. దేవుడు లేడు అన్నారు. అప్పటికీ ఎర్ర జెండా పార్టీలో తిరుగుతున్న నాన్న.

“మా ఇంట్లో పనిచేసే సత్తెమ్మనడిగితే అమ్మదయ ఉంటేనే అంతా జరుగుతుంది హరిబాబూ”అంది. జరుగుతుంది హరిబాబూ”అంది. తొమ్మిది రోజులు రోజూ సాయంత్రం వెళ్లి డప్పులు ప్రారంభమయ్యే సమయానికి ఎంతసేపు కళ్లు మూసుకున్నా అమ్మవారు పూనలేదు. అమ్మదయ ఉండాలంటే నేనూ ‘మాల’ వేయాలి. నాకు పూనకం రావాలి. అందరూ నను గొప్పగా చూడాలి అనుకున్నాన్నేను.  ఈ మాట మానాన్నతో చెపితే ఆయనకు బెల్టుతో పూనకం వచ్చింది. నేను కొండవీటి సింహంలోని ఎన్టీఆర్ వాడే అంతటి ఆయన లావుపాటి బెల్టుకు అందకుండా నూకాలమ్మతల్లి గుడికి పరిగెట్టాను. అక్కడ భక్తుల పూనకాలను చూస్తూ ఉండిపోయేను. కొండలమీంచి చల్లటిగాలి తగిలింది. భక్తులతో పాటు నాక్కూడా. గుడి కింద గాలికి వేపపండ్లు పడుతున్నాయి , భక్తులూ ఊగిపోతున్నారు గాలికి.

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కధ బాగుంది.రచయితకు అభినందనలు.ఇంకా కథనాన్ని పెంచితే మరింత బాగుంటుందని నా అభిప్రాయం.

  • రచయిత లోని సునిశిత పరిశీలన బాగుంది.. చెప్పే పద్దతి నచ్చింది

  • రచయిత రచనా శైలి,సరళంగా, అద్భుతంగా ఉంది.బర్మా కాందిశీకులు పండగ సందర్భాలలో ఆచరించే సంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టు కధలో రచయిత వివరించారు.కధ,కథనం చదివింపజేసింది.రచయిత అభినందనీయులు.

  • ఆ పరిసరాల్లోకి వెళ్ళిపోయాను హరి గారూ ….చాలా బాగుంది …ఇంకా చదవడానికి ఉంటే బాగుణ్ణు అనిపించింది . అబినందనలు

  • హరి గారు మీ కధా వర్ణన బాగుంది అయితే ఇది కధ కు సమాప్తం కాదు తరువాయి భాగం త్వరలో అని ఉంటే బాగుండు అనిపించింది. రచన సైళి చదువరులకు ఉత్సుకత పురుగొలిపేదిగా ఉండటం అభినందించదగ్గ విషయం.

    చిన్న సవరణ ఏమంటే ఆఖరి పేరాకు ముందు పేరా లో పూనకాల గురుంచి నాన్నను అడిగితే అది సైన్స్ అన్నారు అని అచ్చు అయ్యింది. మీ భావం నాకు అర్ధం అయ్యింది కనుక అది అక్షర దోషం అని అర్ధం చేసుకోగలను. అక్కడ సైన్స్ కు బదులు
    నాన్సెన్సు అని అచ్చు అయి ఉండాలి. ఈ చిన్న అక్షర దోషం మొత్తం కథను నాన్సెన్సు చేయగలదని గుర్తించి ప్రూఫ్ రీడింగ్ మీద జాగ్రత్త వహించాలి అని తెలియచెస్తున్నాను.

  • కథ చాలా చక్కగా రాసారు హరిగారు, నిజం చెప్పాలంటే చాలా సినిమాల్లో బర్మా నుండి వచ్చిన వారి గురించి చాలా క్లుప్తంగా చెప్పేవారు కానీ మీరు బర్మా క్యాంప్ కథలుగా చెప్పడానికి పూనుకున్నారు అందుకు ధన్యవాదాలు… మరిన్ని కథలు చదవడానికి మేము సిద్ధం👍👍👍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు