నిర్మలమైన ప్రశాంత కవిత్వం…..

కాలం గాయాన్ని రేపుతుంది, మాన్పుతుంది. అలాగే రోజూ ఒక కొత్త సమస్యనో లేకపోతే అనుభవాన్నో మన కళ్ళముందు నిలుపుతుంది. మామూలు జనం వాటిని గుర్తుపెట్టుకుంటారు కానీ కవులు మాత్రం హృదయానికి హత్తుకున్న ప్రతీ అంశాన్ని రికార్డ్ చేస్తారు. అలా చేయడం ఇవాళ్టికీ మనకి అవసరమా అని అనిపించవచ్చు కానీ భవిష్యత్ తరాల వారికి అవసరమే కదా.

ప్రముఖ కవి శివారెడ్డి ఒక కవితలో దీపావళి గురించి ఏమి రాస్తారు…? దాని తర్వాత అయిన గాయాల గురించి రాయమని అంటాడు. నిజమే కదా. ఆనంద సందర్భాన్ని రికార్డ్ చేయడం నలుగురితో పంచుకోవడం ఎంత ముఖ్యమో అలాగే బాధామయ జీవితాల వెనక ఉన్న చీకటి కోణాలని రికార్డ్ చేయడం కూడా అంతే ముఖ్యం . అలా రికార్డ్ చేసిన కవితని మనం ఈ రోజు తొలకరి లో పరిచయం చేసుకుందాం.  కవితా శీర్షిక “మిగిలిపోయే కథలు కొన్ని”  కవయిత్రి కడెం లక్ష్మీ ప్రశాంతి.

రాయడానికి చాలా ఏళ్లుగా కవిత్వం రాస్తున్నారు, చాలా కవితలు ఆయా పత్రికల్లో అచ్చులో వచ్చాయి.ఫేస్బుక్ లో అభినందనలు, కంగ్రాట్స్ లాంటి కామెంట్స్ చాలానే అందుకున్నారు కానీ ఈమె లోపల మాత్రం ఇంకా సరైన కవిత నానుంచి రాలేదు అనే భావనలో ఉండేవారు. కొన్నాళ్లు రాయడం ఆపేసి, చదివి మళ్ళీ రాశారు , మళ్ళీ పైన చెప్పినవన్నీ మామూలే. ఆవిడ కవిత్వమే రాశారు నిజం. కానీ ఆమె తాను కోరుకున్న ఆవేదన, అనాదిగా సమాజాన్ని తొలుస్తున్న ప్రశ్న లాంటి ఒక వస్తువు తీసుకుని రాయాలనే కోరిక బలంగా నాటుకుపోయింది.

అది ఈ కింద ఇచ్చిన కవితతో తీరిపోయింది. కవిత్వం లో కొన్ని  వస్తువులకు మరణం ఉండదు. అవి సమాజం లో ఉన్నంత సేపు వాటి మీద కవిత్వం వస్తూనే ఉంటుంది. ఆనాటి అలిశెట్టి ప్రభాకర్
” తాను పుండై మరొకరికి పండై”లాంటి కవితా వాక్యాలు నుంచి ఈనాటి కొత్త కవుల వరకు ఎంత మంది రాసినా ,అక్షరాలు కుప్పలుగా పోసినా, ఆ ఆవేదన మాత్రం తీరనిది. కాలం మారిన కొద్దీ వస్తువును చూసే విధానం మారుతుంది.కవులు పాత పదాలకి మాట్లు వేస్తారు అని సీతారాం ఒక చోట అన్నట్టు గా కొత్త తరం కవులు కొన్ని పాత వస్తువులకు మాట్లు వేస్తారు.మళ్లీ ఒకసారి వాటినే వర్తమానపు అద్దంలో నుంచి ప్రపంచానికి చూపెడతారు.

కవిత లోకి వెళదాం..

మిగిలిపోయే కథలు కొన్ని

ప్రతీ కధా ఏదోఒకరోజు
కంచికి చేరుతుందనుకుంటారు కానీ
ఇక్కడ మాత్రం రోజుకో కొత్తకథ పుడుతుంది
తరచిచూస్తే
మస్కారాతో మెరిసే కళ్ళలోనో
లిప్స్టిక్ పెదవులలోనో
ప్రాణం పోసుకునే ఓ కొత్తకథ కనిపిస్తుంది

ఫౌండేషన్ క్రీములతో,ఐలాష్ లతో
ఆకర్షిచే ముఖాల మాటున
ఏడురంగుల స్వప్నాలు
కమురు వాసన వేస్తాయి 

దేహం వినిమయ వస్తువు అయ్యాక
నగ్నత్వాన్ని కాంక్షిస్తారే కానీ
దానివెనుక ఉండే కలల్ని కాదు
ఇక్కడంతా క్షణకాలపు ప్రేమలు
శాశ్వత  వియోగాలు.

కోరికల కొలిమిలో కాలిపోవడం
తప్పనిసరైనప్పుడు
ఆవేశపు గాజుసీసా భళ్ళుమన్నాక
మనసు పొరల్లో వేల రుధిర సంతకాలు
చెయ్యకమానదు

తనువు విరహం తీర్చే అవయవమయ్యాక
స్పర్శలోని అసహ్యమేదో అర్ధమౌతుంది
దగాపడ్డ బతుకులోంచి
స్పష్టాస్పష్టాలుగా ఉండే కథలేవో
కొత్తభాష నేర్చుకుంటాయి
చీకటి పరదాలలో  పుట్టే  కథలన్నీ
 అసంఖ్యాకంగా మారి
కంచికి చేరని కథలుగా మిగిలిపోతాయి

-కడెం లక్ష్మీ ప్రశాంతి

ఎక్కడైనా ఒక్క వాక్యం ఇమడనిది ఉంటుందేమో అనుకున్నా లేనే లేదు. చాలా స్పష్టమైన గొంతుతో, తాను ఎంచుకున్న వస్తువు తాలూకా ప్రతీ మాటని అక్కడ ప్రజంట్ చేశారు ప్రశాంతి.

“దేహం వినిమయ వస్తువు అయ్యాక
నగ్నత్వాన్ని కాంక్షిస్తారే కానీ
దానివెనుక ఉండే కలల్ని కాదు
ఇక్కడంతా క్షణకాలపు ప్రేమలు
శాశ్వత  వియోగాలు.”

ఇలాంటి వాక్యాలే ఒక కవి ఇలా రాస్తాడు

” ఆమెకి తెల్సింది ఒక్కటే
మల్లెపూలని అన్నం మెతుకులుగా మార్చడం ”  చాలా లోతైన మాట అనిపిస్తుంది కదా. ఇక్కడ కవితలో కూడా కవితను మలుపు తిప్పిన వాక్యం నాకు అనిపించింది.
“దేహం వినిమయ వస్తువు అయ్యాక”. అదొక్క మాట చాలు. దేహం వినిమయ వస్తువు అవ్వడానికి గల కారణాలు, స్త్రీ మాత్రమే ఆ వినిమాయానికి పనికిరావడం. మళ్ళీ అదే స్త్రీ ని వివక్షతో చూడడం లాంటి అంశాలన్నీ ఈ ఒక్కమాటతో చర్చకి వస్తాయి.ప్రేమలన్ని క్షణ కాలపు వేనని ఏది శాస్వతంగా ఉండవు అని ఆమె చెప్పిన తీరును మనం మెచ్చుకోవాలి.

“తనువు విరహం తీర్చే అవయవమయ్యాక
స్పర్శలోని అసహ్యమేదో అర్ధమౌతుంది
దగాపడ్డ బతుకులోంచి
స్పష్టాస్పష్టాలుగా ఉండే కథలేవో
కొత్తభాష నేర్చుకుంటాయి
చీకటి పరదాలలో  పుట్టే  కథలన్నీ
అసంఖ్యాకంగా మారి
కంచికి చేరని కథలుగా మిగిలిపోతాయి”

నిజానికి ఇలాంటి వస్తువు రాసేప్పుడు కలం మనకి తెలియకుండానే అలా వెళ్లిపోతూ ఉంటుంది.అందులో తప్పులు ఒప్పులు కవి చూసుకోడు. ఈ కవిత ఎడిట్ చేసినట్టేమి నాకు అనిపించలేదు. ఒకటి రెండు వెర్షన్స్ లొనే ఇలా కుదిరిపోయింది. వస్తువును వాడుకుంటూ  రూపాన్ని చెక్కిన తీరు విస్మయం కలిగిస్తుంది.పైగా రోజువారీ వస్తువుల్ని వాడుకుంటూ కవితను నిర్మించడం వెనక ఉండే శ్రమని మనం అర్ధం చేసుకోవాలి. తనకి ఎలా తెల్సింది ఈ సబ్జెక్ట్ అంటే , చూడాల్సిన పనిలేదు. ఆకలి ఎలాంటి వారినైనా ఎలా ఏమారూస్తుందో ఈ రోజున మనం ఎవరికి చెప్పే పనిలేదు. బహుశా ఎక్కడో బాగా తనని డిస్టర్బ్ చేసిన అంశమో, వార్తో అయి ఉండాలి.అందుకే ఇలా అది కవిత రూపంలో ఒదిగిపోయింది. అవసరం తీరినాక స్పర్శ అసహ్యం అవుతుంది అని నిజాలు రాసినందుకు.చాలా మంది బయటకి చెప్పుకోలేని వెతలని ఇలా కవితా రూపంలో మనకి అందించినందుకు మనం ప్రశాంతి గారిని అభినందించాలి. ఈ కవిత సారంగ లొనే ప్రబ్లిష్ అయింది.కొత్త తరాన్ని ఇలాంటి కవితలతో ప్రపంచానికి పరిచయం చేయడం సారంగ కి కొత్తకాదు.

ప్రశాంతి గారిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని చర్ల గ్రామం.చిన్నతనం నుండి అమ్మ చందమామ,బాలమిత్ర వంటి పుస్తకాలు  చదవడం వల్ల సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది.ఆ ఇష్టమే ఆమెని కవితలు వ్రాసే దిశగా నడిపించింది.చిన్నప్పటినుండి స్త్రీల పట్ల జరిగే హింసను,వివక్షను చూస్తూ పెరగడం వల్లేమో వారి సమస్యలను ఇతివృత్తంగా తీసుకోని కవితలు వ్రాస్తుంటారు. సాహితీ ప్రయాణంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రశాంతి గారి నుంచి మరిన్ని సామాజిక అంశాల మీద కవితలు రావాలని కోరుకుంటూ. ఇంకాస్త వచనాన్ని తగ్గించి కొంత విశేషణాలు జోడించడం ద్వారా శైలి లో ఇంకాస్త  పట్టు సాధించ వచ్చు అనిపిస్తుంది. అదేం పెద్ద కష్టమైన విషయమేమి కాదు.అతి త్వరలో నే ఈమె నుంచి ఒక కవితా సంపుటి ఆశించడం తప్పు కాదు.ఆ దిశగా సాగాలని మనమూ కోరుకుందాం.

*

అనిల్ డ్యాని

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత మీద సోదరుడు విశ్లేషణ బాగుంది
    మంచి అభివ్యక్తిని పట్టుకుంటూనే, మెలకువనూ జోడించే ఈ సమీక్షతనం అతడిలోని మెరుపు.. ప్రశాంతిగారు విలువైన వస్తువుని కవిత్వం రాసారు. దేహం వినిమయ వస్తువయ్యాక….వాక్యం వాస్తవికకోణం… అభినందనలు

  • “ఆమెకి తెల్సింది ఒక్కటే
    మల్లెపూలని అన్నం మెతుకులుగా మార్చడం”
    ఈ వాక్యం రాసిన కవి పేరు ??

    • ధన్యవాదాలు సోదరా , అనిల్ డ్యాని అనే కవి రాసిన వాక్యాలు అవి

  • మంచి కవిత్వాన్ని పరిచయం చేసారు…అభినందనలు సార్

  • మంచి కవితను పరిచయం చేసారు.అన్న…
    లక్ష్మీ అక్కకు శుభాకాంక్షలు💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు