ఆమె నవ్వింది!

తాను కుక్క‌లాగా కాకుండా మ‌నిషిలాగా బతికితే త‌న మొగుడి ఆత్మ‌కి శాంతి క‌లుగుతుందా? క‌ల‌గ‌క‌పోవ‌డ‌మే త‌న‌కి కావాల్సింది.

“ఊరుకో సుమ‌తీ. మీ ఆయ‌న ఎక్క‌డికీ పోలేదు”

ఎవ‌రో ఓదారుస్తున్నారు. భ‌ర్త శ‌వం ముందు కూర్చొని బాధ‌ప‌డుతున్న సుమ‌తి చిన్న‌గా త‌లెత్తి చూసింది. ఎవ‌రో గానీ. బాగా చూసిన మొహంలాగే వుంది. బ‌హుశా త‌మ‌కి దూర‌పు బంధువులు కూడానేమో. ఎప్పుడూ ఆవిడ త‌మ ఇంటికి రావ‌డం గానీ, త‌ను వాళ్లింటికి పోవ‌డం గానీ లేదు. మ‌రిప్పుడు ప‌నిగ‌ట్టుకొని ప‌రామ‌ర్శించ‌డానికి ఎందుకు వ‌చ్చిన‌ట్టు? త‌న పేరు సుమ‌తి అని ఆవిడకెలా తెలిసింది. బ‌హుశా ఇక్క‌డికొచ్చాకే తెలిసిందేమో. చ‌నిపోయిన మ‌నిషి తాలూకూ కుటుంబ‌స‌భ్యులు త‌న‌కి బాగా ద‌గ్గ‌ర అని చెప్పుకోవ‌డంలో మ‌నుషుల‌కి ఎంత ఆనందం వుంటుందో! అలాంటి ఆనందం పొంద‌డానికే వ‌చ్చిందా? “తెలిసిన‌వాళ్లు ఎవ‌రైనా చ‌నిపోతే బావుండు, వెళ్లి ఓదార్చ‌డం ద్వారా చూసేవాళ్లంద‌రి గుర్తింపూ పొందుదాం” అని అనుకుంటూ వుంటుందా ఈవిడ‌? అదే నిజ‌మేమో. లేక‌పోతే, ఇంత ఎండ‌న ప‌డి రావాల్సిన అవ‌స‌రం ఏముంది? ఒక‌వేళ త‌న భ‌ర్త‌కీ, ఈవిడ‌కీ ఏదైనా సంబంధం వుండి వుంటుందా? బ‌తికున్న‌ప్పుడు త‌న‌ని శారీర‌కంగా సుఖ‌పెట్టినవాడు చ‌చ్చిపోయాక ఎలా వున్నాడో చూడాల‌నే కుతూహ‌లంతో వ‌చ్చిందేమో!

సుఖ‌పెట్ట‌డం అనే ప‌దం త‌న‌కి ఎందుకు త‌ట్టింది? ఒక‌వేళ శారీర‌కంగా ఆవిడ‌ని క‌ష్ట‌పెట్టాడేమో. పెద్ద‌గా సెక్సుసుఖాన్ని ఇవ్వ‌లేక‌పోయాడేమో. నిజంగా పోయాడా లేడా అని స్వ‌యంగా క‌న్‌ఫ‌ర్మ్ చేసుకుందామ‌ని వ‌చ్చిందేమో. అడిగేస్తే పోలా. “ఏవ‌మ్మా, నీకూ మా ఆయ‌న‌కీ ఏమైనా సంబంధం వుందా? ఉంటే, నువ్వు ఆయ‌న‌తో సుఖ‌ప‌డ్డావా లేదా” అని. సుమ‌తికి న‌వ్వొచ్చింది. అది చూసేవాళ్ల‌కి క‌న‌బ‌డే న‌వ్వు కాదు. గుండెలు బాదుకుంటూ ఏడ్చే బాధ క‌న్నా యింకా ఎక్కువ బాధ‌లో వున్న‌వాళ్లు నిర్వికారంగా, మౌనంగా శూన్యంలోకి చూస్తూ వుండిపోతార‌ని సుమ‌తికి ఎవరో చెప్పారు. ఏడ‌వ‌డం క‌న్నా, అస‌లు చుట్టూతా ఏం జ‌రుగుతుందో త‌న‌కి తెలియ‌డం లేద‌న్నట్టు న‌టించ‌డమే తనకి తేలిగ్గా వుంది.

అప్ప‌టికి మూడుగంట‌లైంది శ‌వం ఇంటికొచ్చి. తీసుకెళ్ల‌డానికి యింకా ఒక నాలుగైదు గంట‌లు ప‌డుతుందేమో. ద‌గ్గ‌రి బంధువులెవ‌రో రావాల‌ట‌. ఏం చేస్తారు వ‌చ్చి? పోయిన మ‌నిషి ఎంత మంచివాడో, ఎవ‌రెవ‌రికి ఎలా స‌హాయ‌ప‌డ్డాడో ఏక‌రువు పెడ‌తారు. వారం ప‌దిరోజుల కింద‌టే ఫోన్లో మాట్లాడుకున్నామ‌నీ, వ‌చ్చేవారంలో క‌ల‌వాల‌నుకున్నామ‌నీ చెపుతారు. ఒక‌వేళ త‌న మొగుడు రెండు నెల‌లాగి పోయుంటే? అప్పుడు కూడా అవే మాట‌లు చెపుతారు. సుమ‌తికి మ‌ళ్లీ న‌వ్వొచ్చింది. ఒక అర‌లో రోజువారీ వేసుకునే బ‌ట్ట‌లు, ఒక అర‌లో కాస్త ఖ‌రీదైన బ‌ట్ట‌లు, సూట్‌కేసులో ప‌ట్టుచీర‌లు దాచుకున్న‌ట్టు జ‌నాలు మాట‌ల్ని కూడా ర‌క‌ర‌కాల అర‌ల్లో స‌ర్దుకుంటారేమో. చావు మాట‌లు, పెళ్లిమాట‌లు, ఆఫీసు మాట‌లు, రోడ్డుమీద మాట‌లు, ముగ్గులో దింపే మాట‌లు. ఇప్ప‌టికొక వంద‌మంది వ‌చ్చివుంటారేమో శ‌వాన్ని చూడ్డానికి. అంద‌రూ అవే మాట‌లు. “నీ న‌డుము మీద వున్న పుట్టుమ‌చ్చ భ‌లే వుంది సుమతీ” అని ఒక్క‌ళ్లూ అన‌రే. త‌తిమ్మా విష‌యాల్లో పెద్ద‌గా తెలివితేట‌లు లేనివాళ్ల‌కి కూడా ఏ సంద‌ర్భానికి ఏ సొరుగులో దాచిన మాట‌లు బ‌య‌ట‌కి తీయాలో భ‌లే తెలిసిపోతుంది.

పుట్టుమ‌చ్చ గుర్తుకురాగానే సుమ‌తి చెయ్యి అప్ర‌య‌త్నంగా న‌డుముని త‌డిమింది. పుట్టుమ‌చ్చ వున్న భాగంలో చీర ప‌క్క‌కి తొల‌గిపోయి ఉంది. వ‌చ్చేపోయేవాళ్లంద‌రికీ స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతూనే వుంద‌న్న‌మాట‌. సుమ‌తి చీర‌ని స‌ర్దుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఎంత‌మంది కొత్త‌గా ఆ పుట్టుమ‌చ్చ‌ని గ‌మ‌నించి వుంటారు? ఇదివ‌ర‌కే గ‌మ‌నించిన వాళ్ళ క‌ళ్లు దానికోసం వెతుకుతూ వుంటాయా? మొగుడు పోయిన బాధ‌లో వుంది, కాబ‌ట్టీ ఈ ఒక్క‌సారికీ గుచ్చిగుచ్చి చూడ‌కుండా త‌మాయించుకుందాం అనుకుంటారా? పెళ్లాం పోయిన బాధ‌లో వున్న మ‌గాళ్లెవ‌రైనా అర్థ‌న‌గ్నంగా క‌న‌బ‌డితే ఆడ‌వాళ్లు ఎలా ఆలోచిస్తారు? “అబ్బా యిత‌గాడి కండ‌లు భ‌లే వున్నాయే. ఒక్క‌సారి ఆ బ‌ల‌మైన చేతుల్లో న‌లిగిపోయే అవ‌కాశం వ‌స్తేనా” అనుకోరా? త‌నైతే ఏం అనుకోనుండేది? ఎంత ఆలోచించినా ఈ ప్ర‌శ్న‌కి స‌మాధానం త‌ట్ట‌లేదు సుమ‌తికి. భ‌ర్త చ‌నిపోతే, శ‌వం ప‌క్క‌న కూల‌బ‌డి గంట‌ల త‌ర‌బ‌డి ఏడిచే ఆడ‌వాళ్ల‌ని చాలామందిని చూసింది. కానీ, భార్య చ‌నిపోతే భ‌ర్త‌లు ఏడ్చిన దృశ్యాలేవీ పెద్ద‌గా ఆమెకి గుర్తురాలేదు. ఒక‌టీ అరా వ‌చ్చినా, అవి వృద్ధ‌దంప‌తుల‌కి సంబంధించిన‌వే కావ‌డం వ‌ల్ల త‌న‌కి కామ‌వికారాలేవీ క‌ల‌గ‌లేద‌ని మాత్రం అర్థ‌మైంది.  ఏదేమైనా, ఇక్క‌డున్న మ‌గ‌వాళ్లంతా కూడా త‌న న‌డుమునీ, పుట్టుమ‌చ్చ వ‌ల్ల ఆ న‌డుముకి వ‌చ్చిన అద‌ర‌పు ఆక‌ర్ష‌ణ‌నీ చూస్తూ ఆస్వాదించే అవ‌కాశాన్ని వ‌దులుకోరేమో అనే ఆలోచ‌నే ఆమెకి న‌చ్చింది.

పైట పొర‌పాటున ఒక అంగుళం కింద‌కి జారినా, బొడ్డు క‌న‌బ‌డేట్టు చీర క‌ట్టుకున్నా త‌న భ‌ర్త‌కి ఇష్టం వుండేది కాదు. “సానిదాని లాగా ఏంటా వాల‌కం, ఇంత వ‌య‌సొచ్చినా యింకా చీర క‌ట్టుకోవ‌డం రాలేదు నీకు” అనేవాడు. నిజానికి త‌న‌ న‌డుము మీద పుట్టుమ‌చ్చ వుండ‌డం కూడా అత‌నికి ఇష్టం లేదు. ఆ పుట్టుమ‌చ్చ వ‌ల్ల అంద‌రి దృష్టీ త‌న భార్య న‌డుము మీద ప‌డ‌డం అత‌నికి చాలా క‌ష్టంగా వుండేది. శ‌వాన్ని ద‌గ్గ‌రినుండీ చూసే సాకుతో మూక్కూమొహం తెలియ‌ని ప‌రాయి మ‌గ‌వాళ్లు కూడా త‌న భార్య ఊపిరి త‌గిలేంత ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి నుంచుంటున్నార‌ని, చేయి చాపితే అందేంత దూరంలో వున్న పుట్టుమ‌చ్చ మీద వాళ్ల చూపులు చిక్కుకుపోతున్నాయ‌నీ శ‌వానికి తెలుస్తుందా? తెలియ‌దేమో. మొహం ప్ర‌శాంతంగానే వుందిగా. ముందుకు వంగి, శ‌వం చెవి ద‌గ్గ‌ర నోరు పెట్టి ర‌హ‌స్యంగా అడుగుదామనిపించిది సుమ‌తికి. కానీ, నిర్వికారంగా శూన్యంలోకి చూస్తూ వుండ‌డం అనే వ్రతానికి భంగం క‌లుగుతుందేమో, ఎందుకొచ్చిందిలే అని ఆగిపోయింది.

చ‌చ్చిపోవ‌డం వ‌ల్ల మొహంలో భావాలు ప‌లికించ‌లేక‌పోతున్నాడు కానీ, అత‌ని ఆత్మ మాత్రం అక్క‌డ‌క్క‌డే తిరుగుతూ గొణుగుతూ వుంటుంద‌ని సుమ‌తికి అనిపించింది. శ‌రీరం లేని భ‌ర్త ఆత్మ త‌న‌మీద పెత్త‌నం చేయ‌లేద‌నే ఆలోచ‌న ఆమెకి చాలా హాయిగా అనిపించింది. ఉన్న‌ట్టుండి వ‌చ్చిన ఆ హాయిలోనుండీ ఒక చిలిపి ఆలోచ‌న పుట్టింది. చీర కొంగుతో క‌ళ్లు తుడుచుకుంటున్న‌ట్లు న‌టిస్తూ, పైట‌ని కాస్త కింద‌కి జార్చింది. తాను కావాల‌నే ఆలా చేసింద‌ని చూసేవాళ్ల‌లో ఎవ‌రికైనా తెలుస్తుందా? తెలియ‌క‌పోవ‌డానికే ఎక్కువ ఛాన్సుంది. త‌ల కొంచెం కూడా క‌దిలించ‌కుండా చిన్న‌గా క‌ళ్ల‌ని తిప్పుతూ అటూయిటూ చూసింది. ఊహూ, ఎవ‌రికీ తెలిసినట్టు లేదు. పైట కింద‌కి జార‌డం గ‌మ‌నించిన ఒక‌రిద్ద‌రి క‌ళ్ల‌లో మాత్రం ఏదో మెరుపు క‌న‌బ‌డింది సుమ‌తికి. అంత‌మంది మ‌ధ్య‌లో కూడా పైట స‌ర్దుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డం ఆమెకి చాలా కొత్త‌గా వుంది.

సుమ‌తి గుండెల మీద ఆచ్ఛాద‌న త‌క్కువ‌గా వుంద‌నే స‌మాచారం ఎక్కువమంది క‌ళ్ల‌కి చేర‌గానే అప్ప‌టిదాకా స్త‌బ్దుగా వున్న వాతావ‌ర‌ణంలో క‌ద‌లిక మొద‌లైంది. సాంబ్రాణి క‌డ్డీలు మార్చాల‌నీ, ప్ర‌మిద‌లో నూనె పోయాల‌నీ, ఐస్ బాక్సులో బాడీ మ‌రీ ఎక్కువ గ‌డ్డ‌క‌ట్టిపోకుండా కాసేపు క‌రెంటు స్విచ్చి క‌ట్టేయాల‌నీ ఏవేవో కార‌ణాల‌తో ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిపోతున్నారు. శ‌వం మీద అంద‌రికీ వొకేసారి అలాంటి అక్క‌ర ఎందుకొచ్చిందో సుమ‌తి వెన‌క కూర్చున్న డ‌జ‌నుమంది ఆడంగుల‌కీ తెలుస్తూనే వుంది. మ‌గాళ్లంద‌రి ఆస‌క్తీ సుమ‌తి మీదే వుండ‌డం వాళ్ల‌లో ఒక‌ళ్లిద్ద‌రికి గిట్ట‌లేదు. సుమ‌తి పైట‌ని స‌రిచేద్దామా అనే ఆలోచ‌న కూడా వాళ్ల‌కి వ‌చ్చింది. కానీ, అలా చేయ‌డం సంప్ర‌దాయం కాదు. ఇలాంటి సందర్భాల్లో పైట జారడానికి ఎలాంటి ప్రాధాన్య‌తా లేన‌ట్లూ, ఆ విష‌యం ఎవ‌రూ గ‌మ‌నించ‌న‌ట్లూ న‌టించాల్సిందే.

“గంధ‌పుచెక్క‌లు కూడా కొన్ని పెడ‌తార‌ట‌. ఒక నాలుగైదు వేలు అద‌నంగా అవుతుంది అంటున్నారు. అలాగే కానిమ్మ‌ని చెప్పాను. నేనిచ్చేస్తాలే, త‌ర్వాత చూసుకుందాం” అంటున్నాడు ఎదురింటాయ‌న‌. ఏదో ప‌నున్న‌ట్లు ఎప్పుడూ వ‌రండాలో తిరుగుతూ త‌న‌నే గ‌మ‌నిస్తూ వుండేవాడు అత‌ను. అవ‌కాశం దొరికితే మాట‌లు క‌ల‌పాల‌నే ఉత్సాహం కూడా వుండేద‌నుకుంటా. కానీ వాళ్లావిడ ప‌ర‌మ‌గ‌య్యాళి. అత‌ని వుద్దేశం ఏమాత్రం క‌నిపెట్టినా బ‌త‌క‌నివ్వ‌దు. స‌మ‌యానికి భార్య పుట్టింటికి పోవ‌డం, అదే స‌మ‌యంలో త‌న భ‌ర్త చ‌నిపోవ‌డం ఎదురింటాయ‌న‌కి క‌లిసొచ్చింది. ఎందుకు గంధ‌పుచెక్క‌లు, డ‌బ్బులు దండ‌గ అందామ‌నుకుంది సుమ‌తి. కానీ, తానున్న ప‌రిస్థితిలో అలాంటి స‌మాధానం చెప్ప‌కూడ‌ద‌ని సుమ‌తికి తెలుసు. ఇంట్లో వున్న‌ప్పుడు పౌడ‌ర్ కూడా రాసుకోనిచ్చేవాడు కాదు త‌న భ‌ర్త‌. “ఎవ‌డొస్తాన‌న్నాడేంటీ, సింగారించుకుంటన్నావ్‌?” అనేవాడు. బ‌య‌టికెళ్లేట‌ప్పుడు కూడా మ‌రీ ఎక్కువ కాకుండా తూకంగా రాసుకోవాలి. లేదంటే మ‌ళ్లీ సానిబాగోతం మొద‌లెట్టేవాడు. ఐదువేలు పెడితే ఎన్ని పౌడ‌ర్ డ‌బ్బాలొస్తాయ్‌? ఎదురింటాయ‌న‌కి తెలిసుంటుందేమో, అడిగితేనో?

“అచ్చం నిద్ర‌పోత‌న్న‌ట్టే వున్నాడు. అస‌లు చావుక‌ళే లేదు”… మాట‌ల‌మూట‌లో నుండీ ఎవ‌రో యింకో వాక్యం బ‌య‌టికి తీశారు. చ‌చ్చిపోయిన‌వాడు నిద్ర‌పోతున్న‌ట్టు కాకుండా ఇంకెలా వుంటాడు? ఈ మాట‌ అన్నాయ‌న వేరే యింకేదైనా శ‌వం చూడ‌డానికి పోయిన‌ప్పుడు “అచ్చం మెల‌కువ‌తో వున్న‌ట్టే వున్నాడు. చావుక‌ళ బాగా క‌న‌బ‌డుతోంది” అని వుంటాడా ఎప్పుడైనా? ప్రాణం పోయాక మొహం నిద్ర‌పోతున్న‌ట్టు వుంటే బ‌తికున్న‌ప్పుడు చేసిన మంచీచెడూ మారిపోతాయా? వంటింట్లో ప‌నుల‌న్నీ కానిచ్చుకొని, స్నానం చేసి బెడ్రూమ్ లోకి వ‌చ్చేస‌రికి గుర్రుపెట్టి నిద్ర‌పోతున్న మొగుణ్ని చూసి త‌ను ఎన్నిసార్లు ఉసూరుమందో వీళ్లెవ‌రికైనా తెలుసా? కానీ, అత‌నికి ఉత్సాహం వుండి, త‌న‌కి నిద్ర ముంచుకొస్తున్నప్పుడు, అత‌ను ఉసూరుమ‌నాల్సిన అవ‌స‌రం ఎందుకు రాలేదో వీళ్ల‌లో ఎవ‌రైనా చెపుతారా? ఎందుకు మాట్లాడ‌తారు శ‌వాల ద‌గ్గ‌ర  ఇలాంటి సోది మాట‌లు? ఎలాగూ మొగుడు లేడుగా, నాలుగు మంచి మాట‌లు చెపితే, త‌ర్వాత్త‌ర్వాత ఏమైనా అవ‌కాశం యిస్తుందేమో అనుకుంటారా? అదేదో తిన్న‌గా అడ‌గొచ్చుగా. “పాపం షాక్ లోకి వెళ్లిపోతున్న‌ట్లుంది. కాళ్లూ చేతులూ రుద్దండి”.. శ‌వం నిద‌ర‌పోయిన‌ట్లు వుండ‌డం చూసి ముచ్చ‌ట‌ప‌డిపోయిన శాల్తీ స‌ల‌హా యిచ్చింది. ఆడ‌వాళ్లెవ్వ‌రూ ముందుకు రాక‌పోతే తానే స్వ‌యంగా పూనుకునేలా వున్నాడు. చూడడానికి బాగానే వున్నాడు,పాపం రుద్ద‌నిస్తే పోతుందేమో. మ‌రి మూడుగంట‌ల నుండీ యిక్క‌డే ప‌డిగాపులు ప‌డత‌న్న వాళ్ల సంగ‌తేంటి? సుమ‌తికి మ‌ళ్లీ న‌వ్వొచ్చింది.

“సుబ్బ‌మ్మ‌త్త‌య్య రాలేదా?” ఎవ‌రో అడుగుతున్నారు. “లేదు, కూతురికి పురుడు పోయ‌డానికెళ్లిందిగా. ఎలాగైనా వీలు చూసుకొని ఆ రోజుకి వ‌చ్చేస్తానంది” పైట స‌ర్దాల‌ని త‌హ‌త‌హ‌లాడిన ఆవిడ బ‌దులిస్తోంది. ఆ రోజు అంటే ఏ రోజు? త‌న‌కి బొట్టూ గాజులూ తీసేయాల్సిన రోజు అయ్యుంటుంది. అందుకే గామాలూ చివ‌రికొచ్చేస‌రికి గొంతు గుస‌గుస‌లోకి దిగిపోయింది. ఆ కార్య‌క్ర‌మం న‌డిపించ‌డంలో సుబ్బ‌మ్మ‌త్తకి చాలా పేరుంది. శాస్త్ర‌ప్ర‌కారం అన్నీ చ‌క్క‌గా చేయిస్తుందిట‌. శాస్త్రానికి విరుద్ధంగా చేస్తే పోయినోడు తిరిగొచ్చేస్తాడ‌ని భ‌య‌మేమో?!

“తాడు తెగాక గానీ మొగుడి విలువేంటో తెలిసిరాదు ఎద‌వ ముండ‌ల‌కి” త‌న భ‌ర్త త‌ర‌చూ అనే మాట గుర్తొచ్చింది సుమ‌తికి. “అయ్యో అదేవిటండీ అంత మాటంటారు” అని తాళిబొట్టు క‌ళ్ల‌క‌ద్దుకోవాల‌ని ఆశించేవాడేమో. త‌న మౌనం అత‌న్ని రెచ్చ‌గొడుతుంద‌ని తెలిసినా మాట్లాడ‌కుండా వుండిపోయేది. “ఉలుకూ ప‌లుకూ లేదు. నేను గానీ నిజంగా ఛ‌స్తే నీ బ‌తుకు కుక్క‌ల‌క‌న్నా అధ్వాన్నం అయిపోద్ది” అనేవాడు. తాను కుక్క‌లాగా కాకుండా మ‌నిషిలాగా బతికితే త‌న మొగుడి ఆత్మ‌కి శాంతి క‌లుగుతుందా? క‌ల‌గ‌క‌పోవ‌డ‌మే త‌న‌కి కావాల్సింది. ఏమేం చేస్తే ఆత్మ‌ల‌కి శాంతి లేకుండా పోతుందో పంతులుగారిని అడిగి తెలుసుకోవాలి. అస‌లు సుబ్బ‌మ్మ‌త్త రాకముందే మెడ‌లో తాళి తెంపి అవ‌త‌ల పారేయాలి. ఆ ప‌నేదో యిప్పుడే చేస్తే? మొగుడు పోయాడ‌న్న బాధ త‌ట్టుకోలేక సుమ‌తికి పిచ్చెక్కింది అని చెప్పుకుంటారేమో అంద‌రూ. కొంత‌మంది ఆడ‌వాళ్ల‌క‌యినా నిజం ఏంటో అర్థం కాక‌పోదు. కానీ, వాళ్లు మాత్రం ఎందుకు బ‌య‌ట‌కి చెపుతారు!

పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంద‌ని చెప్పి అంతా క‌లిసి మ‌ళ్లీ త‌న‌కి పెళ్లి చేయాల‌ని చూస్తారేమో. అమ్మో!  మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం అన్న‌ది పెద్ద శిక్షా లేక అయిష్టంగా బొట్టూ గాజులూ పూలూ తీసేయ‌డం పెద్ద శిక్షా? ఈ రెండూ కాకుండా త‌న‌ముందున్న మార్గాలేంటా అని ఆలోచించడం మొద‌లెట్టిన సుమ‌తి నిర్వికారంగా శూన్యంలోకి చూడాల‌నే సంగ‌తి తాత్కాలికంగా మ‌ర్చిపోయింది. ఒక ర‌క‌మైన ఆహ్లాదం ఆమె ముఖంపై ప‌రుచుకుంటుండ‌గా క‌ళ్లు క్ష‌ణ‌కాలం పాటు మూత‌ప‌డ్డాయి. ఆ మార్పుని ముందుగా గ‌మ‌నించిన వొక కుర్రాడు ద‌గ్గ‌ర‌కొచ్చి సుమ‌తి మీద చేయ్యేస్తూ, వెన‌క కూర్చున్న ఆడ‌వాళ్ల‌తో అన్నాడు “చూస్తారేం లోప‌లికి తీసుకెళ‌దాం ప‌ట్టండి. డెరిలియం అంటారు దీన్ని. వ‌దిలేస్తే కోమాలోకి వెళ్లిపోతుంది”. వీధి చివ‌ర ఎర్ర‌బిల్డింగులో  మెడిక‌ల్ స్టూడెంటే అయ్యుంటాడు. అత‌ని మాటలు వింటూనే వొక్క‌పెట్టున వొక ప‌దిమంది ప‌రిగెత్తుకొచ్చి సుమ‌తిని ప‌ట్టుకున్నారు. వాళ్ల చేతులు ఎక్క‌డెక్క‌డో త‌డుముతున్నాయి. సుమ‌తిని బెడ్రూమ్ లోకి త‌ర‌లించ‌డం అనే కార్య‌క్ర‌మాన్ని ఆడ‌వాళ్ల స‌హ‌కారంతో నిర్వ‌హించాల‌నుకున్న కుర్ర‌డాక్ట‌రు నిరాశ‌కి లోన‌య్యాడు.  ఈసారి సుమ‌తి పైకే న‌వ్వేసింది.

*

శ్రీధర్ బొల్లేపల్లి

31 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Such a wonderful story..it’s has been quite sometime since I came across a honest and beautiful writing like this. Kudos and all the very best to Sridhar Bollepalli, looking forward to many and many stories of you.

    • Thank you so much mam. This comment is very very special to me as it was the first compliment since i started writing for Saranga.

  • మొదటికధా…!!!!!????

    నువ్ రాస్తావ్ బాస్….రాస్తావంతే..

    కొత్తగా చెప్పాలనే తపన కనపడుతోంది.
    స్త్రీ శరీరం చుట్టూ సాగుతోన్న అనేకానేక చర్చోపచర్చల్లో..ఈ కోణమూ ఒకటి.

    స్త్రీ అంటే ఒక‌ శారీరక అవసరపు వస్తువు గా భావిస్తోన్న, పైకి స్త్రీ వాదులుగా కనపడుతోన్న (నాతోసహా) అనేక మందిలో కూడా కనపడకుండా ఏదో ఒకరూపంలో పురుషాధిక్యత ఉంటూనే ఉంది..అది మాటో, ప్రవర్తనో,వాదనో, మరోటో మరోటో..నరనరానా జీర్ణించుకునిపోయిఉంది కనుక స్త్రీ అంటే సెక్స్ కి‌ ఉపకరించే ఒక జీవమున్న బొమ్మగా భావిస్తూన్న సందర్భంలో చావులాంటి సందర్భంలో కూడా సెక్స్ ఆలోచనలూ శారీరక స్పృహా మన్నూ మశానం ఏంటీ? అని దీర్ఘంగా నిట్టూర్చి నిరసించే అవకాశం‌లేదనే నా అభిప్రాయం.

    మొన్నామధ్య ఎవరో సెలబ్రిటీ చనిపోతే ఆయనభార్యను ఇదేంటీ జీన్సూ టీషర్టూ వేసుకుని వచ్చిందీవిడ. భర్తపోయాడనే దుఖ్ఖ మే లేకుండా!!?? అని మెటికలు విరిచిన సమాజంలో ..ఇలాటి కథ రావటం అబ్బురమేమీ కాదు..

    నువ్ కొనసాగుబా…

    ఎఫ్ బీ లో కొనసాగినట్టే కథల్లో కూడా నీ ఫ్లో కొనసాగలని మనస్పూర్తిగా ఆసిస్తూ…

    రాధాలోల…

    • మిత్ర‌మా,
      నేను రాసిన ప్ర‌తి అక్ష‌రం మీదా నీ ప్ర‌భావం కూడా వుంది. క‌థ బావున్నా లేక‌పోయినా మ‌నిద్ద‌రం తీసుకోవాల్సిందే ఆ క్రెడిట్‌. టీచ‌ర్ ట్రెయినింగ్ చ‌దువుతూ కాలేజీలో నేర్చుకున్న‌దానిక‌న్నా నీతో క‌లిసి తిరుగుతూ, నీతో మాట్లాడుతూ నేర్చుకుందే ఎక్కువ‌. ఇవాళ రాసిలో నిన్ను మించిపోయాను క‌దాని, నువ్వు ప‌రిచ‌యం చేసిన ప్ర‌పంచాన్నీ, అది నాపై చూపిన సానుకూల ప్ర‌భావాన్నీ ఎప్ప‌టికీ మార్చిపోను. నా ఆశీస్సులు నాకు ఎప్ప‌టికీ వుంటాయ‌ని ఆశిస్తాను.. కాదు వుండి తీరాల్సిందే అని ప్రేమ‌గా శాసిస్తాను.

    • నా ప్ర‌తి ర‌చ‌న‌నీ అభినందించి, ప్రోత్స‌హించిన అతి కొద్దిమంది మిత్రుల్లో మీరూ వొక‌రు. ఈ క‌థ మీకు న‌చ్చినందుకు చాలా సంతోషంగా వుంది.

  • బాగుంది శ్రీధర్ గారూ .మీలో ఈ కోణం ఉంది ,దీన్ని పైకి తీస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా .ఈ సన్నివేశం నేపథ్యంలో కథలు చదివా ,కానీ మళ్ళీ మీరు ఓ కొత్తదనం తీసుకుని వచ్చారు అభినందనలు.

    • థేంక్యూ వెరీ మ‌చ్ అండీ. విజ‌య‌వాడ వ‌చ్చారంట‌గా. ద‌గ్గ‌రుండి బెత్తం ప‌ట్టుకుని రాయిద్దురు గానీ నాచేత‌. మీ అభిమానానికి కృత‌జ్ఞ‌త‌లు.

  • పెళ్ళిలో గుర్తింపు ఆరాటాలు తెలుసు. చావులో కూడానా! మీ ఫేస్ బుక్ పోస్ట్ లో ఆమె just mee సృజన అని సౌండ్ చేశారు. సో, ఇంక చర్చ లేదు.

    • మీర‌న్న‌ట్టు పెళ్లిలో ఆరాటాలు మామూలే. Unfortunately, చావులో ఆరాటాలు అంత‌కంటే మామూలు. ఒక మ‌గ‌వాడిగా స్త్రీ మ‌న‌సుని పూర్తిగా చ‌ద‌వ‌డం అన్న‌ది నాకెప్ప‌టికీ సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని నాకు తెలుసు. కానీ, జెండ‌ర్ ప‌క్క‌న‌పెడితే, మ‌నిషికి స‌హ‌జంగా వుండే బ‌ల‌హీన‌త‌లు, ప‌రిమితుల విష‌యంలో మ‌నం బ‌హిరంగంగా మాట్లాడుకోగ‌లిగింది చాలా త‌క్కువ అనుకుంటాను. మాట్లాడుకోక‌పోవ‌డం వ‌ల్ల జ‌రిగే మంచీ వుంటుంది, న‌ష్ట‌మూ వుంటుంది. మీలాంటి మంచి క‌థా ర‌చ‌యిత్రి (అండ్ మంచి స్నేహితురాలు కూడా క‌దా) అభిప్రాయం నాకెప్పుడూ అమూల్య‌మే. ఇక‌ముందు కూడా నా క‌థ‌లు చ‌దివి మీ అభిప్రాయం చెపుతార‌ని ఆశిస్తాను.

  • కథలో….
    ఆమె నడుముమీద పుట్టుమచ్చ ఉండడం హాస్యాస్పదంగా ఉంది. అలా ఉండే అవకాశమే లేదు. పోనీ మీరెవరికైనా ఉండడం చూశారా? ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మీరేదో నోటికొచ్చిన పేరు చెప్పి, కనపడిన రౌడిరంగమ్మని చూపించి, పరిశీలించుకునే బాధ్యత నిజనిర్ధారణ కమిటీ మీదనే వేసేంత గడసరేనని తెలుస్తూనే ఉంది. వాస్తవానికి దూరంగా వున్న వివరాలతో, ఇలాంటి అభూత కల్పనలతో కథరాయడం రచయిత చీప్ టేస్ట్ కి నిదర్శనం. ఎందుకంటే భూమ్మీద నడుమ్మీద పుట్టుమచ్చ గల ఆడవారు ఉండడం దుర్లభం.😂

    జోక్స్ పక్కన పెడితే, ఇలాంటి కథలు గతంలో తెలుగు రచయితలు రాసే సాహసం చేసి ఉండకపోవచ్చు. భారతీయ భాషలలోనే రాకపోయి ఉండొచ్చు అనిపిస్తుంది. బాగా పేరున్న భారతీయ మూలాలున్న అమెరికా రచయిత రాసిన కథకి ఇది చక్కటి అనువాదం అంటే సులభంగా నమ్మేయచ్చు. మరి భారతీయ రచయితలు ఎందుకు రాయరు అంటే రచయిత పాఠకులను హర్ట్ చేయకూడదనే ప్రిన్సిపుల్స్ మనకి ఎక్కువ. కొందరు ఉద్యమ స్వభావం గల రచయితలు పక్కన పెడితే.

    ఈ కోణంలో చూసినప్పుడు జీవితమంతా వేపుకుతిని చనిపోయిన భర్త పక్కనే ఉండగా భార్యల స్వగతాలు కథలుగా రావడం నేను చదినట్టు గుర్తుంది. ఐతే ఆ సందర్భంలో కామపు దృష్టికోణాలు ఉండవా అంటే ఉండొచ్చు. ఐతే అవి తళుక్కున మెరిసి మాయం అవుతాయి. కాన్షియస్ బ్రెయిన్ ఎలర్ట్ చేస్తుంది ఇది సందర్భం కాదని. కానీ ఈ కథలో అలా లేదు. కథంతా జరిగిన సన్నివేశానికి భిన్నంగా
    కథంతా ఆమె కామ ప్రకోపమైన ఆలోచనలతోనే నడిచింది.

    భర్త పీడించడం, సాధించడం అనేవే ఆమె ఇంత విశృంఖలంగా ఆలోచించడానికి కారణాలు అనుకున్నా… ఆమె బతికినన్నాళ్లు ఎందుకు కాపురం చేయాల్సివచ్చింది? వదిలేసి కండలవీరుడినో, పుట్టుమచ్చ ఇష్టపడిన వారినో, తనకి నచ్చిన మరో వ్యక్తితోనో వెళ్లిపోవలసింది కదా. (కథలో పిల్లలు ఉన్న ఛాయలు కూడా లేవు, పిల్లలకోసం సర్దుకుని జీవించింది అనడానికి)

    పైట జార్చడం, పుట్టుమచ్చ కనపడేలా చేయడం, పురుషుడి కండలకే విలువనిచ్చి కౌగిలించుకోవాలని అనుకోవడం జరగవని కాదుగాని, ఆ దశ మహా ఐతే ముప్పైలోపే ముగిసిపోతుంది. నలభైలు ఐనప్పటికీ అలాగే ఉంటే చనిపోయిన మొగుడేకాదు ఏ మొగుడైనా అడగకుండా ఉంటాడా? (ఎదు‌రింటి కుర్రాడిని అదాటుగా చూడడంవేరు. అతడు ఎప్పుడు బయటకి వస్తాడా అని ఎదురు చూడడంవేరు, అలా చూసిచూసి సైగలు చేస్తే కలవరపడడం వేరు. ఆ సైగలకి నవ్వులతో, ఆపై సైగలతో ప్రతిస్పందించడం వేరు. ఆ తర్వాత ఒకరోజు ఆ కుర్రాడు నేరుగా భర్తలేనప్పుడు వచ్చి తలుపు తడతాడు) ఇలాంటి తతంగాలు ఏ దశలో చూసినా మొగుడనేవాడు ఏదోవొకటి అంటాడు. భర్త విషయాలు తెలిస్తే భార్యయినా అంటుంది.

    ఆమెతో భర్తమీద ఆరోపణలు చేయించడం వల్ల ఈ కథ సరసమైన కథలలోకి చేరకుండా పోయింది అనిపిస్తుంది. ఈమాట ఎందుకంటే భర్త వేధింపులకు గురయిన భార్యకు లభించాల్సిన సింపతీ కూడా ఆమెకి మిగలలేదు. (ఆమె కూడా కోరుకోలేదు అనిపిస్తుంది కథలో. ఎందుకంటే ఆమెకి ఎలాంటి దుఃఖమూ లేదు కథలో)

    సింపతీ సంగతి పక్కన పెట్టినా… తనని సుమతీ అని పిలిచిన ఆవిడతో తన భర్తకి ఎఫైర్ ఊహించడం కాథారంభంలో చక్కటి థాట్ ప్రాసెస్ అనిపించింది. తర్వాత అదంతా కథని వదిలేసింది. కథంతా చదివాక పాఠకులు సుమతికి కొన్ని ఇతర వివాహేతర సంబంధాలు ఉండే అవకాశాలు లేవా అని ఆలోచిస్తే ఉండే ఉండొచ్చు అనే జవాబు వస్తుంది. ఇందుకు కారణం కథంతా నడిచిన ఆమె థాట్ ప్రాసెస్.

    భార్యాభర్తల మధ్య బంధంగాని, మృత్యువు ఒక మనిషిని జ్ఞాపకాలలో తప్ప ఇకపై మిగలకుండా చేసిన సందర్భంగానీ అంతగా ఆషామాషీగా తీసిపడేయాల్సినవి కాదు. అంటే పెళ్లి, చావు రెండూను.

    కథ చదువుతున్నంత సేపు ఒక సైకలాజికల్ స్టడీ అలా నడుస్తూపోయింది. ఈ కథని ఫ్రెంచ్ పీపుల్ బాగా ఆదరిస్తారేమో అనిపించింది.

    మొదటి కథకి అభినందనలు.💐

    • అన్నా,
      సారంగ‌లో క‌థ ప‌బ్లిష్ అవ‌డం ఎంత సంతోష‌మో, ఆ క‌థ చ‌దివి నువ్వు యింత వివ‌రంగా నీ అభిప్రాయం చెప్ప‌డం అంత సంతోషం నాకు. క‌థ‌లు రాసిన‌న్నాళ్లూ నువ్వు చెప్పిన ప్ర‌తి మాటా గుర్తుంచుకుంటాను.

  • Amazing story..loved this new style of narration..
    Keep going Sridhar bollepalli.. expecting some more stories like this.. all the best…

  • మంచి కథ. ఎవరి వైయక్తిక అనుభవాలు ఎలా వుంటాయో ఎదుటివారికి అర్థం కావాలని లేదు. కథకి వుండే పరిధి దృష్ట్యా సుమతి జీవితంలోని అన్ని పార్శ్వాలనీ స్పృశించడం కుదరకపోయి వుండొచ్చు. కానీ కొన్ని ప్రత్యేక‌ పరిస్థితుల్లో ఒక స్త్రీ ఇలా ఆలోచించడం అసహజం అనో, అనూహ్యం అనో నేను అనుకోను. మీ నుండీ మరిన్ని మంచి కథలు ఆశిస్తున్నా.

    • నా మ‌న‌సుని చదివేశారు వ‌సుధ‌గారూ మీరు. థేంక్యూ సో మ‌చ్‌.

  • శ్రీధర్ గారూ…పదునాలుగు నుండి అరవై దాకా ఆడవాళ్ల శరీరానికి చావు పెళ్లి అనే సందర్భానుసారాలు వర్తించవని నిర్లజ్జగా చెప్పేసారు… ఎవరు ఒప్పుకున్నా ఒప్పకపోయినా నిజం మారదు… ఆడవాళ్ళ అంతర్ముఖంలో మగవారి ఉనికి అంతకుమించి గొప్పగా ముందుకు సాగడం కష్టమే…ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో గానీ నిజం మారదు కదా… మీ ప్రయోగానికి అభినందనలు

    • క‌థ మీకు న‌చ్చినందుకు సంతోషం. Without mincing words, ఏం రాయాల‌నుకున్నానో అది రాసేయాల‌నేదే నా ప్ర‌య‌త్నం. నా ఆలోచ‌న‌లు పంచుకునేందుకు యింత మంచి వేదిక మీద నాకు అవ‌కాశం యిచ్చిన అఫ్స‌ర్ గారికి ధ‌న్య‌వాదాలు.

  • కథ మొత్తం కామ వికారాలే కనబడుతున్నాయి. సాంప్రదాయ నిరసనలో మహిళకోణం బాగుంది. ఇంకా బలంగా రాసే అవకాశం ఉంది

    • ఏ భాగ‌మైతే బావుంద‌ని మీరు చెప్పారో అంత‌వ‌ర‌కూ ధ‌న్య‌వాదాలు. బాగా రాసే అవ‌కాశం వుంద‌న్న మీ అభిప్రాయంతో నేనూ ఏకీభ‌విస్తాను. మ‌రింత బాగా రాయాల‌న్న‌దే నా ప్ర‌య‌త్నం. థేంక్యూ.

  • గొప్ప కధ. సుమతి ఆలోచలన్నీ చాలా బగచెప్పారు రచయిత. స్త్రీ భావాలను కొత్తరకంగా బాగా చెప్పారు.
    కధలో మునుమతలు ఆవిడ భావాన్ని ఖచ్చితంగా తెలుపుతాయి .”తాను కుక్క‌లాగా కాకుండా మ‌నిషిలాగా బతికితే త‌న మొగుడి ఆత్మ‌కి శాంతి క‌లుగుతుందా? క‌ల‌గ‌క‌పోవ‌డ‌మే త‌న‌కి కావాల్సింది.”

  • Wonderful.. ఒక వైవిధ్యమైన కథ చదివిన ఫీలింగ్ కలిగింది 👌

  • ఇంతకీ ఈ కథలో నాయకి సుమతి ఏరకమైన స్త్రీ వాదానికి ప్రతినిధి? పురుషాధిక్యత వల్ల చెడిపోయిన ఏ మగాడి తీరునైతే ఆమె చీదరించుకుందో అచ్చంగా ఆమె తీరు కుాడా చీదరించుకునేవిధంగానే వుంది. శవం దగ్గర ఆమె నటన, పరాచికాలు, పైట జార వేసి తను ప్రదర్శించిన కామ ప్రకోపం… ఆమె భర్త శవం చుట్టూ చేరిన కొంతమంది మగవాళ్లకు.. పాఠకుల్లో కొంతమందికి సంతోషం కలిగించి ఉండవచ్చు. కానీ ఆహ్వానించదగ్గ పరిణామం కాదది. పురుషాహంకారంతో మగాడు గడ్డి తిన్నాడని ఆ అహంకారాన్ని కాలదన్నుతుా స్త్రీ కూడా గడ్డి తినాలా?

    పురుషాధిక్యతను ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ఆ క్రమంలో స్త్రీ ఆధిక్యతను కొనితెచ్చుకోవడం కాదు మనం కోరుకోవాల్సింది. ఆధిక్యత అనేది పురుషుడి వద్ద వున్నా స్త్రీ వద్ద ఉన్నా దానిని పెరికివేయవలసిందే. అప్పుడే స్త్రీ పురుషుల మధ్య సామరస్యపుార్వక సంబంధాలు నెలకొంటాయి. అటువంటి సంబంధాలు ఏర్పరిచే దిశగా మనం ఆలోచనలను సాగించాలి.

    • క‌థ గురించి మీ అభిప్రాయం చెప్పినందుకు కృత‌జ్ఞ‌త‌లు. అస‌లు ఈ కథ స్త్రీ వాద కోణంలో రాయ‌బ‌డింది కానే కాదు సార్‌. ఆడ‌వాళ్లంతా ఈ ర‌కంగా ఆలోచించ‌డం మంచిద‌నో, లేదా ఆల్రెడీ అలా ఆలోచిస్తున్నార‌నో చెప్ప‌డం నా వుద్దేశం కానే కాదు. వెయ్యిమందిలో వొక‌ళ్లు… ల‌క్ష‌మందిలో వొక‌ళ్లు.. లేదా కోటి, ప‌దికోట్లలో వొక్క‌రైనా యిలా ఆలోచిస్తారా అంటే.. తెలియ‌దు అనేదే నా స‌మాధానం. అస‌లు ఇందులో వున్న ప్ర‌ధానపాత్ర ప్ర‌వ‌ర్త‌న‌ని స‌మ‌ర్థించ‌డ‌మో, వ్య‌తిరేకించ‌డ‌మో చేయ‌లేదు నేను. ఈ పాత్ర‌తో ఎవ‌రు ఎంత‌వ‌ర‌కూ ఐడెంటిఫై అవుతారో కూడా నాకు తెలియ‌దు. నా ఆలోచ‌న‌ల్లో పుట్టిన వొక fictitious character మాత్ర‌మే అది. ఇందులో భ‌ర్త కానీ, లేదా భార్య కానీ గ‌డ్డి తినే ప్ర‌వ‌ర్త‌న‌ని క‌న‌బ‌రిచారా? అవ‌త‌లివారి ప్ర‌వ‌ర్త‌ని దానికి ఎంత‌వ‌ర‌కూ కార‌ణ‌మైంది అన్న‌ది చ‌ర్చ కానే కాదిక్క‌డ‌. This is neither generalization nor glorification of any section of the society.

      • మీరు కాదంటున్నారు. సరే,
        కానీ మీ కథ తన కడుపులోని విషయాన్ని దాచుకోకుండా వుండలేకపోతోంది. మీ కథా నాయకి సుమతి ఈ కథ కోణమేమిటో వెల్లడిస్తోంది. భర్త పై ఆమె పట్టిన పంతం ఈ కథలోని చర్చనీయాంశాన్ని తెలియపరుస్తోంది. గమనించగలరు.

  • కొందరు స్త్రీ పురుష మనోవికారాలకు చావు, పెళ్లి సందర్భాలు కూడా అతీతం కాదు అని తెలియచెప్పారు శ్రీధర్ గారు. ఈ కధ చదువుతుంటే కాశీభట్ల వేణుగోపాల్ గారి శైలీ ప్రవాహం గుర్తొచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు