దుల్హన్

పాసులు, బ్యాండ్‌మేళంతో ఆ వీధంతా అదిరిపోయింది. అందంగా అలంకరించి ఉన్న హోండా కారు నేరుగా వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. పెళ్లికళ ఉట్టి పడుతోందా ఇంట్లో. పైనుండి కింద దాకా కరెంటు దీపాలు వేలాడుతున్నాయి. ఇంటి ముందు షామియానా ఉంది. బిర్యానీ వాసన వీధి చివరి దాకా తెలుస్తోంది. అర్ధరాత్రి దాటినా మరుసటి రోజు వలీమా ఉన్నందువల్ల, ఇంట్లో చాలామంది మెలకువగానే ఉన్నారు. కారు ఆగగానే ఇంట్లో నుండి కొంతమంది ఆడవాళ్లు వచ్చి దిష్టి పళ్లాలతో సిద్ధంగా ఉన్నారు. 

కారులోనుండి పెళ్లికూతురు, పెళ్లికొడుకు దిగారు. వీధిలో చాలామంది ఉత్సాహంగా ఈ హడావిడంతా చూస్తున్నారు. కోలాహలంగా ఉంది అక్కడి వాతావరణం. కొత్త జంటకి ఒకావిడ దిష్టి తీసింది. పెళ్లి బట్టల్లో షాహీద్, అస్రా ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. 

“అమ్మాయికి పైన గది చూపించు” అని షాహీద్ వాళ్లమ్మ చెప్పింది. అస్రాని తీసుకుని ఇంట్లో మూలగా ఉన్న మెట్ల మీదుగా పైకి వెళ్లాడు షాహీద్.  

అతిథులు ఒక్కొక్కరే బయటకు వెళ్లడం మొదలుపెట్టారు. మెల్లిగా నిశ్శబ్దం ఆవరించింది. 

***

“బచావ్! ముఝే యహా సే బాహర్ నికాలో” షాహీద్ అరుపులతో తెల్లవారుజామున ఆ పెళ్లి ఇల్లు దద్దరిల్లింది.

షాహీద్ కేకలు విన్న కొంతమంది పైనున్న అంతస్తుకు వెళ్లడానికి ఉన్న చిన్న గ్రిల్ తలుపు తెరిచారు. అవతలి వైపు నుండి షాహీద్ పరిగెత్తుకుంటూ వచ్చి హాల్లో దీవాన్ మీద కూలబడి వణికిపోతున్నాడు. అతని కొత్త షేర్వాణీ అంతా చెమటతో తడిసిపోయి ఉంది. 

షాహీద్ అక్క జబీన్ ఒక గ్లాసులో నీళ్లు తెచ్చిచ్చి, “క్యా హువా, రే! ఎందుకట్లా దెయ్యాన్ని చూసినట్టు బిత్తరపోతున్నావ్?” అని అడిగింది. 

షాహీద్ కళ్లల్లో భయం పోలేదు సరికదా, ఇంకా ఎక్కువైంది. పైనున్న గది వైపు చూస్తూ “వహా.. ఉపర్..అస్రా.. అస్రా..” అంటూ గుటకలు మింగాడు. అప్పటిదాకా ఎవరికీ పైన గదిలో ఉన్న కొత్త పెళ్లికూతురు అస్రా గుర్తుకు రాలేదు. 

విచిత్రంగా షాహీద్ వైపు చూసి “క్యా హువా అస్రా కో?” అని అడిగింది షాహీద్ అమ్మ జుబేదా. 

జబీన్ తెచ్చిచ్చిన మంచినీళ్లు గటగట తాగేశాడు షాహీద్, “అమ్మీ! వో బచ్చి పాగల్ దిఖ్రీ. విచిత్రంగా చూస్తోంది. జుట్టంతా వదిలేసుకొని ఏదేదో మాట్లాడుతోంది. బహుత్ డర్ లగ్రా ముఝే. నేను లోపలికి వెళ్లను” భయంగా అన్నాడు. 

వెంటనే జబీన్ నవ్వేసి “అరే! పాగల్ వో నహీ, తూ హై. కొత్త కదా! భయపడి ఉంటుంది. నువ్వే ఏదో చేసి ఉంటావ్. మొదటి రాత్రి కదా, కొంచెం నిదానంగా ఉండాల్సింది” అంది. 

“అరే భాజీ, తూ నహీ సమజ్ రహీ! నేను అసలేమీ అనలేదు. కనీసం వేలు కూడా ముట్టుకోలేదు. గదిలోకి వెళ్లి పక్కన కూచుని పలకరించాను. అంతే! ఒక్కసారిగా నన్ను కోపంగా చూసి గొంతంతా మార్చేసి ఏదేదో మాట్లాడుతోంది. పరేషాన్ హోగయా మై దేఖ్ కె!” 

షాహీద్ మాటలు విచిత్రంగా అనిపించి, జబీన్, జుబేదా, ఇంకో ముగ్గురు ఆడవాళ్లు మెట్ల మీదుగా పైగదికి వెళ్లారు. గదిలో అడుగు పెట్టీపెట్టగానే అందరూ ఉలిక్కిపడ్డారు. 

పూలతో అలంకరించి ఉన్న గది మొత్తం చెల్లాచెదురుగా చేసి ఉంది. కొత్త డ్రెస్సింగ్ టేబుల్ పగిలిపోయి ఉంది. పక్కనే టేబుల్ మీద పెట్టి ఉంచిన స్వీట్లు, పళ్లు దిక్కుకొకటి పడి ఉన్నాయి. అస్రా నడి మంచం మీద జుట్టంతా విరబోసుకుని, బాసింపట్టు వేసుకుని కూచుంది. పెళ్లిబట్టలు అక్కడక్కడా చిరిగిపోయి ఉన్నాయి. చక్కటి బంగారు రంగు మొహం నిండా ఎవరో రుద్దినట్టు కాటుక పులిమేసి ఉంది. అది చూసి అందరూ నివ్వెరపోయారు. వీళ్లు గదిలోకి రావడం గమనించిన అస్రా విరబోసుకుని ఉన్న జుట్టు రెండు వైపులా మొహం పక్కకు తోసి, పెద్దగా అరుస్తూ చేతికి అందిన వస్తువు తీసుకుని వాళ్ల వైపు విసిరింది. 

చాలా మామూలుగా పైకి వచ్చిన ఆడవాళ్లంతా హడలిపోయి కేకలు వేసుకుంటూ కిందకి ఉరుకుల మీద వచ్చేశారు. జుబేదా మూర్ఛపోయినంత పని చేసింది. ఇంట్లోవాళ్లంతా తమకు తోచింది తలా ఒకటి చెప్పారు. 

“దుల్హన్ ఖూబ్ సూరత్ హై నా! నజర్ లగి హోగీ. మళ్లా దిష్టి తీస్తే సరిపోతుంది.”

“జం జం నీళ్లు తాగించండి.”

“ముల్సాబ్‌ని పిలిపించండి. ఆయనే ఏదో ఒక సలహా ఇస్తారు.”

“ముందు వాళ్లింటికి ఫోన్ చేసి చెప్పండి. ఇలాంటి పిచ్చిపిల్లని కట్టబెట్టారు మనకి. ఎంత మోసం?”

ఒక్కసారిగా పెళ్లి మాహోల్ మొత్తం మారిపోయింది. 

“మరి, రాత్రికి వలీమా ఉంది కదా. దాని సంగతేంటి? ఏర్పాట్లన్నీ చేసేశాం. ఇప్పుడు అందరికీ ఏమని సమాధానం చెప్పాలి?” విసుగ్గా అన్నాడు షాహీద్ వాళ్ల నాన్న ముఖ్తార్. 

షాహీద్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. మొబైల్ తీసి అస్రా వాళ్ల నాన్న ఇజాజ్‌కి ఫోన్ చేశాడు. అవతల ఆయన ఫోన్ తీయగానే విషయం చెప్పాడు. ఉరుకులు పరుగుల మీద వచ్చారు అస్రా వాళ్ల అమ్మ, నాన్న, అన్న, వదిన. 

వాళ్లు రాగానే ఇంట్లో మనుషులంతా చుట్టూ చేరి వీళ్లని నానా మాటలు అనడం మొదలుపెట్టారు. అస్రా తల్లిదండ్రులు తల దించుకుని అన్ని మాటలూ పడ్డారు. ఆ తరువాత వాళ్లు పైకి వెళ్లి అస్రాని గదిలోకి వెళ్లారు. అస్రా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. తనని అలా చూసేసరికి వాళ్లు నోట మాట రాకుండా ఉండిపోయారు. 

అస్రా వాళ్లమ్మ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. అస్రా అత్తింటి వాళ్లే దీనంతటికీ కారణం అంది. “నిన్నటి దాకా బంగారంలా ఉన్న పిల్ల ఒక్క రాత్రికే ఇలా అయిపోయిందంటే ఏమనాలి? ఇక్కడే ఏదో చేతబడి జరిగింది. నాశనం చేసేశారు మా పిల్లని.” అంది. 

“ఓయమ్మో! ఎన్నేసి మాటలు అంటూ ఉందో చూడండి. పిచ్చిపిల్లకు మేకప్ వేసి మాకు చూపించి, మాయమాటలు చెప్పి పిల్లోడికి కట్టబెట్టి ఇప్పుడు ఏమి ఎరగనట్టు ఎలా ఏడుస్తున్నారో చూడండి. మా అదృష్టం బాగుంది కాబట్టి పెళ్లైన వెంటనే ఈ బండారం బయటపడింది. లేకపోతే మా పిల్లోడిని చంపేసి ఉండేది ఈ రాక్షసి” షాహీద్ వాళ్లమ్మ అస్సలు తగ్గకుండా తిరిగి తిట్టింది. 

“ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి మా బిడ్డకి. మీరు మా ఇంటికొచ్చి బతిమాలితేనే కదా ఒప్పుకున్నాం. ఉన్నఫలంగా పెళ్లి చేయాలంటే, చక్కగా చదివే పిల్లని చదువు మాన్పించేసి నెల రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా పెళ్లి చేశాం. మీరు అడిగినంత కట్నం ఇచ్చాం. ఇప్పుడిట్లా మమ్మల్ని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. పెళ్లి చేసి అమ్మాయిని మీ చేతుల్లో పెట్టడం వరకే మా పని. ఆ తరువాత మంచైనా, చెడైనా మీదే బాధ్యత” అస్రా వాళ్ల నాన్న నిష్టూరాలు పోయాడు. 

ఈ వాదోపవాదాలు అవుతూ ఉంటే, అస్రా వాళ్ల అన్న ఇర్షాద్ పరుగున మసీదుకి పోయి మౌలానాని తీసుకొచ్చాడు. అస్రా వాళ్ల అమ్మ, వదిన, అత్త మౌలానాని అస్రా ఉన్న గదికి తీసుకెళ్లారు. 

దగ్గరగా మూసి ఉన్న గది తలుపులు తోయగానే, ఒక చెంబు వచ్చి మౌలానా తలకి గట్టిగా తగిలింది. అస్రా మళ్లీ గట్టిగా కేకలు వేస్తూ ఇంకొన్ని వస్తువులు విసిరేయడం మొదలుపెట్టింది. వాటిని తప్పించుకుంటూ మౌలానా ఆమె దగ్గరకి వెళ్లి అస్రాని తేరిపార చూశాడు. అస్రా మౌలానా మొహంలోకి చూస్తూ గట్టిగా అరిచింది. ఒక్క ఉదుటున వెనక్కి దూకాడు మౌలానా. బిగ్గరగా ఖురాన్ సూరాలు చదువుతూ ఆ గదిలో నుండి బయటకు వచ్చేసాడు.  

మౌలానా కిందకి వెళ్లి, “ఆ అమ్మాయిని సైతాన్ పట్టుకుంది. ఈ పిల్లతోపాటు ఈ ఇంట్లోకి కూడా సైతాన్ వచ్చేసింది. అందుకే కోపంతో ఫరిష్తాలు ఇక్కడి నుండి వెళ్లిపోయారు. దర్గాకు తీస్కెళ్లి పెద్ద ముల్లాకి చూపించాల్సిందే. ఇది నా మాట వినేటట్టు లేదు. ఎంత త్వరగా దర్గాకు తీసుకుని వెళ్తే అంత మంచిది. వలీమా ఇప్పటికి క్యాన్సల్ చేసుకోండి” అని చెప్పి త్వరత్వరగా వెళ్లిపోయాడు.  

ఆయన మాటలు వినగానే ఇంట్లో వాళ్ల ఏడుపులు ఇంకా ఎక్కువయ్యాయి. జుబేదా వెంటనే అస్రాని వాళ్ల పుట్టింటికి తీసుకెళ్లి పోవాలని బెదిరించింది. అస్రా వాళ్లమ్మ మాత్రం “అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు అస్రా మీ ఇంటి కోడలు. నలుగురిలో మా పరువు పోతుంది. అసలే ఆడపిల్ల. ఈ విషయం బయటకి పొక్కితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటారు. మీరిలా మాట్లాడ్డం న్యాయం కాదు. ఒకసారి దర్గాకి తీసుకువెళ్తే అంతా సర్దుకుంటుంది” దాదాపు బతిమాలినట్టే మాట్లాడింది. 

కొద్దిగా భోజనం ఒక పళ్లెంలో పెట్టుకుని అస్రా వాళ్లమ్మ జాగ్రత్తగా వెళ్లి  పైన అస్రా గది బయట పెట్టి పరుగున వచ్చేసింది. పైన అస్రా ఉన్న గదికి వెళ్లే మెట్ల దగ్గరే, గ్రిల్ తలుపుకు తాళం వేశారు. 

– – – 

ఆ రోజు సాయంకాలం అస్రాని తీసుకుని, వాళ్ల అమ్మ, నాన్న, అన్న, వదిన, షాహిద్ ఊరవతలున్న పీర్‌సాహెబ్ దర్గాకి వెళ్లారు. అస్రాని బట్టలు మార్పించడానికి చేతకాలేదు వాళ్లెవరికీ. అలాగే పెళ్లి బట్టల్లో, చింపిరి జుట్టుతో బలవంతంగా కారులో కూచోబెట్టి వెనక అస్రా నాన్న, అన్న కదలకుండా ఆమెని పట్టుకుని కూచున్నారు. దారంతా ఉండుండి భయంకరమైన గొంతుతో కేకలు వేస్తూనే ఉంది అస్రా. 

దర్గా దగ్గర చాలామందిని కాళ్లకి సంకెళ్లు వేసి కట్టేసి ఉంచారు. కొంతమంది శూన్యంలోకి చూస్తూ కూచుని ఉంటే, మరికొంతమంది గట్టిగా కేకలు వేస్తున్నారు. తమ వాళ్లను సైతాను నుండి పెద్ద ముల్లా విడిపిస్తారన్న నమ్మకంతో ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్లే. కారు దిగి ఆ వాతావరణం చూడగానే ఎందుకో కొద్దిసేపు అస్రా నిశ్శబ్దంగా ఉండిపోయింది. గుంపులుగా మనుషులు ఉన్నా, ఎందుకో భయంగా అనిపించింది అస్రాకి. 

పెద్ద ముల్లా వచ్చి అస్రాని చూడగానే ఆమె మళ్లీ అరవడం మొదలుపెట్టింది. అస్రా చుట్టూ రెండుసార్లు ఏవో మంత్రాలు చదువుతూ తిరిగాడు ముల్లా. తరువాత వెళ్లి తన అనుచరుడి చెవిలో ఏదో చెప్పాడు. అనుచరుడు బుద్ధిగా తలూపి లోపలికి వెళ్లి కాసేపట్లో ఒక చిన్న సీసాలో నీళ్లలాంటివి తీసుకొచ్చి ఇచ్చాడు. 

ముల్లా ఆ నీళ్ల సీసాని అస్రా వాళ్ల నాన్న చేతికిచ్చి “ఇవి పవిత్రమైన మంత్రించిన నీళ్లు. రోజూ మూడు పూటలా అమ్మాయితో తాగించండి. నేనొక మందు ఇస్తాను. తెల్లవారుఝామునే అది తినిపించండి. ఇప్పుడు నేను ఈ పిల్ల ఒంట్లో ఉన్న సైతాన్‌ని తరిమేస్తాను. నేను చెప్పినవి చేస్తే మళ్లీ ఆ సైతాను తన దరిదాపుల్లోకి కూడా రావడానికి భయపడుతుంది. ఆ తరువాత ఒక మూడు నెలల పాటు నెలకి రెండుసార్లు అమ్మాయిని తీసుకుని రావాలి. దీనంతటికీ లక్ష రూపాయలు ఖర్చవుతుంది” అని చెప్పాడు.  

 ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారందరూ. నిలబడి ఉన్న అస్రాను బలవంతంగా కూచోబెట్టాడు ముల్లా. విసిరికొట్టి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి చెరొక రెక్క వచ్చి కదలకుండా పట్టుకున్నారు అతని అనుచరులు.

మళ్లీ మంత్రాలు చదువుతూ ఆమె చుట్టూ తిరిగాడు ముల్లా. ఒకసారి తిరిగిన తరువాత వెనక నిలబడి గట్టిగా కాలితో అస్రా నడుము మీద తన్నాడు. ఒక్క క్షణం ఆ ప్రదేశమంతా అస్రా ఆక్రందనతో అదిరిపోయింది. ఆ కేక ముల్లాని అస్సలు కదల్చలేదు. ఇంకో నాలుగుసార్లు అలాగే తిరిగి మొత్తం ఐదుసార్లు తన్నాడు. నాలుగోసారికే అస్రా స్పృహ కోల్పోయి జీవం లేనట్టు పడిపోయింది. 

ఇంత జరుగుతున్నా, అస్రా కుటుంబ సభ్యులు కానీ, షాహీద్ కానీ అడ్డు పడలేదు, ఏంటని ప్రశ్నించలేదు. 

– – – 

స్పృహలో లేని అస్రాని వాళ్ల అమ్మానాన్నలు పుట్టింటికే తీసుకొచ్చారు. మెలకువ వచ్చి చూసేసరికి, పక్కనే అస్రా వదిన వజిహా ఉంది. తనని పట్టుకుని అస్రా భోరుమని ఏడ్చింది. వజిహా నిశ్శబ్దంగా ఆ అమ్మాయిని ఓదార్చింది. అస్రా ఏదో అనబోయేంతలో వాళ్లమ్మ భోజనం తీసుకొచ్చింది. ఆమెని చూడగానే ఏమీ మాట్లాడకుండా కూచుంది అస్రా. వజిహా ఆమె చేతి నుండి పళ్లెం తీసుకోగానే ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. 

వజిహా ముద్దలు కలిపి పెడుతుంటే అస్రా నెమ్మదిగా తింది. కాసేపటికి కొద్దిగా ఓపిక వచ్చిందేమో “చాలా భయమేస్తుంది భాభీ” అంది.

వజిహా వెంటనే “నిన్నటి ముల్లా దెబ్బలకి నువ్వు ప్రాణాలతో ఉంటావనుకోలేదు. అమ్మీ, బాబా అంతదాకా వెళ్లనిస్తారని నేను ఊహించలేదు. ఇదంతా మన చేయి దాటిపోయేలోపు, ఇక్కడితో ఇదంతా ఆపేస్తే మంచిదనిపిస్తోంది. ఎన్నో కలలు కంటాం, ఏదేదో అవ్వాలనుకుంటాం. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇది జీవితం ఎందుకవుతుంది? నన్నే చూడు. చక్కగా జోనల్ లెవెల్‌లో వాలీబాల్ ఆడేదాన్ని. ఈ ఆటలు గీటలు ఆడపిల్లలకు ఎందుకని చెప్పి స్టేట్ టీంకి సెలెక్ట్ అయిన నన్ను తీసుకొచ్చి మీ అన్నకు కట్టబెట్టారు. దేశం కోసం ఆడాలని ఎన్ని అనుకున్నాను? అవన్నీ పక్కన పెట్టి మా అమ్మీ వాళ్లు చెప్పినట్టు పెళ్లి చేసుకోలేదా నేను? ఆడపిల్లలకు సర్దుకుపోవడం మామూలే. కదిలిస్తే ఆడవాళ్లందరివీ ఇలాంటి కథలే ఉంటాయి. ఇంక చాలు. ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని షాహిద్ వాళ్లకు కబురు పెడదాం” అని చెప్పి చెయ్యి కడుక్కోవడానికి లేచి బయటకు పోయింది. 

తిరిగివచ్చి చూసేసరికి అంతవరకు ఏడ్చిన అస్రా రూపం మాయమై ఆ మోహంలో సంకల్పం, మొండితనం చేరాయి.

“నహీ భాభీ! ఇంతా చేసింది, ఆ ముల్లా తన్నులు భరించింది ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కాదు. ఆరు నూరైనా ఈ పెళ్లి ఇక్కడితో తెగిపోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో నేను నా సివిల్స్ కోచింగ్‌కి వెళ్లాలి. ఇన్నేళ్ల నా కలని ఇప్పుడు పక్కన పడేసి మామూలుగా ఉండలేను. నా బాధని ఒక్కరూ అర్థం చేసుకోలేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావని సంతోషపడ్డాను. ఇప్పుడు నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేనెవరికి చెప్పుకోను భాభీ? మన ప్లాన్‌లో ఏ మార్పు లేదు. ఇప్పటిదాకా నాకు ధైర్యాన్నిచ్చి సపోర్ట్ చేసావు. ఇంకొక్క 48 గంటలుపోతే, మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఆ తరువాత నీక్కూడా ఈ తలనొప్పి ఉండదు. ప్లీజ్ భాభీ! కాదనకు” అని తడిగా ఉన్న వజిహా రెండు చేతులు పట్టుకుంది అస్రా. 

వజిహా గట్టిగా నిట్టూర్చి “సరే, అస్రా! గుల్బర్గాలో అయితే నీకు తప్పక నయమవుతుందని, అక్కడైతే మా అమ్మ వాళ్లింట్లోనే ఉండొచ్చని అమ్మీ బాబాకి చెప్పి నేనే ఎలాగోలా ఒప్పిస్తాను. అవసరమైతే మా నాన్నతో కూడా ఒక మాట చెప్పేస్తాను. ఇప్పటికే షాహీద్ వాళ్లతో బాబా మాట్లాడి ఒక వారం రోజుల్లో నిన్ను తిరిగి పంపడానికి ఏర్పాట్లు చేస్తామని, అప్పటి దాకా వలీమా వాయిదా వేయమని చెప్పి ఉంచారు. నీ యాక్టింగ్ దెబ్బకి హడలి పోయి ఉన్నారందరూ. మనం ముందే అనుకున్నట్టు రేపు సాయంత్రానికే మన ప్రయాణం. ఎల్లుండి పొద్దున్నే నీ సివిల్స్ కోచింగ్‌కి ఢిల్లీ ప్రయాణం. నేను నా ఫ్రెండ్స్ సాయంతో అన్ని ఏర్పాట్లు చేస్తాను” అంది. 

వెంటనే వజిహాని గట్టిగా వాటేసుకుంది అస్రా. “థాంక్య సోమచ్ భాభీ! నువ్వు లేకపోతే నా జీవితం మొత్తం నరకంగా మారిపోయేది. ఈ పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అమ్మీకి బాబాకి చెప్పి ఎంతలా మొత్తుకున్నా వినలేదు. నా పెళ్లి చేసి పడేయడం తప్ప, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, నాకు అబ్బాయి నచ్చాడా లేదా.. ఇవేవీ పట్టించుకోలేదు. నన్ను ఇంత మాత్రం చదివించింది కూడా మంచి సంబంధం రావడానికంట. రేపు పిల్లలకు ఇంట్లోనే చదువు చెప్పుకోవడానికంట. దేశాలను ఏలుతున్నారు ఆడవాళ్లు అవతల. వీళ్లు మాత్రం కనీసం మన బతుకుల్ని, చదువుల్ని కూడా మనల్ని ఏలుకోనివ్వరు. ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ షాహీద్ కూడా ఎంత మొత్తుకున్నా వినలేదు. కనీసం అతడు పెళ్లి తరువాత నన్ను చదువుకోవడానికి ప్రోత్సహించేలా ఉండి ఉంటే, మనకీ తిప్పలు తప్పేవి. నన్ను పెళ్లి చేసుకుంటే అదేదో గొప్పతనంలా ఫీలవుతున్నాడు తప్ప, నా ఇష్టాయిష్టాలతో, అంగీకారంతో అతనికి పని లేదు. ఆ ముల్లా నన్నలా తంతుంటే కనీసం నోరు మెదపలేదు. అలాంటివాడిని నేను జీవితాంతం నమ్మి ఉండలేను.”

“నిజమే కానీ, రేపు నువ్వెళ్లిపోయావని తెలిశాక ఇంట్లో వాళ్లేమైపోతారో అని భయంగా ఉంది.”

“నేనేమైపోతానో అని వాళ్లు ఆలోచించలేదు కదా భాభీ! అమ్మీ బాబా కానీ, అన్నయ్య కానీ ఆ దుర్మార్గుడు నన్ను అలా తంతుంటే అడ్డుపడలేకపోయారు. ఒకవేళ నాకేమైనా అయ్యుంటే? దేవుడి పేరో, దెయ్యం పేరో చెప్పి తుడిచేసుకునేవాళ్లే తప్ప వాళ్లు చేసింది ఎంత ఘోరమో ఒప్పుకునేవాళ్లా? చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. చేతికి దొరికిన పుస్తకాలు చదివి, లైబ్రరీలు తిరిగి, అన్నయ్య పుస్తకాలు దొంగచాటుగా తీసుకుని రాత్రిళ్లు మేలుకుని చదివి ఇంతదాకా వచ్చాను” అంది అస్రా. గదిలో గోడకు వేలాడుతున్న మెడల్స్, ఇనుప బీరువా మీదున్న ట్రోఫీలు చూపిస్తూ “వీటికి ఈ ఇంట్లో విలువ లేదు. వాళ్ల దృష్టిలో పెళ్లి చేసుకుంటే తప్ప నేను ప్రైమ్ మినిష్టర్ అయినా, వాళ్లకు నేను పిచ్చిదానిలాగే కనిపిస్తాను. కలెక్టర్‌ని అవ్వాలన్న నా కలను వీళ్ల కోసం వదులుకోను. నిజంగా వీళ్లు నన్ను ప్రేమిస్తే, ఇప్పటికైనా నా పట్టుదలను అర్థం చేసుకుంటారు. లేదంటే, వాళ్లిష్టం.”

– – – 

మరుసటి రోజు పొద్దున్నే అస్రా లేచేసరికి, షాహీద్‌కి ఈ పెళ్లి ఇష్టం లేదని, తలాఖ్ కావాలంటున్నాడని వాళ్ల పెళ్లి జరిపిన మౌలానాతో కబురు పంపారు అత్తింటి వాళ్లు. ఎంత సులువుగా పెళ్లి కావాలని సాధించుకుంటారో, అంతే సులువుగా వదిలించుకోవడం కూడా కుదురుతుంది మగవాళ్లకి. తలాఖ్ మాట వినగానే అస్రా తల్లి గట్టిగా ఏడుస్తూ, షాహీద్ కుటుంబాన్ని శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. 

రెండ్రోజుల క్రితం, షాహీద్ కుటుంబమే చచ్చేదాకా తన కుటుంబమని, వాళ్లు చెప్పినట్లు నడుచుకుని పుట్టింటికి, వాళ్ల పెంపకానికి పేరు తేవాలని, అస్రాకు నూరిపోసిన వాళ్లమ్మ ఇప్పుడు వాళ్లని తిడుతూ ఉంది. మనుషులు, వాళ్ల అభిప్రాయాలూ, ప్రవర్తనలు మారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదేమో?

సాయంత్రం వజిహాతోపాటు బయల్దేరింది అస్రా. సాగనంపుతున్నప్పుడు అస్రా తల్లితండ్రుల మొహంలో తను వెళ్తున్నందుకు బెంగ కంటే, తగలబడిపోతున్న వాళ్ల పరువు కాపాడుకోవడమే వాళ్లకు ముఖ్యం అన్నట్టుగా ఉన్నారు. ఈ మూడు రోజుల్లో అస్రా తల్లి గానీ, తండ్రి గానీ అస్రా పక్కన కూచుని మాట్లాడింది లేదు. తనకు ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించింది లేదు. ఇదంతా చూస్తుంటే అస్రా పట్టుదల ఇంకా పెరిగింది. తనకంటూ సొంతంగా పేరు సంపాదించుకునే దాకా మళ్లీ ఈ ఇంటి గడప తొక్కకూడదని మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది. 

బయటకొచ్చేసరికి అస్రా వాళ్ల దూరపు చుట్టం సాజిద్ ఆటోతో రెడీగా ఉన్నాడు. అది ఎక్కి రైల్వే స్టేషన్‌కి బయల్దేరారు. ఆటోలో ఉన్నంతసేపూ ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.

ఆటో దిగి స్టేషన్‌లోకి వెళ్లాక అక్కడ వజిహా ఫ్రెండ్ వీళ్లిద్దరికీ ఎదురొచ్చింది. “ఇక్కడి నుండి హైదరాబాద్ దాకా నీకు తోడుగా నా ఫ్రెండ్ దివ్య వస్తుంది. అక్కడి నుండి నువ్వు క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకి వెళ్లు” అని చెప్పి వజిహా అస్రా సర్టిఫికెట్లు అన్నీ ఉన్న ఒక కవర్, కొంత డబ్బు ఇచ్చింది. అటు ఇటు చూసి, మొహానికున్న హిజాబ్ పక్కకు తీసి చెవిలో ఉన్న దుద్దులు తీసి ఇచ్చింది. ఇబ్బందిగానే అవన్నీ తీసుకుంది అస్రా.

“ఇప్పుడు నా దారి నేను చూసుకుని ఢిల్లీ వెళ్లిపోతాను, కానీ నీ పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉంది భాభీ. ఇదంతా మనం కలిసి ప్లాన్ చేశామని వాళ్లకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?” 

వజిహా నవ్వి “పిచ్చిదానా! ఎనిమిదేళ్ల క్రితం నేను చేయలేని పనిని ఇప్పుడు నువ్వు చేస్తున్నావ్. ముందు ఇక్కడి నుండి జాగ్రత్తగా బయటపడు చాలు. నేను మల్లా ఏ సైతాన్ కట్టు కథో చెప్పి, నువ్వు నన్ను కొట్టేసి పారిపోయావని చెప్తాను. కొద్దిగా నాక్కూడా యాక్టింగ్ చేసే అవకాశం రానీ” అని అస్రా భుజం తట్టింది. 

ప్లాట్‌ఫాం మీదకి ట్రైన్ వచ్చి ఆగింది. హడావిడిగా దివ్య, అస్రా ట్రైన్ ఎక్కేశారు. ఎక్కువసేపు ఆగకుండానే ట్రైన్ కదిలింది. కిటికీలో నుండి అస్రాకి వజిహా చెయ్యి ఊపుతూ కనిపించింది. 

ఇప్పుడు ఆమె ప్రయాణం ఎక్కడికో, అనుకున్నది సాధిస్తుందో లేదో అన్న విషయం పక్కన పెడితే, ఇష్టం లేని పెళ్లి నుండి తప్పించుకుని, తల్లిదండ్రులను, సమాజాన్ని ఎదిరించి ఒక కొత్త భవిష్యత్తులోకి అస్రా ప్రయాణం మొదలైంది. ట్రైన్ బయటే నిలబడి ఈ సాహసం చేయడానికి అస్రాకు తోడుగా నిలిచిన వజిహా, తిరిగి అదే పాత జీవితంలోకి వెళ్లిపోతోంది.  

కనుమరుగయ్యే దాకా అలా ఇద్దరూ చేతులూపుతూనే ఉన్నారు. ఆ క్షణం వాళ్లిద్దరూ ఒకరి కళ్లకి ఒకరు ఫరిష్తాల్లాగే కనిపించారు.

*

ఇప్పుడు ఆ భయం లేదు

* హాయ్ మాధురి. మీ గురించి చెప్పండి.

హాయ్! మాది కడప. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. టెన్త్ క్లాస్ దాకా అక్కడ చదివి, ఆ తర్వాత గుంటూరులో ఇంటర్ పూర్తి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఆక్యుపంక్చర్ థెరపీ కోర్సు చేశాను‌. కొన్ని కారణాల వల్ల ఆ ప్రొఫెషన్‌లోకి వెళ్లకుండా హెచ్‌ఆర్‌గా కెరీర్ మొదలు పెట్టాను. ప్రస్తుతం ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్ హెడ్‌గా పనిచేస్తున్నాను.

* సాహిత్యంపై ఆసక్తి ఎలా కలిగింది?

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. అందుకు కారణం మా అమ్మానాన్న. ఏరోజూ నన్ను ఆపలేదు. బాగా ఎంకరేజ్ చేశారు. చందమామ, బాలమిత్ర, వండర్ వరల్డ్ లాంటివి ప్రతినెలా మా ఇంటికి వచ్చేవి. మా స్కూల్లో లైబ్రరీ ఉండేది. అందులోని పుస్తకాలన్నీ చదివాను. ఆ తర్వాత కడప టౌన్‌లో ఉన్న సి.పి.బ్రౌన్ లైబ్రరీలో పుస్తకాలు చదివాను. మా నాన్న స్నేహితుడి దగ్గర చాలా పుస్తకాలు ఉండేవి. ఖాళీ టైంలో ఆ పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని చదివేదాన్ని.

* పుస్తకాలే ప్రపంచం అన్నమాట! మరి చదువు, ఆటలు?

అవీ ఉండేవి. పరీక్షల్లో మార్కులు బాగానే వచ్చేవి. ఇక ఆటలంటే నాకు తెలిసింది మ్యాగజైన్స్‌లో వచ్చే ‘పదవినోదం’, ‘పదచదరంగం’ పూర్తి చేయడం. వాటిని అస్సలు వదిలేదాన్ని కాదు.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

చిన్నప్పుడు చాలా కవితలు రాసేదాన్ని. వాటికోసం ఒక బుక్ ఉండేది. కొన్ని కథలు కూడా రాశాను. కానీ ఎక్కడా ప్రచురించలేదు. ఆ తర్వాత నా బ్లాగులో కొన్ని యాత్రా కథనాలు, పుస్తక సమీక్షలు రాశాను. 2020 లాక్‌డౌన్‌ టైంలో ‘లాక్‌డౌన్’ పేరుతో ఒక కథ రాసి, సారంగ వెబ్ పత్రికకి పంపాను. అది Marital Rape నేపథ్యంలో సాగే కథ. అఫ్సర్ గారు  వెంటనే రిప్లై ఇచ్చి ‘కథ బాగుంది. ప్రచురిస్తానన్నారు’. 2020 ఏప్రిల్ 15న నా తొలి కథ ప్రచురితమైంది. ఇప్పటికి ఏడు కథలు రాశాను.

* ‘ఉనికి’ కథల సంపుటి తీసుకొచ్చారు కదా! దాని నేపథ్యం చెప్పండి.

‘లాక్‌డౌన్’ తర్వాత ‘విరిగిన కొమ్మలు’, ‘కలల ఫొటోఫ్రేమ్’, ‘వలపు స్వాతంత్ర్యం’, ‘చీకటి గుళికలు’ లాంటి కథలు రాశాను. 2021 హైదరాబాద్ బుక్ ఫెయిర్ టైంలో ఛాయా పబ్లికేషన్స్ నిర్వాహకులు మోహన్‌బాబు వాటిని ఒక పుస్తకంగా తెస్తానని అన్నారు. త్వరలో నా కథా సంపుటి రాబోతోంది అని ఫేస్‌బుక్‌లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏడాదిపాటు దానికోసం వర్క్ జరిగింది. 2023 జనవరిలో పుస్తకం వచ్చింది.

* మీ కథల పుస్తకం టైటిల్ ప్రత్యేకంగా ఉంది. కథ పేరు కాకుండా, అలా వేరే టైటిల్ పెట్టడానికి కారణమేంటి?

నేను రాసిన కథలన్నీ స్త్రీల సమస్యల చుట్టూ అల్లుకున్నవి. ప్రతి కథలో Women Identity కనిపిస్తుంది. అలాంటి కథలున్న పుస్తకానికి ఏం టైటిల్ పెట్టాలా అని చాలా ఆలోచించాను. ‘ఉనికి’ అనే పదం సరిగ్గా సరిపోతుందని అనిపించింది. స్త్రీల ఉనికిని తెలిపే కథలున్న పుస్తకం అది.

* మూడేళ్లుగా కథలు రాస్తున్నారు. మీ కథల్లో అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పు ఏమిటి?

నేను ఎక్కడా కథారచన నేర్చుకోలేదు. నాకు రాయాలని అనిపించిన పద్ధతిలో రాసేదాన్ని. ప్రస్తుతం కథని Detailedగా, Structuredగా రాయగలుగుతున్నాను. మొదట్లో కథా వస్తువు విషయంలో కొంత భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. ‘ఇది రాయొచ్చా అని భయపడే కథలే మనం రాయాలి’ అనే కొటేషన్ ఎక్కడో చదివాను‌. నా కథలు ఎవరైనా చదివితే ఏమనుకుంటారోనన్న ఆలోచనని దాటి, ‘ఏమనుకున్నా ఫర్వాలేదు. నాకు నచ్చినట్టు నేను రాస్తాను’ అనే‌ ధైర్యం తెచ్చుకున్నాను.

* మీకు నచ్చిన రచయితలు?

చిన్నప్పుడు యండమూరి, మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలు చదివేదాన్ని. యండమూరి కంటే మల్లాది రచనలు నాకు బాగా నచ్చుతాయి. ఆయన రాసిన ‘అందమైన జీవితం’ నాకు చాలా ఇష్టమైన నవల. అయాన్ రాండ్, సిడ్నీ షెల్డన్ రచనల్ని కూడా ఇష్టపడతాను.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

కొన్ని కథాంశాలు ఆలోచించి పెట్టుకున్నాను. కొంత రాశాను. వాటిని పూర్తి చేయాలి.

*

మాధురి పాలాజి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Beautiful writing andi let them fly.. ఆస్ర లాంటి situationలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. గిప్పుడు గిప్పుడే అమ్మాయిల ఇష్టాలను గౌరవిస్తన్నారు. వాళ్ళను ఇంకా బాగా అర్థం చేస్కోవాలని ఆసిస్తూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు