నాలుగు దృశ్యాలుగా అల్లిన కథ

ర్ధరాత్రి  దాటాక మంచి నిద్రలో వున్న నాకు మెలకువ వచ్చింది. పక్క మీద అటూ ఇటూ దొర్లాను.  పెద్ద పెంకుటింటిలో , ఒకవేపు మూసేసిన విశాలమైన సావడిలో చుట్టాలు – కొందరు మంచాల మీద , మరి కొందరు, కింద, జంబుఖానాలు పరిచిన చాపల మీద-నిండా ముసుగు తన్ని ఆదమరిచి నిద్రపోతున్నారు. ఎండాకాలం రాత్రి చల్లగా గాలి వీస్తున్న వేళ. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా  సాధారణంగా ఒక్క రోజు మించి ఉండను; చీకట యితే చాలు చెవి దగ్గర గుయ్యిమనే దోమలు, రాత్రింబవళ్ళు ప్రతిధ్వనించే మగ్గాల చప్పుడు , నూలు, స్టార్చి, కేష్మీటు రంగుల వాసన…నాకు(మొదట్లో) పడేవి కావు.  అయితే, వరుసగా మూడు ఫంక్షన్లు రావడం మూలాన తప్పనిసరై రెండు రోజులు మించి నేనక్కడ ఉండాల్సి వచ్చిన సందర్భమది .

అది సిరిసిల్ల లో మా అత్తగారిల్లు. ఊరినిండా నాకు బంధువులే కాదు, ఆత్మీయ సాహితీ మిత్రులూ వున్నారు. ఉండేది తక్కువ సమయమైనా ఒక షెడ్యూలు పెట్టుకుని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. రెండో రోజు , ఎలాగోలా  కాస్తా కునుకు తీద్దామనుకున్ననా ఆశను ఆవిరి చేస్తూ  సావడి మూల నుంచి ఒకావిడ సన్నగా రోదిస్తూ నా నిద్ర ఎగరగొట్టేసింది.

ఇంటి నిండా చుట్టాల సందోహం, సందడి. పెళ్లి , వ్రతం , ఆ తర్వాత దావత్ … అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా  వుంటే ఆమె మాత్రం  నిరలంకారంగా  దీనవదనంతో మౌనంగా వుండటం, చుట్టాలు ఆమెతో ఓదార్పుగా మాట్లాడటం , అప్పుడప్పుడు సున్నితంగా కసురుకోవడం…నా దృష్టి ఆమె వేపు పోయినప్పుడల్లా ఆమె ఒక ఎనిగ్మా లా కనిపించింది.  వీలు చేసుకుని  ఆమె గురించిన విషయాలు తెలుసుకున్నాను.

ఆర్థికంగా బాగా చితికి పోయిన కుటుంబం లోంచి వచ్చిన ఆమె పెనిమిటి జీవిక కోసం రకరకాల వృత్తులు ప్రయత్నిస్తూ ఐదేళ్ళ క్రితం దేశాంతరం వెళ్లి పత్తా లేకుండా మాయమయ్యాడు. ఆమె బీడీ కార్మికురాలిగా స్థిరపడి  ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ వచ్చింది. ఆమెకు ఊరినిండా బంధువులున్నారు – అత్తమామలు , అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు , తోడికోడళ్ళు …ఇంకా చాలా మంది. వాళ్ళంతా మొదట్లో ఆమెకు పెదవి సానుభూతి చూపెట్టారే కాని ఆమె ఒంటరి జీవన పోరాటంలో  కాస్తంతయినా చేయూత నిచ్చేందుకు ముందుకు రాలేదు. ‘ఆమె పడ్డ అవస్థలకు , భరించిన అవమానాలకయితే  వేరేవాళ్ళు ఉరి పోసుకు చచ్చే వాళ్ళే , ఆమె కాబట్టి బండరాయిలా నిలబడి పిల్లల్ని పెద్ద జేసి ఒక దారికి తీసుకు రాగల్గుతున్నది’-అని కొందరు  నాకు చెప్పారు.

సుభిక్షంలో దుర్భిక్షమంటే ఏమిటో సిరిసిల్ల లో కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. గుంట మగ్గాల స్థానంలో మరమగ్గాల ప్రవేశం, చేనేత సహకార సంఘాల నిర్వహణలో పెట్టుబడిదారి సంబంధాలు వేళ్ళూనుకోవడం , ప్రభుత్వాదికార్ల అవినీతిమయ ప్రాపకంతో బోగస్ సంఘాల విస్తరణ, లోన్ల మంజూరిలో అవకతవకలు , ముడిసరుకు –నూలుబట్ట ధరల స్థిరీకరణ, సబ్సిడీల  విషయంలో ప్రభుత్వ పాలిసీలలో చిత్తశుద్ధి లేకపోవడం …వగైరా కారణాల మూలంగా అక్కడ తీవ్రమైన ఆర్ధిక వ్యత్యాసాలు నెలకొని వున్నాయి. కోట్లకు పడగలెత్తి ఎలాంటి ఆటుపోట్లనయినా  తట్టుకో గలిగిన వాడు ఒకవైపు,  పూరి గుడిసెలో లేదా పాత పెంకుటింటిలో దినదినగండం నూరేళ్ళాయుష్షుగా  బతుకునీడ్చే నేత కార్మికుడు మరో వైపు ..మనకు కనపడతారు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడవాళ్ళు బీడీలు చుట్టి స్వల్పమైన స్థిరాదాయం సంపాయిస్తారు , ఎదిగిన ఒకరిద్దరు కొడుకులు కొత్త జీవిక కొరకు మహారాష్ట్ర , గుజరాత్ వలస వెళతారు . చక్ర భ్రమణంగా  దాపురించే స్టాగ్ ఫ్లేషన్, మాంద్యం మధ్యతరగతి ప్రజలను హడలెత్తిస్తాయి , బలవన్మరణాలకి పురికొల్పుతాయి . ‘90 వ దశకపు పశ్చిమార్ధం లో  అమలు లోకి వచ్చిన నూతన ఆర్ధిక , పారిశ్రామిక విధానాల పర్యవసానాలు అంతటా కనబడుతోన్న కాలమది .

రాత్రి భోజనాలప్పుడు నాకు మంచినీళ్ళు అందించే నెపంతో ఆమె నన్ను సమీపించింది. “నువ్వు కథలు రాస్తవని మేనకోడలు చెప్పింది. నీ పుస్తకం ఇచ్చింది. కొన్ని కథలు చదివిన . మీరు కథలు రాసేటోళ్ళు ఏమేమో ఊహించి రాస్తరు…నీ కళ్ళ ముందర కనపడే నా అసంటోళ్ళ బతుకు మీద కథ ఎందుకు రాయవయ్యా ?”

పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆమె అడిగిన తీరుకు ఆ క్షణాల్లో ఏమి చెప్పాలో నాకు తోచలేదు. మౌనంగా తలాడించాను. చేనేత పట్టణమైన సిరిసిల్లలో నేత కార్మికుల వృత్తి జీవితం, పని సంస్కృతి, ప్రజల సామాజిక –ఆర్ధిక -వ్యాపార వ్యవహారాలు నాకు కించిత్ కొత్తగా , ప్రత్యేకమైనవిగా కనిపింఛి కుతూహలం రేపేవి. వాటిని మరింత సన్నిహితంగా పరిశీలించి ఒక కథ రాయాలన్న ఆలోచన కూడా గతంలో నా మదిలో మెదిలింది. ఆ ఆలోచనకు ఆమె ప్రశ్న ఆజ్యం పోసింది.  ఆ రాత్రి నేను నిజంగా నిద్ర పోలేదు.

**

కథ రాయడానికి ఏదన్నా’విశిష్ట వస్తువే’ కావాలి , అన్ని మామూలు విషయాలు పనికి రావు అనే భ్రమ నాకెప్పుడూ లేదు. రాయగలిగే నేర్పు వున్నవారికి  ప్రతి ఆలోచన , ప్రతి సంవేదన , ప్రతి అనుభవం , అనుభూతి  కథకి proper stuff కాగలదు అని నాకు తెలుసు.  అక్కడ చాలా చేనేత కుటుంబాలు దారిద్ర్యంలో మగ్గుతున్నాయి ; వాళ్ళ జీవితం, ఆర్ధిక దుస్థితి ఇతివృత్తంగా , ఆమె ఒక పాత్రగా…ఒక  కథ రాయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను . మర్నాడు  అలాంటి కుటుంబాల్ని మరికొన్నింటిని  పరిశీలించి, వ్యక్తుల్ని కలిసి  అవసరమైన  వివరాలు సేకరించాను.

కథా రచయితకు రెండు రకాల సందిగ్ధతలు ఎదురవుతాయి ; కథ రాయాల్సి వచ్చినప్పుడు  మస్తిష్కంలో తిరుగాడే అనేక  కథావస్తువు (subject/theme)ల్లో దేనిని ఎంచుకోవాలి అనేది ఒకటయితే , నిర్ణయించుకున్న వస్తువును కథగా మలచడానికి ఏ పధ్ధతి (technique / form) వాడాలి అనేది మరొకటి. ఆమెని  ఒక పాత్రగా, అక్కడి నేత కార్మికుల దీనస్థితి గురించి  రాయదలచుకున్న కథకి  ఏ దృష్టికోణం ఉపయోగించాలి , ప్లాట్ నిర్మాణం ఎలా చేయాలి  అనే విషయమై రామగుండం వచ్చాక  చాలారోజులు  తీవ్రంగా ఆలోచించాను. నా వృత్తిగత షిఫ్ట్ డ్యూటీ ముగిశాక  తీరిక సమయంలో కూర్చుని రోజుకు కొన్ని పేజీల చొప్పున  రాయడానికుపక్రమించాను . కార్మికుల పేదరికం, వారి జీవన శైలి, పలు ఆర్ధిక, రాజకీయ పరిణామాల  నేపథ్యంలో వారి ఆరాటాలు , పోరాటాలు,  ఇతర రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు వలసలు చిత్రించేందుకు  ఒక కుటుంబ గాథ చెప్పాల్సి రావడంతో అనేక పాత్రలతో  నెర్రేటివ్ విస్తృతి పెరిగి పోయే ప్రమాదం ఏర్పడింది.  కథ మొదటి డ్రాఫ్ట్ నచ్చక పక్కన పడేశాను . రెండో డ్రాఫ్ట్ కీ అదే గతి పట్టింది. కొన్ని రోజుల విరామం తర్వాత కథా రచన ప్రణాళిక మార్చాలని  నిశ్చయించుకున్నాను.

కుటుంబ అనుబంధాల మార్దవాన్ని, మనిషిలోని మానవీయ స్పందన శీలతని ఆర్ధిక దుస్థితి మొద్దు బారుస్తుంది , కొండొకచో జీవితంలోని బీభత్స సన్నివేశానికి వ్యక్తులను నిందించడానికి లేదు.. – ఈ కమ్యూనికేషన్  అందించడానికి ఒక  కుటుంబపు బహు పార్శ్వాలను స్పృశిస్తూ  , పలు  పాత్రలను స్ఫురియింప జేయాలనుకున్నాను , అయితే అదే సమయంలో కథన విస్తృతిని , కథ నిడివిని అదుపులో ఉంచాలన్న విషయం మరచిపోలేదు. కథ  ఏ టెక్నిక్ లో రాయాలి అని పరిపరి విధాల ఆలోచించాను. డాక్యుమెంటరి అనిపించే కథన పధ్ధతి బాగుంటుందని చివరికి నిర్ణయింఛి, నాలుగు  arrangements ( టైటిల్ పెట్టని పెయింటింగ్స్)  ని వెళ్లాడ దీసి చూపిస్తూ కథనం నడిపించాను.

నాలుగు చిత్రాలుగా కథ  alternate దృష్టి కోణాల్లోంచి పొరలు పొరలుగా unfold అవుతుంది. సన్నివేశాలలో , ఘటనలలో క్రియా పదాలు present tense లో వుంటాయి.  ఒకటవ , మూడవ చిత్రాలలో  జానమ్మ ఆలోచనలు, జ్ఞాపకాలు, భయాలు , రెండో చిత్రంలో అనసూయ  బాధ , ఆవేదన, ఆశల చిత్రణ …కాగా వీరిద్దరి ఆలోచనల్లోంచి భూలక్ష్మి విషాద భరిత  జీవితకోణం ఆవిష్కరణ…(నన్ను కథ రాయమని అడిగిన ఆవిడకి నమూనా ఈ పాత్ర). నాలుగో చిత్రం ద్వారా  కథకుడు నేరుగా ఇచ్చిన sting  లాంటి ముగింపు – మనుషుల మమతానురాగాలపై , హృదయాల ఆర్ద్రత పై ఆర్ధిక శక్తి కొట్టగల దెబ్బను బీభత్సంగా దృశ్యమానం చేస్తుంది. ఈ స్కీం తో పూర్తయిన కథ నాకు సంతృప్తి నిచ్చింది.

**

కథకి శీర్షిక నిర్ణయించడం ఒక్కొక్కసారి రచయితకు సవాలుగా పరిణమిస్తుంది. కథాంశాన్ని స్ఫురింప జేసేదిగానో , ముఖ్యపాత్ర predicament ని సూచించేదిగానో,  పాఠకులకు catchy గా తోచేదిగానో కథకి టైటిల్ పెట్టడం సాధారణం. కొన్ని రచనల  ఆలోచనాస్ఫోరకమైన శీర్షికలు విరోదాభాసగా కనపడతాయి. ఉదాహరణకి:  A River With Three Banks , The Third Bank of the River, The Fourth side of a Triangle…

విరోదాభాసగా అనిపించినా ఒక గణిత శాస్త్రవేత్త త్రికోణంలో నాలుగు భుజాలుంటాయని  కనుగొన్నాడు. బ్రెజిల్ రచయిత జోవా గిమారియా రోసా కథ ‘The Third Bank of the River’ ప్రపంచ ప్రసిద్ధ కథల్లో ఒకటని నాకు తెలుసు; పలువురు విమర్శకులు  ఈ కథని వివిధకోణాల్లో విశ్లేషించి ఇందులోని పారభౌతిక భావనపై వ్యాఖ్యానాలు చేశారు.  అవలా వుంచుదాం.

అయితే చేనేత కుటుంబం పై కథ రాసేటప్పుడు  నేను ఇవేవీ ఆలోచించలేదు. అంత  లోతైన భావాల మీద నా దృష్టి లేదు.  కథ ద్వారా ఏమి కమ్యూనికేట్ చేయాలో స్పష్టత ఉన్నందున ప్రణాళికా బద్ధంగా ప్లాట్ నిర్మాణం చేశాను. చిక్కని కథ ఒద్దికగా చట్రం పొంగి పొర్లకుండా  నాలుగు చిత్రాల్లోకి ఒదిగిపోయింది.

అప్పట్లో నేనొక పెద్ద ఎరువుల ఫ్యాక్టరీలో  ఉద్యోగం చేస్తున్నందున కావచ్చు- కథ రాయడం ముగుస్తున్న దశలో వుండగా ఇండస్ట్రియల్  సేఫ్టీ(భద్రత)కి లోగో అయిన  ‘ఆకుపచ్చ త్రికోణం’ అసంకల్పితంగా నా మదిలో మెదిలింది . ఈ కథ ప్రధానంగా జానమ్మ చుట్టూ అల్లినదైనా  ఇందులో మరి రెండు ముఖ్యపాత్రలు భూలక్ష్మి , అనసూయ . కథా త్రిభుజానికి ఈ ముగ్గురు మూడు భుజాలు(మిగతా పాత్రలు వీళ్ళను ఆలంబనగా చేసుకున్నవే) .ఈ మూడు కోణాల పరిధిలో ప్రధాన కథ విస్తరించి వుంది. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అయినప్పుడు  ఒక కుటుంబం వారైనా , మరో సమూహమైనా-  మనుషుల మధ్య మమతానుబంధాల భద్రతకి  వారి  ఆర్ధిక సుస్థిరతయే  హామీ. విలువలను పక్కన పెట్టి కఠినంగా వ్యవహరించాల్సిన నిస్సహాయత లోకి నెట్టివేసే ఆర్ధిక దుస్థితి వెనకాలి కారణాలు తన గత జీవితానుభవం మీద జానమ్మకు  కొంత మేర తెలిసినా , నాలుగో చిత్రం లోని బస్సు లోపలి ఘటన- కథకుడు వెలుగు విరజిమ్మిన నాలుగో కోణం- తెలిసే అవకాశం లేదు; సామాన్య ప్రజల , ప్రత్యేకించి  బడుగు వర్గాల, జీవితాలను-వారికి తెలియకుండానే- ఎక్కడో కూర్చున్న వారు నిర్ణయించే ఆర్ధిక అంశాలు  శాసిస్తాయని  ఆమె అవగాహనకు ఎన్నడూ అందదు.  కథకు ఔచిత్యవంతంగా ఉంటుందని త్రిభుజపు నాలుగో కోణం’  శీర్షిక పెట్టేశాను.

ఈ కథకు మొదటి పాఠకుడు అప్పుడు ఫర్టిలైజర్ సిటిలో ఉండిన  ఒక ప్రసిద్ధ కవి మిత్రుడు. రాతప్రతిని ఇరవై నిమిషాల పాటు ఏకబిగిన చదివి , కర్చీఫ్ తో నుదుటి మీది చెమట తుడుచుకుని, ‘ఒక వర్గం వారి జీవితాన్ని చాలా కోణాల్లోంచి ఆవిష్కరించిన కథ –నెరేషన్ కొత్తగా , ఆసక్తికరంగా వుంది,’ అన్నాడు. రెండు రోజుల తర్వాత కథని ‘ఆంధ్రజ్యోతి –ఆదివారం’ కి పంపించాను. అప్పటి టాబ్లాయిడ్ సైజ్ పత్రికలో కథని రెండు వారాలు(25-06-2000, 02-07-2000) వేశారు . చాలా మంది సాహితీమిత్రుల, విమర్శకుల  ప్రశంసలందుకున్న కథ యిది.

*

ఆడెపు లక్ష్మీపతి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు