తలకు మాసిన కథ!

కరోనా కహానీలు!

బుజ్జిగాడికి బూచాడంటే భయం లేదు. బూచాడి తాతన్నా భయం లేదు. ఇప్పడు వాడి చుట్టూ బూచాళ్ళే. ఇంట్లోనూ బూచాళ్ళే. వీధిలోనూ బూచాళ్ళే. నిజం చెప్పాలంటే వాడికి వాడూ వొక బూచాడే!

మొదట్లో అద్దంలో తనని తాను చూసుకొని వొక్క క్షణం బిక్కచచ్చి మరుక్షణం గుక్కపట్టి యేడ్చాడు. ఆ యేడుపు యేడు వూర్లవతలకు వినిపించింది. ఆపడానికి ఆటలు ఆడినా లేదు. పాటలు పాడినా లేదు. తల్లక్రిందులై తప్పస్సు చేసినా లేదు. ఆపరా బాబూ- అని అందరూ మొత్తుకున్నా ఆపలేదు. వాడ్ని తట్టుకోలేక అందరూ యేడ్చారు. అప్పుడు బుజ్జిగాడు నవ్వాడు!

ఇప్పుడు అద్దంలో తనని తాను చూసుకొని మురిసిపోతున్నాడు. ముసి ముసినవ్వులు నవ్వుతున్నాడు. ముద్దులాడుతున్నాడు. ఆ క్రెడిట్ అంతా వాళ్ళ మావయ్యదే?!

ఔను, యే జుట్టు చూసి వాడికి వాడు భయపడ్డాడో ఆ జుట్టు యిప్పుడు లేదు. ఉన్నా క్రాఫ్ లా వుంది. అపార్ట్మెంటులో వున్న వాళ్ళందరూ ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తున్నట్టు బుజ్జిగాడ్ని చూస్తున్నారు. వాడి ముఖం కూడా చంద్రబింబంలా వెలిగిపోతోంది. చుట్టూ వున్న మిగతా పిల్లలు తలకు మాసిన తనంతో చుక్కల్లా వెలవెలబోతున్నారు!

హెయిర్ సెలూన్స్ లేవు కదా-అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ‘తెలిసిన బార్బర్ని యింటికి రప్పించి…’ అని అమ్మ యిరుగమ్మ పోరుగమ్మలకు కతలు చెప్పేసింది. కాని బుజ్జిగాడు ‘మా మావయ్య చేసిన కటింగ్’ అని గొప్పగా నిజం చెప్పేశాడు!

అంతే. ఇంటి ముందు యిరుగూ పొరుగూ క్యూ కట్టారు. ఒకర్ని చూసి వొకరు. అపార్ట్మెంటులోని పిల్లలందరూ చేరారు. కాదు, పెద్దవాళ్ళు చేర్చారు. తామూ తలకు మాసిన ముఖాలతో చేరారు. తల గోక్కున్నారు. గెడ్డం గీక్కున్నారు. ‘బాబ్బాబు’ అన్నారు. అందరూ పిచ్చోళ్ళకు మల్లె వున్నారు. గుంపులుగా చేరినా పోలీసులూ మీడియా వచ్చేసరికి చెదిరి సామాజిక దూరం పాటించి సెహబాష్ అనిపించుకున్నారు. సామాజిక సేవతో మావయ్యా ‘సెహబాష్ బాసూ’ అనిపించుకున్నాడు!

ముందు మొహమాటానికి మావయ్య కత్తెర కట్ కట్ లాడించాడు. అంటే వాట్సప్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన వీడియోని ఆన్ లైన్ క్లాసుగా భావించాడు. అందులో జుత్తుకి రబ్బరు బ్యాండులు వరుసగా పెట్టేసి కురచగా కట్ చేయడం చూసాడు. చూసిందే చేసాడు. అంతే డిష్ తయారీ అన్నట్టు డిప్ప తయారీ. కొందరికి నెత్తిమీద గిన్నె బోర్లించి చుట్టూ మిగిలిన జుట్టు తడిపి రేజరు పట్టుకు గీసేసాడు. మరికొందరికి పనసకాయ చెక్కినట్టు చెక్కేసాడు. అది మరెందరికో నచ్చి అలాగే కావాలని కోరి మరీ చేయించుకున్నారు. అయితే యే యిద్దరిదీ వొక్కలా లేదు. అదేమని అడిగితే ‘యే రెండు తలకాయలయినా వొక్కలా వున్నాయా?, నీ తలకాయను బట్టే నీ కటింగు’ అన్నాడు మావయ్య!

మొత్తానికి యిదంతా చూసిన పేపరువాళ్ళు మావయ్య గురించి ఘనంగా రాసి పడేసారు. వీడియో తీసి పంపితే వైరల్ న్యూస్ కింద టీవీల్లో చూపించేసారు. ఆ వీడియోని మెచ్చుకుంటూ వో సినిమా స్టారు ట్వీట్ కూడా చేసేసాడు. దాంతో యేరియా ఎమ్మెల్యే రంగంలోకి దూకి దువ్వెనలూ కత్తెరలూ బహూకరించి భుజంతట్టి ప్రోత్సాహించాడు. ఆ యెంకరేజుమెంటులో మావయ్య కన్నూ మిన్నూ కానలేదు. కత్తెరకు అందినంత మేరా కట్ చేసాడు. కత్తి‘ర’ పట్టిన వారియర్ అంటూ రాసిన కథనాలు ఆయన్ని కథనరంగంలోకి తోసేసాయి!

ఇటు పిల్లలతో పాటు పెద్దలూ పోటీ పడ్డారు. జుట్టూ గెడ్డమూ లేని మగాడెవడు? చేసేదేముంది… చేతికొచ్చిందే కటింగు. బాగోలేకపోయినా యీ కరోనా కాలంలో బయట తిరిగేది యేమీ లేదని కొందరు సరిపెట్టుకుంటే, బయట తిరక్కుండా వుండడానికని మరికొందరు సరిపెట్టుకున్నారు. మాకు గెడ్డాలూ మీసాలూ లేకపోవచ్చు… కాని జుట్టుంది అని ఆడవాళ్ళు ఆగలేదు. చిగుళ్ళని కొందరు. పగుళ్ళని కొందరు. పక్కలూ పక్క సైడులూ అని మరికొందరు. పోటీ పడ్డారు. ఆడవాళ్ళ మధ్యపోటీ అసూయకు దారితీసింది. దాంతో తొందరపడిపోయి తలనీలాలు తలా కొంచెం సమర్పించేసుకున్నారు!

అర్ధరాత్రయేది. అలసి మావయ్య యింటికి వచ్చేవాడు. ఆవలింతలు తీసేవాడు. ఒకరోజు తిని తేన్చక ముందే ‘రేపో మాపో కరోనా కనుమరుగయ్యాక హెయిర్ సెలూన్ పెట్టుకుంటాను’ అన్నాడు!

దాంతో యింట్లో అందరికీ గ్రీన్ జోన్లోంచి వొక్కసారిగా రెడ్ జోన్లోకి వొచ్చిపడ్డట్టు నిద్రలు వదిలిపోయాయి!

‘సామాజిక సేవనుకున్నాం’ అని గొణిగారు!

‘కరోనా నాకు దారి చూపిన దేవత’ అన్నాడు మావయ్య. ఎవరికీ మాటలు రాలేదు. ‘ఏపనీ చెయ్యడానికి యిష్టపడని సోమరి యీ పనన్నా చెయ్యనీ’ అని యెవరూ సంతోషించలేదు. అన్నయ్య మాత్రం కులవృత్తి చేసుకొనే కుర్రాళ్ళు అల్టిమేటం యిచ్చిన సంగతి గుర్తుచేసాడు. ‘ఆళ్ళ బొంద… అధికంగా అల్లరి చేసిన కుర్రాళ్ళకు నా సెలూన్ లోనే జాబ్ యిస్తాను’ కాన్ఫిడెంటుగా అన్నాడు మావయ్య!

‘కుల వృత్తి నామోషీ కాదట్రా?’ అని అమ్మమ్మ అంటే, ‘యిప్పుడు కులముండొచ్చు. కాని కుల వృత్తి ఎక్కడుంది? ఫేమస్ హెయిర్ సెలూన్స్ అన్నీ యేవీ కులవృత్తి చేసేవాళ్ళవి కావు, కానేకావు. కార్పొరేట్సువి. వాటి బ్రాండ్ వేరు. యిమేజ్ వేరు. లక్షలు పోసినా ఫ్రాంచేజెస్ కూడా మనం సాధించలేం. వేలల్లో చార్జెస్. మన వూహకి అందవు. మనం అంత దూరం ఆలోచించం’ అని ఆలోచనగా వొక్క క్షణం వుండిపోయాడు మావయ్య. మళ్ళీ తనే ‘అందులో జాబ్ చెయ్యాలంటే మాంచి చదువూ యింకా మాంచి ట్రైనింగూ వుండాలి. నాకయితే కరోనా పుణ్యమా అని యిక్కడ ట్రైనింగు హేపీగా అయిపోతోంది, పెట్టుబడే వెతుక్కోవాలి’ వెలుగుతున్న ముఖంతో అన్నాడు మావయ్య!

ఆ వెలుగు బుజ్జిగాడి ముఖంలోనూ ప్రతిఫలించింది!

‘సామాజిక సేవకు గిట్టుబాటు వుంటుంది’ అని నమ్మిన మావయ్యకొక్కడికే ఆ రాత్రి మా బాగా నిద్రపట్టింది!!

*

బమ్మిడి జగదీశ్వరరావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎక్స్లెంట్ మిత్రమా

  • సరదాగా ఇప్పటి కరోనా స్తితి మీద రాసిన కధ బజారా స్టాండర్డ్ లో ఉంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు