తమ్ముడు లేని ఆ గది…మూగది!

శ్రీకాంత్, జానకీబాల తమతమ అభిమాన రంగాలలో అంకిత భావంతో కృషిచేసి, ప్రసిద్ధిని, రససిద్ధిని సాధించారని నాకనిపిస్తుంది.

 మా తమ్ముడు శ్రీకాంతశర్మ ఇంట్లో తన గదిలో ఇంకా ఎప్పుడూ కన్పించడు. అతని కంఠం వినిపించదు. పరిహాసంగా మాటల మధ్యలో కులాసాగా నవ్వే ఆ నవ్వు కూడా ఇంక కనిపించదు.

ఒక రోజు మామూలుగా శర్మ ఇంట్లో తమ్ముడు ఉండే గదిలోకి వెళ్ళాను. అంతటా నిశ్శబ్దం. అతని కుర్చీ, టేబుల్, టేబుల్ మీద తను సర్దుకున్న పుస్తకాలు ఉన్నాయి. పైన ఎదురుగా గోడ మీద అతని పెద్ద సైజు ఫోటో కన్పిస్తోంది. టెన్నిస్ బంతిలా చేయించుకున్న హెయిర్ కట్ (ఇది తమ్ముడు వాడే మాట) అందర్నీ ఆకర్షించే చిరునవ్వు, చురుకైన చూపు, కళ్ళల్లో మెరుపు.

ఆ గదిలోకి నేను రావడం చూసినప్పుడు, చదువుకుంటూనో , రాస్తూనో, తల పైకెత్తి “చిన్నా, రా, రా, ఎలా ఉన్నావు, అందరూ బాగున్నారా ” అన్న అతని పలకరింపు మాయమైపోయింది. గది చిన్నబోయింది.

అతని ఫోటో నా మనస్సులో దాగిన అనేక స్మృతుల్ని కదిలించింది. మేం ముగ్గురు అన్నదమ్ములం. మా చిన్న తమ్ముడు ఇతను. చిత్రం, మా ఇంట్లో నన్ను ‘చిన్న’ అనీ, మా అన్నయ్యను ‘భాను’ అనీ (పేరు భానుమూర్తి), ఇతనిని శర్మ అనీ పిలవటం అలవాటు. మా తరువాత ఒక చెల్లెలు సత్యవతి. మా నాన్నగారు తన అభిమాన కవి భవభూతి పేరు శ్రీకంఠశర్మ అని ఇతనికి పెట్టుకున్నారు. ఇంగ్లీషు లిపిలో ఇతని పేరు శ్రీకాంతశర్మగా మారటంతో అక్షరాలా శ్రీకాంతశర్మగానే స్థిరపడ్డాడు. ఈ తమ్ముణ్ణి మా అమ్మమ్మ, ఇతని కబుర్లూ, హాస్యం, సందడీ చూసి ‘కవీ’ అని ఇష్టంగా పిలిచేది. అందుకనే, మా మేనమామగారింట్లో ఇతను అందరికీ ‘కవిబావ’.

ఇంట్లో మా ఇద్దరికీ బాగా సఖ్యత ఉండేది. ఆటపాటల్లో కలవకపోయినా ఖులాసా కబుర్లలో ఇద్దరికీ కలిసేది.

ముందుగా రెండు బాల్య స్మృతుల గురించి చెబుతాను.

1940వ దశకంలో యాయవరం బ్రాహ్మలవి కొన్ని కుటుంబాలు మా రామచంద్రాపురంలో ఉండేవి. వారు బ్రాహ్మల ఇళ్లకు వచ్చి ఆ రోజు ఉదయం పంచాంగం, అంటే తిథి,వారం, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం చెప్పేవారు. మా ఇంటికి వచ్చే యాయవరం బ్రాహ్మణ రూపం – పొట్టి పంచె, విభూతి రేఖలు, గుండు వెనక చిన్న పిలక, చేతిలో ఒక రాగి చెంబు. మా ఇంటి సింహద్వారం దగ్గర నిలబడి,ఆ రోజు పంచాంగం గడగడా చదివేసి నించునేవాడు. అంతకు మించి ఏమీ అడగడు. పాపం ఆయన దుర్ముహూర్తం అనడానికి బదులు ‘ధుముతం ‘ అనేవాడు. ముందు ఆయన్ని ఈ తమ్ముడే చూసి, “అమ్మా, ధుముతం గారు వచ్చేసారు” అనేవాడు. అప్పుడు అమ్మ “శర్మా, ఆయనకీ బియ్యం పెట్టి పంపు” అనేది. ఇంటి లోపలి నుంచి బయటకు వచ్చి ధుముతం గారిని చూసి ఇద్దరం గట్టిగా నవ్వేవాళ్ళం. ఆయన పట్టించుకోకుండా వెళిపోయేవాడు. మా నవ్వులు విన్న అమ్మ బయటకు వచ్చి, “తప్పు, అలా నవ్వకూడదు. చిన్నపిల్లలు మీకు తెలియదు. ఆయన మా తాతగారికి శిష్యుడు. వైదికం నేర్చుకున్నాడు. కానీ కొద్దిగానే వచ్చింది. మంచి బ్రాహ్మణ కుటుంబం సుమా వాళ్ళది. అలా నవ్వకండి మొహం మీద. బావుండదు. బాధపడతా డేమో” అనేది.

తమ్ముడు శ్రీకాంత్ చిన్ననాటినుంచీ హాస్యప్రియుడు. తనకు తెలిసిన హాస్య సంఘటనలు ఆసక్తికరంగా వర్ణించి చెప్పేవాడు. ఒకసారి, పూర్ణయ్య అని ఎలిమెంటరీ స్కూలులో తనతో చదివిన బాల్య మిత్రుడి గురించి అటువంటిదే ఒక సంఘటన చెప్పాడు. అతను మూల వీధిలో ఉండేవాడు. మా ఇంట్లోనూ, పూర్నయ్య ఇంట్లోనూ లింగాయి అనే చాకలి ఉండేవాడు. బట్టలు చక్కగా ఉతికి, మల్లెపువ్వులా మెరిసేలా ఇస్త్రీ చేసి తెచ్చేవాడు. పట్టుదల మనిషేగాని, కొంత మూర్ఖత్వం ఉండేది. ఒకసారి పూర్నయ్య ఇంటికి బట్టలు తీసుకువెళ్ళడానికి లింగాలు వచ్చి వాళ్ళ అరుగు మీద కూర్చుంటాడు. పూర్ణయ్య ఆ అరుగు మీదే అటూ ఇటూ తిరుగుతూ కొన్ని ఇంగ్లీషు మాటలూ, వాటి స్పెల్లింగులూ పుస్తకం చూసి వల్లిస్తూ ఉంటాడు. రేపు అవి క్లాసులో అప్పగించాలి. లింగాలిది చూసి”పూర్నయ్య సారూ, భలే బాగుందండీ ఈ బాస. మీ బళ్ళో సెబుతారా. నాకూ ఒక మాట సెప్పండీ, మీతోబాటే సెబుతాను.” అని అడుగుతాడు. పూర్నయ్య “నీకెందుకురా ఇది? నీకేమైనా తెలుస్తుందా పెడుతుందా.” అని తీసెయ్యబోతాడు. లింగాలిలా ఆగేవాడు కాదు గదా. పూర్నయ్య వదిలించుకుందామన్నా వదలడు. “సారూ, ఒక్క మాట సెప్పండి, పలుకుతాను.” అని తగులుకుంటాడు. పూర్నయ్య వీడు చెబితే వినడంలేదని “లింగాలూ, అయితే ఈ మాట విని, నాతోపాటే అను.” అనిచెప్పి, ‘ఫూల్’ అనే మాటని మూడుసార్లు అనిపించి, “ఇది చాలా మంచి మాటరా. దండం సారూ అంటావు చూడు, అలాంటి మంచిమాట.” అనిచెప్పి, ఇంట్లోకి పోయి, “మంచిపని చేసాను” అని నవ్వుకుంటాడు. ఆ తరువాత ఒక రోజు, పూర్ణయ్యకి స్కూలు పరీక్షలో ఇంగ్లీషులో బాగా మార్కులు తగ్గాయని టీచరుచేత తిట్లు తిని,మొహం మాడ్చుకుని వస్తున్నాడు. లింగాలు ఇస్త్రీ బట్టలతో వాళ్ళ ఇంటి అరుగు మీద కనబడి, నవ్వుతూ “పూర్నయ్య ఫూల్ గారూ! రండి రండి!” అని పలకరిస్తాడు. పూర్నయ్య అది విని తట్టుకోలేక, వాడినేమీ అనలేక, తనలో తననే తిట్టుకుంటూ లోపలికి పోతాడు. శర్మ ఈ సంఘటన గురించి చెప్పినప్పుడు ఇద్దరం బాగా నవ్వుకున్నాం పూర్నయ్య పరిస్థితికి.

బుజ్జి శర్మ మొదటి ప్రైజు : మా ఊళ్ళో, మా వీధి చివరిలో ఒక పెద్ద తోట, ఆ తోట కవతల మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్ పైన భూమి తనఖా బ్యాంక్ ఉండేవి. దాని మేడ మీద ఒక సంస్థవారు నెహ్రూ జన్మ దినోత్సవం సందర్భగా బాలల దినోత్సవం జరిపించారు. అందులో పిల్లలకు పద్యాలు, శ్లోకాలు చదివే పోటీ పెట్టారు. అందులో ఈ బుజ్జి శర్మ, నాన్నగారు చదువుకునే ‘సౌందర్య లహరి’ లో ఒక శ్లోకం చదివాడట. మంచి ఉచ్చారణతో, ధైర్యంగా చదివినందుకు ఆ సంస్థ వారు చిన్న మెడల్ బహుమతిగా ఇచ్చారు. ఆ రాత్రి ఇంట్లో అందరికీ ఈ సంగతి చెప్పి తన ప్రైజు మెడల్ చూపించాడు. అందరం బుజ్జి శర్మ బహుమతి పొందినందుకు మెచ్చుకున్నాం. అమ్మ, నాన్నగారు “అరే, మాకు తెలియకుండానే వెళ్ళావే” అన్నారు. “ప్రైజు తెచ్చుకుని గొప్పగా చూపించాలని చెప్పలేదు” అన్నాడు మా బుజ్జి శర్మ.

హైస్కూలులో చదువుతూ తాను రాసి చదివిన తొలి రచన : సైన్సు టీచర్ శ్రీమతి రంగనాయకమ్మ గారు ఆవిడ నిర్వహించే సైన్సు క్లబ్ లో ‘చెట్లు మాట్లాడితే’ అన్న విషయం మీద చిన్న వ్యాసం రాసి చదవమన్నారు తన క్లాసు విద్యార్థుల్ని. అందులో శర్మ కూడా పాల్గొని, తన వ్యాసం చదివి వినిపించాడట. అది విని “బావుంది శర్మా! బాగా రాశావు. కొత్తగా ఉంది.” అని రంగనాయకమ్మ గారు, తన తోటి విద్యార్థులు మెచ్చుకున్నారని చెప్పాడు. ఆ తరువాత అది నాకు చదివి వినిపించాడు. నేనూ సంతోషించి, వాడి భుజం తట్టి “బాగా రాశావురా. నీ రచన అందర్నీ ఆకట్టుకుంటుంది.” అన్నట్టు జ్ఞాపకం. తమ్ముడికి తాను చూసిన దృశ్యాన్ని, చదివిన రచయితల, కవుల వైభవాన్ని లోతుగా గ్రహించి, వర్ణించి చెప్పే నేర్పు, తీర్పు, చమత్కారం సహజంగానే వచ్చాయనిపిస్తుంది నాకు. మా నాన్న గారి సహవాసం, ప్రోత్సాహం ఆ సహజ నైపుణ్యానికి తగినంత దోహదం అందించాయి.

బాపూజీ సైకిల్ కథ : తమ్ముడు కాకినాడలో మా మామయ్యగారింట్లో ఉండి, పి.ఆర్ కాలేజీలో పి.యు.సి చదివిన రోజులవి. ఈ బాపూజీ మామయ్యగారింటికి దగ్గరలోనే వాళ్ళ తాతగారింట్లో ఉండేవాడు. ఇతను మాకు మా అమ్మ తరఫు దగ్గర బంధువు. బాపూజీ, శర్మా ఒకచోటే చదివేవారు. బాపూజీ కాలేజీ టైముకి పావుగంట ముందు సైకిల్ గంట మోగించి, మామయ్యగారింట్లోకి వచ్చి, “శర్మా! డ్రైవరు వచ్చేశాడు, రావాలి,రావాలి!” అనేవాడుట నవ్వుతూ. అద్ధం ముందు నుంచుని, అటు తిరిగి, “ఇదిగో వచ్చేస్తున్నానురా!” అనేవాడుట శర్మ. మా అత్తకు కూడా ఈ ఛలోక్తులు ఇష్టం. వీళ్ళిద్దరి వరసా చూసి నవ్వుకునేది. ఇలా శర్మ సైకిలు వెనక సీటు మీద కూర్చుని, కాలేజీ ముచ్చట్లూ, టీనేజీ మోజులూ చెప్పుకుంటూ కాలేజీ చేరేవారు.

ఒకరోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చే వేళ, బాపూజీ శర్మతో “శర్మా!నువ్వు కూడా నాలా సైకిలు నేర్చుకుని తొక్కాలిరా. ఇది నా సొంత సైకిలే గదా, మంచిగా నేర్పుతాను, నేర్చుకోరా.” అన్నాడట. దానికి శర్మ “నేను సైకిలు నేర్చుకోను, ఆ నేర్చుకోవటంలో కాళ్ళకీ, చేతులకీ దెబ్బలు తగిలితే నేను ఓర్చుకోలేను. అంతే” అన్నాడట. భయపడద్దని, దెబ్బలు తగలకుండా నేర్పుతానని బాపూజీ ఎంత నచ్చచెప్పినా శర్మ వినలేదట. ఇల్లు వచ్చాక, బాపూజీ శర్మని దింపేసి, లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడట. ఆరోజు బాపూజీని చాలా విసిగించానని, బహుశా రేపు తనకోసం అతనిక రాడనీ శర్మ మససులో అనుకున్నాడట. కానీ మర్నాడు బాపూజీ యథావిధిగా వచ్చి, గుమ్మంలో సైకిల్ గంట కొట్టి, లోపలికి వచ్చి పిలిచే సరికి ఆశ్చర్యపడి, గబగబా వెళ్లి సైకిలెక్కి కూర్చున్నాడట. “శర్మా, ఇవాళ నీకోసం రాకూడదనుకున్నాను నిజంగా. ఎందుకో రాకుండా ఉండలేకపోయాను సుమా!” అన్నాడట బాపూజీ. “నాకూ అలాగే ఉందిరా. మనం కలిసే ఉంటాము. ఎంత పోట్లాడుకున్నా విడిపోము.” అన్నాడట శర్మ. వారి ఆ అనుబంధం తమ్ముడు ఈ లోకం వదిలి వెళ్లే దాకా అలాగే నిలిచింది, వాళ్ళు తరచు కలిసినా, కలవకున్నా. ఒకసారి మామయ్యగారింట్లో వ్యక్తి స్వాతంత్య్రం, ప్రేమ, ఆకర్షణ వంటి విషయాల గురించి చర్చ వచ్చి ఇద్దరూ రెచ్చిపోయి తీవ్రంగా వాదించుకున్నారు. అప్పుడు బాపూజీ తన గొంతు పెంచి, “శర్మా!నీ అభిప్రాయంతో నేనెంత మాత్రమూ ఏకీభవించను. ఇలాగే ఖండిస్తాను. ” అన్నాడట. అప్పుడు శర్మ చిరునవ్వుతో “పోనీ నీ మాటే నిజం అనుకో, నీతో ఏకీభవిస్తాను” అన్నాడట. దానికి బాపూజీ తెల్లబోయాడు శర్మ యుక్తికీ, సమయస్ఫూర్తికీ. ఇంతదాకా తన బుద్ధి బలంతో చెలరేగి వాదించిన శర్మ పరిస్థితి గ్రహించి, పూర్తిగా తాను తగ్గిపోయి, బాపూజీ వైఖరిని ఆమోదించటం శర్మలో నాకు కనిపించే చిత్రమైన చమత్కారం.

శర్మ కాకినాడ నుంచి రాసిన ఉత్తరం, నాన్నగారి సంతోషం : దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏదో పనిమీద కాకినాడ వచ్చారు. రామారావు పేటలో తన మేనల్లుడి ఇంటిలో దిగారు. నాన్నగారికి ఎప్పటిలాగే కబురు పంపారు రమ్మని, చూడాలని. ఇద్దరికీ ఎంతో సన్నిహిత స్నేహం ఉండేది. నాన్నగారు కృష్ణశాస్త్రి గారిని కలిసి, ఆయన సన్నిధిలో అక్కడ చేరిన సాహితీ మిత్రులతో సరదాగా కొన్ని గంటలు సాహిత్య సంభాషణలతో ఇష్టాగోష్టిగా గడిపి, ఆ ఇంట్లోనే ఒక వాటాలో ఉంటున్న మామయ్య కుటుంబాన్ని, తమ్ముడు శర్మనీ చూసి, రాత్రికి రామచంద్రాపురం వచ్చేశారట. కొన్ని రోజుల తరువాత పి.ఆర్.కాలేజీ యాజమాన్యం, విద్యార్థులూ గురజాడ వర్థంతి సందర్భంగా కాలేజీలో ఒక సాహిత్య సభ ఏర్పాటుచేసి, శాస్త్రిగారిని వక్తగా ఆహ్వానించారు. కృష్ణశాస్త్రిగారు ఒకప్పుడు ఆ కాలేజీలో పనిచేశారు. ఆయనకా కాలేజీతో చాలా అనుబంధం ఉంది. ఆ సభకి సుప్రసిద్ధ కవి కాటూరి వేంకటేశ్వర రావుగారు అధ్యక్షులు. AIR లో పనిచేసున్న ఉషశ్రీ కూడా ఒక వక్త. శర్మ ఆ సభకి చాలా ఉత్సాహంగా వెళ్ళాడు తన మిత్రులతో.

ఆ సభలో కృష్ణశాస్త్రి గారి ఆకర్షణీయ ప్రసంగాన్ని, వేదిక మీద తోటి వక్తలతో ఆయన సరదాగా చేసే చమత్కారాలనీ, ఛలోక్తులనీ, హాస్యాన్ని శర్మ తన్మయత్వంతో అనుభవించి, ఆస్వాదించి, ఆయన ప్రసంగ కౌశలాన్ని, ఇతర వక్తల విశేషాలను కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తూ నాన్నగారి పేర ఒక ఉత్తరం రాశాడు. అది చదివి, నాకూ, అన్నయ్య భానుకూ చదివి వినిపించారు నాన్నగారు. “ఈ ఉత్తరం శర్మ చాలా బాగా రాశాడు కదూ. ఆ సభలో మనం ఉన్న అనుభూతి కలిగేలా రాశాడు. శర్మలో రచనా నైపుణ్యం, విశ్లేషణ, మంచి రచయితగా రాణించే లక్షణాలు అలవడ్డాయి. సంతోషంగా ఉంది. అలాగే, మీరు కూడా సరదాగా రాసినవి నాకు చూపిస్తున్నారు. రాయాలనే తపనా, రచనా నైపుణ్యం కోసం చేసే ప్రయత్నం మీ అందరిలో చూసినప్పుడు, నేను చాలా సంతోషిస్తాను. నేనూ నా పిల్లల్లో ఈ మాత్రం సాహిత్యం పట్ల అభిరుచి, చక్కని రచనలతో మెప్పించాలని ప్రయత్నం చూసి, అదృష్టవంతుణ్ణే అనుకుంటాను. కవుల సంతానానికి అభిరుచి ఇలా పరంపరగా రావటం విశేషమే అనిపిస్తుంది. నేనెరిగున్న కవుల పిల్లల విషయంలో ఇది జరగలేదు, ఎందుకో. కానీ, మీమీ క్లాసు చదువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధ దెబ్బ తీస్తుంది. రచనా చాపల్యం మీ పాఠాల్ని, పరీక్ష చదువునీ భంగపరచకూడదు. శెలవుల్లోనే ఈ సాహిత్య వ్యాసంగం, కథలూ, నవలలూ చదవటం శ్రేయస్కరం. మనవంటి మధ్య తరగతి వారికి సర్టిఫికెట్, దానితో వచ్చే ఉద్యోగం చాలా అవసరం. అక్కడ జాగ్రత్త పడకపోతే, లోకంలో బతకటం కష్టం. ఇది బాగా గుర్తుంచుకోండి. మీకు నా ప్రోత్సాహం ఉంటుంది.” అని చెప్పారు.

పి.యు.సి. పరీక్షలు – ఆశాభంగం : పి.యు.సి. లో శర్మకి రెండు పేపర్లు ఫిజిక్సు, కెమిస్ట్రీ ఉండిపోయాయి. అందరి విద్యార్థుల్లా పాస్ కావాలని చదివినా ఫలితం దక్కలేదు. బాపూజీ పాసయ్యాడు. అతనికి పై రెండు సబీజెక్టుల్లో ట్యూషన్లు ఉండేవి. శర్మకి ఆ సౌకర్యం లేదు. అప్పటి నాన్నగారి కుటుంబ బాధ్యతలు, ఆదాయం అందుకు అనుకూలించలేదు. ఇంటి నుంచి ప్రయివేటుగా పరీక్ష రాసినా ఫలితం దక్కలేదు. శర్మ, నాన్నగారు ఈ పరిణామానికి చాలా బాధపడ్డారు. తన తోటి మిత్రులు చదువులో ముందుకి వెళ్లిపోయారు, తాను వెనకపడ్డానన్న ఆలోచన శర్మని వేధించేది. ఆ కాలంలో నేను ఇంటికి దూరంగా తణుకులో అక్కమాంబా టెక్ష్స్‌టైల్సులో స్టెనోగా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాను. అన్నయ్య భాను కొవ్వూరులో భాషా ప్రవీణ పరీక్ష పాసై, మా ఊరి హైస్కూలులో తెలుగు పండిట్ గా చేరాడు. అన్నయ్యకి పెళ్లయింది. అంతా కలిసే ఉంటున్నాం. అప్పటి ఉద్యోగాల్లో జీతాలు పెద్దగా ఉండేవి కావు. నాన్నగారు తన అన్నదమ్ముల కుటుంబాలకి ఆర్థికంగా సహాయం చేస్తూ తన కుటుంబాన్ని చూసుకోవాలి. శర్మతో మాట్లాడి I.T.I అనే చిన్న టెక్నీకల్ కోర్సులో మామయ్య సలహాతో చేర్పించారు. అదీ ఆశాభంగంగాన్నే మిగిల్చింది. నేను తణుకు నుండి శెలవలకి ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి సంగతులు అమ్మ చెపింది. మా నాన్నగారు, శర్మా దూరందూరంగానే ఉంటున్నారు. మాట్లాడుకోవటం లేదు. భానే శర్మతో ఒకరోజు “నువ్వింత నిరాశా, నిస్పృహలతో ఉండటం బాగా లేదు. నీ భవిష్యత్తుకి ఏదో ఒక దారి ఉండకుండా ఉండదు. నేను నాన్నతో మాట్లాడతాను. నీకు తెలుగు, సంస్కృతం భాషల మీద ఆసక్తి ఉంది కదా. నాలాగే కొవ్వూరులో భాషాప్రవీణలో చేరి ఆ కాలేజీలో మంచిగా చదువు. దానితో ఒక ఉద్యోగమూ సంపాదించగలవు. ఆలోచించు.” అన్నాడుట. శర్మకి ఆ ఆలోచన నచ్చి, తానే నాన్నగారితో ఆయన ఒక్కడూ ఉన్నప్పుడు తనకు భాషాప్రవీణ చదవాలని ఉందని చెప్పాడుట. నాన్నగారు వినగానే బాగుందనటం, ఆయన దగ్గర భాషాప్రవీణ ఎంట్రన్స్ పరీక్షకి చదివి పాసుకావటం, భానుతో వెళ్ళి కొవ్వూరు కాలేజీలో చేరిపోవటం జరిగాయి. శర్మ ఆ విధంగా చదువులో చీకటి రోజులు అనుభవించి, స్వీయ నిర్ణయంతో అందులోనుంచి బయటపడ్డాడు.

శర్మ సంస్కృత కాలేజీ – కొన్ని ముచ్చట్లు -కొన్ని ఇక్కట్లు : సంస్కృత కళాశాలలో అతని చదువు బాగా సాగుతోంది. తెలుగు, సంస్కృతం అతనికి ప్రియమైన భాషలు. చెరువులో వదిలిన చేపలాగా చలాకీగా ఉన్నాడు . అది కో ఎడ్యుకేషన్ కాలేజీ. గాంధీగారిని అమితంగా అభిమానించి, ఆయన సిద్ధాంతాలను శిరసావహించే కె.వి.ఎన్. అప్పారావు గారు దాని ప్రిన్సిపాల్. శర్మ అలవాటుపడిన ఇంగ్లీషు కాలేజీ వాతావరణానికీ, దీనికీ చాలా తేడా వుంది. పంచెలు, చొక్కాలు, పిలక ,జుట్టూ,బొట్టుతో కొందరు విద్యార్థులూ, ఇంగ్లీషు హైస్కూలులో చదివి ప్యాంటు, షర్టుతో ఉండే కొందరు విద్యార్థులూ, తమ సహజమైన వేషంలో విద్యార్థినులూ శర్మకి కనిపించారు. పరిమితంగా SC విద్యార్థులు కూడా ఉండేవారు. ఈ భాషాప్రవీణ వారికి అందుబాటులోనిదని సామాన్య బ్రాహ్మణ కుటుంబాలనుంచి ఎక్కువగా చేరి చదువుకునేవారు. గర్నమెంటు స్టైఫండు పొందుతున్న విద్యార్థులు అధికంగా ఉండేవారు. అక్కడ తెలుగు, సంస్కృతం బోధించే ఉపాధ్యాయులు సమర్థులు, ప్రసిద్ధులైన పండితులు. సద్బ్రాహ్మణ వేషంలో వచ్చి కళాశాలలో కావ్య పాఠాలు, శాస్త్ర పాఠాలు బోధిస్తారు. శర్మ ఈ వాతావరణంలో ఇమిడేందుకు కొంత సమయం పట్టింది. బయట గది తీసుకుని ఉండేవాడు. ఇతని స్వభావానికి తగిన మిత్రుడు వేమూరి సత్యం. ఇద్దరూ సహాధ్యాయులని నాకు జ్ఞాపకం. శర్మ ఉన్నంతకాలం వారి స్నేహం కొనసాగింది.

తను ఆర్జించిన ఆధునిక సంస్కారంతో శర్మ కాలేజీలో చదువుతూనే, తన సాహిత్య వ్యాసంగం కొనసాగించాడు. వీలు చూసుకుని తన కథలు పత్రికలకు పంపేవాడు. రాసేవాడు. అవి ఎక్కువగా ఆంద్ర ప్రభ, ఆంద్ర పత్రికలలో వచ్చి, పాఠకుల అభిమానాన్ని పొందగలిగాయి. రచయితగా పేరు, గుర్తింపు వచ్చాయి. తన కాలేజీ అనుభవాలతో “తూర్పున వాలిన సూర్యుడు” అన్న నవల రాశాడు. దానివల్ల అతనికి నవలా రచయితగా కూడా పేరు వచ్చింది. ఆ నవలలో అక్కడి విద్యార్థుల కష్ట నిష్ఠూరాలు, సరదాలు, కోరికలు, ఊరిలో సంపన్న కుటుంబాలకు అంతఃకరణలో ఈ కళాశాలలో చదివే దిగువ తరగతి బ్రాహ్మణ విద్యార్థుల పట్ల గల తేలిక భావం బాగా చూపించాడు. కళాశాల విద్యార్థులందరూ పంచెలు కట్టుకుని తెలుగు చదువుకునే విద్యార్థుల్లా ఉండాలన్నది ప్రిన్సిపాల్ గారి నిర్బంధ నిబంధనని, దానిని తొలగించమని వేమూరి సత్యం మరికొందరు విద్యార్థుల్ని కలుపుకుని శర్మ చేసిన ప్రయత్నం గురించి ఈ నవలలో ఆసక్తికరంగా చెప్పాడు. ఈ ప్రయత్నం కాలేజీలో సంచలనం సృష్టించింది. శర్మ ప్రతిఘటనకి ప్రిన్సిపాల్ లొంగలేదు. అతనికి టి.సి ఇచ్చి కాలేజీ నుంచి బయటకు పంపించెయ్యాలనే తరుణంలో అప్పారావుగారికి అభిమాన పాత్రుడైన లక్ష్మణదాసు గారిని తెలుగు లెక్చరరుగా చేర్చుకోవటం జరిగింది. వారితో శర్మ ప్రతిఘటనని ప్రస్తావించగా, ఆయన “శర్మ విషయం నాకు వదలండి. నేను చూసుకుంటాను. నాతో ఉంటాడు. మన కళాశాల క్రమశిక్షణకు ఇతని కారణంగా భంగం రాదనీ హామీ ఇస్తున్నాను. అతను వస్తుతః మంచివాడే” అని చెప్పి ఆ చర్యని ఆపించారు. ఈ లక్ష్మణ దాసు గారు మంచి కవి. నాన్నగారికి మంచి మిత్రులు.

తణుకు అనుభవాలు, జ్ఞాపకాలు : నేను తణుకులో ఉద్యోగంలో చేరడానికి వెళ్ళే సమయంలో మా వదినగారి అన్నయ్య, రాజమండ్రీ స్టేషనులో వరహాలు అనే వ్యక్తిని పరిచయంచేసి, “ఇతను మీకు తణుకులో మా బంధువు నరసమాంబ గారిని పరిచయం చేస్తాడు. మీకు ఆ ఊరు కొత్త కదా. మీకు వారి సహాయం ఉంటుంది.” అని చెప్పాడు. నరసమాంబగారు హైస్కూలులో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తారని, కుటుంబంలో అందరూ సంగీత ప్రియులనీ, సినిమా సంగీతం, సాహిత్యం బాగా అభిమానిస్తారనీ వరహాలు చెప్పాడు. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. నరసమాంబ గారు మా కుటుంబం గురించి విని, సంతోషించి, అభిమానంగా మాట్లాడారు. “మీకు రూము దొరికే దాకా మా ఇంట్లో మాతో ఉండండి. మీకు రూము దొరికి వెళ్ళినా మా ఇంటికి వస్తూ ఉండండి. మీ వదిన పైపు బంధువులం కదా. అలా రావడం మాకు సంతోషం” అన్నారు ఆవిడ ఆదరంగా. ఐతే, రూము త్వరగానే దొరకడంతో నా మకాం అక్కడికి మారింది. నరసమాంబ గారికి నలుగురు మగ పిల్లలు- శివరాం, రఘురాం,సుందరరాం, కుమారస్వామి. ఇద్దరు ఆడపిల్లలు – జానకీబాల, వాణి. అప్పట్లో జానకీబాల నేపథ్య గాయని సుశీల దగ్గర సెక్రటరీగా మద్రాసులో పనిచేస్తోందని, ఎప్పుడైనా వీలు చూసుకొని వస్తుందని, ఆమె ఆర్థికంగా కుటుంబానికి సహాయపడుతుందని తెలిసింది. శివరాం ఆ ఊరి కోర్టులో స్టెనో. మిగతా పిల్లలు స్కూలు చదువుల్లో ఉన్నారు.

రఘురాం హార్టు పేషేంట్. స్కూలు చదువు పూరయినా ఇంట్లోనే ఉండిపోవలసిన అనారోగ్యం. అందరూ మంచి సంగీతజ్ఞానం ఉన్నవారు. సుస్వరంగా పాడగలరరు. ఇంట్లో నరసమాంబ గారు గాత్రం, వీణ పాఠాలు చెప్పేవారు. తన స్కూలులో చదువుకొనే విద్యార్థినులు, ఆమెకి తెలిసినవారి ఆడపిల్లలు ఇంటికి వచ్చి ఆవిడ దగ్గర నేర్చుకునేవారు. సాయంకాలం వేళలోనో, ఆదివారాలలోనో వారింటికి వెళ్ళేవాణ్ణి. ఇంట్లో సంగీత స్వరాలు, వీణానాదం ఆహ్లాదంగా వినిపించి మనసును కదిలించేవి. నరసమాంబగారు ఇంట్లో పనిచేసుకుంటూ చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేవారు. అది తమాషాగా, చూడముచ్చటగా ఉండేది నాకు. సీత అనే చిన్న అమ్మాయి, పదేళ్లు ఉంటాయనుకుంటాను, వీణ పాఠానికి వచ్చేది. వాళ్ళ పిల్లలూ, నేనూ సీత రావటం చూసి “అదిగో సీత వచ్చింది” అనగానే సిగ్గుపడి, చేతులలో మొహం దాచుకుని మధ్య గదిలోకి పరుగెత్తేది. శివరాంలో మంచి సంగీత దర్శకుని లక్షణాలుండేవి. బాగా పాడేవాడు. పాటలకు మంచి స్వర రచన చేసేవాడు. ఒకరోజు సీత రావటం చూసి, నేను అప్రయతంరంగా “ఓర తలుపులు తీసి, చిట్టి అడుగులు వేసి, చిన్నారి పాటలా సీత వస్తుంది. సీతతో పాటుగా కవిత వస్తుంది.” అన్నాను. శివరాం అది విని, పల్లవి బాగుందని, పాట పూర్తి చేస్తే ట్యూన్ చేసి పాడతాననీ అన్నాడు హుషారుగా. అలా ఆ ఇంట్లో నా మొదటి పాట పుట్టింది. పాట పూర్తి చేశాను. అన్నట్టే శివరాం స్వర రచన చేసి, ఇంట్లో పాడి వినిపించాడు. నరసమాంబ గారితో సహా అందరూ సంతోషించారు.

అలాగే, తమ్ముడు శ్రీకాంత శర్మ రాసిన కథలు పత్రికల్లో వస్తున్నాయని నరసమాంబగారి ఇంట్లో చదివి వినిపించాను. ఆ కథలు విని వాళ్ళు మెచ్చుకున్నారు. ఆ విధంగా సంగీత సాహిత్యాభిమానం కారణంగా నాకూ, తమ్ముడికీ వారి కుటుంబంతో అనుబంధం పెరిగింది. అందరం కలిసినప్పుడు సంగీత, సాహిత్యాలకు సంబంధించిన సంభాషణలు, వాద్య సంగీత ప్రయోగాలు, వాటి ప్రత్యేకతలూ – వీటి పైనే మా కబుర్లూ, కాలక్షేపం.

రాగము లెగసిన ఆశా వీధులు : తణుకులో ఉద్యోగంలో వచ్చే జీతంతో నాకు లోటు లేకుండా గడిచేది. జీవనం ప్రవాహంలా సాగుతూ ఉండేది. ఒక ఆదివారం ఎప్పటిలాగే నరసమాంబగారి ఇంటికి వెళ్ళాను. జానకీబాల మద్రాసు ఉద్యోగం విరమించుకుని వచ్చారట. నన్ను ఇంట్లో అందరూ ఆమెకు పరిచయం చేశారు. అప్పుడు జానకీబాల సీత పాట తాను కూడా విన్నానని, బాగా నచ్చిందని, ఇలా కలుసుకోవటం సంతోషంగా ఉందని చెబుతూ ఆప్యాయంగా పలకరించారు. ఆమె మాటతీరు, రూపం, తల్లి నుంచి వచ్చిన సంగీతం, స్నేహభావం, ఆమె ఇంటికి రాగానే అక్కడ కనిపించే సందడి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అంతరంగంలో ఇటువంటి అమ్మాయి జీవిత సహచారిగా వస్తే బాగుంటుంది కదా అనిపించింది. పత్రికల్లో మా తమ్ముడు రాసిన కథలు చదువుతానని, అవి తనకు బాలా నచ్చాయని చెప్పి అతని వివరాలు ఆసక్తిగా అడిగి తెలుసుకుంది. ఆమె చెల్లెలు వాణి కూడా చమత్కారంగా మాట్లాడుతూ ఉండేది. సీత పాటలో సీత, ఈ వాణి మంచి స్నేహితులుగా కనిపించేవారు.

ఒకసారి నా అనారోగ్యం వల్ల 4-5 రోజులు జానకి వాళ్ళింట్లోనే ఉండి, డాక్టరు గారిచ్చిన మందులు వాడుతున్నాను. ఒక ఆదివారం తమ్ముడు శర్మ కాకతాళీయంగా కొవ్వూరు నుంచి తణుకు వచ్చాడు. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు వీరి అడ్రస్ ఇచ్చాను. తణుకులో ఆ రోజు పెద్ద వర్షం కురిసి వెలిసింది. నరసమాంబగారి పిల్లల పాటలు, మాటలు శర్మ కబుర్లు, సరస సాహిత్య సంభాషణలతో ఆ సాయంకాలం గడిచిపోయింది. శర్మ ఇంట్లో అందరినీ బాగా ఆకట్టుకున్నాడనిపించింది. వాడి తరహాయే అలా ఉంటుంది. మా ఇంట్లోనూ అలాగే గలగలా కబుర్లు చెబుతూ సందడిగా ఉంటాడు. రాత్రి బాగా పొద్దుపోయింది. శర్మ, జానకి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. హాలులో పడుకుని, నిద్రపట్టని నాకు ఆ మాటలు వినిపిస్తున్నాయి. జానకి శర్మతో “మీరూ, మీ మాటలు, మీ రచనలు, ఆలోచనలు నాకు చాలా ఇష్టం. మీరు ఒక్క రోజులో నా మనసుకి చాలా దగ్గరయ్యారు. చిత్రం, మీ చిన్నన్నయ్య మీ కన్నా ముందు నుంచి తెలిసినా, మా ఫేమిలీ ప్రెండుగానే నాకు ఆయన కనిపిస్తారు. ఆయన సరదాగానూ, సైలెంటుగానూ ఉండేవారు. ఆయన పాటలు బాగా రాస్తారని, కవిగా ఆయనంటే అభిమానం మా ఇంట్లో అందరికీ. మీరు మీరే. ఆయన ఆయనే. మిమ్మల్ని మరిచిపోలేను” అంది. దానికి శర్మ “మిమ్మల్ని చూడగానే నాకూ మీ మీద అంత ఇష్టం కలిగింది. మీరు నాకు బాగా గుర్తుంటారు. మరచిపోను.” అన్నాడు. ఆ మర్నాడు శర్మ కొవ్వూరు తిరిగి వెళ్ళిపోయాడు. నేను కూడా తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాను.

కుటుంబంలో కలకలం : కొన్నాళ్ళకి కొవ్వూరు నుంచి శర్మ ఉత్తరం రాశాడు. అర్జంటుగా నా దగ్గరికి బయల్దేరి వస్తున్నానని, కొన్న విషయాలు నాతో ముఖాముఖీ మాట్లాడాలని. నేను నరసమాంబగారి ఇంటికి రెండురోజులుగా వెళ్ళలేదు వీలుకాక. శర్మ కొవ్వూరు నుంచి శనివారం రాత్రి నా రూముకి వచ్చాడు. కొన్ని కుశల ప్రశ్నలు వేసి, “ఇప్పుడు చెప్పు ఇంటి విషయాలు” అన్నాను. “చిన్నా, నేను ఈ నెల ఇంటికి వెళ్ళకముందే శివరాం మన ఇంటికి వెళ్ళి , నాన్నగారిని కలిసి, వాళ్ళమ్మగారి సలహా మీద తనని జానకీబాల అన్నయ్యగా పరిచయం చేసుకుని, వాళ్ళమ్మ గారి మాటగా మర్యాదపూర్వకంగా జానకీబాల పెళ్లి ప్రస్తావన తెచ్చి, మా ఇద్దరి పరిచయం ఉత్తరాలతో బాగా పెరిగిందనీ, మా అమ్మగారు మీతో మాట్లాడమని తనని పంపారని చెప్పాడట. నాన్నగారు అంతా విని, మా శర్మ భాషా ప్రవీణ ఆఖరి సంవత్సరంలో ఉన్నాడు. పరీక్షలు రాసి పాసవాలి. ఉద్యోగస్తుడుగా స్థిరపడాలి. ఇది నా అభిప్రాయమని మీ అమ్మగారికి చెప్పండి అన్నారట. మన అమ్మ చాలా కంగారు పడిందట ఈ పరిస్థితికి.

నాన్నగారు భాను అన్నయ్యతో ఈ విషయం చెప్పి, మన చిన్నాకి ఈ విషయం తెలియదంటావా? కావాలని ఊరుకున్నాడా? నేను ఆ మధ్య చిన్న ఉద్యోగ విషయంలో వాళ్ళ LO సురేంద్రకి (ఆయన పూర్వ విద్యార్థి) చనువుగా ఉత్తరం రాసాను . అది చిన్నాకి తెలిసి ఏమనుకున్నాడో? ఇంటికి శెలవుల్లో కూడా రాలేదు. నా పిల్లల వైఖరి, ఈ పరిస్థితి నాకర్థం కావటం లేదు. నేను శర్మని భాషా ప్రవీణ పూర్తిగా చదివించాలంటే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోవాలి. ఇది శర్మ భవిష్యత్తుని భగ్నం చేస్తుందని నా ఆవేదన. శర్మకి నా అభిప్రాయం స్పష్టంగా చెప్పు” అన్నారట. భాను నాకీ వివరాలు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పి, శర్మా! నాన్నగారు ఈ పరిస్థితిలో నీ చదువు విషయంలో కల్పించుకోరు. నువ్వు బాగా చదివి, ఈ భాషాప్రవీణ గట్టెక్కించు. నీ చదువుకి భంగం రాకుండా మిగతా విషయాలు చిన్నా, నేను చూసుకుంటాము. నువ్వు త్వరగా చిన్నను కలిసి, ఈ విషయాలన్నీ వివరంగా చెప్పు అన్నాడు. అందుకే ఇలా బయల్దేరి వచ్చాను.” అన్నాడు. అంతా విన్నాను.

అప్పుడు శర్మ మళ్ళీ కల్పించుకుని “నువ్వు మామూలుగా లేవు. ఏదో నిస్పృహ నీ కళ్ళల్లో. ఇంతవరకు నా దగ్గర ఏదీ దాచలేదు నువ్వు. ఏదైనా ఉద్యోగ సమస్యా?” అని అడిగాడు. దానికి నేను “అప్రియమైన సత్యం చెప్పకపోవటమే ఇద్దరికీ మంచిది. భాను అన్నట్లు నీ చదువు విషయంలో ఆర్ధిక సమస్యలు లేకుండా నేనూ, భానూ చూసుకుంటాము. పరీక్షలకి బాగా చదివి భాషాప్రవీణ సర్టిఫికేటు సంపాదించు. ఇంకో చిన్న మాట. నువ్వూ, జానకి అన్యోన్యమైన జంట కాగలరు. శుభం. ఇది మనకి పరీక్షా సమయం. చదువు మీద దృష్టి పెట్టు. సాధిస్తావు.” అని చెప్పాను. బాగా లేటయింది. లైటు ఆర్పాను. గదిలో చీకటి. ఇద్దరి అనుబంధంలోనూ చీకటి. మా గోదావరిలా నిద్ర ఇద్దరినీ మౌనంగా తనలోకి తీసుకుంది.

తరువాత కాలం అనుకూలించింది. శర్మ భాషాప్రవీణ పాసై సర్టిఫికెట్ సంపాదించాడు. మా తల్లితండ్రులు ఈ పెళ్ళికి సుముఖంగా లేరని నరసమాంబగారు గ్రహించారు. తణుకులో వారి నరసింహారావు గారు, సంగీత పాఠాల పరిచయంతో మంచి మిత్రులైన ఇంకొక కుటుంబం ఈ పెళ్ళికి సహృదయంతో సహకరించారు. శ్రీకాంత శర్మ, జానకీ బాల ఒక సుముహూర్తాన అగ్ని సాక్షిగా దంపతులయ్యారు.

పెళ్ళికి ఆప్త మిత్రులు బాపూజీ, అతని చెల్లెలు, శ్రీకాంత్ కాలేజీ మిత్రులు కొంతమంది, శ్రీ లక్ష్మణదాసుగారు, శ్రీ అనంతం అతిథులుగా వచ్చారు. అప్పటికే జానకీబాల ఆర్.టి.సి లో ఉద్యోగిని గనక తన స్టాఫ్ లో ముఖ్యులు వచ్చి, ఆశీస్సులు, అభినందనలు అందించారు. మా ఇంటినుంచి మా అన్నయ్య, వదిన వచ్చారు. హైదరాబాద్ నుంచి నేను వెళ్ళాను. ఆ సమయంలో శివరాం, సుందరం, నేను, హైదరాబాద్ లో వేరువేరు ఉద్యోగాలలో ఉన్నాం. ఈ పెళ్లికి వచ్చిన వారందరూ జానకీబాల పైన, శ్రీకాంత్ పైన, వారి కుటుంబం పైన ఉన్న ఆదరాభిమానాలు కారణంగా వచ్చి పాల్గొన్నవాళ్ళే.

జానకి బదిలీ మీద బెజవాడ రావడం, శర్మ బెజవాడలో ఆంధ్రజ్యోతి వార పత్రికలో సబ్ ఎడిటర్ గా ఉద్యోగంలో చేరడం, బెజవాడలో ఇద్దరూ స్థిరనివాసం ఏర్పరుచుకోవడం జరిగాయి. అప్పుడు నండూరి రామమోహన్ రావుగారు దినపత్రికలో, పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు వార పత్రికలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరే శ్రీకాంత శర్మని పరీక్షించి తీసుకున్నారట. అక్కడినుంచి శ్రీకాంత శర్మ జీవితం పత్రికా రచయితగా ఆరంభమై, మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. మంచి సాహిత్య వాతావరణంలో మనసుకు నచ్చిన మంచి మిత్రుల సహవాసంలో సాహిత్య రంగంలో ప్రతిభాశాలియైన కవిగా, రచయితగా గుర్తింపు పొందాడు. నాన్నగారి అభినందనలతో, శ్రీమతి జాంకీబాల సహకారంతో తన తొలి కావ్యం ‘శిలా మురళి ‘ అచ్చువేయడం జరిగింది. పత్రికలలో పదునైన విమర్శతో వ్యాసాలు వచ్చాయి. అనుభూతి వాదమన్న నవీన సాహిత్య దృక్పథం అవలంబించి కవిత్వంలోను, కథలు, నాటకాలు, నవలల్లోను శ్రీకాంత్ తనదైన స్థానం సంపాదించాడు. అతని సాహిత్య వ్యాసంగానికి బెజవాడ నివాసం చాలా దోహదం చేసింది.

ఆ తరువాత AIR లో ఉద్యోగం. ఉషశ్రీ, శ్రీకాంత్ AIR లో పనిచేసిన కాలం వారిద్దరికీ స్వర్ణయుగం. ఇద్దరూ స్టేషన్ డైరెక్టరు బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఎపిక చేసిన వాళ్ళే. ఇద్దరూ తమ ప్రతిభా పాటవాలతో సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రశంసలు అందుకున్నారు. శ్రీకాంత్ తన పాటలతో,   జాతీయ పురస్కారాలు అందుకున్నతన నాటకాలతో, వైవిధ్యభరితమైన కార్యక్రమాల రూపకల్పనతో AIR కూ తనకూ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసాడు.

చిత్ర పరిశ్రమలో జంధ్యాల స్నేహం, బాపూ రమణల పరిచయం శ్రీకాంత్ కి సినిమా పాటలు రాసే మంచి అవకాశాన్ని కల్పించాయి. జంధ్యాల గారి ప్రోత్సాహంతో ఆ రంగంలోకి వెళదామనుకున్నాడు. కానీ, ఆ రంగంలోని మాయా, మర్మం స్వానుభవంతో గుర్తించి, అందులో తను ఇమడలేనని గ్రహించి, మానుకున్నాడు. AIR లో ఉద్యోగంలో పదవీవిరమణకి ముందే ఆంద్రప్రభ సంపాదకునిగా అవకాశం వచ్చింది. హైదరాబాద్ లో ఆ బాధ్యత ప్రశంసాపాత్రంగా నిర్వహించి, హైదరాబాదులోనే పదవీవిరమణ అనంతరం స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. పిల్లలు మోహన కృష్ణ, కిరణ్మయి తలిదండ్రుల ప్రోత్సాహంతో అభిరుచికి తగిన పై చదువులు స్వదేశ, విదేశాల్లో చదివి, వారు కోరుకున్న రంగంలో రాణించి కీర్తిమంతులయ్యారు.

శ్రీకాంత్ శ్రీమతి జానకీబాల గురించి కూడా ఈ స్మృతులలో భాగంగా కొంత చెప్పాలి. స్వయంకృషితో, ఉత్తమ సాహిత్యాధ్యయనంతో కథా రచన చేసి, రచయిత్రిగా గుర్తింపు సాధించింది. తన కథలకి మంచి పురస్కారాలు, సాహితీవేత్తల అభినందనలను, ఆశీస్సులను అందుకుంది. ‘కనిపించే గతం’ అన్న నవలకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాన్ని, పాఠకుల ఆదరాభిమానాలను పొందింది. రచనా కౌశలం, వాస్తవ దృష్టి కలిగిన ప్రముఖ రచయిత్రిగా పాఠకుల దృష్టిలో నిలిచింది. పుట్టిన ఇంటినుండి వచ్చిన సంగీత కళలో ప్రావీణ్యం గడించి, ఆకాశవాణిలో గాయనిగా పేరుతెచ్చుకుంది.

శ్రీకాంత్, శ్రీమతి జానకీబాల తమతమ అభిమాన రంగాలలో అంకిత భావంతో కృషిచేసి, ప్రసిద్ధిని, రససిద్ధిని సాధించారని నాకనిపిస్తుంది.

హైదరాబాద్ లో తన అనారోగ్యానికి జరిగిన ఒక ఆపరేషన్ తట్టుకుని, బాగానే కోలుకుని, ‘ఉపనిషత్ కల్పవృక్షం’, ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ వంటి సుదీర్ఘ రచనలు శ్రీకాంత్ చేయగలిగాడు. సన్నిహిత మిత్రులు కోరగా పత్రికలకు రాయడం కూడా జరిగింది. తన అనారోగ్యానికి మంచి వైద్యం జరుగుతున్న సమయంలోనే, హఠాత్తుగా వచ్చిన స్ట్రోక్ కారణంగా శ్రీకాంత్ ఆఖరి ఊపిరి ఆగిపోయింది. శరీరాన్ని విడిచి, అందర్నీ విడిచి వెళ్ళిపోయాడు.

అలా తమ్ముడు శ్రీకాంత్ తన గదిలో, గోడ మీద ఛాయా చిత్రంగా నిలిచాడు. యాభై సంవత్సరాల సాహిత్య సేవ, సంచారం అతనిది. అక్షరాలా “సృజన”, “సమాలోచన” అన్న రెండు పుస్తక సంపుటాలుగా అతని గ్రంధాలయంలో ఒదిగిపోయాడు.

వేదికల మీద, ఆకాశవాణిలో వినిపించే ఆ కంఠస్వరం, రూపం కాలమనే కడలిలో ఏ దరికో, ఏ దీవికో చేరిపోయాడు. అతని సాన్నిహిత్యం పోయి, అతని సాహిత్యమే లోకానికి, నాకు మిగిలింది. నా అంతరంగంలో మధుర స్మృతిగా మిగిలిపోయాడు ‘చిన్న’తమ్ముడు శ్రీకాంత్.

*

 

ఐ.ఎస్. శాస్త్రి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలియని విషయాలు తెలిపారు శ్రీకాంత్ శర్మ గారి గురించి.

  • బాగుంది.
    చాలా బాగా రాసేరు. కొన్ని తెలిసినవి, ఇంకొచెం బాగాతెలిసేయి. తెలియనివీ చాలా తెలిసేయి.

    శ్యామ్

  • యాదృచ్ఛికమో… ఇంకోటో అవ్వొచ్చు. లాక్డౌన్ సమయం లో
    తమ్ముడు గురించి అన్నయ్య ఆప్యాయంగా చెప్పిన సంగతులు బాగున్నాయి.
    అయితే స్కిప్ చేయకుండా చెప్పిన ఒక విషయం ఆసక్తిగా అనిపించింది. ఆ విషయం తమ్ముడికి చెప్పారా? లేక మొదటిసారి ఇక్కడే ప్రకటించారా? కొద్దిగా సందేహం కలిగింది.

  • కొంచెం ఆలస్యం అయినా..

    నాకు ఎంతో ఆప్తులైన శ్రీకాంత శర్మ గారి ని మళ్ళీ గుర్తు చేసిన మంచి

    వ్యాసం. …

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు