ఒక కామ్రేడ్ బతుకు పుస్తకం!

నీ అస్తిత్వమే ఒక తిరుగుబాటు చర్య అనిపించేంత సంపూర్ణమైన స్వేచ్ఛతో జీవించడమే స్వేచ్ఛలేని ప్రపంచాన్ని ధిక్కరించే మార్గం – ఆల్బర్ట్ కామూ

భుజంమీద వెదురుబద్ద కావడితో అరకిలోమీటరు దూరం నడిచి తన గుడిసెదగ్గరికి రెండు బిందెల నీళ్లు మోస్తూ అతను వడివడిగా నడిచే వాడు. ఇల్లు చేరాక, ఇంటిపనులని త్వరత్వరగా ముగించుకుని, సైకిల్ తొక్కుకుంటూ గనులలో పనికి వెళ్ళేవాడు. అక్కడ బొగ్గుగనులలో కాంట్రాక్టుకార్మికునిగా పనిచేసేవాడు. చింద్వారా (మధ్యప్రదేశ్ ) బొగ్గుగనుల ప్రాంతంలో మన మిత్రుడు పి కె మూర్తి దైనందిన జీవితమిది. అవి, 1972 చలికాలపు రోజులు. అప్పుడే నేనాయనని కలవడానికి అక్కడికి వెళ్లాను. తన సహచరురాలు నీతాతో కలిసి, బొగ్గుగని కార్మికుల్ని కూడగట్టే ప్రయత్నాన్ని ఆయన అంతకుముందే ప్రారంభించాడు. అప్పుడు మూర్తి వయసు 31 సంవత్సరాలు. దృఢమైన దేహం, బలీయమైన వ్యక్తిత్వం కలగలిసిన మనిషి.

మార్చి 21, 2020 తేదీన ఆసుపత్రిలో వున్న తనని చూడడానికి మేము కొంతమందిమి పుదుచ్చేరి వెళ్ళాము. బాగా బలహీనమైనపోయి, బక్కచిక్కిన శరీరం. కళ్ళు తెరిచి చూడడం, మాట్లాడడం కూడా అతికష్టంగా వున్న పరిస్థితి. మమ్మల్ని గుర్తుపట్టాడు. ఏదో చెప్పాలని పెనుగులాడుతున్నాడు. నిస్సహాయంగా చేయి పైకెత్తి నోటిదగ్గరకి తెచ్చుకున్నాడు. ఏదో చెప్పాలి, మాట్లాడాలన్న తన నిస్సహాయ స్థితీ, తాపత్రయమూ కనిపిస్తున్నాయి. చిలీ గాయకుడు విక్టర్ హారా జైలులో రాయగా, పీట్ సీగర్ పాడిన పాటలోని పంక్తి ఒకటి గుర్తుకొచ్చింది. ఓ పాటా, పాడవలసిన సమయంలో నేను పాడలేకపోతున్నాను‘. వైద్యుడూ, తన బాల్య మిత్రుడూ తనని కాపాడడానికి శాయశక్తులా కృషి చేస్తున్నా, ఆ బాధ, పెనుగులాట ఇక ముగిసిపోక తప్పదేమో అనిపించింది. ఆ మరుసటిరోజే (మార్చి 22, 2020) ఆయన కన్నుమూశాడు. తన వయసు 80 సంవత్సరాలు.

 2018 సెప్టెంబరులో కొంతమందిమి మూర్తిని తన మొబైల్ ఫోన్ ద్వారా కాంటాక్టు చేయాలని ప్రయత్నించాము. అదే సమయంలో, చింద్వారా ప్రాంతంలోని తన సహచర కామ్రేడ్ ఒకరు మాకు ఫోన్ చేసి, మూర్తి హైదరాబాద్ లో వున్నాడా అని అడిగాడు. మూర్తి మామూలుగా సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ వచ్చేవాడు, కార్డియాలజిస్ట్ ని కలవడం కోసం. కానీ ఫోన్ చేసినప్పుడు తాను హైదరాబాద్ రాలేదు. అటు తాను పనిచేస్తున్న చింద్వారా లోనూ లేడు. ఫోన్ చేస్తే స్పందించడంలేదు. సెప్టెంబరు మధ్యలో మాకు తన నుంచి ఒక మెయిల్ వచ్చింది. మూర్తి తాను పుదుచ్చేరిలో ఒక ఆసుపత్రిలో ఉన్నాననీ, మూత్రకోశంలో క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారనీ అందులో రాశాడు. తనకి ఒక క్లిష్టమైన, సున్నితమైన శస్త్ర చికిత్స చేయనున్నారని తెలియజేశాడు. సన్నిహితమైన మితృలందరికీ ముందే వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నానని రాశాడు. అయినా, ముదిరిపోయిన నాలుగో గ్రేడ్ క్యాన్సర్ తో పద్ధెనిమిది నెలలపాటు పోరాడి నిలబడ్డాడు. ఇంకొకరెవరైనా, ఇంతకాలం పాటు బ్రతికే వారు కాదని డాక్టరు చెప్పారు.

మనిషి ప్రయాణం

పి కె మూర్తి గా మనందరికీ తెలిసిన ఎడ్మండ్ రతినె వియత్నాం దేశంలోని సైగాన్ నగరంలో 1941లో జన్మించాడు. తల్లిదండ్రులు – వలెంటిన్, లియాన్ రతినెలు. తండ్రి లియాన్ రతినె ఇండో-చైనాలోని ఫ్రెంచి వలస పోలీసు యంత్రాంగంలో ఒక అధికారిగా పనిచేసేవాడు. సాంప్రదాయిక మైన క్యాథలిక్ కుటుంబానికి చెందిన రతినె దంపతులకి కొడుకు మూర్తితో పాటు ఇద్దరు కూతుళ్లు. 1954లో ఆ కుటుంబం పుదుచ్చేరికి వచ్చేసింది. అప్పుడే పుదుచ్చేరి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా భారత దేశంలో భాగమైంది. అక్క డే, పుదుచ్చేరి లోని ఫ్రెంచి పాఠశాల లిసీలో మూర్తి చదువుకున్నాడు. పుదుచ్చేరిలో గడిపిన ఎనిమిది సంవత్సరాల కాలం మూర్తి జీవితంలో ముఖ్యమైనవి. మూర్తి భావాలని తీర్చిదిద్దడంలో ఆ ఎనిమిది సంవత్సరాల పుదుచ్చేరి జీవితం ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. తన మిత్రుడైన డాక్టర్ గారి ప్రకారం, విద్యార్థిగా మూర్తి మొండివాడు, ఆవేశపరుడు, ఎవరితోనైనా ఘర్షణకు సిద్ధంగా ఉండేవాడు. తాను ఒక ఫైటర్, ఎవరైనా బలవంత పెట్టినా, వత్తిడిచేసినా తేలికగా లొంగిపోయే రకం కాదు.

బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పెరియార్ నాయకత్వంలో సాగిన కుల వ్యతిరేక, ఆత్మ గౌరవ ఉద్యమం తనని చాలా ప్రభావితం చేసింది. తన భవిష్యత్ రాజకీయ అభిప్రాయాలకి రూపమిచ్చింది. బ్రాహ్మణిజాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించేవాడు, కుల అణచివేతపై చర్చలలో చాలాసార్లు ఎంతో ఉద్వేగంతో మాట్లాడేవాడు.1962లో ఇంజినీరింగ్ విద్యని అభ్యసించడానికి పారిస్ వెళ్లాడు. ఆ సమయంలో నిర్బంధ సైనిక విధులలో భాగంగా ఫ్రెంచి సైన్యంలో బాధ్యతపనిచేశాడు. అదే సంవత్సరంలో ఫ్రెంచి వలసవాదంనుంచి స్వాతంత్ర్యాన్ని సాధించిన అల్జీరియా యుద్ధంలో పాల్గొనకుండా నిరాకరించాడు. అందుకు ఆరునెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తరవాత సైనిక బాధ్యతలనుంచి విడుదలయ్యాడు. వలసవాదం, జాత్యహంకారాలని వ్యతిరేకించే క్రమంలో ఆయన ఫ్రాంజ్ ఫేనన్, మావో రచనలతో ప్రభావితమయ్యాడు. మే 1968 ఫ్రెంచి విద్యార్థుల తిరుగుబాటు ముందుకొచ్చేనాటికి తాను ఒక మార్క్సిస్టుగా మారాడు. విద్యార్థుల తిరుగుబాటుకు కేంద్రంగా వున్న సొర్బోన్ లో పరిశోధక విద్యార్థిగా చదువుతున్న మూర్తి, ఆనాటి తిరుగుబాటు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సంవత్సరంలో తాను ఇండియాకి తిరిగివచ్చాడు. ఒకసారి మూర్తిని భారతదేశానికి ఎందుకు తిరిగివచ్చావని ప్రశ్నిస్తే, 1967 నక్సల్బరీ వసంతకాలం మేఘగర్జనయే తనని ఇండియాకి రప్పించిందని సమాధానమిచ్చాడు.

1970లో తాను మొదటిసారి హైదరాబాద్ కి వచ్చాడు. తను, మా అక్క కి సోర్బోన్ స్నేహితుడు. 1968లో పారిస్ వదిలివచ్చిన తర్వాత నీతాతో కలిసి ముంబాయిలో వున్నాడు. 1970లో మొదటిసారి తను హైదరాబాద్ కి వచ్చినప్పుడు నేను మా ఇంట్లో కలుసుకున్నాను. కొన్ని రోజులు హైదరాబాద్ ఉన్నతర్వాత, బొంబాయికి వెళ్లి, మళ్ళీ నీతాతో కలిసి హైదరాబాద్ కి వచ్చాడు. 1971లో హైదరాబాద్ లో హిమయత్ నగర్ ప్రాంతంలో వాళ్ళు ఒక గది అద్దెకు తీసుకుని వున్నారు. జీవనోపాధి కోసం చెక్క వస్తువులు తయారు చేసే పరిశ్రమలో మూర్తి ఒక కార్మికునిగా పనిచేశాడు. అదే సమయంలో జార్జిరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులని కూడగడుతున్నాడు. మూర్తి జార్జిరెడ్డిని కలవాలని ఆసక్తి చూపించాడు. నాకు గుర్తున్నంత వరకూ, వాళ్ళు నాలుగైదు సార్లు కలుసుకున్నారు. వాళ్ళ చర్చలలో గెరిల్లా యుద్ధం, క్యూబా, చైనా, రష్యా విప్లవాల అనుభవాలు ప్రస్తావనకు వచ్చేవి. మూర్తి, నీతా ఇద్దరూ అప్పటికే మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాలకూ, ఆ ఉద్యమానికీ కట్టుబడినవాళ్లు గనుక, వాళ్ళు జార్జిని అటువైపు ఒప్పించడానికే ప్రయత్నించేవాళ్ళు. జార్జిరెడ్డి రాజకీయ అభిప్రాయాలు రూపొందుతున్న కాలం అది.

మార్చి 1972 లో మూర్తి, నీతా ఇద్దరూ హైదరాబాద్ వదిలి చింద్వారా బొగ్గుగనుల ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత, ఏప్రిల్ 14 న జార్జిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ వదిలి వెళ్ళేటప్పుడు, భవిష్యత్ సంప్రదింపులకోసం వాళ్ళు ఒక పోస్టల్ అడ్రస్ మాకు ఇచ్చి వెళ్లారు. జార్జిరెడ్డి హత్య, ఆ తర్వాత పరిణామాలగురించి వాళ్లకి ఒక వుత్తరం రాశాము. ఒక నెల తర్వాత మాకు జవాబు వచ్చింది. తన సూచన మేరకి, నేను 1972 సెప్టెంబరులో నేను చింద్వారా వెళ్ళాను, తనని కలవడం కోసం. తాను అప్పటికే ఒక గనిలో కార్మికునిగా చేరి పనిచేస్తున్నాడు.

దేశంలో బొగ్గు గనుల జాతీయకరణ క్రమం మొదలైన కాలమది. 1973 మే నెలలో బొగ్గుగనుల జాతీయకరణ చట్టం అమలులోకి వచ్చింది. మూర్తి ముందుగా ఒక లోడర్ గా చేరి, ఆ తర్వాత గనిలో కార్మికునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. గని కార్మికుల్ని మెల్లగా సంఘటితం చేయడం మొదలుపెట్టాడు. దీంతో, అధికారులు కార్మికులనుంచి తనని వేరు చేయడానికి, అకౌంట్స్ విభాగానికి బదిలీ చేశారు. మూర్తి అక్కడ కూడా అవకతవకల్ని ఎత్తి చూపించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అక్కడ బొగ్గుగనులలో బలంగా వున్న మాఫియా ముఠాల ఆగ్రహానికి గురయ్యాడు. మాఫియా బృందపు సభ్యుడొకరిని ఎదిరించి కొట్టడంతో కార్మికులలో మూర్తి పట్ల అభిమానమూ, ఆదరణా పెరిగేయి. తాను ప్రశ్నించే వాడు, ఎదిరించి నిలబడి పోరాడేవాడు. దీంతో కార్మికులకు మూర్తి నాయకుడయ్యాడు. జూన్ 1975లో ఎమర్జెన్సీ విధించారు. మూర్తి, నీతా ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ, ఇద్దరూ అరెస్టయ్యారు, మీసా చట్టం కింద నిర్బంధంలో వున్నారు. ఆ తర్వాత ఉద్యోగంనుంచి తొలగించడంతో, మూర్తి పూర్తికాలం కార్యకర్తగా మారిపోయాడు. నిజానికి ఆయన ఒక పూర్తికాలం కార్యకర్తే. అయితే, గని కార్మికుల్ని సంఘటితం చేయడం కోసం, అదీ తనకి తెలియని, తాను ఎవరికీ తెలియని ఒక కొత్త ప్రాంతంలో కార్మికుల్ని కూడగట్టడంకోసం తాను ఒక కార్మికునిగా చేరి పనిచేశాడు.

పారిస్ లో

ఎఐటియుసికి అనుబంధంగా ఉండిన ఒక కార్మిక సంఘంలో పనిచేస్తున్నప్పటికీ, ఆనాటికే తాను సిపిఐ(ఎం.ఎల్) సంస్థలో ఒక బాధ్యుడు. 48 సంవత్సరాలపాటు బొగ్గుగనుల ప్రాంతంలో పనిచేసిన మూర్తి అనేక కార్మిక పోరాటాలకి నాయకత్వం వహించాడు, అన్నిటిలో ముందు నిలబడ్డాడు. తాను ఆనాటి ఐ.ఎఫ్.టి.యుకి అనుబంధ సంఘమైన లాల్ జండా కోల్ మైన్ మజ్దూర్ యూనియన్ ని నిర్మించాడు. ఐ.ఎఫ్.టి.యు ఉపాధ్యక్షునిగా, ఆ తర్వాత ఎ.ఐ.ఎఫ్.టి.యు అధ్యక్షునిగా పనిచేశాడు. బొగ్గు గనుల ప్రాంతంలో నివసించి, ఆ కార్మికుల కోసం పనిచేస్తూనే, అనేక అంతర్జాతీయ వేదికలో చురుకుగా పనిచేశాడు. ప్రఖ్యాత ఆర్థికవేత్త సమీర్ అమిన్ ఆధ్వర్యంలో నడిచిన వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ లో సభ్యుడు.

2017లో తెలంగాణలో జరిగిన అంతర్జాతీయ గని కార్మికుల మహాసభలలో చురుకుగా పాల్గొన్నాడు. మూర్తి సోషల్ ఫోరమ్ సభలలో కూడా పాల్గొన్నాడు. 2004 లో పారిస్ నగరం లోజరిగిన యూరపియన్ సోషల్ ఫోరమ్ సభల సందర్భంగా జరిగిన ఒక సంఘటన గురించి మూర్తి మాకు చెప్పాడు. మూర్తి ఆ సభలలో కరపత్రాలని పంచుతూ వున్నాడు, అక్కడ తనకన్నా చిన్నవాడైన ఒక వ్యక్తి కూడా కరపత్రాలని పంచుతుంటే చూశాడు. తన ముఖకవళికలు భారతీయునిలా కనిపించడంతో మూర్తి ఆ వ్యక్తిని పేరు అడిగాడు. ఆ వ్యక్తి తన పేరు చెప్పడంతో, ఆతర్వాత సంభాషణల క్రమంలో అతను తనకు దూరపు బంధువు అవుతాడనీ, తన చెల్లెలు పారిస్ నగర శివార్లలోనే ఉందనీ మూర్తి తెలుసుకున్నాడు. కానీ, మూర్తి ఆవ్యక్తికి తానెవ్వరన్నది మాత్రం చెప్పలేదు. అప్పటికే తన తల్లి, అక్క చనిపోయారని కూడా మూర్తికి తెలిసింది. ఆ తర్వాత పారిస్ లో తన చెల్లెలు ఎక్కడ వున్నదో తెలుసుకుని, ఆమెని కలవడానికి వెళ్ళాడు. 36 సంవత్సరాల తర్వాత, అన్నాచెల్లెళ్ళు అలా కలుసుకున్నారు.

తన నివాసం, ఆఫీసు కలగలిసిన చిన్న ఇంటిని చూస్తే, తన గురించి తెలుస్తుంది. కష్టపడే మనిషి. తన గదినీ, వస్తువులనూ శుభ్రంగా, చక్కగా సర్ది ఉంచుతాడు. ప్రతీ వస్తువూ ఉండాల్సిన చోటులోనే ఉండాలి, అలాగే ఉంటుంది. తాను ఉతుక్కున్న బట్టలని చక్కగా మడత పెడతాడు, అవి ఇస్త్రీ చేసినట్లే ఉండేవి. అది కొంచెం అతి అనుకోవాలా? కానే కాదు. మూర్తి తన వస్తువులనీ, పరిసరాలనీ శుభ్రంగా, సర్ది వుంచుకోవడాన్ని వాళ్ళ అమ్మ దగ్గరనుంచి నేర్చుకున్నాడు. మూర్తి ఒక అద్భుతమైన వంటగాడు, చాలా ఇష్టంగా వంట చేసేవాడు. గాయకుడు కాకపోయినా పాటలు పాడడానికీ, నాట్యం చేయడానికీ అసలు సంకోచించేవాడు కాదు. 1968లో పారిస్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చాక, మూర్తి, నీతా ఇద్దరూ ఒకసారి పుదుచ్చేరిలోని ఇంటికి వెళ్లారు. కారణాలేమైనా, మూర్తి ఆ ఇంటికి మళ్ళీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. గడచిన పదేళ్లకాలంలో మూర్తి పుదుచ్చేరికి అప్పుడప్పుడూ వచ్చివెళ్లినా, తన పాత యింటికి మాత్రం వెళ్ళలేదు. పుదుచ్చేరిలో చికిత్స పొందుతున్న కాలంలో కూడా తమ పాత ఇంటికి వెళ్ళ నిరాకరించాడు.

మనం కామ్రేడ్ మూర్తి గురించి చెప్పుకున్న ఈ కథ, ఇంకొక మనిషి గురించి మాట్లాడుకోకపోతే అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఆ మనిషి తనతో పాటు పుదుచ్చేరి స్కూలు, కాలేజీలలో కలిసి చదువుకున్న సహాధ్యాయి, గాఢ స్నేహితుడు. 1968 తర్వాత, 2008 దాకా ఆ మిత్రునితో మూర్తికి ఎలాంటి సంబంధాలూ లేవు. 40 సంవత్సరాల తర్వాత, వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు. అంతకాలం తర్వాత కలుసుకున్నా వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహబంధమూ, అనుబంధమూ అలాగే నిలిచిఉన్నాయి. డాక్టర్ అయిన ఆ మిత్రుడే మూర్తికి చికిత్స అందించాడు. మూర్తి జీవితంలోని చివరి పద్ధెనిమిది నెలల కాలంలో పూర్తి సంరక్షణ బాధ్యతలు నిర్వహించాడు. మూర్తి పట్ల ఆయన చూపించిన ఆదరణ, అందించిన సంరక్షణ మరువలేనివి. ఆయనకు మనమంతా అభివాదం చేయాలి.

మూర్తి మరణంతో మనం ఒక మంచి స్నేహితుడిని, కామ్రేడ్ నీ కోల్పోయాము. అతనొక అద్భుతమైన, విలక్షణమైన వ్యక్తి. అసమానత, అణచివేతలతో నిండిన ప్రస్తుత సామాజిక ఆర్ధిక వ్యవస్థని విప్లవాత్మకంగా మార్చే పోరాట బలం ఆయనలో తొణికిసలాడేది. మూర్తి ఆ పోరాటాన్ని అమితంగా ప్రేమించిన వ్యక్తి.

హృదయాన్ని ఉండవలసిన స్థానంలోనే నిలుపుకున్న వ్యక్తిగా మూర్తి జీవితం విలువైనదనీ, ఆ జీవితాన్ని తాను ఉదాత్తంగా జీవించాడనీ ఒక మిత్రుడన్నాడు.

కవి మజాజ్ మాటలలో చెప్పుకోవాలంటే,

ఏదేమైనా, మేం వేకువ గురించి కలలుకనే సాహసం చేశాం

ఇప్పటిదాకా మనం చూసి ఎరగని సూర్యోదయం వైపు చూశాం

*

ప్రదీప్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Many thanks for sharing this interesting narrative of Com PK Murthy. As Pradeep titled we know PKMurthy was as an inspiring strong personality. Pradeep has brought several unknown and significant aspects of PK’s life close to our heart. Some times life seems to be terrible as it just lives on the memories of our relatives who are no more. It is always a challenge to express our gratitude for their love and friendship. Com. PK Murthy remains as an inspiring friend in our thoughts and actions. May his soul rest in peace. Best regards and love
    Suresh

  • మూర్తి జీవితం గురించి మాట్లాడుకుంటే కనిపించనీవీ, వినిపించనివీ తలుపుకు వస్తాయి.

    ‘హఠాత్తుగా , ఊహించని కదలిక, అతని చేయి
    నెత్తురు స్రవించకుండా గాయాన్ని అదుముకుంది
    మనకి మాత్రం తుపాకీ కాల్పుల మోత వినిపించనేలేదు
    దూసుకుపోయిన తూటా సవ్వడికూడా. కొంచెం సేపటి తర్వాత
    తన చేతిని దించి, చిరునవ్వు నవ్వాడు
    మళ్ళీ ఇంకొకసారి తన అరచేతిని
    అదే గాయంపైన ఉంచాడు, జేబులోనుంచి
    వెయిటర్ కి డబ్బులు చెల్లించి , బయటికి వెళ్ళిపోయాడు
    సరిగ్గా అప్పుడే చిన్న కాఫీ కప్పు పగిలిపోయింది
    ఆ చప్పుడు మాత్రం మనకు స్పష్టంగా వినిపించింది’
    – యానిస్ రిట్సాస్, గ్రీకు కవి

    మూర్తితో పరిచయం వున్నవాళ్లు తన వ్యక్తిత్వాన్ని పోల్చుకుంటారు. తాను ఎందరికో చిరకాలంగా తెలిసినా, తనగురించి తెలిసిన వాళ్ళు అతి కొద్దిమంది.

    మూర్తి మూర్తిత్వాన్ని ఆవిష్కరించిన ప్రదీప్ కి కృతజ్ఞతలు. ప్రచురించిన సారంగకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • చాలా బాగుంది కిరణ్ . ప్రదీప్ కు కూడాచెప్పిన . మూర్తి నాకు 1983-84 లో మొదటి సారి పరిచయం .అప్పుడు విజృంభణ కు నికరాగువా ఉద్యమాల గురించి సాండినిస్తా ఎఫ్ ఎస్ ఎల్ ఎన్ గురించి సి ఐ ఏ మద్దతుతో కుట్రపూరితంగా ఏర్పడిన కాంట్రా ల గురించి వాళ్ళ మధ్య యుద్ధం గురించి అక్కడ విఫలమైన సోషలిస్టు స్వప్నం గురించి సుదీర్ఘంగా దాదాపు మూడు నాలుగు గంటలు వివరించారు. అవన్నీ జీర్ణించుకుని నేను రాసిన వ్యాసం బాగుందన్నారు ఆంతా. తర్వాత ఎన్ వీ క్రిష్నయ్య ఎం పీ ఎన్నికల ప్రచారం కోసం కరీంనగర్ పోయినప్పుడు కలిశారు. అక్కడికి సుహాసిని మూలే నీతా కూడా వచ్చినట్టు గుర్తు. తిరుగు ప్రయాణంలో కారులో తనతో ప్రయాణం చేయడం మరచిపోలేని అనుభవం. ఎన్నెన్నో విషయాలు చెప్పారు. ప్రపంచ రాజకీయాలు, పోరాటాల గురించి ఒక కదిలే ఎన్సైక్లోపీడియా తను. ఫ్రెంచ్ విద్యార్ధి ఉద్యమంలో పాల్గొన్నాడని తెలిసి సోర్బోన్ లో చదివాడని తెలిసి అయన వినమ్రతను వినయాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యాను. ఇవాళ , ఏవో కొన్ని విషయాలు పైపైన తెలుసుకుని అన్నీ తమకు తెలుసు అని పోజులు కొట్టి తమ డొల్ల తనం కొట్టొచ్చినట్టు కనబడుతున్నా సిగ్గు ఎగ్గూ లేకుండా గొప్పలు చెప్పుకునే కొంతమందిని చూస్తుంటే మూర్తి చాలామంది అందుకోలేని ఉన్నతశిఖరాలకు ఎదిగిన మహోన్నత మానవీయ వ్యక్తిత్వం అన్నది సుస్పష్టం.
    ఒక అద్భుతమైన సారవంతమైన జీవితాన్ని అణచివేయబడిన ప్రజలకు అంకితం చేసిన గొప్ప కామ్రేడ్ మూర్తి. ఆయనకు కన్నీటి జోహార్లు.

  • మంచి ఉద్వేగ ,విప్లవ ఉత్సాహ జీవితం…మాణిక్యం.
    జోహార్ కామ్రేడ్ pk మూర్తి

  • స్వేచ్ఛలేని ప్రపంచాన్ని ధిక్కరించే మార్గం లో నడిచిన కామ్రేడ్ పి.కె. మూర్తి

    బొగ్గు గనుల కార్మికుల కోసం శ్రమించిన కామ్రేడ్.

    అసమానత, అణచివేతలతో నిండిన సామాజిక ఆర్ధిక వ్యవస్థని విప్లవాత్మకంగా మార్చే పోరాటం కోసం శ్రమించిన కామ్రేడ్ పి.కె. మూర్తి

    కామ్రేడ్ పి.కె. మూర్తి అమర్ రహే.

  • కామ్రేడ్ పి.కె. మూర్తికి ప్రదీప్ గారు సమర్పించిన ఉద్వేగభరిత నివాళి ( ఇంగ్లీషు లో ) కి లింకు

    https://www.cpimlnd.org/a-tribute-to-an-inspiration/

    A Tribute to an Inspiration

    PK Murthy—From Puducherry to Chindwara and Back\

    “ The only way to deal with an unfree world is to become so absolutely free that your very existence is an act of rebellion.” – Albert Camus

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు