ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్

మా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు ఉన్నత చదువుల ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం అంత సులువేం కాదు. పెళ్లితో కలిసి రావడం వలన నేను అప్పటి వరకూ కలత పెట్టిన తీవ్రమైన అప్పుల బాధ నుంచి విముక్తుడినయ్యాను. అలాగే కుటుంబ బాధ్యతలూ తీరాయి. ఇక నేను ఏదో ఒక అఫిలియేటెడ్ కాలేజీలో లెక్చరర్గా చేరి స్థిరపడాలని మావాళ్లు అనుకున్నారు. దానివల్ల నాకు జీవనోపాధి దొరుకుతుంది, భార్యకు వచ్చిన భూములను, వ్యవసాయాన్ని దగ్గరుండి చూసుకోగలనని వాళ్లు భావించారు. నా భార్య తరపు పెద్దలు కూడా అదే అనుకున్నారు.

కాని లెక్చరర్గా చేరడం, జీవితాన్ని నడిపించడం అనేదానికి నేను ముందునుంచీ వ్యతిరేకంగా ఉండేవాణ్ని. అలాగే వ్యవసాయ పనులను చూసుకోవడానికి నాకే శిక్షణా లేదు, అభిరుచి కూడా లేదు. అయితే వాటిని చూసుకోవడానికి పెద్ద శిక్షణంటూ ఏమీ అవసరం లేదని, కమ్మ కుటుంబంలో పుట్టినవాడు నీళ్లలో చేప ఈదినంత సులువుగా వ్యవసాయం చేసుకోగలడని పెద్దలు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో పి.హెచ్.డి. చెయ్యగలనన్న నా కలలు నెరవేరే అవకాశం లేదనిపించింది. అయినప్పటికీ మరొక్క ఏడాది చదువుకోవడానికి ఇంట్లోవారి అనుమతి సంపాదించుకున్నాను. అదే సమయంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒక ఏడాది కాలానికి డిప్లమా ఇన్ ఎకనామిక్ అడ్మినిస్ట్రేషన్ అనే కోర్సు ప్రారంభించింది. ఆ సంస్థ ఆ కోర్సును నిర్వహించడం అదే తొలిసారి. నాతోపాటు, మరో ఇద్దరు బి.ఏ. సహాధ్యాయులు ఆ కోర్సు చదవాలని నిర్ణయించుకున్నాం.

1953 జులైలో రంగయ్య, కూచి సూర్యనారాయణ, నేను విజయవాడలో రైలెక్కి ఢిల్లీకి బయల్దేరాం. గ్రాండ్ ట్రంక్ (జి.టి.) ఎక్స్ ప్రెస్ లో 40 గంటల ప్రయాణం. ఆ ట్రెయిన్ చాలా ఘనమైన చరిత్ర ఉంది. అది మద్రాసు నుంచి బయల్దేరి ఢిల్లీ, అంబాలా, అమృత్ సర్, లాహోర్, రావల్పిండిల గుండా ప్రయాణించి పెషావర్ చేరేది. మళ్లీ అటునుంచి బయల్దేరి ఇటు వచ్చేది. బ్రిటిష్ వారి కాలంలో అనేక స్థానిక యుద్ధాలు జరిగేవి. వాటిలో పాల్గొనే సైనికులను మద్రాసు పోర్టు నుంచి వాయవ్య అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల వరకు ఎక్కడ అవసరమైతే అక్కడకు చేరవెయ్యడానికి ఆ ట్రెయిన్ ఉపయోగపడేది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఆ ట్రెయిన్ అనేక ప్రాంతాలు, సంస్కృతులు, భాషలు, మతాలు, ఆహారాలు – వీటన్నిటినీ పరిచయం చేస్తూ భారతదేశంలో భిన్నత్వాన్ని ప్రతిఫలిస్తూ సాగిపోయేది. దేశవిభజన తర్వాత ఆ రైలు మద్రాసు నుంచి ఢిల్లీ వరకే వెళ్లడం మొదలుపెట్టింది.

మేం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మా భవిష్యత్తు ఏమిటో మాకే తెలియదు. ఏం చెయ్యబోతున్నాం, ఢిల్లీ చదువు ఏ పరిచయాలను తెస్తుంది, జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది – ఏమీ తెలియదు. మంచి ఆయుష్షు ఉండటం వల్ల ఈనాడు గడచిపోయిన సుదీర్ఘ జీవనయానాన్ని సమీక్షించుకుంటూ ప్రయాణం తొలి మెట్లను తరచిచూసుకునే అవకాశం కలుగుతోంది. ఎన్నోఏళ్ల తర్వాత మళ్లీ మేం ముగ్గురం కలిసి డిన్నర్ చేస్తూ ఆ తొలి ప్రయాణం గురించి ముచ్చటించుకున్నాం. తర్వాత చాలాసార్లు మేం ఆ ట్రెయినెక్కి ఢిల్లీ రాకపోకలు సాగించాల్సిన అవసరం కలిగింది. నేను అక్కడే చాలా ఏళ్లు ఉద్యోగం చేశాను, కూచి రాష్ట్రపతికి ప్రెస్ సెక్రటరీగా చేశాడు. రంగయ్య ఐపీఎస్ చేసి, తర్వాత రాజకీయాల్లోకి వెళ్లాడు. ఎన్నికల్లో గెలిచి పార్లమెంటు సభ్యుడయ్యాడు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో స్టేట్ మినిస్టరుగా పనిచేశాడు.

అప్పటివరకు నేను, కూచి సూర్యనారాయణ ట్రెయిన్లో ఒక రాత్రికి మించి ప్రయాణాలు చేసినవాళ్లం కాదు. కొత్త రంగయ్య మాత్రం ఆ వేసవిలో తోటి విద్యార్థులతో కలిసి కాశ్మీర్ వెళ్లొచ్చాడు. అందువల్ల ఆ ప్రయాణంలో అతనే మా నాయకుడు. మా జర్నీ కష్టమయిందనే చెప్పుకోవాలి. మాకు బెర్తులు దొరకలేదు, కాని మాలో ఉరకలెత్తే ఉత్సాహం వల్ల మాకది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. అనుక్షణం మారే దృశ్యాలను ఆసక్తిగా చూస్తూ, ప్రతిచోటా మేం చదివిన చరిత్రను మననం చేసుకుంటూ మాట్లాడుకున్నాం. భారతావని ఎంత విశాలమైనదో, ఎన్ని ఖండాలుగా ఉంటుందో గమనించే తొలి అవకాశం మాకు అలా కలిగింది. మొత్తానికి రెండోరోజు మేం ఢిల్లీ చేరాం.

అప్పటికి కొత్త రంగయ్య అన్నయ్య ఢిల్లీలోని (పూసా) ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో పనిచేస్తూ ఉండేవాడు. మేం అతనింటికి వెళ్లి నాలుగు రోజులుండి, ఢిల్లీని పరిచయం చేసుకుని తర్వాత కాలేజీకి వెళ్లి, హాస్టలుకు మారాలన్నది మా ఆలోచన. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మమ్మల్ని ఎందుకో నిరాశ పరిచింది. అది రెండు భాగాలుగా ఉంది. ఒకటి సామాన్య ప్రజానీకం కోసం. రెండోది సెర్మోనియస్ ప్లాట్ ఫామ్. అంటే కేవలం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సౌకర్యార్థం. రెండూ చిన్నవే సైజులో. కాని రైల్వే స్టేషన్నుంచి బయటకు రాగానే ఆ నగరం అబ్బురపరిచింది. మేం టాంగా (గుర్రబ్బండి) ఎక్కి పూసా వెళ్లాం. కొద్ది రోజుల్లోనే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాకు కేటాయించిన జూబిలీ డార్మెటరీకి మారిపోయాం. అది అధునాతన భవనం. కట్టి 5 ఏళ్లే అయింది. గదులు విశాలంగా, బయటకు చూస్తే పచ్చని బయళ్లతో ఆహ్లాదకరంగా ఉండేది.

******

అప్పటికి ఢిల్లీ విపరీతంగా మారుతోంది. 1848లో మానిఫెస్టోలో మార్క్స్ రాసినది –

“All fixed, fast frozen relations, with their train of ancient and venerable prejudices and opinions, are swept away, all new-formed ones become antiquated before they can ossify. All that is solid melts into air. All that is holy is profaned, and man is at last compelled to face with sober senses, his real conditions of life, and his relations with his kind.”

 

స్వాతంత్ర్యం తర్వాత ఆ సోబర్ సెన్సెస్ త్వరగానే ఊపందుకున్నాయి. దేశవిభజనకు భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ జరిగాయి. కాశ్మీర్లో యుద్ధం నడుస్తూ ఉండేది, దేశవ్యాప్తంగా ఆహార కొరత ఉండేది. అటువంటి గతాన్ని వదిలి భవిష్యత్తు వైపు బలమైన అడుగులు వెయ్యాలనే తీవ్రమైన వాంఛ దేశాన్ని ముందుకు నడిపించింది. పనికిమాలిన వాటిని తుంగలోకి తొక్కి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలనే ఒక వ్యక్తి దార్శనికతకు ఆ కాలం అద్దం పట్టింది. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారి నిర్బంధం కారణంగా అధిక సమయం జైళ్లలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనకు భారతీయ చరిత్రను ఆకళించుకుని విశ్లేషించే సమయం దక్కింది. దేశంలో ఏ విధమైన మార్పులకు శ్రీకారం చుట్టాలో ఆయన అప్పుడే ఒక బ్లూప్రింట్ తయారుచేసుకున్నట్టు తోస్తుంది.

భారతదేశ అభివృద్ధికి ఆయన ప్రతిపాదించిన ఫ్రేమ్ వర్క్ లో నాలుగు మూల సూత్రాలున్నాయి.

ఒకటి. దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలి, అలాగే నిలబడాలి. భారతీయులు సుదీర్ఘ కాలం ఇతరుల పరిపాలనలో మగ్గిపోయారు. తమనుతాము పరిపాలించుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. వేల ఏళ్లుగా మనుగడలో ఉన్న ఫ్యూడల్, కుల వ్యవస్థలు ప్రజాస్వామ్య లక్ష్యాలను సామాన్యులకు చేరువకానివ్వని ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని అధిగమించాలి. సమాజం పైన పొరలన్నిటినీ తొలగించుకొని వెళితే అట్టడుగున భారతీయ సమాజపు ప్రాధమికమైన పునాదులు, విలువలు కనిపిస్తాయి. వాటిని కాపాడాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించాలన్న స్పృహ ఆయనకు గట్టిగా ఉంది. ఎక్కువ అవకాశాలున్న కొందరు కొన్నిటిని తమ గుప్పిటపట్టడం జరుగుతుందనేదాన్ని ఆయన అప్పటికే గమనించగలిగాడు. దానికి విద్య మాత్రమే పరమౌషధమని ఆయన గుర్తించారు. దేశంలో అన్ని ప్రాంతాలకు, కులాలకు విద్య అందితే పరిస్థితులు మారుతాయని, సమాన అవకాశాలు, అభివృద్ధి సాధ్యమని ఆయన ఆలోచన.

రెండోది – ప్రభుత్వ పాత్ర పెరగాల్సిన ఆవశ్యకతను జవహర్ లాల్ నెహ్రూ గుర్తించారు. పౌరులకు అవసరమైన సేవలందించడానికి, కొద్దిమంది గొప్పవారి ఆధిపత్యం నుంచి సమాజాన్ని కాపాడటానికి అది ముఖ్యమని భావించారు. అందువల్లనే నూతన పారిశ్రామిక విధానానికి నాంది పలికారు. కార్మిక చట్టాలు బలోపేతం చెయ్యడం, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వెయ్యడం, రెగ్యులేషన్ యాక్ట్ అమల్లోకి తీసుకురావడం వంటివి చేయించారు. ప్రభుత్వాలు తమను తాము ఒక ప్రొవైడర్ గా, రెగ్యులేటర్ గా భావించుకోవాలని, అదే సమయంలో ప్రజలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదని ఆయన దృక్పథంగా ఉండేది.

మూడోది – ప్రభుత్వం విస్తరిస్తున్నప్పుడు నిజాయితీ, సమర్థత రెండూ నిండుగా ఉన్న సివిల్ సర్వీస్ అవసరమని నెహ్రూ తొలిరోజుల్లోనే గ్రహించారు. సమర్థత కాస్తోకూస్తో తక్కువైనా నిజాయితీ పుష్కలంగా ఉండాలన్న ధ్యేయంతో అడ్మినిస్ట్రేటివ్ నిబంధనలను మార్పించి 1951లో సివిల్ సర్వీసుల ప్రవర్తనా నియమావళి తీసుకొచ్చారు. అవి ఎలా రూపొందించారంటే – ఏ సివిల్ సర్వీసు అధికారి అయినా అవినీతికి పాల్పడటం అసాధ్యమనే తీరులో, అసలు ఆ ఆలోచనే కష్టమనేంత స్థాయిలో పకడ్బందీ చేశారు. వాటిలో భాగంగానే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆ వేసవిలో కొత్త కోర్సుగా ‘డిప్లమా ఇన్ ఎకనామిక్ అడ్మినిస్ట్రేషన్’ కు రూపకల్పన చేసింది. నేను చేరింది అందులోనే.

జవహర్ లాల్ నెహ్రూ దార్శనికతలో నాలుగో భాగం – స్వతంత్ర, సమర్థ న్యాయవ్యవస్థ. ఆయన విస్తృత అధ్యయనం ప్రకారం ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రతి అడుగులోనూ న్యాయం కనిపించాలి. ఆదేశిక సూత్రాలు, ప్రాధమిక హక్కులు – ఇవన్నీ అమలు జరగాలంటే బలమైన న్యాయవ్యవస్థ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సూత్రాలుగా చూసినప్పుడు ఇవి నాలుగూ అసాధారణమైనవి, అత్యవసరమైనవిగా జనాలకు అనిపించాయి. కాని వాటిలోనే వాటిని తారుమారు చేసే విత్తనాలున్నాయని ఎవరికీ తెలియలేదు. అప్పటికింకా ప్రతిపక్షాలకు చాలినంత బలం లేదు, అయినా అవి వీటిమీద ఎలా పోరాడాలో అని ఆలోచిస్తూ ఉండేవి. కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీల్లో అంతర్గత మథనాలు జరుగుతూ ఉండేవి.

అప్పుడే తొలి పంచ వర్ష ప్రణాళిక వచ్చింది. (1953). పార్టీల విధానాలు, ప్రణాళిక – ఇవి దేశంలోని మేధావుల మెదళ్లకు తగినంత మేతనిచ్చాయి.

*****

భారత దేశ చరిత్రను సొంతంగా అధ్యయనం చెయ్యడానికి ఢిల్లీ నగరం, దాని వాతావరణం గొప్ప అవకాశాన్నిస్తుందని మాకు ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గోపాల్ చెబుతూ ఉండేవారు. మేం వ్యక్తిగతంగానూ, స్నేహితులతో కలిసి ఢిల్లీ, న్యూఢిల్లీ లోపల్లోపల ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయన మాటల్లోని నిజమెంతో అర్థమయ్యేది. ఏ ప్రాంతాన్ని తీసుకున్నా అది బోలెడంత చరిత్ర చెబుతుంది. సాధారణంగా ఢిల్లీని ఒక నగరంగా చూస్తారు. అది పేరు మట్టుకే. మేం వెళ్లేప్పటికి అది రెండు మున్సిపాలిటీలుగా ఉండి, తర్వాత ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలోకి వచ్చాయి. రెండు వేల ఏళ్లుగా ఆ నగరం విస్తరించని రోజే లేదనిపిస్తుంది. పాలించిన ప్రతి రాజవంశమూ దాన్ని ఏదో ఒక తీరున కొత్తగా నిర్మించడానికి ప్రయత్నించింది. దాంతో ఢిల్లీ ప్రతిసారీ ఒక కొత్త నగరంగా రూపుదిద్దుకుంటూనే ఉంది.

(మహాభారత కాలం క్రీ.పూ. 3000 అని చరిత్రకారులు అంచనా వేస్తే, ఆ సమయంలో ఢిల్లీ ‘ఇంద్రప్రస్థం’ అనే నగరంగా ఉండేదని చెబుతారు. దానికి సంబంధించి లభ్య మైన ఆధారాలు తక్కువ. అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం 9 – 10 శతాబ్దాల్లో తోమార్లు పాలించినప్పుడు సూరజ్ కుండ్ (అనంగపూర్) రాజధాని. తోమార్ పాలకుడు అనంగపాల్ 1052లో ‘లాల్ కోట్’ నిర్మాణం జరిపాడు. తర్వాత వచ్చిన పృధ్వీరాజ్ చౌహాన్ 1180లో దాన్ని గట్టిచేశాడు. ఆయన సమయంలో దాన్ని ‘ఖిలా రాయ్ పిథోరా’ అనేవారు. ఇప్పుడు అది మెహ్రౌలీ ప్రాంతం. తర్వాత వచ్చిన బానిస వంశపు రాజులకూ అదే వేదిక. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యానికి వచ్చినప్పుడు మంగోలుల దండయాత్రలను తట్టుకొనేందుకు 1303లో ‘సిరి ఫోర్ట్’ ప్రాంతాన్ని నిర్మించాడు. తర్వాత వచ్చిన పాలకుడు ఘియాసుద్దీన్ తుగ్లక్. ఆయన తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని నిర్మించాడు 1320లో. ఖిలా రాయ్ పిథోరా, సిరి కోటల మధ్యనున్న ప్రాంతాన్ని కూడా ఆయనే అభివృద్ధి చేశాడు, దాన్ని జహాపనా అని వ్యవహరించేవారు. ఫిరోజ్ షా తుగ్లక్ పగ్గాలు చేపట్టినప్పుడు ఫిరోజాబాద్ గా విస్తరించాడు, ఆయన పేరుమీదున్న కోటను ఇప్పటికీ ‘ ఫిరోజ్ షా కోట్లా’గా వ్యవహరిస్తున్నారు. హుమయూన్ పూర్వపు ఇంద్రప్రస్థం ఎక్కడో అక్కడే తన కోట ఉండాలని ‘దిన్ పనా’ కట్టించాడు. షాజహాన్ తన పేరు మీద కట్టించిన నగరం షాజహానాబాద్. దీనికి చుట్టూ గోడలుండేవి, లాల్ ఖిలా (ఎర్ర కోట), చాందినీ చౌక్ వంటి ప్రాంతాలు ఈ నగరం లోపలే ఉండేవి. ఇప్పుడు వీటిని పాత ఢిల్లీగా వ్యవహరిస్తున్నారు.

ఆ రకంగా ఢిల్లీ అనేది సుమారు ఏడు నగరాల కలయిక అని స్థానికులు నమ్ముతారు. దక్షిణ, పశ్చిమ దిక్కుల్లోని ఆరావళి పర్వతాలు, తూర్పున యమునా నది ఆ నగరానికి హద్దులుగా ఉండేవి. పాలించిన ప్రతివారూ తమదైన నిర్మాణశైలిని ప్రతిబింబించేలా జాగ్రత్త పడ్డారనిపిస్తుంది అప్పటి కోట శిధిలాలు, భవనాలను చూస్తున్నప్పుడు. కొందరు ఉన్న నగరాన్ని ముట్టడించి కోటలు కడితే, మరికొందరు ముట్టడించకుండా ఉండేందుకు కోటలు కట్టారు. వాటిలో నివాస స్థలాలు, విజయ స్మారకాలు, సమాధులు, తోటలు – ఎన్నో.

మొఘలుల తర్వాత వచ్చిన ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వాలు తమ రాజధానిగా తొలుత కలకత్తా నగరాన్ని ఎంచుకున్నారు. కాని 19వ శతాబ్దం చివర్లో ఉవ్వెత్తున ఎగసిపడిన జాతీయోద్యమం ఫలితంగా లార్డ్ కర్జన్ నేతృత్వంలో బెంగాల్ విభజన జరిగింది. ఆ సమయంలో రాజకీయ, మతపరమైన కలహాలు రేగి, కలకత్తాలో బ్రిటిష్ అధికారులను హత్యలు చెయ్యడం పెరిగిపోయింది. వారిని సురక్షితమైన ప్రాంతాల్లో ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే మన దేశంలో ప్రజలు విదేశీ వస్తు బహిష్కరణ చేశారు. దాంతో అప్పటి ప్రభుత్వం ఒకవైపు బెంగాల్ ను తిరిగి ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తూ, మరోవైపు అల్లర్లు నివారించడానికి, పరిపాలనలో సౌలభ్యానికి కూడా రాజధానిగా ఢిల్లీ ఉంటే బాగుంటుందని ఆలోచించింది.

1911లో ఢిల్లీ దర్బార్ పేరిట పెద్ద సభ జరిపి, కొత్త ఢిల్లీ నగర నిర్మాణానికి ఎంపరర్ జార్జ్ 5, ఆయన భార్య క్వీన్ మేరీ శంకుస్థాపన చేశారు. సర్ ఎడ్విన్ ల్యుటెన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ అనే ఇద్దరు ఆర్కిటెక్టుల సారధ్యంలో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 1931 ఫిబ్రవరి 13న కొత్త రాజధాని ప్రారంభోత్సవం అప్పటి వైస్రాయి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా జరిగింది. ఇప్పటికీ కొత్త ఢిల్లీని కొందరు ‘ల్యుటెన్స్ ఢిల్లీ’ అంటారు వ్యవహారంలో.

వాళ్లు మొదట కట్టిన భవనాలన్నీ మొఘల్ నగరానికి ఉత్తరంగానే. మొదట బ్రిటిష్ రెసిడెంట్ మెట్ కాఫ్ యమునా నది ఒడ్డున సువిశాలమైన బంగళా కట్టుకున్నాడు. ఢిల్లీలో నివాసం ఏర్పర్చుకున్న తొలి బ్రిటిష్ అధికారి ఆయనే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ బంగళా ఐ.ఎ.ఎస్.ల శిక్షణకు వేదికగా మారింది. బ్రిటిష్ వారు కొత్త రాజధాని కట్టాలనుకున్నప్పుడు మెట్ కాఫ్ కు సమీపంగా ఇంకాస్త ఉత్తరానికి వైస్ రీగల్ లాడ్జితో నిర్మాణాలు ప్రారంభించారు.

రైసీనా కొండల్లో ఒక శిఖరం మీదనున్న మేవాట్ గ్రామాన్ని ఖాళీ చేయించి అక్కడ వైస్రాయికి ఇల్లు కట్టే పని ప్రారంభించారు ల్యుటెన్స్ బృందం. అక్కడే ఎందుకంటే, తూర్పు ముఖంగా, పూర్వపు ఇంద్రప్రస్థం, అప్పటి దిన్ పనా కోటకు అభిముఖంగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అదే ఇప్పుడు మనకు రాష్ట్రపతి భవనమయింది. రైసీనా హిల్స్ లో బంగళాలు, సువిశాలమైన రోడ్లు, చెట్లు – అప్పుడు వచ్చినవే. తర్వాత ఉత్తర – దక్షిణాలకు మధ్య ఇరుసుగా కనిపించేలా మొదటి ప్రపంచ యుద్ధ స్మారకం ‘ఇండియా గేట్’ను, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉన్న మార్గాన్ని ‘కింగ్స్ వే’ ( రాజ్ పథ్)గానూ నిర్మించారు. రాజ్ పథ్ కు సమాంతరంగా ఉన్న ‘సంసద్ మార్గ్’ చివరకు నేడున్న సెక్రటేరియెట్ భవనం, పార్లమెంటు భవనాలను ఆర్కిటెక్ట్ బేకర్ సారథ్యంలో నిర్మించారు. వీటి డిజైన్ ను ఆయన యధాతథంగా దక్షిణాఫ్రికా ప్రిటోరియాలోని స్టేట్ హౌస్ కోసం కూడా ఉపయోగించాడు.

దేశం నలుమూలల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చేవారి నివాసాల కోసం లోఢీ గార్డెన్స్ పక్కన లోధీ కాలనీ, బొంబాయి, మద్రాసు ప్రావిన్సుల నుంచి వచ్చిన వారి కోసం గోల్ మార్కెట్ సమీపంలో మరో కాలనీ కట్టారు బ్రిటిష్ వారు. అక్కడితో వారి శకం ముగిసిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం భారీగా చేపట్టిన నిర్మాణం ఏదంటే చాణక్యపురి ప్రాంతం. అక్కడ వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు, ఛాన్సెరీలు, హైకమిషన్స్, దౌత్యవేత్తల నివాసాలు ఏర్పడ్డాయి. మనకు స్వాతంత్య్రం వచ్చాక ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అయింది, నగరం అన్నివైపులా విస్తరించడం ప్రారంభించింది. 1915 తర్వాత వచ్చిన రాజస్థానీ భవన నిర్మాణ కార్మికులు తరాల తరబడి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే అవసరమే కలగనంతగా ఢిల్లీ విస్తరిస్తూ వచ్చింది.

నగరం పెరుగుతున్న కొద్దీ అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వలస వచ్చినవారితో వివిధ ఉప సంస్కృతుల సమ్మిశ్రమంగా మారింది ఢిల్లీ. స్వాతంత్య్ర సమయం వరకూ ఢిల్లీ, న్యూఢిల్లీ రెండూ చిన్న నగరాలే. దేశ విభజన తర్వాత పశ్చిమ పంజాబ్ నుంచి వచ్చిన వలసలతో అది అకస్మాత్తుగా పెరగడం మొదలైంది. శరణార్థుల కోసం నగరానికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో పెద్ద కాలనీలు ఏర్పడ్డాయి. వారికి ఉపాధి కల్పన పెద్ద ప్రశ్న అయి కూర్చుంది. దానికి పరిష్కారంగా ఒకప్పటి క్వీన్స్ వే, ఇప్పటి జన్ పథ్ – పంచ్ కుల్ రోడ్డులో దుకాణాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో అవి తాత్కాలికం అనుకున్నారు. కాని ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయి. పాక్ శరణార్థులు లాహోరును పోలి ఉండే ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని తమ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. పాకిస్థాన్, పంజాబ్, హరియాణా, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ – ఒకటేమిటి, దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి వెళ్లి దాని సంస్కృతిని సుసంపన్నం చేశారని చెప్పుకోవచ్చు. అప్పట్లో దక్షిణాదిలో నాలుగు వేర్వేరు రాష్ట్రాలు, నాలుగు భాషలు, నాలుగు సంస్కృతులూ ఉన్నాయన్న వాస్తవం అక్కడివారికి తెలిసేది కాదు. అందరికీ కలిపి మద్రాసు ప్రావిన్సుకు చెందినవారు కనక మద్రాసీలనే వ్యవహరించేవారు.

1911 – 37 మధ్యన బ్రిటిష్ వారు ఉపయోగించిన వైస్ రీగల్ లాడ్జిని 1940లో స్థాపించిన ఢిల్లీ యూనివర్సిటీకి కేంద్ర భవనంగా వాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత నగరంలో అక్కడక్కడా ఉన్న కాలేజీలన్నిటినీ ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోకి తరలించారు. సెయింట్ స్టీఫెన్స్, హిందూ, రమ్ జాస్, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, మిరాండా హౌస్ – వంటివన్నీ కొద్ది కాలంలోనే అక్కడికి తరలిపోయాయి. అప్పటికి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు ప్రత్యేకంగా భవనం అంటూ ఏదీ లేదు. ప్రోబిన్ రోడ్డులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ భవనంలో కొంత భాగాన్ని దీనికి కేటాయించారు.

ఇటువంటి నేపథ్యంలో మేం అక్కడ చదవడానికి వచ్చి వాలాం.

*****

ఒక విద్యావేత్త దార్శనికత, స్వప్నాలకు ఒక ప్రధాన మంత్రి సహకారం తోడయితే ఉన్నత స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు కష్టమేం కాదనడానికి నిదర్శనం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఆ విద్యావేత్త ప్రొఫెసర్ వి.కె.ఆర్.వి.రావు. పూర్తి పేరు విజయేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు. 1908 జులై 8న తమిళనాడులోని కాంచీపురంలో పుట్టారు. బొంబాయి యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో ఎమ్.ఎ. చదివిన ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పి.హెచ్.డి. చేశారు. మొదట కొంత కాలం బొంబాయిలోని విల్సన్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేసిన ఆయన తర్వాత కర్ణాటకలోని ధార్వాడలో, వాల్తేరులోని ఆంధ్రా యూనివర్సిటీలో (1936 – 37) పనిచేశారు. చిన్న ప్రదేశాల్లో అధ్యాపకుడిగా ఉండిపోవాల్సిన వ్యక్తి కాదు ఆయన. ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా చేరిన ఆయనకు ఆ నగరం బోలెడన్ని అవకాశాలను ఇచ్చింది. ప్రపంచంలో అత్యున్నత విద్యాలయాలకు దీటుగా సామాజిక, ఆర్థిక శాస్త్రాల అధ్యయనానికి ఒక కేంద్రం మన దేశంలో ఉండాలన్నది ఆయన సంకల్పం. దానికి నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తోడయ్యారు. వారిద్దరి కృషి ఫలితంగా ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్, సోషియాలజీ, జాగ్రఫీ, కామర్స్ విభాగాల కోసం ప్రత్యేకంగా ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ 1949లో ఏర్పాటయింది. ఇది మౌరీస్ నగర్ లోని ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ లో ఉంది. దానికి తొలి డైరెక్టర్ గా ప్రొఫెసర్ వి.కె.ఆర్.వి. రావు వ్యవహరించారు, ఆ తర్వాత ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వైస్ ఛాన్సలర్ ( 1957 – 60)గా పనిచేశారు.

ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మాత్రమే కాకుండా, ఢిల్లీలో ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, బెంగళూరులో ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛేంజ్ అనే మరో రెండు సంస్థలు ప్రాణం పోసుకోవడానికి కూడా ఆయనే ఆద్యులు. బొంబాయిలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ వంటి స్థాపనకు చాలా కృషి చేశారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ వంటి సంస్థలను బలోపేతం చేసింది ఆయనే. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ మెంబర్, ట్రాన్స్ పోర్ట్ అండ్ షిప్పింగ్, ఎడ్యుకేషన్ అండ్ యూత్ సర్వీసెస్ మంత్రిగా పనిచేశారు. షిప్పింగ్ మినిస్టర్ గా కొత్త నౌకల నిర్మాణానికి, మంగుళూరు, ట్యుటికోరన్, కొచ్చిన్ వంటి నౌకాశ్రయాల అభివృద్ధికి, పోర్టులు – రహదారుల అనుసంధానానికి కృషి చేశారు. 1974లో పద్మ విభూషణ్ అందుకున్నారు. దాదాపు 40 పుస్తకాలు, మోనోగ్రాఫులు, 210 ఆర్టికల్స్, 68 సెమినార్ పేపర్లు… ఎన్ని రాశారో తల్చుకుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ఎనభై మూడేళ్ల వయసులో1991 జులై 25న మరణించారు.

ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (డి.ఎస్.ఇ)లో మేం చేరినప్పటికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 30మంది పరిశోధక విద్యార్థులు ఉన్నారు. అయితే, అప్పటికి సంస్థ ప్రారంభించి నాలుగేళ్లయినా ఒక్కరు కూడా పి.హెచ్.డి. పట్టా అందుకోలేదు. 1953లో మరో రెండు కోర్సులు పెట్టారు. అప్పట్లో అది ఢిల్లీ యూనివర్సిటీలో ఒక విభాగమా, లేదా సొంతంగా ఎదగాల్సిన ఒక సంస్థనా అన్న విషయం మీద కొంత గందరగోళం ఉండేది.

అయితేనేం, ఫ్యాకల్టీలో గొప్పవారుండేవారు. ప్రొఫెసర్ వి.కె.ఆర్.వి.రావు స్వయంగా మంచి అధ్యాపకులు. అయితే మేం చేరినప్పుడే ఆయన ప్రభుత్వం నియమించిన టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ సభ్యులయ్యారు. అందువల్ల మాకు క్లాసులు తీసుకోలేదుగాని ప్రతి ఉదయం ఆయన స్కూలుకు సుడిగాలి వచ్చినట్టు వచ్చేవారు. చాలా వేగంగా నడిచేవారు, వరండాల్లో ఉన్నవారిని పలకరించేవారు. ఆఫీసు, ఫ్యాకల్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేవారు. వివేకానందుడి ఆదర్శాలను ఒంటపట్టించుకున్న ఆయన తరచూ విద్యార్థులతో మాట్లాడేవారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలు వెల్లివిరియాలని ఆకాంక్షించేవారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని కామన్ రూమ్ నుంచి పొందిన స్ఫూర్తితో స్కూల్లో ఫ్రెటర్నిటీ రూమ్ ప్రారంభించారు. అక్కడ ఫ్యాకల్టీ, విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగే సౌలభ్యం ఉండేది. వారి మధ్య దూరం తగ్గేది.

వి. కె.ఆర్.వి. రావు తర్వాత చెప్పుకోదగిన ఫ్యాకల్టీ సభ్యులు, సీనియర్ మోస్ట్ బి. ఎన్. గంగూలీగారు. ఆయన చాలా నెమ్మదస్తులు, మృదుభాషి. ప్రొఫెసర్ రావు కరుకైన కామెంట్ల దెబ్బ తగిలినవారికి గంగూలీగారి మాటలు లేపనంలా ఉండేవి. రావుగారిలో ఓపిక, సహనం తక్కువ. గంగూలీగారిలో అవి పుష్కలం. వారిద్దరి కాంబినేషన్ లో స్కూల్ బాగా నడిచేది. గంగూలీగారు ఇంటర్నేషనల్ ట్రేడ్ సబ్జెక్టులో నిపుణులు. అది మా సిలబస్ లో లేదు. అందువల్ల మేం వారిని కలిసింది తక్కువ.

డిప్లొమా కోర్సుకు అధ్యాపకులు కె.ఎన్.రాజ్, పి.ఎన్. ధర్, ఎస్.పి.నాగ్ గార్లు. వీరిలో కె.ఎన్.రాజ్ గారు అప్పటికే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, మానెటరీ పాలసీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఇండియా వంటి పుస్తకాలు రాసి ప్రసిద్ధులైన వారు. కాని ఆయన కూడా మాలాగే అప్పుడే చేరారు స్కూల్లో, అధ్యాపకుడిగా. మాకు ఎకనామిక్ ప్లానింగ్ ప్రిన్సిపుల్స్ బోధించేవారు. మొదట్లో కొద్దివారాలు కొద్దిగా ఆదుర్దాగా కనిపించేవారు. మేం క్లాసులో ఉన్నది 30మంది కన్నా తక్కువే. అయినా ఆయన భయం తగ్గేది కాదు. ప్రతి అంశం గురించి బోలెడంత నోట్సు రాసుకుని వచ్చేవారు, దాన్ని చదివేవారు. ఆయన ఆర్థర్ లూయీస్ రాసిన ‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్’ పుస్తకాన్ని ఫాలో అయ్యేవారు. నేను ఏయూ విద్యార్థిగా ఉన్నప్పుడే దాన్ని చదివాను. దానికి వ్యతిరేకంగా ప్రోజుకెస్ రాసిన ‘ఆర్డీల్ ఆఫ్ ప్లానింగ్’, హయెక్ రాసిన ‘ద రోడ్ టు సెల్ఫ్ డమ్’ వంటివి కూడా చదివాను. రాజ్ గారు ప్లానింగ్ లో తన అభిప్రాయాల పట్ల నిక్కచ్చిగా ఉండేవారు. వ్యతిరేక అభిప్రాయాలను పట్టించుకునేవారు కాదు.

పి.ఎన్.ధర్ గారు మాకు ఎకనామిక్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ సబ్జెక్టును బోధించేవారు. అప్పటికాయన ఒక విదేశీ ప్రొఫెసర్ తో కలిసి చిన్న పరిశ్రమల మీద పుస్తకం రాసే పనిలో ఉండేవారు. కాని ఆయనకు మూడ్స్ తర్వగా మారిపోతూ ఉండేవి. కొన్ని రోజులు చాలా హాయిగా, విశ్లేషణాత్మకంగా, సబ్జెక్టును ఒక సర్జన్ లాగా చెప్పేవారు. మరికొన్ని రోజులు చాలా డల్ గా, విద్యార్థుల వైపు చూడనైనా చూడకుండా చెప్పుకుంటూ పోయేవారు. కమ్యూనిస్టు పార్టీతో తిరుగుతారని, ప్రతిదానిమీదా రాజ్యానికే అధికారం ఉండాలని నమ్ముతారని ఆయన గురించి ప్రచారంలో ఉండేది. 2000లో ఆయన ఆత్మకథ రాశారు. దానిలో ప్రైవేటు రంగానికి తాను అనుకూలమని పాఠకులను నమ్మించే ప్రయత్నాలు చేశారు. లేదా మరి అప్పట్లో ఆయన విప్లవాత్మక ధోరణిని మేమే అర్థం చేసుకోలేకపోయామేమో.

మా కోర్సుకు సంబంధించి రోజువారీ వ్యవహారాలు యువ లెక్చరర్ ఎస్.పి.నాగ్ గారి చేతుల మీదనే నడిచేవి. ఆయన అప్పుడే హేగ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి వచ్చారు. ఇంకా పి.హెచ్.డి. పట్టా చేతికి రాలేదు. ఆయనకు ఎకనామిక్స్ సబ్జెక్టులో పెద్ద ఇంట్రెస్టు కూడా లేదు. ఆయన అపాయింట్ మెంట్ ఆయనకూ, మాకూ కూడా ఆశ్చర్యమే. ఎ.డి. గొర్వాలా, పాల్ ఆపిల్ బీ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద రాసిన పేపర్లను విశ్లేషించడంలోనే ఆయన ఎక్కువకాలం గడిపేవారు. అప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న కొందరు సహాధ్యాయులు ఆయనకు సాయం చేసేవారు.వారి అనుభవాలు మాకెంతో విలువైనవిగా తోచేవి.

ఇవిగాక మేం లేబర్ రిలేషన్స్, స్టాటిస్టిక్స్ చదవాల్సి వచ్చేది. కోర్సు ప్రారంభించిన తొలి ఏడు అదే కావడంతో సిలబస్ మీద ఫ్యాకల్టీకి కూడా పెద్ద పట్టు లేదనిపించేది. ప్రతి ఏటా చలికాలంలో విదేశీ ప్రొఫెసర్లు వచ్చి ఒక ఏడాది గడిపే అవకాశం ఉండేది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో . మేం ఉన్నప్పుడు లండన్ స్కూల్ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రొఫెసర్ రాబ్సన్ వచ్చారు. పొడుగ్గా, హుందాగా ఉండేవారు. జాతీయ పరిశ్రమల నిర్వహణ రంగంలో ఆయనకు గొప్ప పట్టుంది. క్లాసుకు చాలా సూక్ష్మ స్థాయిలో ప్రిపేరయి వచ్చేవారు. ఆయన జేబులో పాకెట్ వాచీ ఉండేది. ఆయన దాన్ని ఎప్పుడూ తీసి చూసేవారు కాదు. కాని క్లాసు సరిగ్గా 45 నిమిషాలే చెప్పేవారు. అది మాకు ఆశ్చర్యంగా ఉండేది. జాతీయీకరణ రంగంలో భవిష్యత్తులో మేం ఎదుర్కోబోయే సవాళ్ల గురించి చర్చించేవారు. మితిమీరిన ఉత్సాహం మంచిది కాదేమో తరచి చూసుకోవాలని హెచ్చరించేవారు.

క్లాసురూమేగాక,   ఢిల్లీలోని పుస్తక దుకాణాలు కూడా మా అధ్యయనానికి బోలెడన్ని అవకాశాలిచ్చేవి. విశాఖపట్నంలో పుస్తకాల దుకాణమంటే కేవలం ప్రిస్క్రయిబ్ చేసిన పాఠ్యపుస్తకాలు కొనుక్కోవడానికే. అదికూడా కేవలం వాటి పేరు చెప్పి కౌంటర్ లో అడగాలి, ఉంటే ఇస్తారు లేదంటే లేదు. కాని ఢిల్లీ దీనికి వ్యతిరేకం. అక్కడ కొత్త కొత్త పుస్తకాలుండేవి, వాటి దగ్గరకు వెళ్లి చూడొచ్చు, ఏమేం కొనాలో నిర్ణయించుకోవచ్చు, చర్చించుకోవచ్చు. మా రాజధాని జీవితాన్ని ఆ షాపులు సుసంపన్నం చేశాయి, మా చదువులో అవీ ఒక భాగంగా మారాయి.

********

వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరిన కొత్తలో హాస్టల్లో ఆహారవిహారాలకు కొంత ఇబ్బంది పడినట్టుగానే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హాస్టల్లో కూడా మాకు కొంత ఇబ్బంది తప్పలేదు. అక్కడ తిండి తగినంత దొరికేది కాదు, ఇక్కడ చాలినంత దొరుకుతుందిగాని మేం తినలేకపోయేవాళ్లం. ఎందుకంటే అక్కడివారికి ప్రధాన ఆహారం చపాతీలు. కూరంటే బంగాళాదుంపలే. అది కూడా చాలా చప్పన. దక్షిణాది నుంచి వచ్చినవారికి అది హాస్పిటల్ తిండితో సమానంగా అనిపించేది! భోజనం చివర్లో కాస్త అన్నం ఇచ్చేవారు. అదికూడా చాలా తక్కువ, బాస్మతి రకం. అన్నమే ప్రధాన ఆహారమైన మాకు అది చాలేది కాదు, దాన్ని చివర్లో ఇవ్వడం నచ్చేదీ కాదు. చప్పదనాన్ని మేం ఆవకాయలతో భర్తీ చేసుకున్నాంగాని, ఈ అన్నం పద్ధతెలా మార్చాలో మాకు తెలియలేదు. ఉత్తరాది స్నేహితులు మా అవస్థను గమనించి కలగజేసుకుని అన్నం ముందే వచ్చేలా ఏర్పాటు చేశారు. వాళ్ల టేబుల్ మీదకు రాగానే మాకిచ్చేసేవారు. ఇది చాలా మేలు చేసింది. మూడు నెలల తర్వాత మేం కూడా చపాతీలను ఇష్టపడటం మొదలుపెట్టాం. చలికాలం మొదలు కావడంతో చపాతీలే తేలిగ్గా అరుగుతాయని మాకు అర్థమయింది. అప్పడు అలవాటయిన చపాతీలు, ఇప్పటికీ ఆహారంలో భాగంగా కొనసాగుతున్నాయి.

ఢిల్లీ వాతావరణం విచిత్రమైనది. అందులో మార్పు అక్కడివారి జీవనశైలిని అమితంగా ప్రభావితం చేస్తుంది. వేసవిలో ఎండలు ఠారెత్తిస్తాయి. మధ్యాహ్నాలు బయటకు వెళ్లలేం. దుమ్ము దుమారాలు, ధూళి మేఘాలు లేచి వాహనాలకు దారి కనపడనంతగా ఇబ్బంది పెడతాయి. అన్నిచోట్లా దుమ్ము పేరుకుపోతుంది. వేడి వలన ఇంటి బయట పడుకోలేం, లోపల పడుకోలేం. అక్కడ అందరి ఇళ్లలోనూ రెండేసి పరుపులుంటాయి. ఒకటి తేలిగ్గా బయట వేసుకోగలిగేది, మరొకటి పెద్దది, శీతకాలంలో ఉపయోగపడేది. వేసవి తర్వాత వానకాలంలో జల్లులు పడతాయి. అది కాస్త మేలు చేసి వేడి తగ్గుతుంది. అక్టోబరు వచ్చేసరికి చలి మొదలయ్యేది. వేడి, వానలతో విసిగిపోయిన ఢిల్లీ జనం చలికాలం కోసం ఎదురుచూస్తారు. స్వెట్టర్లు, ఉన్నిదుస్తులు, సాక్సలు బయటకు తీసి సిద్ధంగా ఉంచుకునేవారు. ఇళ్లు, ఆఫీసులు, పార్కులు – ఎక్కడ చూసినా ఆడవాళ్లు స్వెట్టర్లు అల్లుతూ కనిపించేవారు. ఉత్తరాది మహిళలకు అదొక తప్పనిసరి, ఇష్టమైన కాలక్షేపంగా కనిపించేది. నేను జీవితంలో మొదటిసారి ఉలెన్ సూటు వేసుకున్నది ఢిల్లీలోనే. అక్కడివారి దగ్గర సాధారణంగా రెండుంటాయి. కాని నేను ఒక్కదాంతోనే కాలక్షేపం చేశాను. రెండు స్వెట్టర్లు, ఒక కంఫర్టరు కూడా కొనుక్కున్నాను. జార్జ్ శాంటయానా అనే పాశ్చాత్య తత్వవేత్త తన రచనల్లో ఏం రాశాడంటే, ఒక మనిషి ఏం అంగీకరించాడో అనేదే కాకుండా, దేన్ని తిరస్కరించాడో – అది కూడా అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అని. అయితే సరదాగా చెప్పాలంటే, అవసరమున్నా సరే నేను మరో జత ఉన్ని దుస్తులు వద్దనుకోవడానికి కారణం ‘సరళంగా జీవించడం’ వంటి పెద్ద విలువల ప్రకారం కాదు, ఆర్థిక పరిస్థితుల బట్టి నడుచుకోవడం అంతే.

చలికాలంలో ఢిల్లీలో బోలెడన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంగీత కచేరీలు, నాటకాలు, కవితాగోష్టులు, చర్చలు – ఒకటేమిటి, అన్నిటికీ ఆ కాలమే తగినది. అప్పుడే విదేశీ పర్యాటకులు సైతం వస్తుంటారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, దివాన్ చాంద్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ప్రభుత్వం వంటివి ఇతర దేశాల నుంచి ప్రముఖ వ్యక్తులు వచ్చినప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేసేవి. విద్యార్థులకు ఇవెంతో విలువైనవి. మేధావులను కలిసి వారి అభిప్రాయాలను వినే అవకాశం, చర్చించే అవకాశం ఈ సందర్భంగా కలిగేవి. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మానసికమైన పరిధిని విశాలం చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు మేలు చేస్తాయి.

కాని చాలా సందర్భాల్లో రచయితలను, రాజకీయ నాయకులను కలవడం ఆశాభంగానికి దారితీస్తుందని నా వ్యక్తిగత అనుభవం. ఒకసారి ఒక ఎమ్.పి. (మెంబర్ ఆఫ్ పార్లమెంటు) చొరవ వల్ల నేను నా స్నేహితులు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి వెళ్లాం. దాన్ని ప్రజా సోషలిస్ట్ పార్టీ నిర్వహిస్తోంది. అధ్యక్షుడు ప్రొఫెసర్ జె.బి.కృపలానీ. ఆయన నెహ్రూకు సన్నిహిత మిత్రుడు. ఆలిండియా కాంగ్రెస్ పార్టీకి పూర్వ అధ్యక్షుడు. ఆ సమావేశం మమ్మల్ని ఉత్తేజపరచడానికి బదులు నిరాశపరిచింది. మేం దూరం నుంచి ఆరాధించిన నాయకుడు వ్యక్తిగతంగా కలిసినప్పుడు వేరేగా అనిపించాడు. రాజకీయ నాయకులు కేవలం అధికారమే పరమావధిగా బతుకుతారని, దానికోసం ఏమైనా చేస్తారని అర్థమైంది. రాజకీయాలు మేం అనుకుంటున్నట్టుగా సిద్ధాంతపరమైన మార్గాల కన్న వ్యక్తిగత అంశాలతోనే నడుస్తాయని అర్థమైనప్పుడు బాధ కలిగింది. కాని అది ఒక వాస్తవాన్ని నగ్నంగా మా ముందు నిలబెట్టింది. అది కూడా విలువైన అనుభవమే. ఢిల్లీలో రాజకీయ పరిచయాలు లభించడం పెద్ద కష్టం కాదు. విద్యార్థులు కొందరు వాటికోసం తహతహలాడతారు. కాని ఆ పరిచయాలు రెండంచుల కత్తి వంటివి. విద్యార్థులు తమ అవసరాలకు పెద్దవారిని వాడుకుందామనుకుంటే, పెద్దవారు వీరిని తమ అవసరాల కోసం వాడుకుందామనుకుంటారు. తమ ప్రసంగాలు తయారుచెయ్యడానికి, పనుల్లో సాయానికి అంటూ అది మొదలవుతుంది.

ఏదయితేనేం, నా మార్గం నాకు సుస్పష్టంగా ఉంది. నేను రాజకీయాలకు పనికొచ్చేవాణ్ని కాను. చదువే నాకు సర్వస్వం.

******

మేం ఢిల్లీలో చదువుతూ ఉన్న కాలంలో ఆర్థిక విధానాల్లో రెండు వివాదాస్పద అంశాలు వచ్చాయి.

మొదటిది ఆర్గనైజ్ డ్ కుటుంబ నియంత్రణ. మొదటి జనాభా గణన తర్వాత అది ప్రముఖ సిఫార్సు. చిత్రంగా అప్పటి ఆరోగ్యమంత్రి దాన్ని తోసిపుచ్చారు. ఆవిడ అవివాహిత. సెస్సెస్ రిపోర్ట్ ఆధారంగా వచ్చిన ఈ సిఫార్సు ప్రజలను భయపెడుతోందని ఆమె భావించారు. మన దేశ జనాభా సమస్యను పరిష్కరించడానికి ఆనాడొక మంచి అవకాశం లభించింది. కాని దాన్ని జారవిడిచేసింది ఆనాటి ప్రభుత్వం. 1960ల చివరి వరకూ ఏమీ చెయ్యలేదు. దాని ఫలితాలను దేశంలో నేటికీ మనం చూస్తున్నాం. ఒక ఆర్థికవేత్త ఆరోగ్యశాఖామంత్రి అయ్యేదాకా జనాభా నియంత్రణ అంశాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అరవైల చివర్లో – విదేశాల నుంచి నిధులు ఇచ్చే సంస్థలు – ఫోర్డ్ ఫౌండేషన్ వంటివి పట్టుపడితే తప్ప ఆ దిశగా ముందడుగు పడలేదు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టడంలో ఆలస్యమైంది. ఒకసారి ప్రారంభమయ్యాక కూడా అవసరమైనంత త్వరగా అడుగులు పడలేదు.

ముఖ్యమైన రెండో అంశం – జాతీయ బడ్జెట్ లోటును పూరించడం. ఆ సమయంలో మన స్టెర్లింగ్ నిల్వలు తగ్గిపోతూ ఉండేవి. అభివృద్ధి పనులకు కావలసిన నిధులు సంపాదించాల్సిన పూచీ టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ పైన ఉండేది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ వి.కె.ఆర్.వి. రావుగారు ఒక పేపర్ తయారుచేశారు. ‘డెఫిసిట్ ఫైనాన్సింగ్, ప్రైస్ బిహేవియర్ అండ్ కాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్ డ్ ఎకానమీ’ అనే అంశాలను కూలంకషంగా చర్చిస్తూ సాగింది ఆ పత్రం. మేమున్న సమయంలోనే ఈ చర్చ సాగడం మాకెంతో మేలు చేసింది. మేం ఆ డిబేట్ ను శ్రద్ధగా ఫాలో అయి మావైన అభిప్రాయాలను ఏర్పర్చుకోవడానికి ఉపయోగపడింది. అలాగే ఒకటి రెండేళ్ల తర్వాత డెఫిసిట్ ఫైనాన్సింగ్ మీద కె.ఎన్.రాజ్ గారు మరో పేపర్ రాశారు. బడ్జెట్ లోటును ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా కొలవాలి అని.

ఆ సమయంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్) ఐ.ఎమ్.ఎఫ్.   భారత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక మిషన్ (కార్యక్రమం) గురించి ఒక రిపోర్టు తయారుచేసింది. ‘డెవెలప్ మెంట్ విత్ స్టెబిలిటీ’ అనేది దాని లక్ష్యం. దీనికి బెర్న్ స్టీన్ నాయకత్వం వహించారు, అప్పటికాయన ఫండ్ కౌన్సెలర్ గా ఉండేవారు. ఈ మిషన్ లో రిచర్డ్ గూడే కూడా ఉండేవారు. అనంతర కాలంలో నన్ను ఐ.ఎమ్.ఎఫ్.లో నియమించడంలో రిచర్డ్ గూడేది కీలకపాత్ర. ఆ సంస్థలో నాకు మొదటి పదేళ్లు ఆయనే డైరెక్టర్ కూడా.

చెప్పొచ్చేదేమంటే, విజ్ఞానాత్మకమైన ఈ పేపర్లన్నీ మాకు అందుబాటులో ఉండేవి. కీలకమైన అంశాల మీద లోతైన చర్చలు జరుగుతూ ఉండేవి. కొన్ని అభిప్రాయాలను ఏర్పర్చుకునే అవకాశం కలిగింది. అయితే నా భావిజీవితంలో ఐ.ఎమ్.ఎఫ్.లో పనిచేస్తాననిగాని, ‘లోటు’ అనే అంశం మీదే నా దృష్టి మరింత కేంద్రీకరించి పనిచెయ్యవలసి వస్తుందని అప్పట్లో నాకు ఊహామాత్రంగానైనా తట్టలేదు.

******

మా డిప్లొమా కోర్సు అయిపోవచ్చింది. ఆ తర్వాత ఉద్యోగ అన్వేషణ పైన దృష్టి పెట్టాను. కుటుంబ బాధ్యత నామీద ఉందనే స్పృహ నన్ను అనునిత్యం మెలకువతో ఉంచేది. వీలైనంత త్వరగా నేను సంపాదన మొదలుపెట్టాలి, ఇక ఎక్కువ సమయం లేదని తోచేది.

ఆ సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.ఎస్.కృష్ణగారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిమీద ఢిల్లీకి వచ్చారు. మేం ముగ్గురం ఆయనను మర్యాదపూర్వకంగా కలవాలని అనుకున్నాం. ఆయన మర్నాడు బ్రేక్ ఫాస్ట్ సమయానికి రమ్మన్నారు. వెళితే మమ్మల్ని సాదరంగా పలకరించారు, మా చదువుల గురించి అడిగారు. నా చదువు ఎప్పుడవుతుందని, అటుపైన నేనేం చెయ్యాలనుకుంటున్నానని అడిగారు. 1954 మే నెలకల్లా ఈ కోర్సు పూర్తవుతుంది, ఉద్యోగ అన్వేషణలో ఉన్నానని చెప్పాను. ఆయన శ్రద్ధగా విన్నారు. ఉద్యోగంలో చేరినా కూడా, ఆలిండియా సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలని అనుకున్నాను. దానికి అర్హత సాధించడానికి ఇంకా రెండేళ్లుంది.

మా కోర్సు పూర్తయి, పరీక్షల సమయం వచ్చేసరికి దురదృష్టవశాత్తు మలేరియా జ్వరం పట్టుకుంది. ఏ.యూ.లో ఉన్నప్పుడు జ్వరం తరచూ వచ్చేది. కాని ఈసారి పరీక్షల సమయం కావడంతో నాకు చాలా భయం వేసింది. పరీక్ష హాలుకు నడుచుకుంటూ వెళ్లి, మూడు గంటల పాటు కూర్చుని పరీక్ష రాసే ఓపిక లేకుండా పోయింది. కాని ఒక సహాధ్యాయి నా గదికి వచ్చి, నన్ను తన సైకిలు మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి పరీక్ష తర్వాత మళ్లీ నా గదికి తీసుకొచ్చి దించేవాడు. తన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

కోర్సులో భాగంగా మేమొక ప్రాజెక్టు రిపోర్టు తయారుచెయ్యాలి. పేపర్లకెన్నో దానికీ అన్నే మార్కులు. అంటే సమ ప్రాధాన్యమన్నమాట. ‘అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫుడ్ ప్రొక్యూర్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అన్నది నేనెంచుకున్న అంశం. అది రాస్తున్నప్పుడు ప్రభుత్వం పాటిస్తున్న కంట్రోలు విధానం, ఎదురవుతున్న ఇబ్బందులు మరింత విస్తృతంగా అధ్యయనం చెయ్యగలిగాను. దాని తర్వాత మౌఖిక పరీక్ష ఉంటుంది. వచ్చిన ఎగ్జామినర్ నన్ను ఎన్నో అంశాల్లో ప్రశ్నలడిగారు. నిర్బంధ సేకరణ ఎత్తివెయ్యాలన్నది నా అభిప్రాయమని ఆయనకు స్పష్టంగా చెప్పాను.

మొత్తమ్మీద సంవత్సరాంత పరీక్షల్లో నేను విజయం సాధించాను. డిప్లొమా చేతికి వచ్చింది. ఢిల్లీవాసం అప్పటికి అయిపోయింది. ఇంటికి తిరిగి వచ్చేశాను. మా చెల్లి పెళ్లి చేశాం. అమ్మ కొద్దికాలం చెల్లితో పాటు ఉండాలనుకున్నది. కాని వాళ్ల పరిస్థితీ అంతంతమాత్రమే. అందువల్ల ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అదనపు బాధ్యత నామీద పడింది.

ఈ నేపథ్యంలో జూన్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్లి, వి.ఎస్.కృష్ణగారిని కలిశాను. ఆయన సాయం చేస్తారనే ఆశ నాలో మిణుకుమిణుకుమంటూ ఉండేది.

అనువాదం: అరుణా పప్పు

 

అరిగపూడి ప్రేమ్ చంద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • In all aspects this is a Valuable Article. Storehouse of facts regarding past and the then days…it made an alert reading…many thanks Aruna garu for the impeccable translation. As rich as the original might have been. Enlightened.shall preserve this…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు