డిఫ‌రెంట్లీ ఏబుల్డ్ అద్దం

త‌న‌ని చూస్తుంటే అలానే చూస్తూ వుండిపోవాల‌ని అనిపిస్తూంటుంది. మొద‌టిరోజు చూసిన‌ప్పుడు ఎలా వుందో ఇప్ప‌టికీ అలానే వుంది. ప‌రిచ‌య‌మై కొన్ని రోజులు గ‌డిచాక ఎవ‌రిమీదైనా మ‌న‌కున్న అభిప్రాయంలో ఎంతోకొంత మార్పు వ‌చ్చి తీరుతుంది. కానీ, ఈ అనుభ‌వం కొత్త‌గా వుంది. నేను ఎవ‌రి గురించి మాట్లాడుతున్నానూ, ఎందుకింత గాఢానుభూతికి లోన‌వుతున్నానూ తెలియాలంటే నా ఫ్లాష్ బ్యాక్ క్లుప్తంగానైనా తెలుసుకు తీరాలి మీరు.

*****

నా పేరు అద్దం. ఎక్క‌డ పుట్టానో, ఎవ‌రు న‌న్ను త‌యారుచేశారో నాకు తెలీదు. ఊహ తెలిసేస‌రికే నేనొక హోమ్‌నీడ్స్ షాపులో వున్నాను. చాన్నాళ్ల‌పాటు న‌న్నెవ‌రూ కొనుక్కోలేదు. ఎందుకూ అన్న‌ది మొద‌ట్లో నాకూ తెలియ‌లేదు. ఒక‌సారి యిద్ద‌రు మ‌నుషులు నా గురించి మాట్లాడుకోవ‌డం నా చెవిన ప‌డింది. “ప‌గిలిపోయిన అద్దం  పెట్టుకుంటే కొంప‌కి అరిష్టం” అంటున్నాడాయ‌న వాళ్లావిడ‌తో. అప్పుడ‌ర్థ‌మైంది నాకు. నేను మామూలు అద్దాన్ని కాదు, ప‌గిలిన అద్దాన్ని. “దీని పేరేంటి, బ్రోకెన్ అద్ద‌మా?  డిజేబుల్డ్ అద్ద‌మా?  రెండూ కాదు, డిఫ‌రెంట్లీ ఏబుల్డ్ అద్దం”.. ఇలా నా గురించిన జోకులు చాలా విన్నాన్నేను.

కొన్ని అద్దాల్లో చూసుకుంటే మ‌నుషులు స‌న్న‌గా క‌న‌బ‌డ‌తారు. అలాగే కొన్నిట్లో లావుగా, కొన్నిట్లో ఎత్తుగా, కొన్నిట్లో పొట్టిగా, కొన్నిట్లో బ‌లంగా క‌న‌బ‌డ‌తారు. స్ప‌ష్టంగా వున్న‌దున్న‌ట్లు చూపించే అద్దాలంటే ఎవ‌రికీ పెద్ద‌గా మోజుండేది కాదు. ఏ అద్దంలో చూసుకుంటే వాళ్ల‌కి వాళ్లు న‌చ్చుతున్నారు అన్న‌దే  జ‌నాల‌కి ముఖ్యం. స‌గం ముఖం వొక‌చోట‌, యింకో స‌గం యింకోచోట క‌నిపించే ప‌గిలిన అద్దం కావాల‌ని ఎవ‌రు మాత్రం కోరుకుంటారు. నా త‌ర్వాత ఎప్ప‌టికో వ‌చ్చిన లేత అద్దాల‌న్నీ అమ్ముడుపోతుంటే, నేను మాత్రం వొక మూల‌గా నిల‌బ‌డి, వ‌చ్చేపోయే వాళ్ల వైపు ఆశ‌గా చూస్తూ వుండేదాన్ని. ఎవ‌రైనా న‌న్ను చూసి మ‌న‌సు ప‌డ‌క‌పోతారా అని. కొన్నాళ్ల‌కి ఆ ఆశ కూడా చచ్చిపోయింది.

ఇక నాకు జీవితేచ్ఛ న‌శించి, వైరాగ్యం మొద‌ల‌వుతూ వుండ‌గా జ‌రిగింది ఆ అద్భుతం. ఫుల్లుగా తాగి వున్న ఒక క‌స్ట‌మ‌ర్ నా ద‌గ్గ‌ర‌కొచ్చి ప‌రిశీల‌న‌గా చూశాడు. అత‌ని చిన్న‌ప్పుడు వాళ్లింట్లో స‌రిగ్గా నాలాంటి అద్ద‌మే వుండేద‌ట‌. న‌న్ను చూస్తుంటే అత‌ని బాల్య‌స్మృతులు మ‌న‌సులో క‌ద‌లాడుతున్నాయ‌ట‌. అత‌ని మాట‌లు షాపు వోన‌ర్‌కి ఎంత సంతోషం క‌లిగించాయో చెప్ప‌లేను. సగం రేటుకి కూడా అమ్ముడు పోన‌నుకున్న న‌న్ను, ప్రైస్ ట్యాగ్ చించేసి ఎమ్మార్పీ క‌న్నా ఎక్కువకి ఆ మందుబాబుకి అంట‌గ‌ట్టేశాడు.

*****

నామీద ద‌య‌త‌ల‌చి న‌న్ను వొక యింటిదాన్ని చేసిన మందుబాబు యింట్లో మొత్తం నలుగురు వుండేవాళ్లు. ఆయ‌నా, భార్యా, కొడుకూ, కూతురూ. న‌న్ను చూసిన వెంట‌నే భాభీ గ‌య్యిన లేచింది. ప‌గిలిన అద్దాన్ని కొనుక్కొచ్చేవాడికంటే అప్ర‌యోజ‌కుడు ఎవ‌డూ వుండ‌డంది. ఒక అద్దం మంచిదో కాదో కూడా తెలుసుకోలేని వాడికిచ్చి పెళ్లి చేసి త‌న గొంతు కోశార‌ని వాపోయింది. పిల్ల‌ల గొంతు పెద్ద‌గా లేవ‌లేదు కానీ, వాళ్లు కూడా త‌ల్లి అభిప్రాయాల‌తో ఏకీభ‌విస్తున్నార‌ని నాకు అర్థ‌మైంది. నా మీద సానుభూతి చూపించిన పాపానికి అత‌ను అన్ని మాట‌లు ప‌డాల్సిరావ‌డం నాకు క‌ష్టంగా అనిపించింది. కానీ, మందుబాబు వాళ్ల‌ మాట‌ల్ని త‌ల‌కెక్కించుకున్న‌ట్లు అనిపించ‌క‌పోవ‌డంతో తృప్తిగా నిట్టూర్చాన్నేను.

*****

రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ క్ర‌మంగా నాకు అర్థం అయిందేంటంటే, అస‌లత‌ను ఏం చేసినా వాళ్లావిడ తిడుతూనే వుంటుంది. అలాగ‌ని త‌ప్పంతా ఆవిడ మీద నెట్టేయ‌డం కూడా క‌రెక్ట్ కాదు. మ‌నోడి ప‌నులు కూడా అలానే వుండేవి. ఎలాగూ త‌న‌కి ఆ యింట్లో గుర్తింపు లేదు కాబ‌ట్టీ, ఏ బాధ్య‌తా తీసుకోవాల్సిన అవస‌రం లేద‌న్న‌ట్టు వుండేవాడు. గుర్తింపు లేక బాధ్య‌త‌లు వ‌దిలేశాడా, బాధ్య‌త‌లు వ‌దిలేయడం వ‌ల్ల గుర్తింపు లేకుండా పోయిందా అన్న‌ది నేను ఇప్ప‌టికీ తేల్చుకోలేక‌పోయాను. పాపం ఇంట్లో ప‌నులూ, బ‌య‌ట వ్య‌వ‌హారాలూ అన్నీ వొక్క‌తే చూసుకోవాల్సి రావ‌డం వ‌ల్ల భాభీ ఎప్పుడూ రుస‌రుస‌లాడుతూనే వుండేది. అస‌లు సంగ‌తి చెప్ప‌డం మ‌రిచేపోయాను. మ‌న మందుబాబు క‌విత్వం రాసేవాడు. అత‌ను ఏం రాసేవాడ‌న్న‌ది ఫ్యామిలీ మెంబ‌ర్సెవ‌రూ ప‌ట్టించుకునేవాళ్లు కాదు. ఏదైనా క‌విత రాసి, దానిని ఏ ప‌త్రికాఫీసుకో పంపిన త‌ర్వాత, అది అచ్చ‌య్యేవ‌ర‌కూ కాలుగాలిన పిల్లిలా  తిరుగుతూ వుండేవాడు. నా ముందు నిల‌బ‌డి వొక్కో క‌విత‌నీ డ‌జ‌నుసార్లు నాకు వినిపించేవాడు. అందుకో కొన్ని నాకు అర్థ‌మ‌య్యేవి. కొన్ని మాత్రం అస‌లు దేని గురించి రాశాడో కూడా తెలిసేది కాదు. మొత్త‌మ్మీద  ప్ర‌పంచంలో మ‌నుషులంద‌రూ వొక‌రినొక‌రు అర్థం చేసుకుంటూ, ప్రేమాభిమానాల‌తో వుండాల‌ని అత‌ను కోరుకుంటున్నాడ‌ని మాత్రం ఖాయంగా చెప్పొచ్చు. ఆయ‌న‌కి స‌మాజం ప‌ట్ల ఎంత అక్కర వుండేదంటే,  పిల్ల‌లు ఏం చ‌దువుతున్నారు అని ఎవ‌రైనా అడిగితే స‌మాధానం  గుర్తు చేసుకోలేక ఇబ్బంది ప‌డేవాడు.

మొద‌ట్లో న‌న్ను చిన్న‌చూపు చూసిన మాట నిజ‌మేలే కానీ, రాన్రానూ భాభీకి కూడా నేనంటే కాస్త స‌ద‌భిప్రాయం ఏర్ప‌డింది. వృత్తిరీత్యా ఆవిడ వొక క్లినిక‌ల్ సైకాల‌జిస్టు. ఎవ‌రైనా బాగా డ‌బ్బున్న పేషెంట్ల‌తో అపాయింట్‌మెంటు వున్నా, మీటింగుల్లో లెక్చ‌ర్ యివ్వాల్సివ‌చ్చినా నా ముందే నిల‌బ‌డి ప్రాక్టీస్ చేసేది. ఏమాటకామాటే గానీ భాభీ మంచి వ‌క్త‌. ఎదుటివాళ్లని అర్థం చేసుకోవాలంటే స‌మ‌స్య‌ని వాళ్ల స్థానంలో నిల‌బ‌డి చూడాల‌ని చెపుతా వుండేది. త‌రాన్ని బ‌ట్టీ, వ‌య‌సుని బ‌ట్టీ, హోదాని బ‌ట్టీ అభిప్రాయాలు మారిపోతా వుంటాయ‌నీ, ఎవ‌రినీ దేనికీ నిందించ‌డానికి వీల్లేద‌నీ ఆవిడ చెప్తూంటే నాకు భ‌లే ముచ్చ‌టేసేది. అస‌లు నా ముందు నిల‌బ‌డి రిహార్స‌ల్స్ చేసేట‌ప్పుడు ఆవిడ మొత్తంగా వొక కొత్త మ‌నిషిలా తోచేది. భాభీకి చాలామంది ఫోన్ చేసి వాళ్ల క‌ష్ట‌సుఖాలు చెప్పుకునేవాళ్లు. వాళ్ల మొగుళ్ల‌ గురించీ, పిల్ల‌ల గురించీ, తోటి ఉద్యోగుల గురించీ ర‌క‌ర‌కాల భ‌యాలూ బాధ‌లూ. వాట‌న్నిటికీ భాభీ ద‌గ్గ‌ర స‌మాధానం వుండేది.

కానీ పాపం ఆవిడ‌కి భ‌ర్తతోనే కాదు పిల్ల‌లిద్ద‌రితో కూడా పొసిగేది కాదు. అడ్డ‌మైన తిళ్లూ తింటున్నారనీ, చ‌దువూ సంధ్యా లేకుండా కాల‌క్షేపానికి అల‌వాటు ప‌డ్డార‌నీ ఆవిడ కంప్లెయింటు. చివ‌రికి ఎందుకూ ప‌నికిరాకుండా పోతార‌నీ పిల్ల‌ల్ని శాప‌నార్థాలు పెడుతూ వుండేది. కూతురు వేసుకునే డ్ర‌స్సులు చూస్తే ఆవిడ‌కి గుండాగినంత ప‌న‌య్యేది. అలాంటి డ్ర‌స్సులేసుకు తిరుగుతూ ప‌రువు తీస్తున్నావంటూ వాపోయేది. కానీ, ఆ కోపం కాసేపే. మ‌ళ్లీ అవే డ్ర‌స్సుల‌తో కూతురు దిగిన  ఫోటోలు అంద‌రికీ చూపించి మురిసిపోతూ వుండేది. ఇక కొడుకు విష‌యానికొస్తే, అత‌ను చ‌దువూ సంధ్యా లేకుండా పొద్ద‌స్త‌మానం ఫ్రెండ్సుతో బ‌లాదూర్ తిర‌గ‌డం ఆవిడ‌కి ఏమాత్రం స‌యించేది కాదు. న‌యానో భ‌యానో చ‌దువు మీద దృష్టి పెట్టేలా కొడుకుని వొప్పించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డేది. అత‌నూ వినుండేవాడేనేమో. కానీ, చ‌దువూ చ‌దువూ అని పిల్ల‌ల్ని రాచి రంపాన పెట్ట‌కూడ‌ద‌నీ, ఎదిగే పిల్ల‌ల అభిరుచుల్ని గౌవ‌ర‌వించాల‌నీ భాభీ వేరేవాళ్ల‌కి చెప్ప‌డం అత‌ను చాలాసార్లు వినివుండ‌డం వ‌ల్ల వాళ్ల‌మ్మ ప‌ర్స‌న‌ల్‌గా ఇచ్చే కౌన్సిలింగుని లెక్క చేసేవాడు కాదు. పిల్ల‌లు త‌న  మాట‌ల్ని ల‌క్ష్య‌పెట్ట‌క‌పోగా, త‌న‌కి యిష్టం లేని ప‌నులు ప‌దేప‌దే చేయ‌డంలో ఆనందాన్ని పొందుతూ వుండడం భాభీకి వున్న పెద్ద స‌మ‌స్య అని నేను గ్ర‌హించ‌గ‌లిగాను.

నా కొత్త యింట్లో నాకు బాగా న‌చ్చింది మాత్రం భాభీవాళ్ల అమ్మాయేన‌ని చెప్పాలి. త‌న త‌మ్ముడికి వున్నపాటి స్వేచ్ఛ కానీ, అత‌నికున్నంత పాకెట్ మ‌నీ కానీ త‌న‌కి లేక‌పోవ‌డం ఆ అమ్మాయికి చాలా బాధ క‌లిగించేది. కానీ ఎప్పుడో వొక‌సారి త‌ప్ప పెద్ద‌గా ఆ విష‌యం గురించి ఫీల‌వుతున్న‌ట్లు క‌నిపించేది కాదు. త‌న ఫ్రెండ్స్ తో ఎప్పుడు ఫోన్ మాట్లాడాల్సి వ‌చ్చినా నా ముందే వ‌చ్చి కూర్చునేది. నా వైపు చూస్తూ ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్స్ మారుస్తూ త‌ను మాట్లాడుతూంటే  ఆ క‌బుర్ల‌న్నీ నాకే చెపుతోందా అనిపించేది నాకు. ఒక్కోసారి వున్న‌ట్టుండి ఏడవ‌డం మొద‌లెట్టేది. అవ‌త‌లివాళ్లు ఏం చెప్పేవాళ్లో ఏమో గానీ అంత‌లోనే మ‌ళ్లీ పెద్ద‌గా న‌వ్వేసేది. ఎవ‌రైనా కొత్త‌గా ప‌రిచ‌యం అయితే వాళ్ల‌కి త‌న కుటుంబ‌స‌భ్యుల గురించి చాలా గొప్ప‌గా చెప్పేది. అంత మంచి కుటుంబంలో పుట్ట‌డం త‌న అదృష్టం అనేది. అంత‌లోనే ఇంకొక‌ళ్ల‌తో మాట్లాడుతూ..  త‌న‌ తండ్రి రెస్పాన్సిబుల్ కాద‌నీ, త‌ల్లి ప్రోగ్రెసివ్ కాద‌నీ, త‌మ్ముడు కేరింగ్ కాద‌నీ అంటూ చిన్న‌బుచ్చుకునేది.

నాకు నాలుగు ముక్క‌లు ఇంగ్లిష్ అబ్బిందంటే అందుకు కార‌ణం ఆ అమ్మాయే.  సివిల్ స‌ర్వీస్ ప‌రీక్ష‌లు రాసి, క‌లెక్ట‌రు కావాల‌ని వుంద‌నీ, కానీ ఇంట్లో ప్ర‌శాంతంగా చ‌దువుకునే వాతావ‌ర‌ణం లేద‌నీ  త‌ర‌చూ అంటుండేది.  సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల్లో రెండు స‌బ్జెక్టులు పోయిన రోజు ఆ పిల్ల ఎంత‌గా ఏడ్చిందో నాకింకా గుర్తుంది. నాక్కూడా చాలా దిగుల‌నిపించింది. కానీ, అవేమంత ముఖ్యం కాద‌నీ, రేపొద్దున అయ్యేయ‌స్ అయిపోయాక ఇలాంటివ‌న్నీ జ‌నాలు గుర్తుంచుకోర‌నీ ఆ అమ్మాయి త‌న ఫ్రెండుతో చెప్ప‌డం విన్నాక నాక్కాస్త మ‌న‌సు కుదుట‌ప‌డింది.  కొత్త కొత్త నెయిల్ పాలిష్ డిజైన్లు, ఫేస్‌ప్యాకుల‌కి ర‌క‌ర‌కాల ఆర్గానిక్ రెసిపీలు, డ్ర‌స్సుల‌కి వెరైటీ మ్యాచింగ్ కాంబోలు, డేటింగ్ సైట్స్ లో ఫేక్ ప్రొఫైల్స్ ఏవిట‌న్న‌ది క‌నిపెట్ట‌డాలూ.. వీటిగురించి ఆ పిల్ల అల‌వోక‌గా మాట్లాడుతుంటే, చెప్పొద్దూ నాక్కూడా న‌మ్మ‌కం కుదిరింది. ఏనాటికైనా ఈ అమ్మాయి క‌లెక్ట‌ర‌య్యే తీరుతుంది.

మ‌నుషులు చేసే ప‌నులు, వాళ్లు మాట్లాడే మాట‌లు, కోప‌తాపాలూ, ప‌రాచికాలూ వీట‌న్నిటికీ అల‌వాటు ప‌డ‌డానికి నాకు ఆట్టే స‌మ‌యం ప‌ట్ట‌లేదు. నేను అద్దాన్ని కాకుండా యింకేదైనా వ‌స్తువుని అయ్యుంటే వాటిని అర్థం చేసుకోవ‌డం అనే విద్య నాకు అంత తేలిగ్గా ప‌ట్టుబ‌డేది కాద‌నుకుంటా. ఒక్క మిన‌హాయింపు ఏమిటంటే మా మందుబాబు కొడుకు. అత‌ని మాట‌లు మాత్రం నాకంత తేలిగ్గా కొరుకుడు ప‌డేవి కావు. మిగిలిన ముగ్గుర్నీచూడ‌డం ద్వారా నేను నాకు అబ్బిన లోక‌జ్ఞానం యిత‌ని ద‌గ్గ‌రకొచ్చేస‌రికి ప‌నికొచ్చేది కాదు. అమ్మాయిల‌ని అక్కా అనీ, చెల్లీ అనీ పిలిచేవాడు. నాలుగు రోజులు తిరిగేస‌రికి వాళ్ల‌నే డాళింగ్ అని ప‌ల‌క‌రించేవాడు. ఎవ‌రికి కాల్ చేసినా యువార్ మై వోన్లీ ఫ్రెండ్ అనేవాడు. ఒక్కోసారి ఎవ‌రిని ఏ వ‌ర‌సతో పిలుస్తున్నాడో తానే మ‌ర్చిపోయి చిక్కుల్లో ప‌డేవాడు. (ఈ ల‌క్ష‌ణం కొంత‌వ‌ర‌కూ అత‌ని అక్క‌లో కూడా లేక‌పోలేదు. అన్న‌య్య‌లెవ‌రో, బాయ్ ఫ్రెండ్స్ ఎవ‌రో క్లారిటీ వుండేది కాదు. కానీ, ఈ పిల్లోడికి వున్నంత అయోమ‌యం ఆ అమ్మాయికి లేద‌నే చెప్పాలి).

కుర్రాడికి సినిమా పిచ్చి జాస్తి. అలాగ‌ని ఎక్కువ స‌మ‌యం వృధా చేయ‌డానికి ఇష్ట‌ప‌డేవాడు కాద‌నుకుంటా. పైగా తాను సినిమా డైలాగులు పెద్ద సౌండుతో వింటుంటే ఇంట్లో వాళ్ల‌కి అసౌక‌ర్యం కలిగే ప్ర‌మాదం వుంద‌న్న‌ స్పృహ కూడా వుండేది కాబోలు అత‌నికి. అందుకే పావుగంట‌, అర‌గంట మించ‌ని ఇంగ్లిష్ సినిమాలే చూసేవాడు. వాటిలో కూడా మాట‌లు త‌క్కువ‌గానూ, రొప్ప‌డం మూల్గ‌డం ఎక్కువ‌గానూ వుండేవి. అదేంటో, ఎవ‌రైనా నీకెలాంటి సినిమాలు ఇష్టం అని అడిగితే ప‌ర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనో, సిటిజెన్ కేన్ అనో చెప్పేవాడు. ఆ రెండు సినిమాలూ ఏనాటికైనా చూడాల‌నేది ఆ అబ్బాయి జీవితాశ‌యాల్లో ఒక‌ట‌నే సంగ‌తి నాకు మాత్ర‌మే తెలుసనుకుంటాను.  వాళ్ల నాన్నఫుల్లుగా మందుకొట్టి వొళ్లు తెలీకుండా యింటికొచ్చిన‌ప్పుడు, ఎవ‌రూ  గ‌మ‌నించ‌కుండా ఆయ‌న పాకెట్లో డ‌బ్బులు లేపేస్తూ వుండేవాడు. ఆ విష‌యం అక్క‌కి తెలిసే అవ‌కాశం లేక‌పోయినా త‌న‌కీ కాస్త వాటా పంచేవాడు. బ‌హుశా వీటినే మీ మ‌నుషులు మ‌ధ్య‌త‌ర‌గ‌తి అనుబంధాలు అని పిలుచుకుంటార‌నుకుంటా. నా అవ‌గాహ‌న‌ త‌ప్ప‌యితే క్ష‌మించండి. ఎంత మ‌నుషుల మ‌ధ్య బ‌తుకుతున్నా అద్దం అద్ద‌మే క‌దా!

***

నాకు ర‌క‌ర‌కాల అనుభూతుల్ని ప‌రిచ‌యం చేసి, మ‌నుషుల మ‌న‌స్త‌త్వాల్ని అర్థం చేసుకునే అవ‌కాశం యిచ్చిన యీ కుటుంబానికి నా వంతుగా ఏం చేయ‌గ‌ల‌నా అని నేనెప్పుడూ ఆలోచిస్తూ వుండేదాన్ని. ఒక‌ళ్ల గురించి వొక‌ళ్లు తెలుసుకునే అవ‌కాశం లేక‌పోబ‌ట్టి గానీ, లేక‌పోతే యింత అంద‌మైన కుటుంబం వేరే ఎక్క‌డా వుండే అవ‌కాశం లేద‌నీ, వాళ్ల మ‌ధ్య జీవించగ‌ల‌గ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌నీ న‌మ్మేదాన్ని. ఒక‌రోజు అనుకోకుండా ఆ న‌లుగురూ వొకేసారి నా గ‌దిలో వుండ‌డం త‌ట‌స్థించింది. అలాంటి అవ‌కాశం మ‌ళ్లీ మ‌ళ్లీ రాద‌ని నాకు తెలుసు. వాళ్ల‌ రుణం తీర్చుకోవాల‌ని నేను నిజంగా అనుకుంటే, ఆ ప‌ని చేయ‌డానికి అదే మంచి సంద‌ర్భం.

నేను గొంతు స‌వ‌రించుకొని మాట్లాడ్డం మొద‌లెట్టాను. “అంద‌రికీ న‌మ‌స్కారం, నేను మీ అద్దాన్ని..” అన్నానో లేదో వొక్కసారిగా న‌లుగురూ వులిక్కిప‌డ్డారు. ఏదో దెయ్యాన్ని చూసిన‌ట్టు బెదిరిపోయారు. కాసేప‌టికి తేరుకున్నారు. నేను చెప్పేది శ్ర‌ద్ధ‌గా ఆల‌కించ‌డం మొద‌లెట్టారు. అన్నాళ్ల నా గుండె బ‌రువు కొంచెంకొంచెంగా దిగిపోతోంది. ఆ యింట్లో ఎవ‌రెవ‌రికి ఎలాంటి ఆశ‌లున్నాయి, ఎవ‌రెవ‌రికి ఎవ‌రి మీద ఎలాంటి అసంతృప్తులున్నాయి అన్న‌ది నేను చెపుతుంటే న‌లుగురూ నిర్ఘాంత‌పోయి నిల్చుండిపోయారు. నా ఉప‌న్యాసం చివ‌రికొచ్చే స‌మ‌యానికి ఒక‌ళ్ల మొహాలు వొక‌ళ్లు చూసుకోసాగారు. నా మాట‌ల‌తో వాళ్ల మ‌ధ్య అర‌మ‌రిక‌లు తొల‌గిపోయాయ‌నీ, వాళ్లంద‌రూ ఇక‌పైన ఎలాంటి అపార్థాలూ లేకుండా వొకే ప్రాణంగా వుంటార‌నీ, అలా వుండ‌డంలో నా కాంట్రిబ్యూష‌న్ కూడా వుంద‌నీ అనుకోవ‌డం నాలో కించిత్ గ‌ర్వాన్ని క‌లిగించింది కూడా. కానీ, కొద్ది క్ష‌ణాల మౌనం త‌ర్వాత నాకేదో తేడా అనిపించ‌సాగింది. నా అవ‌గాహ‌న‌కి అంద‌నిదేదో అక్క‌డ జ‌రుగుతోంద‌ని నాలో అనుమానం మొద‌ల‌య్యింది. కాసేప‌టికి, అంద‌రూ క‌లిసి ఏదో నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపించారు.

****

క‌ట్ చేస్తే… నేను ముక్క‌లుముక్క‌లైపోయి గోడ‌వ‌త‌ల ప‌డున్నాను. ముందు కొంచెం కోప‌గించుకున్నాలే కానీ, వాళ్ల న‌లుగురికీ నా మీద కోపం రావ‌డంలో త‌ప్పు లేద‌ని నాకు త‌ర్వాత్త‌ర్వాత  తెలిసొచ్చింది. నేను అద్దాన్ని అనే విష‌యం మ‌ర్చిపోవ‌డం నాదే త‌ప్పు. మ‌నుషులు ఎలాంటి అద్దాలు కొనుక్కోవాల‌నుకుంటారూ అన్న‌దానికి సంబంధించి హోమ్ నీడ్స్ షాపులో వున్నప్పుడు నేను నేర్చుకున్న ప్రాథ‌మిక సూత్రం నా మెద‌డు పొర‌ల్లో ఎక్క‌డో మ‌రుగున ప‌డిపోయింది. అవును, నాదే త‌ప్పు. నేను ఏం చేసి వుండాల్సింది, ఏం చేయ‌కుండా వుండాల్సింది అని ఆలోచ‌న‌లో మునిగిపోయి వున్న స‌మ‌యంలో వొక జీవి నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి, త‌న ప్ర‌తిబింబాన్ని నాలో చూసుకోవ‌డం మొద‌లెట్టింది. “ఎవ‌ర్నువ్వు” అడిగాన్నేను. “నా పేరు పంది” అని చెప్పింది. “నీకేమైనా స‌మ‌స్య‌లుంటే నాకు చెప్పుకోవ‌చ్చు”, అన్నాన్నేను. అవును మ‌రి, మందుబాబు ఇంట్లో వుండడం వ‌ల్ల నాకు అబ్బిన లోక‌జ్ఞానం అంతాయింతా కాదుగా.  “నేను బుర‌ద‌లో పొర్లాడ‌తాను, అశుద్ధం తింటాను, నాకే స‌మ‌స్య‌లూ లేవు” అని జవాబిచ్చింది పంది. నాకు న‌వ్వొచ్చింది. నా ముందు నిల‌బ‌డి మ‌నుషులు చెప్పిన మాట‌లు గుర్తొచ్చాయి. నాలుగురోజులు పోతే నీ రంగూ బ‌య‌టప‌డుతుందిలే అని మ‌న‌సులో అనుకున్నాన్నేను. ఆ క్ష‌ణం నుండీ దానిమీద వొక క‌న్నేసి వుంచాను. చెప్పొద్దూ, ఆ పంది ఒక హిపోక్రాట్ అని నిరూపించాల‌నే తాప‌త్ర‌యం నాలో బ‌య‌ల్దేరింది. ఎంత పంది అయితే మాత్రం అంత అతిశ‌యం ప‌నికిరాదు. దాని రంగు బ‌య‌ట‌ప‌డేయాలంటే నాకున్న తెలివితేట‌ల‌కి ఒక‌ట్రొండు రోజులు మించి ప‌ట్ట‌దు. అస‌లే నేను మామూలు అద్దాన్ని కాదు. డిఫ‌రెంట్లీ ఏబుల్డ్ అద్దాన్ని.

*****

అప‌న‌మ్మ‌కంతో కూడిన క్యూరియాసిటీతో ఆ పందినే కొన్నాళ్ల‌పాటు ప‌రిశీలిస్తూ వుండ‌డం నా దిన‌చ‌ర్య‌లో ప్ర‌ధాన‌మైన అంశంగా మారిపోయింది. త‌న‌ని చూస్తున్న‌కొద్దీ అలానే చూస్తూ వుండిపోవాల‌నే మార్పు నాలో వ‌చ్చిన‌ట్లు నేను ఒప్పుకోక త‌ప్ప‌దు. మొద‌టిరోజు చూసిన‌ప్పుడు ఎలా వుందో ఇప్ప‌టికీ అలానే వుంది. ప‌రిచ‌య‌మై కొన్ని రోజులు గ‌డిచాక ఎవ‌రిమీదైనా మ‌న‌కున్న అభిప్రాయంలో ఎంతోకొంత మార్పు వ‌చ్చి తీరుతుంది. కానీ, ఈ అనుభ‌వం కొత్త‌గా వుంది

రోజులూ వారాలూ నెల‌లూ గ‌డిచిపోతున్నాయ్‌. బుర‌ద‌లో పొర్లాడ‌డం, అశుద్దం తిన‌డం మినహా ఆ పంది యింకో ప‌ని చేయ‌డం లేదు. మిగిలిన పందుల‌తో అది మాట్లాడుతున్న మాట‌లు కూడా నా చెవిన ప‌డుతూనే వున్నాయ్‌. అస‌లు దేనిగురించీ దానికి ఫిర్యాదులున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.  ఆ పంది త‌న గురించి తాను చెప్పుకున్న మాట‌ల్లో నిజం వుంద‌ని నాకు క్ర‌మ‌క్ర‌మంగా విశ్వాసం క‌లిగింది. ఆ విష‌య‌మే దానితో చెపుదామ‌నుకున్నాను గానీ స‌మ‌యానికి  ఆ ద‌రిదాపుల్లో అదెక్క‌డా క‌నిపించ‌లేదు. అప్పుడే కాదు, ఆ త‌ర్వాత కూడా దాని ఆచూకీ దొర‌క‌లేదు నాకు. వ‌ర్షం వ‌చ్చి, నా మీద ప‌డిన మురికీ దుమ్మూ కొట్టుకుపోయిన‌ప్పుడు.. నాలోకి ఎవ‌రైనా తొంగిచూసి వాళ్ల‌ని వాళ్లు అందంగా చూసుకోగ‌ల‌ర‌ని నాకు న‌మ్మ‌కం కుదిరిన‌ప్ప‌డు నాకు ఆ పంది గుర్తొస్తూ వుంటుంది. “ఐ మిస్ యూ” అని నేను అనుకునే మాట దాని చెవిన ప‌డితే బావుండు అని నాకు ఒక‌లాంటి మ‌నాది మొద‌ల‌వుతుంది.

*

శ్రీధర్ బొల్లేపల్లి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా డిఫరెంట్ గా ఉంది. రచయిత ఎన్నుకున్న ప్రతీక లు మనసు కెక్కాలంటే ఎంతో ఆలోచన అవసరం. రచయిత పంది ని ఎందుకు idealize చేసాడు? కుటుంబం లోని వాళ్ళందరి జీవితాలను, వాళ్ళ మధ్య సంబంధాలను పాఠకులకు తెలియపరచడానికి రచయిత అవలంబించిన తీరు స్రుజనాత్మకంగా ఉంది 👍👍

  • Awesome!! This story has an amazing perspective towards things. Simply, just what we expect from Sridhar Bollepalli and Saranga, Fresh, thought provoking and AMAZING 😀.

  • ఇలాంటి అద్దంగా నేనుకూడా ఉంటుంటానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.. అలానే అలాంటి అద్దాలు నాముందు బోలెడున్నట్టుకూడా అనిపిస్తుంటుంది. ఇది చదివాక నన్ను నేను తడుముకున్నట్టూ ఇతరులనుకూడా నాలా చూసినట్టూ … ఏంటో రకరకాల ఫీలింగ్స్…

    నైస్ రైటప్ అన్నా.. యాజ్ యూజువల్.. నీ శైలి ఎప్పటిలా ఆపకుండా చదివించగలదని ఈ కథ నిరూపించింది. రియాలిటీకి ప్రతిరూపంగా ఉందీ కథనం.👌

  • మంచి కథ. అద్దాన్ని ప్రతీకగా వాడుకున్న విధానం నచ్చింది నాకు.

  • చనిపోబోతున్న కథని పంది బతికించింది.👍

  • మనుషుల్లోని హిపోక్రసీని అద్దంమీద నెపం పెట్టి బలే బయట పెట్టారు. పంది పర్వమైతే మరీనూ… హ్యాట్సాఫ్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు