ఓ ప్రేమ పూర్వక హెచ్చరిక సుస్మిత  Hiraeth

స్మశానభూమిలో మంటలకు దూరంగా పరుగెడుతున్న అతడూ ఆమె ఒక శిధిలభవనపు నీడకి చేరుకున్నారు. ‘‘మన్నులోంచి లేచిన మొలకల్లా నిటారుగా నిలబడి చేతులు కలుపుకున్నారు. నింగినుంచి జారిన చినుకుల్లా పెనవేసుకున్నారు. ఆమె పెదవుల్ని అందుకున్న అతనిలో విస్ఫోటనం. అతని దేహాన్ని అల్లుకున్న ఆమెలో ప్రకంపనలు’’

కోటపోలూరు చీలురోడ్డు దగ్గర బస్సుదిగి, డొంకలోంచి కాళంగియేటి ఇసకలో కాళ్లీడ్చుకుంటూ స్మశానం నట్టనడిమధ్యలో ఉన్నపుడు, మసక వెలుతురులో చెల్లెమ్మబొంద గట్టుమీద ఉండే వీధిమునీశ్వరుడి రావిచెట్టు తలవిరబోసుకుని గాలికి ఊగుతూ చేసిన వింత శబ్దం చెవినపడగానే వెన్నీపులో ఎవరో చెళ్లున చరిచినట్లు అనిపించేది. సరిగ్గా అట్లాగే ఒళ్లు జలదరించింది  ‘Hiraeth’ కథ చదవడం పూర్తి కాకముందే. “కొత్తావకాయ” సుస్మిత తన బ్లాగు లో ఈ ఏడాది జనవరిలో రాసిన కథ ఇది.

ఇది జ్ఞాపకం కాదు, భవిష్యత్తు. భయబీభత్స దుఃఖదృశ్యం. ఒక ప్రేమపూర్వక హెచ్చరిక.

కథ – కొన్ని వందల యేళ్ల తర్వాత జరిగింది.

వైరస్‌లతో విరుచుకుపడ్డ మూడో ప్రపంచయుద్ధం సంఘజీవనాన్ని ఛిద్రం చేసింది. మనిషికీ మనిషికీ నడుమ కొలతలకు అందని భౌతికదూరాలు అనివార్యం అయ్యాయి. ఒక మనిషికి మరొక మనిషి తారసపడే అవకాశమే లేని కాలం దాపురించింది. టోర్నడోలో పేల్చిన న్యూక్లియర్‌ బాంబు నాలుగో ప్రపంచయుద్ధంగా మారింది. చెట్టూ చేమా మాడిపోయింది. సకలజీవరాశులూ హతమయ్యాయి. 790 కోట్లున్న జనాభాలో మిగిలింది 4 కోట్ల మంది మనుషులు మాత్రమే. ఈ కొద్దిమందినీ కాపాడుకోవాల్సిన అగత్యం, అన్ని వినాశనాలకూ కారణమైన సైన్సుమీదే పడింది.  పరిశోధనలు మనిషి ఆయుస్సును 125 యేళ్లకు పెంచాయి.  ఇక చావునూ, ముసలితనాన్నీ గెలిస్తే చాలు..కొత్త పుట్టుకల అవసరం రాదు. కొన్ని శతాబ్దాలకు ముందు స్త్రీలు  తమ గర్భంలో 9 నెలలు మోసి పిల్లల్ని కనేవారనీ, విత్తనం నేలలో పడి  దానికదే మొలిచి చెట్టు అయ్యేదనీ విస్తుపోయి చెప్పుకుంటున్న కాలంలో ఈ కథ నడుస్తుంది.

విశ్వంలోని మరే ఇతర గ్రహమూ నివాసయోగ్యం కాదని తేలిపోయాక భూమిమీద మిగిలిన పరిమిత వనరుల ఆధారంగానే జనన మరణాల నియంత్రణ ఉండాలి. చావుపుట్టుకలు సరితూగే లెక్కలు కట్టి అనుమతిస్తేనే కొత్త జననం సంభవిస్తుంది. ఈ సమతుల్యతలో తేడాలు రాకుండా చూసే బాధ్యత గ్లోబల్‌ కౌన్సిల్‌ది. పల్లెలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు , దేశాల సరిహద్దులు చెరిగిపోయి ప్రపంచమంతా పిడికెడు గ్రామంగా మిగిలిపోయాక ఏర్పడ్డ పాలనా వ్యవస్థ అది.  స్త్రీ , పురుషుడు అనే లైంగిక అస్తిత్వాలు నేరంగా మారిపోయి మనుషులు నెంబర్లుగా ఉనికిలోకి వచ్చారు. వంటిల్లు అంతరించిపోయింది. మనిషి ఆరోగ్యం గ్లోబల్‌ కౌన్సిల్‌ బాధ్యత కాబట్టి, ఎవరికి, ఏ పోషకాలున్న ఆహారం ఎంత మోతాదులో అవసరమో నిర్ణయించి కేంద్రీకృత వంటసాల నుంచి అందే ఏర్పాటు జరిగింది. బరువు, ఆరోగ్యం నియంత్రణ కోసం రోజూ వ్యాయామం తప్పనిసరి. యంత్రానికి శరీరాన్ని అప్పగించేస్తే చాలు, ఏ అవయవానికి ఎంత ఒత్తిడి అవసరమో లెక్కగట్టి  నొక్కి, పిండి, సాగదీసి వదులుతుంది. ఆరోగ్యం కోసమే ఆహారం కాబట్టి మనుషులకు దంతాల అవసరం తగ్గిపోయింది. నమలడానికి కాక, ఆకారానికి మాత్రమే దంతాలు మిగిలాయి. పలువరస కూడా మారిపోయంది. వాడుక తగ్గిపోయి స్వరపేటిక మూసుకుపోయింది. ఊపిరికీ, ఆహారానికీ ఇబ్బంది కలుగుతుంది కనుక ఇళ్లలోని స్పీచలేబ్‌లో గొంతుకి వ్యాయామం చేయాల్సి రావడం మనుషులకి విసుగ్గా ఉంటోంది. ఎవరి ప్యాడ్‌లో వారు ఉండిపోయి, కంప్యూటర్‌ స్క్రీన్  మీద మాత్రమే సమాచార వినిమయంతో జీవించే కాలం అది.

…. ఇటువంటి దృశ్యం మన పిల్లలు పిల్లల పిల్లల పిల్లలకైనా ఊహించగలమా? కడుపు దేవి, పేగులు పెళ్లకొస్తున్నట్టు లేదూ?! భయం..దుఃఖం..కోపం పెనవేసుకుని తనుకులాడుతూ తల బద్దలైపోతున్నట్టు అనిపిస్తుంది ‘Hiraeth’ కథలోకి జారిపోయి కొట్టుకుపోతున్నపుడు.   రెక్కలు విప్పుకుని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న, కంటికైనా ఆనని ప్రాణంలేని క్రిమితో సతమతమవుతున్న కొవిడ్‌ కాలంలోంచి చూసినప్పుడు ఈ కథాదృశ్యం మరింత భీతావహంగా కనిపిస్తుంది. భవిష్యత్తును భూతద్దంలో చూపి భయపెట్టడం ఈ కథ లక్ష్యం కాదు. వర్తమానంలో మానవ నిర్లక్ష్యాన్నీ, స్వార్థపూరిత బాధ్యతారాహిత్యాన్నీ గుర్తుచేసి హెచ్చరించడం ఈ రచయిత్రి వ్యూహం. సైన్సులో సాధించిన విజయాలకు పొంగిపోయి ప్రకృతితో పరాచికాలు ఆడద్దని చెప్పడం ఉద్దేశ్యం. మానవశరీరంలో ఛేదించలేని రహస్యాలు రెండు మిగిలిపోయాయి అని రచయిత్రి చెబుతారు. అవి – మెదడు, గర్భకోశం. మెదడును శోధించి సాధించినవేవీ, ఆ మెదడులో కలిగే ఆలోచనలను నియంత్రించలేవు. అట్లాగే తొమ్మిది నెలల కాలాన్ని ఏడున్నర నెలలకు తగ్గించగలిగినా, గర్భసంచికి బయట బిడ్డ పుట్టడం అసాధ్యమే అయ్యింది. ఒక మనిషి మరణించిన రెండేళ్లకి ఒక జననానికి అనుమతి లభిస్తుంది. ఎంపిక చేసిన స్త్రీ గర్భసంచిలో ప్రయోగనాళికలోంచి పిండాన్ని ప్రవేశపెడతారు. సరిగ్గా ఏడున్నర నెలలకు రోబో సర్జరీతో బయటకు రాగానే బిడ్డ నర్సరీలోకి వెళ్లిపోతుంది. బిడ్డని కనడం అన్నది ఒక ప్రాజెక్టు మాత్రమే. మాతృత్వం అనే మాట డిక్షనరీల్లోనుంచి కూడా మాయమైపోయిన కాలం మరి.

సరిగ్గా ఇక్కడే కథను దారిమళ్లించారు రచయిత్రి.

నిజానికి P45XD అనే ప్రొఫెసర్‌తో కలిసి X120J అనే పరిశోధకురాలు, ఎప్పుడో మరణించిన ఒక వ్యక్తి మెదడును డీకోడ్‌ చేయడం కథలో ముఖ్యాంశంగా నడుస్తుంది. ఎవరి మెదడు అది? పుట్టినవారి ద్వారా కొనసాగిన తరంలో ఆఖరి మగవాడి మెదడు అది . సహజ సమాగమం పై కౌన్సిల్‌ నిషేధానికి విరుద్ధంగా పుట్టినవాడు. తెగలో చివరి మనిషి. అతడి మెదడు పొరల్లో అంతుచిక్కనివేవో దాగి ఉన్నాయి. ఏమిటవి? సైంటిఫిక్‌గా మానవజాతికి ఉపయోగపడేవి కాదని ప్రొఫెసర్‌ తేల్చేశాడు. పరిశోధన కొనసాగించాల్సిన అవసరమూ లేదని నిర్ధారించేశాడు. కానీ పరిశోధకురాలు ఆగలేదు. ఆ వ్యక్తి మెదడు జీనోమ్‌ మెమొరీని విప్పి చూసింది. ఒక మహాద్భుత చిత్రం ఆమె ముందు ఆవిష్కారమైంది.

’’ ప్రాణంలేని వస్తువుల చల్లని స్పర్శ కాకుండా ఏదో కావాలని ఆమె కోరుకుంటోంది.

దేహపు కర్తవ్యమింకేదో ఉన్నట్టు జలదరించింది.

అవయవాలకు అతీతంగా లోపలెక్కడో ఉద్వేగం రాజుకుంటోంది.’’

‘ఆమె రెప్పల చాటున మునుపెరుగని చెమ్మ ఊరి కన్నీటి కాలువలు కట్టింది.’

ఆ పరిశోధకురాలిని భరించలేని వేదనకు గురిచేసి జొరబడ్డ ఊహ, కలగా మారింది.

ఆ కలలోని దృశ్యం ఇదీ – స్మశానభూమిలో మంటలకు దూరంగా పరుగెడుతున్న అతడూ ఆమె ఒక శిధిలభవనపు నీడకి చేరుకున్నారు. ‘‘మన్నులోంచి లేచిన మొలకల్లా నిటారుగా నిలబడి చేతులు కలుపుకున్నారు. నింగినుంచి జారిన చినుకుల్లా పెనవేసుకున్నారు. ఆమె పెదవుల్ని అందుకున్న అతనిలో విస్ఫోటనం. అతని దేహాన్ని అల్లుకున్న ఆమెలో ప్రకంపనలు’’

కలలోని ఈ ప్రేమోద్రేక దృశ్యం తెగలోని చివరి మనిషిది మాత్రమే కాదు. ఈ కలనుగన్న రోబోయుగపు పరిశోధక స్త్రీలో రగిలిన  ఆకాంక్ష కూడా. న్యూక్లియర్‌ బాంబులతో సముద్రాలు ఇంకిపోవచ్చు కానీ, మనసులోపలి తడి మిగిలే ఉంటుందని చెప్పిన కథ ‘Hiraeth. అడవిలో అమ్మనుంచి తప్పిపోయిన లేగదూడ  అరిచే అరుపులో ధ్వనించే దుఃఖార్తి ఈ కథ.

కథకు అవసరమైన శైలిని వస్తువే ఎంపికచేసుకున్నది అని అర్థమవుతుంది.  ఆధునిక సాంకేతిక పదజాలంతో కూడిన వాక్యాలు కథకు గాఢతనిచ్చాయి. తెలుగుకథ వస్తు, శిల్లాల్లో కొత్త దారులను వేసుకుంటూ వెళ్తోందనే సంతోషం కలుగుతోంది  సుస్మిత రాసిన ఈ కథను చదివినప్పుడు.

కథ ను ఇక్కడ చదవొచ్చు.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రచనలో ఏముందో చెప్పగలగడం, తాను చెప్పిన విషయాన్ని అందరిచేతా ఒప్పించగలగడం కొద్దిమందికే సాధ్యం. ఉమా గారి సమీక్ష కథదాకా నడిపించింది. కథ… భవిష్యత్తును భయంకరంగా ఆవిష్కరించింది. మానవజాతి తప్పిదాన్ని ఎత్తిచూపి, కర్తవ్యాన్ని విప్పి చెప్పింది అంతర్లీనంగా… మరీ ముఖ్యంగా ఎటువంటి నీతి బోధలూ లేకుండా.

  • విశ్లేషణకు ధన్యవాదాలు ఉమామహేశ్వరరావు గారూ.

    నారాయణస్వామి గారికీ, మునిగోపాల్ గారికీ ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు