టెర్లిన్ షర్టు, యెనిమిది మూర్ల పంచె ధరించిన మనిషి

తమిళ మూలం:జి. నాగరాజన్
తెలుగు:దాము

జి.నాగరాజన్(1929-1981)మధురైలో పుట్టాడు. తమిళ్, యింగ్లీషు, Maths‌లో ప్రతిభ వున్న వాడు. Star Maths teacher. మధురైలో ఆ నాటి చాలా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ సినిమా హాల్లల్లో తమ ప్రకటనల్లో ఆయన పేరుని ప్రముఖంగా వేసే వారు.

తమిళ సాహిత్యంలో ఆయనది వొక ప్రత్యేక స్థానం. వొక విశిష్ట గొంతుక. మొదట కమ్యూనిస్టు వుద్యమంలో పని చేశాడు. అనేక ఆందోళనల్లో పాల్గొని రెండు మూడు సార్లు జైలుకెళ్ళొచ్చాడు. కానీ ఆయన తాగుడు, సెక్స్ వర్కర్లతో సంపర్కం వంటి ‘అరాచక’ ప్రవర్తనని కమ్యూనిస్టు పార్టీ భరించలేకపోయింది. ఆయన కూడా ఆ నిర్మాణంలో వుండలేక బయటికొచ్చాడు. రక రకాల వుద్యోగాలు చేసాడు. చివరికి ఆ అలవాట్లు, బలహీనతల స్థాయికి చేరి, 52 యేళ్ల వయసులో ఆయన్ను బలితీసుకున్నాయి.

ఆయన 30కి పైగా కథలు, వొక నవల, వొక నవలిక, యింగ్లీషులో వొక నవలిక రాశాడు. ఐదు మంది ప్రముఖ తమిళ రచయితలు నాగరాజన్ ప్రధాన పాత్రగా కథలు రాసారంటే, తమిళ సాహిత్యంలో ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.

నాగరాజన్ People from the lower depths of the society గురించి రాశాడు. ఆయన నవల ‘నాళై మట్రుం వొరు నాళే'(రేపు కూడా యింకొక రోజే)లో, వొక pimp జీవితంలో వొక రోజు వుంటుంది. ఆయన కథల్లో కూడా, రిక్షా వాళ్ళు, సెక్స్ వర్కర్లు,చిన్న చిన్న నేరస్థులు, అసంఘటిత కార్మికులు వంటి వాళ్ళ గురించే వుంటుంది. ‘Le vagabond et son ombre'(సంచారి మరియు అతని నీడ)పేరుతో రాసిన biographical sketchలో ఎం. కన్నన్ అంటాడు, ‘In Nagarajan’s stories, for the first time in Indian literature, and extraordinarily in Tamil literature, we encounter a world of marginal, hopeless human beings crawling like “ants on a Mobius strip”, devoid of any of the typical traditional “Indian” elements of transcendence or salvation.’

నాగరాజన్ రచనల్లో వాస్తవ వాదం, అస్థిత్వవాదం కలిసి వుంటాయి. ప్రముఖ యిండాలజిస్ట్ డేవిడ్ షుల్మన్ నాగరాజన్‌ను ‘తమిళ కామూ’ అని పిలిచాడు. ‘Nagarajan somehow combined the grimy realism of Gorky with the lyrical despair of Camus’ అంటాడు షుల్మన్, నాగరాజన్‌ నవలకు యింగ్లీషు అనువాదానికి రాసిన ముందుమాటలో. అందులోనే షుల్మన్ ఈ కథ గురించి, ‘One of the finest of his mature stories’ అన్నాడు. Simple-minded realisim నుండి, dream-like, deeply moving dimension of Devayani’s mindకు కథనాన్ని తీసుకెళ్తాడు నాగరాజన్ అంటాడు షుల్మన్.

షెల్లీ అన్నట్టు, జీవితపు ముళ్ళ మీద పడి, రక్తం కార్చి, తన అనుభవాల్ని కథలుగా మిగిల్చి వెళ్ళిన మనిషి నాగరాజన్.

మూల కథ ‘టెర్లిన్ షర్టుం యెట్టు ముళ వేట్టియుం అనింద మనిదర్’ రచనా కాలం:1973

***

పోలీసు రైడు వుండచ్చని నమ్మకమైన సమాచారం వున్నందువల్ల, తలుపు తెరచుకొని, యింటి గుమ్మంలో నిలబడ వద్దని చెప్పేశాడు మామ. వొక నెలకు ముందు యిల్లు వదిలి పారిపోయిన కమల గురించి యే సమాచారమూ లేదు. వోనం పండక్కి పుట్టింటికి పోయిన సరస యింకా తిరిగి రాలేదు. బయటి తలుపు మూసేసి, హాలుకు చివర వున్న గదిలో ట్యూబు లైటు వెలుతురులో, మంచం పరుపు మీద వొంటరిగా కూర్చొని వున్న దేవయానికి విసుగు కమ్ముకొంది.

యేదో గుర్తొచ్చిన దానిలా, హాలులోని మెట్లెక్కి పైకి పోయి, మిద్దె గదిలో లైటు వేసింది. కింది గది కన్నా, యిక్కడ సౌకర్యాలు యెక్కువ. రక రకాల విదేశీ చిత్రాలు గోడను అలంకరించాయి. గదిలో గోడ వారగా చాలా పెద్ద చెట్టినాడు మంచం, దాని మీద ‘డబల్’ బెడ్ వుంది. ‘నైట్ బుకింగ్’కు మాత్రమే యెక్కువగా వుపయోగిస్తూ వస్తున్న ఆ గది, గత నెల రోజులుగా మనుషుల అలికిడి లేకుండా వుంది. కమలకే ‘నైట్ బుకింగ్’ యోగం యెక్కువ.

దేవయాని మెల్లగా పరుపును పైకి లేపి, దాని కింద వున్న అర అంగుళం మందంతో, మెలి తిప్పి వున్న దారాన్ని బయటకు తీసింది. ఆమె వూరి నుంచి వస్తున్నప్పుడు, ఆమె బెడ్దింగును కట్టేందుకు వాళ్ళమ్మ వాడిన దారం అది. గది మధ్యలో నిలుచొని, దారపు గట్టితనాన్ని పరీక్షిస్తున్నట్టు, దాన్ని చాలా రకాలుగా లాగుతూనే, పై కప్పు కేసి చూసింది. దూలంలో వొక యినుప రింగు వేలాడుతూ వుంది. అది మంచానికి నేరుగా పైన వుంది. మంచం మీద నిలబడి, దారాన్ని ఆ రింగులోకి దూర్చడం కుదురుతుందా? పై కప్పు మధ్యలో వున్న మెర్క్యురీ బల్బుకు వున్న మెటల్ కవర్ ఆ యినుప రింగును కవర్ చేస్తున్నందువల్ల, ఆ రింగు స్పష్టంగా కనిపించడం లేదు.

గబ గబా కిందికెళ్ళి, బట్టలు ఆరేసే వొక వెదురు కర్రను తీసుకొచ్చింది దేవయాని. మంచం మీద నిలబడి, కర్రతో దారాన్ని రింగులోకి దూర్చడానికి ప్రయత్నించింది.

కింద తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. కర్రను, దారాన్ని మంచంలో పడేసి కిందికి పరిగెత్తింది. బయటి తలుపు తెరిచే ముందు కొంచెం తటపటాయించింది. తలుపు యెవరూ తట్టలేదేమో అనిపించింది. పక్కనున్న పూంగావనం వాళ్ళ తలుపు తెరస్తున్న శబ్దం మాత్రమే వినిపించింది. తలుపు సందులోంచి యెవరైనా నిలుచొని వున్నారేమో అని చూసింది. యెవరూ నిలుచొని వున్నట్టు లేదు. దేవయాని మిద్దె మీద గదికి వచ్చింది.

మళ్ళీ, కర్రతో దారాన్ని రింగులోకి దూర్చేందుకు ప్రయత్నించడం మొదలు పెట్టింది. భుజాలు నొప్పెడుతున్నాయి. ముఖంలో నుంచి చెమట మొదలై, నుదుటి చెమట ఆమె జవ్వాది బొట్టును కరిగించింది. దేవయానికి ఏదో తోచింది. కర్రనూ, దారాన్ని నేల మీద పడేసి, త్వర త్వరగా కిందికి పరిగెత్తింది.

వెనుక వరండాలో, కిటికీ దగ్గర, తుప్పు పట్టిన అరడుగు యినుప మేకు వెతికి తీసుకొని పైకి వచ్చింది. ఆ మేకుకి మధ్యలో దారపు వొక చివరను బిగించి కట్టింది. ఆమె దారాన్ని లాగిన లాగుడుకి చెయ్యి కోసుకుంది. నొప్పికి తట్టుకోలేక, చేతి మీద యెంగిలి వుమ్మి, దాన్ని నోటితో వూదింది.

మంచం మీద నిలబడి, కర్ర సాయంతో మేకుని యినుప రింగులోకి దూర్చడానికి ప్రయత్నించింది. మేకు రింగులోకి నేరుగా పోకుండా, మాటి మాటికీ కింద పడిపోతూ వుంది. వొక నిమిషం తమాయించుకొని, వణుకుతున్న చేతుల్ని స్థిరంగా పెట్టుకొంది. మళ్ళీ మేకుని యినుప రింగులోకి దూర్చడం మొదలు పెట్టింది. మేకు వొక సగం యినుప రింగులోకి పోయినప్పటికీ, రెండవ సగం పోవడానికి దారపు ముడి అడ్డుపడుతూ వుంది. దారపు బరువు కూడా మేకు లోపలికి వెళ్ళకుండా ఆపుతోంది. దారం చాలా పొడవుగా వుంది. అంత పొడవు వుండకూడదనిపించింది దేవయానికి. దాన్ని తగినంత వరకు కత్తిరించడానికి కత్తి యెక్కడ దొరుకుతుందా అని ఆలోచించింది. యింట్లో కత్తేదీ లేదు. బ్లేడు? అది కూడా లేదు.

దేవయానికి వంట గదిలో వున్న కత్తిపీట గుర్తొచ్చింది. మెట్ల మీద గెంతుకుంటూ కిందికెళ్ళి కత్తిపీట తెచ్చింది. మంచం వొక చివర నిలబడి, తన మెడకూ, యినుప రింగుకూ మధ్య నున్న దూరాన్నీ, వురికి సరిపోయే దారపు పొడవునూ కొలిచింది. మేకుకు కట్టి వున్న మొన నుంచి దారాన్ని యెక్కడ కత్తిరించాలో నిర్ణయించుకొంది. కత్తిపీటలోని కత్తి పదునుగా వుండటం వల్ల, దారాన్ని కోయటం పెద్ద యిబ్బందవలేదు.

యింకో ఆలోచన కూడ వచ్చిందామెకు. కత్తితో కర్ర వొక చివర నిలువుకు, కొంచెం రెండుగా చీల్చింది. దారాన్ని ఆ చీలికలోకి దూర్చింది. యిప్పుడు దారం జారకుండా కర్రతో దారాన్ని సుళువుగా పైకి లేపడానికి వీలయింది. యీ సారి మేకుని యినుప రింగులోకి దూర్చి, దారాన్ని రింగులో నుంచి కిందికి వేలాడదీసింది. మంచం చివర నిలబడి, దేవయాని తన తల పట్టేంత వురిని దారం చివర వొక రింగులాగా జారు ముడి వేసి చూసింది. ఆ ముడి సరిగా పడలేదు. ఆమెకు యిందులో అనుభవం లేదు. రెండు మూడు సార్లు విఫల యత్నం చేశాక, ముడి మంచిగా పడింది.

అప్పుడు, కిందెవరో తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. దేవయాని కొంచెం తటపటాయించింది. కింద తలుపు తడుతున్న శబ్దం యెక్కువైంది. ‘యిప్పుడు దీనికి అవసరం యేం వచ్చింది?’ అనుకొన్న దానిలా, దేవయాని కిందకి పరిగెత్తుకెళ్ళి, చీర కొంగుతో ముఖం తుడుచుకొని, బట్టలు సరిచేసుకుంటూ తలుపు తెరిచింది.

మామ, యింకొకరు మసక వెలుతురులో నిలబడున్నారు.

“తలుపు తీయడానికి యింత సేపా?” అన్నాడు మామ.

“పైనున్నా” అంది దేవయాని.

“తలుపేసుకొని, లైటార్పేసి వుండమంటే, నిన్నెవడు పైకెళ్ళమన్నాడు?” అంటూనే మామ లోపలికి రాగా, వెంట వచ్చినతను కూడా లోపలికొచ్చాడు.

“హుం..లైటెయ్యి” అంటూ మామ బయటి తలుపేసాడు. హల్లో లైటేసింది దేవయాని.

మామతో వచ్చినతను యేపుగా యెదిగివున్నాడు. హరికథలు చెప్పే వాడికి వున్నట్టు పొడవాటి జుత్తు. టెర్లిన్ షర్టూ, యెనిమిది మూర్ల పంచె ధరించి వున్నాడు. మామూలుగా వచ్చేవాళ్ళు చూసినట్టుగా, ఆమెనే తేరిపార చూడకుండా, హాలునూ, దానికానుకొని వున్న గదినీ, చుట్టు పక్కలా చూస్తున్నాడు.

“వోకే కదా అండీ” అతన్ని చూస్తూ అన్నాడు మామ.

హాలుని ఆనుకొని వున్న గదిలోకెళ్ళి, ట్యూబులైటు వెలుగులో గదంతా కలయజూసి, “ఫర్వాలేదు, అంతా శుభ్రంగానే పెట్టుకున్నారు” అన్నారాయన.

“యిక్కడంతా శుభ్రంగానే వుంటుంది” అన్నాడు మామ దొంగ నవ్వుతో. “అయితే నేనొస్తా”

“డబ్బు?” అన్నాడు వచ్చినతను.

“అంతా డాక్టరు దగ్గరే తీసుకుంటా” అంటూనే బయటికెళ్ళాడు మామ.

బయటి తలుపేసి, గొళ్ళెం పెట్టి, హాలులో లైటు ఆర్పి, వచ్చినతనితో “రండి” అంటూ హాలును ఆనుకొని వున్న గదిలో, ట్యూబులైటు వెలుతురులోకి ప్రవేశించింది దేవయాని. నేరుగా వెళ్ళి మంచం మీద కూర్చుంది. అతను సందేహిస్తూ, దగ్గరికొచ్చి నిల్చున్నాడు.

“యిట్లా కూర్చోండి” అందామె.

“లేదు, ఆ హాల్లో కుర్చీ వుంది కదా, దాన్ని తీసుకురా” అన్నాడు. ఆమె నవ్వింది.

“యెప్పుడూ పడక కుర్చీలో హాయిగా పడుకోవడం యిష్టం నాకు” వివరిస్తున్నట్టు చెప్పాడు.

చాలా మంది ఆ వెదురు పడక కుర్చీలో కూర్చొని, దేవయానితో ముద్దు ముచ్చట్లు పెడతారు. అందుకని, వెంటనే వెళ్ళి, ఆ కుర్చీ తెచ్చి మంచం పక్కన వేసింది. అతడు కుర్చీలో వాలాడు, ఆమె మంచంలో కూర్చొంది. వొకరినొకరు చూసుకొన్నారు.

“నువ్వు అందంగా వున్నావు” అన్నాడతను. ఆమె నవ్వింది.

“కొంచెం చీరను వదులు చెయ్యి” అన్నాడు.

ఆమె మళ్ళీ నవ్వింది.

“హుం..తమషాకు చెప్పలేదు. నీ రొమ్మును పూర్తిగా కప్పేయకుండా కొంచెం చీరను పక్కకు జరుపు.”

ఆమె జరిపింది.

“కొంచెం నేరుగా కూచో”

ఆమె మళ్ళీ నవ్వింది.

“కొంచం నేరుగా కూర్చోవచ్చు కదా?” అనునయంగా అడిగాడు.

“మీరేంటి ఫోటో తీస్తున్నారా?” ఆమె నవ్వింది.

“అవును. అలానే అనుకో” అన్నాడు.

ఆమె వొక చిత్రకారుడి ముందు కూర్చొని సరిచేసుకుంటున్నట్టు, చీరను, వెంట్రుకల్ని సరిచేసుకుంది. కాసేపు ఆమెను చూస్తూ ఆస్వాదించి, యేదో లోపాన్ని కనిపెట్టినట్టు, “కూర్చొని వుంటే బాలేదు. అలా పడుకో” అన్నాడు.

“మీరు కూర్చొనే వున్నారు కదా, యేమీ చెయ్యకుండా” అందామె నవ్వకుండా.

“నేనిక్కడ కూర్చొని వుండిపోవడానికే వచ్చాను” అన్నాడు.

ఆమె నవ్వుతూనే పడుకొంది. వొక చెయ్యి మడిచి తల కింద పెట్టుకొని, అతన్ని చూస్తూ నవ్వుతూ పడుకొంది. అతను ఆమెని చూస్తూనే వున్నాడు.

“మీకు కోరిక లేదా?” అడిగింది.

“బోలెడుంది.”

“మరి?”

“అందుకే కదా నిన్నే చూస్తూ వున్నా.”

“చూస్తూ వుంటే సరిపోతుందా?” ఆమె నవ్వింది.

“తాకి చూడచ్చు”

“మీరు తాకి చూళ్ళేదే!”

“తాకితే నువ్వు గమ్మున వుండాలి కదా!”

ఆమె నవ్వింది. “నేనేమీ చిలిపి చేష్టలు చేయను, మీరు వూరికే అలా తాకి చూడండి.”

బయటి తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. ఆమె లేవడానికి వీలు కాని దానిలా ఆలస్యం చేసింది. అతను నిదానంగా లేచి వెళ్ళి తలుపు తీశాడు. తలుపు తట్టింది మామనే. మామ అతన్ని యేమీ అడక్క ముందే, అతను బ్యాగులోంచి యేదో తీసి మామకు యివ్వడానికొచ్చాడు.

“వద్దు, వుంచండి, అంతా డాక్టరు దగ్గర తీసుకుంటా. డాక్టరు షాపుకు వచ్చేశారు. మీరు రాలేదా అని అడిగారు” అన్నాడు మామ.

“యిప్పుడే వచ్చేస్తా అని చెప్పండి” అన్నాడతను.

మామ బయటికెళ్ళాడు. అతను తలుపేసి గొళ్ళెం పెట్టాడు.

“ఘోరం” అంటూనే అతను కుర్చీలో వాలాడు.

“యేది?” అడిగిందామె, మంచం మీది నుంచి లేచి, అతని దగ్గర నిలబడి.

“యీ టైము లెక్క గురించే” అని అతను అంటుంటే, ఆమె అతన్ని హత్తుకోడానికి ప్రయత్నించి, అతని బుగ్గల్ని, చివరికి అతని పెదాల్ని హడవిడిగా ముద్దాడింది.

“సరే, నువ్వు పోయి పడుకో” అన్నాడతను.

“మీరేం చేస్తారు?” అని అడుగుతూనే పోయి పడుకుంది.

“యిక్కడే వుంటాను” అన్నాడతను.

“అది అడగలేదు, యేం పని చేస్తారు?”

“పుట్టి, పెరిగి, చనిపోయే పని చేస్తున్నా”

ఆమె మంచంలోంచి లేచి, అతన్ని లేపి గట్టిగా హత్తుకోవడానికి ప్రయత్నించింది. అతను మాత్రం కుర్చీలో అలానే వాలి వున్నాడు. వోడిపోయిన ఆమె, మంచం దగ్గరికొచ్చి, దాని మీద పడింది.

“నాకు దాహమేస్తుంది” అంది దేవయాని.

అతను లేచి, హాల్లో లైటేసి, మూలన వున్న బానలోంచి నీళ్ళు తీసుకెళ్ళి ఆమెకిచ్చాడు. పడుకునే నీళ్ళు తాగింది. కొంచెం నీళ్ళు ఆమె యెదపై పడి, రొమ్ముల్ని తడిపింది.

నిలబడే వున్న అతను, “వెళ్ళొస్తాను” అన్నాడు.

“మళ్ళీ యెప్పుడొస్తారు?” అని అడుగుతూ ఆమె మంచం మీది నుంచి లేచి వచ్చి, అతని పక్కన నిలబడింది.

“నువ్వు పిలిచినప్పుడొస్తాను” అంటూ అతడు బ్యాగులో నుంచి ఐదు రూపాయల నోటు తీసి ఆమె వైపు చాచాడు. ఆమె దాన్ని తీసుకొని, కళ్ళకద్దుకొని, దిండు కింద పెట్టింది. అతను తలుపు తీసుకొని బయటికెళ్ళాడు.

రాత్రి మూడు గంటలకు మామ యింటికొచ్చాడు. అతన్ని గురించి తెలుసుకోవాలని ఆమెకు ఆతృతగా వుంది. కానీ, కస్టమర్ల యెవరి పట్లా ఆమె యెక్కువ శ్రద్ధ చూపించడం మామకు నచ్చదు. అందుకని, మొదలు పెట్టడమే, “ఆయన నాకు ఐదు రూపాయలిచ్చాడు” అంది.

“యెవరతను?” అడిగాడు మామ.

“అదే, మీరు మొదట తీసుకొని వచ్చారే, ఆయనే”

“మొదట యెవర్ని తీసుకొచ్చాను? నేనీరోజు వొకే సారి కదా వచ్చాను?”

“అదే, యేడు, యేడున్నరకి తీసుకొచ్చారు కదా? ఆయనే, గుర్తులేదా?”

“యేడు, యేడున్నరకా? నేను సుబ్బు యింట్లో నుంచి బయల్దేరేటప్పుడే తొమ్మిది గంటలు అయ్యుంటుందే!”

“యీ రోజు కూడా సుబ్బు యింటికి పోయారా?”

“అవును. యిరవై రూపాయల వరకు గెలిచా. యీ రోజు తొమ్మిది గంటల దాకా వీధిలోనే తల చూపించద్దని పొలీసు హెడ్డు చెప్పాడు. నేను కూడా తొమ్మిది గంటల దాకా సుబ్బు యింట్లోనే వుండిపోయిన.”

“అయితే, ఆ టెర్లిన్ షర్టు అతన్ని మీరు పిల్చుకొని రాలేదా? ఆయనతో కూడా వొక డాక్టరు వచ్చాడంటనే, మీరు ఆ డాక్టర్ని వేరే యింటికి పిల్చుకొని పోయారే!”

“డాక్టరా? అదెవరు డాకుటారు? నీకేమైనా మతి పోయిందా? లేదా తలుపు తెరిచేసి కలలు కంటున్నావా?”

“లేదే, తలుపు మూసేసి పైనే కదా వున్నాను. మీరు తలుపు తట్టినప్పుడే కదా కిందికొచ్చాను.”

మామ కళ్ళార్పకుండా చూస్తున్నాడు.

ఆమె చెబుతూనే వుంది.

“కొంచెం పొడవుగా వున్నాడు. పొడుగు జుత్తు. నీలం రంగు టెర్లిన్ షర్టు, యెనిమిది మూర్ల పంచె కట్టుకొని వున్నాడు. కానీ, నన్ను తాకను కూడా లేదు.” అని చెప్పి, దేవయాని నవ్వింది.

“దేవూ, వూరికే వాగద్దు. నేను వీధిలోకి వచ్చేసరికే గంట తొమ్మిది దాటిందే. ఆ సాయిబుల కుర్రాడ్ని మాత్రమే కదా యీ రోజు పిల్చుకొని వచ్చాను. అంతకు ముందు యెవర్ని తీసుకొచ్చా?”

“నేను వాగుతున్నానా, మీరు వాగుతున్నారా?” అంటూనే తాను అతని దగ్గర నుంచి తీసుకున్న ఐదు రూపాయల నోటుని మామకు చూపించాలని దిండుని లేపి చూసింది. దాని కింద యేమీ కనిపించ లేదు. దేవయానికి వొళ్ళు జలదరించింది. కంగారుగా దిండుని అటూ యిటూ యెత్తి చూసింది. యేమీ కనిపించలేదు. పరుపు కింద చూసింది. దిండు కవరు చివర్లు పట్టుకొని బయటికి లాగి, ఆ కవరు లోపలంతా తడివి చూసింది. దిండు నేల మీద పడింది. నేల మీద పడిందేమోనని వెతికింది. ఐదు రూపాయలు కనిపించలేదు. మళ్లీ దిండు కవర్లో వెతికింది.

“యెక్కడికి పోయుంటుంది? యిక్కడే యెక్కడో వుండాలే?” అంది నమ్మకంతో.

“యేది?” అడిగాడు మామ.

“ఆ టెర్లిన్ షర్టు అతను యిచ్చిన ఐదు రూపాయలే.”

“నువ్వేమైనా కల గిల కన్నావా?” మామ నవ్వాడు.

“మీరే, గందరగోళంలో అంతా మర్చిపోతారు” అంది కనిపించకుండా పోయిన ఐదు రూపాయల్ని యింకా వెతుకుతూనే.

“వొక వేళ మిద్దె పైన వుందేమో” అనుకుంటూ దేవయాని హడావిడిగా మెట్లెక్కి మిద్దె గదికి వెళ్ళింది.

ఆమె ఆర్పడం మర్చిపోయిన మెర్క్యురీ లైటు వెలుగులో, ఆమె ప్రయాసపడి యినుప రింగులో నుంచి వేలడదీసిన దారం, దాని చివరను అలంకరించి వున్న వురిని చూసి, ఆమెకు వూపిరి ఆడలేదు.

***

దామూ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు