1
అతడి ఋతువు
వెన్నెల్లో
పారిజాతమై,
నిన్నలోకి… కాస్త నీలోకి
విచ్చుకున్నా.
మంచు పూలై కరిగిన
నా గుబులు గుండెకు,
అరచేతి వెచ్చదనంతో
నువ్వంటించిన నెగడు
కాలనీదు.
ఆరిపోదు.
మనసు నిండా మసక..
వొంటి మీద వెన్నెల.
నడక తేలికవుతుందో,
మరింత భారమవుతుందో,
పాలపొంగుల మేఘాలెక్కి
ఈ భావం తేలిపోతుందో!
మధనమెటూ తేల్చదు.
చెలిమి చేయి చాచదు.
నువ్వురేపిన నిప్పు..
ఎంతకీ నివురు కప్పదు.
హేమంతాన్ని తాకిన
వాసంత చుంబనంలా..
లోపలా బయటా
చలి పుట్టించే ఉష్ణం.
2
నా వలపు దేవర ముద్దు
నీలాంబరంలో,
చిలికే మోహవర్ణరాగంలో,
నిండు మబ్బుల్తో కూడె
వాడు – నా ఈడునంతా తడిమె.
ఉరుమై మెరుపై,
కౌగిళ్ల వానై,
తడవ తడవకూ తడిపె
తెరలు కరిగించె.
ఒక్క చినుకై జారి,
వేయిగా చెదిరి,
రేయిలో వెన్ను వొణికిన సద్దు.
ఇది – నా వలపు దేవర ముద్దు
*
Image: Rafi Haque
భావం బాగుంది రెండు కవితల్లో …