నింగిని గీసుకునే అల్లరిపక్షి

1.
కొంచం కొంచం ఆశ ఉమ్ములా ఊరుతుంది.
అర్ధాకలితో పిల్లవాడు సగం బన్నుని
ప్రేమిస్తూ నిదురోతాడు.
రేపటి రోజు నిండు భోజనమై కలలో వస్తుంటుంది.
2.
ఆమె ఉగ్గబట్టుకుని చెప్పులీడుస్తూ
పనిని ప్రేమిస్తుంది.
అతను కళై ఆమె ముఖాన కురుస్తాడన్న
లీలామాత్రపు ఆశలో నిద్రై జోగుతుంది.
నిజాలు నరకబడ్డాయని తెలిసి
తనుసగానికి కూలిపోతుంది.
3.
ఏదీ హామీ గాని కాలం
క్షణాలను గుసగుసల దుమ్ముతో పేరుస్తుంది.
శిధిలజీవితపత్రాలు ఏరుకోను ఎవరూ మిగిలిఉండరు.
కొంత వ్యధ కప్పిపెట్టబడి, నాగరికత అంచుని ఎలా
ఎప్పుడు తాకుతుందో ఎవరికీ తెలియదు.
4.
ఆకురాలు కాలమంతా కొంచం దుఃఖం.
గల్లంతైన ఊహలు శిశరాకాశపు మబ్బులు.
ఋతువులు మహ గమ్మత్తైన మంత్రగాని మాటలు.
5.
కొన్ని గీతాలు పాడుకుని శాంతిని ప్రేమించే
విశ్వాత్మిక దేహమీ రహస్యనేల.
ఆకాశపుటంచులను పట్టుకుని
హద్దులుగీసుకునే అల్లరిపక్షి కూడా!
*

2

అంతఃశోధన

ఏముంది ఇక్కడ? అని అడిగావా!
అయితే విను-
భయంతో, పగటినీ వెలుతురునీ మూసిన జీవితముంది.
రహస్యమైన రాత్రి చీకటి ఉంది.
గుసగుసల కీచురాళ్ళున్నాయి.
ఇక్కడ ఏముందని అడిగావుగా విను-
మనసు తుంచబడిన పదాలున్నాయి.
పారిపోయిన భావాలున్నాయి.
ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే-
నువ్వూహించని
కంటి నలుసులున్నాయి.
ఏమరుపాటులో కాలిన కలలున్నాయి.
నలిగిన హృదయముంది.
ఎలాగో తేరుకుని నడిచేప్పుడు
దారిని తడిమే చూపులున్నాయి.
అన్నీ విదిలించుకుని బ్రతికేప్పటికి
గుబాళించని మనసు ఉంది.
అడుగుకో పసిఛాయ ఉంది.
మోసుకుపోయే బాధ్యతలున్నాయి.
ఏముందిక్కడా అని అడిగావుగా; మరేమీ లేదు.
మళ్ళీరాని బాల్యంలో, ఉన్నానో లేనో తెలీని ‘నేను’
ఎలా బ్రతికున్నానో ‘నీకేమైనా’ తెలుసా !
అన్ని సమయాలూ తీపికబురులనేమీ చెప్పవు.
అన్నిసార్లూ తీర్చిదిద్దిన సంతోషాలుండవు.
గోటికి కరుచుకుని నొప్పితో విలవిలలాడిన పన్నుది
తోచీతోచని కధంటావా? నీకంటే అమాయకులుండరు!
లేదూ నీకంటే కౄరస్వభావి..
నువ్వు అడకపోయినా చెబుతాను –
చిట్టిపొట్టి మాటల మూటలు విప్పేతీరాలిపుడు.
శోకానికి పుట్టిన కన్నీళ్ళ ఉప్పదనంలో వెళ్ళిన జ్ఞాపకాలకి
ఒక లిపి కావాలిపుడు.
బంధాల్లో నివ్వెరపోయిన వాస్తవాలకి, ఒక మెత్తటి
అతిపదునైన భాష కావాలిపుడు.
అంతరాల్లో తప్పి బ్రతికే, అంతరాళాల్లో
మరణించి బ్రతికే కంటినలుసుల్లాంటి మనుషులకి
గొంతు కావాలిపుడు.
ఇక ఆఖరుగా ఒకే ఒక మృదువైన నాలుక కావాలిపుడు –
పదాల సౌందర్యాన్నీ పెదాల మృదుత్వాన్నీ
వాక్య గంభీరాన్నీ
జన్మ అర్ధాన్నీ మరణపు శబ్ధాన్నీ
జీవించడంలోని సంగీతాన్నీ
పగిలిపోవడంలోని రాహిత్యాన్నీ
ముడుచుకుపోయిన మస్తిష్కంలోని మర్మాన్నీ
ఒకే అంచుతో నిర్వచించే నాలుక!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం 

అనురాధ బండి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు