మొదట్లో అంతా….

1.
మొదట్లో అంతా
ఒక పాటలాగే మొదలవుతుంది
అతనూ నువ్వూ –
ఇద్దరి మధ్యా ప్రకృతి పురికొల్పిన స్నేహం
అద్భుతంగా వుంటుంది
మొదట్లో అంతా
సున్నితత్వం ప్రవహిస్తూ ఉంటుంది
గదుల నిండా
కళ్ళు జిగేల్ మనే చిరునవ్వులతో
తిరిగి నాన్న చేతుల్లోనో వాలినట్టనిపిస్తుంది
మొదట్లో అంతా
రంగులతో అలికిన గుమ్మంలో
ఉదయం సాయంత్రం ముగ్గులేసినట్టుంటుంది
అప్పటికింకా నీ బుద్ధీ తనువూ
నీ జెండా కిందే వున్నాయనుకుంటావు
ఎన్నాళ్లగానో ఒక రివాజుగా
నీ జన్యువుల్ని కత్తిరించుకొస్తున్నట్టు
ఒక్క క్లూ కూడా దొరకదు
2.
మెల్లమెల్లగా
అబద్ధపు మేడ కూలిపోతుంది
నీ అంతరిక్ష నౌక
ఊపిరాడని కాలాలలోకి పయనిస్తుంది
ద్విధృవ ప్రపంచం కాస్తా
ఏక ధృవ విశ్వంగా కుచించుకుపోగానే
రెండు వైపులా మూసుకుపోయిన
కృష్ణబిలంలో ఒంటరిగా మిగిలిపోతావు
తలల్లేకుండా తిరుగాడే
అమ్మలూ అమ్మమ్మలూ స్నేహితురాళ్ళూ
నీ ఆర్బిట్ లోనే సంచరిస్తూ ఆశ్చర్యంలో పడేస్తారు
భూ పరిభ్రమణ కక్ష్య
సరిగ్గా నీ శిరస్సు మీదుగానే పోతుందని
నీ చంద్రయాన్ ఛాయాచిత్రంలోనే
స్పష్టంగా కనిపిస్తుంది
నడుస్తున్న దారి ఎదురుతిరగడం
నీ ఊహక్కూడా అందదు
బడుల్లో ఆఫీషుల్లో రోడ్లు మీదా
ఎక్కడికక్కడ సమాధులు పుట్టుకొచ్చి
భయపెడతాయి
పోలిక పట్టలేనంతగా కమిలిపోయిన
స్త్రీ దేహాలు కొన్ని
నిన్ను గుర్తుపట్టి జాలిగా నవ్వుతాయి
నువ్వు రెండుగా చీలిపోయిన చోట
పాదాల్లేని ఒట్టి కనురెప్పల అన్వేషణ
ఎప్పటికీ గమ్యం చేరదు
3.
పాఠ్యాంశాల్లో రాయని సిలబస్ ను
జీవితాంతం నేర్చుకున్నాక
హిస్టరెక్టమీ చేయబడ్డ నీ గ్రహంలోనే
కొత్త ఖగోళ శాస్త్ర బోధన కోసం నియమింపబడతావు
కానీ, నువ్వక్కిడ ముందుగా
కత్తిరించబడిన జన్యువుల పునరుద్ధరణ కోసం
జీవశాస్త్రం బోధించాల్సి వుంటుంది!

కవిత – 2

అసలు కథ వేరు

ఒకవేళ
గాయాలు సాక్షం చెప్పినా
అది చెల్లదు
సగానికి విరిగిన జీవితం సంగతి
మూడో కంటికి తెలీదు
చూసేందుకు నువ్వు
వేయి కాళ్ళతో నడుస్తున్నట్టే వుంటుంది
ఆకాశం వలసపోయిన విషయం
బహిరంగ రహస్యమే ఐనా
కళ్ళు
చినుకుల కోసం ఎదురుచూడ్డం మానవు
అబద్ధానికున్న మెరుపు
ఎవరి ప్రమేయం లేకుండానే
ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంటుంది
ఒక ఒడ్డు అంటూ వున్నవాడు
నిలబడి ఎన్ని మాటలన్నా చెబుతాడు
ఊబి అంచున ప్రాణం కొట్టుమిట్టాడితే గానీ
కన్నీళ్ళ లోతు తెలీదు
కష్టం
మైదానం వెలుపల శీతల గదిలో
స్లో మోషన్ లో చూస్తూ
ఆటను వ్యాఖ్యానించడంలా వుండదు
అది గాజా పిల్లల కనురెప్పల మీద కురిసే
ఫాస్ఫరస్ మేఘం
పంట చేతికందేలోపు
మట్టి పడ్డ పురుటి నొప్పులన్నీ
వాక్యాల్లోకి తర్జుమా కావు
ఉచ్చులో మెడ ఇరుక్కుపోయిన
ఊపిరాడనితనం
అక్షరాల్లోకి ఎత్తి పోయడం కుదరదు
కాసిన్ని చివుళ్లను చూపించి
కూలిన వనాల రాతలు మారాయనంటే
చిత్రం పూర్తైపోదు
కేవలం కొన్ని సున్నితమైన దృశ్యాలతో
చప్పట్లను పోగేయడం కవిత్వం వరకే
అసలు కథ వేరు.
*

సాంబమూర్తి లండ

నేను సాంబమూర్తి లండ. టీచర్. బోధన తర్వాత ఎక్కువగా ప్రేమించేది కవిత్వం. చదవడం మరీ ఇష్టం. వర్తమాన సమాజంలోని వ్యత్యాస్తాలు, మూకస్వామ్యాలు, బతుకు రొద, శూన్యం నన్ను కదిలిస్తాయి. 2020 లో "గాజురెక్కల తూనీగ" కవితా సంపుటి ప్రచురించాను. నాదైన వాక్యాన్నీ, నాదైన గొంతునీ, నాదైన భాషనీ వదిలివెళ్లాలనేది నా స్వప్నం.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు