చరిత్ర మూలాలు -సమస్యల గుర్తింపులు

భారత దేశం చాలా మారింది. ఏమీ మారలేదు. ఈ రెండు వాక్యాలూ నిజమేననిపిస్తాయి. “ భారతీయ భాషలలొ తొలితరం నవలలు” అనే పేరుతో ఎం. శ్రీధర్ రాసిన పుస్తకం చదివినప్పుడు పదహారు భారతీయ భాషలలో వచ్చిన తొలి నవలలను పరిచయం చేశారు. తానెందుకు ఈ పరిశోధనా పరిచయ వ్యాసాలు రాశారో ఆయన వివరించారు. మృణాళిని సాహిత్యవేత్తగా నవలా చరిత్ర అవసరాన్ని చెబుతూ, ఈ పుస్తకం లోని ఆసక్తికరమైన అంశాలు వివరిస్తూ తొలి నవలల గురించి పలు భాషాలలో ఉన్న వాద వివాదాలు ప్రస్తావిస్తూ మంచి ముందు మాట రాశారు.

ఒక సామాన్య పాఠకురాలిగా ఈ తొలి నవలల పరిచయాన్ని చదివినప్పుడు నాకు కలిగిన ఆలోచనలు రాస్తాను. ఈ నవలలో ఒకటి రెండు బహుశా ఒకటేనేమో. మొగల్ చక్రవర్తుల పరిపాలన బాగానే ఉన్నప్పుడు జరిగింది. మిగిలిన నవలలు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం విస్తరించినప్పుడు , బ్రిటీష్ పాలన కిందకు దేశమంతా వచ్చి, ఆ పాలకుల ప్రాభవం పెరిగినప్పుడు రాసినవి. రాజవంశస్తుల, రాజుల జీవితాల లోనే కాదు, సామాన్యుల జీవితాల్లో కూడా కల్లోల కాలమని చెప్పదగిన కాలంలో రాసినవి. పాలకుల మతాలు మారాయి. హిందూ రాజుల ప్రభావం, ముస్లిం రాజుల ప్రాభవం తగ్గిపోవటం తో కొత్త పాలక మతం తో ఎలాంటి సంబంధం ఉండాలనే సమస్య ప్రజల ముందుకు వచ్చింది.

ఈ మతాల సమస్య కంటే పాతదైన వర్ణ వ్యవస్థ ఎందరు పాలకులు మారినా చెక్కు చెదరకుండా తన ఉక్కు పాదం దేశమంతటా మోపి స్థిరం గానే ఉంది. దాంతో వచ్చే ఇబ్బందులను బ్రిటీష్ పాలకులు క్రైస్తవ మతం తో అధిగమంచవచ్చనే ఆశ, ఆలోచన కింది వర్ణాలలో మొలకెత్తుతోంది. అది సహజంగా హిందూ మతాధిపతులకు కలవరాన్ని , కోపాన్ని కలిగించింది. ఈ కుల, మత, దేశ భావనలన్నింటికి కీలకమైన ‘ స్త్రీ’ గురించి కొత్త ఆలోచనలు చేయక తప్పని పరిస్థితి వచ్చి పడింది. కులం ‘పవిత్రం’గా, కట్టుబాట్లతో ఉండాలన్నా, మతం ‘ పవిత్రం’గా ఉండాలన్నా, దేశ “ గౌరవ ప్రతిష్టలు” కాపాడుకోవాలన్నా ఒక్కటే మార్గం. స్త్రీల లైంగికత్వాన్ని పితృస్వామ్య కట్టుబాట్లతో కంట్రోలు చేయటం. కుల, మత, జాతి, దేశ విషయాలలో కొంత వెసులుబాటు. ఉదారతావాదాలు. పాలకవర్గాలకు అవసరమైనప్పుడు స్త్రీల లైంగికత్వ కంట్రోళ్ళు కొంచెం సడలించబడతాయి అవసరమైనంత వరకే. ఇది చాలా పకడ్బందీ గా, రకరకాల సంస్కరణల పేరుతో పితృస్వామ్యం అమలుచేస్తుంది. మరి స్త్రీల గర్భధారణ శక్తే కదా అన్నీ కుల, మత, జాతి పవిత్రతలకూ కీలకం. అందువల్ల రాజ్యం , పితృస్వామ్యం, మతం, వర్ణవ్యవస్థ కలిసి ఒకదానితో ఒకటి అవసరమైనప్పుడు సహకరించుకుంటూ, ఘర్షణ పడుతూ ఉంటాయి. ఈ ఘర్షణలు, ఈ సహకారాలే తొలి భారతీయ నవలలన్నింటి లో దాదాపుగా ప్రతిఫలించాయి. అందువల్లే నవలలు చాలా వరకూ స్త్రీ కేంద్రంగా తిరుగుతూ హఠాత్తుగా పురుష ప్రాధాన్యత వైపు కి వెళ్లిపోతాయి.

ఆ కాలపు రచయితలు ఈ సామాజిక, రాజకీయ, లైంగిక కోణాలను తాము అర్థం చేసుకున్న మేరకు రాయటమే చాలా గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వైరుధ్యాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇప్పుడింకా ఎక్కువగా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవటానికి ఈ తొలి భారతీయ భాషా నవలలు ఎంతైనా ఉపకరిస్తాయనిపిస్తుంది. అక్కడ కుల, మతాంతర వివాహాలు రాజీలతోనో, మరొక విధంగానో అంగీకరింప చేయాలని రచయితలు ప్రయత్నించారు. ఇప్పటికీ కులాంతర వివాహాలు పరువు హత్యలతో ముగుస్తున్న విషాద సందర్భం మనది. సంస్కరణలు, అభ్యుదయాలు, విప్లవాలు అన్నీ చూసినప్పటికీ ,దాటి వచ్చినప్పటికీ కులం, మతం, జాతి అనే కంచుకోటలు ఎందుకు బలపడుతున్నాయి?శంబూకులు ఇంకా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం సామాజిక శాస్త్రవేత్తలు చేస్తున్న అధ్యయనం లో, రాజకీయ ఉద్యమాల కార్యాచరణ లో సాహిత్యం ఎంతొ ఉపయోగపడుతోంది. ఒట్టి వాద వివాదాలకు కాదు. పరిశోధనాత్మక పరిశీలనకు. అందుకోసం శ్రీధర్ ఎంతొ శ్రమపడి సమాచారం సేకరించి చాలా క్లుప్తం గా, అసలు కీలకమైన అంశాన్ని ఒదలకుండా ఈ పుస్తకం లో మనకు అందించారు. అందుకు ఆయనకు మనం -సామాజిక మార్పు కోరుకునేవారందరం, సామాజిక న్యాయాన్ని అడిగే వారందరం ధన్యవాదాలు తెలియచేయాలి. పదహారు భాషలలో ఒక క్లిష్ట సమయం లో భారతీయ మేధావుల, రచయితల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామనే ఆలోచన రావటమే ఎంతొ మంచి విషయం.

1790 లో వచ్చిన పర్షియన్ నవల భోగం కుల స్త్రీలకు సంబంధించినది. ఈ నవల లో ఆ వృత్తి లో ఉన్న స్త్రీల వల్ల ఒక వర్గం వారి ఆర్ధిక సంబంధాలు మెరుగు పడటం, క్షీణించటం ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సెక్సువల్ పొలిటికల్ ఎకానమీ ని వారి జీవితాల నుంచీ చూడవచ్చు. వితంతువుల లైంగిక అమ్మకాల రాజకీయ ఆర్ధికాన్ని “ యమునా పర్యటన్ “ అనే మరాఠీ నవలలో చూడవచ్చు. పుణ్యక్షేత్రాల్లో వర్ధిల్లిన స్త్రీల లైంగిక దోపిడీ ని చూపించిన మొదటి నవల ఇదేనేమో. వితంతువుల వివాహం సాధ్యమవుతుందని క్రైస్తవం లొకి మారతారనే ఆలోచన కలిగించి, అగ్రవర్ణాల ఆదరణ కు చాలా కాలం పాటు నోచుకోని నవల అని పరిచయం చేశారు శ్రీధర్. అంటరానితనం నుంచి విముక్తి కి, పేదరికం, బానిసత్వాల నుంచి విముక్తికి కొందరు మత మార్పిడి చేసుకుంటే అగ్రవర్ణ స్త్రీలు వివాహం, గర్భధారణ, సంతానం వంటి కారణాలకు మతం మారారు. ఎక్కడో ఒక చోట అయినా దళితుల, స్త్రీల సమస్యలకూ, పరిష్కారాలకూ మూలం ఒకటే అయింది.

పోర్చుగీసు నవల లో (1866) జాత్యంతర వివాహాల ప్రతిపాదనలున్నాయి. పాలకవర్గానికి చెందిన అన్య జాతీయులకు బ్రాహ్మణులంటే లెక్క ఎందుకుంటుంది? కానీ ఒక బ్రాహ్మణుని అవమానించినందుకు ఎంత కథో నడిచింది. భారత జాతికి లేదా దేశానికి అసలైన శత్రువులు కులం, మతం, వాటి మధ్య అంతరాలు అని 1866 లోనే గుర్తించినవారున్నారు. ఇప్పటికీ గుర్తించని వారున్నారు.

శ్రీరంగరాజచరిత్రం (1872) అనే తెలుగు నవలలో వర్ణ వ్యవస్థ గురించి ఎంత చర్చ ఉన్నా, దానిని సమర్ధించే వాదనలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ముగింపు కూడా అతి శూద్ర కులాల వారిని కించపరిచేలా ఉంది. ఏ నవలలోనైనా అందం, తెలివి, సాహసం ఉన్న స్త్రీ తప్పకుండా అగ్రవర్ణానికే చెంది ఉంటుంది. మొదట్లో అతి శూద్ర కులానికి చెందిన స్త్రీ గా పరిచయమైనా చివరికి అగ్రవర్ణ స్త్రీ గా బయట పడుతుంది. సుగుణాలున్న స్త్రీలు కింద కులాలలో కనబడితే అగ్ర వర్ణాల వాళ్ళు “ నువ్విక్కడ తప్పబుట్టావు” అన్నట్లు మాట్లాడటం చాలా నవలల్లో కనబడుతుంది. పర్షియన్ నవల లో నర్తకి ఖానుమ్ జాన్ గురించి ఆమె ప్రియుడు “ ఎన్నొ ఉత్తమ గుణాలున్న నీవు, అట్టి గుణాలు ఎట్టి పరిస్థితులలోనూ ఉండ జాలని జాతిలో ఇరుక్కుపోయా” వంటాడు. కన్యాశుల్కం గుర్తొస్తుంది. మధురవాణి ని గురించి సౌజన్యారావు పంతులు కూడా ఒక మంచి తండ్రికి పుట్టి ఉంటావనే అర్థం వచ్చే మాటలు మాట్లాడతాడు. “ మంచివారి యెడల మంచిగా, చెడ్డ వారి యెడల చెడ్డగా “ ఉంచటాన్ని నేర్పిన తల్లికి ఏ ప్రాధాన్యమూ లేదు.

రాజపుత్ర వంశాల వైభవం తగ్గి ముస్లిం రాజులు స్థిరపడటానికి కూడా స్త్రీలే కారణమవుతారు. గుజరాతీ నవలలో ఒక వివాహిత యువతి ని బలవంతం చేయటం తో మొదలై అనేక ఆవివేకపు పనులు చేసిన కరన్ అనే రాజు జీవితమే కథావస్తువు.

మొత్తం మీద ఈ పదహారు నవలల క్లుప్త పరిచయాల వల్ల మన దేశం లో ప్రధాన సమస్యలు కులం, జెండర్ అని ఆ కాలం నాటికే రచయితలు గుర్తించారని అర్థమవుతుంది. కులాంతర వివాహాలు కుల నిర్మూలనకు ఒక మార్గం గా సూచించిన అంబేద్కర్ వివేకవంతమైన ఆలోచనలు గుర్తొస్తాయి. ఈ కుల పితృస్వామ్యం దానిని ఎంత అసాధ్యం చేస్తున్నదో తెలుసుకుంటాం. దానిపై తీవ్ర యుద్ధం ప్రకటించటమే మన ముందున్న ఏకైక మార్గం.

*

ఓల్గా

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ఓల్గా గారికి క్రుతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రొ. సాయిబాబా చేసిన క్రుషిని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం కంటే ముందు భారతదేశం లో వెల్లివిరిసిన ఆంగ్లకవిత్వాన్ని గురించి పరిశోధన చేసాడాయన. ఆంగ్లం లో వచ్చిన ఆ కవిత్వం లో బ్రిటిష్ విస్తరణవాదాన్ని తెగనాడుతూ వచ్చిన విస్తారమయిన కవితలను ప్రస్తావించాడు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు