గిజిగానికున్నంత ఓర్పు ఈ కవికి!

సాంబమూర్తి లండ ‘గాజురెక్కల  తూనీగ’ కవిత్వ సంపుటి ద్వారా సాహితీ లోకానికి సుపరిచితుడు. కవిత్వాన్ని అల్లడంలో గిజిగానికున్నంత ఓర్పును, నేర్పును, నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న వాడిలా కనిపిస్తాడు. “అప్పుడు కూడా” కవిత ద్వారా ప్రకృతి విధ్వంసాన్ని, ప్రభుత్వ పనితీరును చర్చకు పెట్టిన విధానం ఆకట్టుకుంటుంది.
*
అప్పుడు కూడా …
—————
అభివృద్ధి మా కేసి
కన్నెత్తి కూడా చూడదు కానీ
తుఫాన్ల కెందుకో వల్లమాలిన ప్రేమ?
అల్పపీడనం సవతితల్లి
నాలుగు చినుకుల్ని రాల్చి
నాట్లేసుకోవడానికి సాయం చేసిందని
ఊరట పడేలోపు
పెనుగాలుల ఉరితాళ్లను పేనుకొచ్చి
పచ్చని ప్రాణాలను ఉరితీసి పోతాయి
పడవలన్నీ 
తీరం గుంజకు కట్టేయబడిన పాడి ఆవులైనప్పుడు
ఆకలి లేగదూడ మోరెత్తి
నట్టింట్లో పేగులు తెగేలా అరుస్తూ వుంటుంది
వేల విధ్వంసపు చేతులతో 
తుఫాను 
మా నవ్వుచేలన్నీ విరిచేసి వెళ్ళిపోయాక
మృతశిశువును కన్న
తల్లుల్లా
రిక్త గర్భాలతో నిలుచుంటామా..
థూ… ఈళ్ళ బతుకు చెడ..
అప్పుడు కూడా వదల్రు!
మా పరిహారాల పాలబొట్లకూ కక్కుర్తి పడ్తారు!
*
ఆదిమ మానవుని మొట్టమొదటి జీవనాధారం వేట. అటుపిమ్మట వ్యవసాయం. అల్పపీడన ప్రభావంతో తుఫాను సృష్టించే భీభత్సం వల్ల బడుగు జీవుల బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారుతోంది. పంటనష్టానికి ప్రభుత్వం తీరుబడిగా ప్రకటించే పరిహారాలు, అర్హులైన వారికి అందించాలంటే ముందుగా కక్కుర్తి మహాశయుల కడుపు నింపాల్సిన దౌర్భాగ్యపు స్థితి దాపురించిందని కవి ఆవేదన వ్యక్తంచేస్తాడు. ఒకవైపు దళారీ వ్యవస్థను, మరోవైపు ప్రభుత్వ పాలనాతీరును, దాని వైఫల్యాన్ని ఏకకాలంలో దృశ్యమానం చేయడం చూస్తాం. ‘సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం’ అన్న చందంగా తయారైన దుర్మార్గపు లంచగొండితనం ప్రస్తావించబడుతుంది.
*
కవితలో మానవీకరణ(personification) ద్వారా, భావచిత్రాల(imagery) ద్వారా బలమైన దృశ్యరూపం ముద్రించే ప్రయత్నం సఫలమైంది. ఆకలిని ఎలా దృశ్యీకరించాడో చూస్తే తెలుస్తుంది. చిత్రించబడిన వాతావరణాన్ని పాఠకులు అనుభూతి చెందుతారు. ‘నవ్వుచేలు’ వంటి పదచిత్రాలు సైతం కవి సత్తాను తెలుపుతాయి.
“ఒక ఆలోచనలో, దృశ్యాన్నో, ఉద్వేగాన్నో చెప్పేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఇమేజెస్ అవసరపడొచ్చు. అనేక ఇమేజెస్ కలిసి ఒక భావాన్ని  వ్యక్తీకరించినపుడు ఆ ఇమేజ్ ల సముదాయాన్ని ‘ఇమేజరీ’ అంటారు. ఒక కవితలో అనేక ఇమేజరీలు ఉండొచ్చు.”( కవిత్వ భాషలో  బొల్లోజు బాబా).
*

బండారి రాజ్ కుమార్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సాంబ మూర్తి ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి.దృశ్యమానం
    చేసి కవిత్వీ కరించడం ఆయన కవన నైపుణ్యం.40 ఎల్లా శరీరం లో 70 ఏళ్ల అనుభవాల మనిష ఉన్నాడేమో అనిపించక మానదు.
    అభినందనలు.

  • చాలా బాగుందండీ పరిహారాల పాలబొట్లకు కక్కుర్తి పడడం గొప్ప ఇమేజినరీ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు