ఆయన జీవితమే ఒక చరిత్ర

ఎంవీ ఆర్ నిష్క్రమణతో రాయలసీమ వర్తమాన చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. ఎంవీ ఆర్ అంటే రాజకీయాలూ, సాహిత్యమూ కలగలసిన అరుదైన స్వరం.

నావంటి ర్యాడికల్‌ స్టూడెంట్స్‌కు విద్యార్థి దశనుండే ఆయనంటే ఒక తెలియని అభిమానం, ఆరాధన. ఆయనను చూడకముందే ఆయన రాసిన రాజకీయ కరపత్రాలు చదివినవాడ్ని. కడపలో ఇంటర్మీడియట్‌, మదనపల్లిలో బిఎస్‌సి చదువుతున్న దశలో ఆయన కార్యకలాపాలు ఆనోటా ఈనోటా వినేవాడిని. 40 యేండ్ల క్రితం ఆయనంటే కొందరికి భయం మరికొందరికి ఒక పిచ్చి అభిమానం. నేను విద్యార్థిగా ఉన్నపుడే ఎక్కడో విజయవాడ బస్టాండులో ఆర్టీసి డ్రైవర్‌లు, కండెక్టర్‌లు ఆయన ఫోటోను ఆనాటి పత్రికలో చూసి ‘మన లీడర్‌’ అని ఒకరికొకరు చూపుకుంటూ ఉప్పొంగిపోయిన దృశ్యాన్ని నేను చూశాను. ప్రొద్దుటూరు అంగళ్లవద్ద చుట్టుపక్కల గ్రామాలనుండి వచ్చిన రైతు ఆసాములు కూర్చొని పిచ్చాపాటి మాటల్లో ఆయనపేరు ఉచ్ఛరిస్తే, అంగడి ఆసామి లేచి వచ్చి చేతులు పట్టుకొని ‘ఆయనపేరు ఈడ మాట్లాడకండి స్వామి దయచేసి ఎక్కడికైనా పోయి మాట్లాడుకొండి’ అని కళ్ళనిండా భయం నింపుకొని చేతులు జోడించిన దృశ్యాన్నే నేను చూశాను.
రాజకీయాలలో తీవ్రవాద వామపక్ష భావజాలంతో ‘మావోయిస్టు-లెనినిస్టు’ పార్టీనుండి ప్రారంభమై ‘తెలుగు దేశం’ పార్టీ వరకు నడిచారు. రాయలసీమ భవిష్యత్తు కోసం ఎన్‌.టి.ఆర్‌తో విభేదించి తన రాజకీయ భవిష్యత్తునూ కాలదన్నుకున్నారు.

సాహిత్యంలో విరసం నుండి మొదలైన ఆయన, శంకరాచార్యుల కవితా వైభవాన్నీ తిక్కన తేటతెలుగు సొగసునూ ఆస్వాదించారు.

దూరం నుండి చూసేవారికి చాలా వైవిధ్యాలు, విలక్షణాలు కనిపిస్తాయి. అవి ఆయన వ్యక్తిత్వంలో ఉన్నాయా! లేక చూసేవారి దృష్టి కోణంలో ఉన్నాయా! – అంటే చెప్పడం కష్టం. ఆయన ప్రారంభమైన ఎమ్‌ఎల్‌ పార్టీ సిద్ధాంతంలోనే వర్గహింస ఉంది. అది సిద్ధాంత పరమైన సాయుధపోరాటహింస. ఆయన దాన్ని రాయలసీమ గ్రామాల్లో ప్రవేశపెట్టాలనే ప్రయత్నం వికటించిందని చెప్పవచ్చు. ఆయన సహచరులు, అనుయాయులు సిద్ధాంత పరమైన హింసలో సిద్ధాంతాన్ని గాలికొదిలి హింసను మాత్రమే స్వీకరించడంతో అది రాయలసీమ ఫ్యాక్షనిజంగా మారింది. ఆయనకు ఫ్యాక్షనిస్టు అనే ముద్రనూ వేసింది. ఆయనే డా|| ఎం.వి. రమణారెడ్డి.

‘ఒరు లేయవి యొనరించిన
నరవర! అప్రియము తన మనంబునకగు తా
నొరులకు అవి సేయకునికి
పరాయణము పరమధర్మ పథముల కెల్లన్‌’
– తిక్కన మహాకవి

ఎంవి రమణారెడ్డి ఇంటి ముంగిటిలోకి అడుగుపెట్టగానే వసారాలో గోడకు ఫ్రేమ్‌ కట్టించిన పై పద్యపటం దర్శనమిస్తుంది. ఆయనకు తిక్కనపై ఎనలేని అభిమానం. అన్నమయ్య గేయాలన్నా అంతే ప్రాణం. తిక్కన పద్యాలలో తేటతెనుగు పాలనురగలా తేలియాడుతుంటుందని ఎంవిఆర్‌ అంటారు.

ఆయన గుంటూరులో మెడిసిన్‌ చదువుతున్న సమయంలోనే మిత్రులతో కలిసి ‘కవిత’ లిఖిత పత్రిక కొద్దికాలం నడిపారు. మెడిసిన్‌ పూర్తయిన తర్వాత ప్రొద్దుటూరులో ప్రాక్టీసు పెట్టి పేదల డాక్టరుగా పేరు సంపాదించారు. 1968లో తెలంగాణాలో ప్రారంభమైన ముల్కీ ఉద్యమాన్ని మర్రిచెన్నారెడ్డి తెలంగాణా ఏర్పాటు ఉద్యమంగా మార్చి ఊపందుకుంటున్న సమయంలో, కడప జిల్లా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి.బసిరెడ్డి రాయలసీమ మహాసభలకు పిలుపునిచ్చాడు. అప్పటి నుండే ఎంవి రమణారెడ్డి రాయలసీమ సమస్యల పట్ల అధ్యయనం ప్రారంభించి, రాయలసీమ కోసం యువ సమాఖ్యను స్థాపించాడు. ఎంఎల్‌ పార్టీవైపు మొగ్గుచూపి, విరసం వ్యవస్థాపకుల్లో ఒకడయ్యారు. ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలను విరసం వ్యతిరేకించడంతో అనంతపురంలో జరిగిన విరసం మహాసభలో దానికి రాజీనామా చేశారు. విరసం నేతగా 1975లో డిటెన్యూవ్‌గా జైలు జీవితం అనుభవించారు. ఆ సమయంలోనే మూఢనమ్మకాలపై ‘బాణామతి’ పుస్తకాన్ని రాశారు. ఒక అమెరికన్‌ డాక్టర్‌ చైనాకు వచ్చి అక్కడి పురోగమనంపై రాసిన పుస్తకాన్ని తెలుగులోకి ‘పురోగమనం’ పేరుతో అనువదించారు.

ఆ తర్వాత కార్మికోద్యమ నాయకుడిగా అనేక కేసుల్లో ముద్దాయిగా మారాడు. ప్రధానంగా అడ్వకేట్‌ రామసుబ్బారెడ్డి హత్యకేసులో ఆయన ప్రధాన ముద్దాయి అయ్యాడు. ఈ కేసుల్లో అనేకసార్లు జైలు జీవితం అనుభవించాడు. ఇవన్నీ నా చిన్నతనంలో రాజకీయ, సాహిత్య అవగాహన కలుగకముందు జరిగిన సంఘటనలు. ఆకాలంలోనే ఆయన ‘ప్రభంజనం’ పేరుతో ప్రొద్దుటూరు నుండి పత్రిక వెలువరించే వారు.
మా గ్రామం ప్రొద్దుటూరుకు పక్కనే. పెన్నానది ఒడ్డున ఉన్న మాగ్రామం నుండి పెన్నలో అడ్డంగా నడిచిపోతే ప్రొద్దుటూరు 5 కి.మీ.లు. రోడ్డు మార్గాన పోతే 8 కిలోమీటర్లు. బి.ఎస్‌.సి. పూర్తయి నేను మా ఊరి గ్రామ రాజకీయాల్లో కాలుమోపుతున్న సమయానికి, రాయలసీమ ఉద్యమం తీవ్రతరమవుతోంది. ఎం.వి.రమణారెడ్డి దాన్ని ప్రారంభించారు. చెన్నైకి సొరంగం మార్గం ద్వారా క్రిష్ణా నీళ్లను తీసుకుపోయే ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఎంవి రమణారెడ్డి అప్పుడప్పుడే ఎన్‌టిఆర్‌తో విభేదిస్తున్నారు. తెలుగుదేశంలో నాదేండ్ల భాస్కర రావు అంకంలో ఎంవి రమణారెడ్డి ఎన్‌టిఆర్‌ వైపే నిలిచినా, ఆ తర్వాత రాయలసీమ విమోచన సమితి సంస్థను ప్రారంభించి రాయలసీమ నాలుగు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. దీంతో ఎన్‌టిఆర్‌తో పూర్తిగా విభేదాలు ఏర్పడ్డాయి. విమోచన సమితి తరఫున 1984లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. నిరాహారదీక్షలోనే 10-12 రోజులు రాయలసీమలోని ముఖ్యపట్టణాల్లో సభలు నిర్వహించి, ప్రొద్దుటూరులో నిరాహార దీక్షను కొనసాగించారు.

నిరాహారదీక్షకు కూర్చొనే ముందు ఆయన రాయలసీమ సాగునీటి సమస్యలతోపాటు ఇతర రంగాలలోని సమస్యలను అధ్యయనం చేసి ఒక బుక్‌లెట్‌ను రాశారు. ఆ బుక్‌లెట్‌ను రాసేసమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని, అందుకే ఆ పుస్తకానికి ‘రాయలసీమ కన్నీటి గాథ’ అని పేరుపెట్టానని ఎంవిఆర్‌ అంటారు. ఆ పుస్తకానికి ఆర్టిస్టు చంద్ర వేసిన బొమ్మ (కరువు భూమిలో నుండి పైకి పొడుచుకు వచ్చిన తల దాహార్తితో దోసిలి పట్టి వుండగా పైనుండి ఒక చుక్క నీటిబొట్టు రాలుతున్న దృశ్యం) మరింత కదిలించింది. నిరాహార దీక్షకోసం చంద్ర వేసిన బొమ్మలతో ముంద్రించిన వాల్‌పోస్టర్లను రాయలసీమ అంతటా ఒక ఉద్రేకాన్ని పుట్టించాయి. దానికితోడు ఎంవి రమణారెడ్డి ఉపన్యాసాలు యువకులను ఉద్వేగానికి గురిచేయగా, రైతులను ఆలోచింపజేశాయి.

అంతకుముందే ఎంవిఆర్‌ పైన విపరీతమైన అభిమానం పెంచుకున్న నేను నిరాహార దీక్ష శిబిరంలో ఆయనను మొట్టమొదటిసారి కలిసి వివరాలు చెప్పి పరిచయం చేసుకున్నాను. అప్పటి నుండి ఆయనతో అడపా దడపా కలుస్తూనే ఉన్నాను.

అప్పట్లో మంత్రిగా వున్న కరణం రామచంద్రరావు రాయబారిగా వచ్చి ఒక ఒప్పందంపై సంతకాలు చేసి ఎంవిఆర్‌ దీక్షను విరమింపజేశారు. ఆ మరుసటిరోజే ఎన్‌టిఆర్‌ తిరుపతిలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా – ఎంవిఆర్‌ నిరాహార దీక్షకు కూర్చున్నాడా? నాకు తెలియదే? ఆయన ఎందుకు కూర్చున్నాడో, ఎందుకు వివరమించాడో నాకు తెలియదే?- అని సమాధానమిచ్చాడు.

ఈ పరిణామం తర్వాత ఎంవి రమణారెడ్డి తెలుగుదేశంను వీడి 1985 ఎన్నికల్లో రాయలసీమ విమోచన సమితి తరఫున నాలుగు జిల్లాలలోని ప్రధాన నియోజకవర్గాలలో తన అభ్యర్థులను నిలిపారు. ఐజి స్థాయి వ్యక్తి స్వయంగా ప్రొద్దుటూరులో మకాంవేసి, ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ పక్కనే వున్న యర్రగుంట్లలో రెండు రోజులు మకాం వేసి అనేక కట్టడులతో, కర్ణుని చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు ఎంవి రమణారెడ్డిని ఆ ఎన్నికల్లో ఓడించారు. ఆ తర్వాత జరిగిన గ్రామ హత్యలలో (ప్రధానంగా ఆయన నివాసం వుంటున్న రాయలసీమ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజికి రెండు పర్లాంగుల దూరంలో జరిగిన ఏడు హత్యల ఉదంతంలో) ఆయన ముద్దాయిగా మారాడు. అప్పటి నుండి ఆయన ఎక్కువగా అజ్ఞాతంలోనూ, జైలు జీవితంలోనూ గడపాల్సిరావడంతో రాయలసీమ ఉద్యమంలో ఆయన పాత్ర ప్రత్యక్షంగా కనుమరుగయింది.

ఆయన బయట వున్నప్పుడు తరచూ కలిసేవాడిని. 1987లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా ఊరి పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసిన నేను, ఎంవి రమణారెడ్డిని నా తరఫున మా గ్రామానికి తీసుకుపోయాను. మా గ్రామం కమలాపురం నియోజకవర్గ పరిధిలో వున్నప్పటికీ ఆయన నా మాట కాదనక నా కోసం మా గ్రామంలో మా ఇంటికి, హరిజనవాడకు వచ్చి నేను తన మనిషిననే భరోసా గ్రామంలో కలిగించాడు. ఎంవి రమణారెడ్డి ఎక్కువగా అజ్ఞాతవాసంలోనూ, జైలు జీవితంలో ఉండడంతో నేను ప్రత్యక్షంగా కలవడం తగ్గిపోయింది.

కమలాపురం ఎమ్మెల్యే ఎంవి మైసూరారెడ్డి వెంట రాయలసీమ ఉద్యమంలో పాల్గొనేవాణ్ణి.
ఎంవి రమణారెడ్డి బయట ఉండే సమయంలో తరచూ ఆయనను కలిసేవాడిని. రాళ్ళ వంకీ, భూమి, స్వర్ణ పిశాచి నగరం, అమ్మ, మృతజీవులు వంటి రష్యన్‌ పుస్తకాలను ఆయన వద్దనుండే తెచ్చుకొని చదివాను. ఆవిధంగా రాజకీయాల్లోను, సాహిత్యంలోను నేను గురువులుగా చెప్పుకొనే వారిలో ఎం.వి. రమణారెడ్డి మొదటివారయ్యారు.

ఎంవి రమణారెడ్డి తన జైలుజీవితాన్ని పూర్తిచేసుకొని 1995లో బయటకు వచ్చారు. ఆతరువాత కూడా ఆయన పార్లమెంటరీ ఎన్నికలలో పోటీచేస్తూ వచ్చినప్పటికీ ఆయనకు ప్రతిసారీ ఓటమే ఎదురయింది. ఈ బూర్జువా రాజకీయాలలో సక్సెస్‌ కావడానికి ఎంత దిగజారి లోపలికి మునకేసినా తనకు పూడు తగలలేదని ఎంవిఆర్‌ ఒక సారి హాస్యమాడారు. సక్సెస్‌ అవుతున్నవాళ్ళు మరెంత లోపలకి దిగజారి పూడు తగులుతున్నారో అర్థం కావడం లేదంటారాయన.

ఎంవి రమణారెడ్డి జైలుజీవితంలోనూ, పార్లమెంటరీ రాజకీయాల్లో అలసిపోయి విరామంగా ఉన్న జీవితంలోనూ అనేక పుస్తకాలను రాశారు. ఆయన రాసిన ప్రతి పుస్తకమూ సాహితీ విద్యార్థులకే కాకుండా రచయితలకూ పాఠ్యాంశాలే. పరిష్కారంపేరుతో కథల సంపుటి వెలువరించారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జీవిత చరిత్రను ‘ఆయుధం పట్టని యోధుడు’ గా రాశారు. ఆపాతమధుర సినిమాలపై రాసిన వ్యాసాలను ‘స్వర్ణయుగం’ పేరుతో అచ్చేశారు. ఆర్‌.కె. నారాయణ్‌ ‘ఎ టైగర్‌ ఇన్‌ మాల్గుడి’ ని ‘పెద్దపులి ఆత్మకథ’ గా, ‘ట్యాక్టీవ్‌ మాన్‌’ ను ‘వదరుబోతు’ గానూ అనువదించారు. తిక్కన పద్యాలలోని తేటతెలుగు వైశిష్ట్యాన్ని ‘తెలుగింటికి నడిచొచ్చిన ద్రౌపది’ గా మనకు అందించారు. టూకీగా ప్రపంచ చరిత్రను నాలుగు భాగాలుగా వెలువరించారు.

78 యేళ్ల వయస్సులో ఎం.వి. రమణా రెడ్డి కన్నుమూశారు. కన్నుమూసే పదినెలల ముందు నుండి ఆయన 24 గంటలూ ఆక్సిజన్‌ మాస్క్‌ తోనే జీవించారు. ఇట్లాంటి గడ్డుకాలంలో ఎవరైనా ఏం చేయగలరూ! నిస్సహాయంగా మంచానికో, కుర్చీకో కరుచుకుపోయి చివరి గడియల కోసం ఎదురు చూస్తారు.
అయితే ఆయన ఆక్సిజన్‌ మాస్క్‌ను మూతికి తగిలించుకునే, శక్తినంతా కూడదీసుకుని రాసుకుంటూ గడిపారు. రాసినదాన్ని తానే ల్యాప్‌టాప్‌లో టైప్‌ చేసుకున్నారు. సాహిత్యమే ఊపిరిగా జీవించారు. అదీ అనితర సాధ్యమైన ఆయన గుండెదిటవు.

నాలుగేళ్ల కిందట ఆయనకు తలెత్తిన సిఒపి వ్యాధి (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) గత యేడాది నవంబర్‌, డిసెంబర్‌లలో తీక్షణమై ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా చెడిపోయింది, డాక్టర్లకు కూడా నమ్మకం లేకపోయింది. ఆయనకు మాత్రం ‘ప్రపంచ చరిత్ర’ పూర్తి చేయలేకపోయాననే ఆలోచనతప్ప ఇతరం లేదు. దాన్ని పూర్తి చేసేందుకు డాక్టర్లపై ఒత్తిడి పెట్టి ఫోర్సబుల్‌ డిశ్చార్జి చేయించుకొని కర్నూల్‌ నుండి ప్రొద్దుటూరు చేరుకున్నారు. డాక్టర్లు కూడా నమ్మకం లేకనే పంపించేశారని ఎం.వి.ఆర్‌ ఒక సందర్భంలో నాతో అన్నారు.

ఎంవిఆర్‌ను ఎప్పుడు కలిసినా భాష, సాహిత్యాలు, పాత సినిమాలపైనే మా మాటలు నడిచేవి.
ఎంవిఆర్‌ ఆస్పత్రి నుండి ఇంటికి చేరిన కొన్నాళ్ళకు తిరిగి కోలుకొని ప్రపంచ చరిత్ర నాల్గవ భాగంలో మిగిలిపోయిన అధ్యాయాలను పూర్తి చేశారు. మక్సిమ్‌ గోర్కి ‘మదర్‌’ నవలను ‘కడుపు తీపి’ పేరుతో అనువదించి వెలువరించారు. నాతో పాటు ఆయన పాతస్నేహితులు అనేక మంది చెబుతుండటంతో, చివరి దినాలలో ఆయన జీవితంలోనే ముఖ్య ఘట్టాలను ‘గతించిన రోజులు’ పేరుతో రాయడం ప్రారంభించారు. 120 పేజీలు మాత్రం వ్రాసి అర్ధాంతరంగా దాన్ని వదలి, ఈలోకాన్ని విడిచిపోయారు.

*

పాలగిరి విశ్వప్రసాద్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మాకు తెలియని రమణారెడ్డి గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

  • ఆయన రాసిన ” తెలుగు సినిమా స్వర్ణ యుగం ” మొదట ఆంధ్రభూమి శుక్రవారం ఎడిషన్ లో తరువాత పుస్తకంగా వచ్చింది. సూపర్. ఎస్వీయార్‌ అభిమాని కాబోలు, ఎస్వీ ఆర్ గురించే ఎక్కువ రాశారు.

  • డా..యం. వి. రమణారెడ్డి గారి సమగ్ర జీవిత చరిత్ర లా ఉంది వ్యాసం. ఎన్నెన్నో పర్శ్వాలను ముచ్చటించారు.జులై నెలలో ఆంధ్రజ్యోతి వివిధ లో “అక్షరమే ఆక్సిజన్”” అన్న శీర్షిక న, వారితో మీ ఇంటర్వ్యూ నే బహుశా చివరిదేమో!? ఆ వ్యాసం చదివి విరసం వ్యవస్థాపక సభ్యులు MVR గారికి మిత్రులు అయిన నగ్నముని గారు మీ ద్వారా mvr గారితో మాట్లాడి ..”యాభై ఏళ్ళతర్వాత మిత్రుడితో మాట్లాడాను”” అని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఇన్ని విశేషాలు కలిగిన వ్యాసం అందించినందుకు మీకు అభినందనలు👌👌💐💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు