కూడలి వైపుకి !

 గుమ్మానికి ఆనుకొని సనుగుకుంట కూర్చుంది శోభ.

“ఏడ్చినవంటే నడ్డిమీన తంతా, నోరు మూసుకొని ఉండు” మొగుడు బాలరాజు అరిచాడు. రంగు పోయిన లుంగీ, బనీను వేసుకొని దిగులు చింత లేనట్టే ఉన్నాడు.

ఆయన కోపం తగ్గినాక మెల్లగా మంచం పక్కన కూర్చొని “అట్టగాదయ్యా. ఆ అబ్బాయి వాళ్ళకాడ మంచి హాస్పటల్లో చూపిచ్చేదానికి స్తోమత లేదు. మన పిల్లకేమో ఏడోనెల పడింది. బలమైన తిండి లేకపోతే ఏ రక్తహీనతో వచ్చి కాన్పు కష్టమయిద్ది. పంతాలకు పోయి పిల్లని అగసాట్లు పెడతమా!” వేడుకుంది.

“థూ, సిగ్గులేదే నీకు, ఎవుడితోనో దెంకెళ్ళిన దాని గురించి ఎందుకే శోకండాలు పెడతావు”

“అట్టగాదయ్యా, తొలికాన్పు తల్లిగారి ఇంట్లోనే జరగాల. అసలే ఆపిల్ల ఇంట్లో అన్ని పనులకూ ముందుండే రకం. ఆడ సాయం చేసేవాళ్ళు ఉన్నరో లేరో కూడా తెలేదు. ఇట్లాంటి టయాన ఆడపిల్లకు తల్లే రక్షణ”

“చెప్తే అర్థం కాదు నీకు, ఇంక నీ కర్మ” అని ఇదిలించుకొని బైటికి వెళ్ళిపోయిండు బాలరాజు.

అట్టన్నాడంటే.. నీ ఇష్టమైనట్టు చేసుకో అని అర్థం.

హమ్మయ్య! అనుకొని ఆదరా బాదరా కాటన్ చీర కట్టుకొని, కీప్యాడ్ ఫోను చిన్న పర్సులో పెట్టుకొని కూతురింటికి బయలుదేరింది శోభ.

****************

అల్లుడి కుటుంబం మర్యాదలు చేద్దామని చూసినా పడలేదు. విషయం చెప్పి అంగీకారం కోసం చూస్తుంది. వాళ్ల ఇల్లూవాకిలీ తన ఇంటిలాగే ఉన్నాయి. అలవాట్లూ, కట్టుబాట్లు ఏ హడావిడీ లేకుండా తమలాగే ఉన్నాయి. మల్లెందుకో వేరువేరు బతుకులు అనుకుంది. అమ్మ వచ్చిన ఆనందంతో కూతురు శిరీష ఆకలి దప్పులు మరిచిపోయింది. గుండె నిండా సంతోషం. కళ్ళనిండా వెలుగు నింపుకొని అమ్మ చేయి పట్టుక్కూర్చుంది. ఇంట్లోవాళ్ళు స్టూల్ మీదున్న అరటిపళ్ళు చూస్తా, సరే అన్నారు. రెండు కుటుంబాలూ కలిసే అవకాశం కదా, కాదనటం ఎందుకన్నది వాళ్ళ ఆలోచన.

“బాగా తగ్గిపోయినవు మా” శిరీష.

కూతుర్ని గుండెలకు అదుముకొని “ఇంగ నువ్వు ఉన్నావుగా, మళ్ళీ ఒల్లొస్తదిలే” శోభ.

వాళ్లను అంత అన్యోన్యంగా చూసినాక స్టీఫెన్ కి ఎందుకో ఇబ్బందిగా అనిపించింది.

“జింకపిల్లలాగా తిరిగేపిల్ల ఎంత నెమ్మదస్తురాలయింది!” అల్లుడితో మాట కలుపుదామని అంది.

అది కూడా ఆరోపణలా అనిపించిందో ఏమో, నవ్వి ఊరుకున్నాడు.

“చిన్నప్పుడు ఇంటిమీనికి ఎన్నెన్ని  తగులాటలు తెచ్చేది. ఒకసారి ఇంట్లో టీవీ రాటంలేదని, మిద్దెక్కి పక్కింటోళ్ళ డిష్ తీగ పీక్కొని వొచ్చింది. హా..హా”

అల్లుడు కాస్త కుదురుకొని “ఆ, నాకు తెలుసు. పెళ్లయిన కొత్తల్లో నేను టైం కి రాట్లేదని, బ్యాగ్ తీసుకొని సెల్ పాయింట్ కాడికి వొచ్చి నేను మా ఇంటికి వెళ్ళిపోతా అనేది. నిజంగా పొయిద్దేమోనని అప్పటికప్పుడు షట్టర్ మూసి తీసుకొచ్చేవాణ్ణి”

ఆమె కూతుర్ని ‘ఇంటి మీద అంత భరోసా పెట్టుకున్నావా?’ అన్నట్టు చూసింది.

“ఆ మధ్య అమ్మను చూడాలని ఉందని దిగులుపడింది. అట్టని మీరు పిలవకుండా నేను పంపలేనుగా. అప్పుటినుంచీ.. పిల్లలుగాని ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయిని తొందర పెట్టింది”

“హా, నీకు లేదా తొందర. పిల్లలో అని బతిమాల్లేదా నువ్వు?” దెప్పింది శిరీష.

అమ్మను చూసుకొని బడాయి పోతోందిలే అని ముచ్చట పడ్డాడు భర్త.

శోభ భుజం మీద తట్టి “చాల్లే ఇంక,  ఎట్టైతేనేమి శుభమ్ జరిగింది గదా”

“సరే పో, తొందరగా తయారయి రాపో” శోభ.

శిరీష చకచకా బ్యాగులో బట్టలు సర్దుకుంది,

“మందులు పెట్టుకున్నావా?” స్టీఫెన్.

“హా.. అయిపోతే నాన్న తెస్తాడులే”

నాన్న… స్టీఫెన్ మొహం  బిగదీసుకున్నాడు.

“అప్పుడే నా స్థానాన్ని మీ నాన్న ఆక్రమించుకున్నాడా!”

“కాదు, నాన్న స్థానమే నువ్వు దక్కించుకున్నావు” అని కళ్ళలోకి చూసి నవ్వింది.

ఇల్లు దాటేముందు శోభ అల్లుడితో “నువ్వు గూడా వచ్చి దిగబెడితే బాగుంటది కదయ్యా”

ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నాడు.

వెళ్లాలనీ ఉంది. కానీ ఆ రోజు శిరీష వాళ్ళ నాన్న అన్న మాటలు మర్చిపోలేదు.

“ఎవరికైనా ఇస్తాగాని, ఆ నాయాళ్లకు మాత్రం నా కూతురును ఇచ్చేది లేదు…తూ” అన్న కాండ్రింపు విని ఇప్పటికి సంవత్సరం. అదింకా పచ్చిపచ్చిగా గుచ్చుతూనే ఉంది.

అత్తగారి వైపు చూసి “నాకు షాపులో పనుందిలే, మీరు పొయ్యి రాండి” అన్నాడు.

గత సంవత్సర కాలంగా ఏరోజూ భార్యను వదిలి దూరంగా లేడు స్టీఫెన్. పెళ్లయిన కాణ్ణుంచీ ఈరోజు దాకా శిరీష తన ఊహలకు తగ్గట్టుగానే ఉంది. సెల్ పాయింట్ లో సరిగ్గా జరక్కపోతే,  ఖర్చులకు సర్దుకోవడం నేర్చుకుంది. ఎప్పుడు దిగాలుగా ఉన్నా ప్రేమగా దగ్గరికి తీసుకునే ఆ చేతులు కొంతకాలం తనకు దూరంగా ఉంటాయని బెంగ పడ్డాడు. శిరీష మటుకు మొగుడిని రమ్మని వేడుకోలుగా చూసింది. ఆమె గుడ్లనిండా నీళ్లు.

*****************

అంతెత్తు కడుపుతో వస్తున్న శిరీషను చూసి అట్ట జరిగిందా! అని పోసుకోలు ఆశ్చర్యాలు ప్రకటించారు కాలనీ జనాలు. తల్లి చాటు కోడి పిల్లలా దాక్కొని దాక్కొని నదిచింది శిరీష. వెళ్ళేటప్పుడు ఉన్న తెగువ ఇప్పుడు ఏమైందో! బరువైన అడుగులతో ఇంట్లోకి వొచ్చింది. టీవీ ముందు కూర్చున్న నాన్న మొహమంతా ఎర్రబడింది. ఆయన్ను ధైర్యంగా పలకరించలేక అలా నిలబడింది. టీవీ సౌండు పెంచిండు. మెల్లగా తన గదిలోకి చేరింది. ఇల్లంతా లావాను దాచుకున్న అగ్నిపర్వతంలా ఉంది. ఆమె ఇల్లు వదిలి పోయాక, తన దాబాకి వచ్చేవాళ్ళ ఎటకారాలు పడలేక దాబా మూసుకున్నాడు బాలరాజు. ఊరికి చూపించను మొహం చెల్లక ఎప్పుడూ ఇంట్లోనే పడి ఉంటున్నాడు. బాగా సన్నబాడ్డాడు. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు నిశ్శబ్దంగా చేసుకుంటున్నారు. నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ  ఇరుగూపొరుగు ఇంటి పంచలో చేరారు. అందరికీ సందేహాలు, తీరేదాకా ఆరాలు.

“ఏమే శిరీషా, ఎంత మొండిదానివే, అంత ధైర్యం ఎట్లా చేశావు?” అని ప్రశ్నల దాడి చేశారు. సంవత్సరం క్రితం ఆ రోజు భయాలను, బ్రమలను మరోసారి గుర్తు తెచ్చుకుంది.

ఆదివారం. ఇంట్లో అంతా చర్చికెళ్లారు. మిట్ట మధ్యాహ్నపు ఖాళీ రోడ్లు. ఈ పంతాల మధ్య నుంచి బయటపడాలని శిరీష బ్యాగ్ తీసుకొని వచ్చేసింది.

స్టీఫెన్, శిరీష ఇద్దరూ వాళ్ళ రెండు ఊర్లు కలిసేచోట కూడలిలో ఉన్నారు. దానికి దగ్గర్లో ఫ్రెండ్ పనిచేసే బెంగళూరు బేకరీ లోపల కూర్చున్నారు. అతను ఇచ్చిన సపోర్ట్ ఇద్దరూ ఎప్పటికీ మర్చిపోరు. ఎప్పుడూ “నీలాంటోడు ఒకడు ఉండాలి బాబాయ్ “ అని అతన్ని ఉబికిస్తుంటాడు స్టీఫెన్.

ఆమె పెద్ద పెద్ద కళ్ళలో బెరుకు బాగా తెలుస్తుంది. చామనచాయ కావటాన ఆమె వేలికి ఉన్న ఉంగరం మెరుపు బాగా కనిపిస్తోంది. దాని మీద S అన్న అక్షరం. S… స్టీఫెన్.

ఫోన్ మోగుతోంది. చూసి శిరీషకి చెమటలు  పడుతున్నాయి. స్టీవెన్ ఫోన్ కెళ్ళి చూస్తుండు. అది ఇంటి నుంచే…

“ఈపాటికి విషయం పాలెమంతా పాకి ఉంటది” శిరీష.

బేకరీ నవీన్ కి ఆ మాట విన్నాక వచ్చిన డౌట్ “ఇద్దరూ పాలెం వాళ్లే అయితే ఇంత పంచాయతీ ఎందుకురా! పెద్దోళ్ళకు చెప్పి మాట్లాడితే అయిపోద్దిగా”.

“వాళ్లది పాలెమే గాని మా పాలెం కాదు. మురారి పల్లిలో మాలపాలెం” స్టీఫెన్.

“అయితే ఏమైంది, అడిగితే పోయిద్దిగా” ఈ గీతల మద్య దూరాలు తెలీని నవీన్.

“ఎట్టయిద్ది రా సామి. మా నాన్నను సంబంధం అడగమని చెప్తే, మా నాన్నా ఫ్రెండ్స్ నవ్వి, దేశంలో నీకు మాలపిల్లే దొరికిందా రా అని సిగ్గు తీసిర్రు. నేను వదలకుండా మా నాన్నను బతిమాలితే తప్పక, పొయ్యి వాళ్ళ నాన్నతో మాట్లాడిండు. ఇంక చూడాలి. వీళ్ళ నాన్న అమ్మనా బూతులు తిట్టి, మీరేంది మేమేంది! ఈ ఎదవ నాయాల్లకి నా కూతురును ఇస్తానా? కూతుర్ని మాదిగోడికి ఇచ్చి చేసిండని ఊరంతా నా మొహం మీద ఉయ్యటానికా అని చిందులేసిండు.” వివరంగా బాధపడ్డాడు స్టీఫెన్.

ఉసూరుమన్నాడు నవీన్ “మరి పోలీస్ స్టేషన్?”

“అన్నీ అయ్యాయి రా సామీ. పోలీస్ స్టేషన్ కి పొతే .. మీరూ మీరు ఒకటేగా. ఇంక గొడవ ఎందుకు? అన్నారు.

“కాదు సార్, వాళ్ళు మాకన్నా ఎక్కువంట” అన్నా.

ఎస్సై నన్ను పట్టుకొని “పెళ్ళిళ్ళు చేయడానికి ఇదేం తిరుపతి గుడి కాదు. మీరే చేసుకోనీ రాండి, పోండి” అన్నాడు, ఆయనకి దీన్లో సమస్యే కనపడలేదు, ఖర్మ “. స్టీఫెన్.

“ఉఫ్. అయితే ఇంక మనకు ఉంది ఒకటే ఆప్షన్. పద” అని ఇద్దరినీ కారెక్కించాడు నవీన్. కారు ఎన్ హెచ్16 మీద పరుగు తీసింది. పోలీస్ స్టేషన్లు, చేజ్ లు, ఏవేవో ఊహించాడు కానీ అవేవీ జరగలేదు. ఎందుకంటే, బాలరాజు ఒక్కమాటలో.. “ఈ రోజు నుంచి నా కూతురు సచ్చిపోయింది, ఛత్.” అనేసుకున్నాడు. అంతకుమించి పోరాడే బలగం, డబ్బూ, ఏదీ లేదు, ఉత్త పౌరుషం తప్ప.

సాయంత్రం పూట గుణదల చర్చి  వెలుగుతోంది. చర్చి పాస్టర్ ఇలాంటి పెళ్లి చెయ్యడు. దాంతో  కింద కాలనీకి వెళ్లి పెళ్లిళ్ల పాస్టర్ను వెతికి పట్టుకున్నారు. పెళ్లి బట్టల్లో స్టీవెన్ శిరీష ఉంగరాలు మార్చుకొని హత్తుకున్నారు. అక్కడ పిలవని చుట్టాలు కళ్ళు కాకరొత్తులు చేసుకున్నారు. అంతా విని న్యాయం మాట్లాడబోయరు. పడనియ్యలేదు శోభ.

*****************

బజార్లో అంతా మొహాన్నే.. ఎల్లిపోయిన పిల్లని ఎట్ట రానిచ్చినవ్! అని బాలరాజు సిగ్గు తీసిర్రు. బాలరాజుకి కూతురి రెక్క పట్టుకొని ఇంట్లోంచి బయటికి నెట్టేయాలని ఉంది. ఆడదాకా వొచ్చి ఆ కడుపు చూసి ఆగిపోతున్నాడు. ఇంట్లో ఉండలేక నేరుగా దాబా కాడికి పోయి కూర్చుంటాడు. మూతపడ్డ ఆ దాబా గుండెల మంటకి పెట్రోల్ పోసిద్ధి.  పెళ్ళిళ్ళు, శుభకార్యాలకూ పోయ్యేది లేదు. నలుగురు ఉన్నప్పుడు విధినీ, దేవుణ్ణి, ముఖ్యంగా కూతుర్నీ అమ్మనా బూతులు తిడతాడు.

చేతనైనవాడు పోరాడుతాడు. చేతకానోడు మంకుపట్టు పట్టి సాధిస్తాడు.

“పోరాడితే పోరాడొచ్చు కానీ, పంతం పడితేనే ఓ పట్టాన తెగదు” అని మొగుడి వాలకనికి వేసారింది భార్య. కూతురు వచ్చాక మౌనంగా ఉంటున్నాడు , ఏమై పోతాడో ఎమో అని దగ్గరకెళ్లి “కాదయ్యా, ఎందుకిట్లా ఉండడం. ఎంత కాలమున్నా మనోయెద పోదు. నా మాటిని దాబా మళ్లా తెరువు” అన్నది.

బాలరాజు “ఎందుకే ,వచ్చే పోయే నలుగురూ నన్ను సిగ్గు మానం  తియ్యటానికా? డబ్బులు పోయినా పర్వాలేదు. పోయిన పరువు తిరిగి రాకపోతే బతికి దండగ”  కేకలేసిండు. పరువు తిరిగి ఎట్లా వొచ్చిద్దో ఆమెకి అర్ధం కాలేదు. ఏదో ఆలోచన చేసిండని మాత్రం తట్టింది.

శిరీష రాత్రి బాత్రూంకని లేసి చూస్తే అమ్మ మెలకువగానే ఉంది. వచ్చి ఆమె కాళ్ళు తాకింది. కన్నీళ్లు కాళ్ళ మీద పడ్డాయి. అమ్మ గాబరాగా లేచింది. అమ్మ కూతురును గుండెకు హత్తుకుంది.

అలా ఆమె పక్కన పడుకొని “ఎందుకమ్మ అంతలా భయపడుతున్నావ్?” అంది.

అమ్మ “ఇట్టాంటి మనిషితో భయాలు కాక ఏముంది.

నువ్వు పోయినాక చిన్న అగసాట్లు కాదులే. నీ వల్ల మీ నాన్న మర్యాద మంటగలిసిందని రోజూ తిట్లే. ఆయన కొన్ని రోజులపాటు అన్నం తినలేదు. నన్ను తిననియ్యలేదు. సరింగ నిద్రపోలేదు. నన్నూ పోనియ్యలేదు. కులం చెడ్డాడని ఊరంతా ఎగతాళి చేస్తుందని రాత్రుల్లు తాగి బోరుమని ఏడిచేవాడు.

ఈ వంకన ఎన్ని రోజులు నన్ను అడ్డగోలుగా తన్నిండో. మనుషులతో కలవకుండా ఇట్టనే ఉంటే ఏమై పోతడో అని నా భయం. హు, నాలుగు మెతుకులు నోట్లోకి పోంగానే యాడలేని పట్టింపులు వస్తాయి ఈ మనుషులకి. ఈ కులం మందు లేని జబ్బు శిరీషా”

అమ్మని చూసి శిరీషకి పాపం అనిపించింది. ఆమెకైన గాయాలు చూసి ఎంత యాతన పడిందో కదా అనుకుంది. ‘తను పడ్డ బాధలు, తిన్న  దెబ్బలు నా వల్లే. అదేదో నాకే జరగాల్సింది. సరి చేయాల్సింది ఏదో ఉంది’ అని తలుచుకుని రాత్రంతా నిద్ర పట్టలేదు.

తెల్లారి స్టీఫెన్ కి ఫోన్ చేసి అమ్మ ఇట్లా అన్నదని చెప్పుకొని బాధపడ్డది “నువ్వు ఒకసారి ఇక్కడికి వస్తావా?” అడిగింది.

“నేనెందుకు వస్తా? మీ నాన్నే నన్ను పిలవాలి. ఇప్పటికైనా మా గురించి అర్థమయ్యే ఉండాలి మీ నాన్నకు” స్టీఫెన్.

మా..  అన్న మాటకు అర్థం వేరని శిరీషకి తెలుసు.

అది మన అనే పదంగా ఎప్పుడు మారుతుందో తెలీదు.

***************

డాక్టర్ డేట్ ఇచ్చిన రోజు హాస్పిటల్ కి వెళ్లాలంటే తండ్రి కదల్లేదు. బతిమాలింది, లాభం లేదు.

తను పంతం నెగ్గే సమయం. తగ్గాలని లేదు.

అంత పట్టుబట్టి ఉంటే ఎట్టరా! అన్నారు చుట్టుపక్కలోళ్ళు. అది హాయిగా అనిపిస్తుంది. ఇన్నాళ్లు మాటలు పడ్డ ప్రాణం వాళ్ళ గుర్తింపుకి తృప్తి పడ్డది.

చివరికి అమ్మే చిన్నగా కూతుర్ని బయలుదేరదీసింది.

వెళుతూ భర్తకి ఫోన్ చేసింది శిరీష. ఫోన్ పట్టుకున్న అతని అరచేతికి చమటలు పట్టేశాయి.

“కచ్చితంగా వస్తున్నావ్ కదూ” శిరీష.

అలా అడగాల్సిన పరిస్థితి వచ్చినందుకు తనమీద తనకే జాలి పుట్టింది. అడిగించుకున్నందుకు అతనికి కూడా.

“వస్తానని చెప్పూ” శిరీష.

“మ్మ్.. ”

“ఎదురు చూస్తుంటా, వస్తావుగా, నాకు భయంగా ఉంది”

“హ”

“నువ్వు వస్తే బాగుంటుందన్నాడు మా నాన్న” శిరీష చెప్పలేక చెప్పింది.

“అబద్ధం చెప్పమాకు”

మౌనంగా ఉంది.

కొన్ని గంటల తర్వాత క్యార్ మని ఈ లోకానికి వచ్చింది ఓ చిన్నారి. పాపను ముద్దాడిన శిరీష, స్టీఫెన్ కోసం వెతికింది. ఆపరేషన్ థియేటర్లో లేడు. జనరల్ వార్డుకు తీసుకొచ్చారు. అక్కడ లేడు. ఏడుపు, ఉక్రోషం తన్నుకొచ్చాయి. పళ్ళు బిగబట్టి తలను  దిండుకు అదుముకుంది. కనుకొనల నుంచి కన్నీరు దిండుని తడి చేశాయి. నెప్పి, బిడ్డను కన్నదానికన్నా పెద్ద నెప్పి. అప్పుడు కదా నాన్న మొహంలో నవ్వు చూసింది శిరీష. పాప బోసినవ్వుతో పాటే బాలరాజు నవ్వాడు. ఎన్నో నెలల తర్వాత తృప్తిగా నవ్వాడు.

భార్యku పెద్ద భారం దించుకున్నట్టు ఉంది.

ఆయన నవ్వు చూసి శిరీషకు ఆశ్చర్యానందం కలిగాయి. కొన్ని నిమిషాలు తన బాధను మర్చిపోగలిగింది. పాపనెత్తుకున్న బాలరాజు కూతురు దగ్గరికి వచ్చి “నా మనవరాలు మన పోలికనే, వాళ్ళ సారలు ఏమీ రాలేదు, హా.. హా..” అన్నాడు.

నవ్వుతున్న శోభ, శిరీష, మొహాలు బిగుసుకున్నాయి. ఆ వార్డు అంతా ఆయన నవ్వే వినిపిస్తుంది.

*********************

ఈ రోజు నుంచీ బాలరాజు పట్టు గురించి ఊరు చెప్పుకుంటది, పంతం గురించి పొగుడుకుంటది. అని

చాలా మనశాంతి గా ఉన్నాడు. అలాగే జరిగింది కూడా.

కూతురి దగ్గరికొచ్చి అల్లుడిని పిలవమన్నాడు బాలరాజు. పోయిన పరువు తిరిగి పొందటం.. అన్న ఆయన మాటలు మరచిపోని భార్యకు కంగారుగా అనిపించింది. పిలవాలా, వద్దా!! తెలీలేదు.

ఒకటో రోజు.. రెండవ రోజు.. మూడవ రోజు.. భార్యనీ కూతుర్ని చూడడానికి రాని స్టీఫెన్ కోసం శిరీష ఎదురుచూపు సాగుతూ ఉంది.

నిరంతర బాధ వైరాగ్యానికి దారి తీస్తుంది. శిరీష గుండెల్లో ఇప్పుడు అలాగే ఉంది.

“ఇంతకాలం కురిపించిన ప్రేమ ఉన్నట్టుండి మాయమైపోయిందా? ఇలాగైతే నాకూ అక్కడికి వెళ్లాలి అనిపించట్లేదు” అమ్మతో అంది.

“హ్మ్. కొన్ని సార్లు అంతే. మీ ఆయన, మీ నాన్న ఇద్దరికీ ఒకేరకం పంతం. దానికి బలయ్యేది ఇంట్లో ఆడోళ్ళే. ఇదంతా కాదుగానీ, నేను పొయ్యి స్టీఫెన్ ని వెంట పెట్టుకొని వస్తా, తాలు ” అమ్మ.

“అవసరం లేదులే.” అమ్మ బుజాన తల వాల్చింది.

ఫోన్ వైపు చూస్తూ ఉంది.

బాలరాజు హుషారు ఇద్దరికీ అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు అతని పట్ల ఊరి దృక్పధం మారిపోయింది.

నిండు గర్భిణీ చచ్చేటట్టున్నా పట్టించుకోని పంతం గల మనిషి అన్న పేరు. అల్లుణ్ణి గడప తొక్కనియ్యలేదు బాలరాజు అన్న పొగడ్త చాలా మజా ఇస్తున్నాయి.

బాలరాజు బజార్ నుంచి వచ్చి “అల్లుడు ఇంకా రాలేదా?” అన్నాడు. ఆయన ఉద్దేశం ఏందో ఇంట్లో మనుషులకు అంతుభట్టలేదు. బిడ్డకు పాలు పడుతున్న తన కూతురు దగ్గరికి వచ్చి “బర్త్ సర్టిఫికెట్ ఇదిగో” అని తీసి చూపించాడు.

అంత సంబరం ఏంటో అర్థంకాక దాన్ని జాగ్రత్తగా చూసింది. అందులో ఇంతింత అక్షరాలతో కనపడింది ఆయన కులం పేరు.

పాప జీవితానికి పూసిన రంగు అంది. మనసు చెదిరిపోయింది. స్వర పేటిక తడారిపోయింది.

టక్కున ఆ బర్త్ సర్టిఫికెట్ లాక్కొని సర్రున చించింది. ఆ శబ్దం కోత కోసినట్టుగా ఉంది.

ముక్కలుచేసి నాన్న మొహాన విసిరేసింది శిరీష. ఇన్నాళ్లు మాట్లాడడానికి ధైర్యం చాలని మనిషి ఇప్పుడు నోరు తెరిచింది. తానూ అయనలాగే ఒకేఒక్క మాట అన్నది “ఛీ,” అని.

ఎన్నాళ్లుగానో తనలో రేగుతున్న అగ్గి. దెబ్బకు ఆయన శిఖరం విరిగిన పర్వతంలా అయ్యాడు.

శిరీష ఏడుస్తున్న బిడ్డను చెంగున చేతికి అందుకొని ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టింది. అమ్మ ఆపలేదు. నాన్న ఆపే ధైర్యం చెయ్యలేదు. ఆమెది కెరటంలాంటి ఉదృతి, ఆపను చేతకాదు.

భర్తింటికి వెళ్ళలేదు. వెళితే నాన్నలాగే అతనూ మరో బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాడని గట్టి నమ్మకం.

కూడలి దారిలో వెళ్తా ఉంటే ఒక ఊహ తోచింది… నాన్న, భర్త, ఇద్దరూ కలిసొచ్చి చంకన ఉన్న బిడ్డను దగ్గరికి తీసుకున్నారంట. ఆ పాప ఏడుపు ఆపిందంట. ఆ పసిమొహంలోకి నవ్వు తిరిగొచ్చిందంట. వాళ్ళిద్దరూ కలసి పంచిన ఊహత్మక నవ్వు అది.

*

చరణ్ పరిమి

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా బాగుంది.

    చివరి ఊహ నచ్చింది.

    ముగింపు రేపటి దారికాడ దీపాలుబెట్టింది.

    • అవును, ముగింపు రేపటి కోసం ఒక ఆశ. Thank you sir.

  • కథ చాలా నచ్చింది.ఎందుకో చాలా బాథ అనిపించింది.ఈ కులాల సమస్యలు, పట్టుదలలు పైనించి కింద దాకా అన్ని కులాల లో వున్నాయి.ఇది పోయి సమాజం ఒక్కటి గా ఎప్పుడవుతుంది? మంచి కథ.

    • ఆ బాధను అక్షరీకరిద్దాం అనే ప్రయత్నం సర్. Thank you.

  • కులం అనేది పీడితులను కూడా పీడకులను చేస్తుందనేది మనం నేడు చూస్తున్నాం.ఆ విషయమే ఈ కథ చెప్పింది.సమాజం దృక్కోణం మారనంతవరకు ఇది మారదేమో..2+3= 1 అన్నాడు నగేష్‌బాబు.కథ చివర అలాంటి ఊహాత్మక ముగింపు ఇచ్చారు.

    • ఇప్పటికైతే ఊహగానే ఉండిపోయింది. కథ ఉద్దేశం బాగా చెప్పారు. Thank you sir.

  • నిమ్న కులాలు అంటూ ఊరికి దూరంగా నెట్టబడ్డ వారి మధ్య పంతాలు పట్టింపులు చాలా దారుణం. ఇద్దరు ఒక్కటై సమాజం మీద తిరగబడాలి. అలాంటిది వారి మధ్య వైరుధ్యం. మంచి కథా వస్తువు తీసుకుని బాగా రాసిన కథ. మంచి ఊహతో ముగింపు బాగుంది. రచయితకు అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు