కుక్క సచ్చింది

బర్మా క్యాంపు కథలు  8

టీవీలో రామాయణం చూసాక ఆదివారం సాయంత్రం బాణాల ఆట ఆడుతూ , నూకాలమ్మ  పండగ రోజుల్లో రాత్రి  తెరకట్టి వేస్తున్న సినిమాలు గొనె పట్టా పట్టుకెళ్లి చూస్తూ,   కప్పల బడి కప్పరాడ లో అల్లీ కాయలు ఆడుకుంటూ , బర్మా క్యాంపు కొండ మీద రేడియో పాటలు వింటూ, దసరా సెలవులకు శ్రీహరి పురం బర్మా కాలనీలో స్కూటర్ టైరుతో ఆడుతూ, మూడు చీపురు పుల్లలు పెట్టి కర్రతో రబ్బరు బాలు తో క్రికెట్ ఆడుకుంటూ, కంచరపాలెం మెట్టు మీద ప్రజా నాట్యమండలి పాట లు , వీధినాట కాలు చూసుకుంటూ , బర్మా క్యాంపు నుంచి కిందకు దిగుతుండగా రోజూ శవాలు ఎదురవు తుండగా వాటిని సాగనంపుతూ , శవాల మీద నుంచి పువ్వులతో పాటు వేసిన ఇరవై పైసలు బిళ్ళలు తీసుకోకూడదు అని వాటివంకే చూస్తూ ఎవరో పుణ్యాత్ముడు వాటిని తీసుకోగా మనశ్శాంతి పొందుతూ, నేషనల్ హైవే నెంబర్ అయిదు లో  అక్కడకు అయిదు కిలో మీటర్ల దూరం లో వున్న ఎయిర్ పోర్టు లోంచి  దిగిన రాజీవ్ గాంధీని చూడడానికి వొచ్చిన జనం కోసం రోడ్డుకు అటూ ఇటూ కట్టిన కర్రల మీద కాళ్ళు పెట్టుకొని రోజంతా ఎదురుచూస్తూ,   టీవీలో చిత్రలహరి  శనివారం సినిమా చూసుకుంటూ, శ్రీకృష్ణ లీలలు పుస్తకం, జనవిజ్ఞాన వేదిక పుస్తకాలు చదువుతూ హాయిగా  మా  పెంకుటింట్లో గడుపుతున్న నాకు  ………

ముక్కు పుటాలు అదిరిపోయేంత కంపు కొట్టింది.

ఇంటి బయటకు వెళ్లి చూద్దును కదా

“అక్కయ్య ” ఇంటి పక్కన ఖాళీ స్థలంలో , భాగ్య లక్ష్మీ అంటీ ఇంటికి వెళ్లే దారిలో , బొగ్గు బ్రదర్స్ ఇంటికి ఇవతల కుక్క చచ్చి పడి కనిపించింది.   ఇళ్ల కాడ తిరిగే కుక్క చు. … చు…. చు… అంటే అన్నానికి వొచ్చే కుక్క అది.

” హరి బాబూ నువ్వే ఆ కుక్కను తీసి పడేయమ్మ ” అన్నారు దయగల అమ్మలు, అంటీలు.

ఇప్పటిలా సానిటరీ వర్కర్లు, మున్సిపాలిటీ వారు వొచ్చి కుక్కను తీసేంత పద్దతి ఉందని తెలీదు.

అమ్మలంతా అయ్యో మనం అన్నం పెట్టి సాకిన కుక్క చచ్చి పోయిందే అని చాలా బాధ పడిపోయేవారు.

ఆ చనిపోయిన కుక్కను తీసుకెళితేనే మేము శుభ్రమైన గాలి పీల్చుకోగలం. ప్రశాంతంగా అన్నం తినగలం, సుబ్బరంగా నిద్దురపో గలం.

మా అమ్మేమో గొనె సంచీ తీసుకొచ్చి ఇచ్చింది, అక్కయ్య  గారి భార్య సత్తెమ్మ ఒదిన ఇంత ఉప్పు తెచ్చి ఇచ్చింది, భాగ్య లక్ష్మీ అంటీ కొబ్బరి తాడు తెచ్చి ఇచ్చింది.

ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా  వుండే తమ్ముళ్లు రవికాంత్, బాల కిషోర్ లు దరి దాపుల్లో కనపడలేదు.

ఒక కొబ్బరి తాడు కుక్క కాలికి కట్టి , దానిని గొనె మీదకు లాగేను, దాని చర్మం  ఊడి వొచ్చింది.  వాసనకి కడుపులో తిప్పేసింది.

అమ్మ ఇచ్చిన జేబురుమాలు నా ముక్కుకు కట్టి  కుక్కను లాగ సాగేను.  కింద గోనె , దాని పైన కుక్క. రోడ్డు దాటుకుని దిగువకు నూకాలమ్మ పండగకు అగ్ని గుండం తొక్కే దగ్గరకు తీసుకెళ్లడం మొదలెట్టాను.

దారిలో అటూ , ఇటూ ఇళ్ళు అందరూ నా వంక  చూస్తున్నారు. ” అయ్యాయ్యో ఓలమ్మో కుక్క సచ్చి పోనాది … ప్చ్ … ప్చ్.. ” అంటున్నారు.

నాగుల చవితికి పుట్టలో పాలు  పోసే కాడ పెద్ద పెద్ద పుట్టలు వున్న ఆ ప్రదేశంలో చచ్చిన ఈ కుక్కని

ఒక గోతిలో వేసి ఇంత  ఉప్పు , ఇన్ని తంగేడు పూలు, కొన్ని ఆకులు వేసి , మరికొంత మన్ను వేసి కప్పెట్టి తాడు , గో నె  కూడా అక్కడే వొదిలేసి వొచ్చేసాను.

 

బర్మా క్యాంపు కింద స్మశానంలో మనిషిని సాగనంపే తంతు రోజూ చూసేవాడిని , పల్లకిలో, శవం పాడికి కోడి కట్టి, జువ్వలు వేసి,  సారా వేసి, చిందేసి, డప్పులు కొట్టి, పూలు జల్లి, ఊరంతా వొచ్చి సాగనంపడానికి  రావడం రోజూ చూ సిన నాకు చచ్చిన కుక్కకు ఇంకా ఏవైనా గౌరవం చేయగలనా అని అనిపించ సాగింది.

ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్లే సరికి కుక్కను తీసిన చోట నీళ్లు  శుభ్రం చేసి ఉంచారు.

” బట్టలు బయట గోలెం దగ్గర పడేసి తల స్నానం చేసి రా”  అంది  అమ్మ.

*   *    *

క్యాంపులో ఎవరైనా చనిపోతే రాత్రంతా పాటలు పాడే వాళ్ళని పిలిచి శవ జాగారం చేయిస్తారు, గ్లాసులో సారాయి తాగుతూ వాళ్ళు జీవితం మీద పాడే వేదాంతం పాటలు విని తీరాల్సిందే.

మొన్నామధ్య శవ జాగారానికి డప్పు కొట్టి పాటలు పాడే  అప్పలరాజు ” ఇప్పుడు శవ జాగారానికి పాటలు  పాడించే వాళ్ళు తగ్గిపోయారయ్యా బాబూ ” అందరూ సెల్ చూసుకుంటూ జాగారం చేస్తున్నారు , మనిషి సచ్చి పోయిన వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ చేసి యెంత మంది  లయికు కొట్టి రిప్ పెట్టారో చూస్తన్నారు ” అన్నాడు.

సరే ఈ గొడ వెప్పుడూ వుండేదేలే అనుకొని క్యాంపు కిందకు దిగి  నాలుగు లేన్ ల హైవే దాటుతుంటే    కుక్క నొక దానిని వేగంగా వొచ్చిన లారీ గుద్దేసి పచ్చడి కింద చేసేసింది.

కుక్కను పక్కకు లాగే మనుషులు లేరు. కొన్ని వెహికల్స్ చచ్చిన కుక్కను పక్కకు తప్పించి వెళ్లాయి గాని, పొద్దుటికి  అది హైవే రోడ్డుకి పూర్తిగా అతుక్కు పోయి రోడ్డులో కలిసి పోయింది.

” పాపం కుక్క సచిపోయింది, చావని మనుషులు  కుక్క కంటే అద్వాన్నంగా  ఊరిని , బర్మా క్యాంపు ని దోచుకునే వాళ్ళ దగ్గర తిరుగుతున్నారు   ”  అనుకుంటూ ఊర్వశీ జంక్షన్ దగ్గర మలుపు తిరిగి పోయాడు బర్మా కాందిశీకుడొకాయన.

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Appati lo cinimalu ela chuse varo cheppdam bagundhi.manusulu chanipothene avaru pattinchukune varu leru.a rojillo kukalani saki avi chanipothe dhani gowravanga panpinchadam really great.story simplly superb.

  • హరివెంకరమణ రచించిన కుక్కసచ్చింది కధ చాలా బాగుంది. చనిపోయిన కుక్కను పూడ్చిపెట్టడం, చనిపోయిన వ్యక్తి వద్ద శవజాగరణ,భజన తంతు గురించి కధలో బాగా వర్ణించారు.రచయిత అభినందనీయులు.

  • కధ చాలా బాగుంది సార్ చాలా చక్కగా ఉంది చిన్న నాటి జ్ఞాపకాలు ఈ కధలో చాలా బాగా వివరించారు ప్రతి విషయం స్పష్టంగా రాసారు , మా ప్రియ మిత్రులు శ్రీ హరి వెంకట రమణ గారు కి హృదయ పూర్వక అభినందనలు సార్ 💕👏👏🙏🙂🤝😊👌👌👌👌🙏very nice sir

  • చాలా చక్కగా, అప్పటి ఇప్పటి పరిస్థితి ని చెప్పారు. ఇప్పుడు రోడ్డుమీద ఏ కుక్కో, పిల్లో చావడమే ఆలస్యం, క్షణాల్లో అది రోడ్డుకతుక్కుని ఎండిపోతుంది. ఏ మునిసిపాలిటీ వాళ్ళో వచ్చి దాన్ని తీసే అవకాశం, అవసరం లేకుండానే వాటి కళేబరాలని మాయం చేసేస్తున్నారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు