కవిత్వానికి ఎడిటర్ వుండాల్సిందే!  

బండ్ల మాధవరావు కవిత్వ సంపుటి “దృశ్య రహస్యాల వెనక” ఆగస్టు పదిహేను ఆవిష్కరణ!

1. అనుపమ (2014) ప్రచురించిన ఏడేళ్ళ తరువాత ‘దృశ్య రహస్యాల వెనుక’ తెస్తున్నారు. తొలినాటికీ (1998), తరువాతి కాలానికీ గల మీ పరిణామక్రమాన్ని గురించి చెప్పండి.

  • కవితా సంపుటులు వేసే విషయం లో ఈ వ్యవధి నాకు సహజమైనదే. 90 నుంచి రాయడం మొదలుపెడితే మొదటి సంపుటి “చెమట చిత్తడి నేల” 98 లో వచ్చింది. రెండవది ఏడేళ్ళతర్వాత “స్పర్శ”(2005); తొమ్మిదేళ్ల తర్వాత ‘అనుపమ’ వచ్చాయి. ఇప్పుడు “దృశ్య రహస్యాల వెనుక” వస్తోంది. మధ్యలో 2017 లో “ఊరికల” దీర్ఘ కవిత, శివశంకర్ గారితో కలిసి “మా ఊరు మా ఇల్లు” అనే కథా కవితా సంపుటులు తెచ్చాను. 30 ఏళ్ళ అనుభవంలో, క్రమ పరిణామం లేకపోతే వ్యక్తిగా మనం లేనట్టేననుకుంటున్నాను. తొలిసారి రాసిన కవితకి ఇప్పుడు రాస్తున్న కవితకి, వస్తువు సమాజంలోంచే తీసుకున్నప్పటికి,వ్యక్తికరణ లోనూ, భాషా వినిమయం లోనూ ప్రస్పుటమైన మార్పు నా కవిత్వం లో కనబడుతుందనే అనుకుంటున్నాను.

2. సంపాదకుడిగా మీరీమధ్య బిజీ అయ్యారు ? అయినా కవితా మాసపత్రిక నిరాఘాటంగా రావడం లేదు.

  • “కవితా!” మాస పత్రిక కు సంపాదకుడు గా, వార్షిక సంచికలకు సహ సంపాదకుడుగా, దేవిప్రియ (బహుముఖ), పాపినేని (అణ్వేషణ) అభినందన సంచికలకు సంపాదకుడుగా, పని చేయడం మరువలేని అనుభవం. కవితా! మాస పత్రిక ఒకింత ఆలస్యానికి ప్రత్యేక మైన కారణాలు ఏమీ లేవు కానీ, శ్రీ శ్రీ ప్రింటర్స్ లో టెక్నీషియన్స్ కొరత, విశ్వేశ్వరరావు గారు మహాప్రస్థానం మహా గ్రంథం మీద దృష్టి పెట్టటం, కొద్దిగా నా అలసత్వం, ముఖ్య కారణాలు. ఏమైనా కవితా! పత్రిక ఆగిపోదు. త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది

3.వచన కవిత్వ చరిత్రలో మిమ్మల్ని మీరెక్కడ గుర్తిస్తారు ?

  • వచన కవిత్వాన్ని నాలుగు తరాల కవిత్వం గా భావిస్తుంటాను. కుందుర్తి దగ్గర మొదలైన తొలి తరం, 80 ల, 2000, 2020 లలో కవితా నిర్మాణం లోనూ, భాషా వినిమయం లోనూ ఎన్నో మార్పులను తెచ్చింది. 90లలో మొదలైన ఒక కవి వీటన్నిటిని అవలోకిస్తూ, తనలోకి వాటిని ఆవాహన చేసుకుంటూ 2020ల తరం లో కూడా పటిష్టం గా నిలబడే ఉన్నాడంటే, తప్పకుండా అతనికి ఆధునిక వచన కవితా చరిత్రలో ఎంతోకొంత స్థానం ఉన్నట్లే అనుకుంటాను. గుంటూరు జిల్లా సాహిత్య చరిత్ర రాస్తూ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు నా రచనల గురించి నాలుగు పేజీలలో ప్రస్తావించారు. ఏ నాటి కవిత్వ చరిత్ర లో స్థానం సంపాదించుకోవడమైనా అది విమర్శకులు, పాఠకులు నిర్ణయించాల్సిన అంశం.

4.వచన కవిత్వ రచనలో వస్తున్న మార్పులను మీరే విధంగా వ్యాఖ్యానిస్తారు ?

  • గత 30 సంవత్సరాలుగా కవిత్వం లో సంక్లిష్టత,అస్పష్టత ల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆధునికోత్తర కవిత్వం లో ఇవి చాలా సహజమైనవే అన్నంతగా ఒక దశలో కవిత్వాన్ని ఆక్రమించాయి. కాని 2000 తర్వాత వస్తున్న కవులు దీనిని అధిగమించి అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. ఇప్పటికీ రూపానికి, శుద్ధ కవిత్వానికే మేం ప్రాధాన్యత ఇస్తామనే కవులు కూడా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. అలాగే సంఘటనల కోసం ఎదురుచూస్తూ వెంటనే కవిత్వం రాస్తున్నవారూ ఉన్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చెయ్యడమనేది నాకు ఇష్టమైన పని. అలాంటపుడు ఆ సంఘటన ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత కవిత రాస్తే ఆ కవితకున్న రిలవెన్స్ పోతుంది కదా అని కూడా మిత్రులు అడుగుతారు. కాని చరిత్ర ను రికార్డ్ చేసే క్రమంలో దాని రిలవెన్స్ ఎప్పటికీ పోదు అనేది నా భావన. అలాగే వాక్యం రసాత్మకం కావ్యం అన్నంతమాత్రాన ఏకవాక్య కవితలు, నానీలు, నానోలు లాంటివి కవిత్వం అంటే ఎందుకో నా మనసొప్పుకోదు. కవిత్వానికి ఒక నిర్వహణ, అంతర్ రుచిరత్వము, చదివేకొద్దీ లోపలికి వెళ్లి దాన్ని ఆస్వాదించే గుణము ఉండాలనుకొంటాను. వీటన్నింటిని ఇప్పుడు వస్తున్న కవిత్వం లో గమనిస్తున్నాను. పరిణామక్రమాన్ని ఆహ్వానిస్తున్నాను. ఆస్వాదిస్తున్నాను.

5.జూం ద్వారా తొలి సాహిత్య కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వారుగా, సాహిత్యంలో సామాజిక మాధ్యమాలకెలాంటి ప్రాధాన్యాన్నివ్వాలి ?

  • గత సంవత్సరం మార్చ్ 24 నుండీ ఎవరికి వాళ్ళం ఇళ్లల్లో బందీలమైపోయాం. ఏం జరుగుతుందో తెలియక భయం భయం గా ఎక్కడివారం అక్కడే బిగసుకుపోయాం. దాదాపు నెలన్నర బయట ఎవరి ముఖం చూడకుండా గడిపేసాం. మే 1 అంటే విజయవాడ సాహితిమిత్రులకు ఒక కవిత్వ పండుగ. గత 22 సంవత్సరాలుగా క్రమం తప్పకుండ మే 1 సాయంత్రం విజయవాడ లో కవిత్వం తో ఒక సాయంకాలం కార్యక్రమాన్ని జూమ్ లో నిర్వహించాలనిపించింది. దానికి మీరూ, అనిల్, విశ్వేశ్వరరావు ఇంకా కవిమిత్రులు సహకారం అందించారు. అది అనేక సాహిత్య కార్యక్రమాలకు దిక్సూచి అయింది. కవిత్వ వికాసానికి సామాజిక మధ్యమాలు కీలకంగా మారాయి. అయితే అక్కడ వెల్లువెత్తుతున్న కవిత్వాన్ని గురించి మాత్రం నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. రాసిన కవిత్వాన్ని ఒక సంపాదకుడు సరిచూడవలసిన అవసరం ఉంది. అలా లేకపోవడం వలన అకవిత్వం కుప్పలు తెప్పలుగా మన ముందుకు వస్తోంది. అందుకే రాసిన ప్రతి అక్షరం గోడమీద పెట్టడం కాకుండా ఎవరైనా విశ్లేషణ చెయ్యగల వారికి చూపించి అప్పుడు పాఠకుల ముందు పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన.

6. అందుకేనా, మీ దృశ్య రహస్యాల వెనుక సంపుటికి సంపాదకుణ్ణి పెట్టారు ?

  • నిజానికి తెలుగులో కవిత్వ సంపుటులకు సంపాదకులు ఉండే సంప్రదాయం లేదు. అయినా నేను ఆ సంప్రదాయాన్ని తెలుగులో కూడా తీసుకురావాలనే ఉద్దేశం తో డా. ఏ. కె ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తే సహృదయతతో అంగీకరించారు. వారికి నా కృతజ్ఞతలు.

7.మీరు శిఖర, విద్యాసంస్థ ని నడుపుతున్నారు కదా ? స్కూల్లో పిల్లలకి కవిత్వం గురించి చెబుతారా ? ఈ తరం సాహిత్యాభిరుచిని గురించి చెప్పండి.

  • స్కూల్ లో పిల్లలకు కథలు కవిత్వం చదివి వినిపించడం, వారితో రాయించడం గత ముప్పై ఏళ్లుగా చేస్తున్న పనే. కోవిడ్ కంటే ముందు ఎండాకాలం సెలవల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తో కలిసి శిఖర స్కూల్ లో కథ, కవితా రచన, బొమ్మలు, కార్టున్ లు వేయడం మొదలైన అంశాలలో ప్రముఖ రచయితలు, కవులు, చిత్రకారులు, కార్టునిస్టులతో వర్క్ షాపు నిర్వహించాము. ఇక ఇప్పటి తరంలో సాహిత్యభిలాష గురించి చేప్పాలంటే పెరుగుతున్న జనాభా, అక్షరాస్యత లను దృష్టిలో పెట్టుకుంటే దానికి సమస్థాయిలో సాహిత్యభిలాషులు పెరగటం లేదనేది వాస్తవం. ముఖ్యం గా బోధనాంశాలలో సామజిక శాస్త్రాల ప్రాధాన్యత తగ్గడం, టీవీలు, సెల్ ఫోన్ ల వాడకం పెరగడం దీనికి కారణాలనుకుంటున్నాను. అయితే గమనించాల్సింది ఏమిటంటే నిష్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ కొత్తతరం పాఠకులు, కవులు, రచయితలు ఈ యవనిక మీదకు వస్తూనే ఉన్నారు. వీరిలో చాలామంది సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకొని అధ్యయనం, అభ్యాసనం చేస్తూనే ఉన్నారు.

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సంభాషణ బాగుంది
    మిత్రులు మాధవకు శ్రీ రామ్ కు అభినందనలు

  • కవిత్వం గురించి సమాజానికి సాహిత్య అవసరం గురించి తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా వెలిబుచ్చిన మాధవ్ గారికి మంచి ప్రశ్నలతో అడిగిన శ్రీరామ్ గార్కి అభినందనలు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు