ధిక్కార స్వరతంత్రులు తెగిన నిశ్శబ్దం

చిత్తలూరి సత్యనారాయణ ‘మా నాయిన’(2006), ‘నల్ల చామంతి’(2017), ‘మనిషి అలికిడి లేక’(2021)అనే వచన కవిత్వ సంపుటులు; ‘వెలుతురు మొలకలు’(2019) లఘు కవిత్వం వెలువరించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అనిశ్చితిని ఆధారంగా చేసుకుని ‘సముద్రాలు’ అనే కవితను రాసారు. ఇక్కడ ‘సముద్రాలు’ వేటికి/ఎవరికి ప్రతీకగా చెప్పబడి వుంటుంది? ‘సముద్రాలు’చేయాల్సిన తక్షణ కర్తవ్యమ్ ఏమై వుంటుంది?

*

‘సముద్రాలు’

~

గొంతు బావి

ఎప్పుడో పూడుకుపోయింది

మాటల జల పూర్తిగా

అడుగంటిపోయింది

 

మౌనాన్ని శిలువేసుకున్న శబ్దం

నిశ్శబ్దపు రాయి తగిలి తూలిపడింది

 

నోటి చెట్లకు మాటలు పూసే కాలమా ఇది

నాలుక మెలికపామై గొంతుకడ్డం పడింది

 

ప్రశ్నల కత్తులు లేవు

మాటల మంటలు లేవు

అంతటా

ధిక్కార స్వరతంత్రులు తెగిన నిశ్శబ్దం

నినాదాలు నీరుగారిపోయి

ప్రవాహ వొరవడి మందగించిన స్తబ్దతా కాలం

 

ప్రతిదీ మౌనంలోకి ముడుచుకుని

కలుగుల్లోకి దూరిన ఎలుకల తంతు

గొంతు విప్పితే

వేటాడటానికి సిద్ధంగున్న

కలుగుకాడి పిల్లి మాటు

 

అయినా కాలం కడుపుతో వున్నది

అణచివేతల సమాధుల మీదే

ఎర్రెర్రని పూలు పూసే స్వేచ్చారుతువొకటి

తప్పక ఉదయిస్తుంది

 

మూగబోయిన ఈ కాలపు గొంతులన్నీ

నినాదాలు ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రాలై

నియంతృత్వపు తీరమ్మీద విరుచుకుపడే

రోజొకటి తప్పక వస్తుంది

*

మూగబోయిన ఈ కాలపు గొంతులన్నీ ‘సముద్రాలు’ గా ప్రతీకరించబడినాయని తెలుస్తుంది. సముద్రం అనగానే అలలు, కెరటాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ‘సముద్రాలు’ విరుచుకుపడాల్సిన అవసరం వుందంటారా? కవి మాత్రం ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలో నెలకొన్న అనిశ్చితి ఎలా పరిణమించిందో ‘గొంతు బావి, మాటల జల, నోటి చెట్లు’ వంటి మెటాఫర్స్ వాడి స్తబ్దతాకాలాన్ని తెలియజేయడం చూస్తాం. ఇదంతా తుఫాన్ ముందరి ప్రశాంతత అని సరిపెట్టుకోవాల్సిందేనా? నిజంగానే రాబోయే తుఫాను దేశంలోని అనిశ్చితిని చెదరగొడుతుందా? ఒక ఆశావాద దృక్పథాన్ని అలవర్చుకోవడం దప్ప ‘సముద్రాలు’  విరుచుకుపడే సందర్భం ఉంటుందంటారా?

*

‘రస్సెల్ ఎ డ్యూయి’ తన “Psychology: An Introduction” అనే గ్రంథంలో అభ్యసనానికి సంబంధించి S-ఆకారపు వక్రం (S-shape curve) గురించి చెప్పడం జరిగింది. దీనిని ఇప్పటి పరిస్థితులకు

అన్వయించవచ్చు. రస్సెల్ ప్రకారం అభ్యసన మొదట నెమ్మదిగా(slow beginning) మొదలై, తర్వాత ఉత్తుంగ తరంగమై(rapid wave moment) ఎగిసి, పీటభూమి దశ (plateau stage) ను చేరుకుంటుంది. ఇప్పుడు దేశం ఉన్నటువంటి దశ ఇదే. ఈ దశలో పురోగతి మందగించి అంతా నిలిచిపోయిందనే భ్రమ కలుగుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని గమనిస్తే ఒక S-ఆకారపు వక్రాన్ని పూర్తిచేసిందని చెప్పవచ్చు. నెమ్మదిగా ప్రారంభమైన ఉద్యమం, ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని, అనంతర కాలంలో క్రమేణా స్తబ్దతను సంతరించుకుంది. దీన్ని సమూహ పీటభూమి దశ (massive plateau stage)గా వర్ణించవచ్చు. ఇది ఇక్కడితో ముగిసిపోయిందనుకోవడం పొరపాటు. ‘ప్రశ్నల కత్తులు, మాటల మంటలు’ లేకపోవడం   దీనికి ఆజ్యం పోస్తుంది.

*

రస్సెల్ పీటభూమి అనంతర దశ ఒకటి నెమ్మదిగా ప్రారంభమవుతుందని, అది కూడా తారాస్థాయిని చేరుకుంటుందని చెప్తాడు. అంటే S-ఆకారపు వక్రం నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. ఇక్కడ మాత్రం S-ఆకారపు వక్రం ఎప్పుడైతే పీటభూమి దశను చేరుకుంటుందో అప్పుడు ‘నియంతృత్వం’ రాజ్యమేలుతుందని అర్థం. కలాలు, గళాలు పీటభూమి అనంతర దశ కోసం కాసుకుని కూర్చుంటాయి. సమయం వచ్చే వరకు ఓపికగా నిరీక్షిస్తుంటాయి. అదును చూసి ఎక్కు పెట్టిన పదునైన బాణాల్ని గుండెల్ని చీల్చేట్టు ప్రయోగిస్తాయి. ఇదేనేమో కవి చెప్పిన స్వేచ్చారుతువు ఉదయించే కాలం. అణచివేతల సమాధుల మీద ఎర్రెర్రని పూలు పూసే సమయం.

“Keep your face always toward the sunshine and shadows will fall behind you”

_-Walt Whitman

బండారి రాజ్ కుమార్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు