స్పీకర్ లోంచి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్రావ్యంగా ప్రారంభమైంది. ఇంకా తెర తొలగలేదు. మా ముందు నిలుచున్నది ఒక మధ్య వయసు జంట. వాళ్ళు కదిలితేనే మేమూ ముందుకు కదల గలిగేది. నాకెందుకో ఆమె నిలుచున్న తీరులో తేడా కనిపించింది. అంతదాకా భర్త భుజం పట్టుకుని నిలుచున్న ఆమె, అంతలోనే అదే భుజం మీద వాలిపోయింది. కుడిచేతిలో ప్రింటవుట్ పేపర్ పట్టుకుని, అందులోని శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని స్పీకర్ లోంచి వెలువడే శబ్దాలకు అనుగుణంగా అరమోడ్పు కళ్ళతో చదువుకుని పోతున్న ఆయన ఆ పని వీడలేదు.
కాకపోతే తన ఎడమ చేతిని ఆమె వీపు చుట్టూ చుట్టి మరింత గట్టిగా పట్టుకున్నాడు. అక్షరాల నుంచి చూపు మరల్చకుండానే, కుడిచేతిలోని ప్రింటవుట్ ను భార్య ముఖం ముందుకు జరిపాడు. ఆయన చేష్టలు చూస్తుంటే నాకూ అనిపించింది, ఆమెది భక్తిపారవశ్యమేమోనని. అంతలోనే భర్త భద్రమైన భుజం పట్టునుంచి కిందికి జారిపోతోంది ఆమె. ఆ జంట వెనుక నిలుచున్న మాకే కాదు, ఇటుపక్కలా వేచివున్న మరికొందరికి కూడా తెలిసి పోయింది- అది భక్తి పారవశ్యం కాదు, సొమ్మసిల్లి పోవడమని.
కానీ అపారమైన భక్తిలో మునిగి శ్రీవారి సుప్రభాత పారాయణంలో తరిస్తున్న ఆ భర్త శిఖామణికి మాత్రం ఆ స్పృహ లేదు. అందుకే ఎడమ భుజాన్ని మరింతగా ఆమెచుట్టూ బిగించి పైకి లేపి నిలుచోబెట్టాడు- ఇటు చూడకుండానే. ఇక తట్టుకోలేక పోయిందేమో… నిస్త్రాణగా నేలకు జారిపోయింది. పక్కనే వున్న భక్తుల హెచ్చరికలతో భక్తి మత్తు నుంచి ఈవలకు వచ్చేసిన ఆ భర్త శిఖామణి, చివరి క్షణంలో గట్టిగా పట్టుకుని జనం మధ్యనే కూర్చోబెట్టాడు కానీ, లేకపోతే ఆ ఇల్లాలి పరిస్థితి ఊహించుకుంటే ఇప్పుడూ జాలి వేస్తోంది నాకు. సాటి భక్తులెవరో చెప్పగా చెప్పగా… గాలి ఆడడానికి కాస్త పక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడా భర్త తన భార్యను. తెర తొలగి శ్రీవారి దర్శనం మొదలయ్యాక, ఆయమ్మ పరిస్థితి ఏమైందో ఆ వెంకన్నకే ఎరుక. ఏడుకొండల పైన శ్రీవారి ఆలయంలో మహాద్వారానికి ముందున్న మంటపంలో నా కట్టెదుట దృశ్యమానమైన సంఘటన ఇది.
మా ఆవిడ ఎప్పటినుంచో పోరుతుంటే- ఆవిడను, పిల్లలిద్దరినీ, అమ్మను వెంట తీసుకుని వెళ్ళాను తిరుమల. తెలిసిన ఒక మిత్రుని సాయంతో ఫిబ్రవరి 2, 2026 న దర్శనం ఏర్పాట్లు ముందే చేసుకున్నాను. మా జంటకు సుప్రభాత సేవ, తర్వాత మా ఆవిడతోపాటు, పిల్లలకు, అమ్మకు కలిపి నలుగురికీ వీఐపీ బ్రేక్ దర్శనం. అంటే మా ఆవిడకు డబుల్ ధమాకా అన్నమాట. సుప్రభాతం సమయం ఫిబ్రవరి తెల్లారు ఝాము 2 గంటలు. వీఐపీ బ్రేక్ దర్శనం అదే రోజు ఉదయం 7 గంటలకు.
ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం తిరుమల వెళ్ళి గెస్ట్ హౌస్ లో గది తీసుకున్నాము. ఆ రాత్రి ఒక రెండు గంటలు నిద్ర పోయి వుంటామేమో… అంతే. అలారం పెట్టుకుని, సోమవారం తెల్లవారుఝామున 12.45 గంటలకే ఆవిడ, నేను లేచిపోయాము, స్నానాదికాలు కానించి, రోడ్డుమీద పడి, అక్కడక్కడా కాటేజీల మధ్య ఎదురుపడే మెట్లు ఎక్కీదిగీ తెల్లవారు ఝామున 1.45 గంటలకు సుపథం క్యూ కాంప్లెక్స్ ఎదుటకు చేరుకుని రిపోర్ట్ చేశాము.
పావుగంట తర్వాత రెండు గంటలకు క్యూ కదిలింది. తెల్లవారుజాము 2 గంటలకు మొదలైన క్యూ ప్రస్థానం, అలా సాగి,సాగి 2.50 గంటలకు ఆలయం వెలుపల మహాద్వారం సప్త ద్వారాలలో మొదటిదైన మహాద్వారం ఎదుట ఉన్న మంటపంలో ఆగింది. క్యూలో “గోవింద”లు తక్కువే కానీ, ఇక్కడకు చేరేసరికి ఎక్కువయ్యాయి భక్తుల గొంతులు. ఇంకా ద్వారానికి ఉన్న తెర తొలగలేదు.

పది నిముషాలు వేచాక, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్పీకర్ నుంచి శ్రావ్యంగా మొదలైంది. ఆ సుస్వర ఝరి 3 గంటల 19 నిముషాల 42 సెకన్ల దాకా సాగి ఆగింది. అదిగదిగో అప్పుడు జరిగింది నేను మొదట్లో మనవి చేసుకున్న సంఘటన. ఈ ప్రహసనం ముగిసేలోగానే, గిర్… ర్… ర్… మన్న శబ్దంతోపాటు ఒక్కసారిగా గోవిందలు ఆ వైకుంఠ సప్తద్వారాల ముందున్న ఆలయ ప్రహరణం దాటి మిన్నంటాయి. ఉలిక్కిపడి చూద్దునుగదా… ఘంటారావంతో తెర తొలగింది. అంతలోనే మూతపడి, మళ్లీ రెండు నిముషాలకల్లా ఓ వారకు తెర జారింది. సప్తద్వారాలలోకి జనప్రవాహం వెల్లువైంది.
తిరుమల శ్రీవారి గర్భాలయం- దీనినే ఆనంద నిలయం అంటారు- చేరుకోవాలంటే సప్త ద్వారాలు దాటాల్సి ఉంటుంది. అందులో మొదటిది మహాద్వారం (పడి కావలి). ఇది ఆలయానికి వెలుపల వుండే మొదటి ద్వారం. దీనినే సింహద్వారం అంటారు. ఈ ద్వారం పైనే పెద్ద రాజగోపురం ఉంటుంది. రెండవది వెండి వాకిలి (నడిమి పడి కావలి). సంపంగి ప్రదక్షిణం దాటిన తర్వాత వచ్చే రెండో ద్వారం ఇది. ఈ ద్వారం వెండితో ధవళవర్ణ మయమై కనిపిస్తుంది. మూడవది బంగారు వాకిలి. గర్భాలయానికి నేరుగా, ఎదురుగా ఉండే అత్యంత ప్రధాన ద్వారం. ఈ ద్వారానికి ఇరువైపులా శ్రీవారి కాపాలాదారులైన జయ విజయుల విగ్రహాలు ఉంటాయి. తలుపులపై స్వామివారి దశవాతార చిత్రాలు బంగారుపూతతో మెరుస్తుంటాయి. నాల్గవది స్నపన మండప ద్వారం. అయిదవది రాములవారి మేడ ద్వారం. ఆరవది శయన మండప ద్వారం. ఏడవది, చిట్టచివరిది అయిన కులశేఖర పడి ద్వారం శ్రీవారి గర్భాలయానికి వున్న ఆఖరి గడప. దీని తర్వాత స్వామివారే కొలువై దర్శనమిస్తారు.
అయితే ఈ ద్వారాలు, వాటి ఆధ్యాత్మిక అందాలు, వెండి బంగారు పూతల గురించి చెప్పుకోవడం, వినడమే కానీ, ప్రత్యక్ష్యంగా వాటిని దాటి వెళ్తున్నా అనుభవానికి రాలేదు. కాదు కాదు, రానివ్వలేదు భక్తజన ఆత్రం… ఆలయ సిబ్బంది హడావుడి తత్వం.
ఒకరు చంటి పిల్లను భుజాల మీదికి ఎత్తుకుంటాడు. వేరొకరు మునికాళ్ళపై నిక్కి నిలబడతాడు. ఒకరి తల ఇటువైపు వాలితే, వేరొకరి తల అటువైపు వంగుతుంది. ఇంకొకరు రెండు మోచేతులూ అడ్డంగా రెండువైపులకూ చాపి, అరచేతులు జోడించి పైకి లేపుతాడు.
భార్య అస్వస్థతను పట్టించుకోని భక్తి ఒకరిది. పక్కనున్న వాళ్ళ భక్తిని ఖాతరు చేయని ముక్తి వేరొకరిది. మోచతులతో ఇవతలివారిని పొడిచి హింసించి మరీ తానొక్కరే దర్శన భాగ్యం దక్కించుకోవాలన్న దుగ్ధ ఇంకొరిది.
సప్తద్వారాలు దాటుతున్నప్పుడు భక్తులకు ఎంత ఆత్రమో… ఇక్కడినుంచే తమ స్వామిని చూడాలని. ఒకరి తలపై నుంచి ఒకరు నిక్కి చూస్తూ… ఒకరి భుజాలను ఒకరు నెట్టుకుంటూ…!
ఇంకొద్ది క్షణాల్లో మనమూ ఆ ముందు వరుసకు వెళ్లి, ఆయన ఎదుట నిలుచుంటాము కదా… ఇంతలోనే ఈ జనానికి ఎందుకీ తహతహ అనిపించింది.
హఠాత్తుగా కిందికి దిగి పల్లంగా మారిన పాదాల కింది నడక దారిని కాస్త పడకుండా చూసుకుని, అందరూ సర్వమంగళ విగ్రహంగా వేనోళ్ళ స్తుతించే ఏడుకొండల వాసుని నేనూ కాసేపు దర్శిద్దామని తలెత్తేలోగానే…
హరిహరీ…
ఇంకెక్కడి విగ్రహం… ఇంకెక్కడి దర్శనం…!
మా దేహాలు మా ప్రమేయం లేకుండానే, సప్తద్వారాలు కాదు, పొడవాటి క్యూలైన్ కూడా దాటి ఈవలకు వచ్చి పడిపోయాయి. కాదు కాదు… శ్రీవారి సేవకులనేవారు ఈడ్చి, నెట్టి, గుంజి ఆపని చేసిపడేశారు, ఇంకొన్ని భక్త దేహాల భుజాలు పట్టి కనిపించారు.
సప్తద్వారాల కీవల, తలనీలాలు నీకర్పించిన భక్త గుండుల మీదినుంచి దూరంగా… గర్భాలయంలోని మసక వెలుగులో ఆ పద్మావతీపతి ఏం కనిపించాడో… అదే మాకు దక్కిన దర్శనం. సమయం అప్పటికి తెల్లవారుజాము 3.50 గంటలు.
కళ్ళుమూసి తెరిచేలోగా కాదు- ఆల్చిప్పల్లా ఇంతలేసిగా తెరచిపెట్టుకున్న కన్నులకే దిక్కులేదు. దివ్యమంగళ విగ్రహుడని లోకం కొనియాడే ఏడుకొండల వాడిని ఒక్క క్షణంసేపైనా తృప్తిదీరా చూసి “ఎలా ఉన్నారని” పలకరించే భాగ్యం దక్కలేదు.
నేనే కాదు… పక్కవారిని నెట్టి, హింసించి, బాధపెట్టి అయినా సరే వెంకన్నను చూడాలని ఆత్రపడిన తోటి భక్తజనానిదీ ఇదే దుస్థితి.
“సుప్రభాత సేవకు”లకే పరిస్థితి ఇదైతే… మరి రూ.300 ప్రత్యేక దర్శనం, ధర్మ దర్శనం భక్తుల మాటేమిటి? వందల వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి, గంటల తరబడి… ఒక్కోసారి రోజులతరబడి క్యూలైన్లలో ఓపికగా నిరీక్షించే అపర భక్తకోటి గతియేమిటి?
అయినా స్వామీ, నాకొకటి తెలియక అడుగుతాను.
భక్తజనం ఇన్ని వ్యయప్రయాసలకోర్చి నీ సన్నిధికి చేరేది నిన్ను చూసి తరించడానికి కానీ, నీ భృత్యుల భుజం లాగుళ్లు… వీపు నెట్టుళ్లకు కాదుకదా. ముటటలాడే వారి ముఖారవిందాల దర్శనాలకు అంతకంటే కానేరదు కదా!
కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో!
క్షమించండి స్వామీ… ఈ సందేహం నాది కాదు.
భక్త పోతన్నది.
*








Add comment