కథాసంగమం, కదనరంగం కరాచీ నగరం

1980లో మొదటిసారి కరాచీ వెళ్లినప్పుడు, అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల మూలంగా ఊళ్లోకి వెళ్లడం సాధ్యపడలేదు. ఆ సంగతుల్ని గతంలో వివరించాను. మరో నాలుగేళ్లకు, అంటే 1984లో కరాచీ సమీపంలోని పోర్ట్ కాసిమ్ వెళ్లినప్పుడు తప్పిపోయిన అవకాశం చేతికి చిక్కింది. మొదట పోర్ట్ కాసిమ్ గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి.  క్రీ.శ.712లో సింధ్ ప్రాంతాన్ని లోబరచుకున్న అరబ్ సేనాధిపతి మొహమ్మద్-బిన్-కాసిమ్ పేరిట ఉన్న ఈ ఆధునిక రేవుని సింధూనది అరేబియా సముద్రంలో కలిసేచోట, డెల్టా ప్రాంతంలో నిర్మించారు. 1980 పనిచేయడం మొదలుపెట్టిన పోర్ట్ కాసిమ్, కరాచీకి సుమారు 30 కి.మీ.ల దూరంలో ఉన్నది.

కరాచీరేవుపై ఒత్తిడిని తగ్గించడానికి, జనావాసాలకు దూరంగా కాలుష్యకారకాలైన ముడిపదార్థాల నిల్వ-రవాణాలకు, ప్రమాదకరమైన ఇంధనాలను, రసాయనాలను సంబాళించడానికి, పారిశ్రామిక కేంద్రాలను సమాంతరంగా అభివృద్ధి చేయడానికి, పెద్ద ఆధునిక ఓడలను రప్పించడానికి, పోర్ట్ కాసిమ్‌ని నిర్మించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూన్న పరిణామం. ఉదాహరణకి మనదేశంలో బోంబే పోర్టుకి జోడింపుగా జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు, కలకత్తాకి హాల్దియా, మద్రాసుకి ఎన్నూరు, విశాఖపట్నానికి గంగవరం – ఈ క్రమంలోనే అవతరించాయి.

అన్ని ఆధునిక రేవుల మాదిరిగానే, పోర్టు కాసిమ్‌లోనూ కార్మికులు తక్కువ సంఖ్యలోనే ఉంటారు; లోడింగ్, అన్‌లోడింగ్ పనులు చాలా వరకూ భారీ యంత్రాల సహాయంతో నడిచిపోతూ ఉంటాయి. పోర్ట్ కాసిమ్‌లో కూడా ఇదే తంతు. అయితే శ్రామికుల కేంటీన్ మా ఓడను నిలిపిన జెట్టీకి దగ్గరలోనే ఉంది. నలుగురు స్నేహితులం మర్నాడు కరాచీ వెళ్లేందుకు టాక్సీ మాట్లాడుకున్నాం. ముందురోజు సాయంత్రం జెట్టీమీద అటూ ఇటూ పచార్లు చేశాం. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఓ వారం రోజులపాటు ఓడమీద ఊగిసలాడుతూ ప్రయాణించాక, భూమి మనల్ని ఆహ్వానిస్తుంది. నేల అందజేసే నిశ్చల దృఢత్వం మనకు భద్రతను, భరోసాను కలిగిస్తుంది. నావికులకే ఈ సంగతి తెలుస్తుంది.

అది వేసవికాలం. సాయంత్రం కాస్త చల్లబడినప్పటికీ చెమటలు కక్కుతున్నాం. మా నడక పూర్తయ్యాక కేంటీన్‌లో దూరాం. కేంటీన్ స్టాఫ్‌తో సహా, అక్కడ ఉన్న శ్రామికులు చిరునవ్వులతో మమ్మల్ని పలకరిచారు. ‘ఆయియే, బైఠియే,’ అన్నారు. మా ఓడలోంచి బయటకు రావడం వాళ్లు గమనించారట. అందులో ఉన్నవారంతా భారతీయులే అని ముందే తెలుసట. ఒకరిద్దరు లస్సీ తాగుతూండడం గమనించి, మేమూ అదే ఆర్డరు చేశాం. చాలా బాగుందనిపించింది. డబ్బులు చెల్లించబోతే, కాష్ కౌంటరు వద్ద కూర్చున్న నెరిసిన గెడ్డం పెద్దమనిషి తీసుకోలేదు. కొంతమంది వర్కర్లు లేచి వచ్చి, మాతో వాదన పెట్టుకున్నారు.

“ఆప్ హమారే మెహమాన్ హై, ఆప్‌సే పైసా కైసే లేంగే?” అన్నారు.

వాళ్ల మర్యాద, సంస్కారం మమ్మల్ని ఆశ్చర్యపరచాయి. వాళ్లెవ్వరూ పెద్ద చదువుకున్నవాళ్లు కాదు. కష్టించి పనిచేసి, పొట్టనింపుకొనే వాళ్లు. డబ్బు తీసుకోవల్సిందే అని నేను, మరో మిత్రుడు పట్టుబట్టాం. మా రేడియో ఆఫీసరు, చెల్లింపు విషయమై పట్టుబడితే వాళ్లు నొచ్చుకుంటారని నా చెవిలో చెప్పాడు.

ఆనాటినుంచీ, సాయంత్రం పూట మా ఓడనుండి ఎవరు వెళ్లినా ఉచితంగా లస్సీ లభించేది. వాళ్లల్లో కొంతమందితో మా వాళ్లకు మాటలు కలిశాయి. హిందీ సినీమాలు సినీ తారలు, క్రికెట్ ఆటగాళ్లు – వీటిపై చర్చలు జరిగాయి. పోర్టు వదిలిపెట్టేటప్పుడు మావద్ద ఉన్న హిందీ సినీమాల వీడియో క్యాసెట్లను బహూకరించాం. అయితే వాళ్లెవ్వరి వద్దా వీడియో ప్లేయర్ లేదు. ఆఫీసర్ల క్లబ్బులో ఉందట. బయట ఎక్కడో చూస్తాం అన్నారు.

మర్నాడు మేము టాక్సీ మాట్లాడుకొని కరాచీ ప్రయాణం కట్టాం. రోడ్లు బాగున్నాయి. వెళ్తూంటే – ‘కోరంగి’ అని ఒక ప్రదేశాన్ని సూచించే బోర్డు కనిపించింది. కాకినాడకు దగ్గరలో కోరంగి ఉందని తెలుసు. అక్కడ వచ్చిన తుఫానుల గురించి కూడా చదివాను. భారతీయ శ్రామికులను – ముఖ్యంగా తెలుగు వాళ్లని – బర్మాలో కోరంగీలు అంటారని తెలుసు. కానీ, కరాచీ శివార్లలో ఈ కోరంగి ఏమిటి? ఈ ప్రదేశానికి ఆ పేరు ఎక్కడినుంచి వచ్చింది? రెండింటికీ ఏదైనా సంబంధం ఉందా? ఇంత వరకూ నాకు సరైన జవాబు దొరకలేదు.

ఒక గంటలోపే కరాచీ చేరుకున్నాం. టాక్సీని విడిచిపెట్టి, సిటీ బస్సుల్లో తిరిగాం. అక్కడ మాకు ఎదురైన మొదటి అసాధారణ అనుభవం ఏమిటంటే, బస్సు కండక్టర్లతో సహా ఏ ఒక్కరూ మమ్మల్ని విదేశీయులని అనుకోలేదు. భాష (హిందుస్తానీ), రూపు రేఖలూ అన్నీ ఒకటే మరి. జిన్నా సమాధి భవనాన్ని పైనుంచి చూశాం. లోపలికి వెళ్లాలనిపించలేదు. దేశవిభజనకు ప్రధాన కారకుడైన జిన్నాపై మాకెవరికీ సదభిప్రాయం లేదు. అతగాడే పాకిస్తానీయుల జాతిపిత (‘కైద్-ఎ-ఆజం,’ ‘బాబా-ఎ-క్వామ్’) మరి.

ఎవరైనా మరీ శుద్ధ ఉర్దూ మాట్లాడితే ఇబ్బంది కలిగేదేమోగానీ, అంతా మాకు అర్థం అయేటట్లుగానే సంభాషించారు. సద్దర్ (బజారు) వెళ్లి చూడమని ఎవరో సూచించారు. కరాచీ వీధులు బోంబేలో ముస్లింలు ప్రధానంగా ఉండే మొహమ్మద్ ఆలీ రోడ్‌ని తలపించాయి. అయితే అంతటా పఠాన్ సూట్లు వేసుకున్న మొగవాళ్లే తప్ప మహిళలు (బురఖాల్లోనైనా) కనిపించ లేదు.

అప్పటికి మధ్యహ్నం అయిపోయి అందరికీ ఆకలి వేసింది. ‘బోంబే స్వీట్స్‘ దుకాణం మా కంట పడింది; సమోసాలూ, గులాబ్‌జామ్‌లూ, చనా బటూరా నోరూరించాయి. అయితే మేమొక పొరబాటు చేశాం. అవి ‘రోజా’ (ఉపవాసాల మాసం) దినాలు అని పూర్తిగా మర్చిపోయాం. తినే పదార్థాలు కొనుక్కోవచ్చుగానీ బాహాటంగా తినకూడదని ఒక పెద్దమనిషి హెచ్చరించాడు. దాంతో మాకు ఆకళ్లు ఎక్కువైపోయాయి. మేము ఇండియన్స్ అనీ, మాలో ఏ ఒక్కరూ కూడా ముస్లిం కాదనీ విన్నవించుకున్నాం. ‘అయితే మీ హోటల్ రూముకి పోయి తినండి,’ అన్నాడు. మేము రూమంటూ బుక్ చేసుకుంటే కదా? ఆకలితో బుర్రలు పనిచెయ్యడం మానేశాయి. ఒక ప్రొఫెసర్‌లా కనిపించిన పెద్దమనిషికి మా గోడు చెప్పుకున్నాం. అతడు స్వచ్ఛమైన ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషులో,

“వై.ఎం.సీ.ఏ.కి వెళ్లండి. అక్కడ ముస్లిమేతరులకు లంచ్ సెర్వ్ చేస్తారు,” అన్నాడు.

‘హమ్మయ్య’ అనుకొని, వాళ్లనీ వీళ్లనీ అడుగుతూ ఆ దిశగా నడిచాం. చాలా దూరం అని అర్థం అయింది. ఆ రోజుల్లో గూగుల్ మ్యాపులు లేవు కదా? ఎండ మండిపోతున్నది; ఖాళీగా ఉన్న టాక్సీలేవీ మాకు ఎదురు పడలేదు. దుకాణాలన్నీ తెరిచే ఉన్నాయి. తినుబండారాలను కొనుక్కుంటున్నవాళ్లే తప్ప, తింటున్న వాళ్లెవరూ కనిపించలేదు.

“ఏవైనా కొనుక్కొని ఏ పార్కులోనో చెట్ల చాటున తినేద్దాం; ఎవరైనా అడిగితే మేము ఇండియన్స్ అని చెప్పేద్దాం, భయం దేనికి?” అన్నాడు, మా ఎలెక్ట్రికల్ ఆఫీసరు, (మేం ఎస్.పీ. అని పిలుచుకొనే) సురిందర్ పాల్ సింగ్ చౌహాన్. దీనిమీద కాసేపు చర్చ నడిచింది. అందరికీ తిండి ధ్యాస తప్ప మరో ఆలోచన లేదు. ‘సరే, అలాగే చేద్దాం,’ అని నిర్ణయించుకున్నాం.

ఇంతలో ఒక మర్చిపోలేని దృశ్యం మా కంటబడింది. 15-16 ఏళ్ల వయసులో ఉన్న బక్క పలుచని కుర్రవాడు, తోపుడు బండిమీద ఉన్న బన్నుని చేజిక్కించుకొని, తింటూనే, పరుగుతీసాడు. కొందరు అతని వెంటపడి పట్టుకొని లాక్కొచ్చారు. జనం పోగై, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ‘పాపం, చిన్న పిల్లాడు, వొదిలెయ్యండి,’ అని కొందరంటే, ‘ఆ, మరీ అంత చిన్నపిల్లడేం కాదు, పైగా దొంగ కూడాను. నాలుగు తగల్నిస్తే మరెప్పుడూ ఇలాంటి పని చెయ్యడు,’ అని మరికొందరూ వాదించుకున్నారు. ఇంతలో ఆ పిల్లవాడి బంధువులెవరో వచ్చి, అతడికి మతిస్థిమితంలేదని చెప్పి, విడిపించుకొని, వెంట తీసుకుపోయారు.

మా ‘ఆపరేషన్ హైడ్ పార్క్’ ఊసెత్తకుండా, వై.ఎం.సీ.ఏ. కోసం సీరియస్‌గా వెతకడం మొదలుపెట్టాం. ఎట్టకేలకు క్రిక్కిరిసి ఉన్న ఆ కేంటీన్‌లో దూరాం. గెడ్డాలూ, టోపీలూ ఆధారంగా సగానికి పైగా స్థానికులే అని గమనించి విస్తుపోయాం. మటన్ బిరియానీ కూపన్లు కొని, కళ్లు కాయలుకాసేలా ఎదురుచూశాం.

“మనం కరాచీ వచ్చింది ఈ కేంటీన్ చూడ్డానికా?” అని ఎస్.పీ. వ్యాఖ్యానించాడుగానీ, ఎవరం పట్టించుకోలేదు.

“బీరు దొరుకుతుందేమో ప్రయత్నిద్దాం,” అన్నాడు మరో ఆయన. అంతా గుడ్లురిమి చూసి, అతని నోరు మూయించారు.

అంత రుచికరమైన బిరియానీ జన్మలో తినలేదని ఢంకా బజాయించి చెప్పగలను.

ఆకలి బాధనుండి విముక్తులం అయ్యాక, వై.ఎం.సీ.ఏ.లో కొందరి సూచన మేరకు క్లిఫ్‌టన్‌కి టాక్సీలో ప్రయాణం కట్టాము. అది అత్యంత ధనికవర్గం నివసించే ప్రాంతం. అక్కడ మాత్రమే కార్లు నడుపుతూన్న మహిళలు కనిపించారు. (దావూద్ ఇబ్రహీం క్లిఫ్‌టన్లోనే ఉంటాడని అంటారు).

మా టాక్సీ డ్రైవరు మాటకారి. తిరిగి పోర్ట్ కాసిమ్‌కి తనే తీసుకెళతానని మాతోనే ఉన్నాడు.

“మీరు హిందువులు కదా? ఇక్కడే ఒక గుడి ఉంది, శివ్‌జీకా మందిర్! తీసుకెళ్తాను, పదండి,” అన్నాడు.

కరాచీలో గుడి! కుతూహలం కొద్దీ, “సరే, పద,” అన్నాను. దైవభక్తుడైన ఎస్.పీ. నన్ను సమర్థించాడు.

సముద్రతీరానికి దగ్గరగా గుట్టల వద్ద డ్రైవరు కారుని నిలుపుచేశాడు. “ఇక్కడనుంచి ఇసుకలో నడవాలి,” అన్నాడు.

“వీడి వ్యవహారం ఏదో తేడాగా ఉంది,” అని హెచ్చరించాడు, మా రేడియో ఆఫీసర్.

“నలుగురం ఉన్నాం; ఏం చేస్తాడు? మరేం ఫరవాలేదు,” అన్నాను కానీ, లోలోపల అనుమానంగానే ఉంది.

ఒక చీకటి గుహలోకి నడిపించాడు.  లోపల నూనె దీపం వెలుగులో ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ప్రక్కనే శివలింగం! కాస్త దూరంగానే మా జోళ్లు విప్పుకున్నాం.

సాధువు మమ్మల్ని చూస్తూనే లేచి, ఆప్యాయంగా ఆహ్వానించాడు. ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. భోజనం చేసి, గంటలో వస్తానని టాక్సీ డ్రైవరు వెళ్లిపోయాడు.

“శివలింగానికి దండం పెట్టుకోండి,” అన్నాడు, సాధువు. అతడు చెప్పినట్లే చేశాం. “శివరాత్రి నాడు బాగా జనం వస్తారు,” అన్నాడు. చాలా రోజులుగా ఒంటరిగా ఉన్నాడట. అప్పుడప్పుడూ సాధువులు వస్తారటగానీ, మామూలు రోజుల్లో భక్తులు పెద్దగా రారని చెప్పాడు. అతడు చక్కని ఇంగ్లీషు మాట్లాడుతూ మమ్మల్ని విస్మయపరచాడు.

“మీదేవూరు?” అని ఒక్కొక్కర్నీ అడిగాడు.

నేను ‘విశాఖపట్నం,’ అన్నప్పుడు, “ఓ! అక్కడ పెద్ద షిప్‌యార్డ్ ఉంది. నేవల్ బేస్ కూడా. అక్కడే 1971లో పాకిస్తానీ సబ్‌మెరీన్ ‘ఘాజీ’ ములిగిపోయింది,” అని, అందరికీ ఆశ్చర్యం కలిగించాడు.

“మీకెలా తెలుసు?” అని అడిగితే, “ఏముంది? పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటాను. నా శిష్యులు ఒకరిద్దరికి క్లిఫ్‌టన్లో బ్రహ్మాండమైన లైబ్రెరీలు ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడికి వచ్చే సాధువులు, భక్తులు బోల్డన్ని కబుర్లు మోసుకొస్తూంటారు.”

చాలా సేపే మాట్లాడుకున్నాం.

మధ్యమధ్యలో మా వాళ్లిద్దరు సిగరెట్లు కాల్చుకోవడానికి బయటకి పోయి వస్తున్నారు.

“వాళ్లిద్దరూ మాటిమాటికీ ఎక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాడు, సాధు మహరాజ్.

నిజం చెప్పాను.

“ఆ మాత్రం దానికి బయటకి పోవడం దేనికి? నాకో సిగరెట్టివ్వమను, నేనూ కాలుస్తాను.”

ఇంతలో వాళ్లిద్దరూ తిరిగి వచ్చారు. సాధువు నిజంగానే వాళ్ల వద్ద సిగరెట్టు తీసుకొని వెలిగించాడు!

చిద్విలాసంగా పొగ వదులుతూ, “దీన్ని శివ్‌జీ కా మందిర్ అంటారుగానీ, ఇదసలు గుడికాదు, మఠం! ఇక్కడ సాధువులందరం కూర్చొని గంజాయి పీలుస్తాం! సిగరెట్టు ఏ మూల?” అని ప్రకటించాడు.

అతడు గ్రాడ్యుయేషన్ చేశాడట. సంసారం అంటే విరక్తి కలిగి సన్యసించాడట. ఎంతకాలమైనా ఒంటరిగా ఉండగలడట. భక్తులు తినడానికి ఏవో తెచ్చిపెడుతూంటారన్నాడు. అతనికే కోరికాలేదటగానీ, హిమాలయాలలో పర్యటించి గొప్ప ఙ్ఞానులైన సాధువులనూ, ఋషులనూ కలుసుకోవాలనీ, వాళ్ల ఆశీర్వాదాలను పొందాలనీ, అలాగే మానస సరోవరం చూడాలనీ అనిపిస్తూ ఉంటుందట.  మేము అతనికి నమస్కరించి, సెలవు తీసుకున్నాం. వొట్టి చేతులతో వెళ్లినందుకు చింతిస్తూ వెనుతిరిగాం.

తిరుగు ప్రయాణంలో మళ్లీ కోరంగి శివార్లను దాటాం. ఆ మిస్టరీ అలానే ఉండిపోయింది – అప్పటికీ, ఇప్పటికీ. సాధువు మాటలు మమ్మల్ని లోతుగా తాకాయి. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. టాక్సీ డ్రైవరు ఏదో చెప్పుకుపోతున్నాడు.

షిప్పులోకి వెళ్లాక, ఆ మర్నాడు ఎస్.పీ. తన 1971నాటి అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. కరాచీ హార్బరుపై ఇండీయన్ నేవీ చేసిన చారిత్రాత్మక దాడిలో అతడూ పాల్గొన్నాడనికి మాకు తెలుసుగానీ, వివరాలు ఎన్నడూ చెప్పలేదు. ఆనాటి కరాచీ సందర్శనం, ఎస్.పీ. లోలోపలి ఙ్ఞాపకాల తుట్టను కదిలించింది.

“టాక్సీ డ్రైవరు ఉన్నాడని నిన్న చెప్పలేదుకానీ మొదటిసారి కరాచీ వెళ్లిన అనుభవమే గుర్తుకొచ్చింది. అప్పుడు మేం వెళ్లింది పోర్టుని ధ్వంసం చెయ్యడానికి. విజయవంతం అయ్యాం కూడా. ఈ సారి అందుకు భిన్నమైన అనుభవం. జీవితం ఎన్ని విచిత్రాలను మోసుకొస్తుందో కదా?” అన్నాడు.

చాలామంది ఎలెక్ట్రికల్ ఆఫీసర్లలాగే ఎస్.పీ. సింగ్ కూడా మొదట ఇండియన్ నేవీలో పనిచేసి, మర్చంట్ నేవీలోకి వచ్చాడు. మంచి పనిమంతుడు, స్నేహశీలి, పైగా సహజ కథకుడు కావడం మూలాన అందరికీ ఆప్తుడే. 1971నాటి అతని అనుభవాన్ని ఇక్కడ క్లుప్తంగా చెబుతాను.

1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతూన్నప్పుడు, డిశెంబరు నాలుగవ తేదీన నిర్వహించిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’లో ఎస్.పీ. పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ఇండియన్ నేవీ చూపిన చొరవ, యుక్తి, పన్నిన పథకం – ఆనాటి సోవియట్ నేవల్ అధికారులను కూడా ఆశ్చర్య చకితులను చేసింది. తక్కువ పరిధిలోనే సంచరిస్తూ, తీర ప్రాంతాలలో గస్తీని నిర్వహించే మూడు చిన్న మిసైల్ బోట్లను ఈ దాడికి వినియోగించారు. అయితే అవి అంత దూరం ప్రయాణించలేవు. అందుకని పెద్ద యుద్ధ నౌకలతో వాటిని కరాచీ దరిదాపులకు లాక్కెళ్లి విడిచిపెట్టారు. అవి రాత్రిపూట, శత్రువు కళ్లుకప్పి, ఊహించని విధంగా హార్బరు లోపలికి చొచ్చుకుపోయి, పెద్ద విధ్వంసాన్ని సృష్టించి, తిరిగి పెద్ద ఓడలను చేరుకున్నాయి.  మిసైల్  బోట్లను తిరిగి సురక్షితంగా లాక్కొచ్చే పని పెద్ద నౌకలది. అయితే ఇదంతా శత్రువు అప్రమత్తం అయ్యేలోగా, అతి తక్కువ సమయంలో జరిగిపోవాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

ఎస్.పీ. అలా కరాచీ హార్బరులోకి చొచ్చుకుపోయిన ఒక బోట్‌లో ఉన్నాడు. దాడిని పూర్తిచేసి తిరిగి వచ్చేందుకు పూనుకొనేసరికి వాళ్ల ఇంజిను చెడిపోయి, బోటు శత్రువు హార్బరులో నిలిచిపోయింది! మిగతా బోట్లన్నీ తిరుగు ప్రయాణం కట్టాయి. మా మిత్రుడు ఉన్న బోటు మాత్రం కదల్లేకపోయింది. సమయం మించిపోతే, బోట్లను లాక్కుపోయే పెద్ద నౌకలు ఆగకుండా బయలుదేరిపోతాయి. లేకుంటే వాటికీ ముప్పు తప్పదు.

విపరీతమైన ఒత్తిడి మధ్య, చెమటలు కక్కుతూ, ఇంజిన్‌రూములో నానాపాట్లూ పడి, ఏదో ఒకలా ఇంజిన్ స్టార్ట్ చేశారు! శత్రు ఫిరంగులన్నీ వీళ్ల బోటునే లక్ష్యంగా చేసుకొని కాల్పులు చేస్తున్నాయి. మిగతా బోట్లన్నీ వెళ్లిపోయాయి. వీళ్లు కుంటుతూ కుంటుతూ హార్బరు బయటకి వచ్చేసరికి తెల్లవారిపోయింది. వైమానికదాడి జరిగే ప్రమాదం మరింత ఎక్కువైంది. అనుకున్న సమయానికి, వీళ్లకు నిర్దేశించిన పెద్ద నౌకను చేరుకోగలుగుతారా? అందరికీ విపరీతమైన టెన్షన్! తీరా ‘రాంగ్‌డెవూ పాయింట్’ చేరుకొనేసరికి అన్ని నౌకలూ వెళ్లిపోయాయి. వీళ్లకోసం ఎదురుచూస్తున్న నౌక కూడా లంగరు ఎత్తేసింది. రేడియో వాడేందుకు అనుమతి లేదు. ఆ పెద్ద నౌక, రిస్కు తీసుకొని మరింత సమీపంగా వచ్చింది. తాడు విసిరి,  బోట్‌ని సంధించారు. అంతా ఊపిరి పీల్చుకుంటూండగా పాక్ గస్తీ విమానాలు కంటబడ్డాయి. లొకేషన్ తెలిసిపోతే బాంబర్లు విరుచుకు పడతాయి. ఏమైతేనేం, ఎట్టకేలకు స్వంత బేస్‌ని చేరుకున్నారు!

‘ఆపరేషన్ ట్రైడెంట్’ ఘనవిజయం సాధించింది. రెండు పాక్ యుద్ధ నౌకలు ధ్వంసం అయ్యాయి. ఇంధనం నిల్వచేసిన టాంకులు కాలిపోయాయి. ముఖ్యంగా శత్రువు స్థైర్యం దెబ్బ తిన్నది. అంతే కాదు, మరో నాలుగు రోజుల తరువాతే ఇండియన్ నేవీ, కరాచీపై మరో దాడిని చేబట్టింది (‘ఆపరేషన్ పైథాన్’). రెండు ఆపరేషన్లలోనూ భారతీయ నౌకలకు, నావికులకు ఎటువంటి నష్టమూ వాటిల్లలేదు. పాక్ ఐదు నౌకలను పోగొట్టుకుంది. 300కు పైగా నావికులు మరణించారు. కరాచీ రేవు మూతబడింది. అంతిమంగా పాకిస్తాన్ రెండు ముక్కలైంది.

“అదొక మరపురాని అనుభవం; ఇది మళ్లీ మరో అనుభవం,” అంటూ ముగించాడు, ఎస్.పీ.

‘ఘాజీ’ని ముంచెయ్యడం, సోవియట్ యూనియన్ సహకారంతో అమెరికన్ నేవీకి చెందిన ఏడవ నౌకాదళాన్ని నిలువరించడం, బంగ్లాదేశ్ విముక్తి – వీటన్నిటి వెనుకా ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వ పటిమ, దృఢ సంకల్పం ఉన్నవని ఎస్.పీ. తరచూ అంటూండేవాడు.

డిసెంబరు నాలుగవ తేదీని నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

[గమనిక: ఇంతటితో ఈ శీర్షిక ముగిసిపోయింది]

ఉణుదుర్తి సుధాకర్

7 comments

Leave a Reply to Jayasurya Somanchi ( S.J.Surya ) Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఘాజీని మునక
    రషియా జలాంతర్గాములు
    అమెరికా సెవెంత్ ఫ్లీట్
    మరిచిపోలేని అనుభవాలు!
    వాటికన్నా మిన్న నీ మితృడు
    ఎస్ పీ అనుభవం.
    దాన్నే ఒక సినిమాగా తీయవచ్చు!
    డైరెక్టర్ క్రీష్ వింటున్నారా!
    రానా అలోచించు!

  • కళ్ళకు కట్టినట్టు రాశారు ఎంతో సరళంగా

  • కరాచీ గురించి మంచి వివరాలతో కధ చెప్పినట్లు చాలా బాగా చెప్పారు . సుధాకర్ గారికి కధలు చెప్పడం బగాతెలుసు.

    “అంత రుచికరమైన బిరియానీ జన్మలో తినలేదని ఢంకా బజాయించి చెప్పగలను” బలే జ్గ్నాపకం ఉంది.

  • పాకిస్థాన్ లో ఇన్ని అనుభవాలు ఉండటం మీకే దక్కిందేమో అనిపిస్తుంది, నేను షిప్ లో మెరైన్ ఇంజనీర్ గా పాకిస్థాన్ వెళ్ళడం జరిగింది కానీ, బయటకు అడుగుపెట్టడం జరగలేదు, కానీ షిప్ లోకి వచ్చే ఏజెంట్లు, టెక్నీషియన్స్, షిప్ ఛాందలర్స్, తో బాతాఖానీ అయ్యేది, మన హిందీ సినిమా పాటలు చాలా ప్రేమతో పాడి వినిపించేవారు, ఏది ఏమైనా సుధాకర్ ఉనుదుర్తి గారు ఈ అనుభవాలు తో ఒక మంచి సస్పెన్స్ మూవీ తీయవచ్చు, మీ ఈ అనుభవాలు ముందే తెలిసి ఉంటే, “ఘాజీ ” సినిమా నిర్మాతలు, దర్శకుడు, అంతకంటే మంచి సినిమా తీసే వారంటే అతిశయోక్తి కాదు…

  • సహజంగా మంచి కథకుడైన సుధాకర్ గారి శైలి చక్కగా చదివిస్తుంది..

  • ఇంతకీ ఈ యస్ పి‌ఎవరండీ? ఒకప్పుడు ఒక ఎస్పి అనేతను విరసం లో వుండే వాడు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు