ఓపి నయ్యర్: ప్రతి పాటా ఒక అందమైన స్మృతి

లతామంగేష్కర్ చేత తన కెరీర్ లో ఒక్క పాట కూడా పాడించని ఘనత ఓ.పి.నయ్యర్ దే!

స్వర మాంత్రికుడు ఓపి నయ్యర్ ని హిందీ చిత్రసీమలో” రిథమ్ కింగ్” అని కొంతమందీ, “మెలోడీ కింగ్” అని కొంతమందీ అంటారు. మతి పోగొట్టి మత్తులో ముంచే బాణీలు అలవోకగా చేయడం ఈయన ప్రత్యేకత. అందుకే ఐంద్రజాలికుడు అంటాను నేనాయన్ని. కావాలంటే ఆయన చేసిన పది పాటలు చూడండి మీకే అర్థమవుతుంది.

* దీవాన హువా బాదల్ సావన్ కి ఘటా ఛాయీ–

* తారీఫ్ కరూ క్యా ఉస్ కీ—-

* ఇషారోం ఇషారోం మై దిల్ లేనే వాలీ—

* ఆంఖో హీ ఆఖోం మే ఇషారా హోగయా—

* లేకే  పెహలా పెహలా ప్యార్ —

* యేలో మై హారీ పియా—

* సున్ సున్ జాలిమా—

* హెయ్ దిల్ హై ముష్కిల్ జీనా యహా

* జర హఠకే జర బచ్ కే యెహ్ బొంబై మెరీ జా—

*ఉథర్ తుమ్ హసీహో ఇథర్ దిల్ జలా హై—-

*మాంగ్ కె సాథ్ తుమ్హారా మైనే మాంగ్ లియా సంసార్

*మెరా నామ్ చిన్ చిన్ చూ—-

*దిల్ కీ ఆవాజ్ భీ సున్ మేరే ఫసానే పె నజా—-

*జాయియే ఆప్ కహా జాయేంగే—-

*ఆప్ కే హసీన్ రుహ్ పె ఆజ్ నయా నూర్ హై

*మేరా దిల్ మచల్ గయాతో మేరా క్యా కుసూర్ హై

ఇలాచెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కి అంతుండదు. చూశారుగా యెలాంటి పాటలో తలుచుకుంటేనే మాధురులూరిపోతున్నాయి. ఒక్కోపాటా ఒక్కో స్లోపాయిజన్ మాత్ర ఇంత చక్కటి బాణీలు సృష్టించిన ఓ.పి.నయ్యర్  సంగీతంలో యే విధమైన శిక్షణా తీసుకోలేదంటే ఆశ్చర్యంగా వుంటుంది.అతని కుటుంబంలో కూడా సంగీత వాసనలేమీ లేవు.తండ్రి కెమిస్ట్ గా పనిచేస్తూ వుండేవాడు.లాయర్లూ ,డాక్టర్లూ యెక్కువగా వున్న కుటుంబం.  ఓ.పి. నయ్యర్ పూర్తి పేరు ఓంకార్ ప్రసాద్ నయ్యర్ .

అతను లాహోర్ లో  1926,జనవరి 16వ తేదీన పుట్టాడు. అతని బాల్యమంతా అక్కడే గడిచింది.నేడు అది పాకిస్థాన్ లో వుంది. అతని బాల్యమంతా బాధాకరంగా గడిచింది, మూడుసంవత్సరాలు డీసెంట్రీతో బాధపడ్డాడు, మూడు సార్లు టైఫాయిడ్ బారినపడ్డాడు,ఇవన్నీ చాలనట్టు పిచ్చికుక్క కాటుకు కూడా గురయ్యాడు.అన్నీ తట్టుకుని బతికి బయట పడ్డాడు. తల్లిదండ్రులిద్దరూ చిన్నతప్పుకు కూడా కఠినంగా శిక్షించే వాళ్లు.

ఇవన్నీ అతన్ని ఒక మొండి మనిషిగానూ, ఈగోయిస్ట్ గానూ జీవితంతో రాజీ పడని వ్యక్తిగానూ తయారు చేశాయి.  లాహోర్ లో పెరిగిన వాళ్లందరికీ ఆ ఊరంటే యెనలేని మమకారం వుంటుంది యెందుకనో!

కొంత కాలానికి నయ్యర్ కుటుంబం లాహోర్ నుండీ అమృత్ సర్ కి మకాం మార్చారు,సహజంగానే ఓపి నయ్యర్ కి ఇదేమీ నచ్చలా,అతను లాహోర్ మీద బెంగ పెట్టుకున్నాడు.సంగీతంలో ఫార్మల్ ట్రయినింగ్ లేకపోయినా హార్మోనియమ్ బాగా వాయించేవాడు,మొదటినుండీ అతనికి సంగీతం మీదే దృష్టి.

లాహోర్ రేడియో లో  సింగర్  గానూ ,కంపోజర్ గానూ పనిచేస్తూ వుండేవాడు అదే సమయంలో సంగీతం టీచర్ గా కూడా పని చేశాడు,కానీ ఆ ఉద్యోగం ఆటే కాలం నిలవలేదు,కారణం తాను సంగీతం టీచర్ గా పని చేసే లేడీస్ కాలేజ్  ప్రిన్సిపాల్ తో ప్రణయ కలాపం బట్టబయలవడం. లాహోర్ రేడియోలో సింగర్ గా,కంపోజర్ గా పనిచేసే రోజుల్లోనే ,షంషాద్ బేగం తో పరిచయం  .ఆమె గొంతును అతను చాలా ఇష్ట పడేవాడు. అతను ప్రయివేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ వుండేవాడు.

నయ్యర్ తనకు ఇరవై సంవత్సరాల వయసులో అంటే 1946 లో సి.హెచ్ .ఆత్మా తో పాడించిన “ప్రీతమ్ ఆన్ మిలో” అనే పాట చాలా హిట్ అయింది.ఇది రాసింది నయ్యర్ భార్య సరోజ్ మోహినీ నయ్యర్ .అయితే ఆ ప్రయివేట్ రికార్డ్ మీద నయ్యర్ పేరు లేదు.అదివిన్న డి.యమ్ .పంచోలి యేమైనా సరే ఈ పాట చేసినతనికి  తన సినిమా లో ఛాన్స్ ఇచ్చి మ్యూజిక్ డైరెక్టర్ ని చెయ్యాలి అని వెతుక్కుంటూ బయలు దేరాడు.

(ఆ తర్వాత ఇదే పాట రెండో చరణం మాత్రం తీసుకుని గురుదత్ సినిమా “మిస్టర్ అండ్ మిసెస్ 55″సినిమాలో మళ్లీ గీతాదత్ తో మధురంగా పాడించాడు నయ్యర్ .విరహంతో వేగిపోతున్న మధుబాల మీద చిత్రీకరించారా పాటని.మధుబాల అంటే చాలా ఇష్టం నయ్యర్ కి,అన్నట్టు ఆ పాటలో వచ్చే ప్రీతమ్ అనే  పేరు బాగా నచ్చి ,ఆ సినిమాలో హీరోకి అదే పేరు పెట్టుకున్నాడు గురుదత్ .

“అంగూర్ “అనే సినిమాలో కామెడీ కోసం మరోసారి ఈ పాటను వాడుకున్నారు.)

అలా రేడియోలోనూ,ప్రయివేట్ గానూ పాటలు కంపోజ్ చేస్తున్న నయ్యర్ కి బొంబాయి సినీ పరిశ్రమలో నటుడిగా ప్రయత్నించాలనిపించింది,ఎలాగో స్నేహితుడి సహాయంతో బొంబాయి చేరాడు.  అక్కడ అతన్ని స్క్రీన్ టెస్ట్ చేసిన వాళ్లు నటుడుగా అతనికి భవిష్యత్తు  లేదని తేల్చి చెప్పారు . దానితో అతను మ్యూజిక్ కంపోజింగ్ వేపు దృష్టి పెట్టాడు.

“కనీజ్ “(1949)అనే సినిమాకి నేపథ్య సంగీతం సమకూర్చాడు.ఈలోగా ఇందాక చెప్పుకున్నాం కదా డి.యమ్ పంచోలి ఆయన”ఆస్మాన్ “(1952)అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఇచ్చాడు కానీ ఆ సినిమా ఫ్లాపవడంతో తనకి పేరు రాలేదు. ఆ తర్వాత వచ్చిన “ఛమ్ ఛమా ఛమ్ “గతి కూడా అదే అయ్యింది. అయితే “ఆస్మాన్ ” సినిమా చేసే సమయంలో అందులో పాడిన గీతాదత్ కి ఈయనలో మంచి ప్రతిభ దాగి వుందని అనిపించింది.దానితో ఆమె తన భర్త గురుదత్ కి ఇతన్ని రెకమండ్ చేసింది.

గురుదత్ తమ సినిమా “బాజ్ ” లో ఇతనికి అవకాశం ఇచ్చాడు కానీ అదికూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ,మళ్లీ కథ మొదటికి వచ్చింది.ఒకరోజు బాజ్ చిత్రానికి రావాలిసిన డబ్బుల కోసం గురుదత్ ని కలిస్తే ,తాను ఇప్పుడు డబ్బివ్వలేననీ వరసగా తన మూడు చిత్రాలు “ఆర్ పార్ ,మిస్టర్ అండ్ మిసెస్ 55,సిఐడి” సినిమాలకి సంగీతం సమకూర్చమనీ ,అంతా కలిపి అప్పుడే ఇస్తాననీ అన్నాడు. “ఆర్ పార్ “(1954) అతని జాతకాన్ని మార్చేసింది,యెటువంటి పాటలు చేశాడందులో! “సున్ సున్ సున్ జాలిమా”,”యేలో మై హారీ పియా” “,బాబూజీ ధీరే చల్ నా”ఇలా గీతా,రఫీ ,షంషాద్ బేగం తనూ కలిసి ప్రజలని మెస్మరైజ్ చేశారు.

“సి.ఐ.డి”మిస్టర్ అండ్ మిసెస్ 55″లో పాటలు కూడా సూపర్ హిట్టవ్వడంతో ఓ .పి.నయ్యర్ పేరు చిత్ర ప్రపంచంలో మారు మోగి పోయింది. పంజాబీ భాంగ్రా పధ్ధతికి,స్పానిష్ ట్యూన్స్ ని మిళాయించి ఇతను చేసే సంగీతం విపరీతంగా జనాలని ఆకర్షించ సాగింది.అప్పటికే హిందీ చిత్ర సీమలో లబ్ద ప్రతిష్టులైన నౌషాద్ ,రోషన్,మదన్ మోహన్  ,శంకర్ జైకిషన్ మొదలైన వారిని  తట్టుకుని నిలబడగలిగాడు.ముఖ్యంగా శంకర్ జైకిషన్ ద్వయం తనకి గట్టి పోటీగా తలచే వాడు.

కొంతమంది ఆయన చేసే బాణీలకి చాలావరకూ పీలూ రాగమే ఆధారమని ,ఆయనకి సంగీతం పెద్దగా తెలియదని ఆక్షేపించినప్పటికీ ,అత్యంత మధురమైన ,లయతో కూడిన అతని పాటలని ప్రజలు అమితంగా ఇష్టపడ్డారు .అతనికి హార్మోనియమ్ ,పియానో,తబలా ,డోలక్ వాయించడం వచ్చు.సారంగీతో ,పియానోతో,గిటార్ తో,వయొలిన్ తో మాజిక్కులు చేసేవాడు, ముఖ్యంగా సారంగీని అతను వాడినంత విరివిగా యెవ్వరూ వాడలేదు.అతను గుర్రపు బగ్గీ నడకతో సృష్టించే బాణీలు శ్రోతలను ఉయ్యాలలూగించేవి ,అందుకు మంచి ఉదాహరణ “నయాదౌర్ “లోని “మాంగ్ కె సాథ్ తుమ్హారా “అనే పాట.అలాగే “బహారో ఫిర్ భీ ఆయేగీ” లో “ఆప్ కే హసీన్ రూహ్ పే ఆజ్ నయా నూర్ హై” లో పియానోను అద్భుతంగా వాడాడు.

ఆ రోజుల్లో ఒక సినిమాకు లక్ష రూపాయల అత్యధిక పారితోషికం వసూలు చేసినవాడూ,సినిమా రికార్డులమీదా,పోస్టర్ల మీదా తన బొమ్మ వేసుకున్న ఘనుడూ కూడా ఓ.పి.నయ్యరే.

1957లో నాసిర్ హుస్సేన్ “తుమ్ సా నహి దేఖా” అనే రొమాంటిక్ సినిమా కొత్త వాళ్లయిన షమ్మీకపూర్ ,అమితా లతో తియ్యాలనుకున్నాడు.ఆ సినిమాకు కావలసినట్టుగా మాంఛి రొమాంటిక్ బాణీలను సమకూర్చింది నయ్యరే ,ఆ బాణీలకు తగ్గట్టుగా పాడిన రఫీ,అభినయించిన షమ్మీ ఆ చిత్ర విజయాన్ని పతాక స్థాయికి తీసికెళ్లారు.అప్పటి నుండీ ఓపి నయ్యర్ వెనుదిరిగి చూడలేదు.మళ్లీ ఇదే టీమ్ 1964లో వచ్చిన “ఫిర్ వొహీ దిల్ లాయా హూం” సినిమాకి పనిచేసింది .అందులో పాటలు కూడా హిట్టే.

అయితే  ఒక విచిత్రం ఆలిండియా  రేడియో 1957-1967వరకూ సుమారు ఒక దశాబ్దం పాటు ఓ.పి.నయ్యర్ పాటలు నిషేధించింది “ట్రెండీ” గావున్నాయనే మిషతో,అయినా నయ్యరేమీ పట్టించుకోలేదు. 1958లో “నయాదౌర్ “చిత్రానికి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది.ఆ సినిమాలో “యే దేశ్ హై వీర్ జవానోంకా” అనే పాటకి ఈ అవార్డ్ వచ్చింది,అది రాసింది కూడా ఓ.పి.నయ్యరే !

ఆయన పాటల్లో వుండే విశేషమేమంటే మాధుర్యమూ,లయా పెనవేసుకుని వుంటాయి.పాటకి జవ,జీవాలు అద్దడంలో నయ్యర్ మొనగాడు,అందుకే రొమాంటిక్ గీతాలంటే నయ్యర్ వేపు చూసే వాళ్లందరూ. కొన్ని ప్రత్యేకమైన గొంతులని ఇష్ట పడేవాడు .

ఆడగొంతులలో షంషాద్ బేగం,గీతాదత్ ,ఆశా భోన్సలేలు ఆయన కి ఇష్టమైన వాళ్లయితే,మగ గొంతులలో రఫీ అంటే ప్రాణం .ఆయన చేత హీరోలకీ,కమెడియన్సయిన జానీ వాకర్ మొహమూద్ లకు కూడా పాడించేవాడు. కామెడీ పాటలకు కూడా యుగళగీతాలలాగా మూడునిముషాల సమయం కేటాయించడం నయ్యర్ తోనే మొదలయింది. “జానేకహా మెరా జిగర్ గయాజీ,యె దిల్ హై ముష్కిల్ జీనా యహా”—జానీ వాకర్ మీద చిత్రీకరించినవి యెటువంటి పాటలు నిజంగా!

అయితే మెలోడీ క్వీన్ అని పిలుచుకునే లతామంగేష్కర్ చేత తన కెరీర్ లో ఒక్క పాట కూడా పాడించని ఘనత ఓ.పి.నయ్యర్ దే!

కారణం యేమిటీ? అని యెవరైనా అడిగితే ఆమె గొంతులో ఆధ్యాత్మికత తొంగి చూస్తుందనీ ,తను చేసే సంగీతాని కి  ఆమె గొంతు సూటవ్వదనీ చెప్పేవాడు. బినాకా గీత్ మాలా సమర్పించే అమీన్ సయానీ ఒక ఇంటర్వ్యూ లో లతాకీ మీకూ యేమైనా తగాదా వచ్చిందా? అని అడిగితే అదేమీ లేదనీ ఆమె గొంతు తన పాటలలో వుండే పెప్ కి సరిపోదనీ చెబుతూ “ఆశా భోన్సలే గొప్పగాయని అయితే లతానే నంబర్ వన్ “అని మెచ్చుకున్నాడు.

ఇక్కడ ఓ.పి.నయ్యర్ వ్యక్తిత్వం గురించి రెండు మాటలు. అతను అహంభావి,మొండివాడు, ఒకసారి యేదైనా నిర్ణయం తీసుకున్నాడంటే యెవరొచ్చి చెప్పినా మార్చుకోడు. ఈ గుణాల వలన అతను వ్యక్తిగత జీవితంలోనూ,వృత్తిగత జీవితంలోనూ చాలా మందిని ఇబ్బంది పెట్టాడు,తను పడ్డాడు. తాను అత్యంత అభిమానించే సింగర్సయిన మహ్మద్ రఫీతోనూ ,ఆశాభోన్సలే తోనూ విభేదాలు వచ్చాయి.ఇంట్లో భార్యాబిడ్డలతో కూడా తగాదా పడి చివరిరోజులలో ఇంటి నుండీ బయటకు వచ్చి ,తన అభిమానుల ఇంట పేయింగ్ గెస్ట్ గా వుండాలిసి వచ్చింది.

రఫీతో వివాదం 

మొదటి నుండీ రఫీ కీ,నయ్యర్ కీ మధ్య చక్కని అనుబంధం వుండేది,ఇద్దరి మూలాలూ పంజాబ్ లో వుండటం ఒక కారణం ఆ అనుబంధానికి. నయ్యర్ తన నిర్మాతలకీ ,దర్శకులకీ స్పష్టంగా చెప్పేవాడు తన సినిమాలో పాటలన్నీ రఫీనే పాడతాడని. రఫీ కూడా యెంతోమంది సంగీత దర్శకులను చూశాను గానీ ఓపి నయ్యర్ లాంటి వారిని చూడలేదు అనేవాడు.

అలాంటిది 1960 ప్రాంతాలలో రోజు ఒక పాట రికార్డింగ్ కి రఫీ రావలసిన సమయానికి రాలేక పోయాడు.చాలా ఆలస్యంగా వచ్చిన రఫీ వేరే సంగీతదర్శకుల వద్ద పాట పాడి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యిందనీ అందుకే ఆలస్యమయిందనీ సారీఅనీ చెప్పాడు. అది విన్న ఓపి నయ్యర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు రికార్డింగ్ కాన్సిల్ చేశాడు “ఇకనుండీ నీవు నా పాటలు పాడవలసిన అవసరం లేదు” అని రఫీని పంపేశాడు. రఫీ స్థానంలో మహేంద్ర కపూర్ ,ముఖేష్ ,కిషోర్ కుమార్ లకు అవకాశమిచ్చాడు.కానీ మనసులో దుఃఖంగానే వుండేది.

రఫీ కూడా బాధపడి ఒక పండుగకు పూలూ మిఠాయిలూ పంపాడు నయ్యర్ తీసుకోలేదు, తర్వాత పండక్కి రఫీ స్వయంగా మిఠాయిలు తీసుకుని నయ్యర్ ఇంటి తలుపు తట్టాడు, తలుపు తీసిన నయ్యర్ గట్టిగా కౌగలించుకున్నాడు రఫీని. ఇద్దరి కళ్లల్లోనూ కన్నీళ్లే “తప్పు నాదంటే నాది “అనుకున్నారిద్దరూ.దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇద్దరూ కలిసి పాటలు చేశారు. అప్పుడు పాడిన పాట “దిల్ కీ ఆవాజ్ భి సున్ మేరే ఫసానే పే నజా”–“హమ్ సాయా “సినిమాలోది యెంత అద్భుతంగా వుంటుందో!

ఆశాతో అనుబంధం

నయ్యర్ తన కెరీర్ మొదట్లో షంషాద్ బేగం,గీతాదత్ లతో యెక్కువ పాటలు పాడించే వాడు.గీతా నయ్యర్ దగ్గర మొత్తం 22సినిమాల్లో 65 పాటలు పాడింది.అందులో33 సోలోలు.గీతా  దత్ నయ్యర్  గురించి యేమంటుందంటే “నయ్యర్ ట్యూన్ కట్టేది పదాలకి కాదు ఫీలింగ్స్ కి” ఆశా తో అనుబంధం పెంచుకున్నాక గీతాదత్ కీ,షంషాద్ బేగంకీ పాటలివ్వడం తగ్గించేశాడు నయ్యర్ .ఒక సారి గీతాదత్ ఈ విషయం మీద నయ్యర్ ని నిలదీసి అడిగి తగాదా కూడా పెట్టుకుంది ,తనకు అవకాశాలివ్వడం లేదని.  ఆశాతో నయ్యర్ కి ప్రత్యేక అనుబంధం వుంది.

అతనామెకి యెక్కువ అవకాశాలిచ్చేవాడు.వారిద్దరికీ 1952లో తీసిన సినిమా “ఛమ్ ఛమా ఛమ్ “లో పాడినప్పటి నుండీ పరిచయం .ఆమె కెరీర్ యెదుగుదలకి నయ్యర్ చాలా సహాయ పడ్డాడు ,ఆమెతో చాలా మంచి పాటలు పాడించాడు .అతని దర్శకత్వంలో ఆమె మొత్తం 320పాటలు పాడింది.అయితే 1974 సంవత్సరం లో “ప్రాణ్ జాయ్ పర్ వచన్ న జాయ్ “కోసం “చైన్ సే హమ్ కో కభీ”అనే అద్భుతమైన పాట పాడాక ఆశా అతనికి గుడ్ బై చెప్పేసింది.ఇద్దరి మధ్యా యేం జరిగిందో యెవరూ నోరు విప్పలేదు.ఆ పాటని సినిమాలో కట్ చేశారు గానీ బెస్ట్ సాంగ్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇచ్చారు.అది స్వీకరించడానికి కూడా ఆశా వెళ్లలేదు,నయ్యరే తీసుకోవాలసి వచ్చింది,కారులో ఇంటికి తిరిగి వస్తూ బయటికి ఆ అవార్డుని విసిరి వేశాడు నయ్యర్ .తర్వాత బయట యెక్కడైనా మాట్లాడేటప్పుడు ఆశా తన ఉన్నతికి కారకులైన వారి ని గురించి యస్ .డి,బర్మన్ పేరు చెప్పేది కానీ నయ్యర్ పేరు తలిచేది కూడా కాదు.ఆశా తనను వదిలేశాక ,దిల్ రాజ్ కౌర్ ,వాణీజయరామ్,కవితా కృష్ణమూర్తి ల చేత పాడించే వాడుఅయినా మనసులో వెలితిగానే వుండేది. హీరోయిన్లు చాలామంది నయ్యర్ పాటలు చిత్రీకరింపబడినా ,ఆయనకి మాత్రం తన పాటలు మధుబాల మీద చిత్రీకరించబడటం అంతులేని సంతోషాన్నిచ్చేది. ఆయన పాటలకి యెక్కువగా అభినయం చేసిన హీరోలు  షమ్మీ కపూర్ ,జాయ్ ముఖర్జీ,దేవానంద్ ,గురుదత్ ,బిశ్వజిత్ .

ఆయన పాటలకి అభినయం చేయని హీరోలు —-అమితాబ్ బచ్చన్ ,సంజీవ్ కుమార్ ,రాజేష్ ఖన్నా,జితేంద్ర

ఆయనతో యెక్కువగా పనిచేసిన పాటల రచయితలు —-సాహిర్ లూథియాన్వి,మజ్రూహ్ సుల్తాన్ పురి,

ఆ తర్వాత జాన్ నిసార్ అఖ్తర్ ,యస్ .హెచ్ .బిహారి,అహ్మద్ వాసి .అహ్మద్ వాసి తో ఆయనకు చక్కని స్నేహముండేది. 1974 తర్వాత ఆయన హవా తగ్గడం మొదలైంది,1989లో “నీరాజనం” అనే తెలుగు సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.అందులోకూడా చాలా మంచి పాటలున్నాయి .”నిను చూడక నేనుండలేను,ఘల్లు ఘల్లున గుండె ఝల్లన” అనే పాటలు సూపర్ హిట్లు ఆయన చివరి కాలంలో చేసిన సినిమాలు “మంగిని”(1992),”నిశ్చయ్ “(1992).

“జిద్ ” (1994)ఆయన చేసిన ఆఖరి సినిమా .

ఇంక వ్యక్తిగత జీవితానికొస్తే, ఆయన భార్య పేరు సరోజ్ మోహిని నయ్యర్ ,”ప్రీతమ్ ఆన్ మిలో “అనే పాట రాసిందావిడే అని చెప్పుకున్నాం కదా.ఆయనకు ముగ్గురు కూతుళ్లూ ఒక కొడుకు.ఆయన ఇద్దరు అన్నదమ్ములు ,పి.పి.నయ్యర్ ఫిజీషియన్ బెంగుళూరులో వుండేవారు,జి.పి.నయ్యర్ డెంటిస్ట్ సికింద్రా బాద్ లో వుండేవారు .తన జీవిత చరమాంకంలో బెంగుళూరూ,హైద్రాబాదూ వస్తూ పోతూ వుండేవారు నయ్యర్. అయితే ఆయనకి తన కుటుంబంతో సత్సంబంధాలు వుండేవి కాదు,ఈయన మొండి స్వభావమూ,రాజీ పడని తత్త్వమూ,ఆడవాళ్ల బలహీనతా ఆయనకి కుటుంబాన్ని దూరం చేశాయి.

చివరికాయన చర్చ్ గేటు దగ్గర వున్న తన విలాసవంతమైన నివాసాన్ని వదిలి, బొంబాయి శివార్లలో,అభిమానుల స్నేహితుల ఇళ్లలో విరార్ ,ఠాణే లలో పేయింగ్ గెస్ట్ గా వుండ సాగాడు. చివర చివర్లో హోమియో వైద్యాన్ని అధ్యయనం చేయడం లాంటి పనులు కూడా చేశాడు.టివీలో వచ్చేకొన్ని మ్యూజిక్ షోలకి జడ్జిగా  పని చేశాడు.

తన 81వ యేట జనవరి 28 న 2007లో తనువు చాలించే సమయానికి ఆయన బొంబాయి శివార్ల లోని ఠాణే లో రాణీ నఖ్వా అనే ఆవిడ కుటుంబంతో  పేయింగ్ గెస్ట్ గా వుంటున్నాడు. తన అంత్యక్రియలకు కూడా తన కుటుంబం హాజరు కాకూడదనే ఆంక్ష పెట్టాడు. ఒకనాడు హిందీ చిత్ర సీమను యేలిన సంగీత దర్శకుని శకం అలా ముగిసిపోయింది. 2013లో ప్రభుత్వం ఆయన పేరున స్టాంప్ రిలీజ్ చేసింది. ఆయన లేకపోయినా ఆయన చేసిన పాటలు వింటుంటే ఆ మాధుర్యం మనని వెంటాడుతూనే వుంటుంది. ఆ రకంగా ఆయన చిరంజీవి.

*

రొంపిచర్ల భార్గవి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఓ పి నయ్యర్ పై భార్గవి గారు రాసిన వ్యాసం చాలాబాగుంది. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. వ్యాసరచయితకి శుభాకాంక్షలు.

  • Wonderful article. You should keep writing on songs, more and more.

    I guess, if there was no tussle between Rafi and Nayyar, Mahendra Kapoor would not shine. Sone call him poor man’s Rafi. కానీ అతనికి అది కూడా ఎక్కువే.

  • ఓ.పి.నయ్యర్ పాటలు విన్నాను గాని.ఆయన వ్యక్తిగత జీవితం మీ వ్యాసం ద్వారా నే తెలుసు కోగలిగాను.మంచి సమాచారం అందించారు.
    కృతజ్ఞతలు మీకు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు