ఒక సినిమాకి సరిపోయేటంత కథ

హిట్లర్ ఆదేశాలని అనుసరించి యూదులని నిర్దాక్షిణ్యంగా ముందు కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపులకీ ఆ తరువాత గ్యాస్ ఛేంబర్లల్లోకీ పంపడానికి కారకు లయిన రాజకీయ, మిలిటరీ, ఆర్ధిక, న్యాయస్థానాలకు సంబంధించిన అగ్రగాములైన జర్మన్లని రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి జర్మనీ ఓడినట్లు ఒప్పుకున్న తరువాత నవంబర్ 20, 1945 లో మొదలుపెట్టి పదినెలలకు పైగా జరిగిన నూరెన్‌బర్గ్ ట్రయల్స్ ని నడిపి శిక్షించారు. ఆ అగ్రగాముల క్రింది స్థాయివారినీ, ఆష్విట్జ్, ట్రెబ్లింకా మొదలయిన స్థావరాల్లో యూదుల నిర్మూలన కార్యక్రమాన్ని అమలుజరిపిన కొందరినీ పంధొమ్మిదివందల అరవై దశకం చివరిదాకా కోర్టులలో విచారణ జరిపి శిక్షలని విధిస్తూనే ఉన్నారు. “ది రీడర్” అన్న సినిమాలో చూపినట్లుగా ఉద్యోగ విధులవల్ల ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారికి కూడా శిక్ష తప్పలేదు. ఆ సినిమాలో, సీమెన్స్ కంపెనీ ప్రకటన చూసి దరఖాస్తు పెట్టి ఉద్యోగంలో చేరిన వ్యక్తి హానా. యుద్ధం ముగిసిన ఇరవయ్యేళ్ల తరువాత కోర్టులో హాజరుపెట్టబడుతుంది. “నేను చేసిన తప్పు ఆ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టడమేనా?” అన్న ఆమె ప్రశ్నకు జవాబిచ్చే మూడ్‌లో ఆ కోర్టు ఉండక ఆమెకు తీవ్ర శిక్ష విధిస్తుంది.

జర్మనీ ఓడిపోక ముందర, ఆ యుద్ధ సమయంలోనూ, అది మొదలవక ముందు కూడానూ, యూదులని వాళ్లకి ఎదురవుతున్న అపాయాన్నుంచీ తప్పించడానికి ప్రయత్నించిన జర్మన్లు లేకపోలేదు. అయితే, వాళ్ల సహాయా లన్నీ గుప్తంగా ఉండవలసిందే. యుద్ధ సమయంలో పట్టుబడితే జర్మన్లయినా గానీ శిక్షకు గురయ్యేవారు. అలాంటిది, సహాయం చేస్తున్న కొద్దిమంది జర్మన్లలో తనని కాపాడుకోవడాని కయినా గానీ తప్పక అలా సహకరించిన వేరొకళ్లని హిట్లర్ ప్రభుత్వానికి పట్టించినప్పుడు, దానివల్ల వాళ్లకి శిక్షపడినప్పుడు, యుద్ధానంతరం ఆ వివరాలు బయటపడ్డప్పుడు, వాళ్లు మిగిలిన జర్మన్లనించీ తిరస్కారభావాన్ని ఎదుర్కోక తప్పలేదు. ఈ అడకత్తెరలో ఇరుక్కుపోయినట్లుగా ఒక జడ్జి “గర్ల్ విత్ లిజర్డ్” లో కనిపిస్తాడు. ఈ కథలో ఆయనది అధికభాగం తెర వెనుకనుండే ప్రధానపాత్ర. ముందుండే ముఖ్యపాత్ర ఆయన కొడుకుది. ఆ ఇద్దరినీ కలిపే కీలకపాత్ర జడ్జీగారి భార్యది. ఈ కథ రచయిత బెర్నార్డ్ ష్లింక్. ది రీడర్ సినిమా ఈయన రాసిన పుస్తకం ఆధారంగానే తియ్యబడ్డది. ముందు పేరాలో చెప్పినట్లుగా, ఉద్యోగరీత్యా ఖైదీగా వున్న యూదులకి వార్డెన్ గా ఉన్న హానా ఆ తరువాత కొన్ని దశాబ్దాలపాటు ఆ ఉద్యోగం కలిగించిన హానిని అనుభవించడం గూర్చిన కథ అది.

గర్ల్ విత్ లిజర్డ్” ఒక పెయింటింగ్ గూర్చి. అందులో ఆశ్చర్యకరంగా కనిపించే ఇద్దరి గూర్చి. చిన్నప్పటినించీ దాన్ని చూస్తూ అది మనసులో రేపిన భావాలని నిత్యం అనుభవిస్తూ పెరిగి, ఒక అబ్బాయి దాని సృష్టికర్తని వెదికే క్రమంగూర్చి. ఆ అన్వేషణలో బయటపడిన ఆ అబ్బాయి తెలుసుకున్న నిజాలగూర్చి. అతని తల్లిదండ్రుల మధ్య అతనికి కనిపించిన అగాధం గూర్చి. తల్లిప్రేమకు కరువయిన అతని గూర్చి. ఇవన్నీ పొరలు పొరలుగా కథలో విడుతూ వస్తాయి. ఈ కథ ప్రత్యేకత, ముఖ్యమైన పాత్రలు వేటికీ పేర్లుండవు. అబ్బాయి, జడ్జి, తల్లి, గర్ల్‌ఫ్రెండ్, లైబ్రేరియన్ – అంతే!

అతను ఎనిమిదేళ్ల వయసు దాటేదాకా తండ్రి స్టడీ రూమ్‌లో మధ్యాహ్న వేళ నిద్రపోయే సమయంలో అక్కడ తగిలించి ఉన్న ఒక పెయింటింగుని చూస్తూండేవాడు. సముద్రతీరాన ఒక అమ్మాయి రాతిమీద పెట్టిన చెయ్యిమీద గడ్డాన్ని ఆనించి ఎండలో సేదతీరుతున్న ఒక తొండని చూస్తున్న చిత్రమది. మొహం చిన్నపిల్లదే. కానీ కళ్లూ, నిండయిన పెదాలూ, వంకీలు తిరిగిన జుట్టూ ఒక స్త్రీవి. (“She might have been eight years old. The face was a child’s face. But the eyes, the full lips, and the hair, which curled against the brow and fell to cover her back and shoulders, were those not of a child but of a woman. The shadow that her hair cast over cheek and temple was a secret, and the darkness of the puffed sleeve into which the bare upper arm vanished a temptation.”) ఆ చిత్రం అతను పడుకునే సోఫాకి వెనుక గోడమీద తగిలించి ఉండేది. “ఆ జ్యూయిష్ అమ్మాయి పెయింటింగ్ కిందే వాడు పడుకోవాలా?” అని తల్లి అనడం, “ఆ అమ్మాయి జ్యూయిష్ కాదు. ఆ డ్రస్ ఆ కాలంలో అందరు ఆడపిల్లలు వేసుకున్న డ్రస్సు వంటిదే,” నని తండ్రి జవాబు చెప్పడం అతనికి గుర్తు. ఆ సంభాషణలోని గోప్యత అతనికి పెద్దయిన తరువాత, కథ చివరిలో తప్ప తెలిసిరాదు.

తల్లిదండ్రులు వాళ్ల సంభాషణల్లో ఏదో దాచివుంచుతున్నట్లు అతనికి అనిపిస్తుంది. ఆయన పొజిషన్ వల్ల పార్టీలకి, కాన్సర్టులకీ ఆహ్వానాలు వస్తాయి, వాళ్లు వెడతారు గానీ, ఒక జోక్‌కి నవ్వడం గానీ, కాన్సర్టులో చప్పట్లు గొట్టడం గానీ వేరొకళ్లు మొదలుపెట్టిన తరువాతే నని అతను గ్రహించిన విషయం. దానితో బాటే వాళ్లు తమ అభిప్రాయాలని తమలోనే ఉంచుకుంటారనీ, వేరెవరితోనూ పంచుకోరని గూడా. పంధొమ్మిదివందల యాభయ్యవ దశకంలో వాళ్లు మిగిలినవాళ్లతో కలవకపోవడాన్ని ఆ కాలానికి సంబంధించిన ఫార్మాలిటీగా అతను అన్వయించుకున్నా గానీ దాన్ని మించిన దేదో కారణమై ఉండాలని అతని నమ్మకం. పడక గదిలో తల్లికీ, తండ్రికీ వేరే మంచాలున్నాయన్న సంగతి వెళ్లొద్దని చెప్పిన ఆ గదిలోకి పదమూడేళ్ల వయసులో చూసి తెలుసుకున్న అతనికి అలా ఎందుకన్నదాని గూర్చి అన్నీ ప్రశ్నలే.

మధ్యాహ్న నిద్రకోసం అతను తండ్రి స్టడీ రూమ్‌లోకి అడుగుపెట్టడం ఆపేసిన కొన్నేళ్ల తరువాత, ఎనిమిదవ తరగతిలో ఒక పెయింటింగ్ గూర్చి వ్యాసం రాసుకు రమ్మన మన్నప్పుడు తండ్రి ఇంట్లో లేని సమయంలో అతను గర్ల్ విత్ లిజర్డ్ మీద ఆ గదిలో కూర్చుని రాసినదాన్ని తండ్రికి చదివి వినిపిస్తాడు. ఆ గదిలోకి అనుమతి లేకుండా వచ్చినందుకు ముందు కోపగించుకున్నా విన్న తరువాత ఆ వ్యాసాన్ని ఆయన మెచ్చుకుంటాడు గానీ ఆ పెయింటింగ్‌ని నిధిగా భావించా లనీ, అది తమవద్ద ఉన్నట్లు తెలిస్తే అసూయ జెందడం గానీ లేదా అంతకు మించి లాక్కోవడం గానీ చేస్తారనీ చెప్పి, అందుకని వేరే పెయింటింగ్‌ మీద వ్యాసాన్ని రాయమంటాడు. ఎంత స్నేహితు లయినా గానీ అన్నీ అందరితో పంచుకోకూడ దని ఆయన కొడుక్కు సలహా ఇస్తాడు. దాన్ని అతను ఎలా పాటిస్తాడో అతని మొదటి గర్ల్‌ఫ్రెండ్ తో జరిగిన సంభాషణల్లోనూ ఆ పెయింటింగ్‌ చిత్రకారుడి గూర్చి అన్వేషిస్తున్నప్పుడు కలిగిన లైబ్రేరియన్ సాంగత్యంలోనూ బాగా తెలుస్తుంది.

అతనికి పధ్నాలుగేళ్ల వయసులో తండ్రి తన జడ్జీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇన్‌స్యూరెన్స్ కంపెనీలో జేరతాడు. అది వాళ్ల జీవనశైలిలో తెచ్చిన మార్పువల్ల వేరే చోట, పాత ఇంటికి దూరంగా, చిన్న ఇంట్లోకి మారతారు. ఆ మార్పు ప్రభావం వాళ్ల సాంఘికజీవనం కూడా పడి పాత కుటుంబ స్నేహితులందరినీ దూరం చేసి వాళ్లని పూర్తిగా ఇంటికి పరిమితం చేస్తుంది. తల్లి పోలీస్ డిపార్ట్‌మెంటులో సెక్రటరీగా చేరుతుంది. అతను హైస్కూల్ పూర్తిచేసేటప్పటికి ఒంటరితనం తండ్రిని తాగుడుపరం చేసి దానివల్ల ఆ ఉద్యోగం కూడా పోయేలా జేస్తుంది.

అసలే ఎవరితోనూ పెద్దగా కలవని అతను బలమైన పొడగరిగా, దేహ దార్ఢ్యంతో ఉండడం భయాన్ని కలుగజేసి హైస్కూల్ జీవితంలో ఎవరూ అతనికి స్నేహితులు కాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. హైస్కూల్ తరువాత సెలవుల్లో దగ్గరలో ఉన్న పట్టణాని కెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియంలో కనిపించిన రెనే డాల్మన్ పెయింటింగ్ ఒకటి – సముద్ర తీరాన ఒక రాతిపైన నగ్నంగా ఉన్న అమ్మాయి ఒంటి చేతిమీద నిలబడి ఉన్నది – అతనికి ఇంట్లో ఉన్న గర్ల్ విత్ లిజర్డ్ ని గుర్తుచేసి రెండింటికి ఏదో సంబంధ మున్నట్లనిపింప జేస్తుంది. ఇంటికి తిరిగొచ్చిన తరువాత తండ్రిని ఆ పెయింటింగ్ చిత్రకారుడు ఎవరని అడిగితే తండ్రి తెలియదని జవాబు చెబుతాడు గానీ దానితోబాటే అది విలువయినదని కూడా చేరుస్తాడు. దానిని అమ్మకూడదనీ, అది తానూ, భార్యా అతనికిచ్చే విలువయిన వస్తువనీ చెబుతాడు.

లా చదువుకి ఇంటికి వీలయినంత దూరంగా వున్న కాలేజీకి వెడుతున్నప్పుడు ఒక పట్టణంలో ఆగి అక్కడి మ్యూజియానికి వెళ్లి అక్కడ ఉన్న రెండు రెనే డాల్మన్ పెయింటింగులని అడిగల్లా చూస్తాడు. ఆ చిత్రకారుని గూర్చి ఉన్న పుస్తకాన్ని కొని చదవడం మొదలుపెడతాడు.

అతను కాలేజీలో మూడవ సంవత్సరంలో ఉన్నప్పుడు తండ్రి పోయాడని తెలిసి ఇంటికి వెళ్లినప్పుడు తల్లిని, “తండ్రితో ఎందుకు అంతకాలం ఉన్నా”వని అడిగితే ఆమె, అలవాటువల్ల నని జవాబిస్తుంది. ఆ ప్రశ్న, అతను అప్పటిదాకా ఆ భార్యాభర్తల మధ్య ఉన్న (లేని) సంబంధాన్ని ప్రత్యక్షంగా చూడడంవల్లనే కాక, రచయిత, మొదట్లో “ఆ జ్యూయిష్ గర్ల్” అన్న ఆమె ఎత్తిపొడుపుకి ముందుముందు కారణాన్ని చూపబోతున్నాడని చెప్పడానికి కూడా! అక్కడి నించీ అతను ఆ పెయింటింగుని తనతో తెచ్చుకుని తనింట్లో గోడకు తగిలిస్తాడు. దాని చూసిన అతని గర్ల్‌ఫ్రెండ్ తాను అలాగే ఉన్నది కదా అని ప్రశ్నిస్తుంది. అంతటితో ఆగకుండా, దాని విలువ కనుక్కోవడం ముఖ్యమనీ, ఎందుకంటే, అది విలువయిన దయితే దాన్ని భద్రంగా చూసుకోవాలని చెప్పి, తన సోదరుడు కళ చరిత్రని అధ్యయనం చేస్తున్నాడనీ అతని సహయా న్నడుగుతా ననీ చెబుతుంది. అన్ని విషయాలనీ అందరితో పంచుకోలే మని తండ్రి చెప్పిన సూక్తిని వంటపట్టించుకున్నట్లుగా ఆ వివరాలని ఆమెకు చెప్పడానికి ఇష్టపడక, ఆమె అదేపనిగా అడుగుతున్నదని ఆమె వచ్చే ముందర ఆ పెయింటింగ్ గోడమీంచి తీసి దాచిపెట్టి, అది తల్లి వెనక్కు తీసుకున్న దని అబద్ధం చెప్పి ఆమె వెళ్ళిన తరువాత మళ్లీ బయటకు తీస్తూంటాడు. అలా చెయ్యడానికీ, చివరికి ఆమె రాకకీ విసుగెత్తి ఆమె అతన్ని వదిలి వెళ్లేలా చేస్తాడు. “నీ మనసులోనూ, హృదయంలోనూ ఏమున్నదో నాకు తెలియదు. అందులో నాకు చోటు ఉండవచ్చేమో గానీ అది చాలా చిన్నది,” అంటుం దామె వెళ్లేముందు.

ఆమె అలా వెళ్లడం అతన్ని బాధపెడుతుంది. దానికి ఆ పెయింటింగ్ లోని ఆమెని కారణభూతురాలిగా చేస్తాడు. చూడు, ఎట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చావో నని నిందిస్తాడు. నీ పోటీదారు నిష్క్రమణకి గర్వపడుతున్నావా అని ఆమెని నిందిస్తాడు. మొదట్లోనే రచయిత దానిలోని half seductive woman ప్రత్యేకతని పేర్కొన్నాడు గనుక ఆ చిత్రంలోని ఆమె అతని మనసులో ఎలాంటి స్థానాన్ని ఆక్రమించిందో చెప్పవచ్చు.

రెనే డాల్మన్ చరిత్ర చదువుతుంటే, 1933లో పారిస్‌లోని ఒక గాలరీ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కి కాటలాగ్ కవర్ మీద ఉన్న చిత్రం “లిజర్డ్ అండ్ గర్ల్” అని తెలుస్తుంది. ఉత్తేజితుడై యూనివర్సిటీలోని ఆర్ట్ హిస్టరీ మ్యూజియానికి వెళ్లి లైబ్రేరియన్ సహాయంతో ఆ చిత్రాన్ని స్లైడ్ ప్రొజెక్టర్ ద్వారా చూస్తాడు. అతని దగ్గర ఉన్న పెయింటింగ్ లోని అమ్మాయే, ఆ తొండే. అయితే, సైజులు తారుమా రయ్యాయి. పెద్దగా ఉన్న తొండ చిన్నగా ఉన్న అమ్మాయిని చూస్తోంది. అయితే, అది 1937లో మ్యూనిచ్ లో ‘డిజెనెరేట్ ఆర్ట్’ కింద నిర్వచించబడి ఆ ప్రదర్శన తరువాత మిస్సయింది. ఒక యూదుడు జర్మన్ యువతిని మరులు గొలిపేలా చిత్రించడం (half seductive woman) ఆ డిజెనెరేట్ కారక్టరైజేషన్ కి కారణం. అయితే, “గర్ల్ విత్ లిజర్డ్” గూర్చిన వివరాలు లేవు. తన దగ్గర వున్న ఆ పెయింటింగ్ గూర్చి అతను పదేపదే అడగడంతో దాన్ని ఎక్కడ చూశావని ఆమె అడిగేసరికి వివరాలని ఆమెతో పంచుకోవడానికి ఇష్టం లేని అతనికి అబద్ధం ఆడక తప్పలేదు.

ఇంటికొచ్చి పెయింటింగ్ లోని ఆ అమ్మాయితో, “నీ భవిష్యత్తు అంత బాగోలేదు. ఆ తొండ పరిమాణం పెరుగుతూ పోతుంది గానీ, నీకు దానితో సల్లాపం ఆడడం తప్పదు. అది రాజకుమారుడిలాగా మారుతుందని నువ్వు దాన్ని ముద్దు పెడితే అది అలా పెరిగి నువ్వు చిన్నగా అయిపోయావా ఏమిటి?” అనడుగుతాడు. ఈ సంభాషణ, చిత్రంలోని అంశాన్ని కలిపి ఆ కాలంలో జర్మనీలో యూదులు, జర్మన్ల మధ్య సంబంధాన్ని రచయిత ప్రతీకాత్మకంగా చెప్పడం. యూదులు, అమాయక మయిన అందమయిన యువతివంటివాళ్లు. జర్మన్లు, అందవిహీన మయిన తొండలాంటివాళ్లే గానీ, “గర్ల్ విత్ విజర్డ్”లో భయంగొల్పేలా లేరు. మొదట్లో ఏమాత్రం భయం కలిగించని జర్మన్లు, “లిజర్డ్ అండ్ గర్ల్”లో యూదులందరినీ భయభ్రాంతులను చేసేలా పరిణామాన్ని పొందారు. ఆ పెయింటింగ్ ని మ్యూనిచ్ లో ‘డిజెనెరేట్ ఆర్ట్’ కింద నిర్వచించడానికి గల కారణం తెలుస్తుంది. ఇక మిగిలిన ప్రశ్న, ఆ డిజెనెరేట్ పెయింటింగ్ ఏ మయిం దన్నది.

అతను ఆ పెయింటింగ్ ని ఫ్రేం నుంచీ జాగ్రత్తగా విడదీసి చూసి దాని పరిమాణం ఆ ఫ్రేం కన్నా పెద్ద దనీ, అప్పటిదాకా ఆ ఫ్రేమింగ్ వల్ల దాచివెయ్యబడ్డ ఒకచోట డాల్మన్ సంతకం ఉన్నదనీ తెలుసుకుంటాడు. రెనే డాల్మన్ బయోగ్రఫీని చదివి అతను లిడియా డయకొనోవ్ అన్న అందమైన జ్యూయిష్ అమ్మాయితో పారిస్ నించీ బెర్లిన్ వచ్చాడనీ, అతని పేరువల్లా, స్వఛ్ఛమైన జర్మన్ భాషవల్లా జర్మన్ ఆర్టిస్ట్ అని వెంటనే గుర్తింపు పొందాడనీ, ఆమె అక్కడ కాబరే నడిపేదనీ తెలుస్తుంది. అయితే, కారణాంతరాలవల్ల ప్రభుత్వాధికారులతో రెనే విరోధం తెచ్చుకుంటాడు. వాళ్లు ఆమె కాబరేని ధ్వంసం చేస్తారు. 1937లో మ్యూనిచ్ ఎగ్జిబిషన్ కి ముందరే లిడియాతో జర్మనీ సరిహద్దు దాటగానే ఫ్రాన్స్ లో వచ్చే స్ట్రాస్‌బర్గ్‌కు రెనే పారిపోతాడు. అతను ఫ్రెంచ్ దేశ పౌరుడయినా గానీ జర్మన్ ఆర్టిస్ట్ గానే గుర్తింపు ఉండడంతో పారిస్ లోనూ, ఆంస్టర్‌డామ్‌లోనూ ప్రదర్శించిన అతని పెయింటింగులని జర్మన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తరువాత అమ్మేస్తుంది. సానుభూతి గల డీలర్లు, ఆర్ట్ కలెక్టర్లూ వాటిని కొంటారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు యూదులని కాన్‌సన్‌ట్రేషన్ కాంపులకి పంపుతున్నప్పుడు జర్మన్ మిలిటరీ వ్యక్తులు వాళ్లనించీ స్వాధీనం చేసుకుని తమవిగా చేసుకున్న కళాఖండాలు యుద్ధం తరువాత కొన్ని దశాబ్దాల తరువాత అయినా గానీ బయటపడినప్పుడు ఆ యూదుల సంబంధీకులు అవి తమవంటూ రావడంవల్ల వాటిగూర్చి పెద్ద దుమారం లేచి వాటిని ఆ సంబంధీకులపరం చెయ్యడం జరిగింది. అలాంటి అమ్మకాల్లో కొన్న వ్యక్తులకు కూడా అదే పరిస్థితి ఎదురయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్ మ్యూజియంలలో జేరిన వాటి పరిస్థితీ అదే. “గర్ల్ విత్ లిజర్డ్” గూర్చిన జడ్జిగారి భయం పాఠకులకు కొంత అర్థమవుతుంది.

జర్మనీ స్ట్రాస్‌బర్గ్‌ ని ఆక్రమించిన తరువాత రెనే, లిడియాల జాడ మాయ మవుతుంది. ఆ జాడ పట్టుకునే ప్రయత్నంలో అతను తల్లి దగ్గరకు వెళ్లి, తండ్రి యుద్ధం సమయంలో ఏం చేసేవాడని అడుగుతాడు. ఆయన మిలిటరీ ట్రిబ్యునల్ లో ఉండి, నకిలీ పత్రాలున్న యూదులకి సహాయం చేశాడని ఆమె చెబుతుంది. తీగె లాగితే డొంకంతా కదిలినట్టు అతని ప్రోద్బలంతో చాలా వివరాలు బయటి కొస్తాయి – ఆమెకు కూడా స్ట్రాస్‌బర్గ్‌ మిలిటరీ కోర్టులో భర్త పనిగూర్చిన అవగాహన ఆయన వల్లనే కలగడం గూర్చి, ఇంట్లో ఆయనకూ, ఆమెకూ వేరే పక్క లుండడం గూర్చి, “ఆ జ్యూయిష్ గర్ల్” గూర్చి తిరస్కారభావంతో ఆమె అతని చిన్నప్పుడు మాట్లాడడం గూర్చి, ఆయన ఉద్యోగం మారడానికి వెనక కారణాల గూర్చి, అతని జీవితం మొత్తంలో ఆమె సంతోషంగా కనిపించకపోవడం గూర్చి, అతనిపట్ల ఆమె ఎప్పుడూ తల్లిగా మెత్తదనం చూపకపోవడం గూర్చి, చివరికి అతని పుట్టుక గూర్చి –

ఎన్ని చిక్కుముళ్లు వీడినా గానీ, ఆ పెయింటింగ్ తండ్రి వద్ద కెలా చేరిందో అన్నదాని గూర్చి అతనికి ఊహాగానా లున్నాయి గానీ అది మాత్రం పూర్తిగా అర్థం కాని విషయం. ఆ పెయింటింగ్ అమ్మాయికి తన ఆవేదన నంతా వెళ్లగక్కుతూంటాడు. మొదట్లో చెప్పినట్లుగా ఆ జడ్జి ఒక పక్క యూదులకి సహాయం చేస్తూ, ఇంకొకపక్క అలా సహాయం చేసిన జర్మన్ని పట్టించీ నిజంగా అడకత్తెరలో ఇరుక్కుపోయాడా అన్న సందేహం తలెత్తక తప్పదు. అతను మాత్రం తండ్రి యూదులకి – ముఖ్యంగా ఆ పెయింటింగ్ లో కనిపించిన లిడియాకీ, చిత్రించిన రెనేకీ – అన్యాయం చేశాడని నమ్ముతాడు. ఆ పెయింటింగ్ గూర్చి అతని మానసిక సంఘర్షణని “just as had been the case at home, the painting was a treasure, a mystery, a window onto beauty and freedom, and at the same time a commanding, controlling power to which sacrifices would have to be made” అంటూ రచయిత వర్ణిస్తాడు. అతనేం చేస్తాడో చదివి తెలుసుకోవలసిందే. కథలో ప్రస్తావించిన “గర్ల్ విత్ లిజర్డ్” మరియు “లిజర్డ్ అండ్ గర్ల్” రెండు చిత్రాలకూ లంకె ఉన్నదా అన్న పాఠకుల సందేహాన్ని తీర్చకుండా కథ ముగియదు.

కథ చదవడం మొదలుపెట్టగానే అలాంటి పెయింటింగ్ ఒకటి నిజంగా ఒకటున్నదా, రెనే డాల్మన్ అనే పెయింటర్ ఉన్నాడా అన్న సందేహం రావడం సహజం. “Girl with wizard” ని గూగుల్ చేస్తే ఈ బొమ్మ కనిపిస్తుంది. అయితే, చిత్రకారుడు రెనే డాల్మన్ కాదు. కథలో ఆ అమ్మాయి దుస్తుల రంగు కూడా ఆ బొమ్మలోని దానికి భిన్నంగా ఉంటుంది కానీ, బొమ్మ మాత్రం కథలో రచయిత ఏం చెప్పబోతున్నాడో దానికి సహాయంగా పూర్తిగా సరిపోతుంది. Ernest Stuckelberg అసలు చిత్రకారుడు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే వచ్చే వికీపీడియా వెబ్ పేజీలో రెనే డాల్మన్ ప్రస్తావన ఉంటుంది: This (Girl with a Lizard (1876–84)) appears as the work of the non-existent René Dalmann in Bernard Schlink’s novel series Liebesfluchten.

జర్మన్లకీ, జర్మనీలోని, జర్మనీ చుట్టుపక్కల దేశాలని ఆక్రమించిన తరువాత వాటిలోని యూదుల మధ్య నెలకొన్న దౌర్జన్యకారుల-అణచివేతకు గురయినవాళ్ల (oppressor-oppressed) సంఘర్షణ ఆ సమాజం మీద ముద్రించిన మాయని మచ్చలోని చాలా అంశాలని ప్రస్తావించిన క్లిష్టమైన, ప్రశంసనీయమైన సృజన ఈ కథ. ఒక సినిమాకి సరిపోయేటంత విస్తృతి గలది. ఇంత అద్భుతమైన కథని అందించినందుకు రచయితకు, ఆంగ్లానువాదాన్ని అందించిన జాన్ వుడ్స్ కూ అభివందనాలని తెల్పుకోవాలి.

రచయిత పరిచయం:

Bernhard Schlink వృత్తిరీత్యా లాయర్, ప్రొఫెసర్, నవలా రచయిత. ఇంతకుముందు చెప్పినట్లు ఆయన నవల “ది రీడర్” బాగా ప్రాచుర్యాన్ని పొంది, సినిమాగా రూపుదిద్దుకున్నది. ఇక్కడ పరిచయం చేసిన కథ Flights of Love కథా సంకలనంలో చేర్చివున్నది.

*

తాడికొండ శివకుమార శర్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు