పిల్లల కోసం ఒక పెద్దాయన

నా చిన్నప్పుడు. కరీంనగర్ల జిల్లా తిమ్మాపూర్ మండల్  మల్లాపూర్ అమ్మ వూర్ల. హోళీకీ “జాజిరి జాజిరి జాజా” అని పాట పాడుకుంటా రెండు కోలలు పట్టుకుని (యిప్పుడున్న దసరా మాడ్రన్ కోలలు కాదు. చిన్న కట్టె దొరికినా అది కోల అయ్యేది)  వూర్ల వొక్కో యిల్లు తిరిగి బియ్యం జొన్నలు లేదా కొన్ని పైసల్ జోలెల యేస్కుని వొచ్చినట్టు గుర్తు. సిగ్గూ మొహమాటం భయం యేమీ లేని ఆ ఏజ్. అంతే. సరే వొచ్చి పంచుకున్నామో యింట్లోళ్ళకు యిచ్చినమో నాకేం గుర్తులేదు కానీ నేను మా యింటికి సిటీకి వొచ్చేసినట్టు గుర్తుంది. అంతే.

యిప్పటికీ నేను వూరికి పోతే పిల్లలు వాడుకలో వాళ్ళకు అందుబాటులో వున్న పాటలు పాడుతుంటే నాకు ముచ్చట అయితది. నేను అవన్నీ మిస్ ఐన ఫీల్ వొస్తది. చాలా మటుకు నేను వూరికి పోతే పిల్లలతో  వుండడం అలవాటు. యెందుకు అంటే పుట్టింది పెరిగుతున్నది సిటి కాబట్టి వూరి జీవన శైలిని చూడాలని.  కానీ ఆ పాటలు ఆటలు యింకా వూర్లల్లో వున్నాయి సజీవంగా. మా బామ్మర్ది యిప్పుడు పాడమన్నా వాడు యీసీగా పాడుతడు చిన్నప్పటి పాటలు. అట్లా గుర్తుంది పోయాయ్ వాడికి.

గంగదేవు యాదయ్య సార్ చేసిన గొప్ప పని యేంది అంటే పిల్లల్లో కలిసిపోయే గుణాన్ని ఆపాదించుకోవడం. అది ఆయనకు వున్న పిల్లల మనస్తత్వం కావొచ్చు. వాళ్ళతో మమేకం కావడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి అర్ధం అయ్యే వాళ్ళ ఆమాయక పలుకులనే ఓన్ చేస్కుని పాటగ మార్చుకున్నడు. ఆటల రూపంలో పాటలు రాసిండు. పిల్లలు వెంటనే క్యాచ్ చేసే భాషలో. ప్రాస వుంటే పిల్లలు చాలా తొందరగా ఆ పాటని లేదా చెప్పే టెక్నిక్ బట్టి ఆ మాటను క్యాచ్ చేస్తారు వెంటనే. వాళ్ళ జీవని శైలిని కూడా మార్చేయొచ్చు ఆ పాటలు ఆ విధానం. వెరీ ఎఫ్ఫెక్టివ్ అవి.

 

సై అంటే సై.. నై అంటే నై 

 

అడవికి.. అ.. 

ఆటకు.. ఆ.. 

ఇటుకకు.. ఇ..

ఈగకు.. ఈ

ఉడతకు.. ఉ..

ఊరుకు.. ఊ..

ఎలుకకు.. ఎ..

ఏరుకు.. ఏ..

ఐదుకు.. ఐ..

ఒకటికి.. ఒ.. 

ఓడకు.. ఓ..

ఔనంటే.. ఔ..

సై అంటే సై 

నై అంటే నై..

గమ్మత్తుగా సాగే యీ పాట వొక వుదాహరణ. విన్న పిల్లలకు అఆలతో పాటు ప్రకృతి కూడా గుర్తుండిపోతుంది. యిట్లా చెప్పడం యాదయ్య సార్ కి వొక్కడికే సాధ్యం అనిపిస్తుంది.

“ఉయ్యాలా జంపాలా” గొప్ప పుస్తకం. పిల్లలకోసమే కాదు పెద్దలు కూడా వాళ్ళ చిన్నతనం గుర్తు చేస్కోవొచ్చు.

“తిండ్లు – చిరు తిండ్లు” పాటలో కొన్ని తిను భండారాల పేర్లు చెప్తూ, అవన్నీ చదువ్తుంటే నోరూరుతుంటే అంతలోనే

తక్కువ తింటే మేలు… ఎక్కువ తింటే 

గుడ గుడా.. గడ గడా

తసుక్.. తుసుక్.. డర్.. డర్

బర్ బుర్ డాం డాం

డూమ్ డాం డుస్..! 

అని సున్నితంగ హెచ్చరిక చేస్తాడు. “అప్పల్ దేరా.. పప్పల్ దేరా!”లో కూడా వూరించే పాట.

స్కూల్ నుండి యింటికి వొచ్చిన పిల్లలకు మొబైల్ యిచ్చేసి చెడగొట్టకండి. పుస్తకం యిచ్చి మీరు కూడా కొంచెం తెలివి తెచ్చుకోండి. పిల్లలకి యీ పుస్తకాన్ని పెద్దలు నజరానాగా యియ్యొచ్చు. పాడి వినిపియ్యొచ్చు. టీచర్స్ వాళ్ళ విద్యార్ధుల కోసం యీ పుస్తకాన్ని గిఫ్ట్ కింద యియ్యొచ్చు. కొంచెం దొరికిన టైంని యీ పాటలు వినిపించి వాళ్ళ తెలివి యెదగడానికి యూస్ చెయ్యొచ్చు. రాబోయే తరానికి కొంచెం ఆర్ట్ అండ్ లైఫ్ ని బోధన చెయ్యొచ్చు. జీవితం నేర్పొచ్చు. ఖచ్చితంగ నేర్పొచ్చు.

సిటీలో వున్న పిల్లల్కి యీ పుస్తకం గొప్ప బహుమతి. ఆది మానవుడి గురించి తెలుసుకున్నట్టే వుంటుంది చెప్పాలంటే సిటీ పిల్లలకు ఈ పుస్తకం.

యీ యిరుకు గదుల్లో బతికే కొందరి యింటి ముందు అసలు వాకిలే ఉండదు. ముగ్గు ‘చరిత్ర’ కావడం కూడా (సిటీలో) వింత కాదు. యీ గేయంలో యింకా ముగ్గు ముచ్చట బతికే వుంది. వూర్లల్లో ముగ్గు వేసిన వాకిళ్ళు ముచ్చటగా వుంటాయి. అప్పార్ట్మెంట్స్ ఐన యిళ్ళల్లో యీ ముచ్చట వుండదు. సిటీలో చిన్న చిన్న బస్తీల్లో ముగ్గు వేసే అంత ప్లేస్ వుండడం కొంచెం నయం. ముందు ముందు చెప్పలేం.

ముగ్గులు అన్న గేయం చూడండి.

ముగ్గలు

 

తెల్లగ చిన్నగ చుక్కలు

చుక్కలు కలపగ ముగ్గులు 

ముగ్గులు చూడగ ముచ్చట

భలే..గ ఉన్నవి ఇచ్చట!

పాటలో మ్యాథమాటిక్స్ కూడా వుంటాయని కొందరికి తెలుసు. కానీ దాన్ని యెట్లా వాడాలి, పిల్లలకు యెట్లా నేర్పాలి అనేది యెందరికి తెలుసు? యిదిగో యిట్లా.

చారెడు కండ్లు

 

చారెడు కండ్లు

వేలెడు ముక్కు 

బెత్తెడు నుదురు 

దోసెడుముఖము 

మూరెడు ముఖము 

జానేడు పొట్ట 

బారెడు మనిషి

 

అదిగో.. అదిగో.. అదిగో.. 

ఇదిగో.. ఇదిగో.. ఇదిగో.. 

 

యిట్లాంటి చాలా పాటలు వున్నాయి యింకా యీ “ఉయ్యాలా జంపాలా”లో.

పిల్లల కోసం “ప్రకృతి, జంతువులు, సమాజం, మనుషులు, సంస్కారం, చదువు అండ్ వాళ్ళు అలవాటు పడాల్సిన గొప్ప జీవితం కోసం”  పాటలు వున్నాయి ఈ పుస్తకంలో. యాదయ్య సార్ శ్రమ కనిపిస్తది. రాబోయే తరం మీద వున్న ఆశ ఆయనలో కనిపిస్తది. అన్నీ నేర్పిస్తాడు కూడా. నేర్పించాల్సిన భాధ్యత మన అందరి మీదా కూడా పెడ్తాడు.

పుస్తకంలో ప్రత్యేకం శివాజీ సార్ బొమ్మలు. పాటకు తగ్గ చక్కటి బొమ్మలు. పిల్లల్ని ఆకుట్టుకునే బొమ్మలు. ఆర్టిస్ట్ గా కూడా పిల్లల చూపు మర్లే బొమ్మలు అవి. సింగల్ లైన్లో అద్భుతంగా ఆకట్టుకునేలా వున్నాయి.

యిట్లాంటి పుస్తకాలు రావడం చాలా తక్కువ. అరుదు. పిల్లలకు మంచి సాహిత్యాన్ని మంచి జ్ఞానాన్ని అందించాలి అనుకునే ప్రతి వొక్కరి దగ్గర యీ పుస్తకం వుండాలి. అన్ని పుస్తక షాపుల్లో అందుబాటులో వుంది.

యీ పుస్తకం పెద్దల గతం. యీ పుస్తకం పిల్లల భవిష్యత్తు.

పుస్తకం కోసం

రచయిత: గంగదేవు యాదయ్య

ఫోన్: 90591 12105

 

విజయ్ కుమార్ ఎస్వీకే

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజానికి వీటిని స్కూలులలో పాడించాలి. పేరెంట్స్ కి ,గ్రాండ్ పేరెంట్స్ కి ఈ పాటలు చేరాలి. గుడ్ రివ్యూ.

    • థాంక్యూ అన్నా… షేర్ చేయండి… స్ప్రెడ్ ద గుడ్ లిటెరేచర్… 🙂

  • విజయ్ అన్నా..ఎంత అందమైన వచనమో!వ్యాసం చాలా బాగుంది.మీరన్నట్లు ఇది పెద్దల గతం,పిల్లల భవిష్యత్తు.ఉదహరించిన పాటలు చాలా బాగున్నయి అన్నా.

    • థాంక్యూ సో మచ్ గోపాల్ బ్రో… 🙂

  • సిటీలో వున్న పిల్లల్కి యీ పుస్తకం గొప్ప బహుమతి. ఆది మానవుడి గురించి తెలుసుకున్నట్టే వుంటుంది చెప్పాలంటే సిటీ పిల్లలకు ఈ పుస్తకం.

    గొప్పగా చెప్పారు… ఇది సిటీ పిల్లలకే కాదు మన ఊర్లలోని పిల్లలకు కూడా వర్తిస్తది.

    యాదన్న జయహో.. విజయ్ భాయ్ ముబారక్

    పత్తిపాక మోహన్
    సిరిసిల్ల

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు