ఏ పండు తీపి?

ల్వకుర్తికి వెళ్దామనీ అర్థగంటసేపటినుంచి నిలబడ్డ.రెండు మూడు బైకులు ముందలి నుండే పోయినా ఆపబుద్ధికాలేదు.ఎండ విపరీతంగ కొడ్తుంది.’ఇక ఏదొచ్చినా ఆపాలి’ అని మనసులో అనుకుంటుండగానే కూలొల్ల ఆటో వచ్చింది.ఎండకు నిలవడ్డ నన్ను జూసి “యెక్కడికి పోవాలి ?”అన్నట్లు సైగ చేసిండు డ్రైవరు.

‘కల్వకుర్తి అన్నా’అని అనగానే కూర్చోమన్నట్లు తల పక్కకు తిప్పిండు.డ్రైవరు పక్కసీట్లో అటిద్దరు,ఇటిద్దరూ.లోపలి సీట్లో ఐదు మంది ఆడోళ్ళు.దానికి ఎదురుంగున్న కట్టెసీట్లో ఇద్దరు కూర్చోంగ ఇంకా  ముత్యమంత జాగ ఉంది.ఎట్లనో అట్ల సందుజేసుకొని ఆటో ఎక్కిన.

ఈ ఊరికీ వచ్చే ఒక బస్సు కూడ పోయింది.ఎక్కడికి పోవాలన్నా ఈ ఆటోలే గతి.ఏ ఆటో వచ్చినా పదిపదిహేను మందుంటరు.వెనుక ఐదారుమంది,పక్కలకు ఐదారు మంది వేలాడుతున్నట్లు ఉంటరు.ఈ ఆటోల కనీసం ఈ మాత్రం జాగైనా దొరికినందుకు సంతోషపడుతు కూర్చున్న.కట్టపని చేసే కూలోల్లంతా సొంతంగా ఈ ఆటో కట్టుకొని పోతున్నట్టున్నరు.వాళ్ళ వొంటి మీద చెమటవాసన గుప్పుమంది.ఒకామె నెత్తిమీది నుంచి కంపచెట్ల ఆకులు ఇంకా అట్లనే వున్నయి.కట్టెలు కొడుతుంటే ముండ్లు గీరుకపోయిన గుర్తులు చేతుల మీద కనబడ్డయి.”ఎక్కడికోయివస్తుండ్రమ్మా? “అని అడిగితే రోకండ్లు పగిలే ఎండలు కదా !పొద్దున్నే ఎనిమిది గంటలకే కట్టపనికి వోయి ఎండగాక ముందే ఇంట్లపడుతమని చెప్పిండ్రు.

ఏవేవొ మాట్లాడుకుంటున్నరు.నవ్వుకుంటున్నరు.ఇంత ఎండలో పనిజేసి అలిసిపోయినట్టు ఎవరి ముఖంల కనబడలే.ఎదురెదురుగా కూర్చున్నొళ్ళు పొడుపుకథలు వేసుకుంటుర్రు.

“పండుల్ల పండు ఏ పండు తీపి” అని జవాబుచెప్పమన్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది ఒకామె.తట్టుకు మారు తట్టు వేస్తానంటూ ఇంకొకమే “ఎంత కోసినా పిడికెడు గాదు     “అని ఇంకొక పొడుపుకథ వేసింది.”ఎహే ,ఈ పొడుపుకథలు వద్దు గాని పాటలు చెప్పుండ్రి,పాడుకుందాం”కాస్త కోపంగానే అన్నదొకామె.
“అక్కా!నేనొ పాటజెపుతా.మీరందరూ పాటందుకోవాలి “అని పాట మొదలు పెట్టింది.

“పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండు నగదారిలో
పెయ్యనిచ్చిండు నగదారిలో
నడిపన్నా నాకొక్క నగావెట్టిండు నగదారిలో
నగా వెట్టిండు నగదారిలో
చిన్నన్న నాకొక్క చీరవెట్టిండు నగదారిలో
చీరవెట్టిండు నగదారిలో”

నగాదారిలో పాట ఆటోని ముందుకు నడిపించింది.ఆటోలోంచి ముఖం బయటకు పెట్టి వెనుకకు మళ్ళిపోతున్న చెట్లను,కొండలను చూసుకుంటూ పాట వింటున్న.ఈ కొండరాళ్ళ మధ్య,ఈ చెట్ల నడుమ బతకడం మనిషి ఏదో జన్మల చేసుకున్న పుణ్యం.పల్లెటూరి బడిలో టీచర్ గా పని చేస్తున్నందుకు కనీసం వీటిని చూడగల్గుతున్నాను కానీ ముందుముందు వీటితో ఇంతే ప్రేమగా బతుకగలనా అని ఏవేవో ఆలోచనలు.”ట్రాన్స్ ఫర్ “ఆలోచనే భయంకరంగ తోచింది.ఎంత దూరమొచ్చిన్నో మార్చేపోయిన.చిన్నగా మళ్ళొకసారి తొంగిచూస్తే కల్వకుర్తి మూడు కిలోమీటర్లు అని రాసిన బోర్డు కనిపించింది.

పాటలు పాడుతున్నొళ్ళ పక్కనంగనే ఒకామె ఏమీ మాట్లాడకుండ,ఏదో పోగొట్టుకున్నదానోలే కూర్చుంది.ఎవర్ని పట్టించుకుంటలేదు.ఆమె లోకంల ఆమె.చూస్తే ఎక్కడో చూసిన ముఖం లెక్కనే కనబడింది.కొంచెం ఎత్తు పండ్లు.అమాయకమైన ముఖం.మెడకిందా,చేతులు కాలి చర్మమంతా నల్లగా ముడుతలు ముడుతలు పడ్డట్టుగా వుంది. అరే మా ఊరి మణేక్క లెక్కనే వుందే అని బాగా చూసిన.

“అక్కా!మీ తల్లిగారూరు భూదేవరపల్లినే గదా”
ఊ…అవును,మీదేవూరు?

మాదీ అదేవూరు అక్కా.సోమమ్మ మనువడిని.
“ఎప్పుడో పదిహేనేండ్లాయే మళ్ళీ ఊరుముఖం చూడక.పుంటికూర తిన్నా పుట్టినిల్లు కావాలంటరు.మా తల్లిదండ్రి పోయినప్పటిసంది ఆ ఊరు ఎట్లుందో తెల్వదు.అప్పుడు నువ్వు సన్నపిలగాడివి.మీ నాయినమ్మ వెంబడి పిండిగిర్నికి వచ్చేది కదా!”

అని నా చిన్నతనాన్ని గుర్తుచేసింది.ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నందుకు లోలోపల సంబురపడిన.మణెక్క మొగుడు ఏం చేస్తుంటడో అడుగుదామని వెనుకముందాడిన.ముఖం పాలిపోయిన ఆకాశంలాగ వుంది.చేతులకు వెండిగాజులు కనిపించినయి.ఏం మాట్లాడాలి?కొంచెం సేపు మౌనంగా వున్న.
మణెక్క కొడుకు రాజేష్ .నేను పెద్దబళ్ళో చదువుకునేటపుడు నా కంటే వొక తరగతి పెద్ద.మణెక్కను చూడగానే రాజేష్ కండ్లముందట కదిలిండు.”అక్కా!రాజేష్ బాగుండా?ఏం జెస్తుండు?”-మాట మాట కలుపుకుంటూ అడిగిన.

రాజేష్ పేరు విన్నదోలేదో బొటబొట కండ్లనుండి నీళ్ళు దుంకుతున్నయి మణెక్కకు.పోయి పోయి వాడినెందుకు గుర్తుచేసినవన్నట్టు ఒకామె ముఖంబెట్టింది.ఎందుకక్కా ఏడ్సుతున్నవు? రాజేష్ కి ఏమయ్యిందని అడగాలనిపించి మళ్ళా ఏమనుకుంటదో ,ఏమయ్యిందో అని మాటని వెనక్కి గుంజుకున్న.అంతలో కల్వకుర్తి రానే వచ్చింది.ముందు స్టేజిలో కూలొల్లంతా దిగిండ్రు.మణెక్క ముఖం ఎండిపోయిన వాగులెక్క కనిపించింది.ఇక ఎంత ఇసుక తోడినా తనలో నీళ్ళు రానంతగా కుమిలి పోతూ ఏడ్చింది .ఏడ్చీఏడ్చీ ముఖమంతా గుంజుకపోయింది.అందురూ దిగుతుంటే ఆటోలోవున్న తట్టాపారా అందుకొని మళ్ళిచూడకుండా పోతనే వుంది.

ఆ నడక నేను చిన్నప్పుడు చూసిన మణెక్క నడక కాదు.మా వాడ దిక్కున్న బోరింగు దగ్గరకు వచ్చి  బిందె మీద బిందే పెట్టుకొని తొణకకుండా నీళ్ళు మోసినప్పటి నడక కాదు.

*****    ****       ****

సాయంత్రం పూట రాజు,నేను చెరువుకట్టమీద మాట్లాడుకుంటూ పోతున్నం.వారానికి వొకసారైనా రాజుతో మాట్లాడకపోతే ఏదో పోయినట్టు అనిపిస్తది.అందరి దగ్గర అన్ని పంచుకోము.రాజు దగ్గర మాత్రం ఇప్పటి వరకు ఏ విషయం దాచింది లేదు.ఏ చిన్న సంతోషమైనా,ఎంత పెద్ద దుఃఖమైనా రాజుతో పంచుకుంటుంటే  ఇష్టంగా ఈ చెరువుకట్ట కూడా వింటుంది.”అరే రాజూ,నిన్న ఆటోల మణెక్క కనిపించిందిరా”అని నిన్న జరిగిన కథంతా రాజుకు చెప్పిన.

“ఎట్లుంది?ఏమైనా మాట్లాడిందా?
ఈ మధ్యన ఎవరితోనూ పెద్దగా మాట్లాడుతలేదంట “అని చెప్పుకుంటూ బాటలో వున్న  ముండ్లను పక్కకు తీసేసి నడుస్తున్నడు.కొంచెం సేపు ఆగి ఎందుకన్నట్టు రాజు కళ్ళలోకి చూసిన.

“నీకు తెలియనిదేముంది రా.ఆమె మొగడు పచ్చితాగుబోతు.ఎవరిసోపతికో పోయి మణెక్కను కొడుతుండేది.ఊర్లోనే ఒక దాన్ని చూసుకొని మణెక్కకు ఏడు చెరువుల నీళ్ళు దాపిండు.వాని బాధ తట్టుకోలేకనే ఓ సారి గ్యాసునూనె కూడా పోసుకుంది.ఎన్ని పుణ్యాలు జేస్తెనొ ఒక ఒక పుణ్యం అడ్డుపడుతదంట.ఉస్మానియా దవఖానకు తీసుకొని పోతే మణెక్క ప్రాణాలు దక్కినయి.మెడకింద,చేతులు కాలిపోయుంటయి ,నువ్వు చూసినవు గదా”

రాజు మణెక్క గురించి చెబుతుంటె దుక్కమొచ్చింది.నాకు తెలిసింది వొక మణెక్క మాత్రమే,నాకు తెల్వని ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వుంటరో.ఇద్దరం బాటపొంటి చాలా దూరం నడుస్తుంటే ఇక చాలు ఇంటికి పొమ్మన్నట్లు సూరీడు నిదానంగ కొండమీది నుంచి దిగుపోతుండు.పైనంగ కొంగలబారు కదులుతుంది.పొద్దూకిందని వెనకకు మళ్ళినం.”మరి రాజేష్ ఎట్లుండనగానే ఎందుకేడ్చిందిరా?”మణెక్క గురించి తెలుసుకుందామని ఉత్సాహంగ అడిగిన.

“ఓ..అదా,పే…ద్ద కథరా!మళ్ళి కలిసినపుడు చెబుతాలే”అని రాజు వెళ్ళిపోతుంటే తూము బండ మీద కాసేపు కూర్చుందామని చెప్పి, ఇప్పుడే చెప్పమన్నట్టు బలవంతపెట్టిన.
“రాజేష్ ఎంతందంగ ఉంటడో తెలుసేగద నీకు.పి.జి చదువుతుంటే ఒక అమ్మాయి ప్రేమించిందంట. అమ్మాయి వాళ్ళు బాగా ఉన్నొళ్ళు.ముగ్గురన్నలకు ఒక్కతే చెల్లెలంట. వాళ్ళనాయిన కల్లు అమ్మి ,వచ్చిన సొమ్ము కూడబెట్టి మంచిగ ఇల్లు,పొలం సంపాదించిండంట.ఊర్లో మంచి పలుకుబడి ఉన్నోడంట.రాజేష్ గాడికేమో ఊర్లో మంచి ఇల్లు లేకపాయె.తాగితాగి నాయిన పోయిండంట.రాజేష్ వాళ్ళ నాయిన రాములు సచ్చిపొయ్యినకాన్నుంచి మణెక్కనే ఇంటికి దిక్కైయ్యింది.నాలుగిండ్లల్ల బట్టలుతికి రాజేష్ గాడిని చదివించింది.నాలుగు మేకల కాసుకుంట రెండర్రల ఇల్లు కట్టింది.”

“మరి ఇప్పుడేంజేస్తుండురా రాజేష్ ?”పానం ఆగక మళ్ళీ అడిగిన.
“ఏముంది,సిటీలో ఏదో కంపెనిలో పనిజేస్తుంటంట”
మరి ప్రేమించిన అమ్మాయిరా?

అమ్మాయి వాళ్ళింట్ల ఒప్పుకోలేదంట.ఇద్దరి కులాలు కలువమన్నరంట.ఇద్దరి అంతస్తులు ఒకటి కావన్నరంట.ఇద్దరు లేచిపోయి పట్నంల ఓ చిన్నరూంని  కిరాయికి తీసుకున్నరు.నెలదాక వాళ్ళ జాడ ఎవరికీ తెల్వలేదంట.పోలిస్ స్టేషన్ల చుట్టు,కోర్టుల చుట్టూ అంతా తిరగడం అయ్యింది.పిల్లవాళ్ళ అన్నలొచ్చి పాపం మణెక్కను సావుసావు దెబ్బలు గొట్టిండ్రు.వాడకట్టంతా అడ్డొచ్చిందంట.

వాడు చేసిన తప్పుకు మణెమ్మను ఎందుకు కొడుతరని పెద్దమనుషులు అడ్డుకున్నరంట.”
రాజు చేతిని గట్టిగ పట్టుకొని గుండెబరువుతో రాజు కళ్ళలోకి చూసిన.
“ఒక చేయి కలిస్తే సప్పుడైతదా?రెండు చేతులు కలిస్తేనే సప్పుడు.దీంట్లో పిల్లది కూడా తప్పుంది.మీ చెల్లెను మీరు హద్దునుంచుకోవాలి”ఓ నడీడు మనిషి వాళ్ళ అన్నలను నిలదీసింది.

“పోయినొళ్ళు పోయిండ్రు.వాళ్ళనొదిలి పెట్టుండ్రు.మీ కండ్ల ముందట ఏ బాయిలోనే దుంకితే,ఏ చెట్టుకో ఉరేసుకుంటే బాగుంటాది?”

“గీ మధ్యనే టీ.వి ల జూసిన.రెడ్డొల్ల పిల్లను సూదరొళ్ళ పిలగాడు చేసుకుండంట.ఇద్దరు ఒకే ఆఫీసుల పనిచేసేటొళ్ళంట.ఈ కులపట్టింపులన్ని మన ఊర్లల్లనే కానీ పెద్దపెద్ద పట్నాలల్ల అయితే ఉండవయ్యా”.
అక్కడున్నొళ్ళంతా తలా ఓ మాటంటున్నరు.

“ఇప్పుడు చిన్నకులం,పెద్దకులం అని లేదు.అందరూ ఒక్కటే.ఒకరి మీద ఒకరు మనసు పడ్డరేమో పోయిండ్రు”కాలం ఎట్ల మారిందో ఓ ముసలమ్మ అక్కడికొచ్చినవాళ్ళ తోటి అంటున్నది.
“ఒంటిదాని జూసి కొడుతున్నారు?దానికెవరు దిక్కులేదనుకుంటున్నరా?ఒక్కసారి ఒక దెబ్బగొట్టి చూడిండ్రి,మర్యాద దక్కదు”దూరం నుండి ఓ మగగొంతు వినబడింది.
తలా ఓ మాట అనేసరికి వచ్చినోళ్ళు వచ్చినట్లే కోపంగ వెళ్ళిపోయిండ్రు.వాడు దొరకనీ,వాని పని ఎట్లైతదో అనుకుంటూ బైకులు దీసిండ్రు.

ఎక్కడొళ్ళు అక్కడ పోయిండ్రు.గోడకానుకొని మణెక్క ఒక్కతే వాకిట్లో కూలబడింది.ఊర్లో కరెంటు కూడా పోయింది.అసలే అమాసపొద్దు.ఎవరిండ్లలో వాళ్ళు కొవ్వత్తులను,దీపాలను ముట్టించుకున్నరు.మణెక్క చిన్నగా గ్యాసునూనె దీపం దగ్గరకు పోయింది.దీపం ముట్టిద్దామని గుడ్డపేలికను నాల్కమీద అద్దుకోని పేనింది.దీపం ముట్టిస్తుంటే కొడుకు యాదికొచ్చిండు.ఇన్నిరోజులు మణెక్క ఎవరికోసం బతికింది?కొడుకు కోసమే కదా!కొడుకు మంచిగ సదువుకుంటే కష్టాలు తీర్తవని ఆశపడింది.తల్లిని కండ్లల్ల పెట్టి చూసుకుంటడనుకుంది.ఇంటింటికి పోయి బట్టలుతికె పని తప్పుదని ఎంత మురిసిందో? మొగడున్నన్ని రోజులు సీతమ్మ శెరలు పడ్డది.ఇప్పుడన్న బతుకు మంచిగైతది అనుకుంటే ఇంత పనాయే?పోయినోడు తల్లెట్లుందని మల్లిజూడలే.మణెక్కనేమో రోజు దీపాలు ముట్టించుకునేటపుడు కొడుకును యాజ్జేసుకొని శోకం గడుతది.కొడుకు పేరెత్తితే కండ్లల్ల నీళ్ళు దీసుకొని కుమిలిపోతది.

రాజు మణెక్క గురించి చెప్పుకుంటూ నడుస్తుంటే వొక్కసారిగా  అమ్మగుర్తొచ్చింది.మణెక్కను చూడాల్నని పానం తండ్లాడింది.నిన్న ఆటోలో కూలొళ్ళు వేసిన పొడుపుకథ గుర్తొచ్చి రాజునడిగిన.

“పండుల్ల పండు ఏ పండు తీపి?”అని.

*

తగుళ్ళ గోపాల్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆద్యంతం ఆసక్తికరం. చదివిం చ గల్గింది. మనిషి కులం ఆమె అతడు అంతే

  • చాలా బాగుంది గోపాల్.. మంచి angle తీసుకొచ్చావు. చాలా ప్రశ్నలు ముందుకొస్తాయి కథ చదివినాక. కథ బాధపెట్టింది. కథ చదవడం మంచిగనిపించింది. Keep going 👍🏻💐

  • మంచిచెడ్డలు : కవిత్వంతోనే కలికలి చేస్తవనుకుంటె.. ఇప్పుడు బతుకుల్ని కథ చేసి చూపుతున్నవ్ తమ్మీ. బతుకు బాట పొంటి బాధల్ని బలిమిగ అర్థం చేసుకుంటవ్ గనక నువ ఏది రాసిన కండ్లల్ల బతుకు చెమ్మైతది. ఇగ నుంచి కవితైనా కథైనా ఏదైన రాయి తమ్మి.. కడుపుల నుంచొచ్చేది కమ్మగనే ఉంటది.
    కథలోని వస్తువు.. కథనం.. ఏ సమస్య గురించి మాట్లాడుతోంది కథ.. ఏం చెప్తుంది అన్నీ మంచిగ అర్థమైతన్నయ్. పొడుపు కథలు పల్లెపదాలు నీదైన ముద్ర చూపుతున్నాయ్. Keep rocking thammudu 💐

    ఏ పండు తీపి : కడుపుల కల్గిన పండు తీపి

  • కధ రాయటం మొదటిసారి కావచ్చు
    కధనంలోని అంతర్మథనం చాలా పాతదీ
    లోతైనది భయ్యా..
    మణక్క కలిస్తే.. అమ్మ కాకెంగిలి చేసిన పండు
    ..దానిముందు ఇంకేమీ ఉండదన్నానని చెప్పు.
    ఆ రాజేష్ గాడిగి ఏమీ చెప్పమాక..
    అసలైన ప్రేమ చెప్తే తెలియదు.అనుభవంలోకి రావాల.
    నువ్వెతికినట్టే ఆడు మణమ్మను వెతుక్కుంటూ రావాలి.నువ్వు కధ చెప్పలే తమ్మీ.జీవితం విప్పావు.
    కీర్తన’సీ’రామ్

  • కథలో వర్తమానం చిత్రితమైనది
    మణక్కలాంటి అమ్మలెందరో గదా!

    కథనం సహజంగా నడిచింది,నచ్చింది అభినందనలు

  • గోపాల్ మంచి కథ రాసినవ్..అభినందనలు.. తొవ్వల ఉన్న ముల్లు తీసెయ్యడమే గాకుండా గీరుకపోయిన ముండ్ల గుర్తులను గుర్తుపెట్టుకొని అక్షరీకరించినవ్.. మంచి అబ్జర్వేషన్ కు ఇది నిదర్శనం.. ముందు ముందు నీ నుంచి మంచి కథలు ఆశీంచడం అత్యాశ కాదనుకుంటా….

  • కథలో కూడ నీ మార్క్ కనబడుతుందన్న ,
    బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు