మన సమాజ ‘మూగ సైగ’ లు

“బతకడానికి భారతదేశం కన్నా మించిన దేశం లేదు. ఇక్కడ బతకలేనివాడు ఇంకెక్కడా బతకలేడు. దోచుకున్న వాడికి దోచుకున్నంత.

దొంగ బాబాలు, సెక్స్ బాబాలు, చివరికి కరోనా బాబాలు కూడా పుట్టడానికి అనువైన నేల భారతదేశం మాత్రమే. ఎవరినైనా నమ్మే ప్రజల అమాయకత్వం, నిరక్ష్యరాస్యత, పేదరికం, ఉన్న మన దేశంలో ప్రజలను మోసం చేయడానికి తరచూ బాబాలు పుడుతూనే ఉంటారు. జుట్టులో నుండి ఉంగరాలు, శివలింగాలు, విభూతి తీసేవాళ్ళ, ఏ రోగాన్నైనా నయం చేసే వాళ్ళ, మన భవిష్యత్ ను చెప్పేవాళ్ల, అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబు చెప్పేవాళ్ళ పాదాల మీద  సాగిలపడి మొక్కేవాళ్లు ఉన్నంత కాలం బాబాలు దివ్య తేజస్సుతో వెలిగిపోతూనే ఉంటారు. ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా, పని పాట లేక దేశం మీద పడి తిరిగే పోకిరి వెధవలకు కూడా ఇదొక ఆదాయ మార్గం అయిపోయింది. ‘మూగ సైగ’ అనే ఈ కథలో కూడా అలాగే ఏ ఉద్యోగం లేని ఓ అయిదుగురు యువకులు బతుకుదెరువు కోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించి అందులో ఒక దొంగ బాబాను కూర్చోబెడుతారు.

కథ ఇక్కడ క్లిక్ చేసి, చదవండి మూగ సైగ

విచిత్రంగా ఆ దొంగ బాబాకు మాటలు సరిగా రావు. అంటే కొంచెం నత్తి. అందుకే ఆయన ఏక వాక్య ప్రసంగం చేస్తాడు. ఒక సారి ‘లోకమంతా మిద్దె’ అంటాడు. అంటే ‘లోకమంతా మిథ్య’ అని,  మరోసారి ‘అంతా సత్తం’ అంటాడు. అంటే సత్యం సార్వజనీనమైనది అని అర్థమని వినయ్ అనే Ph. D. చేసిన యువకుడు ఆ బాబా పక్కనే ఉండి ‘భావానువాదం’ చేస్తాడు. కొన్ని రోజుల్లోనే ఈ బాబాకు విస్తృత ప్రచారం లభించి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గరి నుంచి సామాన్యుల దాకా జనం తండోపతండాలుగా వస్తారు.

ఇట్లా జరుగుతుండగానే బతుకుదెరువు కోసం అనుకున్న ఆశ్రమ నియమాలను అతిక్రమించి ఈ యువకుల బృందం లోని యాదగిరి అనే యువకుడు స్థానిక రాజకీయాల్లో జోక్యం కలిగించుకొని రైతుల భూముల్ని ఆక్రమించుకొని ప్లాట్లు చేసి అమ్మాలని చూస్తాడు. ఈ విషయం నచ్చక వినయ్  “ఈ ఆశ్రమాన్ని పెట్టింది పొట్ట పోసుకోవడానికి కానీ ఇతరుల పొట్టలు కొట్టడానికి కాదు కదా! మొదట చెప్పిన మాటను చివరిదాకా నిలబెట్టుకునే ఉద్దేశ్యం నీకు లేదని అర్థమవుతూనే ఉంది. ఇదే నీ జవాబు అయితే నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను” అని  ఈ స్నేహితుల బృందానికి స్వస్తీ చెప్పి విదేశం వెళ్ళే పనిలో పడిపోతాడు. వినయ్ ఆశ్రమం వీడి పోగానే బాబా మూగవాడై పోతాడు. అలా మూగవాడిగా ఎందుకు మారాడో, చివరికి ఆశ్రమం గతి ఏమైందో, ఆ యువకుల ఉపాధి మార్గం ఎలా నిలబడిందో తెలియాలంటే మనం కూడా ఆ ఆశ్రమాన్ని, బాబాను దర్శించుకోవాల్సిందే.

‘మూగసైగ’ అనే ఈ కథ దేశంలోని అనేక సమస్యల సెగలను మన గుండెలకు చేర వేస్తుంది.  ఉన్నతమైన విద్యను అభ్యసించినా ఉపాధి దొరకని వైనం, విలేఖరుల దోపిడి, బూటకపు బాబాల మోసం, రాజకీయ పార్టీల నిజ స్వరూపం, మిత్రుల విభేదాలు, నత్తితో బాధపడుతున్న వ్యక్తి మానసిక సంచలనం, మతాల చూట్టూ, దేవుళ్ళ చుట్టూ జరుగుతున్న వ్యాపారం, భూ ఆక్రమణ దందాలు, రెవెన్యూ అధికారుల అవినీతి, జీవిత తత్వం, బాబాల దగ్గరికి అమాయకంగా వచ్చినా ప్రశ్నల ద్వారా చైతన్యాన్ని చాటే ప్రజలు, పరిసర గ్రామాల దాన గుణం, మన చుట్టూత ఉన్నవన్నీ కల్తీ అవుతున్న విధానం, మీడియా పని విధానం, నిరాడంబరంగా ఉండాల్సిన బాబాల ప్రచారార్భాటాలు, ధన దాహం,  ప్రజా ప్రతినిధులుగా పార్లమెంటులో ప్రశ్నలు అడగాల్సిన ఎంపీలు, ప్రశ్నలు అడగడానికి కూడా డబ్బులు తీసుకునే నీచమైన పద్ధతి, విద్యుత్ అక్రమ వినియోగం, పైకి భక్తిని నటిస్తూనే లోపల మద్యపాన బానిసత్వం, బాబాలు కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆకర్షించడం, కనీస బతుకు కోసం అనేక కుట్రలు పన్నడం ఇలా ఈ కథలో అనేక పొరలున్నాయి. అలాగే సమాజం ఎన్ని రూపాలుగా ఉన్నదో, ఎన్ని కోణాల్లో ఉందో కొందరు నిరుద్యోగుల దృష్టి కోణం నుంచి రచయిత చూపించిన తీరు అబ్బురపరుస్తుంది. ఒక రకంగా ఈ కథ ప్రస్తుత సమాజ ప్రతిబింబం, ఉద్యోగాలు లేని యువకులు తమ ప్రతీకారాన్ని ఎలా వ్యకీకరిస్తారో, ఎన్ని రూపాల్లో ప్రదర్శిస్తారో, మానసికంగా ఎంతగా నలిగి పోతారో  ఈ కథ ఒక డాక్యుమెంటరీ లాగా చూపించింది. తాము చేసేది తప్పని తెలిసి కూడా ‘ఉదర పోషణార్థం బహుకృత వేషః’ అన్నట్లు నైతికంగా దిగజారి ప్రవర్తిస్తారు ఇందులోని యువకులు. దానికి మన వ్యవస్థ ఎంత వరకు కారణమో ఆలోచించమంటుందీ కథ. సమాజంలో విభిన్న శక్తుల మధ్య జరిగే నిశ్శబ్ద సంఘర్షణ, హింస, విప్లవానికి ఈ కథ ఒక ప్రతిరూపం.

కథలోని పాత్రల చిత్రణను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కథలోని నిరుద్యోగ యువకులు ఐదుగురు. వారు యాదగిరి, వినయ్, వీరమల్లు, సత్యం, నర్సింహులు. ఇందులో ప్రధాన పాత్ర యాదగిరి. ఇతడు ఎం. ఏ. పోలిటికల్ సైన్స్ చేశాడు. బూటకపు బాబాను దేశానికి అందివ్వాలనే ఆలోచన ఇతనిదే. ఇతని స్వభావాన్ని చెప్పడానికి రచయిత రెండు ఉపమానాలు వాడాడు. ‘బండ మీద పావు శేరు పుట్టించుకునే తెలివి పరుడు’, ‘గిరీశాన్ని గిరికీలు కొట్టించే తెలివి. తాను తలపెట్టిన పనులలో తప్పక గెలుస్తాడు.’ నిజంగానే కథలో విజయం ఇతనిదే. తరువాత పాత్ర వినయ్. ఇతడు ఫిలాసఫీలో డాక్టరేట్ చేసినవాడు. విధిలేక వీరితో కలుస్తాడు. కొన్ని విలువలున్న మనిషి. రైతులను దోచుకోవడం, అన్యాయానికి పాల్పడడం నచ్చని మనిషి. బాబా ఏది మాట్లాడినా దాన్ని సమన్వయ పరిచి మాట్లాడుతాడు. సత్యం అనే నత్తి యువకుడే బాబ. ఆ నత్తి వల్ల ఎప్పుడూ మౌనంగానే ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. దీని వల్ల బిడియం పెరిగిపోయింది. మిగతా ఇద్దరు నర్సింహులు, వీరమల్లు వీరిద్దరూ డిగ్రీ పాసయ్యారు. నర్సింహులు బాబ ప్రచార బాధ్యతలు చూసుకుంటాడు. వీరమల్లు ఆశ్రమం బాగోగులు చూసుకుంటాడు. వీళ్ళేగాక కథలో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు తెర మీదికి వచ్చి మాయమవుతుంటాయి.

కథ గొప్పదనమంతా రచయిత కథను మలిచిన శిల్పంలోనే దాగుంది. సాధారణంగా, రాజకీయ, సామాజిక అంశాన్ని ఎన్నుకొని కథగా రాస్తున్నప్పుడు అది క్రమంగా వ్యాసం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఈ  రచయిత చాలా లాఘవంగా దాటేశాడు. రచయిత మనకు ఎక్కడా కనిపించడు. పాత్రలే కథను అలా అలా ముందుకు నెట్టుకు  పోతుంటాయి. వ్యంగ్యం, వాస్తవికత ద్వారా కథ యొక్క, ప్రపంచం యొక్క  సహజ స్వరూపాన్ని పాఠకునికి అందిస్తాడు రచయిత. చాలా తక్కువ సంభాషణలతోనే కథ నడిపాడనే విషయం కథ అయిపోయిన తరువాత కూడా మనం గుర్తించం. తెలంగాణ కథల్లో ముడి రాయి లాంటి కథే ఉంటుంది కానీ శిల్పముండదనే కువిమర్శకులకు ఈ కథ ఒక సమాధానం. ఏ కథకుడైనా అన్నీ కాలాలకు పనికి వచ్చే ఏవో కొన్ని జీవన సూత్రాలను తన కథలో వదిలేస్తాడు. అలాంటి వాక్యాలు ఈ కథలో కూడా కనిపిస్తాయి. “నిప్పుకు చెదలంటదు-డబ్బుకు మతముండదు”, “దేశంలో లాభసాటి వ్యాపారం ఎక్కువగా ఇప్పుడు దేవుడి చుట్టే జరుగుతుంది”, “మోసానికి దిగాక మొదలేమిటి చివరేమిటి?”, “దేవుళ్ళతో పాటు జాతి కూడా సంకరమైన దేశం మనది. ‘స్వచ్చం’ అనే పదానికి స్వచ్చమైన అర్థం మనకు ఎక్కడ ఏడ్చి చచ్చింది? ఇక్కడ ‘కల్తీ’ ఒక్కటే నిఖార్సైనది. మిగతావన్నీ కల్తీలే”,  “తెలుగునాట ఏ క్వాలిఫికేషన్ లేకుండా చలామణి అవుతున్న వాళ్ళు ఇద్దరు. మొదటి వ్యక్తి రాజకీయ నాయకుడైతే, రెండో వ్యక్తి విలేఖరి.” (గ్రామీణ విలేఖరులను దృష్టికో పెట్టుకొని), “ప్రజల డబ్బుతో వ్యాపారం చేయాలి. లాభం వచ్చిందంటే మనది. మునిగితే జనాలది.” లాంటివి అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని బోధిస్తాయి.

చలం అన్నట్టు ఈ కథ ‘అందమైన పటంమల్లే గోడకు వెళ్లాడుతూ, మనసుని అందాలతో నింపేది కాదు. ఉరిమి, చించి, చెండాడి, మంచికో, చెడుకో జీవితాన్ని ‘ఇన్ ఫ్లుయెన్స్’ చేసేది. ఉన్నత చదువులు చదువుకున్న మానవ వనరులను సరిగ్గా వినియోగించుకోక పోతే సమాజాన్ని ఎలాంటి సంక్షోభం చుట్టుకుంటుందో ‘మూగసైగ’ల ద్వారా చెప్పిన కథ ఇది. ఈ ‘మూగసైగ’ల ప్రకంపనలను మన హృదయానికి చేరవేసిన కథకులు, విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు  గుండెబోయిన శ్రీనివాస్. ‘ఆకలి – ఆడది’, ‘మమకారం’ కథలతో మొదలు పెట్టి ఇప్పటి దాకా దాదాపు పన్నెండు కథలు రాశారు. ‘ఆకాంక్ష’ (రాజకీయ వ్యాసాలు), ‘గురి’ (సామాజిక, రాజకీయ వ్యంగ్య రచనలు), ‘వేటు’ (గేయాలు) ముద్రిత రచనలు. సుమారు 60-70దాకా సాహిత్య విమర్శా వ్యాసాలు రాశారు. కథలతో పాటు, సాహిత్య వ్యాసాలు, పాటలు పుస్తక రూపం తీసుకోవాల్సి ఉన్నది. ఇదొక లోటు. ఈ కథ మొదట ఆదివారం వార్తలో 26 సెప్టెంబర్ 2010లో ప్రచురింపబడింది. గుండెబోయిన శ్రీనివాస్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. నివాసం వరంగల్.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిప్పుకు చెందలంటదు..డబ్బుకు మతముండదు , ప్రపంచానికి సంస్కృతి , సంప్రదాయాల మార్గదర్శి అని చెప్పుకునే మన దేశంలో దేవుని పేరిట వ్యాపారం (ఇందులో అన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి) , దగా , మోసం , చేసే దొంగ బాబాల లీలలు కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు , దేశంలో నిరుద్యోగ యువత బతకడానికి దారులు వెతుక్కుంటూ చివరికి దేవుణ్ణి ఆసరా చేసుకోవడం దురదృష్టకరం.
    రచయిత , విశ్లేషకులు , ఉపాద్యాయుడు గుండెబోయిన. శ్రీనివాస్ గారి ఉపమాన , ఉపమేయ కరమైన రచన ఎంతో ఆసక్తిగా ఉంటుంది.

  • Great.. గొప్ప కథ .. మంచి విశ్లేషణ .. అభినందనలు💐💐💐🙏

  • సెటైర్ పండించ గల శక్తి శ్రీనివాస్ గారి కలం కు ఉంది. ఆ లక్షణం కధ లో కనపడుతుంది. శ్రీధర్ గారు కధానాడిని పట్టుకున్నారు. ఇరువురికి శుభాకాంక్షలు.

  • అందరికి ప్రిస్కిప్షన్ రాసే డాక్టర్ గారికే ప్రిస్కిప్షన్ రాసిచ్చిన శ్రీధర్ గారికి మొదట అభినందనలు. తెలంగాణా కధలో శిల్పం పై తెలంగాణేతరులకున్న అభిప్రాయానికి సమాధానం చెప్పిన కథ మూగసైగ. శిల్ప సౌందర్యమొక్కటే కాదు రచన ఆద్యంతమూ సెటైరిక్ గా సాగుతుంది. ఈ ప్రధాన అంశం మీరు గుర్తించారు. రాజకీయాలు,సామాజికాంశాలపై రాస్తున్న కథ వ్యాసంగా మారకుండా జాగ్రత్త పడటం అందరికీ సాధ్యం కాని పని. .ఎస్.గారు ఇందులో లాఘవం చూపారన్నారు. వ్యాసం,సెటైర్ ల కన్న చాలా ముందే కథ మర్మాలను అవపోసన పట్టిన వారు జి.ఎస్. “చీకటి పడ్డంక కాళ్ళు మండువ దిక్కే గుంజినట్టు” కథలో కూడా సెటైర్ల కిక్కు తో సమాజాన్ని ‘వీడియో తీశారు’. కథకుడి ఆత్మ పట్టుకోవటంలో మీరు కృతకృత్యులయ్యారు. దశాబ్దాల క్రితం రాసిందే అయిన కథ ప్రయోజనాలే కాదు ప్రాసంగితకు లోటులేదు. అవార్డల కోసం తపస్సు చేసే కాకాలు తీరిన కథా రచయితలే ముగింపు లేకుండా కథలు ముగించే దుస్థితుల్లో ఆలోచనల కాన్వాస్ పై ముగింపు చిత్రాన్ని గీసుకోని కథను నడిపించటమనేది ఆనాడే జి.ఎస్. సాధించారు. బహుశా ఈ “వెలుగులే” మిమ్ములను సంతృప్తి పరిచి మీతో రాయించవచ్చు. పాఠకుడిని గందరగోళంలో పడేసే అనేక కథలు వస్తున్నాయి. వాటికి బహుమతులు పురస్కారాలు వస్తున్నాయి.ఈ కథ మూగ సైగ అలాంటి వారికి పాఠం లాంటిదని భావించాలి. ఈ కథ పై నా అభిప్రాయాలను దాదాపు చేరుకున్న మీ అభిప్రాయాలను చదివిన తరువాత ఇది రాయాలనిపించింది.. గుండెబోయిన శ్రీనివాస్ గారు (జి.ఎస్.) మరి ఇప్పుడు కథలు రాయటం కన్నా విమర్శలపై దృష్టి పెట్టటం పై నాకు బాధగానే వుంది. మీ ఇద్దరికి అభినందనలు…

  • గుండెబోయిన శ్రీనివాస్ ఒక నిజాయతీగల రచయిత. సాహిత్య ప్రయోజనంపట్ల ఖచ్చితమైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ‘మూగసైగ ‘కథ అందుకు సరియైన ఉదాహరణ.
    ఇక వెల్దండి శ్రీధర్ ఒక ఉత్తమ విమర్శకుడు.అతడు కథను పరిచయం చేసిన తీరు, కథలోని లోపల విషయాలను చెప్పకనే చెప్పిన విధం ప్రశంసనీయంగా ఉంది.
    కథకు తగిన విశ్లేషణ యిది.

  • మూగ సైగ కథా విశ్లేషణ బాగుంది. ఈనాటి సమాజానికి ప్రతిబింబం లా ఉంది. రచయిత పరిచయం విశ్లేషణ చివర ఉండటం బాగా కుదిరింది.

  • Good message to society for eradicate the social evils from the society and also government activities should recruitment of educated youth otherwise they can do in this story actors. congrats srinu sir

  • రచయిత గుండెబోయిన గారు వృత్తిరీత్యా నాకు చిరకాల సహచర ఉపాధ్యాయులు. ఆత్మీయుడునూ. సర్ కి సాహిత్యం పట్ల నిర్దిష్టమైన అవగాహన, పట్టు కలిగి ఉండడమే కాకుండా సమకాలీన
    సామాజిక, రాజకీయ, పాత్రికేయ విషయాల పట్ల తనదైన విశ్లేషణాత్మక ఆలోచన కలిగిన వ్యక్తి. సర్ రాసిన దాదాపు అన్ని రచనలు నేను చడవడమే కాకుండా వాటి గురించి వారితో చర్చించే అవకాశం కూడా కలిగింది. వారి సెటైరికల్ శైలికి నేను ప్రత్యేక అభిమానిని.
    సర్ రాసిన మూగ సైగ కథానికపై శ్రీధర్ వెలదండి గారు
    సాహితీ విమర్శ చేయడం అద్భుతంగా ఉంది. ఈ సందర్బంగా
    రచయిత శ్రీనివాస్ సర్ మరియు విమర్శకులు శ్రీధర్ సర్ గార్లను అభినందిస్తున్నాను.
    రాజేశ్వర్ రావు కూచన.,
    9866667453

  • కథ ఎంత చక్కగావుందో …సమీక్షకూడా సద్విమర్శగవుంది. కథనంవల్ల కథను కథకుడు రక్తికట్టించాడు. ఒక విషయం చెప్పుకోవాలి. కథను తెలంగాణ భాషను వాడలేదు ఎందుకనో. సాథారణం కథకుడు తను ఎత్తుకున్న వ్యంగ్యరచనను తనప్రాంతీయభాషలో రాయాలనిపిస్తుంది…కారణం తను ఎంచుకున్న అంశంమీద పట్టును తనుకుబాగావంటపట్టీనభాషను ఉపయోగిస్తాడని నా భావన. అదేవుండాలనికాదు. మైండుగేమ్ ఈ రోజులలో ఆడుకునే ఆట….అది అన్నిటిలోనూ చొరబడింది…దానికీ క్వాలిఫికెషను ఎదటీవాడి బలహీనత…ముఖ్యంగా మన దేశంలో బలంకన్నా బలహీనతలే బలంగా నాటుకున్నాయి…దాన్ని ఎన్ కేష్ చేసుకోవడమే మనీ షు ల మైండ్ గేమ్ .. కథకుడు ఈ విషయాన్ని దేవుడు….వయా బాబా రూపేణ చదువుకొన్న వాళ్ళద్వారా నడిపించాడు తన కథను . పటుత్వంగా రాసిన డైలాగులు….సుత్తిలేకుండాను….సమీక్షకుడు చెప్పినట్టు వ్యాసం రూటున వెళ్ళనీయకుండా జాగ్రత్తగ రాసాడు. నాటకీయత వొరవడి పండిందికథలో…మంచికథ. పదునైన రచయిత అనిపించుకున్నాడు కథకుడు.
    వీరి రచనలు తప్పక చదవాలి అనిపించెటంతగ వుంది కథాకథనం. మెసేజ్ ఓరియంటేషను వుంది. కథ గ కాకుండా వాస్తవ ఘటనలు ఎంచుకుని బారుగా కాకుండా….జర భద్రంగా…జాగురూకతతో…వ్యంగ్యంకూడా అతి మోతాదుకాకుండా….చిక్కగ ఆలోచనతో …కథను రాసారు…చక్కగ పండించారు రచయిత కథను.

  • మీ విశ్లేషణ బాగుంది. నిజాయితీతో కూడిన రాజకీయ ఉద్యమాలు మాత్రమే మానవ వనరులను చక్కగా ఉపయోగించుకుంటాయి.

  • రచయిత శ్రీ గుండెబోయిన శ్రీనివాస్ గారు సమకాలీన పరిస్థితులను సరికొత్త కోణంలోనూ, బిగువైన కథనంతోనూ “మూగసైగ” కథగా రచించారు. ఇక శ్రీ శ్రీధర్ గారు దానిని తనదైనశైలిలో అద్భుతంగా విశ్లేషించారు. రచయిత రాసే ప్రతి వాక్యాన్ని తన మనసుతో ” స్కానింగ్” చేసి విశ్లేషించడం శ్రీ శ్రీధర్ గారి ప్రత్యేకత. తన విశ్లేషణలో వారు ప్రస్తావించిన మంచి వాక్యాలతోపాటు “హుండీ గట్టిగా ఉంటే మిగతావన్నీ అవే గట్టి పడతాయి” “స్వచ్ఛం అనే పదానికి స్వచ్చమైన అర్థం మనకు ఎక్కడ ఏడ్చి చచ్చింది” లాంటివి కూడా నాకు నచ్చాయి. ఇద్దరికీ అభినందనలు.

  • ‘మూగసైగ’ కథను ఆసక్తికరంగానూ, లోతుగానూ విశ్లేషించిన డా. వెల్దండి శ్రీధర్ గారికి, ఈ కథనూ దానిపై చేయబడిన విశ్లేషణ పై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన మిత్రుల కు మరియు పెద్దల కు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
    గుండె బోయిన శ్రీనివాస్
    వరంగల్

  • కథను చదివాను.
    విశ్లేషణను కూడా చదివాను.
    కథ ప్రారంభం నుండి అయిపోయేవరకు ఆసక్తిగా చదివించింది. పాత్రల మధ్య సంభాషణ చక్కగా కుదిరింది.
    నిరుద్యోగులు ఒకటై ఎలాగైనా డబ్బును సంపాదించుకుని జీవించాలనే కాంక్ష వరకు సానుభూతి ఉంటుంది. తర్వాత సంపాదనే లక్ష్యంగా ఎన్నుకున్న మార్గాన్ని కొనసాగించే విధానం పట్ల ఆవేశం కలుగుతుంది. పతనమై పోతున్న మానవీయ విలువలకు మచ్చుతునక ఈ కథ. బతకడానికి కోటి వేషాలు అనుకుంటాం. సంపాదన వస్తున్న కొద్దీ వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్లే వాళ్ళు యాదగిరి లాంటి వాళ్ళు అయితే ఇమడలేక తప్పు కొనేవాళ్ళు వినయ్ లాంటివాళ్ళు. ధన దాహం తీరనిది.
    మనుషుల స్వభావాలను కూడా అర్థం చేసుకుంటాను ఈ కథ ద్వారా.
    కథ రాసిన శ్రీనివాస్ గారికి
    సమర్థవంతంగా విశ్లేషణ చేసిన శ్రీధర్ గారికి అభినందనలు…🙏🙏🙏🙏

    • ధన్యవాదాలు రవిందర్ సార్

  • Excellent story sir ,you tried your level best to eradicate the superstitious and blind concepts among the INDIAN MASS by giving some wonderful illustrations and characters which are very familiar to rural people . Now a days , people still believe in false statements which are being practised by certain BABA ‘s .I personally wish you continue writing stories like this . Thanking you sir

  • ధన్యవాదాలు రవిందర్ సార్

  • శ్రీనివాస్ గారి “మూగసైగలు” పై డా. వెల్దండి గారి విశ్లేషణ చక్కగా చిక్కగా వున్నది. సమస్యల సెగలు, మూగ సైగల ప్రకంపనలు..వంటి ప్రయోగాలు అభినందనీయం. కథ లోని విలువలను వెలికి తీసిన తీరు ప్రశంసనీయము.

  • సార్,నమస్కారం.
    మొత్తం సమీక్ష మరియు మీ కథ చదివాను. పాత్రలు… గురించి తక్కువగా నే చెప్పిన కానీ…. కథలో వారి స్వభావాన్ని మరింత ధృవీకరించారు.”విలేఖరులు.రాజకీయ నాయకులు… ఏమి చదువు కోకుండానే”…ఈ విషయం ఇప్పుడే నాకు తెలిసిన పచ్చి నిజం.
    ప్రచారంలో… నాయకులు… మరియు నాయకులు గా ఎదిగే(డబ్బు మాయ చేసేవారి మధ్యలో విలేకరులు మాత్రం విజయవంతమవుతున్నారు) వారుంటారు.కానీ విలువలుండవు.
    నిత్యం… సత్యాలు పలకటం కన్నా…మౌన మునిగా ఉండటం నత్తి సత్యానికి మంచిదనిపిస్తూంది.ఊరి చివర చిన్న తాటాకుల పాక…నా చిన్నప్పుడు వేరే మతాల వారు…ఇలాగే వేసి మెల్లగా.. పెద్దగా చర్చిగా మార్చారు.(ఇప్పుడు ఇంకా బాగా సంపాదించి కార్పోరేట్ లకు దైవదర్శనం పేర దండుకుంటున్నారు).నిరుద్యోగులకు చాలా మంచి ఐడియాలజీ ఉంటుంది. సందర్భానుసారంగా కథ నడిచింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు