ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే..

నిజంగా ఇది ఒక అరుదైన శీర్షిక. నిజానికి ఈ శీర్షికలో నేను రాసిన కథ.. కొంత కాలం తరువాత దాని పరిణామాలు రాయాలి. కానీ నేను రచించిన “మా పిల్లల ముచ్చట్లు- ఒక టీచర్ అనుభవాలు” పుస్తకం నుంచి, ఒక కథ వంటి అనుభవం.. మీతో పంచుకుంటాను.

అది 2018 నెలలో పిల్లలకు ఉదయం ఆరు, ఏడు తరగతులకు పరీక్ష అయిపోయింది. మధ్యాహ్నం రెండింటికి ఎనిమిదవ తరగతి వారికి పరీక్ష జరుగుతున్నది. ఉన్నది 20 మంది పిల్లలే కాబట్టి నేనొక్కదాన్నే పరీక్ష నిర్వహిస్తున్నాను. మరోపక్క పదవ తరగతి పిల్లలు వారి తరువాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నారు. నేను ఇంకో అరగంటలో పరీక్ష ముగుస్తుందనగా.. ఇద్దరుముగ్గురు పదవ తరగతి విద్యార్థులు నా దగ్గరికి వచ్చి-

“మేడం పరీక్ష దాదాపు అయిపో వచ్చింది కదా.. మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ ఒక చిన్న ఆటాడుకుంటాం” అన్నారు

“అదేంటిరా… పరీక్ష మధ్యలో, పరీక్ష హాల్ లో మీ ఆటేమిటి? పరీక్షని డిస్టర్బ్ చేయకూడదు కదా” అన్నాను.

“ప్లీజ్ మేడం.. ఒక్క పది నిమిషాలు మేము స్క్వా డ్ లాగా వస్తాం. పిల్లల్ని భయపెడతాం. వీళ్ళు ఇప్పుడెలాగూ ఎయిత్ క్లాస్ కదా. ముందు ముందు టెన్త్ క్లాస్ ఎక్జామ్స్ లో సడన్గా స్క్వాడ్ వస్తే ఈ పిల్లలు భయపడకుండా ప్రాక్టీస్ కూడా అవుతుంది. కాసేపు మేము స్క్రాడ్ అధికారులు లాగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేస్తాం. మాకు ఒక అనుభవంలా ఒక్క పది నిమిషాలు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ మేడమ్.” అని రకరకాలుగా బతిమాలారు.

సరే పిల్లలు ఏదన్నా ప్రేమగా అడిగితే కాదనలేను కదా! పరీక్షలో ఇలా చేయకూడదని తెలిసీ కూడా వారి ముచ్చటను కాదనలేక..  “మరి ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా పదంటే పది నిమిషాల్లో వెళ్ళిపోవాలి”  అని చెప్పాను.

వాళ్ళు వెనక్కు వెళ్ళిపోయి… కాసేపటికి అప్పుడే అధికారులు వస్తున్నట్టుగా… బూట్లు టకటకలాడించుకుంటూ స్క్వాడ్ ఆఫీసర్స్ లాగా లోపలికి వచ్చేసారు. పరీక్ష హాలంతా కలియ తిరుగుతూ..

“స్లిప్స్ ఏమన్నా ఉంటే బయట పడెయ్యండి. పరీక్ష సరిగ్గా రాయండి. తల తిప్పకూడదు. ఒక్క స్లిప్ కనపడ్డా డిబార్ చేసిపారేస్తాము. ఒకసారి డిబేట్ చేస్తే రెండు మూడు విద్యాసంవత్సరాలను నష్టపోతారు జాగ్రత్త. అంటూ అటూ ఇటూ హడావిడిగా రూమ్ అంతా అందరినీ టెస్ట్ చేశారు. ఒక పది నిమిషాలు హడావిడి చేసి ఏదో జీపులో వెళ్ళిపోతున్నట్టుగా జామ్మంటూ వెళ్ళిపోయారు.

పిల్లలు నిజమైన స్క్వాడ్ కంటే పదిరెట్లు ఓవరాక్షన్ చేశారు. వీళ్ళు నిజంగానే స్క్వాడ్ వచ్చినంతగా కంగారు పడిపోయారు. అంతా అయిపోయాక హాయిగా నవ్వుకున్నాం..

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ప్రధాన పాత్రధారి అయిన అబ్బాయికి, ఇలాంటి ప్రాక్టికల్ జోక్సంటే చాలా ఇష్టం. ఈ విషయం 2020 లో వచ్చిన మా పిల్లల ముచ్చట్లులో రాసాను.

అయితే తర్వాత కాలంలో ఈ అలవాటే వాడి జీవితాన్ని దెబ్బతీస్తుందని ఊహించలేదు. జరిగిన విషయం ఏంటంటే బహుశా 2022 లోను 23 లోనో  ఇంటర్మీడియట్ లో వాడు తన స్నేహితురాలు ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు.. ఓ  రోజు తమాషాగా ఆ అమ్మాయిని “నువ్వు కనుక నన్ను ప్రేమించకపోతే ఇదిగో నేను ఈ  విషం తాగేస్తున్నాను..” అని యాక్ట్ చేసి ఏదో తాగినట్టుగా నటిస్తూ వీడియో కాల్ చేసి, ఫోన్ పెట్టేశాడు.

ఆ అమ్మాయి నిజంగానే వీడేదో తాగేసాడని భయపడిపోయింది. కళ్ళ ముందు జరిగిన సంఘటన అబద్దం అనుకోలేదు. ఆ రాత్రి గడిస్తే తెల్లారి వాడి మరణం వార్త  వినవలసి వస్తుందేమోనని భయపడిపోయి ఆ అమ్మాయి కూడా ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నదని తర్వాత తెలిసింది. ఈ విషయాన్ని వాడు ఊహించలేకపోయాడు. కుంగిపోయాడు. ఊరు ఊరంతా వాడిని, వాడి తల్లిదండ్రులను విపరీతంగా నిందించారు. పంచాయితీ పెట్టి నెలరోజుల్లో కొన్ని లక్షల తప్పు కట్టమని తీర్మానించారు.

దాదాపు నెల రోజులపాటు ఊరి వారంతా వాడిని చంపేసినంత పనిచేశారు. సరిగ్గా నెలరోజులకు ఈ సంఘర్షణ తట్టుకోలేక వాడూ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు గర్భ శోకం మిగిల్చాడు. ఇదంతా నాకు ఎప్పటికో తెలిసింది. వాడి చురుకుతనం చూసి వాడి ప్రాక్టికల్ జోక్స్ చూసి, వాడి పట్టుదల చూసి.. వాడు ఎంతో పైకి వస్తాడనుకున్న నాకు తీరని దుఃఖం మిగిలింది.

ఎందుకిలా జరుగుతున్నది అని ప్రశ్నించుకుంటే..

పిల్లలలో జీవన నైపుణ్యాలను, జీవితేచ్ఛను, పెంపొందించలేకపోతున్న తల్లిదండ్రులు.. సమాజం..

మార్కులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే విద్యా విధానాలు.. దూసుకుపోతున్న సాంకేతికత.. ప్రభుత్వం ఇవ్వన్నీ.. అకస్మాత్తుగా పిల్లలు తీసుకునే నిర్ణయాల ముందు పేలవంగా నిలబడిపోయాయి.

*

సమ్మెట ఉమాదేవి

2 comments

Leave a Reply to చిట్టత్తూరు మునిగోపాల్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆ కుర్రాడు మొదటిసారి సాటి పిల్లల్ని ప్రాంక్ చేస్తానని మిమ్మల్ని అడిగినప్పుడే మీరు నో అని చెప్పి ఉండాల్సింది. ఇంతకన్నా రాయడానికి మనసొప్పడం లేదు. పరోక్షబాధ్యత అనేది కూడా ఉంటుంది.

  • ఒక టీచరుగా మీరు ఆ కుర్రవాడి ప్రాక్టికల్ జోక్స్ వల్ల కలిగే ప్రమాదాలను వివరించి కట్టడి చేసి ఉండాల్సింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు