లాన్జైనస్ (Longinus) ఎవరూ? ఎప్పుడు జీవించాడు? సాహిత్య విమర్శలో అతని ఆలోచనలు ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వున్నాయి. లాన్జైనస్ ఒక పేరు తెలియని అనామక రచయిత. మొన్న మొన్నటి దాకా ఇతను పుట్టి పెరిగిన కాల, ఇతని అతీత్వం అనేక సంశయాల నెలవు. క్రీస్తు శకపు మూడవ శతాబ్దానికి చెందిన వాడని, కాస్సియస్ లాన్జైనస్ అనే ఒక అలంకారీకుడు అని, కాదు ఒకటవ శతాబ్దపు సాహిత్య విమర్శకుడు డయోనీసియస్ (డయోనీసియాస్ ఆఫ్ హాలీ కార్న్సస్) అనీ .. ఇలా ఎన్నో వాగ్వివాదాలు ఆయన చుట్టూ వున్నాయి. గత కొంత కాలంగా ఆయన వాడిన గ్రీకు భాషను విశ్లేషిస్తూ ప్రస్తుతం అతను ఒకటో శతాబ్దం వాడనీ నిర్దారణకు వచ్చారు. ఇతనికి సంబంధించిన తొలి ప్రస్తావనాలు ఒక పదవ శతాబ్దపు రాతప్రతిలో వున్నా, ఇది పదహారవ శతాబ్దపు ముద్రణ గానే మనకు లభ్యం అవుతున్నట్టు బ్రిటానికా వెబ్ సైటు సమాచారం చెబుతోంది. ఆ పదవ శతాబ్దపు రాతప్రతి లో ఇతని ప్రస్తావన డయానీసస్ లేదా లాన్జైనస్ అని లేదా డయానీసస్ లాన్జైనస్ అని ఉండడం కూడా ఈ వివాదాలకు కారణం అయ్యింది. ఇప్పటికీ అతని గురించిన అనేక సందేహాలు వున్నా సాహిత్యంలో అతని ప్రస్తావన మాత్రం అతని పేరుతో వున్న ఒక చిన్న పుస్తకం – “ఆన్ ది సబ్లైమ్” (On the Sublime) తో ముడిపడి వుంది.
సాహిత్య విమర్శ చరిత్రను కాలానుగుణంగా చూస్తే మనకు గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటల్ లతో ప్రారంభం అయ్యి, రోమన్ సాంప్రదాయ పండితులు హోరెస్, క్వింటిలియాన్ ల మీదుగా సాగుతున్న అనంతర కాలంలో ఒక విద్యుత్ లతలా, ఒక గ్రహాంతరవాసి సందేశంలా వొచ్చాడు లాన్జైనస్. “పెరి హైప్సస్” లేదా “ఆన్ ది సబ్లైమ్” అనే ఇతని ఆ నాటి సాహిత్య చరిత్రలో ఒక మలుపు, ఒక సంచలనం. లాన్జైనస్ నిర్వచనం ప్రకారం “సబ్లైమ్” అంటే “మహోన్నతమైనది” లేదా “ఊత్కృష్టమైనది” అని. అలాంటి ఒక మహోన్నతమైన, ఉత్కృష్టమైన ఆత్మ ప్రతిధ్వనియే సాహిత్యం అంటాడు లాన్ జైనస్. లేదా అలాంటి మహోన్నతమైన, ఉత్కృష్టమైన లోకాలకు పాఠకుణ్ణి తీసుకెళలేదే సాహిత్యం అంటే అంటాడు. సాహిత్యం మీద సిద్ధాంత గ్రంధం లాంటి ఈ పుస్తకం వేమన కదా అభిరాముడితో చెప్పేనట్టు గ్రీకు భాషలో పోస్తుమియాస్ తెరెన్షియస్ అనే వ్యక్తిని సంబోధిస్తూ చెప్పినట్టు వుంటుంది. అయితే ఇది ప్రధానంగా అంతకు ముందు హోరెస్ రాసిన “ఆర్స్ పోయేటికా” కు సమాధానం లేదా స్పందన. ఈ సంభాషణాత్మక రచనలు అటు గ్రీకు సాహిత్యంలోనూ, మన ఉపనిషద్ ల లాంటి రచనలలోనూ సర్వసాధారణం. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ “ఆన్ ది సబ్లైమ్” కూడా సంపూర్ణంగా అందుబాటులో లేదు.
కేవలం ఒక ముక్కగా అందుబాటులో ఉన్న ఈ పుస్తకం కూడా ఈ రచయితను, అందులోని ఆయన తార్కికత, గాఢత, లోతుల పరంగా అరిస్టాటల్ తో సమాన స్థాయిలో కూర్చోబెడుతుంది అంటారు బిర్జాదీశ్ ప్రసాద్ తన “యాన్ ఇంట్రోడక్షన్ టు ఇంగ్షీషు క్రిటిసిజం” (1965) రచనలో. స్వయంగా ఆలంకారికుడైన లాన్జైనస్ ఈ పుస్తకంలో ప్రధానంగా సాహిత్యంలో “సబ్లిమిటి” అనే అంశంపై చర్చిస్తాడు. సబ్లిమిటి అనే పదం తెలుగులో “ఉత్కృష్టత”, “మహత్వం”, ‘ఘనత” “మహోన్నతము” “చాలా గొప్పదైనది” లేదా ఆశ్చర్యపరిచే సౌందర్య, స్థాయిని సూచిస్తుంది. మన దేశపు సాంప్రదాయ సాహిత్య పరిభాషలో ‘సత్యం, శివం, సుందరం’ అంటే సత్యమైనదే మంచిదైనది, అదే సుందరం.
లాన్జైనస్ కు ముందు సాహిత్యం అనేది ప్రధానంగా కవిత్వం, నాటకం (విషాద, సుఖాంతాలతో సహా). ముఖ్యంగా కవిత్వం అనే విషయానికి సంబంధించిన సూత్రీకరణ లో కవిత్వపు ఉద్దేశ్యం, మనుగడ, అస్తిత్వం ఏదో ఒక విషయాన్ని ప్రబోధించడం, లేదా ఆనంద కారణం, లేదా రెండూనూ. స్కాట్ జేమ్స్ అనే సాహిత్య విమర్శకుడు దీన్నే “ప్రేరణ పొందిన గాయకులు, అద్భుతమైన చరిత్రకారులు, ఉద్వేగభరిత వక్తలు, గాఢత గల తత్వవేత్తలు .. అందరి ప్రయత్నాలు .. బోధించడం, ఆనందింపచేయడం, లేదా ఇష్టపడేట్టు చేయడం లేదా తమ వైపు ఆకర్షించడం” అంటాడు (జేమ్స్ స్కాట్ ఆర్.ఏ, “ది మేకింగ్ ఆఫ్ లిటరేచర్”). లాన్జైనస్ ప్రధానంగా ఈ నమూనాను ప్రశ్నించాడు.
ఆనాటి హోమర్ లాంటి పురాణ రచయితలు, శాప్పో, పిండార్ ల లాంటి గీత రచయితలు, ఈస్చిలస్, సోఫోకల్స్ లాంటి విషాద కావ్యాలు రాసిన వారు, డెమోస్థినస్ లాంటి వక్తలు శాశ్వత కీర్తిని, గుర్తింపును పొందింది, బోధించడం, ఆనందపరచడం ఆధారంగా మాత్రమే కాదనీ అది ప్రముఖంగా వారు తమ సాహిత్యాన్ని సర్వోత్కృష్టమైన ఆత్మావిష్కారంగా భావించడమే అంటాడు లాన్జైనస్. బోధన, ఆనందం అనేవి అవసరమైనా అవే సాహిత్యపు శాశ్వతత్వాన్ని ఇవ్వవనీ అంటాడు. సాహిత్యం కలకాలం పాఠకుల హృదయ రాజ్యాలను ఏలాలంటే దానికి మరో ప్రధాన లక్షణం వుండాలి. దీనినే ఆయన “సబ్లిమిటి” అనే భావనతో వివరించాడు. సబ్లిమిటీలో భావప్రకటనలోనూ, రూపంలోనూ కొన్ని ప్రత్యేక లక్షణాలు, సంపూర్ణమైన విశిష్టత వుంటుందీ అనీ, ఆ ప్రత్యేక భావ లక్షణాలు, రూపమే గొప్ప కవులూ, రచయితలకు, వారి సాహిత్యానికి ఔన్నత్యాన్ని, ఆనంతత్వాన్ని ఇస్తాయి అంటాడు. తన వాదనతో అవతలి వ్యక్తిని అంగీకారం వైపు తీసుకెళ్ళే బదులుగా అది పాఠకుణ్ణి తన నుండి తాను విడివడి మరింత ఉన్నత శిఖరాల వైపు తీసుకెళుతుంది అనేది ఇందులో ప్రధాన సూత్రీకరణ.
సాహిత్యంలో ఈ ఉత్కృష్టతకు బీజాలు ప్రకృతి లోనూ, కళలలోనూ వుంటాయి. ప్లేటో చెప్పినట్టుగా కళ కేవలం ప్రకృతి అనుకరణ, ప్రతిబింబం కాదని, అలాగే ఆనాటి అనేక మంది సాహిత్య విమర్శకులు అన్నట్టుగా అది సహజంగా వ్యక్తిలో వుండాలని, నేర్చుకుంటే, నేర్పిస్తే రాదనీ అన్న భావాలను కూడా తిరస్కరిస్తాడు. ప్రకృతిలో ఒక అందమైన, ఉన్నతమైన క్రమం ఉందనీ, దానిని ఆవిష్కరించడం కవీ, రచయితల కర్తవ్యం అనీ అంటాడు. కళలు ప్రకృతికి వ్యతిరేకంగా లేదా అనుకరణగా కాకుండా, ప్రకృత్తికి దగ్గరగా లేదా ప్రకృతితో సమానంగా, సమాంతరంగా ప్రయాణం చేయగలదు, చేయాలి అంటాడు. ఆసలు ప్రకృతిలా మారినప్పుడే కళలు సంపూర్ణ రూపం తీసుకుంటాయి అని ఆయన అభిప్రాయం.
పై సాధారణ ప్రాతిపదకల ఆధారంగా లాన్జైనస్ ఈ సబ్లిమిటీకి ఐదు ప్రధాన సూత్రాలు ప్రతిపాదిస్తాడు – అవి 1. ఆలోచనల ఔన్నత్యం, 2. బలమైన భావోద్వేగాలు, 3. సముచిత అలంకార ప్రయోగం (సరైన వ్యక్తీకరణ రూపాలు), 4. ఉదారమైన పదాలు, 5. కూర్పులో గంభీరత. వీటన్నింటి వెనకాలా భాషపై సాధికారికత, పట్టు, నైపుణ్యం, విశేషమైన కృషి వుంటుంది అనీ అంటాడు. అంటే ఏ కవీ, సాహిత్య వేత్త అయినా తన భాషపై, సాహిత్యంపై సాధికారికతను కలిగి వుండాలి అనేది ఈయన మరో ప్రతిపాదన.
- ఆలోచనల ఔన్నత్యం: ఆలోచనాలలో ఔన్నత్యం లేని ఏ సాహిత్యకారుడూ ఉన్నతమైన, ఉత్కృష్టమైన సాహిత్యాన్ని సృష్టించ లేడు. ఎందుకంటే సబ్లిమిటీ అనేది కవీ, రచయిత ఆత్మకు ప్రతిబింబం. ఆత్మలో లేని ఔన్నత్యం అతని సాహిత్య ఉత్పత్తిలో కనబడదు. నీచమైన, తల ఒగ్గి బ్రతికే బ్రతుకుల నుండీ, అలవాట్ల నుండీ ఉపయుక్తమైన, అభినందనీయమైన సాహిత్యం రాదు. ఇవన్నీ కొంత మేర మానవ సహజమైన, సహజాతమైన విషయాలైనా సరైన క్రమ శిక్షణ, ఉన్నత సాంగత్యం, అధ్యయనం ద్వారా కూడా ఉన్నతమైన విలువలను సంపాదించవచ్చును అనేది ఈయన ప్రతిపాదనలలో మరో ముఖ్యమైన విషయం. జాన్ మిల్టన్ కూడా ఎవరైనా వ్యక్తి ఒక గొప్ప కవి కావాలంటే ముందు తాను గొప్ప వ్యక్తిగా మారాలి అంటాడు అని డేవిడ్ డయిచెస్ అనే అతను తన “క్రిటికల్ అప్ప్రోచేస్ టు లిటరేచర్” అనే పుస్తకంలో అంటాడు.
- బలమైన భావోద్వేగాలు: ఈ విషయంలో లాన్జైనస్ ప్రాధమికంగా ఏమన్నాడో తెలియటం లేదు. ఎందుకంటే అతని రచనలోని ఆ భాగం దొరకడం లేదు అంటారు. పుస్తకం చివరలో దీన్ని గురించి ప్రస్తావిస్తాను అని అన్నాడట. కానీ అది అందుబాటులో లేదు. అయితే ఇతర భాగాలలోగల ముక్కలను పేర్చి చూస్తే “సరైన సందర్భంలో బలమైన భావోద్వేగాలు సాహిత్యాన్ని మహిమాన్వితం చేస్తాయి” అని చెప్పినట్టు అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగమే పదాలకు ఉత్సాహాన్ని ఇచ్చి అందులో దైవత్వాన్ని ఇముడ్చుతుంది, కూరుతుంది అంటాడు. ఈ పరీక్ష ఆధారంగానే అతను ఒడిస్సీ కంటే యిల్లియాడ్ ను, సిశిరో కంటే డెమోస్థనీస్ ను తాను ఇష్ట పడేలా చేశాయి అంటాడు. అయితే ఈ భావోద్వేగాలు నిజమైనవిగా వుండాలి, కృత్తిమంగా, అరువు తెచ్చుకున్నవి కాదు అంటాడు. అది కూడా అవసరమైన స్థానాలలోనే ఉండాలి అంతే కానీ అసందర్భంగా కాదు అంటాడు. ప్లేటో అనేక రకమైన భావోద్వేగాలను అపనమ్మకంగా చూస్తాడు. అరిస్టాటల్ వీటిని అవి కలుగ చేసే ప్రక్షాళన, విడుదలల తీవ్రత ఆదారంగా సమర్ధిస్తాడు. కానీ లాన్జైనస్ దాన్ని అది కలిగించే కళాత్మక చలనాన్ని, నైతిక ఎదుగుదలను చూస్తాడు.
- సముచిత ఆలంకారిక ప్రయోగం: సబ్లిమిటిని మరింత పరిపుష్టం చేసేది సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన అలంకార ప్రయోగం. ముఖ్యంగా సందర్భం ముఖ్యం అంటాడు. లాన్జైనస్ ప్రధానంగా ఆలంకారికుడు. అందులోనూ ఆయన ప్రధాన విషయం ఉపన్యాసాలు. అది కూడా ఒక మహత్వాన్ని సృష్టించే పని. “ఒక అలంకార ప్రయోగం కొంత దాగి వున్నప్పుడే దాని ప్రభావశీలత మరింత వికాశిస్తుంది” అంటాడు. అది దేని వెనకాల దాగి వుండాలి? శైలి వెనుకాల దాగి వుండాలి. సబ్లిమిటిని సృష్టించడంలో ఆలంకారిక ప్రశ్నలు, పదాలు, పదబంధాలు, సంయోగాలు, లయ, అతిశయోక్తి, నర్మగర్భంగా వుండడం, .. లాంటివి చాలా ఉపయోగపడతాయి అంటాడు.
- ఉదారమైన పదాలు: భాషలో ఎంత ప్రవేశం వుంటే అన్ని పదాలు కవీ, రచయితకు బలాన్ని కలిగిస్తాయి. అందులోనూ వున్నతమైన భావలు వున్నతమైన పదాలను కోరుకుంటాయి. వీటిలో రెండు ముఖ్యమైనవి: 1. సరైన పదాల ఎంపిక, 2. రూపకాలు అంటే సరైన పోలీకల ఎంపిక. చక్కని రూపకాలు భాషకు ఆభరణాలు. అయితే ఈ విషయ చర్చలో నాలుగు పజీలు మాయం అవ్వడం వల్ల లాన్జైనస్ వీటి గురించి ఏమీ వివరణ ఇచ్చాడో తెలియడం లేదు. అయితే మిగిలిన పజీలలోనే కొంత స్పష్టత కూడా వుంది అంటారు సాహిత్య చరిత్రకారులు. సరైన, సూటి అయిన పదాలు పాఠకుడిని కవి వైపు లాక్కుంటాయి, చలనాన్ని కలిగిస్తాయి. అవే కవి ప్రత్యేక శైలికి కారణం అవుతాయి అంటాడు.
- కూర్పులో గంభీరత: పదాల కూర్పు సాహిత్య సృష్టిలో అతి ముఖ్యమైన, చివరి అంశం అంటూ అది ఆలోచనలను, ఉద్వేగాలను, రూపకాలను, పదాలను ఒక పూల మాలను దారం బంధించినట్టు బంధిస్తాయి అంటాడు. మొదటి నాలుగు అంశాలనూ సామరస్యం చేసేది ఈ కూర్పులో గంభీరత అంటాడు. కూర్పు లోని ఈ గంభీరతే పాఠకుణ్ణి ఒప్పించడమే కాదు, అతనిలో ఆనందాన్ని నింపుతుంది. అతన్ని ఉన్నత లోకాలలోకి తీసుకెళ్ళి వినూత్న విషయాలను పరిచయం చేస్తుంది అంటాడు.
లాన్జైనస్ తో తన ముందు వున్న ప్లేటో, అరిస్టాటల్, హోరెస్, క్వింటిలియాన్ ల సాంప్రదాయక యుగం ముగిసి, సరికొత్త భావ విప్లవానికి తొలి బీజం పడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే గతంతో ఒక బంధ విముక్తి వచ్చింది. అతని కొత్త పనిముట్లు, ఆధారాలు సాహిత్య విమర్శకు కొత్త ఊపిరులు పోసింది. అతని భావనలలో మరో ముఖ్యమైన అంశం “ట్రాన్స్పోర్ట్” అంటే పాఠకుణ్ణి మరో ఉన్నత లోకంలోకి రవాణా చేయడమే సాహిత్య ఉద్దేశం అంటాడు. పాఠకుడికి నీతి బోధన చేయడం, ఆహ్లాదం కలిగించడం, ఒప్పించడం వంటి ఆనాటి సాంప్రదాయ సాహిత్య పరిధి దాటి ఉన్నత లోకాలకు తీసుకెళ్ళే ఉత్కృష్ట ప్రక్రియే సాహిత్యం అంటాడు లాన్జైనస్ 2000 ఏళ్ల క్రితమే. ఆయన ఉద్దేశ్యంలో సాహిత్య సృష్టి అనేది ఉత్కృష్ట ఆత్మ ధ్వని. ఆ ప్రక్రియలో అది సాహితీవేత్త తో పాటూ పాఠకుణ్ణి కూడా ఉన్నత, ఉత్కృష్ట లోకాల వైపు తీసుకెళ్ళే సాధనం.
*








Add comment