ఊరు యాదికొచ్చింది

టైము తొమ్మిది గూడ గాలే సూర్యుడు నిప్పుల కుంపటిలెక్క భగ భగ మండవట్టిండు. పాలు వోసేటోల్లు, పేపరోల్లు, కూరగాయ​​లోల్లు, పూలమ్ముకునేటోల్లు, పండ్ల బండ్లు.. జనాలతోని తీరుగగొట్టే గల్లీలన్ని ఆడివిల్ల బోషి మెడలెక్క గానొస్తున్నయ్.

లచ్చుమమ్మ శేతిల సంచి వట్కొని దీనంగ నడ్సుకుంట వొస్తుంటే, సంచిలున్న ఖాళీ టిఫిన్ డబ్బలు ఇయాల బువ్వ లేక బాధగ మూల్గవట్టినయ్. ఎన్నడు లేన్ది ఇయాల లచ్చుమమ్మ మనసు కాడువడినట్లున్నది. యేమ్ దోస్తలేదు. మస్తు బుగుల్వట్కుంది. రోడ్డు మీన రాయి గనవడ్తలేదు, రప్ప గనవడ్తలేదు. యెట్ల నడుస్తుందో గూడ ఆయిమెకే ఎర్కయితలేదు. నీళ్ల సుక్క లేక మెడలొంగిపోయి యాలడవడ్డ మక్కజొన్న కంకులెక్క గానొస్తుంది లచ్చుమమ్మ మొకం.

ఇంటికి వోవాల్నంటే బుగులైతుంది. పానమంత కశిబిశయితుంది. అడుగులు ముందర్కి వడ్తలేవు. ఇగ లాభం లేదని ఆడ్నే పక్కకు ఓ శెట్టు కింద రాయుంటే, పొయి దాని మీద కూలవడ్డది. ఇగ ఎట్లాంటాని శేతులు నల్పుకుంట ఆలోచన్ల వడ్డది.

లచ్చుమమ్మ వాల్లది కోస్గి పక్కకుండే శిన్న పల్లెటూరు. పెద్దమన్షి గాంగనే పెండ్లయ్యింది. ఇద్దరు మగవిల్లలను గన్నది. ఆమె మొగడు నర్సయ్యకు ఊర్ల రెండెకరాల పొలముండే. శాతనైనన్ని దినాలు పొలం పనులు జేస్కున్నరు. కాని రాన్రాను వర్షాలు మంచిగ వడక, పంటకు సరిపోను నీళ్ళు లేక త్యాపకు ఎండిపోవట్టింది నేల. పంట శేతికి రాక ప్రతి యాడాదీ నిరాశనే ఎదురైతుంది. ఇగ వొవ్సాయం కోస్రం అప్పులు జేయలేక ఆలుమగలు పసివిల్లలను దీస్కొని సొంతూరు ఇడిషి పట్నంకు వలసొచ్చిన్రు.

పట్నమొచ్చిన కొత్తల తిననీకే సక్కగ తిండి లేకపాయే, ఉండనీకే జాగ దొర్కకపాయే, మస్తు తిప్పలు వడ్డరు. ఇగ ఓ తాన ఓ పెద్దాయిన వాల్ల తిప్పలు జూశి, దయ దలిచి గింత జాగిస్తే చిన్న గుడిశె ఏస్కొని పసివిల్లలను వెట్టుకొని దిన దిన గండం లెక్క గడిపిండ్రు.

ఊరు గాని ఊర్ల దినాము పని కోస్రం కాళ్ళు కట్టెలయ్యేటట్టు దిరిగి దిరిగి నర్సయ్యకు యాసర్కొస్తుండే. చిన్న పని పెద్ద పని అంటాని లేకుండా యా పని దొర్కుతే గది జేశి పెండ్లమ్, పిల్లలను పోషించేటోడు. ఎట్లనో ఇకమతులు వడి కొన్నాళ్ళకు వాల్లను వీల్లను అడిగి కరంటు పని నేర్సుకొని నౌకరి దెచ్చుకున్నడు. కానీ కిస్మత్ బాలేకుంటే ఏమ్ జేస్తం! ఓనాడు కరెంటు స్తంభం యెక్కి రిపైర్ జెయ్యనీకే వోతే షాక్ గొట్టి ఓ కాలు, చెయ్యి వడిపోయినయి. ఇగ మల్ల కష్టాల కుంపట్ల వడ్డటయ్యింది కుటుంబం పరిస్తితి. గప్పట్సంది సుట్టుపక్కల ఇండ్లల్లకు పనికి వొయి లచ్చుమమ్మనే కుటుంబాన్ని పోషిస్తుంది. మొగడ్ని పసివిల్లగాన్లెక్క జూస్కుంటుంది.

లచ్చుమమ్మ పని జేశే గల్లీల అన్ని పెద్ద పెద్ద ఇండ్లు, అపార్టుమెంట్లే. వర్సగ తీరుగ గట్టిచ్చుకున్నరు. ఇండ్ల ముంగట పచ్చగ షెట్లు, రంగురంగుల పూలతోని ఖడక్ ఖడక్ గొడ్తది గల్లి అంతట. గల్లికి మూలమీన ఉండే అపార్టుమెంటులనే లచ్చుమమ్మ పని జేశేది.

పొద్దునైతే సాలు అపార్ట్మెంటుల పిల్లలు, పెద్దలు, సోరోల్లు.. అందరి నోర్లుల్ల నానేది లచ్చుమమ్మ పేరే.

రూపాయి బిల్లంత పెద్ద కుంకుమ్ బొట్టు వెట్కొని, తీరుగ కొప్పు జుట్టి, శేతుల నిండ గాజులు దొడుక్కొని, ముక్కుకు ఎర్ర రాళ్ళ ముక్కు పుల్లలు, కాళ్ళకు కడాలు వెట్టుకొని, నిండుగ పెద్ద ముత్తైదు లెక్కుంటది లచ్చుమమ్మ.

పొద్దున్నే ఇంట్ల పని జేస్కొని, పిల్లలకు, మొగనికి వొండి వెట్టి, అన్ని సక్కగ వెట్టి ఇగ పని కాడికి వోతది.

లచ్చుమమ్మ పనికొచ్చిందంటే ఇగ ఇంట్ల ఉండేటోళ్లకైనా, ఆఫీసులకు వోయేటోళ్లకైనా, అందర్కి మనసు కుదార్థంగుంటది.

ఇగ అపార్టుమెంటుల పష్టు ప్లోర్ల మూలకుండే ఇల్లుగలోల్ల రెండేళ్ల విల్లగాడు లచ్చుమమ్మంటే పానమిస్తడు. ఆమె పనికొచ్చిందంటే సాలు ‘లచ్చుమమ్మా..లచ్చుమమ్మా..’ అన్కుంట ఇగ వో‌‌ జోలి షురూ జేస్తడు. ఆమె పని జేశి పొయ్యేవరకు అమెంటనే దిరుక్కుంట ముచ్చట జెప్తడు. యాదన్న పని సక్కగ జేయకుంటే, “లచ్చుమమ్మా! గా మూలకు దుమ్ము వొయ్యిలేదు. గీ గిన్నెకు నూనె వొయ్యిలేదు. నా అంగికి షాకిలేటు వోయిలేదు” అంటాని పెద్దమన్షిలెక్క నడుముకు శేతులు వెట్టుకొని ఎంబడి వడి మరీ మల్ల మంచిగ జేపిస్తడు. ఇగ లచ్చుమమ్మగా పిల్లగాన్ని జూశి పకపక నగుతుంటది. ‘లచ్చుమమ్మ!లచ్చుమమ్మ’ అంటాని విల్శేటాలకు పానమిస్తది. “అబ్బ! ఎంత ముద్దుగ విలుస్తవ్ నాయిన! మా యప్ప చిన్న దొర” అంటాని మెటికెలు ఇరుస్తది.

ఇగ రెండో ప్లోర్ల లిఫ్ట్ పక్కకుండే ఇంట్ల ఓనాడు బిడ్డ పెండ్లి వెట్టుకున్నరు. వోల్ల పనామె సుస్తయ్యిందంటాని పనికొచ్చుడు బంజేశింది. ఇగ గాయమ్మకు కాల్లు శేతులాడలేదు. “లచుమ్మమ్మా! మా పనాయిమె రాకపాయే. పిల్లను పెండ్లి కూతుర్ని జేశేదుంది. సుట్టాలొచ్చిన్రు. నీకు పుణ్యముంటది. జెర గీ పది దినాలు మా ఇంట్ల పని జేయి తల్లి. ఎన్కసిరి రోజుల్లెక్క ఏసి పైసలిస్తలే. నాయమ్మ చేశిపో తల్లీ” అంటాని అడ్గవట్టింది.

“అయ్యో! గంతగానం జెప్పాల్నామ్మా! వొస్త ఊకో. నీవేమ్ ఫికర్ జేయకుండ పిల్ల పెండ్లి పనులు మంచిగ జేస్కో” అని జెప్పి గా పద్దినాలు పెద్ద ముత్తైద లెక్క దిరిగింది గా ఇంట్ల. ఇగ నడిపి ప్లోర్ల గా ఇల్లుగలోల్లకు మన్మరాలు వుట్టింది.”లచ్చుమమ్మా! జెర మా మన్మరాలుకి దినామొచ్చి తానం జేపిస్తవా? నెలకు రెండు వేలిస్తా. మోకాళ్ళ నొప్పులైనయ్. నాకు కింద గూకోని జెయ్యొస్తలేదు” అంటాని అడుగుతే “పైసలదేముందమ్మా! చేపిస్తలే” అని జెప్పింది. ఇగ దినాము గా పిల్లను కాళ్ళ మీద వండవెట్టుకొని, పాటలు వాడుకుంట మట్టగ నూనె రుద్ది, వేడి వేడి నీళ్లు వోషి తానం జేపిస్తే కుయిక్కుమనకుండ జేపిచ్చుకొని ఎండపొద్దు వరకు హాయిగ పండ్తది గా పిల్ల.

పైన ప్లోర్ల ఇద్దరు ముసలోల్లు. ఆలుమగలిద్దరే ఉంటరు. వాళ్ళింట్ల లచ్చుమమ్మ దినాము ఇల్లు ఊడ్షి తూడ్షి తీరుగ వెడ్తది‌. “లచ్చుమమ్మా! రొట్టెలు తినబుధైతుందే. నా షేతులు గుంజుతయి. మాయమ్మ. జెర రొట్టెలు గొట్టిచ్చిపోరాదే” అంటాని అడుగుతే కాదనకుంట దినాము వాల్లకు రొట్టెలు చేశిచ్చి పోతది.

కింద గూకోని, పిండి గలిపి, గాజులు ఎన్కకి నూకి పీట మీన దబ్బ దబ్బ గొట్టుకుంట రొట్టెలు జేస్తే కింది ప్లోర్లోల్లకు గుడంగ ఇనొస్తది. సన్నగ పూల రేకులెక్క గొట్టి పెనం మీన గాల్షిస్తే ఇగ కడుపునిండ కుదార్థంగ దింటరు ఆలుమగలిద్దరు.

ఓ పారి గిట్లే ఒకమ్మకు నెలల విల్లగాడున్నడు. ఆఫీసుకు తప్పకుండ వొచ్చి పోవాల్నంటే, పిల్లగాడ్ని యాడ వెడ్దునంటాని లచ్చుమమ్మ గుడిషె కాడికి వొయి “లచ్చుమమ్మా! నీకు పుణ్యముంటది తల్లి! ఆఫీస్కు రమ్మన్నరు. ఇంట్ల ఎవ్వరు లేరు. జెర ఇయాల్టికి పిల్లగాడ్ని నీతాన వేట్కోవా. తప్పకుండ రమ్మన్నరు. పోతే పిల్లగాడు ఆగమైతడు. పోకుంటే నౌకరి వోతది. ఇంట్ల పైసలకు చాన తిప్పలైతది. నీకు దండం బెడ్త లచ్చుమమ్మ” అంటాని కండ్లల్ల నీళ్లు వెట్టుకునేటాలకు లచ్చుమమ్మకు పానం కశిబిశయ్యింది.

“అట్లెనే తల్లి! నాతాన వెట్కుంటలే నీవు ఫికర్ జేయకుండ పోయిరా” అని ధైర్నం జెప్పి తోలింది.

ఇట్ల గా అపార్టుమెంటుల అందర్కి కాదనకుండ యా పనైనా జేషిచ్చి పోతది లచ్చుమమ్మ. సుక్రారం నాడైతే ఇండ్లన్ని తూడ్షి, గడ్పలకు నిండుగ పసుపు బండార్లు వెట్టి, ముగ్గేషి పోతే గా లచ్చిమ్ దేవొచ్చి గడ్పల కాడ గూసుందేమో అన్నంత తీరుగ గొడ్తయి ఇండ్లన్ని.

పని జేశినంక ఇంటికి వొయ్యేటప్పుడు కచ్చితంగ అందరు బువ్వో, కూరలో, రొట్టెలో.. ఇట్ల ఏముంటే గయి ఇచ్చి తోల్తరు. లచ్చుమమ్మ ఇంటికి వోంగనే ఆమె పిల్లలు ఆశగ “మాయమ్మ యేమ్ దేచ్చిందో ఇయాల..” అన్కుంట ఉర్కొచ్చి చేతిల సంచి గుంజుకొని పోయి టిఫిన్ డబ్బాలు తెరిసి జూశి, కడుపునిండ తింటరు. పెండ్లమ్ ఒక్కతే దినాము కష్టం జేషొస్తుంటే నర్సయ్యకు మనసు కలికలైతుంటది గాని “ఏమ్ జేత్తు? అంత నా తల రాత” అని కండ్లల్ల నీళ్లు వెట్టుకుంటడు.

ఇంట్ల యా కష్టమొచ్చినా “అమ్మోళ్లు, సారోల్లు అందరున్నరు గద మనకు. దేనికి ఫికర్ జేయాల్సినవసరం లేదు” అని మొగనికి ధైర్నం జెప్తుంటది.

యానాడన్న ఒక్క దినం లచ్చుమమ్మ పనికి రాకుంటే, ఇగ అపార్టుమెంటుల అందరు ఆగమాగం అయితుంటరు. “లచ్చుమమ్మ ఇయాల రాకపాయే యెందుకో” అని వాచ్మాన్‌కు పోన్ల మీద పోన్లు జేస్తుంటరు. ఇయాల పనికెందుకు రాలేదో కనుక్కొని రమ్మని వాల్ల గుడిషె కాడికి ఎవర్నన్న ఒక పోరగాడ్ని తోల్తరు.

అట్లాంటిది ఇయాల పొద్దుగాల పనికి వోయిన లచ్చుమమ్మను బయిటనే ఆపి, “గిప్పట్సంది పనికొద్దులే లచ్చుమమ్మ! గదేదో రోగమంట. అందరు ఇండ్లల్లనే ఉండాల్నంట. తగ్గినాక విలుస్తంలే” అని జెప్పిన్రు.

గా మాటినంగనే లచ్చుమమ్మకు గుండెల పిడుగు వడ్డట్టయ్యింది. ఏమ్ అర్థంగాలే. “పనికి వోకుంటే ఇల్లెట్ల గడవాలే? పిల్లల కడ్పులెట్ల నింపాలే? మొగనికి దవాఖాన ఖర్చులెట్లెల్లుతయ్” అంటాని లోపల్లోపల్నే బుగుల్వట్టింది లచ్చుమమ్మకు.

ఏమ్ జేయాలో దోచక శేతిల ఖాళీ టిఫిన్ డబ్బాలతోనే శిన్నగ ఇంటి బాట వట్టింది.

ఇట్ల అన్ని యాదులు సుట్టుముట్టినయి లచ్చుమమ్మకు. గుండె ధైర్నం జేస్కొని శిన్నగ లేషి గుడిషె కాడికి నడిశింది. ఇంటికి వోంగనే పిల్లలిద్దరూ ఉరుక్కుంటొచ్చి ఆమె శేతిలున్న సంచి దీస్కపోయి ఆశగ టిఫిన్ డబ్బాలు తెరిసి జూస్తుంటే, ఆమె తల్లి మనసు గింజుకలాడింది. బిడ్డల ఆకలి కడుపులు జూస్తుంటే పానం వోతున్నట్లు లోపట్లోపట్నే తన్నుకలాడింది. యేం జేయలేక గప్పుగ వొయి ఓ తాన కూలవడ్డది. ఆ రోజంతా ఇంట్ల ఎవ్వరితోని మాట్లాడలేదు.

పెండ్లామ్‌ను గమనిస్తనే వున్నడు నర్సయ్య. ఆమె ఏంటికట్ల వుందో ఏమ్ అర్థంగాలే ఆయినకు.

లచ్చుమమ్మ గా రాత్రి పండుకుంది కానీ నిద్రవట్టలేదు. గుండెల బుగులెక్వై గుణపాలు గుచ్చుతున్నట్లైతుంది. మబ్బులనే లేసి కూసోని ఏదో ఆలోచిస్తుంది. మధ్య మధ్యల తన పక్కన్నే నిద్రవోతున్న పిల్లల దిక్కు జూస్తుంది.

“లచ్చుమమ్మా” పండుకోకుండ తన మంచం పక్కకే కూసోని ఏదో ఆలోచిస్తున్న పెండ్లాన్ని పిల్షిండు నర్సయ్య. మొగని పిలుపుకు ఉలికిపడి పక్కకు తిరిగి జూసింది. ఆమె మొకంల యేదో దిగులు గానొస్తుంది. “పొద్దుగాల పనికాడికి వొయ్యొచ్చినప్పట్సంది జూస్తున్న. ఉలుకూపలుకు లేదు. దేని గురించో ఫికర్ జేస్తున్నట్టున్నవ్. ఏమైంది?” అడిగిండు.

నోరిప్పలేదు లచ్చుమమ్మ. ఇంగింత పర్శానయ్యిండు నర్సయ్య. “అడుగుతుంటే నోరిప్పవేందే? చెప్పు ఏమైందో! నన్నిట్ల పర్శాన్ల వెట్టకు” జరంత కోపం జేస్కుంట అన్నడు. శిన్నగ నోరిప్పింది లచ్చుమమ్మ. ఇట్ల సంగతని జెప్పి కండ్లల్ల నీళ్లు వెట్టుకుంది.

“ఏమ్ రోగమో ఏమో? ఎవ్వలు ఎవ్వల్ని గల్వొద్దంట. ఒకరింటికి ఒకరు వోగూడదంట. ఎవరిండ్లల్ల వాల్లుండాల్నంట. ఇగ మనకు దిక్కెవరు? నా బిడ్డల కడ్పులెట్ల నింపాలే? నీ గోలీలకు పైసలేడికెల్లి దేవాలే?” బోరుమన్నది లచ్చుమమ్మ.

పెండ్లాన్నట్ల జూషెటాలకు గుండెవల్గింది నర్సయ్యకు.

“గిప్పుడెట్ల! ఏమ్ జేత్తం! ఈడికే ఒక్కదానివే మస్తు తిప్పలు వడ్తున్నవ్ మా కోస్రం. మల్ల ఈ ఆపతొచ్చివడే. దీనికితోడు నీ బతుకుల నేనో నెత్తిన కుంపటిలెక్క అయితి గదే! పట్నం మోజుల వడి గా దినం నీవెంత మొత్తుకున్నా యినకుండ ‘అప్పులపాలు జేశే గీ పొలంతోని ఏమ్ తిప్పలు వడ్తం’ అని తల్లి లాంటి భూమినమ్మి ఈడికి దోల్కొచ్చిన. పట్నంల వుంటే బాగ సంపాయించొచ్చనుకున్న. కానీ ఈడికొచ్చినాక యానాడూ నిన్ను సుఖవెట్టక మంచంల వడ్తి. నీ మొకంల నవ్వు లేకుండ జేస్తి. అయినా నన్నొక్కమాట గిట్ల అనకుంట కష్టమో నష్టమో నీవే భరిస్తున్నవ్. గిప్పుడిప్పుడే జరంత మంచిగుంటున్నం అనుకుంటే మల్ల గిదేం ఆపతొచ్చి వడే?” వలవల ఏడ్వవట్టిండు.

“అట్లనకయ్యా! గా మాయదారి రోగమొచ్చిపడ్తే నీవేమ్ జేస్తవ్ జెప్పు? యేడ్సకూకో” అన్నది కొంగుతోని పెనిమిటి కండ్లొత్తుకుంట. ఆ క్షణం మొగనికి ధైర్నం జెప్పనీకే పైకి అట్ల అన్నదిగాని, గా తర్వాత దినాము ఊరును యాద్జేస్కొని యేడ్వని గడియ లేదు.

“ఊర్ల వుంటే పంట చేతికి రాకున్నా యాదో ఓ పని జేస్కొని బత్కుతుంటిమి. యా కష్టమొచ్చినా పాలోల్లు, సుట్టాలు, ఊరోల్లు అందరుంటరు. ఎవలకి తోచిన సాయం వాల్లు జేస్తరు. గీ పట్నంల ఎవలు వట్టిచ్చుకుంటరు? యెవరి బత్కులు వాల్లవి.” ఊరూ, అక్కడి మనుషులు, పొలం, గొడ్లు.. ఇట్ల అన్నిటినీ యాద్జేస్కొంగనే ఆమె గుండె చెరువైంది. గిప్పుడు తిరిగి ఊరికి పోదమన్నా పోలేని పరిస్థితి.

గుండె రాయి జేస్కుంది.

ఇగ ఇంట్ల వున్న నాలుగు నూకలతోనే దినాము ఒక్క పూటనే కడుపు నింపుకోవట్టిన్రు లచ్చుమమ్మ కుటుంబం. ఒకట్రెండు సార్లు అపార్టుమెంటోల్లు ఒకళ్లిద్దరొచ్చి రెండొందలో, మూడొందలో చేతిలవెట్టి పోయిండ్రు గాని, గయి నర్సయ్య మందులకు గూడ సాలలేదు.

రోజులు భారంగ గడిషిపోతున్నయి. సూర్యుడు దినామొచ్చి ఆయన పని ఆయన జేస్కొని పోతుండు గానీ, లచ్చుమమ్మ బతుకుల మాత్రం గింతంత యెలుతురు గుడంగ నింపలేకపోయిండు. శీకటి బతుకులైనయి వాల్లవి.

చేతిల పని లేదు, దుడ్లు లేవు. వాటితో పాటు లచ్చుమమ్మకు కండ్లనిండ నిద్ర గూడ లేకపాయే. ఒక్కతే ఊకె ఒంటరిగ గుడిశె బయిట కూసుంటది. మల్ల ఎప్పట్లాగ అందరు పనికెప్పుడు విలుస్తరో? పిల్లల కడుపులు తృప్తిగ ఎప్పుడు నింపుతనో అంటాని ఆశగ కండ్లు కాయలు గాషేటట్టు దినాము ఎదురు జూస్తుంది లచ్చుమమ్మ.

*

‌పాలమూరు గోస వినిపించాలని వుంది: స్ఫూర్తి

* నమస్తే స్ఫూర్తి గారూ! మీ గురించి చెప్పండి.

​నమస్తే! నా స్వస్థలం మహబూబ్‌నగర్. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా అక్కడే. పెళ్లి తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డాను. బయోటెక్నాలజీలో పీజీ చేసి, ఆరేళ్లపాటు సైంటిఫిక్ ఈ-జర్నల్స్ పబ్లిషింగ్ సంస్థల్లో మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశాను. బాబు పుట్టడంతో వాడికోసం ఉద్యోగం మానేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను.

* కథలు రాయడం ఎప్పుడు మొదలు పెట్టారు? ఆ ఆలోచన ఎలా మొదలైంది?

​వృత్తిరీత్యా మా నాన్న కందివనం రఘురామయ్య గారు జర్నలిస్ట్ అవడంతో పత్రికల కోసం కథనాలు రాసేవారు. ఆయన్ను అలా చూస్తూ పెరిగిన నాకు కూడా ఆయనలా రాయాలని ఉండేది. ఉద్యోగం చేసేటప్పుడు మా కొలీగ్స్ ఇంగ్లీష్ నవలలు చదవడం చూసేదాన్ని. అప్పుడప్పుడూ వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలు తీసుకుని తిరగేసేదాన్ని. నా ఆసక్తి చూసి మా వారు నాకు చేతన్ భగత్ ‘Half Girlfriend’ నవలను కొని బహుమతిగా ఇచ్చారు. అది చదివాక, నాకూ అలా నవలలు రాయాలనిపించింది. ఆ విధంగా రాయడం పట్ల ఆసక్తి కలిగింది.

* మొదటి కథ ఎప్పుడు రాశారు?

నేను మొదట ఇంగ్లీషు రైటప్స్, కథలు రాశాను. 2019 మొదట్లో ప్రతిలిపి యాప్‌లో ‘A Cool Summer Morning – My First Writing’ అని ఒక రైటప్ రాశాను. అదే నా తొలి రచన. దాదాపు 12 కథలు అక్కడే ఇంగ్లీషులోనే రాసిన తర్వాత తెలుగులో రాయడం మొదలు పెట్టాను. గృహిణి పడే ఇబ్బందుల నేపథ్యంలో ​’పాపం అమ్మ…!’ అనే మొదటి తెలుగు కథ రాశాను.

* మాండలికంలో కథలు రాయాలని ఎప్పుడు అనిపించింది?

రాయడం మొదలు పెట్టక ముందు నేను చాలా తక్కువ కథలే చదివాను. ​నా మొదటి నవల రాసేటప్పుడు అందులోని కొన్ని పాత్రలకు మాండలికం వాడాను. ఆ తర్వాత బతుకమ్మ మ్యాగజైన్‌లో ప్రచురితమయిన మాండలిక కథలు కొన్ని చదివాను. పూర్తిగా మాండలిక శైలిలో కథలు రాయవచ్చని అప్పుడే తెలుసుకున్నాను. అవి చదివేకొద్దీ నాకు వాటి మీద మరింత ఆసక్తి, ఇష్టం ఏర్పడ్డాయి. ఆ ఇష్టంతోనే రెండు మూడు మాండలిక కథలు రాసాక, వాటి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేసేదాన్ని. ఆ క్రమంలో పాకాల యశోదారెడ్డి గారి కథలు, పెద్దింటి అశోక్ కుమార్ గారి కథలు బాగా నచ్చాయి. తెలుగు సాహిత్యంలో పాలమూరు (మహబూబ్‌నగర్) మాండలికంలో చాలా తక్కువ రచనలే వచ్చాయని అనిపించింది. ఆ లోటు భర్తీ చేసేందుకు మా ప్రాంత యాసను ఉపయోగిస్తూ కథలు రాయాలనుకున్నాను. అయితే మాండలికంలోనే కాకుండా అన్ని రకాల కథలనూ రాసేందుకు కృషి చేస్తున్నాను.

* మీకు నచ్చిన రచయితలు? కథలు?

ముందే చెప్పినట్లు, నేను కథలు తక్కువగానే చదివాను. ఇప్పుడిప్పుడే మరింత చదివేందుకు ప్రయత్నిస్తున్నాను. ​నేను చదివిన వాటిల్లో శ్రీరమణ గారి ‘బంగారు మురుగు’ కథ నన్ను ఎంతగానో కదిలించింది. అంగులూరి అంజనీదేవి గారి నవలలు, సీరియల్స్ రెగ్యులర్‌గా చదువుతూ ఉంటాను. ఎంతో సహజంగా ఉంటాయి వారి రచనలు. పెద్దింటి అశోక్ కుమార్ గారి ‘కాగుబొత్త’ కథ, ‘జిగిరి’ నవల చాలా ఇష్టం. ఫలానా రచయితవి అని కాకుండా, మంచి కథ అనిపించేది ఏదైనా ఆసక్తిగా చదువుతాను.

* ఇప్పటి దాకా ఎన్ని కథలు రాశారు? పేరు తెచ్చిన కథలు?

ఇంగ్లీషులో 12, తెలుగులో 33 కథల దాకా రాశాను. అందులో ఎక్కువగా ప్రతిలిపి యాప్‌లోనే ప్రచురితమయ్యాయి. ఇంగ్లీషులో ‘Reincarnated’, ‘Don’t I Deserve Love…?, ‘Little Mintu-A Collection of Short Stories’, ‘A Bird in a Guilty Cage’ కథలు ఎక్కువగా పాఠకాదరణ పొందాయి. ‘Little Mintu-A Collection of Short Stories’ కథల మినీ సిరీస్‌కి బహుమతి కూడా గెలుచుకున్నాను. తెలుగులో నేను రాసిన మొదటి కథ ‘పాపం అమ్మ…!’కి మోమ్స్ ప్రెస్సో‌లో బహుమతి గెలుచుకున్నాను. నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన ‘కథ 2020’ పోటీలో నేను రాసిన ‘చీకటి వెలుగులు’ కథకు విశిష్ట బహుమతి లభించింది. రామోజీ ఫౌండేషన్, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కథా విజయం 2020’ పోటీకి నేను రాసిన ‘నాయిన చెప్పిన అబద్ధం’ కథకు ప్రోత్సాహక బహుమతి వచ్చింది. విశాలాంధ్ర-అరసం యువ కథా పురస్కారం 2021 కథల పోటీలో ‘నేను…మీ…!’, అర్చన ఫైన్ ఆర్ట్స్ కథామాలిక 2021 పోటీకి రాసిన ‘ఇంకా ఎందుకీ నిశ్శబ్దం’ కథలకు ప్రత్యేక బహుమతులు అందుకున్నాను.

* నవలలు కూడా రాశారు కదా?

అవును! ​’చైత్ర’, ‘ఒక మజ్ను కోసం’ అని రెండు నవలలు రాశాను. ఓ ఆడపిల్లపై ఆమె తండ్రి చూపుతున్న వివక్ష నేపథ్యంగా సాగే నవల ‘చైత్ర’. ​దీన్ని పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అందుకోసం రచయితలు శ్రీచరణ్ మిత్ర, ఉండవిల్లి. ఎమ్ గార్లు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా పబ్లిషింగ్‌కి సంబంధించిన విషయాల్లో ఎంతగానో సాయపడ్డారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ గారు ప్రతి సంవత్సరం నూతన నవలా రచయితలకు ఇచ్చే పురస్కారం కోసం ఆ నవలను పంపితే, దాన్ని చదివి ఆయన చాలా మెచ్చుకున్నారు. ​మరో నవల ‘ఒక మజ్ను కోసం’ను సిరీస్‌గా ప్రతిలిపిలోనే ప్రచురించాను. దాన్ని దాదాపు రెండున్నర లక్షల మంది పాఠకులు చదివారు.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

ప్రత్యేకంగా ఇది అని కాకుండా అన్ని రకాల అంశాలనూ కథలుగా రాయాలని ఉంది. నా కథల ద్వారా ‌పాలమూరు మాండలికాన్ని మరింత మందికి చేరువ చేసే ప్రయత్నం చేస్తాను.

*

స్ఫూర్తి కందివనం

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • యాసలో కథ చాలా బాగుందండి…అభినందనలు

  • ఊరు యాదికొచ్చింది టైటిల్ బాగుంది. నీదైన శైలితో..యాసతో కథను బాగా నడిపావు. లచ్చుమమ్మ పని కోసం అపార్టుమెంట్ వాళ్లంతా ఎదురుచూడడం…ఊరికి ఏదో రోగమొచ్చిందని కల్వకూడదని…చేతిలో పనులు లేకపోవడంతో దినం ఎట్లా గడుస్తదో అని దిగాలుపడుతున్న లచ్చుమమ్మ కష్టాల్ని కళ్ళకు కట్టినట్టు చక్కగా రాసావు.
    ఇదివరలో నేను ఇదే తరహాలో కోరిక అనే కథ చిన్న కథ మన తెలుగు కథలు లో రాసాను. కానీ…నీకథ బావుంది.

    పోతే…నీగురించి చదువుతుంటే చాలా గర్వంగా అనిపించింది. చిన్న వయసులోనే చక్కటి సాహిత్య ప్రయాణం సాగిస్తూ బహుమతులు గెల్చుకున్నావు. ఇదంతా మీ నాన్నగారి జీన్స్ నుంచి నీకు రావడం చాలా అదృష్టం. మీ పాలమూరు యాస చదవడం చాలా కష్టంగా వున్నా ఇష్టంగా చదువుతున్నాను. ఇంకా నువ్వెన్నో మంచి మంచి రచనలు చేస్తూ సాహిత్యంలో మణిపూసవవ్వాలని కోరుకుంటున్నాను.

    • యాస చదవడం కష్టంగా ఉన్నా ఇష్టంగా చదివినందుకు మరియు మీ ఆత్మీయ సమీక్షకు చాలా చాలా ధన్యవాదాలండి. 🙏

  • ఈ తరం ఇంగ్లీష్ చదువుల్లో పి.జీ చేసిన. యువ రచయిత్రుల్లో, ఉన్న ఊరిని ఎప్పుడూ యాదిలో ఉంచుకునేది మా స్ఫూర్తి గారే కదా..ఉన్న ఊరిని గుర్తు పెట్టుకోవడమే కాదు..ఆ యాసను,ఆ పలుకుబడిని యధాతథంగా చూపెట్టేది కూడా ఆమెనే… ఇప్పటి ఒక వేవ్ లో చాలా మంది మాండలికాన్ని అబ్యాసం చేసి రాస్తున్నా..తమ ప్రాంతపువారి వెనుకబాటు తనాన్నితమ యాసలోనే ఎక్స్-రే తీసి చూపించి గల సత్తా ఉన్న రచనలను ఆమె చేయగలరు అనిపించేలా రాయగలగడమే ఆమె ప్రతిభ అని ఆమె ముందు రచనలను చదివిన ఎవరైనా చెప్పగలరు.
    ఇక ఇప్పటి కథకు వస్తే.. పట్నానికి వెళితే మంచి జీవనోపాధి దొరుకుతుంది అనుకుని వెళ్లి ఏదో భంగపాటుతో మళ్లీ కన్నతల్లి లాంటి పల్లెను గుర్తుకు తెచ్చుకునే రొటీన్ కథే అయినప్పటికీ…..
    స్ఫూర్తి గారు మాండలికంలో…..చెప్పే వ్యధ ఎప్పుడూ సజీవమే….
    లచ్చుమమ్మ సేతిల సంచి వటకొని దీనంగా నడ్సుకొని వస్తాది. సంచిలున్న ఖాళీ టిఫిన్ డబ్బాలు…ఇయాల బువ్వలేక బాధగా మూల్గ బట్టినయ్.
    నీళ్ల సుక్క లేక మెడలోంగిపోయి యాలబడ్డ ముక్కజొన్న కంకులెక్క ……….లచ్చుమమ్మ మొకం… ఇలా ఇప్పటి తరం వారు రాయాలంటే కొంచెం కష్టమే…ఆ కష్టాన్ని ఇష్టంగా రాసే స్ఫూర్తి గారు ఇలాంటి జీవన చిత్రీకరణ భవిష్యత్తులో మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. అభినందనలు.

    • మీ ఆత్మీయ సమీక్షకు చాలా చాలా ధన్యవాదాలు సర్.🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు