పిచ్చి కృష్ణమూర్తి

(ఈ కథ 1956 ప్రాంతాల్లో భిలాయి ఉక్కు కర్మాగారం నిర్మాణదశలో నిజంగా జరిగిన కొన్ని సంఘటనలకు  కొంత కల్పన జోడించి  కీ.శే. శ్రీ రావి శ్రీ కృష్ణమూర్తిగారు  వ్రాసిన అముద్రిత కథ.) 

విజయనగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీ రావి శ్రీకృష్ణమూర్తి (6 జూన్ 1939- 2 జులై 2001), కేవలం SSLC వరకు చదువుకుని టైపు, షార్ట్ హేండు (హయ్యరు) పాసై భిలై కర్మాగారం నిర్మాణదశలోనే అక్కడ చేరి, స్వయంకృషితో ICWA, CA, LLB చేసి, తర్వాత FSNL లో OSD గా చేరి 1999లో పదవీ విరమణచేశారు. ఆ రోజుల్లో జ్యోతి, యువ మొదలైన మాసపత్రికలలో అతని రచనలు వచ్చేవి. భరాగో, అవసరాల రామకృష్ణరావులకు అనుంగు శిష్యుడైన శ్రీకృష్ణమూర్తి కథాసంకలనం “చాయాచిత్రాలు” కు జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు బహుమతి రావడం ఒక ఎత్తైతే, అందులో “వుమనీటర్స్” కథ నచ్చి బాపు ఆ పుస్తకానికి వేసిన ముఖచిత్రం మరొక ఎత్తు. తెలుగులోంచి 100 మంచి కథలను ఇంగ్లీషులోకి అనువాదం చెయ్యాలని అతని మేనల్లుడు NS Murty తో ప్రణాళిక వేసి మొదటి పుస్తకం “The Palette”(1997)లో తీసుకువచ్చారు. శ్రీ అల్లం శేషగిరిరావు గారి “మృగతృష్ణ” అనువాదానికి వారిద్దరూ Katha-British Council South Asian Translation Award 2000 గెలుచుకున్నారు.

*

‘పోస్ట్!

లేచి తలుపు తీసాను.

“మనియార్డరమ్మా! మీకే” అన్నాడు పోస్ట్ మేన్ ఫారం అందిస్తూ.

సంతకం చేసి ఇచ్చాను. పోస్ట్ మేన్ డబ్బులు లెక్క పెట్టి యిచ్చాడు. ఆనవాయితీగా ఆతనికిచ్చేది అతనికి యిచ్చేసి  డబ్బులు నా హేండ్ బాగ్ లో పెట్టుకున్నాను.  తిరిగి తలుపు వెయ్యబోతుంటే ఆయన ఇంటికివస్తూ కనిపించేరు.

“ఏమిటీ వింత? తిరుగు టపాలో వచ్చేసేరు, వంట్లో బాగోలేదా? ” అన్నాను, రాగానే.

“బాగోకేం? నిక్షేపంలా ఉంది. ఆఫీసులో అందరూ ఫ్రెంచి లీవు పెట్టి హాస్పిటల్ కి  పోతే నేనుకూడా ఫ్రెంచి లీవు పెట్టి ఇలా ఇంటికి వచ్చేసాను. అంతే!”

“అందరూ హాస్పిటలుకి వెళ్ళారా? ఎందుకూ? ”

“మరేం లేదు.  పి.  కృ. పోయాట్ట. శవాన్ని మార్చురీలో  ఉంచేరు. చూడ్డానికి వెళ్ళేరు ” అన్నారు చాలా యధాలాపంగా.

“అయ్యో! ఎప్పుడండీ? ” అన్నానేగాని, నాగుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది వార్త విన్నాక.

“పొద్దున్నే. పదిగంటల ప్రాంతంలో.”

“ఎలా పోయారటండీ?” కళ్ళనీళ్ళు ఆపుకుంటూ అడిగేను.

“ఏముందీ. ఎప్పటిలాగే  కళ్ళకు గంతలు కట్టుకుని రోడ్డు దాటబోయాడట. బస్సుకింద పడిపోయేడు.”

“వాళ్ళవాళ్ళు ఎవరికైనా కబురు పంపించేరా? లేదా?” తెలివితక్కువ ప్రశ్న అని తెలిసినా అడక్కుండా ఉండలేక పోయాను.

“కబురు పెట్టడానికి వాడికెవరున్నారే? పెళ్ళామా?… అదెప్పుడో వీడ్ని వదిలేసి లేచిపోయింది.. వాడివాలకం చూసిన అన్నదమ్ములు దగ్గరకు రానీలేదు. అసలు వాళ్ళెవరో, ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు.”

“మరి శవాన్ని మార్చ్యురీలో ఎందుకండీ ఉంచడం?”

“అంత్యక్రియలు చెయ్యాలి కదా! దానికి బోల్డు ఖర్చు అవుతుంది.  క్రియ చెయ్య డానికి అయితే నరసింహం తయారే కాని, డబ్బులుపెట్టడానికే ఎవరూ ముందుకు రావడంలేదు.”

“ఏం ఖర్మ పట్టిందండీ అతనికి! ఇంతమంది స్నేహితులున్నారు. అతనివల్ల అంతోఇంతో ఉపకారంపొందినవాళ్ళే కదా అందరూను.   అనాధ ప్రేతకు  సంస్కారం చెయ్య డానికి ఆమాత్రం ముందుకు రాలేరా?  పోనీ మీరయినా…”

నా నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది.

నేనసలు అనబోయింది…’ అతనికి మీరు మూడునెలల అద్దె బాకీ ఉన్నారు కదా! ఇలాగైనా ఋణ విముక్తి అవుతుంది గదా” అని.

కాని నా మీద ఒంటికాలి మీద లేస్తూ “నాకేం ఖర్మ? ఏ వరసకి చుట్టమని ఆ తద్దినం నెత్తిమేద వేసుకోవాలి?”

నాకు దుఃఖం  ఇక ఆగలేదు.  నాకళ్ళల్లో నీరుచూసి కోపంగా, “ఆపిచ్చోడు చస్తే నీకెందుకే ఏడుపు?  ఎవరో దగ్గర చుట్టం పోయినట్టు…” అంటూ లోపలికి విసవిసా వెళ్ళిపోయారు.

“దగ్గర చుట్టమేమిటండీ? నాకు తోబుట్టువుకాకపోయినా… తోబుట్టువులానన్ను ఆదరించేడు…” అని చెబుదా మనుకున్నాను.  కాని నూతిలో నీళ్ళలా మాటలు లోపల్లోపలే ఉండిపోయాయి.

దేశం ఎంత పురోగమిస్తున్నా, స్త్రీలు ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, ఆడదానికి గుర్తింపు ఇంకా ఇల్లాలిగా, తల్లిగా, వంటలక్కగా తన పాత్ర సవ్యంగా నిర్వర్తిస్తున్నంతసేపే.  నోరువిప్పి  అభిప్రాయాలు స్వతంత్రంగా చెప్పడమే! అందులోనూ భర్తను ఎదిరించి? ఇంకేమైనా ఉందా? కాపురం ముక్కలు కాదూ? నన్నేతీసుకొండి.  ఏనాటి సంగతి ఇది?  ముగ్ధగా , కొత్త పెళ్ళికూతురినై సంసార జీవన ప్రాంగణంలో అడుగుపెట్టబోతున్న వయసులో… మనుషుల బ్రతకనేర్చిన తనం  అవగాహన అయీ అవని  తరుణంలో … నా ఆశయాలకీ,  ఆవేదనలకీ, వేరే అభివ్యక్తి మార్గంలేక  ఈ రచనా మార్గం ఎన్నుకున్నాను తప్ప, ఎన్నడయినా నోరు విప్పి తప్పుని ‘తప్ప ‘ని  చెప్పగలిగానా? లేదే! నేనురాస్తున్న  నాలుగు ముక్కలూ  పాఠకులకీ, సంపాదకులకీ నచ్చబట్టీ, కాస్తంత పేరుతోబాటు ప్రవాసాంధ్రులలో కొంత గుర్తింపూ, పారితోషికాలూ రాబట్టీ నామానాన  నన్ను ఇలా ఉండనిచ్చారు గాని, లేకపోతే నా అభిప్రాయాలకు  ఆపాటి అవకాశమూ కరువైపోయుండేది.

* * * * * *

 

కాఫీ తాగేసి ఆయన బయటకు వెళ్ళిపోయేరుగాని, నా ఆలోచనలన్నీ పి.కృ. అంటే పిచ్చికృష్ణమూర్తిచుట్టూ తిరుగుతున్నాయి.  నలభై ఏళ్ళు కావస్తున్నా, ఆ మూడునెలల జీవితమూ… నిన్ననే జరిగినంత  స్పష్టంగా గుర్తొస్తోంది….

నాకు పెళ్ళయి అప్పటికి నెల్లాళ్ళయి ఉంటుందేమో!  దేశంకాని దేశం… భాషగానిభాష అయిన అప్పటి  మధ్యప్రదేశ్ లోని  భిలాయి స్టీలుప్లాంటులో ఈయనకి ఉద్యోగం.  అప్పటికింకా ఉక్కునగరం నిర్మాణదశలోనే ఉంది. సీనియారిటీప్రకారం కట్టిన కొద్దిపాటి ఇళ్ళూ ముందుచేరిన వాళ్ళకు ఇచ్చేసేరు. ఈయనికి ఇంకా ఇల్లు దొరకలేదు.  కలల ఆసరాతో దినమొక యుగంగా గడుపుతూ, కలలు వేగిరం పండించమని వెయ్యి దేముళ్ళకు మొక్కుకుంటూ పుట్టింటిలోనే ఉండిపోయేను.

అదిగో! అలాంటప్పుడు ఓ రోజు  వచ్చింది ఇతని దగ్గరనుండి  ఉత్తరం..’ ఇల్లు దొరికింది. వెంటనేరమ్మ’ని.  నేనూ, అమ్మా, నాన్నా ఇంటిడు సామానుతో బయలు దేరాం.  ఇద్దరికి ఇంతసామానెందుకే అంటే అమ్మ వినలేదు.  కొత్త పరిసరాల మీద ఆసక్తితో, కొంగ్రొత్త అనుభవాల ఊహలతో అదిరే గుండెలతో అడుగుపెట్టేను… నా నవజీవన ప్రాసాదం… భిలాయిలో.

ఆరోజు ఆదివారం. వస్తున్నామని ముందుగానే టెలిగ్రాం ఇచ్చినా ఈయన స్టేషనుకి రాలేదు.

నామనసేదో కీడు శంకించింది.

“ఎలాగండీ? అల్లుడు స్టేషనుకి రాలేదు? ‘ అంటున్న అమ్మ మొహంలో తొంగిచూసిన భయం నాదే.

“నువ్వుండు.” అన్న నాన్న చికాకులోనూ నా ఆందోళన ప్రతిధ్వనించింది.

స్టేషను మాస్టరు ఆఫీసువైపు వెళ్ళి , కాసేపటికి మరొక తెలుగు వ్యక్తితో కలిసి  వచ్చేరు నాన్న.  “ఈయనకి అల్లుడ్ని తెలుసునట. అతను ఉంటున్న ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పేరు.  పదండి.”  అంటూ రిక్షాలవైపు  దారి తీసారు.

“హమ్మయ్య!”  అని ఊపిరి పీల్చుకున్నాను.

దారిపొడవునా పెద్దపెద్ద చెక్కపెట్టెలూ, కొత్తగా పెయింటువేసినమెషిన్లూ తప్ప మరింకేం కనిపించడంలేదు.. సర్వాంతర్యామిలా అన్నిటిమీదాపరచుకున్న కెంధూళితప్ప! మనుషులుండేప్రాంతమేనని చెప్పడానికాఅన్నట్టు అక్కడక్కడ  జన సంచారం.  అనంతకాలం ప్రయాణించేం అని అనిపించేక ఒక చక్కటి ఇళ్ళ సముదాయం ముందు ఆగేయి మా రిక్షాలు.  ఒక ఇంటి తలుపుతట్టి నాన్న  నిలుచున్నారు. ఈయన ఆకారం నా కళ్ళముందు ఒకసారి కదిలింది.  ఆశగా ఆయనకోసం చూశాను.  తలుపు తియ్యగానే … కులకుల మని ఎందరున్నారో! డ్రాయర్లూ బనీన్లూ తప్ప ఒంటిమీద మరో ఆచ్ఛాదనలేనివాళ్ళు.  అంతా సుమారు ఈయన ఈడువాళ్ళే. అదే యూనిఫాంలో ఈయనా బయటకు వచ్చి, మమ్మల్ని చూసి, సిగ్గుతో లోపలికి పరిగెత్తేరు.  బట్టలువేసుకుని బయటకు వస్తూ,

“అదేమిటి? రావద్దని ఎక్స్ ప్రెస్ టెలిగ్రాం ఇచ్చానే, మూడురోజుల క్రిందట! అందలేదూ?” అన్నారు.

“రావద్దని టెలిగ్రామా?  మాకేదీ అందలేదు. ఇంతసామానుతోనూ వచ్చేసేం.”  అంది అమ్మ దిగులుగా.

“అనుకున్న ఇల్లు ఆఖరినిమిషంలో దొరకలేదు.” అతని సంజాయిషీ.

“అయ్యో!  పోనీలే.  ముందేదైనా హోటలుకి వెళ్దాం  పద. స్నానాలూ భోజనాలూ అయిన తర్వాత అలోచిద్దాం తీరికగా, ”  అన్నారు నాన్న.

“హోటలా? ఇక్కడ ఏ హోటల్సూ లేవండీ.  ప్లాంటు ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది కదా! అంచేత ఊరే లేదు ఇక్కడ.”

“ఇల్లు దొరక్కుండానే, తగుదునమ్మా అని రమ్మని ఉత్తరం ఎందుకు రాయాలి? ఆ ఇల్లేదో  తీసుకున్నాకనే రాయొచ్చుకదా!  ఇప్పుడేదీ దారి?  తిరిగి వెనక్కి వెళ్ళిపోవడమేనా?”  నేనే ఏదో అపరాధం చేసినంత బాధ ఒక వైపు,  వెనక్కి వెళ్ళడానికి అయిష్టత  ఒక వైపు తో నామనసు  క్రుంగిపోయింది.

“అయితే ఏమిటి చేద్దామంటావోయ్? ఈ కోలనీలో ఎక్కడా ఉండటానికి వీలు కాదంటావా?’ అనడిగేరు నాన్న ఆయన్ని.

“చూస్తూనే ఉన్నారుగదా, ఈ రెండుగదుల ఇంట్లో ఎంతమందిమి ఉంటున్నామో! ఈ ఇల్లు కంపెనీ వాళ్ళు నలుగురికి ఇచ్చేరు.  ఒక్కొక్కరికీ నలుగురేసి ‘గెస్టు ‘లతో వెరసి ఇరవై మందిమి ఉంటున్నాము. పోనీ ‘దుర్గు’లో ఉందామా అంటే, అది చాలా దూరం.  ఇళ్ళు కూడా మట్టి ఇళ్ళు. మనం ఉండలేం. ”

“సర్లే! ఏదో ఒకటి చేద్దాం. ముందు సామాను లోపల పెడదాం. పద!”  అన్నారు నాన్న.

మధ్యాహ్నం ఒంటి గంట దాటింది.  తాగుదామంటే ఏ స్టేషన్ లోనూ   టీ నీళ్ళు తప్ప కాఫీ చుక్క దొరకలేదు. తల బద్దలయిపోతోంది. ఆకలి దంచేస్తోంది. పైగా పడ్డ ఇంత శ్రమా బూడిదలో పోసిన పన్నీరయింది.  చక్కనిరోడ్లు, కాలువలతో ఉన్న నాలుగిళ్ళూ వరసగా ఎంతో ముచ్చటగా, డ్రిల్లుపీరియడు లో  బుధ్ధిగా నిలుచున్న బడిపిల్లల్లా ఉన్నాయి. ఇంత ముచ్చటైన ఊళ్ళో నాకింత జాగాదొరకలేదే అన్న నిరాశ నన్నింకా క్రుంగ దీస్తోంది.

వీళ్ళుంటున్న రెండుగదుల సత్రంలో నేలమీద జంబుఖానాలు పరుచుకుని అరడజనుమంది పడుక్కున్నారు.  “దీనికంటే  మన టర్నర్ సత్రం నయమే బాబూ!  ఎలా ఉంటున్నార్రా నాయనా, ఇంతమంది జనం! ఇలాంటిచోట సంసారమా? ఎలా ఉండగలం తల్లీ? నావల్లకాదంటే కాదు.” నిష్కర్షగా చెప్పేసింది అమ్మ … నెమ్మదిగానే.

“నిన్నుండమని ఎవ్వరూబలవంతం చెయ్యడంలేదుగానీ, ఆ కేరియరు  ఎక్కడుందో బయటకు తియ్యి. వెళ్ళిభోజనాలు పట్టుకొస్తాం.” అన్నారు నాన్న.

* * * * * *

 

“నమస్కారమండీ!”

నాన్నా, ఆయనా వెళ్ళిన కొద్దిసేపటికి  ఏదో కొత్త గొంతుక నమస్కారం అంటుంటే అటుతిరిగాను.

“నాపేరు వేణు. మోహన్ స్నేహితుణ్ణి.  వాడిప్పుడుదారిలో కనపడి మీరు వచ్చినట్లు చెప్పేడు. పాపం! మీకు చాలా ఇబ్బంది అయిపోయి ఉంటుంది,” అన్నాడు.  ఉంగరాలజుట్టూ, కళ్ళజోడూ, సన్నగా పొడుగ్గా ఉన్నాడు. అమ్మతో చనువుగా మాటాడేస్తున్నాడు.

“ఏం చేస్తాం నాయనా!అల్లుడు ఇల్లుదొరికిందని ఉత్తరం రాస్తే ఇంత సామానూ పట్టుకుని వచ్చేం. తీరా వచ్చేక చూద్దుంకదా, ఇదీ సంగతి!అంత డబ్బూ రైలు వాళ్ళ ఎదాన పోసి ఇంతదూరం వచ్చేక వెళ్ళిపోవడమంటే మాటలా?”

“నిజమేనండి! కానీ, పాపం మూడురోజుల క్రిందటే ఇచ్చేడండి టెలిగ్రాం… రావద్దని. అందులోనూ ‘ఎక్స్ ప్రెస్’  టెలిగ్రాం కూడాను.” అన్నాడు.

“ఏమో మరి! ఎందుకందలేదో భగవంతుడికి తెలియాలి! ఇక్కడ ఇల్లు చూద్దామా అంటే  ఇలాగుంది.  ఇక్కడకంటె నడిరోడ్డుమీద ఉండడం నయం. ఎలాగుంటున్నారో, శుచీ, శుభ్రం లేకుండా!.. అబ్బ! పశువుల కొట్టంలాగుంది.”

అమ్మ సంగతి నాకు తెలుసు. అందుకుందంటే దాని ఉపమానాల సంగతీ తెలుసు…  అందుకని చివరి మాటలు వినిపించకుండా మధ్యలోనే అందుకున్నాను, “అమ్మా, ఊరుకో! ఏమిటా మాటలు? ” అన్నాను. అతనుకూడా ఇక్కడుంటున్నాడేమోనన్న సంగతి తలుచుకుని భయమేసింది.

మామా అల్లుడూ, ఎలాగయితేనేం, మెస్సునుండి కేరియరులో భోజనం తెచ్చేరు.  భోజనాలయేక, పెట్టెలూ, సామాన్లూ,  ప్రక్కగదుల్లోకి చేర్చి, వంటింట్లో మాకు కొంచెం చోటు చేసేరు.  ‘ఇదేం సంతరా దేవుడా! ఇల్లంతా ఒకటే సిగరెట్టు కంపు. ఒంటికి కారంరాసుకున్నట్టుంది.” అని గొణుక్కుంటూనే అమ్మ నడుం వాల్చింది.  ఈయనా వేణూ చాలా సేపు తర్జన భర్జనలు పడ్డారు. సాయంత్రం అవుతుంటే మళ్ళీ  రిక్షాలు తీసుకువచ్చి  సామాన్లతోపాటు మమ్మల్ని ఎక్కించేరు. నాలుగైదు వీధులు దాటి రిక్షాలు ఒక ఇంటిముందు ఆగేయి. ఇంటికి తాళం వేసి ఉంది.  వేణు జేబులోంచి ఒక తాళాల గుత్తి తీసి, ఒకదాని తర్వాత ఒకటి తాళం కప్పలో దూర్చి, ఎలాగయితేనేం, పది నిముషాల తర్వాత తాళం తీసేడు.

మేం ఇంట్లోకి అడుగు పెట్టేం. ఇల్లు చూస్తుంటే ఆనందం మాట దేముడెరుగు, ఒక్కసారి నీరుగారిపోయేను.  అంతా వింతగా ఉంది. చిమ్మ చీకటి. కిటికీ అద్దాలకు కార్బను కాగితాలు అంటించి ఉన్నాయి.  కరెంటు ఉన్నా ఒక్క బల్బూ లేదు.  నేలంతా తడి.  నీళ్ళుతోడుకోవడం, పట్టుకోవడం బాధ లేకుండా, వంటింట్లో రెండు, కాంపౌండ్ లో ఒకటి, టాయిలెట్ లో ఒకటీ, నీళ్ళకుండీ దగ్గర ఒకటీ,  బాత్రూం లో రెండూ… ఇలా ఎక్కడ పడితే అక్కడ ఒక కొళాయి.  కానీ కొళాయిలన్నీ  విప్పేసి ఉన్నాయి.  పూర్తి ఫోర్సుతో నీళ్ళు పడుతున్నాయి. ఇల్లూ పెరడూ, నీళ్ళతో నిండిపోయి వరదైపోయింది.

ఎక్కడచూసినా  నీళ్ళు!    నీళ్ళు!!     నీళ్ళు!!!

“ఇదేమిటి!ఇలా కొళాయిలన్నీ ఇప్పి వదిలేసేరు? ఇల్లంతా నీళ్లమయం అయిపోయింది.  అమ్మాయ్! ముందా కొళాయిలన్నీ కట్టు.” అంది అమ్మ.

ఇల్లంతా పరికించి చూసేను. గదులు విశాలంగానే ఉన్నాయి. వంటిల్లు అమరిక గానే ఉంది.  పెరడూ పెద్దదే. ఒక్క మాటలో చెప్పాలంటే గృహిణి కలగనే స్వర్గం లాంటి ఇల్లు. కాస్త శ్రమ పడితే అద్దంలా  దిద్దుకో వచ్చు.

“ఈ ఇల్లు కృష్ణమూర్తని — మా స్నేహితుడిదే లెండి. ప్రస్తుతానికి వాడు ఊళ్ళోలేడు. వారం రోజుల వరకు రాడు.  అంతవరకు మీరు ఉండవచ్చు.  అతను ఒక్కడే ఉంటున్నాడు కూడా.  అతను వచ్చేక మీకు నచ్చితే  ఇక్కడ ఉండవచ్చు. అతనోగదిలో ఉంటే, మీరు రెండో గది వాడుకో వచ్చు.” అన్నాడు వేణు.

“పోన్లెండి. ఏదో ఒకటి దొరికింది, తిరిగి వెళ్ళిపోనవసరం లేకుండా.”   నా మనసు కొంత కుదుట పడింది.  ఇల్లంతా చిందరవందరగా, గుడ్డ పీలికలతో, చిల్లపెంకులూ, రాళ్ళూ, బూజులతో పాడు పడ్డ కొంపలా ఉంది. కానీ ఇకనుండీ ఇదేనా ఇల్లు.

ఎప్పుడు వెళ్ళేరో గాని ఈయన ఒక పనిమనిషిని వెంటబెట్టుకుని వచ్చేరు. ఇల్లంతా శుభ్రం చెయ్యమని పురమాయించేరు.  బయటకు వెళ్ళి మరో గంటలో రిక్షాలో వేయించుకుని  రెండు పరుపులూ, దిళ్ళూ, దుప్పట్లూ తీసుకు వచ్చేరు.  ఈలోగా వేణు ఫ్లాస్కులో వేడి కాఫీ తీసుకు వచ్చేడు. ప్రాణం లేచి వచ్చింది.

“మేం ఈ ప్రక్క వీధిలోనే ఉంటాం. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాటంలేకుండా అడగండి. రేపు మిమ్మల్ని  మా ఇంటికి తీసుకు వెళ్తాను.” అన్నాడతను.

అదిగో! అలా మొదలయింది నా సంసార జీవితం.

అమ్మా నాన్నా  ఇంకో రెండ్రోజులుండి, సంసారానికి కావలసిన  హంగులన్నీ సమకూర్చి వెళ్ళిపోయేరు.

వాళ్ళు వెళ్ళిపోయిన నాటి రాత్రి చెప్పారీయన అసలు సంగతి

— నాలో ఒక పెద్ద బాంబు పేలింది.

భయంతో కంపించిపోయాను.

“సంసారమూ వద్దు .. పాడూ వద్దు. నన్ను పుట్టింటికి పంపేయండ” ని ఏడ్చాను.

“బ్రతికుంటే బలుసాకు తినొచ్చ”ని బ్రతిమాలాడేను. “మా నాన్నకి ఈ విషయం చెప్పకుండా దాచి మోసం చేసే” రన్నాను. ఇంటి యజమాని ఏక్షణాన్న వచ్చి వాలుతాడోనని హడలి చచ్చిపోయేను.

అన్నింటికీ, ‘నేనున్నాను కదా!  నీకెందుకూ భయం? “అంటూ అనునయించేరు.  “ఇప్పుడు వెళ్ళిపోతే మూడేళ్ళదాకా వేరే ఉండవలసిందే” నని భయపెట్టేరు. “తెలిసినవాళ్ళను పట్టుకుని త్వరలోనే ఇంకో ఇంటికోసం ప్రయత్నంచేస్తా” నని మాట ఇచ్చేరు.  “మహా అయితే ఈ కష్టం ఎన్నాళ్ళు?  ఒక నెలో, నెలపదిహేను రోజులో భరిస్తే చాల”న్నారు.  ఇంకా నేను సందేహిస్తుంటే “అతను వచ్చేక నీకు నచ్చకపోతే , అలాగే పుట్టింటికి పంపించేస్తా”నని చేతిలో చెయ్యివేసేరు.

ఇంతకీ ఆయనబయట పెట్టిన విషయమేమిటంటే—- ఆ ఇంటిగలాయనకి ‘ పిచ్చి’ట ! ! !

అంతావిన్నాక అర్థమయింది … ఆ ఇల్లు మేం వచ్చేటప్పటికి ఎందుకు అలా ఉందో!

“ఇదేం ఖర్మరా భగవంతుడా!” అని అనుకున్నాను. నా పరిస్థితి ఒక సారి పర్యావలోకనం చేసుకున్నాను. నచ్చలేదని వెళ్ళిపోవడమా? ఏదయితే అదయిందని ఇక్కడే ఉండి పరిస్థితుల్ని ఎదుర్కోవడమా? ఈ ఇంట్లో ఉండలేనని  తిరిగి వెళిపోతే, మళ్ళీ ఎప్పుడో? చేతికందిన అవకాశాన్ని జారనివ్వకూడదని నాకునేనే  నచ్చజెప్పుకున్నాను. ధైర్యం పుంజుకున్నాను.  కానీ, ఆయన ఇంట్లోలేనపుడు ఈ ఘటం దిగబడితే?  ఆయనా నేనూ కూర్చుని సవివరంగా చర్చించుకున్నాము. ఆయన ఇంట్లో ఉన్నప్పుడే నేనూ ఇంట్లో ఉండడానికీ, ఆయన ఆఫీసుకి వెళ్ళగానే ప్రక్క ఇంటి శర్మగారి ఇంటికి వెళ్ళి సాయంత్రం ఆయన వచ్చేవరకూ ఉండడానికి నిశ్చయించుకున్నాం. అలా అయితే భయమూ ఉండదు, కాలక్షేపం అయినట్టూ ఉంటుందని.

వెనకాతల గది అతనికి వదిలేసి, మా సామాన్లన్నీ ముందు గదిలో సర్దుకున్నాం.  అప్పటినుండి మొదలైంది అతనిగురించి ఎదురుచూడ్డం.  నాలుగురోజులు సవ్యంగా గడిచిపోయేయి.

ఐదోనాడు రాత్రి భోజనాలు చేస్తున్నాం. ‘దడదడా’ తలుపు చప్పుడైంది. నాచేతిలోని ముద్ద కంచంలోకి జారిపడిపోయింది. భయం భయంగా ఆయనవైపు చూసేను.

“భయపడకు. నేను వెళ్ళి చూస్తాను,” అని లేచేరు.

నేను అటే చూస్తున్నాను. తలుపు తియ్యడమే  తడవు, గాలిదుమారంలా ‘రంయి’ మని లోపలకు దూసుకు వచ్చేడు. వస్తూనే లైట్లన్నీ గబగబా ఆర్పేసాడు. నాగుండె బేజారెత్తిపోయింది.

“ఉండండి! ఉండండి! ఏమిటిదీ? లైట్లన్నీ ఎందుకు ఆర్పేస్తున్నారు?” అన్నారాయన కంగారుగా. అనుకోని సంఘటనకు  బెదిరిపోయి  మళ్ళీ లైటు వేసేరు.  అతను తనచేతిలో ఉన్న గొడుగును తెరిచి లైటుకి అడ్దం పెట్టుకున్నాడు. ఒకతువ్వాలుగుడ్డ తలచుట్టూ కట్టుకుని అంచులు మొహమ్మీదా, కళ్ళమీదాపడేలా కప్పుకున్నాడు.

“మీరు కృష్ణమూర్తిగారేనా?” అడిగేరాయన. అతను “అవున”న్నట్టు తలూపేడు.

“కూర్చొండి. మీరు మమ్మల్ని క్షమించాలి. మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో ప్రవేశించడం ఎంత తప్పో నాకు తెలుసును. కాని, తప్పని పరిస్థితుల్లో అలా చెయ్య వలసి వచ్చింది. వీర్రాజుగారు వాళ్ళ ఇంట్లో ఉండమంటే మావాళ్ళకి టెలిగ్రాం ఇచ్చేను రమ్మనమని.   తీరా వీళ్ళువచ్చేసరికి  వీర్రాజుగారిఫేమిలీకూడా వచ్చేసింది.  ఎక్కడుండాలో తెలీనిపరిస్థితుల్లో వేణు మీ ఇంటికి తీసుకువచ్చేడు. కొద్దిపాటిరోజులు మమ్మల్నిక్కడ ఉండనివ్వండి. నాల్రోజుల్లో ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. ప్లీజ్!  మీకు అద్దెకింద జీతంలో ఎంత కోస్తారో అంతా నేనిచ్చుకుంటాను.  మీరు మా ఇంట్లోనే… ఐ మీన్, ఇక్కడ, మాతోనే భోజనం కూడ చెయ్యవచ్చు…. మీకు అభ్యంతరంలేకపోతే. ప్లీజ్! కాదనకండి. మేం ఈ ముందుగదీ కిచెనూ వాడుకుంటాం. మీకు ఏ ఇబ్బందీ కలుగనివ్వం.” అన్నారాయన.

అంతావిన్నాక చాలసేపు ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత చాలసేపు  ఆపకుండా  పెద్దగా పగలబడి  నవ్వేడు .  తర్వాత మళ్ళీ నిశ్శబ్దం అయిపోయేదు. ఒక కాగితం తీసి దానిమీద ఏదోరాసి చూపించేడు అది చదివిన తర్వాత మా ఆయన ముఖంలోకి మళ్ళీ వెలుగు వచ్చింది.

“చాల థేంక్సండీ!” అంటూ అతన్ని పక్క గదిలోకి పంపించి  తిరిగి వచ్చేరు.

“ఇంతకీ అతనేమన్నాడండీ!ఉండమన్నాడా? ఏం మాట్లాడకుండా ఊరుకుని ఒక్కసారలా నవ్వుతాడేమిటి? లైట్లన్నీ అర్పేసి తంతాడేమోనని భయపడి చచ్చేను.” అన్నాను గుసగుస స్వరంలో.  ఆయన నవ్వేరు.

“లైటు పడదుట అతనికి. ఎవరితోనూ మాట్లాడడుట. వేణుచెప్పిన సంగతి గుర్తుకొచ్చినా, ముందు నేనుకూడా హడలిపోయేను. ”

“ఇంతకీ ఏమంటాడు?”

అతను రాసిన కాగితం ముక్క నా చేతిలో పెట్టి “నువ్వే చూడు. కవిత్వం వెలిగించాడు!” అన్నారు, కోటలోపాగా వేసినంత సంబరంగా.

కాగితం విప్పాను. వంకర టింకర అక్షరాలతో ఇలా రాసి ఉంది:

మనం మనం బరం పురం.

కలిసే ఉందాం అందరం.

కష్టాలొస్తాయి అందరికీ,

తోడుండాలి కనీసం ఒక్కరికి!”

అతని మంచితనానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ కష్టంగట్టెక్కించినందుకు ఆ దేముడికి వెయ్యి దండాలు  పెట్టుకున్నాను.

ఇంతలోనే ఆ మానవుడు తనగదిలోకి బాల్టీడు నీళ్ళు తెచ్చుకుని అక్కడే స్నానం మొదలుపెట్టేడు. కొంత భయం కొంత ఆశ్చర్యంతో ఈయన వంక చూసేను. ‘ఊరుకొ’మ్మని సంజ్ఞచేసేరు.  అతని స్నానం అయేక గదిలోంచినీళ్ళు ఇల్లంతాపారుతుంటే, ప్రాణాలుఅరచేతిలోపెట్టుకుని, చీపురూ,గుడ్డా తీసుకుని తుడవడానికి ఉపక్రమించేను. అతగాడు నాముఖంమీదే ‘దభీ’మని తలుపు వేసుకున్నాడు. ‘బ్రతుకుజీవుడా’ అని పనిత్వరగాపూర్తిచేసుకుని ప్రక్కమీద వాలేను. ఎప్పుడేమవుతుందోనన్న బెంగతో రాత్రల్లా నిద్ర  పట్టనేలేదు.

* * * * * *

పరిస్థితులతో మనుషులు ఎంత వేగం రాజీ పడిపోతారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక విపత్కర పరిస్థితి ఎదురౌతుంది. జరగబోయేది ముందుగా ఊహించ గలిగినా, మనసంతా భయంతో నిండిపోయి, ఎలా ఎలా అన్న భయంతో కరచరణాలాడవు. తీరా ఆ విపత్తేదో వచ్చి మీదపడ్డాక ధైర్యం, శక్తీ ఎక్కడనుండి వస్తాయోగాని, దానిని  ఎదుర్కోనూ ఎదుర్కొంటాం. అంతకన్నావేగంగామారిన పరిస్థితులతో రాజీ పడిపోయి మళ్ళీ యధాప్రకారం జీవన ప్రవాహంలో ముందుకు సాగిపోతుంటాం.

ఆ పిచ్చివాడిరూపంలో ప్రమాదం ఎప్పుడు వచ్చిపడుతుందోనని  హడలిపోయినంతసేపు పట్టలేదు… ఆ వ్యక్తితో  అతనింట్లోనే సద్దుకు పోడానికి. మామూలు పరిస్థితులలోనైతే అతని ఛాయలకైనా వెళ్ళడానికి సాహసించని నేను, అతను చేసిన పిచ్చి పనులన్నీ సహిస్తూ మూడునెలలు ఎలా గడిపేనో తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అలాగని అతడేదో ఆగడాలు చేసేవాడని కాదు. నిజానికి కృష్ణమూర్తి చాలా   పెద్ద మనిషీ, మంచి మనిషీను. గదిలో స్నానం చెయ్యడం, చిల్లపెంకులు  ఏరుకుని వచ్చి గదిలో పోగుపెట్టడం, ఎలా అబ్బిందోగాని… సిగరెట్టు కాల్చడంలాంటి పనులు తప్ప అల్లరి చేసే వాడు కాదు.  తన గదంతా చీకటి చేసుకునేవాడు.  తలమీదనుంచి ముఖమీదకు వేలాడేలాగంతలు కట్టుకుని వీధులంట తిరిగేవాడు.  ఉదయం ఇల్లు వదిలితే మళ్ళీ ఏ రాత్రి పదిగంటలకోగాని ఇల్లు చేరేవాడు కాదు. వచ్చేటప్పుడు తనతో ఇంత మద్యం, మాంసం తెచ్చుకునేవాడు.  గదిలోకి పోయి ఒక్కడూ ఆరగించేవాడు. సిగరెట్టుమీద సిగరెట్టు కాలుస్తూ, ఏవో గట్టిగా మాటాడేవాడు. దేశరాజకీయాలమీదా, ఆర్థిక వ్యవస్థ మీదా ఇంగ్లీషులో అనర్గళంగా లెక్చర్లిచ్చేవాడు.  మంచినీటిప్రవాహంలా వచ్చే అతని లెక్చర్లు ఎంతో హేతు బద్ధంగానూ, విశ్లేషాత్మకంగానూ, అర్థవంతంగానూ ఉన్నాయని పించేవి. భాషమీద పట్టూ, విషయం మీద అతనికున్న పరిజ్ఞానం చూస్తే ఆశ్చర్యమేసేది. … అతన్ని చూస్తే ‘పిచ్చివాడికీ, మేధావికీ భేదం ఒకవెంట్రుకవాసే’  అని ఎవరో అన్న మాట నిజమనిపిస్తుంది.   మేధ ముదిరితే పిచ్చి అవుతుందేమో మరి!

అతని పిచ్చి నిజానికి ఇతరులనెవరినీ బాధించేరకం కాదు… ఒక్క  మా పక్కింటి శర్మగారిని తప్ప.  అతని వాలకం అట్టడుక్కి  దిగజారిపోయినపుడు మాత్రం … తన భార్యనీ, పక్కింటి శర్మగారినీ కలిపి బండబూతులుతిడుతుండేవాడు. నేలమీద దుప్పటీ పరిచి, నాలుగు కొనలమీదా చిల్లపెంకులు ఏరుకు వచ్చి జాగ్రత్తగా పేర్చే వాడు. పక్కింటి శర్మగారు తన గదిలోకి సొరంగం తవ్వేడనీ, అ సొరంగంలోంచే తన భార్యని ఎత్తుకుపోయేడనీ అంటుండేవాడు. ‘వాళ్ళు మనకు శత్రువులు. వాళ్ళతో మాటాడొద్ద’ని శాసించేవాడు. పెరట్లో రెండిళ్ళకీ మందడి గోడ దగ్గర నిలబడి వాళ్ళకి వినబడేలా గట్టిగా అరుపులూ, కేకలూ వేసేవాడు. శర్మగారు ఆఫీసుకు వెళిపోగానే గోడదూకి అతని భార్యని ఎత్తుకుపోతాననేవాడు. ప్రమాద వశాత్తూ శర్మగారు  దారిలో తారస పడితే ఇక చెప్పనక్కర లేదు.  గొడుగు ముడిచి, బల్లెంలా పట్టుకుని  రాకెట్ లా అతనిమీదకు దూసుకు వెళ్ళేవాడు. పాపం! శర్మగారయితే రెండిళ్ళకీ  మందడిగోడనానుకుని ఉన్న గదిని వాడడం మానేసారు. ఆ పిచ్చివాడితో ఎప్పుడేం ప్రమాదం వచ్చి పడుతుందోనని ప్రాణాలరచేతిలో పెట్టుకుని ఉండేవారు. నిజానికి పిచ్చి కృష్ణమూర్తి ఇంట్లో ఉన్న మాకంటే, ప్రక్కింట్లో ఉండే వాళ్ళే ఎక్కువ భయపడే వాళ్ళు. తెలుగువాళ్ళ పొరుగు కావాలని పక్క పక్క ఇళ్ళు తీసుకున్నందుకు ఏమీ చెయ్యలేక, మరోమార్గంలేక, బాధపడుతుండేవారు. మేం చేరిన తర్వాత  వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అడపా దడపా కూరలూ పచ్చళ్ళూ ఇచ్చి పుచ్చుకుంటూ, పగలంతా వాళ్ళ ఇంటిలో  నన్ను గడపనిచ్చి, ఎంతో  మంచిగా ఉండేవాళ్ళు శర్మగారూ, వాళ్ళావిడా.

వేణుకూడా అప్పుడప్పుడువచ్చి మంచీ చెడూ కనుక్కుంటుండేవాడు. అతనే ఒకసారి చెప్పాడు శర్మగారికీ, కృష్ణమూర్తికీ మధ్య వైరానికిగల కారణం: “ఈ కృష్ణమూర్తి మొదట్లో మిలిటరీలో పనిచేసేవాడు. మంచివాడు. భార్య అంటే వల్లమాలిన ప్రేమ. కాని ఆవిడకిమాత్రం ఇతనిపొడగిట్టేది కాదు. చిన్నప్పుడేవో  ప్రేమగొడవల్లోపడి తిరుగుడు అలవాటయిందామెకి. చివరికి ఇతన్నివదిలేసి ఎవడితోనో లేచిపోయింది. అతనికీ శర్మగారికీ ముఖంలో దగ్గర పోలికలుండేవట.  అందుచేత శర్మగారే తన భార్యను లేవదీసుకుపోయేడన్న భ్రమలో  అతనిమీద కసి పెంచుకున్నాడు. మీరు వచ్చేక అతని ధోరణిలో మార్పు వచ్చింది. వాగుడు చాలవరకు తగ్గింది. సభ్య ప్రపంచానికి తిరిగి వస్తున్నట్టుంది. ”

శర్మగారూ అదే మాట అన్నారు. ‘ మీరక్కడ ఉంటే కృష్ణమూర్తికి పూర్తిగా  బాగయ్యే అవకాశం ఉంది ‘ అని.

“ఇలాంటి పిచ్చివాడికి ఉద్యోగం ఎలా ఇచ్చేరండీ?  అతనేం పని చెయ్య గలడు?” అనడిగేన్నేను.

“అతను పనేం చేస్తాడు? అతనిమీద జాలికొద్దీ ఆఫీసులో అందరూ అతని పని సర్దుకుకుని నడిపిస్తున్నారు. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో తెలీదు.  ఏక్షణాన్నయినా ఉద్యోగం ఊడిపోవచ్చు”.

ఇప్పుడు నాకు ఇంకో బెంగ పట్టుకుంది. అతని ఉద్యోగం ఊడిపోయి, ఇల్లు ఖాళీ చెయ్యమంటే “మాగతేం కాను?”  అని. ఆశ్చర్యంగా లేదూ? ఒకటి రెండు నెలల క్రిందట  ఆ ఇంట్లో ఎలా గడపడం రా భగవంతుడా అని భయపడ్డ నేనే, ఇప్పుడు ఆ ఇల్లుపోతే ఎలారా భగవంతుడా అని బాధపడుతున్నాను.  ఆ ఇంట్లో సర్దుకున్నాక మరో ఇంటికోసం అన్వేషణ వెనక బడింది.  కృష్ణమూర్తిగారికిస్తానన్న అద్దె అతను అడగనూ లేదు… ఇతను ఇవ్వనూ లేదు.  నేనే ఒక సారి గుర్తు చేస్తే, ‘చూద్దాం, అడగనీ ‘ అని దాటవేసేరు.

* * * * * *

ఓ రోజు రాత్రి కృష్ణమూర్తి ఒక శుభలేఖ పట్టుకుని వచ్చి ఇచ్చాడు.  ఎక్కడ దొరక బుచ్చుకున్నాడో గాని,  అది మాకు వచ్చిందే.  మా తమ్ముడి పెళ్ళి కార్డు. ముందునుంచీ తెలిసిన సంగతే. శలవు పెట్టి ఒక వారం రోజులు ముందుగానే వెళ్దాం అనుకున్నాం. అయితే ఈ పిచ్చాయన  ఒక తంటా తెచ్చి పెట్టేడు.. “మనం మనం బరంపురం కదా— పెళ్ళికి నేను కూడా వస్తా” నన్నాడు. ‘సరేలెండి ‘ అన్నాం నిజంగా వస్తాడేమిటిలే అనుకుని.  మర్నాడు ఒక కాగితం మీద ‘మీరెప్పుడు బయలు దేరుతున్నారు? నేను శలవు తీసుకోవాలి ‘ అని రాసిచ్చేడు.   పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్టు, ఇతన్ని మాతో తీసుకెళ్ళడమా? ఇక్కడైతే తప్పదు కాని, అక్కడెలా ఇతడ్ని భరించడం? ‘స్వర్గానికెళ్ళినా… ‘ అన్న సామెతలాగయింది మా పరిస్థితి.

“ఏం చేద్దామండీ?” అన్నాను ఆ రాత్రి ఆయనతో.

“నువ్వు ఏం మాటాడకుండా ఊరుకో! నేను చూసుకుంటా. వీడిని కూడా తీసుకెళితే చెప్పనక్కరలేదు” అన్నారాయన.

మర్నాడు రాత్రి పదీ పదకొండు గంటల మధ్య ఏవేవో సామాన్లు  మోసుకొచ్చాడు కృష్ణమూర్తి. కాసేపయేసరికి,  అతని గదిలోంచి  పెద్ద పొగా, ఏవోగుడ్డలు కాలుతున్న వాసనా వస్తుంటే గాభరాపడి పరిగెత్తాం అతని గదిలోకి.

ఒక కుర్చీ మీద దుర్గాదేవి పటం పెట్టి ఉంది. మరొక కుర్చీమీద  కిలో నెయ్యి డబ్బా మూత తీసి అందులో ఒక జేబురుమాలు వత్తిలా చుట్టి  ముట్టించి దీపం వెలిగించాడు.  ప్రక్కనే న్యూస్ పేపరు మీద పంచదార పోసి నైవేద్యంపెడుతున్నాడు.

‘ఏమిటండీ ఇదంతా?” అనడిగారాయన కొంచెం చిరాగ్గానే.

నేతి దీపం వెలుగులో అతని ముఖం వింత కాంతితో మెరుస్తోంది.  తలకి మామూలుగా ఉండే గుడ్డకట్టు లేదు. వెలుగుని నిర్భయంగా చూసేస్తున్నాడు.  రాతా కోతా మాని  తిన్నగా మాటాడేస్తున్నాడు.  మొట్టమొదటిసారిగా వింటుంటే అతనిగొంతు ఆశ్చర్యంగాఉంది నాకు.”తమ్ముడి పెళ్ళి కదా!  బాగా జరగాలని దేవీ పూజ!” అన్నాడు చిరునవ్వు నవ్వుతూ.

అతని అభిమానానికి ఆనందించాలో, పూజలకి మెచ్చుకోవాలో, అతని వైఖరికి జాలిపడాలో, మా వైఖరికి సిగ్గుపడాలో తేల్చుకోలేకపోయాను.  మారుమాటాడకుండా  మాగదికి తిరిగి వచ్చేసాం.  మేం చాలాసేపు ఆలోచించి, ఆలోచించి, అతన్ని తప్పించుకుందికి ప్లాన్ వేసేం. అతనితో చెప్పిన రోజుకి మూడురోజులు ముందుగానే అతను ఇంట్లోలేకుండా చూసుకుని  రాయపూర్ చేరుకున్నాం. రైలుపెట్టెలో కూర్చున్నాక ‘హమ్మయ్య’ అనుకున్నాం.

అయితే మా అంచనాలన్నీ తారు మారు చేస్తూ రైలు కదిలే సమయానికి ఎక్కడనుండి వచ్చేడో, గబగబ అడుగులు వేసుకుంటూ వచ్చేడు. తనముఖానికి  మళ్ళీ కట్టుకున్న తెర తొలగించి మావైపు చూసి నవ్వేడు. ఆయన చేతిలో ఒక కవరుంచి కళ్ళకి మళ్ళీ గంతలు కప్పేసుకుని, వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయేడు.

కవరులో— పిచ్చి కృష్ణమూర్తి దస్తూరీ లో ఒక చిన్న పాట:

కల యిదనీ నిజమిదనీ తెలియదులే

బ్రతుకింతేనులే, యింతేనులే…” 

దానితోపాటు మరోచిన్నకవరూ, దానిమీద పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురి పేర్లూ, కవర్లో యాభై  రూపాయలూను!!!

మరొక్క సారి నిర్ఘాంతపోయాం!

* * * * * *

పెళ్ళినుండి తిరిగి వచ్చేక మేం పలకరించినా కృష్ణమూర్తి మమ్మల్ని పలకరించడంగాని, మా ఉనికిని గమనించినట్టుగాని కనబడలేదు. నేనే రెండు మిఠాయిఉండలు ఇచ్చి పెళ్ళిబాగా జరిగిందని చెప్పేను. ఆ మిఠాయి అలాగేవదిలేసి ఏం పట్టనట్టు తనగదిలోకి వెళ్ళిపోయాడు.  మమ్మల్ని క్షమించలేదనడాకి నిదర్శనంగా కాబోలు.  ఆరాత్రి  మరింతగా తాగివచ్చేడు.  దేశనేతలందరినీ విడివిడిగానూ, కలగలిపీ తిట్టేడు.

అతని భార్యనీ, పక్కింటి శర్మగారినీ  బండబూతులు తిట్టేడు.  రాత్రి చాలసేపు ఏవో లెక్చర్లు అస్పష్టంగా వినిపించేయి. కాని మేం  భయపడినట్టు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి పొమ్మని మాత్రం అనలేదు.

* * * * * *

మర్నాటినుండీ ఇంటికోసం గట్టి ప్రయత్నాలు ప్రారంభించి, ఈయన ఒక వారం రోజుల్లో సాధించేరు కూడా.  కృష్ణమూర్తికి మా కొత్తఇల్లు అడ్రసు తెలియకుండా జాగ్రత్తపడ్డాం.  అతనులేనిసమయం చూసుకుని, సామానంతా కొత్త ఇంటికి చేరవేసేం.  వెళ్ళేటప్పుడు ఒక్క ముక్కైనా చెప్పకుండా, ఆ ఇంట్లోకి ఎలా దిగామో, అలాగే దాటేశాం.

“పాపం మంచివాడండీ! ఇన్నాళ్ళూ ఆశ్రయం ఇచ్చేడు. ఒక్క ముక్క చెప్పి వెళితే బాగుంటుందేమోనండీ” అన్నాను అపరాధభావం వదలక.

“చాల్లే! నోరు మూసుకో! మనిల్లు ఎక్కడో చెబితే ‘మనం మనం బరంపురం కదా ‘ అంటూ రేపట్నుండి అక్కడే తిష్ఠ వేస్తాడు.. ఇన్నాళ్ళూ అంటే గత్యంతరం లేక భరించాం గాని, ఇంకానా?”  కాస్తగట్టిగానే అన్నారాయన.

కొత్తఇల్లు విశాలంగా ఎంతో సదుపాయంగా ఉంది.  కృష్ణమూర్తి గొడవలేదు.  మా పుట్టింటివారిచ్చిన డబ్బుతో సోఫా, డైనింగు టేబిలు,  ఫర్నిచరూ, పరదాలూ కూడ కొనుక్కుని ఇంటికి కావలసిన అన్ని హంగులూ సమకూర్చుకున్నాం.

కృష్ణమూర్తి ఎలాగ కనుక్కున్నాడోగాని మా కొత్తఇల్లు కనుక్కున్నాడు. రెండుమూడుసార్లు ఆ చుట్టుపక్కలే తచ్చాడుతుంటే కిటికీలోంచి కనిపించేట్ట ఈయనకి.  తుప్పుఅంటకుండా కాగితంచుట్టి చేతిలో గునపం లాంటి ఇనపరాడ్ పట్టుకున్నాడుట. ‘జాగ్రత్త!’ అని హెచ్చరించారాయన నన్ను.  ఇంట్లోదూరి గొడవ చేస్తాడేమోనని  తెగ భయ పడ్డాం మేం. అయితే ఎప్పటిలాగే మా అంచనాలన్నీ తప్పని ౠజువుచేస్తూ, మా ఇంటి గడప కూడా తొక్కలేదు… కృష్ణమూర్తి.

* * * * * *

గతమంతా తలపుకి రాగానే ఉద్వేగం ఉప్పెనలా ముంచుకొచ్చింది. ఆపదలో ఆదుకుని,  మారు తాళంతో తలుపులు తెరిచి అతనింట్లో జొరబడినా మమ్మల్ని క్షమించి,  మేం అతన్ని దూరంగా విసిరి పారేసినట్టుంచినా సరే, ‘మనం మనం బరంపురం’ అంటూ, ఏ బంధుత్వం లేకపోయినా  మా తమ్ముడిపెళ్ళి బాగా జరగాలని దేవీపూజ చేసినవాడూ,  ‘కష్టాలొస్తాయి అందరికీ, తోడుండాలి ఒక్కరికీ’ అన్న కృష్ణమూర్తి…

అదే! లోకం దృష్టిలో పిచ్చి కృష్ణమూర్తి… ఈ రోజు దహన సంస్కారానికి నోచుకోని అనాధప్రేత!

కొంచెం సానుభూతితో ప్రవర్తించి ఉంటే బహుశా మామూలు మనిషి అయి ఉండేవాడేమోగాని,  ఈ లోకంలో ఎవరికెవరు అని వదిలేసి వెళిపోయాం. చదువూ, సంస్కారం, నాగరికతా, ఇదేనా నేర్పింది? కథల్లో ఎన్నో ఆదర్శాలు వల్లించేనే! అవన్నీ చెప్పేవరకేనా? నామనసు నన్ను పదేపదేనిలదీస్తోంది.  అందరినుండీ ఎంతోకొంత లాభం పొందడమేగాని,  పూచికపుల్లంత సాయమైనా ఇతరులకు చెయ్యలేని అశక్తురాల్నా? ఇంత స్వార్ధమా? ఛీ! ఛీ! ఏమిటీ జీవితం? బాధ తెరలు తెరలుగా పెల్లుబుకుతోంది నాలో. ఏదో చెయ్యాలన్న తపన. ఏమీచెయ్యలేని అసమర్ధత… నిస్సహాయత. గట్టిగా అయ్యో అనికూడా అనలేనంత అబలనా నేను?  అలా  అనుకుందికి నామనసు ఎందుకో అంగీకరించడం లేదు.

అసహనంగా అటూఇటూ చూసేను. విశాలమైన గదులూ, అలంకరణలతో ఈ ఇల్లు ఎంతో శోభాయమానంగా ఉన్నా, నేను మొదట అడుగుపెట్టిన ఆ ఇల్లే… ఆ గూభ్యమే… ఎంతో విశాలంగా, హాయిగా ఉందేమోననిపించింది.  ఈ గదులన్నీ ఇరుకుగా, మనుషులు సంకుచితంగా కనిపించారు.  నాకు ఊపిరి ఆడటంలేదు.  తక్షణం ఏదో చెయ్యకపోతే నా గుండె ఆగిపోతుందేమోననిపిస్తోంది.

ఒక్క విసురుతో లేచాను. ఎవరైనా డబ్బులు సర్దితే పనిచెయ్యడానికి నరసింహం సిధ్ధంగా వున్నాడని ఇందాక ఈయన అన్నమాట గుర్తుకొచ్చింది.

నా హేండ్ బాగ్ అందుకున్నాను.  నా కథకి అందిన పారితోషికం అందులోనే ఉంచాను ఇందాక.

‘మనం మనం బరంపురం’ అన్న కృష్ణమూర్తి మాటలు మననం చేసుకుంటూ, నిర్ణాయకంగా బయటికి నడిచేను.

* * * * * *

 

నౌడూరి మూర్తి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు