ఇప్పటి నీ చావు…

పీడకలలు, జ్వరాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు. కొన్నిసార్లు “abandonment” కూడా personal visits చేస్తుంది. అది ప్రకటనకు అతీతంగా ఉండొచ్చు. కానీ అర్జున్ రెడ్డి వాళ్ళ నానమ్మ చెప్పినట్లు, suffering is personal. And it is also a unique experience for each one. అంతే!
కథకురాలిగా సారంగలో మొదటికథతో మెదలుపెట్టిన అపర్ణ తోట, కథలతో పాటు నెమ్మదిగా జెన్ని అన్న కలం పేరుతో కవితలు వ్రాయడం మొదలు పెట్టింది. పది పైగానే తన కవితలు వివిధ పత్రికలలో ప్రచురించబడినా కవిగా పరిచయం చేసుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటుంది.

గదిలో మంచం మీద

సూక్ష్మక్రిమి నువ్వు.

 

ఫ్యాన్ రెక్కల చప్పుడు,

కప్పుకున్న దుప్పటి,

కాల్చిపారేసిన అగ్గిపుల్లలు.

ఇప్పుడు నీ స్నేహితులు.

 

చప్పట్లు కొట్టే చీకటి.

కాలిపోయే వెంట్రుకల వాసన.

 

నిశ్శబ్దం.

రాత్రి.

దుఃఖం.

 

మోసం. విందు. భోజనం.

మెలికలు తిరిగే చీకటి. దుఃఖమనే ఊబి.

 

నీ, నా ఎవరూ లేరు.

ఎడారి మధ్య ఒంటరి దారి.

వెంటతెచ్చుకున్న పూలు ఏనాడో వాడిపోయాయి.

*

ఎపుడో, నువు చనిపోతావు

అందరూ నివాళి వ్యాసాలు రాస్తారు.

 

ఇప్పటి నీ చావు ఎవరికీ పట్టదు.

*

పిపీలికాల్లా ఎలా బతుకుతున్నామో …!
ఇదొక మెటామార్ఫసిస్. ఉన్నట్లుండి శవ ప్రాయమై మన గురించి పత్రికల్లో వచ్చే నివాళులను మనమే చదువుకుంటున్న పరిస్థితి. మన అంత్యక్రియలకు మనమే హాజరవుతున్న సన్నివేశం. మనకోసం రాలుతున్న కన్నీళ్లు మన ముందే ఇంకిపోయి చెక్కిళ్లలో ఘనీభవించిన దృశ్యం. ఎవరూ లేరన్న సత్యాన్ని గ్రహించేలోపే ఒక మాయ మనను బూటకంగా ఆవరించి మోసం చేస్తుంది. తేరుకునే లేపే ఒక చీకటి. దూరంగా వినపడుతూ అంతర్ధానమవుతున్న చప్పట్ల ధ్వని. మంచంపై పాకుతున్న పిపీలికంలా.. గిలగిల కొట్టుకుంటున్న సూక్ష్మాక్షరంలా…
-కృష్ణుడు

జెన్ని

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత చాలా బాగుంది.
    నిశబ్దం
    రాత్రి
    దు:ఖం
    … చదువుతుంటే వైరాగ్యంతో కూడిన భయమేసింది.

    ఎడిటర్ గారికి విన్నపం.
    వాక్యానికి వాక్యానికి మధ్య ఖాళీ ఉంటే, కవిత ఇచ్చే అనుభూతి సెలయేరు లాగానో, పిల్లతెమ్మెర లాగానో సాగిపోతుంది. కానీ ఖాళీకి ఖాళీకి మధ్య వాక్యాలు ఉండటం వల్లనేమో, ఆ అనుభూతి మెట్ల మీదనుంచి కిందికి దొర్లుతున్నట్టు అనిపించింది.

  • కవిత బావుంది. కృష్ణరావు గారి అందమయిన వ్యాఖ్య ఇంకా బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు