ఇంద్ర ప్రసాద్ రెండు కవితలు

1
బదులేది?
మొక్కలు పెంచుకునే వాణ్ణి
గొప్పలు తవ్వుకుంటూ
నీళ్ళు పెట్టుకుంటూ
ఆకుల్ని తుడుస్తూ
రాలిన పువ్వుల్ని
పక్షులు విడిచేసిన గింజల్ని
పోగు పెట్టేవాణ్ణి
ఇప్పుడు రంపపు మిల్లులో
దుంగల్ని చిత్రిక పడుతున్నాను
పచ్చి వాసన వదలని కలపని
తోలు పటకా సాయంతో
ముందుకు తోస్తున్నాను
ఆరు బయట
తన వంతు
వచ్చేదాకా వేచివుండే
వృక్ష శేషం
చిగురిస్తోందేమోనని
భ్రమ ఎప్పటికీ పోదు
బదులిచ్చిన కూతలతో
బాల్యం వెళ్ళిపోయింది
బదుల్లేని ప్రేమతో
యవ్వనం
ఇప్పుడు నా పిలుపుకు
బదులేది?
2
కొత్తగా ఉంది చలి
కొత్తగా ఉంది చలి
గొర్రెలకాపరి కంబళిలా
చీకటి నన్ను చుట్టుకుంది
వసంతమెందుకు
పుప్పొడి గాలినిండా
ఆవరించుకొని
ఆకులు రాలుతూనే
ఉంటాయి ఎప్పుడూ
చప్పుడు మాత్రం
ఎండినప్పుడే
ఎందుకబ్బా
వాన గురించి
ఆలోచిస్తావు
హాయిగా
అరుగుమీద నించోక
గూడుకట్టుకుంటుంది
ఆకులుతిన్న గొంగళి
రెక్కలొచ్చేక
పట్టతరమా!
*

Indraganti Prasad

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బదులిచ్చిన కూతలతో బాల్యం వెళ్లిపోయింది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు