పచ్చనోట్లు రెపరెపమంటే
హృదయ కవాటాలు తెరుచుకుంటాయి
కళ్ళకు లైట్లు పేర్చినట్లు వెలిగిపోతాయి
జేబుల నిండా దాక్కొని ఉన్నా
మరిన్ని ఆ నోట్ల ధగధగలకు
మనసు కపోతమై ఆకాశమార్గాన
పయనిస్తుంది
భవనాలు… భవంతులు
విలాసాలు… విభ్రమలు
విశ్వనిర్మాణ విజేతలు
అన్నింటినీ నడిపించే ఏకైక మార్గం
సంపదను సృష్టించడమే కదా
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి
ఎండమావుల్లోంచి అయినా
ఆస్తుల్ని ఏర్పరచడమే జీవితం
అప్పుడే జనం మనకు జేజేలు కొట్టేది
దివిటీలు పట్టేది
రాజకీయ విస్తరి నుంచి
సరికొత్త ఖజానాను సృష్టిద్దాం
పదవి మన పెదవిపై అక్షయపాత్ర లిఖించాలి
పని మొక్కలకూ రేట్లతద్ది అద్దుదాం
ఉషోదయాల్ని కొనుక్కుందాం
వెన్నెలలకు వలలు వేసి పట్టుకొని
ఇనప్పెట్టెల్లో, బ్యాంకు లాకర్లలో
జాగ్రత్తగా భద్రం చేద్దాం
అవనీ తలాన్ని గుప్పెటలో బంధిద్దాం
రేపుకు తళుకు బెళుకుల రూపును సృష్టిద్దాం
సూర్యుడేమి ఆరగించి వెలుగిస్తున్నాడో
మనకొద్దనే వద్దు
చంద్రుడేమి పుచ్చుకొని హాయిని గొల్పు
తున్నాడో మనకనవసరం
జనం గుడిసెల్లోనే మగ్గిపోనీ
ఎవరేమయిపోతేనేమి నేస్తం
నోట్ల సముద్రం ఈదడమే కదా
మనకు సమస్తం!
*








Add comment