ఆప్రికాట్ డిలైట్

గేజ్ బ్యాగ్‌లోకి బట్టలు కుక్కుతూ, జిప్ పట్టట్లేదని కాళ్ల మధ్యనేసి బ్యాగ్‌ని నొక్కుతూ, ఇదిగో ఇలాగే నెత్తి మీద కూర్చోని మాటల్తోనే నోరు నొక్కేస్తార్రా” అన్నాను ఎలాగోలా జిప్ మూస్తూ.

“ఊహించుకోవడం తప్పు కాదు కానీ అలాగే జరుగుతుంది అని భయపడడం తప్పు. నీకున్న భయాలే నీ దరిద్రంరా! అది నెత్తి మీద దాండియా కాదు, డీజే ఏస్కొని మరీ ఆడుతుంది. మొత్తం కాకపోయినా సేఫ్ సైడ్‌గా కొంచమైనా చెప్పి చూడు. పొరపాటున భయపడ్డట్టుగానే ఎక్కడైనా దొరికితే, కనీసం చెప్పలేదు అనకుండా” వాడు అలా అన్నాడో లేదో ఇంటి నుండి వీడియో కాల్ వచ్చింది. ఒక్కసారిగా గుండెదడ పెరిగిపోయింది. గట్టిగా శ్వాస పీల్చుకొని ‘చెప్పాలి, ఏదోటి చెప్పెయ్యాలని’ మనసులో అనుకుంటూ లిఫ్ట్ చేశా.

“ఆ మమ్మీ! ఏం లేదే! ఇంతకు ముందే నీతో చెప్దామనుకున్నా కానీ మర్చిపోయా. ఉద్యోగం వచ్చాకా శ్రీసప్తకోటేశ్వరస్వామిని దర్శించుకుంటాననే మొక్కు ఒకటుండె. తీర్చుకోడానికి ఈ వీకెండ్లో ఫ్రెండ్స్‌తో వెళ్తున్నా. సడన్ ప్లాన్, రెండ్రోజులు అంతే” ఒకవేళ నో అన్నా కూడా వెళ్తాననే టోన్‌లో చెప్పగలిగాను.

“ఎవర్నడిగి మొక్కినవ్రా? అయినా ఇప్పడ్దిప్పుడు ప్లాన్ ఎట్లేసుకున్నరు?”

“….”

నా రూమ్మేట్స్ ఆ మాటలకు నవ్వాపుకుంటున్నారు.

“అబ్బా మీరుండండి. మంచిదే కదరా! కానీ జాగ్రత్త బిడ్డా! ఎవరి జోలికి పోకు. నీళ్ళున్న చోటుకి మాత్రం అసలు పోకు” అమ్మ ఎప్పుడు చెప్పేదే ఇంకాస్తేదో చెప్పబోతుంటే, పక్కనుండి గంభీరంగా అదే గొంతు,

“ఇంతకి ఎక్కడుందిరా అది?” అని.

“క..క..కర్ణాటక పక్కకి డాడీ. అక్కడ ఇప్పుడొచ్చే గోకులాష్ఠమి చాలా గ్రాండ్‌గా చేస్తారు” అన్నాను చెమటలు రాకపోయినా వచ్చాయేమొనని ముఖం తూడ్చుకుంటూ.

“ఎక్కడైతే మీకెందుకు? నువ్వు తీస్కెళ్లవ్, కనీసం వాడ్ని అలా అయినా వెళ్ళనీ. నువ్వు మెల్లగా వెళ్లి రారా. కానీ ఇంకెన్ని రోజులు ఆ జాబులు రాని మొఖాలతో తిరుగుతావ్? కొలీగ్స్ పరిచయమైతే వాళ్ల రూమ్లకి షిఫ్ట్ అవ్వు. బాగుపడ్తవ్” ఆ మాటకి నా ముఖకదలికలు చూసి రూమ్మేట్స్ పక్కకే ఉన్నారని అర్థమై “సర్లే! బై” అంటూ కాల్ కట్ చేసేసింది అమ్మ.

ఒక్కసారిగా నోటి నుండి గట్టిగా శ్వాస వదులుతూ ముఖంపై ఫ్రీ బర్డ్ ఫీలింగ్ నిండిపోయింది. గొంతు తడారిపోయిందని నీళ్లబాటిల్ పట్టుకోగానే రూమ్మేట్స్ కొంతమంది బావిలోని కప్పల్లా బెకబెక మొదలెట్టారు.

“అహో చిత్రగుప్తా! చూస్తివా ఈ కర్..నాటకం. పాపాల స్టోరేజ్ డేటాలోకి హ్రిధాన్ అనబడే ఈ నరుడు, తనకి ఓ పిల్ల ఉందని, ఆమెతో ఎటో ట్రిప్‌కి వెళ్తున్నాననే నిజం ఇంట్లో వాళ్ల దగ్గర దాచాడు. పైగా దేవుడి పేరు చెప్పి ఆ పాపానికి పవర్ పెంచాడు” ఓ కప్ప.

“హే, నిజంగా అక్కడికేబే వెళ్లేది. ఓవరాక్టింగ్ ఆపి రైస్ పెట్టుపో” అన్నాను.

“ఇప్పుడు సైమా అవార్డ్ యాక్టింగ్ చేసింది తమరే ప్రభూ! సర్లేగానీ మొత్తానికి ఇంట్లో వెళ్తున్న విషయం మాత్రం చెప్పేశావ్. ఎప్పటినుండో అడుగుదామనుకున్నా, నీది దివ్యాంఖ ఎప్పటి నుండి నడుస్తుంది రా కథ?” రైస్ కడుగుతూ ఆ కప్ప.

“నేను స్కూల్ ఏజ్ నుండే. కానీ ప్రపోజ్ చేయడం మాత్రం ఆమెకి జాబ్ వచ్చాకా చేశా”.

“స్కూల్ నుండే అంటే ఆ ప్రేమలో కాస్త పసితనం కూడిన ‘స్వచ్ఛత’ ఉండే ఉంటది. కానీ ఆమెకి కమర్షియల్ డౌట్ రాలేదా ‘జాబ్ వచ్చాకా ప్రపోజ్ చేసాడేంటి’ అని” కర్రీస్ తెచ్చే కప్ప.

“అలా ఏం లేదులే! అప్పటి వరకు చెప్పలేదు గానీ ట్రై చేస్తున్న అని మాత్రం ఎప్పటి నుండో తెలుసు. కానీ ప్రపోజ్ చేసిన వెంటనే తిట్టింది. ‘టైమ్ అనేది కాలేజీలో ఉన్నప్పుడు వేస్ట్ చేసి, ఉద్యోగంలో బిజీ అయ్యాకా చెప్పావ్ ఏంటి’, అని. అంటే ఏదో టైమ్ పాస్‌కి అని కాదు, In make of memories” అని తన అర్థమని వివరించాను.

“గుడ్ రా! మచ్ మెచ్యూర్డ్ లవ్‌స్టోరీరా మీది”, ఆ కప్పే.
అప్పుడే ఓ దుంకుడు కప్ప ఎగిరి, “మెచ్యూర్డా? ఎవడు వీడా? తిప్పికొడితే వీడు మీకు పరిచయమై నాలుగు నెలలైంది అంతే. అంతా ఆమె మహిమే. మీకేం తెలీదు వీడి పిల్ల గురించి. చెప్తే కాస్త సినిమాటిక్‌గా అన్పిస్తది గానీ స్కూల్ నుండే దివ్యాంఖ అంటే ఓ ఫైర్ బ్రాండ్. కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారని సీనియర్ల మీద కంప్లేంట్ చేస్తే, పట్టించుకోవట్లేదని ప్రిన్సిపల్ మీదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రేంజ్. అలాంటి పిల్ల భయానికి బ్రాండ్ ఎంబాసిడరైన ఈడికి ఎలా పడిందో నాకిప్పటికీ అర్థం కాదు” రూంలో అన్నిటికంటే ముఖ్యమైన మందు బాటిల్స్ తెచ్చేది ఈ దుంకుడు కప్పే కాబట్టే ఆ షార్ట్ టెంపరు. పైగా
చిన్నపట్నుండి ఫ్రెండు. ‘ఉద్యోగం వెతుక్కుంటాను’ అనగానే సిటీలో తన రూం ఇచ్చినవాడు, అందుకే ఆ అలుసు.

“అంటే భయ్యా, నువ్వేమీ అనుకోనంటే ఒకటి అడుగుతా, మీరు కచ్చితంగా ఆమెని పెళ్ళి చేస్కుంటారా?” క్వషనింగ్ కప్ప.

నేను సమాధానం చెప్పేలోపే “చేస్కోక తప్పదులే. ఆసలు వీడికి ఆ ఆలోచనే రాదు. ఒకవేళ వచ్చినా కూడా వీడి పిల్లా ఉప్పెనలో కృతిశెట్టిలా కనబడే సేతుపతి లాంటిదిరా, కోసేసి…కారం కూడా పెట్టుద్ది” దుంకుడు కప్ప.

వాళ్లు అడుగుతూనే ఉన్నారు, వీడు చెప్తూనే ఉన్నాడు. మొత్తానికి నా లవ్‌స్టోరీ మాత్రం ఈ రాత్రికి వాళ్ల సిట్టింగ్‌కి స్టఫ్‌లా మారి ఒక్కోడు మూడు బీర్లు అయిపోగొట్టారు.

“బాబూ సాఫ్ట్‌వేర్ సింతకాయ్! ముందే అనుభవంతో చెప్తున్నా. ప్రపోజ్ చేసిన ఆర్నెళ్ల తర్వాత మొదటిసారి దివ్యాంఖని డైరక్ట్‌గా కలుస్తున్నావనే నీ ఫీలింగ్ ఏ రేంజ్లో ఉందో నాకు బాగా తెల్సు. కానీ ఎక్కువ ఎక్సైటై, డీప్‌గా కనెక్ట్ అవ్వకు. ఏముండదు. ప్రేమనేది ఊహించుకున్నట్టు అసలుండడు. ‘అమ్మాయి కదా’ అనే సాఫ్ట్‌కార్నర్ తీసేసుకో ముందు. కాస్త డిస్టెన్స్‌లో ఉండు. ఏదో ఓ రోజు ఆ అమ్మాయి నిన్ను విడ్చిపెట్టి వెళ్తే, తొందరగా కోలుకునేటట్టు ముందే బ్రెయిన్ని ట్రెయిన్ చేస్కో. ప్రేమను ‘చదివి‘ ఉన్నావ్ కానీ రియాల్టీ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్! అదంతా పెద్దగా ఏమి బాగోదు” నాలుగో బీర్లో భోధిస్తున్నట్టే వాగాడు.

“పో బే! నీదో పెద్ద లవ్‌స్టోరీ, పైగా అనుభవం అంటా” అన్నాను. ఇంకేదో చెప్తున్నాడు కానీ నేనని వినీవిననట్టుగా ఒత్తొత్తి ఇంకో లగేజ్ జిప్ పెట్టేసాకా వచ్చి మంచం మీద వాలాను. వద్దనుకున్నా ఎందుకో వాడి మాటలే కాస్త బుర్రలో తిరగుతున్నాయి. అమ్మాయి సరిగ్గా ప్రేమించకపోతే, లేక అబ్బాయికి ప్రేమించడం రాదని వదిలేస్తే, మనుషులు ఇలాగే సున్నితత్వం కోల్పోయి కరకుగా తయారవుతారేమో! అయినా నాకెందుకు, రేపు దివ్యను కలుస్తున్నా అనే ఎక్సైట్‌మెంట్లో పడ్డాను.

ఎందుకో మెల్లగా భయం మొదలైంది. ఆమె చెన్నైలో నేను హైదరాబాద్లో ఉంటూ ఆరునెలలుగా ఫోన్లో ఏదో మాటో లేక చాటో చేస్కున్నాం. ఏమీ లేకపోయినా ‘ఊరికే కాల్’ని కట్ చేసో, రిప్లై ఇవ్వకనో ఉన్నాం. కానీ దగ్గరగా ఉన్నప్పుడు ఎలా ప్రేమించాలి?! ప్రేమిస్తున్న మనిషిని డైరక్ట్‌గా కలవడానికి కూడా ధైర్యం కావాలి. ఇప్పుడు నిజంగా నాకా ధైర్యం కావాలి. చుట్టున్న వాళ్ళంతా టిండర్ యాప్లో జెండర్‌ని బట్టి స్వైప్ చేస్తూ రాత్రంతా ప్రేమను వెతుక్కోవడంలో మునిగిపోయినట్టు ఫీలవుతారు. తెల్లారగానే ఎన్ని జ్ఞాపకాలున్నా, కిరాయి కొంప మీదెందుకు ప్రేమ పెంచుకోవడం అని ఊరుకునే టైపు. కానీ స్వైప్ చేసిన అమ్మాయిని ఎలా కలుసుకుంటున్నారని నా మథనం. కొన్ని రసాల సీన్లకి సొల్లు కార్చుకుంటూ చూడడమో లేక వినడమో తప్ప నిజంగా ప్రేమ కథలు ఎలా ఉంటాయి, ప్రేమికులు ఎలా కలుసుకుంటారని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌లో ఎవడికీ సరిగ్గా తెలియదనేది నా గట్టి నమ్మకం. కానీ తెలుసన్నట్టు అడ్డమైన సలహాలు మాత్రం ఇస్తారు.

ఇప్పుడు అదంతా అనవసరం, ఆమెను కలుస్తున్నాను, కలిసి తిరిగబోతున్నాను, తాకబోతున్నాను, దగ్గరగా ఉంటూ ప్రేమించబోతున్నాను. ‘కలిసినప్పుడు ఎలా మెలగాలి? ఎహే…అసలు ఇవేం ఆలోచనలు…ఇవేం భయలు, చండాలంగా’ అనుకుంటూనే మళ్లీ అవే ఆలోచనల్లో పడిపోతున్నాను. ఇలా ప్రతిసారీ ఏవో ఆలోచనల్లో పడి లేస్తూ ఎక్కడెక్కడో తిరుగుతున్న నా బుర్రను తన లోకంలోకి గుంజుకొచ్చి కట్టిపడేసేది…ఆమె పేరుతో వచ్చే ఓ వాట్సప్ నోటిఫికేషన్.

“హ్రిధ్! గుర్తుందిగా? మార్నింగ్ ఫైవ్‌కి ఫ్లైట్, త్రీకి అలారం పెట్టుకో. నో చాటింగ్. గుడ్‌నైట్. లవ్యూ. బై” అని ఆమె నుండి వచ్చిన మెసేజ్.

అలారమా? రెండేళ్ళ తర్వాత కలుస్తున్న అనే ఫీలింగ్‌తో అసలు నిద్రే రాదని ఆమెకి ఎలా చెప్పాలి?

ఎర్రటి కళ్లేసుకొని ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. చిరునవ్వు అతికించుకున్న ఎల్లో ఎమోజీ టీషర్ట్‌లో ఆమె బోర్డింగ్ పాస్ తీసుకొని వెతకుతూ ఉంది. గుచ్చుకునే చూపులు విసిరే గాజుకండ్లు ఆమెవి. నేను కనబడగానే లైట్లు పడ్డట్టు ఇంకా మెరిశాయి. “హ్రిద్ధూ…” అంటూ పరుగులాంటి నడకతో దగ్గరికొచ్చింది. ఆమె టీషర్ట్‌కున్న చిరునవ్వు నా షర్టు గుండీలను ముద్దాడిన కాసేపటికి, ఇద్దరం ఫ్లైట్ ఎక్కాం.

నాకు అది మొదటిసారి కావడంతో, ఫ్లైట్ ఎగరకముందే భయం మబ్బులు ముఖంపై తేలి ముచ్చెమటలు పట్టాయి. “వింగ్స్ వచ్చిన ఫీల్ ఉందిరా నువ్వు పక్కనుంటే! ఎన్ని రోజుల ఎదురుచూపు! లెట్స్ ఫ్లై” అందామె ఛీరప్ మూడ్‌తో. నేను మాత్రం సీట్‌ని గట్టిగా పట్టుకుంటూ భయపడ్తున్న ఫీల్‌ని బయటకి కనబడకుండా ఇబ్బంది పడ్తున్నప్పుడే ‘Fasten your Seat Belt’ అని ఏయిర్ హోస్టెస్ల మాటలు, రెక్కల్లోంచి చిన్న మంటలు, ఫాస్ట్‌గా కదులుతున్న విమానపు వైబ్రేషన్లు అన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తల మీది నుండి చల్లగా ఏసీ వస్తున్నా కూడా గుబురుగా వెంట్రుకలు మొలిచే ప్రతిచోటా చెమటతో తడిసిపోయింది. భయాన్ని కప్పిపుచ్చుకున్న ముఖచిత్రం పెట్టిన కాసేపటికే, విమానం శరవేగంగా మబ్బుల మీదికి రావడం, వైబ్రేషన్లు ఆగిపోవడంతో కాస్త నార్మల్ అయ్యాను. ఇలా నార్మల్ అయ్యే ప్రాసెస్లో మాత్రం అనిపించింది, ఈ టేకాఫ్ అచ్చం ప్రేమలాగే ఉంది. ప్రపోజ్ చేసేముందు భయంగా, తర్వాతంతా క్యాజువల్‌గా అని.

“అహో శశీ! ఈ భూలోకం బహు ముచ్చటగా ఉన్నది” అన్నాను కిటికిలోంచి గమ్మత్తుగా చూస్తూ. “భూలోకం కాదు, ఫ్లైట్ ఎగిరేంత వరకు నీ ముఖం చూడాలి. నువ్వు కన్ట్రోల్ చేస్కున్నావ్ గానీ నేను నవ్వాపుకోలేక పోతున్నాన్రా” గట్టిగానే నవ్వింది. ఆ నవ్వు బాగుంటది…నిజానికి ఆ నవ్వు కోసమైనా ఇంకా భయపడ్తే బాగుండనిపిస్తుంటుంది.

“హమ్మా! సరే గానీ, దిగిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లాలో ఏమి ప్లాన్ చేస్కోలేదురా మనం” అందామె.

“మా ఫ్రెండ్స్ కొన్ని యూట్యూబ్ వ్లాగ్స్ సజెస్ట్ చేశారే. కొన్ని చూశా కానీ ఏది సరిగ్గా గుర్తులేదు. రిపీటెడ్ ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడికి పోకపోయినా పర్వాలేదు గానీ, శ్రీసప్తకోటేశ్వర స్వామి దర్శనం మాత్రం మరిచేదేలే. ఇంట్లో అదే చెప్పినా తెలుసా” అన్నాను.

“ఓహో, ఏంటి ఇంకా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీస్కుంటున్నావా? మగాడివిరా బుజ్జీ” మళ్లీ నవ్వాపుకుంటూ అందామె.‘అంటే ఈ ఏజ్లో అబ్బాయిలు ఇంట్లో వాళ్ల పర్మిషన్ తీస్కోవద్దా?’ అని అడిగితే బాగోదేమో అని ఆగాను.

గాల్లో సిగ్నల్ లేకపోయినా ముందే సేవ్ చేస్కున్న కొన్ని ప్లేసెస్ గురించి ఫోన్లో చూపిస్తూ మాట్లాడుకుంటుంటే, ఫ్లైట్ కాస్త పక్కకు వంగి, ఇంకా మీదికి ఎగిరింది.. గోవా వైపుగా.

— 2 —

ఉరికురికొస్తున్న తెల్ల మురికి అలలు తప్ప, ఆకాశానికి సముద్రానికి తేడా లేదనిపించే ‘బాగా’ చీకటిలో, తన చేతులు నా చేయిని పట్టుకుంటూ, నాతో ఆమె అడుగులు ఇసుక మీద పక్కపక్కకే పడ్తున్నప్పుడు ఆ నడక ఎందుకో బాగా నచ్చింది. అలా నడుస్తూ సముద్రం దగ్గరికి వెళ్లగానే, నా పాదాలకి అలలు తాకాయి. నాకు భయం మొదలైంది. కాళ్ళ కింద ఇసుకను లాగేసుకుంటున్నప్పుడల్లా గుండె కింద చెమటలు పట్టాయి.

అలలు నాలుకలుగా నా కాళ్లను చుట్టి సముద్రం గర్భంలోకి నన్ను లాగేసుకుంటాయేమోననే భయం.
నా అడుగులు ఆలోచన్లో పడ్డాయి. వేగం తగ్గి భయాన్ని మోస్తూ, భారంగా పడ్తూ తడబడుతున్నాయి. అడుగేయడానికి అడుగడుగున ఆలోచిస్తున్న సమయం.
అది ఆమె గమనించింది. ధైర్యం చేస్తూ నా చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకొనే సముద్రానికి పరిచయం చేస్తూపోతోంది,
కాదు అరుస్తోంది. ఇంకా లోపలికి వద్దని ఆమెను వెనక్కి లాగుతూ వచ్చాను. ఒడ్డు దగ్గరున్న ష్యాఖ్ మీద ఇద్దరం పడుకున్నట్టే కూర్చున్నాం.

బుక్క బుక్క బీరు అందించుకుంటూ, హుక్కా దమ్ము దమ్ముగా వొదులుతూ ఓ మైకంలో మునిగాం. జాతర లైట్ల వెలుగుల్లో రెస్టారెంట్లు, మోతగా సౌండ్ బాక్సుల్లో ఇంగ్లీష్ పాటలు, ఒళ్ళు తెలీకుండా డాన్సులు.. ఎన్నో వెనక ఉన్నా కూడా తల తిప్పకుండా చేస్తున్న సముద్రం వైపే కండ్లన్నీ. మళ్లీ తాగుతూ…ఊదుతూ…అరుస్తూ…

లేటైనా కరెక్ట్‌గా బుక్ చేస్కున్న రూంలోకే వచ్చేశాం. బెడ్‌పై వాలాం. నిశ్శబ్దం, ఒక్కసారిగా పేరుకుపోయిన నిశ్శబ్దం. నిశ్శబ్దమంటే, సడన్‌గా డీజే ఆపితే వచ్చేది కాదు, నిశ్శబ్దమే ఓ పాటై డీజేలో పెట్టినట్టుంది. ఇలా ఎప్పుడూ ఇద్దరం ఒకే రూంలో లేము. కొత్తగా ఇద్దర్లో రేగిన అలజడి. అక్కడ కూడా నాకేదో భయం. ‘బే..బీ..’ అంటూ వెనక నుండి వచ్చి ఆమె హత్తుకుంది.

“ఐయామ్ గ్లాడ్! ఇప్పుడు కూడా నువ్వే ధైర్యం చేశావ్” నవ్వుతూ, కాదు కాస్త సిగ్గుతో అన్నాను వెనక్కి తిరిగి ఆమె బుగ్గలను పెదాలతో మసాజ్ చేస్తూ కౌగిలించుకున్నాను. ఇన్నేండ్లకి తన కౌగిలి స్పర్శలో ఉండే వెచ్చదనం వల్ల నాకో దేహం ఉందని తెలిసిందంటే నమ్ముతారా ? అలా కౌగిలి నుంచి మెల్లిగా మొఖాలు మాత్రమే బయటపెట్టినప్పుడు ఊపిరాడడం కష్టమైంది. ఒకరికొకరం పెదాలతో ఊపిరందించుకున్నాం. అలా పెదాలే కాదు మొదటిసారిగా దేహం మొత్తం ఇంకో దేహానికి ఊరిపినిచ్చిన రాత్రి అది. ఎన్నో ఏండ్ల వేడివి తన ఒడిలో చల్లార్చుతున్న రాత్రి అది.

— 3 —

పిల్లల్ని అంటాం గానీ, ప్రేమలో ఉన్నప్పుడు పడే గొడవల్లో ఉండే పసితనమే వేరు. ఎక్స్‌స్ట్రా కాండమ్ తేలేదని పొద్దున్నే మొదలెట్టింది, “బాధ్యత లేదురా నీకు. పిచ్చినా…” అని.

దాంతో నేను కూడా అరుస్తాను బీప్ సౌండ్ డైలాగులు, నేను మగాడినన్నట్టు. ఆమె కొడుతుంది, వీటికి భయాలుండవన్నట్టు. కాసేపటికి నన్ను పక్కకు పెట్టి ఫోన్లో దూరినప్పుడు నాకు ఆమెంటే మంట.

“సేఫ్‌గా రీచ్ అయ్యావా?”

“ఎట్లుంది గోవా? మీ వోడు బానే ఉన్నాడా”

“చిల్…టేక్ కేర్ ”

ఇలాంటి మెసేజ్లు అబ్బాయిల పేర్లతో వచ్చినప్పుడు, ఇంకొంత మంది ఫోన్లు చేసి మరీ తెగ ముచ్చట్లు పెడ్తుందన్నప్పుడు నేను అక్కడక్కడే తిరుగుతుంటే,
“నిన్ను నువ్వు బానే కంట్రోల్లో పెట్టుకుంటావ్ రా! నన్ను కంట్రోల్లో పెట్టాలనే నీ ఆలోచనల్ని కూడా పెట్టుకో” అని అంటూనే, “భయాల్ని పోగొట్టాలని చూస్తా గానీ, నమ్మకాల్ని నువ్వే కలిగించుకో. ఇడ్చిపెట్టి ఇంకెవరితోనో అయితే వెళ్ళన్లే” అంటుంది మనిషిగా చచ్చినా కూడా చావని మగతనపు బుద్ధిని ఉద్దేశిస్తూ. ఆ మాటలు కరుకుగా ఉన్నా కూడా, వాళ్లంతా ఆమెకి అన్నయ్యలని తెలిసి అక్కడ్నుంచి బయటకొచ్చి గాలి పీల్చుకుంటాను హాయిగా.

చాలా విషయాల్లో ఆమె అంతే! తేల్చిపారేస్తుంది. రెబలిక్‌గా చూస్తున్నాననే ఫీలింగ్‌తో ఆమె ఇంకా అలాగే తయారవుతోంది. నిజానికి అప్పుడప్పుడు ఆమెను, ఆమె ప్రేమను చూసి నేను ఎంత ఇమ్మెచ్యూర్గా ఉంటున్నాను అని, లేక ఆమె ప్రతి దాంట్లో ఎంతో మెచ్యూర్‌గా ఉంటుందనే భావన లోపల ఉండటంతో అర్థం చేస్కోవడంలో వెనకే ఉండిపోతున్న అనేది ఎక్కువుగా అన్పిస్తుంటుంది. నన్ను యాక్సెప్ట్ చేసింది కాబట్టి తనతో ఇలా ఉన్నా గానీ అప్పుడప్పుడు నా బుద్ధి లేని చేష్టలకి ఆమె భ్లాక్‌లిస్టులో ఉండేవాడినేమో అనే థాట్ కలవరపెడ్తూ ఉంటుంది.

రెడీ అయి బయటపడ్డాం. ఎవరో ముందే రిజర్వ్ చేస్కొని పెట్టుకున్న వాళ్లు, ఇంకా రాలేదన్నట్టుగా కనబడే ప్రైవేట్ బీచ్‌‌లా ఉంది ‘వెగటర్’.

అలలు హోరు ఎక్కువే ఉన్నా, ప్రశాంతంగా అన్పిస్తుంది. ఆమె కాసేపు అలా సముద్రాన్ని చూసి చూసి ఆస్వాదిస్తూ మెల్లిగా నన్ను వాటేసుకుంది. నాకు నచ్చడంతో అలాగే ఉందామనుకునే లోపే చుట్టున్న వాళ్లు చూస్తున్నారు. రెండో నిమిషానికి ఏమనుకుంటారోనని నేను దూరం జరిగాను, అక్కడ మనుషులు బికినీలో తిరుగుతారని మర్చిపోయి!

“నీ కంటే సముద్రమే చాలా బెటర్ రా! అడక్కుండానే అలలు ‘అలై బలై’లు ఇస్తున్నాయి” ఆమె.

“అలై బలైలా! మీ అయ్యకి తెలుస్తే ఉంటాయి, ఇలా ఎవరికీ తేలీకుండా సముద్రంలోకే వచ్చి అలై కొట్టుకుపోవడమో లేక ఆయన కాళ్ల మీద పడ్డా కూడా బూటు కింద బలైపోవడమో” అని నేను.

ఆమె మెల్లిగా ముందుకు నడుస్తూ “నీ భయమంతా మా నాన్న మీదనా? ఇంకా నా మీదేమో అనుకున్నా. డాడీ మరీ అంత సీన్ చెయ్యడేమోరా! కానీ నాకెందుకో నీ మీదే డౌటు. వచ్చి మా ఇంట్లో మాట్లాడేలా లేవు, నేనే మీ ఇంటికొచ్చి మాట్లాడాలేమో. ఒక డౌటూ, రేపు పేరెంట్స్ ఒప్పకున్నాకా పెళ్లిలో తాళీ నువ్వు కడ్తావా లేక నేను కట్టాలా” వెనక్కి తిరిగి చూసింది నవ్వాపుకుంటూ.

వస్తున్న అలని కాళ్తో తంతూ నేను విననట్టుగా అటుగా వెళ్తున్న బికినీలో ఉన్న అమ్మాయి వైపు చూస్తుండి పోయాను. దివ్యాంఖ ఇంకేదో చెప్పబోతూ ఇంకా నా చూపు అటే ఉండేసరికి కోపంగా పిడికెడు ఇసుక తీసి నా ముఖాన కొట్టి వెళ్ళిపోయింది.
వెనకే ఉరికాను. “అంటే ఆ బికినిలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంది అని అంటే నమ్ముతావా అసలూ?” అడిగాను ఈ సారీ నేను నవ్వాపుకుంటూ.

“పో బే! చూడాల్సినవి చూస్తూ చేయాల్సినవి చేస్తూనే, భయమున్నట్టే నటిస్తావ్రా నువ్వు” అంటూ వెళ్ళి వాటర్‌స్పోర్ట్స్‌కి డబ్బులు కట్టేసింది.

“అలా ఏం లేదు. నిజంగానే మీ డాడీ అంటే భయమే. ఆయనతో పెళ్లి గురించి మాట్లాడాలంటే చచ్చేంత ధైర్యం కావాలి. కానీ కచ్చితంగా మాట్లాడుతా. ఎలా అడగాలి? ఏం మాట్లాడాలని, నువ్వే నన్ను బాగా ప్రిపేర్ అయ్యేలా చెయ్యి. నీలాంటి హెచ్చార్‌ని చేస్కోవాలంటే నాలాంటి టెకీకి ఇంటర్వూలో తడబడ్డట్టు మీ నాన్న ముందు మాటలు తడబడితే, మ్యాటర్ సరిగ్గా కన్వే కాదేమో” అన్నాను.

“మాటలు రాకుంటే పాటలు పాడురా. పెళ్ళికి ఊ అంటావా మామ…ఉఊ అంటావా మామ…టిట్టిట్టిట్టి అని. ప్రిపరేషన్ అంట ప్రిపరేషన్. అయినా ముందు నేను ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా ఇంట్లో వాళ్ళని ఎదుర్కోడానికి” అందామె. ఇద్దరం కాసేపు సైలెంట్ అయ్యాం.

సముద్రపు తడి ఉన్నా కూడా ఎండకు కాలి కింది ఇసుక ఉడుకుతున్నట్టుగా ఉంది. చెమటకి కారుతున్న మాయిశ్చరైజర్ జిడ్డుముఖాలు చూస్కొని నవ్వుకున్నాం. ఇసుక తీసి ఒకరి ముఖాలకు ఒకరం రాసుకున్నాకా, వాటర్ స్పోర్ట్స్ కోసం ఒడ్డుకు వచ్చిన ఓ పడవలోకి ఎక్కేశాం.

సముద్రాన్ని చీల్చుతున్నట్టుగా పడవ పోతుంటే దాని వేగానికి నురుగలుగా లేస్తున్న ఉప్పు నీరు ముఖంపై కూడా చిలకరించినట్టు పడుతుంది. అలా దూరం పోయాకా, స్కూబా డైవింగ్ కిట్ ఇచ్చి ఆ నడిసముద్రంలో దూకమన్నారు. భయపడ్డాను. నేను పారిపోడానికి ఎటు వెళ్ళలేకుంది. తప్పలేదు. దిగకపోతే నేనే సముద్రంలోకి తోసేస్తా అన్నట్టు ఆమె చూపు అర్థమై ఆమెతోపాటు నీళ్ళలోకి దిగాను.

సముద్ర ‘గర్భంలోకి వెళ్ళిన పసివాడి’ భయానికి, చుట్టూ కదులుతున్న చిన్న చిన్న చేపపిల్లలకి కూడా నేను బెదిరిపోయాను. ఇద్దరం ఒకరినొకరు చేతులు పట్టుకొని ఇంకా లోపలికి ఈదుతున్నాం. ఒక చోట ఆగేలా చేసి నా ఎదురుగా నిల్చున్నట్టుగా ఈదుతుంది. సముద్రం ఎంత బ్లూగా ఉంటుందో చుట్టూ ఉన్న నీళ్లను చూశాక అర్థమైంది. ఆమె నాకు ఇంకా దగ్గరగా వచ్చింది. తీక్షణంగా మా ఇద్దరి చూపులు కలిశాయి,’ఈ టైంలో రొమాన్స్ ఏంటే…’ అని అనలేక ముఖానికున్న డైవింగ్ కిట్టులోంచి బుడగలు బయటకొదిలాను. కానీ బాగుందనిపించి కాసేపలాగే ఉన్నామిద్దరం. ధ్యానం చేయాలనిపించే వాతావరణంలా ఉంది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న వాళ్ళ మధ్య మేము కూడా చేపలమైపోయాం. డీప్ డైవ్ ఇంత బాగుంటుందా అని టైం అయిపోయే దాకా తెలీలేదు. బోట్ వెళ్ళిపోతది అని ఆమె తేలుతూ పైకి రమ్మంది. నేను మాత్రం ఇంకా చాలాసేపు లోపలే తిరిగి తిరిగి వచ్చి ఆమె ముందు ముఖంపై కిట్ తీసేసి ఓ అధిగమించిన నవ్వుతో నిల్చున్నాను ముద్దుపెట్టి.

రూం కొచ్చి ఒళ్లు నొప్పులతో మంచంపై వాలాం.
తను వెచ్చగుంది. “ఓవరాక్షన్ ఆపి, వెళ్ళి ప్యారాసిటామాల్లు తీస్కురా. నిజంగానే జ్వరం ఇది” అందామె.

వెంటనే ఫార్మసికి బండిపై సగం దూరం వెళ్ళాక “హెల్మెట్లు కూడా తెచ్చుకోరా! లేకపోతే ఫైన్ పడ్తది. జీవితకాలం” ముసిగా నవ్వి కాల్ కట్ చేసింది.

ఆమె, ఇంతకు ముందే రూంలో చెయ్యి వేసినందుకు కసిరింది కూడా తనే. ఆమేంటో అర్థంకాక నెత్తిగోక్కోడానికి చేతులు అచేతనంగా లేచాయి, తలపై హెల్మెట్ పెట్టుకున్నానని కూడా మర్చిపోయి.

ప్రేమెప్పుడూ మనుషుల్ని అర్థం చేస్కోవడంలో ఉంటే, ఆమెప్పుడూ నన్ను ప్రశ్నార్థగోళంలోకి నూకి, అర్థగోళంలోకి లాగినట్టే లాగి ఆశ్చర్యార్థగోళంలో తేలేలా చేస్తుంది.

ఈ గందరగోళంలోనే గోవా రోడ్ల మీదా చాలా మంది జంటలను చూస్తూ పోతున్నాను. నాలాగే కొంతమందిని చూసి, బర్త్‌డేనో, పెళ్ళిరోజనో వచ్చిన వాళ్ళని చూసి ఇంకా బలంగా ఫిక్స్ అయ్యాను. ప్రేమ అనేది ప్రతి సంవత్సరం ఎక్స్‌టెండ్ అవుతున్న సబ్జెక్ట్‌లా మారిపోతుంటుంది. ప్రతి రోజును ఎంజాయ్ చేయలేక, అర్థం చేస్కోవాల్సిన వాటిని కూడా పక్కకు పెట్టిన మనుషులు కేవలం పరీక్షగా తేదీలను బట్టీ పట్టుకొని గిఫ్టులు ఇస్తూ ‘మార్కులు కొట్టేయడం’ లో బిజీ అయ్యారని.

— 4 —

‘గాయాల్ని రేపేది ప్రేమే.
రేపిన గాయాల్ని మాన్పేది ప్రేమే..’

భారీ డైలాగ్‌తో ‘పిశాచుల ప్రేమ’ అనే సినిమా అయిపోయింది. కానీ అందులోని పాటే ‘గోరు చుట్టుకున్న ప్రేమ, గోరు వెచ్చగున్నదే..’ బుర్రలో మాత్రం తిరుగుతూనే ఉంది. వెళ్లి సముద్రంలో దూకి చచ్చిపోవాలనుపించింది.
“ఇదసలో లవ్ స్టోరీయేనా? ఇలాంటి సినిమాలు ఎందుకు పెడ్తావ్రా” అని నన్ను ఆమె తిడుతుందేమోనని భయపడ్డా. చూసేసరికి ఆమె ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది.

దుప్పట్లు ఆమె మీదికి జరిపాను. ఆ కదిలికకి మెలకువ వచ్చిందేమో మెడ దగ్గర మడతపడ్డ డ్రెస్‌ని సరిచేయబోయాను. ’బే..బీ’ అని నిద్రలోనే దగ్గరికి రమ్మని పిలిచింది. నిజానికి ఆ టైంలో ఆమె నన్ను ఏమనుకొని దగ్గరికి తీసుకుంటుందోనని ఆలోచిస్తూ వెళ్తాను. ,‘పగలయితే దొర వేరా…రాత్రి నా రాజువిరా’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి పాట టీవీలో రాగానే, రిమోట్ మీది నుండి బెడ్‌పై ఇద్దరం పొర్లాక చానల్ మారింది.‘రాత్‌కి రాణి’ అనేదో వస్తుంటే ‘నా కథకే ఏకైక రాణివి’ అని చెప్దామనుకున్నా కానీ చెప్పలేదు, నన్ను నేను ఆమెకు నగ్నంగా సమర్పించుకున్నాక.

రాత్రంతా అయిపోయాక, ‘ఇంకా చాలా తెల్సుకోవాలి ఈ మనిషి గురించి’ అని ఇద్దరికీ అన్పించిన క్షణాలు ఎప్పుడూ ఉంటాయి. మేడలో పెరిగినా మా ఇద్దరివి అడవి బుర్రలే అన్పిస్తాయి. ఓ పక్షి ఎప్పుడూ పురుగులాగా ఒక అడవిలో తిరిగితే, దాన్ని గురి చూసి కొట్టే గులేర్ ఇంకో అడవిలో ఉందనిపిస్తుంది. ఒకరిలో దప్పిక తీర్చే చెరువువై లాలనుంటే, ఇంకొకరిలో అంటుకున్న ఎలగడ మంటై భయపెడుతుంటుంది. కానీ ఇద్దర్లో ప్రేమెప్పుడూ పచ్చగా ఉంటూ శ్వాసందించుకుంటూనే ఉన్నాం.

ఎప్పటిలాగానే ఉదయం మళ్ళీ బయలుదేరాం.
ఇటాలియన్ లుక్ డబ్బా ఇండ్లు..
కొబ్బరిచెట్ల నడుమ నేసిన రహదార్లు..
నడిచిన కొద్దీ ఎడతెగని సముద్ర తీరాలు..
వెస్పా వేసుకొని, చపోరా…అఘోడా…మాగోస్…కోటల్లో రాయబారి పక్షుల్లా తిరిగి. కొన్ని బడ్లు,చర్చులు కవర్ చేసి కండోలిమ్ బీచ్లో ఆగాం. రంగురంగుల కళ్లద్దాలతో.
మళ్ళీ పడవలో సముద్రం మధ్యలోకి వెళ్ళి, పారాసేలింగ్ చేయడానికి రెడీ అయ్యాం. పడవ నుండి పతంగి ఎగిరేసినట్టు, ఓ మిషిన్ రోప్‌తో పారాష్యుట్ కట్టి మనుషుల్ని గాల్లోకి లేపుతారు. ఇప్పుడు ఇద్దరం కలిసి జంటగా చేయడానికి సిద్ధపడ్డాం. మిషిన్ రోప్‌ని వొదులుతున్న కొద్దీ, బోట్‌కి దూరమౌతూ గాల్లోకి ఎగిరాం. నా గుండె వేగంగా కొట్టుకునే చప్పుడు ఆమెకి గాల్లో కూడా వినబడుతోంది. ఆమె ధైర్యం చెప్తున్నా నాకు ఎక్కట్లేదు. చాలా ఎత్తుకు వెళ్ళాక ఒక పక్క గోవా ఓ దీవిలా, మరో పక్క కనుచూపుమేర సముద్రమే కనబడుతోంది.

సూర్యుడ్ని అంతెత్తులో ఎప్పుడూ చూడ్లేదు. ఆమె చిల్‌మూడ్‌‌తో అరుస్తూ “హ్రిధ్, భయపడకురా! ఎన్నో అధిగమించావ్‌. ఇదో లెక్క కాదు. చుట్టూరా చూడు ఎంత బాగుందో”.

నేను కిందికి చూడాలంటే భయమేసి ఆకాశం వైపే చూస్తున్నాను. రోప్‌ని కిందికి దించుతూ సముద్రంలోకి పడేస్తూ మళ్ళీ పైకి లేపుతుంది మిషిన్ బోట్.
‘ఇలా చంపుతున్నావ్ ఏంట్రా? ఒకేసారి చంపక’ మనసులోది బయటకనేశా. అప్పటికి ఒళ్లు సముద్రం నీళ్లకే కాదు చెమటతో కూడా తడిసిపోయింది. నోరంతా ఉప్పిసం, ముక్కులోకి కంపు, కంటి నిండా నీలం రంగే. రోప్ మళ్లీ సముద్రంలోకి ముంచి గాల్లోకి లేపింది.

“ఏమైందిరా ఇంకా భయపోలేదా?”

గాల్లో ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ‘ఇప్పుడు కాస్త బెటర్‘ అని కవర్ చేశా సైగతో. నిజంగానే నార్మల్ అవుతున్న సందర్భంలో మాత్రం భయపడ్డట్టుగానే నా ఊహ ఒకటి నిజమైంది. రోప్ తెగింది! ఒక్కసారిగా పారాష్యూట్ మమ్మల్ని చాలా పైకి లాక్కెళ్ళింది. ఎటుపడితే అటు తీస్కెళ్తుంది. పడవలోంచి అరుపులు వినబడుతున్నాయి, చిన్న పడవలతో గజ ఈతగాళ్లు కింద తిరుగుతున్నారు. గాల్లో మేము గుండ్రంగా తిరుగుతున్నాం. నేను గాల్లో నిశ్చేష్టుడై పోతున్నాను. ఆమె వణుకుతున్న గొంతుతో ఏదో గట్టిగట్టిగా అరుస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయి. స్పృహ తప్పుతున్నాను. పారాష్యూట్ కిందికి దిగుతూ దబ్‌మని సముద్రంలో పడేసింది. అప్పుడు కూడా ఆమె నా చెయ్యి మాత్రం పట్టుకునే ఉంది. ఆ స్పృహ మాత్రం బాగా గుర్తుంది.

కళ్ళు తెరిచేసరికి బీచ్ పై పడుకోనున్నాను. పక్కకు ఆమె రెండు చిల్లులు పడ్డ కుండలా కండ్లు. దాదాపు చావు దగ్గరి దాకా పోయొచ్చాక నాకు నేనే కొత్తగా ఉన్నాను. ఎక్కడి లేని ధైర్యం వచ్చిందో లేక అన్ని రోజులు ఉన్న భయం పోయిందో తెలీదు కానీ చావును కూడా అధిగమించాననే ఫీల్లో ఉన్నాను. ఆ సంఘటన జరగడమే నాకు మంచిదైంది అనుకున్నాను, గమ్మత్తు ఏంటంటే ఆ రోజు నుండి ఆమెలో భయాన్ని చూస్తున్నాను. ఆ క్షణం నుండి ఆమెందుకో దేనికి సాహసించేలా మాత్రం లేదని అర్థమైంది.

ఆ చూపులు ఆ ఏడ్పు చూసి, “నువ్వేదో సరదాకి అన్నావ్ గానీ, సప్తకోటేశ్వరుడు ఫీలై ఉంటాడు. ఎలాగు వచ్చాం కాబట్టి వెళ్ళే ముందు నిజంగానే దర్శించుకుందాం” ఆమె భయంతో అన్న మాటకి నాకు చిన్నగా నవ్వొచ్చి దగ్గరికి తీస్కున్నాను. ఆమె నా చెయ్యిని గట్టిగా పట్టుకొని భుజంపై తలవాల్చింది. ఇద్దరం అలా కాసేపు సముద్రంవైపు చూస్తుండి పోయాం. సూర్యుడు కూడా నిదానంగా జారుతూ సముద్రంలోకి డీప్ డైవ్‌కి వెళ్లిపోయాడు.

ట్రిప్ అయిపోయింది.
ఆమె చెన్నైకి నేను హైద్రాబాద్‌కి. మళ్లీ ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా ఏదో ‘అఖేలా’తనం చుట్టేసుకుంది. వీకెండ్లో ఇంటికి వచ్చాను.

“ఎక్కడికిరా?” అంటూ ఎదురైంది మమ్మీ. ఫ్రెండ్స్ కోసం తెచ్చిన బాటిల్స్ చూడక ముందే బండిలో దాచేసాక, “సప్తకోటేశ్వర స్వామీ తీర్థ ప్రసాదం, అర్జెంటుగా పంచిపెట్టాలి” అని బయటపడ్డాను. ఫ్రెండ్స్‌తో చక్కర్లు కొడ్తుండగా, వేరే జంటలను రోడ్లపై గమనిస్తున్నాను. ‘ప్రేమికులు’గా వాళ్ళని వేరే వాళ్ళు చూస్తున్న చూపు నచ్చలేదు. పోలీసులంటే భయం, రైతులంటే జాలి అని అలవాటైన వాళ్ళకి రోడ్డు మీద ప్రేమికుల్ని చూసి పాడైపోయారనే భావన కన్పించేలా చూస్తున్నారు. అందుకే ఉన్నచోట తిరగలేక కావచ్చు గోవా లాంటి ప్రదేశాలకు వెళ్ళి షికార్లు కొడ్తున్నారనిపించింది. అంతేగానీ, ఏముంది మరి గోవాలో? ఎలా తిరిగినా అర్థం చేస్కుంటారనే కంఫర్ట్ తప్పా!

కొన్ని నెలలు గడిచాయి. ఇంట్లో ఆమెకి పెళ్ళి ప్రెజర్ మొదలైంది. ప్రేమికులు పప్పన్నం తినిపించాలంటే అందులో కొన్ని పప్పులు అసలు ఉడకవు. నన్ను కుక్కర్లో పడేసింది. ఆమె ఏడ్పే కింద మంట పెట్టినట్టైంది. రోజురోజుకూ ఆ మంట పెరిగింది. ఇరు కుటుంబాల్లో గ్రీన్ సిగ్నల్‌గా విజిల్స్ వచ్చాకా నవరంధ్రాల్లోంచి ప్రెజర్ బయటకొచ్చేసింది.

హైద్రాబాద్ రూంలో…

పెళ్లి కార్డు మాత్రమే కాదు పార్టీ కూడా కావాలని డిమాండ్ చేయడంతో రాత్రి సిట్టింగ్లో,
“ఛ! సంతలో జిలేబీ గాడికి ఆప్రికాట్ డిలైట్‌లాంటి అమ్మాయితో పెళ్ళేంట్రా బాబు?” అని కప్పల బెకబెక.

ఇప్పుడు తాగే మందుకు మంచింగ్‌గా దుంకుడు కప్పోడు నా పెళ్లికి ఇరు కుటుంబాలని నేను ఎలా ఒప్పించానో చెప్పడానికి రెడీ అయ్యాడు. అలా వాడు కథ మొత్తం కక్కడం, మిగతావాళ్లు తాగింది మొత్తం కక్కడం జరిగాయి.

తినడానికి బిర్యానీతోపాటు ఆర్డర్ పెట్టిన స్వీట్ తింటూ వాడు,”ఇప్పుడు వీడు సంతలో జిలేబి కాదులేరా. అసలు వీళ్లిద్దరు ఆప్రికాట్ లాంటోళ్లు” అంటూ మెల్లిగా లేచి రూం గోడపై ఓ కొటేషన్ రాశాడు.

“తీపిగా, చేదుగా ఉండే ఆప్రికాట్ పండ్లలాంటి మనుషుల్ని, ఆప్రికాట్ డిలైట్ డిష్‌గా మార్చేదేరా ప్రేమ” అని.
కాస్త నవ్వుకున్నాను. చాలా సార్లు విన్నాను గానీ తినడం అదే మొదటిసారి. రుచి చూశాక మాత్రం తనే గుర్తొచ్చింది. నిజంగా నాకు దొరికింది ఆప్రికాట్ డిలైటే.

⁃ హ్రిధాన్

*** *** ***

హ్రిధాన్ బీచ్లో ఒకావిడని బికినీలో తిరుగుతుంటే చూస్తున్నాడని దివ్యాంఖ ఇసుక మొఖం మీద కొట్టింది. నిజానికి అతను సరిగ్గా గుర్తుపట్టలేదు గానీ , బికినీలో ఉన్నావిడ యూట్యూబ్ వ్లాగ్స్‌కి చాలా ఫేమస్. ఆమె సముద్రం దగ్గర డ్రోన్ కెమెరాని గాల్లోకి లేపి ఓ వ్లాగ్ వీడియో తీస్తుండగా హ్రిధాన్, దివ్యాంఖ రోప్ తెగిన పారాసేలింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అది ఆమె రికార్డ్ చేసింది. వ్యూస్ కోసం కాస్త ఎడిట్ చేస్తుండగా బాగా జూమ్ చేసి గమనించింది, దివ్యాంఖనే కట్టేసిన క్లిప్స్ తీసేసి రోప్‌ని తెంపేసిన దృశ్యం.

⁃ రచయిత

*** *** ***

అర్థం పర్థం లేని ఆలోచనలు అన్ని ఈ అర్ధరాత్రి పూట నా అడ్రస్ కనుక్కొని మరీ బుర్రలోకి వచ్చాయా లేక నేనే వాటిని వెతుక్కుంటూ వెళ్లానా అని అర్థం కావటం లేదు.

ప్రొద్దున్నే…
“సోషల్ మీడియా వల్ల మళ్లీ ఈ మధ్యే ఫ్రెండ్స్ అయ్యామే, మనకు బాగా దగ్గర, పైగా మంచి మంచి సంబంధాలు పంపాడు. అయినా ఎందుకు చెప్పావ్ అంటావ్ ఏంటి…చెప్పకపోతే ఎలా? వంద మందిని ట్యాగ్ చేసిన కూడా పది లైకులు కూడా రాని లోకంలో ఉన్నాం, అలాంటిది ఎంతో మందికి చెప్తే గానీ ఒకటో రెండో సంబంధాలు వస్తాయి. నీ బయోడేటా మంచిగ రెఢీ చేసివ్వు, మంచి ఫోటోలు పంపు” అని ఫోన్లో మమ్మీ మాటలు.

మధ్యాహ్నం…
“ఐఫోన్ కొనిచ్చి లవ్ ప్రపోజ్ చేసాడే…ఐపిల్ వాడలేదని బ్రేకప్ చెప్పాడు. ప్రేమించిన విషయం మనసులోనే దాయగలను గానీ పెరిగే కడుపును ఎన్ని రోజులని దాయగలనే. మగాడిని దూరంగానే ఉంచి లవ్ చేస్తేనే బెటర్” ఆఫిస్లో ఫ్రెండ్లీ కొలీగ్ ఇచ్చిన అడ్వైస్.

రాత్రి…
వాడు ఎక్కడో చోట భయపడి టికెట్లు బుక్ చేస్తాడో లేదోనని నేను చేసేసా. ఇంకొద్ది రోజుల్లో వాడిని డైరెక్ట్ గా కలవబోతున్న అనే ఎక్సైట్మేన్ట్ లో ఉండగా ఆ ఇద్దరి మాటలు నన్ను మనసులో మనసు లేకుండా చేస్తున్నాయి.

ఈ ఆలోచనలు నాకు ముందే నుండే లేవా అంటే…ఉన్నాయి, కానీ ఎందుకో ఈ టైంలో రిస్కీ అనిపిస్తోంది. గుండెల్లో పరేడ్ జరుగుతున్నట్టు ఓ అలజడి, బుర్రలో ఆలోచనల మారథాన్.
రూమేట్స్ ఎవరు లేకపోవడంతో, ఫిజికల్గా అలా ఒంటరినైనా కూర్చుంటే, మెంటల్గా మాత్రం ఒంటరితనాన్ని తెచ్చిపెట్టుకున్నాను. నేనే భయపడ్తే వాడు ఇంకా భయపడిపోతాడు. ఛస్…పిచ్చలైట్.

బెడ్ పై కూర్చోని కిటికిలోంచి చూస్తున్నా, మబ్బుల చాటున ఉంటూ మఫ్టీలో తిరుగుతున్న చంద్రుడ్ని. డైవర్ట్ అయ్యను అనుకుంటూ మళ్లీ అవే ఆలోచనలు.
ఏదో అనుకొని తెగ ధైర్యం చేస్తాను గానీ దాని తర్వాత పరిణామాల్ని ఏలా ఎదుర్కోవాలనే ఆలోచనలు ఇబ్బంది పెడ్తున్నాయి. ధైర్యం తెచ్చిపెట్టిన భయాలు ఇవి!

చేతిలో ఉన్న మొబైల్ ఒక్క సెకండ్ కంపించే సరికి ఉలిక్కిపడ్డాను. అప్పటికే చేతులు చెమట పట్టేసాయి, ఫోన్ జర్రున జారిపడింది. తీసి చూసేసరికి స్ర్కీన్ మీద ఓ పెద్ద స్క్రాచ్. మళ్లీ పనిచేస్తుందో లేదోనని ఆన్ చేసి చూస్తే స్ర్కీన్ సేవర్ గా నవ్వుతున్న నేను. కానీ ఇప్పుడు పగిలిన స్ర్కీన్లో నా నవ్వు…దూరంగా చూస్తే పగలబడి నవ్వుతున్న ముఖం పై పగిలిన నవ్వులా… నిజంగా స్ర్కీన్ సేవర్ ఏమైన సూచిస్తుందా ? అనే ఆలోచనల్లో ఉండగా,
మొబైల్ మళ్లీ కంపించింది. వాడి మెసేజే. అది ఒక్క మెసేజ్ తో ఆగదని తెలిసే కాల్ చేసాను.

మాటలు…
ఎంత సేపు మాట్లాడినా ఎడతెగని, తనివితీరని…
మాటలు…
కాలానికీ అనస్థీషియా ఇచ్చినట్టు టైమే తెలీకుండా మాట్లాడాను, మత్తు వాడి మాటల్లో ఉంది, గంటసేపు అయ్యిందని ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యేదాకా తెలియలేదు. స్విచ్ఛాఫ్ అయిన ఫోన్లో నుండి కూడా వాడి మాటలు విన్పిస్తున్నట్టే అన్పిస్తుంటది…నా బుర్రలో తిరిగే ప్రతిధ్వనుల వల్లనేమో. ఇప్పుడు ఇంకెవరి మాటలు నాకు గుర్తుకు రావు కాబట్టి బెడ్ పై వాలాను. కలలో కూడా అతని మాటలే కావచ్చు, నిద్రలో కూడా సిగ్గుపడ్తున్న సంగతి నాది నాకే తెలిసిపోతుంది… నా గురక లాగే.

—2—

ధైర్యంగానే గోవా కి వెళ్లాను.
ట్రిప్ అయిపోయాకా మోసుకెళ్లిన బ్యాగులతో పాటు జ్ఞాపకాలని మాత్రమే తెచ్చుకుంటాను అనుకున్నాను కానీ సముద్రమంత భయాన్ని కూడా మోసుకుంటూ హాస్టల్ కి వస్తాననుకోలేదు.

నేనే రోప్ తెంపాను. చాలానే దొడ్డు ఉన్న రోప్ అది. సంద్రం లో ఎన్నో సార్లు తడిసి తడిసి బలహీనంగా మారిందా లేక నా దగ్గరున్న చిన్న కత్తికి అంతగా పదునుందా? ఇప్పుడు మా ప్రేమ కూడా రోప్ అంత గట్టిగా ఉందనుకుంటే నేను చేసిన పని తెలిస్తే ఆ రీసన్ చాలు చిన్న కత్తి కంటే ఇంకా పదునైనది. అమ్మో! నా హ్రిధాన్ కి ఎట్టి పరిస్థితిలో తెలీకూడదు…తెలీకూడదంతే…
ధైర్యంగా అనుకుంటూనే ఉన్నా కూడా కళ్ల నుండి మాత్రం నీళ్లు టపటపా బయటకొచ్చేసాయి, కాసేపు చెంపలపై కన్నీటి కాలువలు.

ఒకవేళ హ్రిధాన్ కి తెలిసినా లేక నేనే చెప్పినా…
లైట్ తీస్కుంటాడేమొ! అయినా కూడా తెలీకూడదు. నేను చెప్పను అనే ధైర్యం కంటే ఎలాగోలా ఆ విషయం హ్రిధాన్ కి తెలిస్తే ఎలా ? అనే భయం ఓ వైపుంటే…
బతికి బయటపడ్డాం కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇద్దర్లో ఎవరికైనా ఏమైన అయ్యుంటే ? అనే ఆలోచన కూడా తినేస్తుంది. హ్రిద్ధు నన్ను మళ్లీ నమ్ముతాడా? కలిసి నాతో నడుస్తాడా ? లేక భయపడ్తాడా?
ఏ ఛీ, వాడు బానే ఉన్నాడు కదా. ఎలాగూ అయిపోయిందేదో అయిపోయింది కాబట్టి మరి నేనేందుకి పిచ్చలైట్ తీస్కోవాల్సిన విషయంలో ఇంతలా స్ట్రెస్ అవుతున్నాను ? ఎంతైన చేసింది మాత్రం తప్పే…ఇదిగో ఇదే..ఇదే తినేస్తుంది నన్ను. వాడు కూడా కాల్ చేసి గోవా సంగతులు గుర్తుచేస్తున్నాడు. అదే ఇబ్బంది అయిపోయింది నాకు.

“వీకెండ్లో ఇంటికి వెళ్తునరా. అక్కడ ఫోన్ మాట్లాడడం కష్టం. బయటకు వస్తే నేనే చేస్తాను కానీ అయినా ఓ త్రీడేస్ మాత్రం ఓపిక పట్టు. నో కాల్స్, ఏదైన అర్జెంట్ ఉంటే మాత్రం మెసేజ్ పెట్టు” అని హ్రిద్దు చెప్పిన రోజు నుండి, ఆ మూడు రోజులు ఓ రకంగా డిప్రెషన్. వాడు ఉన్నప్పుడు కాలం వేటాడుతున్న పులిలా పరిగెడితే, కానీ ఇప్పుడు మాత్రం నత్త నడకలా ఉంది. ఇదంతా కాదు గానీ పనిలో మునగాలి అని ఆఫీస్, షాపింగ్, సినిమా అంటూ వేరే చోట్ల బిజీ బిజీగా తిరుగుతున్న కూడా రాత్రి అయ్యిందంటే చాలు నేను ఎక్కడ దాక్కున్నా కూడా ఒంటరితనానికి ఇట్టే దొరికిపోతున్నాను.

లాప్టాప్ మొబైల్ స్క్రీన్లు చూసి చూసి ఒత్తిడికి గురైన నా కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి, హ్రిధాన్ నుండి వచ్చిన వీడియో కాల్ కి.
“ఏం సంగతే దొరసాని?” అనే ఎప్పటిలా వాడి మొదలెట్టాడు. నేను వాడిని చూడగానే ఏడ్చేసి మళ్లీ నార్మల్ అయ్యను,

“నిన్ను ఒకటి అడగాల్నే, బేసిక్ గా సముద్రం చాలా మందికి ఓ స్ట్రేస్ బస్టర్ లాంటిది కదా. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓ సర్వే ప్రకారం కొంతమందికి సముద్రం దగ్గర ఎక్కువ సేపు గానీ ఉంటే ముఖ్యంగా అమ్మాయిలకు ఆ అలల వల్ల పీరియడ్స్, మూడ్ ఫ్లక్చువేషన్లు ఎక్కువ గా వస్తాయంటా.! ఇంకొంతమంది కి సముద్రం తెలీయకుండానే అలవాటైపోయి తర్వాత దాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్తో డిప్రెషన్ కి కూడా లోనవుతారంటా. ఇంతకి నువ్వు ఓకే కదా?” అని అడిగాడు.

నాకేం చెప్పాలో తెలియట్లేదు,
“సంబంధాలు చూస్తున్నార్రా. ఇంట్లో వాళ్లతో మాట్లాడి, తొందరగా పెళ్లి చేస్కో ప్లీ…జ్…” అని ఏడుస్తూ ఫోన్ కట్ చేసాను.

⁃ దివ్యాంఖ

*** *** ***

యూట్యూబ్ వ్లాగ్స్ చేసే లేడీ గోవా బీచ్లో ప్యారాసెలింగ్ చేసే పడవవి గుర్తుపట్టింది. ఆ పడవ ఓనర్ కి రోప్ తెంపిన వీడియొని చూపించగానే,
“వాళ్లిద్దరు నాకు మళ్లీ కనబడలేదు మేడమ్. కానీ రోప్ తెంపింది తన గర్ల్ ఫ్రెండే అని ఆ అబ్బాయికి తెలుసు! తెంపినందుకు కొత్త రోప్ కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చాడు, కానీ ఎందుకో తెలీనట్టున్నాడు” అని చెప్పేసి పడవని మళ్లీ సముద్రంలోకి లాక్కెళ్లాడు.

⁃ రచయిత

 

*

మన్ ప్రీతం

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Man! Loved this love story. Its a long side version from Hridhan side but short from Divyanka side. Anyways, enjoyed reading ur poetic expression in each line.

  • Slides of story narration same as tasting an Apricot Delight. What a thought and it’s really SWEET!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు