ఆదెమ్మ

“సామీ..” పిల్చింది ఆదెమ్మ.

ధ్యానంలో నుంచి బయటికి వచ్చి కళ్లెత్తి చూసి చిద్విలాసంగా నవ్వాడు స్వామి.

“ఏ వూరు సామీ మంది? ఈ మద్దె నిన్నెప్పుడూ ఇక్కడ సూచినట్టుగా లేదే” అంది ఆశ్చర్యంగా.

“రాత్రే వచ్చాను..”

“ఏ వూరు నుంచి సామీ?”

“దేశ దిమ్మరులం. అన్ని ఊర్లూ మావే. లోక కళ్యాణం కోసం తిరుగుతూనే ఉంటాం”.

“అవునా సామీ! అయితే నీకూ నాకూ పెద్ద తేడా లేదు సామీ..” అంది ఆదెమ్మ పెద్దగా నవ్వుతూ.

స్వామి నుదురు చిట్లించి ఆదెమ్మ వంక విచిత్రంగా చూశాడు.

“కోప్పడమాకు సామీ. ఒక గోడ మీద నుంచి ఇంకో గోడ మీదకి తిరిగే బల్లిలా నేను, ఒకింటి నుంచి ఇంకో ఇంటికి మారే పిల్లిలా నువ్వు. కాకపోతే నాకు తిరంగా ఒక ఇల్లుంది. నీకు లేదు అంతే” అంది ఆదెమ్మ.

బుర్రూపుతూ ఆదెమ్మ వంక శాంతంగా చూసి మళ్లీ ధ్యానంలోకి వెళ్లినట్లుగా కళ్లుమూసుకుంటున్న స్వామిని “సామీ..” అంటూ మళ్లీ పిల్చింది ఆదెమ్మ.

తన్నుకొస్తున్న కోపాన్ని, చిరాకునూ లోలోపలే దాచుకుంటూ పైకి ప్రశాంతంగా ఏంటన్నట్లు చూశాడు.

“ఇట్టా పొద్దత్తమానం కళ్ళు మూసుకుని, కాళ్లు సాపుకుని కూసుంటే ఇసుగ్గా ఉండదా సామి?” అడిగింది ఆదెమ్మ.

గుబురు మీసాల్లోనుంచి గుంభనంగా నవ్వుతూ జేబులోనుంచి చుట్ట తీసి వెలిగించాడు స్వామి.

“మడిశన్నాక బుర్రో, బుద్దో, కాలో, సెయ్యో పనిచేయాలి గదా! అందుకే అడుగుతున్నా సామి” అంది.

నోట్లోని చుట్ట చేత్తో పట్టుకుని పక్కకు తిరిగి తుపుక్కున ఉమ్మేసి ఆదెమ్మ వంక చూసి మళ్ళీ నవ్వాడు స్వామి.

“నేను అడుగతా ఉంటే ఏమీ సెప్పకుండా అట్టా నవ్వుతావేంది సామీ?” అంది ఆదెమ్మ.

“మీరు మానవమాత్రులు, మేము మానవాతీతులం. మాకు బుర్రా, బుద్ధీ పనిచేస్తున్నాయి కాబట్టే ప్రపంచాన్ని నడిపిస్తున్నాం” అన్నాడు స్వామి ఆమె వంక చూస్తూ.

బుర్రగోక్కుంటూ స్వామి వంక అయోమయంగా చూసింది ఆదెమ్మ. ఆమెవంక చూసి నవ్వుతూ “కాలూ చెయ్యీ ఆడుతున్న మీకు వాటి అంతరార్థం తెలియదులే” అన్నాడు.

“ఏమోలే సామీ? అచ్చరం ముక్క రానిదాన్ని. నాకయన్నీ యాడ తెలుత్తాయిలే గానీ, ఇదిగో ఈ అట్టు తింటా వుండు. ఎన్ని ముసుగులేసుకున్నా మడిశన్నాక ఆకలిదప్పులు తప్పవుగా! అదో కనిపించే పల్లెదాకా ఎల్లొత్తాను. ఆలెస్యమయితే అమ్ముడుబోవు” అంటూ సమాధానం కోసం చూడకుండా అక్కడి నుంచి కదిలింది. ఆమె వంక చూస్తూ తనలో తనే నవ్వుకున్నాడు స్వామి.

* * *

ఊరిలోకి అడుగుపెడుతుంటే ఆదెమ్మ మనసంతా కీడు శంకించింది. పిల్లాజెల్లా, ముసలీ ముతకా అంతా ఊరు విడిచి పోయినట్లుగా ఖాళీగా కనిపించింది. ఎక్కడా మనిషి అలికిడి లేదు. తలమీది బేసిన్ పైన కాకులు అదేపనిగా తిరుగుతుంటే చేతులతో అదిలించింది. తోక ఊపుకుంటూ వెనకెనకే వస్తున్న కుక్కలకు రెండు అట్టుముక్కలు పడేసింది.

‘అట్లమ్మోయ్ అట్లో..’ అంటూ గట్టిగా అరుస్తూ వేగంగా నడుచుకుంటూ పల్లెలోకి ప్రవేశించింది. నోటికి చీరచెంగులు అడ్డుపెట్టుకుని మౌనంగా నుంచున్న ఆడవాళ్లందరి చూపులూ ఆదెమ్మ మీద నిలిచాయి. ‘హుష్’ అంటూ నోటికి వేలు అడ్డుగా పెట్టి గట్టిగా అరవొద్దంటూ సైగచేశారు. ఏం జరిగిందో తెలియకపోయినా ఏదో జరిగినట్లుగా తోచింది అక్కడి పరిస్థితి చూస్తుంటే.

తలమీద బేసిన్ చంకలోకి మార్చుకుంటూ మౌనంగా వాళ్లను దాటుకుని ముందుకు నడిచిన ఆదెమ్మ అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. విగతజీవిగా మారిన పాతికేళ్ల కుర్రాడి చుట్టూ గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల్ని చూసి నోటిమాట రానట్లుగా నిలబడిపోయింది. కన్నీళ్ళు కట్ట తెగినట్లుగా ప్రవహించసాగాయి. ‘అత్తా అత్తా’ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ అట్లు కొనుక్కునే పిల్లోడు ఆయుష్షు తీరకుండానే కన్నుమూయడం ఆదెమ్మను నిలువెల్లా కుదిపేసింది. దుఃఖపు పొగలా ఆవరించిన అక్కడి వాతావరణాన్ని చూడలేక గుంపులోనుంచి వెనక్కి తిరిగింది.

“బంగారంలాంటి పిల్లోడు. బతుకు నాశనం చేసుకున్నాడు”.

“కావాలని పేనాలు తీసుకుంటారా ఎవరైనా? ఆడి కర్మ అట్టా కాలిపోయింది”.

“తినడానికి మెతుకు లేనప్పుడు మీసాలకు సంపెంగ నూనెందుకు? పగలంతా కట్టపడి తెచ్చుకున్న డబ్బులన్నీ బేనర్లకు తగలబెట్టడమెందుకు? అబిమానం అన్నం పెట్టుద్దా? ఆరాదన ఆకలి తీర్సుద్దా? ఎర్రిబాగులోడు. ఈడు బేనరు కట్టకపోతే ఆడెవుడూ సినిమా తియ్యడా? ఆళ్ళేమో గదుల్లో సల్లగా కూసుంటే ఈళ్ళు మాత్రం చెట్లెక్కి, స్తంబాలెక్కి, మిద్దెల మీదకెక్కి జారిపడి కాళ్ళూసేతులూ ఇరగ్గొట్టుకుంటారు. లేదంటే పేనాలు పోగొట్టుకుంటారు? ఇప్పుడీడు సచ్చాడని ఆడెవుడన్నా వచ్చి డబ్బులిత్తాడా? గుండెలు బాదుకుని ఏడ్చేది కన్నది, కట్టుకున్నదేగా!”

మౌనంగా తనలో తానే బాధపడుతూ కూర్చున్న ఆదెమ్మకు ఆ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి.

‘ఒక్కరొక్కరుగా అందరూ అక్కడినుంచి వెళ్ళిపోయాక ఏం మిగులుతుంది? అంతులేని చీకటి! కట్టె కాలిపోయాక ఏం మిగులుతుంది? గుప్పెడు బూడిద! ఇంతకీ.. బతుకులో ఆనందముందా? బాధ ఉందా? లేక రెండూ ఉన్నాయా? బతుకంతా ఆనందమే ఉంటే బాధ రుచి ఎలా తెలుస్తుంది? జీవితాంతం బాధే ఉంటే ఆనందాన్ని అనుభవించేదెప్పుడు?’

ఆదెమ్మను దుఃఖంతో పాటు అంతులేని ప్రశ్నలు కూడా వేధించసాగాయి. చేతికొచ్చిన కొడుకు నిర్జీవంగా కనిపిస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎలా భరిస్తున్నారో? రేపటి నుంచి వాళ్ల బతుకులోని ఖాళీని ఎవరు పూరిస్తారో? కొండెప్పుడూ అద్దం ముందు చిన్నగానే కనిపిస్తుంది. సమస్యెప్పుడూ బతుక్కంటే పెద్దగానే అనిపిస్తుంది. తెలుసుకున్నోడు  ముందుకెళ్తాడు, తట్టుకోలేనోడు మట్టిలో కలుస్తాడు. నోటికి చేతిని అడ్డం పెట్టుకుని నిర్లిప్తంగా తనలో తానే నవ్వుకుంది. బేసిన్లోని అట్లు ఆమెను వెక్కిరిస్తున్నట్లుగా కనిపించాయి. విషాదంగా వాటివైపు చూస్తూ అక్కడున్న పిల్లలందరినీ దగ్గరకు పిలిచి వాటిని ఇచ్చేసింది. కొన్ని అట్లు చిన్నచిన్న ముక్కలుగా చేసి దూరంగా విసిరేసింది. ఒక్కపెట్టున వాటి మీద మూగిన పక్షుల్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది.

బేసిన్‌కి తలకు మధ్య చుట్టలా పెట్టుకున్న తుండుగుడ్డను దులిపి భుజాన వేసుకుంది. ‘తనకేం మిగిలింది?’ తనను తాను ప్రశ్నించుకుంది. చేతిలోని ఖాళీ బేసిన్ వైపు చూసుకుంటూ ముందుకు నడిచింది.

***

“అట్లు తిన్నావా సామీ, బాగున్నాయా?” అని అడుగుతూ చీరకొంగుతో చెమట తుడుచుకుంటూ స్వామికి కొంచెం దూరంలో కూర్చుంది ఆదెమ్మ. ఆమె  వంక చూశాడు స్వామి. ఎండదెబ్బ తగిలిన పావురంలా ఉంది. ముఖమ్మీది చెమట బిందువులు తామరాకు మీద నీటిబొట్టులా మెరుస్తున్నాయి. నడకవల్ల కలిగిన ఆయాసంతో గుండెలు ఎగిరిపడుతున్నాయి.

నుదుటున రూపాయి కాసంత పెద్దబొట్టు. ఎండ పడినప్పుడు తళుక్కున మెరుస్తున్న ముక్కుపుడక. అక్కడక్కడా రాళ్ళూడిన చెవిదుద్దులు. రంగుమారి నల్లగా కనిపిస్తున్న పసుపుతాడు. చేతినిండా నాలుగైదు రంగులు కలిసిన గాజులు. ఎక్కువసార్లు ఉతికినట్లుగా బాగా నలిగి అక్కడక్కడా చిరుగులతో రంగువెలిసిన చీర. తెగిపోయేటట్లున్న కాలిపట్టాలు. వేళ్ళకు బిగుసుకు పోయిన మెట్టెలు. ముసలితనపు రూపురేఖలతో ఆదెమ్మ కొత్తగా కనిపించింది.

“ఏంది సామీ? ఏమడిగినా సమాధానం చెప్పకుండా బెల్లంగొట్టిన రాయిలా వుంటావు? నీకు ఇనబడదా?” అంది ఆదెమ్మ నవ్వుతూ.

“చాలా బాగున్నాయి” అన్నాడు యథాలాపంగా రోడ్డువైపు చూస్తూ.

“అందరూ అట్టాగే అంటారు సామీ. ఆ బగమంతుడు తలరాత సరిగా రాయలేదని బాదపడేదాన్ని. అట్లు పోసుకుని బతికే ఇద్దెనిచ్చి ఒక దారి సూపించాడు. ఇదివొరకు నేనట్లు పోత్తంటే వూరువూరంతా నా పొయ్యి సుట్టూ చేరేవోల్లు. కాలం కలిసి రాలేదు, ఎక్కడబడితే అక్కడ వోటల్లు పెరిగిపోయాయి. జనం రాకపోకలు తగ్గిపోయాయి. తప్పేదిలేక ఇంటింటికీ తిరిగి అమ్ముకుంటున్నాను. ముందు మా వూర్లో అమ్ముతాను. ఏమైనా మిగిలితే కనబడే పల్లెదాకా ఎల్లి అమ్ముకొత్తాను. అందుకే ఈ దారి నాకు బాగా అలవాటు సామి” అంది చీరకొంగుతో కళ్లొత్తుకుంటూ.

స్వామి మౌనంగా ఉండిపోయాడు.

“ఏం సామీ? నా గోసంతా సెప్పి ఇసిగించేత్తన్నానా” అంది ఆదెమ్మ.

ఆదెమ్మ మాటల్లో గడుసుతనం, కళ్లలో అమాయకత్వం కనిపించింది స్వామికి. ఆమెవైపు చూస్తూ “అదేమీ లేదులే! ఇంట్లో మగ మనిషి లేడా?” అన్నాడు.

సమాధానం చెప్పకుండా నేలచూపులు చూస్తున్న ఆదెమ్మతో “అయ్యో పోయాడా” అన్నాడు స్వామి.

స్వామివంక బాధగా చూస్తూ “ఎట్టా సెప్పేది సామీ? వున్నాడో లేదో తెలియదు. వుంటే ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడో ఒకచోట వుండే వుంటాడని మంగలసూత్రం తీయకుండా బతుకుతున్నాను. వూరెల్లినోడయితే రేపోమాపో వొత్తాడని చెప్పొచ్చు. అసలు వత్తాడో రాడో తెలియని మడిసిని వున్నాడని ఎట్టా సెప్పను సామీ?” అంది ఆదెమ్మ.

స్వామి ఆమెవంక జాలిగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.‌ కాసేపయ్యాక “తాగుతాడని, తిరుగుబోతని, ఏ పనీపాటా లేకుండా రోజులు గడుపుతాడని సెప్పకుండా దాచి పెల్లిచేసి నా గొంతుకోశారు. పెల్లైన మూడురోజులకు ఇల్లొదిలినోడు ఇదిగో ముప్పై యేల్లు గడిసినా ఇంటి మొకం సూడలేదు. కడుపున పుట్టినోల్లు లేరు. కడుపులో పెట్టుకుని సాకేవోల్లు లేరు. వొంటికొమ్ము సొంటికాయలాగా బతుకీడ్సుతున్నా..” చెప్పి చీరకొంగు నోటికి అడ్డుగా పెట్టుకుంది ఆదెమ్మ.

ఒంటరి పావురమేదో కుమిలి కుమిలి ఏడుస్తున్నట్లుగా అనిపించింది స్వామికి.‌ చెట్టుమీద నుంచి ఆశగా కిందకి దిగిన పక్షులు కొన్ని గింజలేమీ దొరక్క నిరాశగా వెనుదిరుగుతున్నాయి. ఏదో పనున్నట్లుగా తోక ఊపుకుంటూ వచ్చిన కుక్కలు చెట్టుమీద నుంచి రాలి పోగుపడిన ఆకుల గుట్టల్ని కాలితో కదిపి అక్కడే ముడుచుకుని పడుకుంటున్నాయి. చెట్టుకొమ్మల్లో నుంచి ఆదెమ్మ ముఖంపై పడుతున్న సూర్యకిరణాలు ఆమె గత జీవితంలోని వెలుగు నీడల్ని గుర్తుకు తెస్తున్నాయి.

“నీ కథ వింటుంటే బాధగా ఉంది. చావుపుట్టుకలు, తలరాతలు మనచేతుల్లో ఉండవు. పైనోడు ఎలా రాస్తే అలాగే ఈ జీవితాన్ని గడపాలి. అందులో ఎవరికీ మినహాయింపులు లేవు” అన్నాడు స్వామి ఆదెమ్మ వైపు చూస్తూ.

“అవునులే సామీ. అట్టా అనుకునే బతికేత్తన్నాను. లోకులు కాకుల్లా పొడిచినా తట్టుకుని నిలబడ్డాను. ఆడది వొంటరిగా బతకడం శానా కట్టం. అడుక్కునే దానికి అందం కూడా శాపమే సామి. యెక్కడికెల్లాడో తెలియక నేనేడుత్తుంటే నన్ను సూచి నవ్వేవోల్లు ఎక్కువయ్యారు. సూటిపోటి మాటలతో వేధించారు. నేను గయ్యాలిదాన్నని, నా పోరు బరించలేక ఇల్లొదిలి ఎల్లిపోయాడని నిందలేశారు. వొంటరిదాన్ని. ఎంతమందితో పోట్టాడగలను సామి? తలొంచుకున్నాను గానీ తప్పు సేయలేదు సామి. నాకొచ్చిన వంటనే బతుకుతెరువుగా మార్సుకున్నా” ఆగింది ఆదెమ్మ.

స్వామిలో ఏదో కదలిక మొదలింది. వేళ్ళతో ఏవో లెక్కలేసుకుంటూ, కళ్లను మూస్తూ తెరుస్తూ తనలో తానే గొణుక్కోసాగాడు. గతం తాలూకా నీలి నీడలేవో ముఖంమీది ముడతలుగా‌ కదలాడసాగాయి. చేతులతో కణతలు ఒత్తుకుంటూ ఆదెమ్మ వైపు బాధగా చూశాడు.

ఆదెమ్మ పైకి లేచింది.

ఆకులు అంటుకున్న చీరను దులుపుకుని ఖాళీ బేసిన్ని చేతిలోకి తీసుకుని స్వామివైపు చూస్తూ “ఎల్లొత్తాను సామీ. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఎవరి బతుక్కి ఎవరు కర్తలు? ఇంటిని పోసించాల్సిన మగోల్లంతా సన్నాసులై దేశాలమ్మట తిరుగుతుంటే, నాలాంటి ఆడది అట్లు పోసి అమ్ముకోవడం కంటే ఇంకేం జేత్తది సామి? మొగతోడు లేని ఆడదాన్ని అడవిలో వొదిలినా అన్నం కూరా వొండుకుని తింటది. ఆడతోడు లేని మొగోడ్ని పెద్దపెద్ద బవంతుల్లో వుంచినా పట్టెడు మెతుకులు కాదు గదా, గుక్కెడు నీళ్ళు కూడా ముంచుకు తాగలేడు సామీ. ఆ ఇసయాన్ని మగోడు ఎప్పటికి తెలుసుకుంటాడో? నా బతుకు ఇట్టా ఎందుకయిందని కాలాన్ని నిందిత్తూ కాల్లు బార్లా సాపి కూచోటం కంటే కట్టెల పొయ్యి మీద నాలుగట్లు పోసుకుని అమ్ముకోడమే నా జీవితం నాకు నేరిపించిన పాటం. ఈ కట్టె ఇంకెన్నాల్లుంటది సామీ? రేపో మాపో కాలాల్సిందేగా! కాలేదాకన్నా కాలూ సెయ్యీ ఆడాల్సిందేగా” చెప్పి ముందుకు కదిలింది ఆదెమ్మ.

రెండు కన్నీటి చుక్కలేవో స్వామి కంటినుంచి రాలిపడి ఎండుటాకులు గలగలలాడాయి. చేతికి సంచి తగిలించుకుని పడమటి దిక్కువైపు సాగిపోయాడు స్వామి.

*

కథంతా పూర్తిగా నా మెదడులో రూపుదిద్దుకుంటే తప్ప రాయలేను

* నమస్తే సుబ్బారావు గారు! మీ గురించి చెప్పండి.

మాది గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు. పుట్టి, పెరిగింది అక్కడే. ప్రస్తుతం నూజివీడులో ఉంటున్నాను‌‌. ట్రిపుల్ ఐటీలో తెలుగుశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 13 ఏళ్ల నుంచి పని చేస్తున్నాను.

* మీ కథల ప్రయాణం ఎలా మొదలైంది?

నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగులో ఎంఫిల్, పీహెచ్డీ చేశాను. ‘ప్రాచీన సాహిత్యం – వ్యాఖ్యాన సంప్రదాయం’ నా టాపిక్. పిల్లలమర్రి రాములు గారు నా గైడ్. జిలుకర శ్రీనివాస్ గారు నా సీనియర్. వాళ్ల ద్వారా సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడింది. అక్కడ వాతావరణం ఉత్సాహకరంగా ఉండేది. అక్కడే మొదట కవితలు, ఆ తర్వాత కథ రాశాను. 2007లో ‘ముసురు’ అనే కథ రాశాను. ముగింపుపై సందిగ్ధతతో చాలా కాలం ఆ కథను ఎక్కడికీ పంపలేదు. ఆ తర్వాత ప్రొఫెసర్ అరుణకుమారి గారికి చూపించి సలహాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లకు 2012 నవ్య వారపత్రిక నవంబర్ సంచికలో ఆ కథ ప్రచురితమై బహుమతి కూడా వచ్చింది.

* ఇప్పటికి ఎన్ని కథలు రాశారు?

75 కథల దాకా రాశాను. అందులో చాలా కథలకు బహుమతులు వచ్చాయి. 100 కవితలు రాశాను. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం వివిధ సందర్భాల్లో 20 పాటలు రాశాను. ‘తలరాతలు’, ‘ఆకుపచ్చని కన్నీరు’ కథా సంపుటాలు, ‘గడియారం బతుకులు’ కవితా సంపుటి, ‘వ్యాసలోహిత’ అనే వ్యాససంకలనం, ‘విజయ విలాసం – పరిచయం’ అనే మరో పుస్తకం ప్రచురితమయ్యాయి‌. ‘తలరాతలు’ పుస్తకానికి 2018లో వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం అందుకున్నాను.

* మీకు నచ్చిన రచయితలు?

ప్రాచీన కవుల్లో శ్రీనాథుడు ఇష్టం. వర్ణనకు ఆయన ఇచ్చే ప్రాముఖ్యాన్ని గమనించేవాణ్ని. తిలక్ కథలు, చలం ‘మ్యూజింగ్స్’ ఇష్టం. యూనివర్సిటీలో పసునూరి రవీందర్, ఎండ్లూరి మానస నా జూనియర్లు. వాళ్ల కథలూ నచ్చుతాయి.

* బోధనా రంగంలో ఉన్నారు కదా! ఇప్పటి విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తి ఉందా?

ఉంది. నేను పనిచేసే ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు తెలుగు ఒక సబ్జెక్టు. అలా ఉన్న విద్యాసంస్థ బహుశా ఇదొక్కటే! దినపత్రికల్లో నా కథలు వచ్చినప్పుడు విద్యార్థులు చదివి స్పందిస్తారు. సందేహాలు అడుగుతారు. కథలు రాయమని వారినీ ప్రోత్సహిస్తాను‌. కథలపోటీ నిర్వహించినప్పుడు చాలా మంది ఉత్సాహంగా రాశారు. అందులో కొన్ని కథలు ఎంపిక చేసి పుస్తకంగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను.

* ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?

కథంతా పూర్తిగా నా మెదడులో రూపుదిద్దుకుంటే తప్ప రాయలేను. మరిన్ని కథలు రాయాలని ఉంది. ఒక నవల కూడా రాయాలని అనుకుంటున్నాను.

*

జడా సుబ్బారావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సుబ్బారావుగారి కథ ‘ఆదెమ్మ’ ఇప్పుడే చదివాను. కథనీకరించడంలో చేయితిరిగిన రచయిత. ఎక్కడ ఏది చెప్పాలో, ఎంతవరకూ చెప్పాలో తెలిసిన రచయిత. కథను ఒక శిల్పంలా తీర్చిదిద్దడం తెలిసి కథకుడు. ఆదెమ్మ అట్లు అమ్ముకుంటూ జీవించినా నిలువెత్తు మానవత్వమున్న మనిషి. మానవ సంబంధాల్ని సజీవం చేసే మనిషి. కథకుడు ఆదెమ్మ భర్తే స్వామి అని వాచ్యం చేయకుండానే సూచ్యం చేసిన శిల్పనైపుణ్యం అద్భుతం. రెండు పాత్రలతో సమాజంలోని రెండు ధోరణులు గల మానవ స్వభావాన్ని సమర్థవంతంగా చెప్పారు. పాత్రోచిత మైన భాష, సందర్భోచితమైన సామెతలు పాఠకుణ్ణి ఆనందపారవశ్యంలో ముంచెత్తుతాయి. లోకం తీరుని కళ్ళకు కట్టించిన ఈ కథలో శుష్క వాక్యాలతో జీవితాన్ని గడిపే స్వాముల్ని, సంసారాన్ని ఈదలేక ఓడిపోయి, తాను మాత్రమే ఒడ్డుకి చేరి, మధ్యలోనే కుటుంబాల్ని ముంచేసే స్వామి లాంటి వాళ్ళకంటే బతికినంత కాలం సజీవం చైతన్యంతో జీవించడమెలాగో ఆదెమ్మను చూసి నేర్చుకోవాల్సిందెంతో ఉంది. ఆదెమ్మ ఒక ఉత్తమురాలైన పవిత్రమైన స్త్రీకీ, సజీవచైతన్యానికీ ప్రతీకగా కనిపిస్తుంది. సుబ్బారావుగారు..మీకు నా హృదయపూర్వక అభినందనలు… ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

  • జీవన వైరుధ్యాలను ప్రతిభావంతంగా చిత్రించిన కథ. బాధ్యతల్ని గాల్లో కలిపేసి, తమ మానాన తాము పలాయనం చిత్తగించిన మగ పుంగవుల రాహిత్యాన్ని సున్నితంగా ఉతికి ఆరేశారు సుబ్బారావు గారు. అదే సమయంలో ఆదెమ్మల్లాంటి అమ్మలు ఈ సమాజాన్ని భుజాలపై మోస్తున్న సజీవ జీవనచిత్రాన్ని ఆవిష్కరించారు. రచయితకు అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు