ఏం చెయ్యాలి?

పొద్దున్నే ఐదింటికి లేచి, బూట్లూ, గట్రా తొడిగి, తయారై, బయటికి వ్యాయామానికి వెళుతూ, “ఇదుగో, ఏమోయ్, నిన్నటి లాగా ఇవాళ కూడా బద్దకించకు! లేచి, నీ నేస్తాలతో నడవడానికి వెళ్ళు! నాతో రమ్మంటే రావు, నేను వేగంగా నడుస్తానంటూ”  అని భార్యని హెచ్చరించాడు ప్రసాద్.

“అబ్బ! వెళతాలెండి. ఒక ఐదు నిమిషాలు పడుకుని, లేస్తాను” అంటూ వరలక్ష్మి, మళ్ళీ దుప్పటి ముసుగేసింది ధనుర్మాసం చలికి.

భార్యపై నమ్మకం లేకపోయినా, అప్పటికి నమ్మకం పెట్టుకుని కదిలాడు ఈ పెద్ద మనిషి. ఉద్యోగ విరమణ చేసినప్పటి నించీ క్రమం తప్పకుండా రోజూ రెండు గంటల సేపు వ్యాయామం చేస్తో వుంటాడు. ఉద్యోగంలో వున్నపుడు కూడా తరుచూ వ్యాయామం చేసిన మనిషే. ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ ఈయనకు. దగ్గిర నేస్తాలు, “ఆయనకు వ్యాయామం పిచ్చి!” అంటారు చనువుగా.

దానికి ఈయన నొచ్చుకోడు. పైపెచ్చు సంతోషించి, “ఆరోగ్యం పాడు చేసుకుని, ఇతరుల మీద ఆధార పడి బతకాలా?” అని ఎదురు ప్రశ్నలు వేస్తాడు. ఆపైన, “మీరు కూడా నాతో వ్యాయామం చెయ్యండి! మీ ఆరోగ్యానికి చాలా మంచిది” అంటూ వాళ్ళని ప్రోత్సహిస్తో వుంటాడు. వాళ్ళు, ఎప్పట్లాగే పారిపోడానికి ప్రయత్నిస్తో వుంటారు.

ఇంటికి దగ్గిర్లో వున్న ఒక స్కూలు కాంపౌండుకు వెళ్ళి, అక్కడున్న మైదానంలో రెండు గంటల సేపు ఐదు మైళ్ళు నడిచి, తృప్తిగా ఇంటికి చేరాడు ఆ రోజు, “తప్పు చేశాననే భావన లేకుండా, ఈ రోజు భోజనం చేయొచ్చు!” అనే సంతోషంతో.

అప్పటికే తన నడక పూర్తి చేసుకున్న వరలక్ష్మి, కాఫీ కప్పుతో ఎదురు వచ్చింది. కప్పు చేతికి అందించి, వార్తా పత్రిక కూడా అందించి, అక్కడే నించుంది, ఏదో చెప్పాలన్నట్టు.

“ఏమన్నా చెప్పాలా? ఇంతకీ నడిచావా ఇవ్వాళ?” అంటూ ఆరా తీశాడు ప్రసాద్.

“అబ్బ! నడిచాలెండి. అరగంట కిందట, మీ చిన్ననాటి స్నేహితుడు రావు గారబ్బాయి ఫోను చేశాడు. రావు గారు, ఢిల్లీ నించి ఈ ఊరు వొచ్చేశారట. కొడుకు దగ్గిరే వుంటున్నారట. ఆరోగ్యం బాగోలేదట. మిమ్మల్ని చూడాలనుందట ఆయనకి” అంటూ మొత్తం విషయం అంతా, ‘అట, అట’ భాషలో చెప్పేసింది.

“అలాగా! నా నేస్తం ‘రావా’? ఎన్నాళ్ళయిందో చూసి గానీ, మాట్లాడి గానీ! స్నానం చేసి వెళ్తాను” అంటూ పాత స్మృతుల లోకి వెళ్ళి పోయాడీయన.

 

                     *              *             *

   ఈ ప్రసాదూ, రావూ, ఇద్దరూ, ఒకే కాలేజీలో సహాధ్యాయులే గానీ, ప్రతీ దాని లోనూ గొడవే! పోటీయే!

ప్రసాద్, వ్యాసాలూ, కధలూ గిలికితే, రావు, కవిత్వంతో, పద్యాలూ, అవీ, గిలికే వాడు. కాలేజీ మాగజైనులో ప్రచురణకి పోటీ! క్లాసులో మార్కుల కోసం పోటీ!

ప్రసాద్ అయితే, “దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే. ప్రకృతే శాశ్వితం. నాస్తికత్వం వర్ధిల్లాలి!” అని కాలేజీ డిబేట్లో వాదిస్తే, “ఈ ప్రకృతిని కూడా సృష్టించినది ఆ దేవుడే. బిగ్ బేంగ్ థీరీ (పెద్ద విస్ఫోటన సిద్దాంతం) కూడా వీళ్ళ నమ్మకమే. ఆస్తికత్వం వర్ధిల్లాలి!” అని రావు, ప్రసాద్‌కి బదులు వాదించే వాడు.

ప్రతీ దానిలోనూ, ఇద్దరూ ఒకే అయస్కాంతానికి వున్న ఉత్తర, దక్షిణ ధృవాలే! అన్నిటికీ ఎడ మొహం, పెడ మొహం!

“సావిత్రి గొప్ప నటి!” అని ప్రసాదూ, “జమున గొప్ప అందకత్తె!” అని రావూ, జుట్లు పీక్కోవడం ఒక్కటే తక్కువ! అలా అన్నట్టు గొడవ పడేవారు.

“అమ్మా, కొంచెం ముక్క వడ్డించమ్మా – అంటాడు, మీ హీరో కృష్ణ అని ఒకరు వెక్కిరిస్తే, “అమ్మా, కొంచెం పప్పు వడ్డించమ్మా – అంటాడు, మీ హీరో శోభన్‌బాబు అని ఇంకొకరు వెక్కిరిస్తారు.

ఆ రోజు కాలేజీలో ఇంకో డిబేట్ పోటీ. వీళ్ళిద్దరూ ఆవేశంగా చేసే వాదనలు వినడానికి, చాలా మంది విద్యార్ధులు ఉత్సాహ పడ్డారు ఎప్పటి లాగానే. ఎవరు నెగ్గుతారీ పోటీలో – అన్నదాని మీద పందేలు కూడా కాసేశారు కొందరు.

“ ’కారుణ్య హత్య’లను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఒక మనిషి, తన చివరి కాలంలో, మంచం మీద వుండి, ఇతరుల చేత సేవలు చేయించుకుంటూ, ఆత్మ గౌరవం లేకుండా, అవమానంతో బతుకుతూ వున్నప్పుడు, ఆ మనిషి తన ఇష్టం కొద్దీ మరణించడానికి, డాక్టర్లు సహాయ పడాలి. దీన్ని ఆత్మహత్యగా పరిగణించ కూడదు! ప్రభుత్వం దీన్ని చట్టబద్ధం చెయ్యాలి!” అని ప్రసాద్, చాలా ఆవేశంగా వాదించాడు.

రావు ఏమీ తక్కువ తినలేదు. “జబ్బుతో కృశించి పోతూ, రోజులో, నెలలో అన్నట్టు వుండే ఆ మనిషికి, తన ప్రాణం మీద తనకి హక్కు వుండాలి. ఎంతో యాతన పడి గానీ, ఆ మనిషి మరణించ కూడదని అనడం అరాచకం. అమానుషం. మల, మూత్ర విసర్జన, మంచం మీదే జరుగుతూ వున్నప్పుడు, అంత అశుభ్రతతో జీవించడం ఆ మనిషికి చాలా ఘోరంగా వున్నప్పుడు, మరణించడ మనేది చాలా గౌరవనీయ మైన విషయం. డాక్టర్లు మందిచ్చి, ఆ మనిషి హాయిగా, ప్రశాంతంగా మరణించడానికి తోడ్పడాలి!” అంటూ వాదించాడు రావు కూడా.

వీళ్ళిద్దరూ ఒకరి కొకరు వ్యతిరేకంగా వాదిస్తారనుకున్న మిగిలిన విద్యార్ధులకు, చాలా ఆశా భంగం కలిగింది. వారు బాగా నిరుత్సాహ పడ్డారు. వాళ్ళ ప్రాణాలు ఉసూరుమన్నాయి.

ప్రసాద్, రావూ, ఇద్దరూ కూడా ఒకరి మాటలు ఇంకొకరు విని, చాలా ఆశ్చర్య పడ్డారు! సంతోషించారు కూడా.

” ‘కౌరవులకూ, పాండవులకూ మధ్య సయోధ్య, పారిపోవడంలో కుదిరిందట’ అన్నట్టు, ఇక వీళ్ళిద్దరూ స్నేహితులై పోతారా, ఏం?” అన్నాడొక విద్యార్ధి.

“అదేం సామెత? నేనెప్పుడూ వినలేదే! వివరంగా చెప్పూ!” అని మొదటి వాణ్ణి అడిగాడింకొక విద్యార్ధి.

“ఒకూళ్ళో, శ్రీరామ నవమి పందిట్లో, కురుక్షేతం నాటకం వేస్తున్నారు. కౌరవులూ, పాండవులూ, కసిగా, పిచ్చి కుక్కల్లా, పెద్ద పెద్ద పద్యాలతో, అగ్గి పుల్లల్ని గీసి ఉత్సాహంగ విసిరేస్తూ, కొట్టేసుకుంటున్నారు. అప్పుడు ఆ పందిరికి నిప్పంటుకుంది. ‘ఒరేయ్, జాగ్రత్తరోయ్!’ అంటూ దుర్యోధనుడు, భీముడి చేతిని పట్టుకుని పరిగెత్తాడు. దుశ్శాసనుడు, ద్రౌపదిని కాపాడాడు. కౌరవులూ, పాండవులూ కలిసి పారిపోయారు పందిట్లోంచి” అంటూ పిట్ట కధ చెప్పాడా మొదటి విద్యార్ధి.

ఆ విధంగా, అప్పుడు బద్ధ శతృవులైన  ప్రసాద్, రావులు, ఇద్దరూ ఒకరి నొకరు చూసుకుని, సంబర పడ్డారు.

న్యాయ నిర్ణేతలు, ఇద్దరికీ మొదటి బహుమతి ప్రకటించారు. ఇక, రెండో బహుమతి ఎవరికీ ఇవ్వలేదు. ఆ నాటి నుంచి వాళ్ళిద్దరూ స్నేహితులై పోయారు. ఆ ‘కారుణ్య హత్య’ అనే ఒక్క విషయంలో వాళ్ళిద్దరికీ సయోధ్య కుదిరి, అది వారిని మంచి స్నేహితులుగా చేసింది. ఆ స్నేహమే, మిగిలిన విబేధాలను కాస్త దూరంగా పెట్టి, వాటిని చిన్న చూపు చూసింది.

“నువ్వు బహుమతి కోసం అలా వాదించావా, లేక నిజం గానే అవి నీ అభిప్రాయాలా?” అని అడిగాడు ప్రసాద్, రావుని. అందరూ అలాగే అడిగారు రావుని.

“నేనూ ఇదే ప్రశ్న నిన్ను అడుగుదామనుకుంటున్నాను. నీవి కూడా నిజంగా ఆ అభిప్రాయాలేనా?” అని బదులడిగాడు రావు కూడా.

ఇద్దరూ సంతోషించారు తమ కొత్త స్నేహానికి. ఆ స్నేహం, మిగిలిన కాలేజీ రోజులన్నీ సాగింది. ఆ ఒక్క సయోధ్య, వారిద్దరినీ దగ్గిర స్నేహితులను చేసింది.

ఆఖరికి కాలేజీ నుంచి విడి పోయే రోజు వచ్చింది.

“ప్రభుత్వం ఈ ‘కారుణ్య హత్య’లను ప్రోత్సహించే రోజు ఎప్పుడు వొస్తుందో తెలీదు. నేను వృద్ధాప్యంలో వుండి, చాలా ఘోరమైన స్తితిలో వున్నప్పుడు, నేను ప్రశాంతంగా మరణించడానికి, నువ్వు నాకు సాయం చేస్తావా?” అని అడిగాడు ప్రసాద్, ఒక రోజు రావుని సీరియస్‌గా.

“సరిగ్గా ఇదే, నేనూ నిన్ను అడుగుదామనుకుంటున్నాను. నువ్వే అడిగేశావు మొదట. మనం తప్పకుండా ఒకరి కొకరు సాయం చేసుకుందాం మన జీవితంలో” అని బదులిచ్చాడు రావు, చాలా సీరియస్‌గా.

ఇద్దరు నేస్తాలూ చాలా మురిసి పోయారు. ప్రమాణాలు చేసేసు కున్నారు, “నాకు ప్రమాణం మీద నమ్మకం లేదు” అని ప్రసాద్ గొణుగుతోన్నా! ఆ ఒక్క విషయం లోనూ మాత్రం ప్రమాణం పని చేస్తుందనే నిర్ణయానికి వొచ్చేశారు ఆ ఇద్దరు స్నేహితులూ!

ఆ తర్వాత కాలంలో, ఇద్దరూ విడి పోయారు. పెద్ద చదువులకు వేరే వేరే వూర్లు వెళ్ళి పోయారు. ఆ పైన పెద్ద వుద్యోగాలకు ఇంకో వేరే వేరే వూళ్ళు! మొదట్లో ఉత్తరాలు రాసుకున్నారు గానీ, కాలం గడిచే కొద్దీ, వారి స్నేహం పలచన అయింది!

 

                     *                       *                  *

 

కాల ప్రవాహంలో పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లలూ పుట్టారు. ఉద్యోగాల్లో ఉన్నత స్తాయికి కూడా ఎదిగారు. అంటే, ఏముందీ? పెద్ద జీతాలన్న మాట!

మూడు దశాబ్దాల తర్వాత, ఒక సారి ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళాడు ప్రసాద్. తన చిన్ననాటి నేస్తం రావు గుర్తొచ్చాడు. అతను అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని విన్నాడు. చాలా ప్రయత్నం మీదట కనుక్కుని, వెళ్ళాడు రావు ఇంటికి.

రావు, సాదరంగా ఆహానించాడు ఈ స్నేహితుణ్ణి.

“నువ్వు చూడ్డానికి ముప్ఫై యేళ్ళ కుర్రాడి లాగా వున్నావు! చాలా ఆరోగ్యంగా వున్నావు!” అని మనస్ఫూర్తిగా సంతోషించాడు రావు.

రావును చూసి ప్రసాద్ ఆశ్చర్య పోయాడు. యాభై ఐదేళ్ళకే రావుకి జుట్టంతా వూడి పోయింది. “అదేదో వంశ పారంపర్యం అయి వుంటుంది” అని సరి పెట్టుకున్నాడు ప్రసాద్.

మాటల్లో తెలిసింది, రావు భార్య ఏదో జబ్బు చేసి కొన్నేళ్ళ కిందట చనిపోయిందనీ, వున్న ఒకే ఒక్క కొడుకు మా వూళ్ళోనే ఏదో చాలా పెద్ద ఉద్యోగంలో వున్నాడనీ కూడా.

రావు చూడ్డానికి బాగా వృద్ధుడై పోయాడు. వీపు వంగి పోయింది. మొహంలో కళ అంతా పోయింది. శరీరంలో పటుత్వం అంతా పోయింది. కాళ్ళూ, చేతులూ పుల్ల ముక్కల్లాగా వున్నాయి. లావైతే ఎక్కలేదు. ఎన్నో జబ్బులున్న మనిషి లాగా వున్నాడు చూడ్డానికి.

“నువ్వు రోజూ వ్యాయామం చెయ్యవా? అప్పుడే శరీరానికి ఇంత వృద్ధాప్యం ఏమిటీ?” అని చనువు గానే అడిగాడు ప్రసాద్.

“ఏం వ్యాయామం బాబూ! రోజంతా ఉద్యోగ ధర్మం నిర్వర్తించడానికే సరి పోతోంది. షుగర్ కూడా వొచ్చింది. దాని చెల్లెలు, బీపీ కూడా అక్కని వొదల కుండా వొచ్చేసింది. కిడ్నీ సమస్య కూడా వుందిలే. ‘ఇంకా కొన్నాళ్ళు పోతే, ‘డయాలిసిస్ చేయించాల్సి వొస్తుందేమో’ అంటున్నాడు డాక్టరు. మొన్నా మధ్య రెండు కళ్ళాపరేషన్లు కూడా జరిగాయి, షుగరు కారణంగా వచ్చిన సమస్యల వల్ల. దేని మీదా ఉత్సాహం వుండదు. ‘ఆ(, ఏదో బతికేస్తే పోదూ!’ అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చాడు రావు.

అలా అన్నాడు గానీ, రావుది చాలా విలాసవంతమైన జీవితమే. ఎక్కడికి వెళ్ళినా కారే! ఇంట్లో కూడా పని మనుషులు వున్నారు. ఎటువంటి శారీరక శ్రమా చేసే మనిషి లాగా కనబడలేదు.

స్నేహితులిద్దరూ, ఇక ఆరోగ్యం విషయం వొదిలేసి, వేరే కబుర్లు ఎన్నో చెప్పుకున్నారు కొంత సేపు. అయినా, మళ్ళీ ఆరోగ్యాల మాటలే.

కొంత సేపు పోయాక, “ఈ వయసులో మనం కోలనాస్కపీ చేయించుకోవాలి తప్పకుండా, కోలన్ కేన్సరు నించి తప్పించు కోవడానికి. స్లీప్ ఆప్నియా పరీక్ష కూడా చేయించు కోవాలి. బప్పీ లహిరి, స్లీప్ ఆప్నియా వల్లే మరణించాడట. కోలన్ కేన్సర్ వల్ల అమెరికాలో ఎన్నో మరణాలు సంభవిస్తాయట. ప్రాస్టేట్ పరీక్ష కూడా చేయించుకుంటూ వుండాలి. షుగరునీ, బీపీనీ కంట్రోల్‌లో పెట్టు కోవాలి.  వేళకి తిండి తినాలి. రాత్రిళ్ళు తొందరగా తినాలి. నువ్వు రోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి” అంటూ ఎన్నో జాగ్రత్తలు చెపుతూ, ప్రసాద్ చాలా హితబోధ చేశాడు.

ప్రతీ మాటనీ రావు విన్నాడు గానీ, ఏమీ జవాబు చెప్పలేదు. మాట మార్చేస్తూ వొచ్చాడు.

ప్రసాద్, ఆరోగ్య విషయ చర్చల్లో, ఒక జలగ. పట్టుకుంటే వొదలడు. అవే మాటలు పదే పదే చెప్పాడు ఆ ఒక్క రోజు లోనూ.

అంతే! రావుకి బాగా కోపం వొచ్చేసింది.

“చూడు ప్రసాద్! నువ్వు నా మంచికే చెబుతున్నావు. అది, నాకు తెలుసు. అయినా నేను ఎవ్వరి మాటా వినను. నా అంతట నాకు తోస్తే తప్ప, నువ్వు చెప్పావని మాత్రం చెయ్యను. నువ్వు అవే మాటలు పదే పదే చెబుతుంటే, అస్సలు పట్టించుకోను. కాబట్టి, ఆరోగ్యం గురించి చెప్పడం మానెయ్యి ఇక” అని మందలింపులు చేశాడు ప్రసాద్‌ మీద.

ప్రసాద్, కంగు తిన్నాడు. వాదించే మనసూ, కోరికా రెండూ పోయాయి. నీరసంగా మాట్లాడకుండా వూరుకున్నాడు.

మళ్ళీ వేరే కబుర్లు చెప్పుకుని, చక్కటి భోజనం చేసి, “మళ్ళీ మాట్లాడుకుందాం!” అంటూ ఒకరి నించి ఒకరు శలవు తీసుకున్నారు.

ఆ ‘మళ్ళీ మాట్లాడుదాం’ అనేది ఒక అబద్ధమని, ఇద్దరికీ తెలుసు. ఆ అబద్ధమే ఇప్పుడు నిజం అవబోతోంది.

                 *                   *                *

   “నేవెళ్ళి రావును కలిసి వొస్తాను” అన్నాడు ప్రసాద్, వరలక్ష్మితో.

వరలక్ష్మి, ఒక బేగ్‌లో కొన్ని పళ్ళు పెట్టి ఇచ్చింది, “రావు గారిని అడిగినట్టు చెప్పండి” అంటూ.

ఆమె ఎప్పుడూ రావును కలవక పోయినా, వాళ్ళిద్దరి చిన్నప్పటి స్నేహం గురించీ ఆమెకి తెలుసు.

“అలాగే” అంటూ కదిలాడు ప్రసాద్. రావు కొడుకు ఇంటికి వెళ్ళాడు.

“రండి అంకుల్!” అంటూ రావు కొడుకు, ప్రసాద్‌ని లోపలికి తీసికెళ్ళాడు.

ఆ విశాలమైన గదిలో మంచం మీద రావు, కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు. గది చాలా శుభ్రంగా వుంది. మంచం పక్కనే, సెలైను స్టాండూ, ఆక్సిజన్ సిలిండర్‌, ఇంకా ఏవేవో మెడికల్ సామగ్రీ వున్నాయి. ఖరీదైన ఆస్పత్రి లోని గది లాగా వుంది.

మంచం మీద రావుని ప్రసాద్, ఒక పట్టాన గుర్తు పట్టలేక పోయాడు. ఆ మంచం పక్కనే వున్న కుర్చీలో కూర్చున్నాడు.

కాస్సేపటికి కళ్ళు తెరిచాడు రావు, నీరసంగా. ప్రసాద్‌ని చూసి చిన్నగా నవ్వాడు.

“ఎలా వున్నావు? వ్యాయామం బాగా సాగుతోందా?” అన్నాడు రావు. గొంతు లోని మాట ఎక్కడో నూతి లోంచి వచ్చినట్టు వుంది.

రావు కొడుకు బయటకి వెళ్ళి పోయాడు, ఈ నేస్తాలిద్దరినీ అక్కడ వదిలి.

“నేను బాగానే వున్నాను. నువ్వేమిటి, ఇలా అయిపోయావు? ఇన్ని జబ్బులా? ఇన్ని కష్టాలా? చాలా బాధగా వుంది నిన్ను చూస్తుంటే. వొద్దులే, ఎక్కువ మాట్లాడకు. విశ్రాంతిగా వుండు” అన్నాడు ప్రసాద్ ఆవేదనగా.

‘ఫర్వాలేదు. కొంచెం మాట్లాడ గలను. ఈ మాటలు మాత్రం ఎంత కాలం వుంటాయిలే? కొన్ని నెలలేమో మహా అయితే! నా ఆరోగ్యం గురించి నువ్వా నాడు చెప్పిన మాటలు పట్టించు కోలేదు. నాకు స్లీప్ ఆప్నియా వుందని చాలా ఆలస్యంగా తెలిసింది. కోలన్ కేన్సర్ బాగా ముదిరిందని ఈ మధ్యనే తెలిసింది. వ్యాయామం ఏ నాడూ లేదు కదా? ఇదంతా నేను నాకు చేసుకున్న కర్మ! కర్మ కాదు, ఖర్మ! ఇప్పుడు వగచి ఏం లాభం లే!” అన్నాడు రావు.

రావు కళ్ళ లోంచి నీరు ఉబికింది బయటకి. అక్కడే వున్న క్లీనెక్స్ పేపర్‌తో రావు కళ్ళు తుడిచాడు ప్రసాద్. తుడుస్తూ, “వూరుకో! వూరుకో! గతం గురించి ఆలోచించడం ఇప్పుడు అనవసరం. ఏదో అయింది. తగ్గి పోతుందిలే! మీ అబ్బాయి బాగా చూసుకుంటాడు నిన్ను. దిగులు పడకు! అన్నీ నయం అవుతాయి. ధైర్యంగా వుండాలి ఈ సమయంలో” అంటూ ఓదార్చాడు.

ఓదార్పు కోసం ఆ మాటలన్నాడు గానీ, అవేమీ తను కూడా నమ్మలేదు ప్రసాద్.

కొంచెం సేపు కాలేజీ కబుర్లు చెప్పుకున్నారు, చిన్న పిల్లల్లాగా. తమ చిన్నప్పటి నేస్తాల గురించి చెప్పుకున్నారు. రావు మొహంలో కొంచెం శాంతి కనపడింది.

” ‘కారుణ్య హత్య’ గురించి తెగ వాదించే వాడివి. అది చిన్నప్పటి వాదన గానే మిగిలి పోయిందా? లేక, ఏమన్నా ఆచరణకి కూడా దిగావా?” అని నవ్వుతూనే అడిగాడు స్నేహితుణ్ణి రావు.

అంతే! ప్రసాద్‌కి చిన్నతనం బాగా గుర్తుకు వొచ్చి, పొంగి పోయాడు, అప్పటి వాదనలకి. వర్తమానాన్ని కాస్త మర్చి పోయాడు.

“వాదనలు మాత్రమేనా? ఇంకా నయం! ఆ అభిప్రాయం నాతో పాటు బలపడుతూనే వచ్చింది. నేనెప్పుడో నాక్కావలిసిన పదార్ధం సంపాదించి దాచేసుకున్నాను. అవసరం వచ్చినపుడు మాత్రమే సంపాదించలేము కదా? ముందే సంపాదించి దగ్గిర పెట్టుకుంటే, నిజంగా అంత అవసరం వొచ్చినపుడు, పనికి వస్తుంది” అన్నాడు ప్రసాద్ గొప్పగా.

అనేశాక, మనసు లోనే నాలిక కరుచు కున్నాడు, ఆ మాటలు అనకుండా వుండాల్సిందని.

“చిన్నప్పుడు మనం చేసుకున్న ప్రమాణాలు గుర్తు వున్నాయా?” చిన్న నవ్వుతో అడిగాడు రావు.

‘ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలనే’ ప్రమాణాలు అవి. గుర్తొచ్చాయి.

కొంచెం ఇబ్బందిగా నవ్వాడు ప్రసాద్. ఏమీ మాట్లాడలేదు.

“నీకు గుర్తుందని నాకు తెలుసు. నువ్వు నాకిప్పుడు ఆ సాయం చెయ్యాలి! నేను ఆ పదార్ధం సంపాదించుకునే పరిస్తితిలో లేను. నా విషయం చాలా ఘోరంగా వుంది. అన్నీ మంచం మీదే! బాత్‌రూముకు కూడా నా అంతట నేను వెళ్ళలేను. నా కోసం ఒక పనబ్బాయిని పెట్టారు. అతను వచ్చి తీసుకెళ్ళే వరకూ నేను బిగ పట్టుకోవాలి. ఒక్కోసారి అతను లేని సమయంలో బిగ పట్టుకోలేక పోతే, మంచం మీద పక్క అంతా పాడై పోతుంది. నాది ఏమీ చెయ్యలేని అసహాయ స్తితి. అప్పుడు మా అబ్బాయి వచ్చి, అంతా శుభ్రం చేసి, బట్టలు మారుస్తాడు. వాడు అభిమానంగానే చేస్తాడు. నాకే చాలా సిగ్గుగా వుంటుంది. మొన్నొక రోజు మా అబ్బాయి ఇంట్లో లేని సమయంలో, మా పనబ్బాయి బయటికి వెళ్ళాడు ఎందుకో. సరిగ్గా అప్పుడే, నా పక్క పాడై పోయింది. అలాగే భరిస్తూ కూర్చున్నాను ఇంకేమీ చెయ్యలేక. లేవలేక. అప్పుడే మా కోడలు పలకరించడానికి వచ్చింది.

రాగానే చెడ్డ వాసన పీల్చిందేమో!

‘అయ్యో! అదేంటి మామయ్యా? పిలవలేక పోయారా?’ అంది.

అవసరం వొస్తే, పిలవడానికి ఒక బెల్లు అమర్చారు నా చేతికి పక్కనే. నేనే దాన్ని నొక్కలేదు.

‘వొద్దమ్మా! వొద్దమ్మా!’ అని ఎంత వారించినా వినకుండా, మా కోడలే, మంచం మీద నా పక్కని శుభ్రం చేసింది. నా రహస్య భాగాలు కడిగింది! నా బట్టలు మార్చింది. ‘నాకు ఆస్పత్రిలో అలవాటే మామయ్యా! అదీగాక, మీరు నాకు తండ్రి లాంటి వారు. మీకు చెయ్యడం నాకు ఇబ్బంది కాదు మామయ్యా!’ అంటూ పనులన్నీ చులాగ్గా చేసేసి, ‘పడుకోండి’ అని చెప్పి, వెళ్ళి పోయింది.

మా కోడలు ఒక ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. అయితే మాత్రం? మావగారికి మల, మూత్రాలు తుడిచే, అంతా కడిగే అంతంత దరిద్రపు సేవా?

నాకు సిగ్గుతో ఆ క్షణం లోనే చచ్చి పోవాలనిపించింది. ప్రసాద్‌! ఇంకా ఎందుకు బతికి వున్నానా – అని చాలా రోదించాను. మా కోడలు తన పనిని ఒక కష్టంగా అనుకోలేదు గానీ, నేను చాలా చాలా కష్టంగా ఫీలయ్యాను. ఇలా ఇతరుల మీద ప్రతీ దానికీ ఆధార పడుతూ, ఎంత కాలం బతకడం? చెప్పు, ఎంత కాలం?

నేనింకా ఒక కుళ్ళిపోయిన కూరగాయ స్తితిలో ఎందుకు బతికి వుండడం? అదే మా అబ్బాయితో చూచాయగా ఒకసారి అంటే, చాలా ఫీలయ్యాడు. ‘అదేంటి నాన్నా, అలా అంటావు? నా చిన్నతనంలో నువ్వీ పనులన్నీ నాకు చెయ్యలేదా? పెద్ద వాళ్ళని చూసుకునే బాధ్యత ఎదిగిన పిల్లలదే! పిల్లలని చూసుకోవల్సిన బాధ్యత పెద్ద వాళ్ళదే. సమాజం ఇలా సాగుతూ వుండాల్సిందే. నువ్వలాంటి మాటలు అనకు’ అన్నాడు బాధగా.

ఇక నువ్వే నాకు సాయం చెయ్యాలి, ప్రసాద్! నేనీ బతుకును భరించలేను! ఏమంటావు?” అని చాలా బాధగా, కన్నీళ్ళతో అన్నాడు రావు.

ప్రసాద్‌కీ దుఃఖం ఆగలేదు. చాలా సేపు మాట్లాడలేదు.

“రావూ! ఈ సమయంలో నిన్ను నిందించడం మానవత్వం కాదు. చాలా తప్పు. అయినా సరే, నీకు చెప్పి తీరాలి. నీకు ఎన్నో సార్లు నీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పాను. నువ్వు వినలేదు. నీ పరిస్తితిని నువ్వే ఇలా చేసుకున్నావు. నిన్ను నిందించక తప్పదు. ఎవరైనా వేరే ఎటువంటి దారీ లేక, ఇలాంటి పరిస్తితిలో వుంటే, అది వేరే సంగతి. నీకు అన్ని దార్లూ వుండేవి. నువ్వే వాటిని మూసేశావు. నీ కొడుకు నీకు అన్ని వసతులూ చేకూర్చుతున్నాడు. ఇక నువ్వు ప్రకృతి నిష్క్రమణకే ఎదురు చూడాలి. ‘కారుణ్య హత్య’కి నువ్వు తగవు.

సరయిన సమయంలో బాగా చదవకుండా, పదవ తరగతి పరీక్ష ఫెయిలయి, అఘాయిత్యానికి ఒడికట్టే పిల్లాడి లాగా వుంది నీ విషయం.

ఈ రోజుకీ నేను, ప్రతీ రోజూ, ప్రతీ గంటా, నా ఆరోగ్యం గురించి తపన పడుతూనే వుంటాను. నాకూ, మంచం మీద పడి బతకడం ఇష్టం అవదు.

జీవితం మంతా కులాసాగా గడిపి, చివరి రోజుల్లో ఏ కష్టం లేకుండా నిష్క్రమిద్దామను కునేవాళ్ళకి కాదు ఈ ‘కారుణ్య హత్య’ అనేది. ఇప్పటికీ, నాకా అర్హత వుందా – అని నేను తెగ ఆలోచిస్తూ, ఆ అర్హత వుంచుకోవాలని తెగ కష్ట పడుతూ వుంటాను.

నీ కొడుకూ, కోడలూ, నిన్ను జాగ్రత్తగా, అభిమానంగా చూసుకుంటారు. నువ్వు శాంతిగా వుండడానికే ప్రయత్నించు.

నీకు సాయం చేయలేక పోతున్నందుకు నన్ను క్షమించు! నన్ను ప్రమాణం తప్పే వాడి లాగా చేసింది నువ్వే!

చాలా మంది దయా హృదయాలు గల వారు, నన్ను తప్పు పడతారని నాకు తెలుసు. నువ్వు కూడా నన్నే తప్పు పడతావు గానీ, నీ తప్పు తెలుసు కోవు. నన్ను మళ్ళీ క్షమించు!” అంటూ రోదించాడు ప్రసాద్.

కొంత సేపు ఆ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. రావు కొడుకు వచ్చి ప్రసాద్‌కి ఒక కాఫీ కప్పు అందించాడు. తండ్రి చేత నెమ్మదిగా కబుర్లు చెబుతూ కాఫీ తాగించాడు.

“పనబ్బాయి వున్నా, ఇంట్లో నేను వున్నంత వరకూ, నేనే నాన్నని చూసుకుంటాను. నా కదే ఇష్టం” అన్నాడు రావు కొడుకు.

ఆహా! ఏం కొడుకు!

ప్రసాద్ సంతోషించాడు. కాఫీ కప్పులు తీసుకుని రావు కొడుకు లోపలికి వెళ్ళి పోయాడు.

“ఇక నువ్వు విశ్రాంతి తీసుకో రావ్‌! రోజూ వొచ్చి చూస్తాను నిన్ను” అన్నాడు ప్రసాద్ శలవు తీసుకుంటూ.

“అలాగే! నువ్వన్న మాటలు నిజమే! తప్పు నాదే! ఆ తప్పును దిద్దు కోలేను ఇప్పుడు. నువ్వే పెద్ద మనసు చేసుకుని, మళ్ళీ ఆలోచించు! రెండ్రోజులు ఆలస్యం అయినా ఫరవాలేదు. డాక్టరు నా ఆయుష్షును కొన్ని నెలలు పెంచుతానన్నాడు. ప్రశాంతంగా నా పరిస్తితి ఆలోచించు ప్రసాద్! స్నేహితుడా!” అన్నాడు రావు కన్నీళ్ళతో.

ఇంటికి వచ్చే దారంతా, ఆలోచిస్తూనే వున్నాడు ప్రసాద్. “నేను ఆ పని చేయగలనా? స్నేహితుడికి చేసిన ప్రమాణం నిలబెట్టుకో గలనా? నా కంత శక్తి వుందా? నా కోసం నేను చేసుకోగలను గానీ, రావుకి సాయపడ గలనా నేను? నా స్నేహితుడు సిగ్గుతో బ్రతకడం లేదా మరి? అలాగే బ్రతక మనాలా? నేనూ అందరి లాగా కబుర్లు చెప్పే వాడినేనా? నేను తప్పు చేస్తున్నానా? రావుకి సాయం చేసి, అతన్ని మరణం లోకి పంపేస్తే, మిగిలిన జీవితం అంతా గట్టిగా, ధైర్యంగా తప్పు చేయని వాడి లాగా వుండ గలనా? లేకపోతే, అది తప్పు అవదా? తప్పు చేసిన వాడి లాగా కుమిలి పోతానా? అసలు ఏది తప్పు? ఏది తప్పు కాదు? ఏమన్నా కేసు జరిగి, నా మీదకి వొస్తుందా? వొస్తే, భయమా? రావును అంత ఘోరమైన స్తితి లోనే వుంచగలనా? అతన్ని చూస్తే నాకు జాలి ఎందుకు? జాలి పడి వూరుకోవడమేనా? ఊరుకోకపోతే, అతని నరక యాతనని అంతమొందించడానికి నాకు నైతిక బాధ్యత లేదా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కెవరు చెప్ప గలరు? ఏమిటిది? నేను నిర్ణయిచు కోలేక పోతున్నాను!” అనుకుంటూ, ప్రసాద్ చాలా మధన పడి పోయాడు.

ఎంతో ఆలోచించిన మీదట కూడా, ఆలోచనలు ఆగవు! నిర్ణయమూ తేలదు! అదీ పరిస్తితి!

***

     జె. యు. బి. వి. ప్రసాద్

 

జె. యు. బి. వి. ప్రసాద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సమస్య ఒకటి సృష్టించి సమాధానం చెప్పకుండా పాఠకులే వదిలేయడం రచయితకు సమాధానం తెలియక కాదు, పాఠకులేమంటారో తెలుసుకోవడానికే అని నమ్ముతున్నాను.
    రావుగారు వ్యాయామం చేయకపోవడానికీ , హీరో కారుణ్యహత్య చేయకపోవడానికీ సంబధం బలంగా లేదు.పైగా హత్యానంతరం జరిగే పరిణామాల గురించి ఆలోచించడం కూడా అతనికి ఆ హత్య చేయగలిగే మానసిక స్థైర్యం లేదనీ, ఆ తరువాతి పరిణామాలను ఎదుర్కోగల పరిపక్వత లేదనీ పాఠకులకు అనిపించవచ్చు. చూస్తుంటే, మళ్ళీ మనసు మార్చుకుని వచ్చే విసిట్లో చంపేసినా ఆశ్చర్యం లేదన్నంత డోలాయమాన స్థితిలో ఉంది అతడి పరిస్థితి. ఏం చేయాలో చెప్పమన్నారు గనుక:
    కారుణ్య హత్యలు ఇంకా డాక్టర్లు పరిధిలోనే లేవు, అందువల్ల ఇది హత్య కిందే వస్తుంది.ఎలాగూ అనుమానంలో పడి తానా పని చేయబోనందుకు తన మనసును నమ్మించుకునే కారణాలు చెప్పేసుకున్నాడు కనుక దానికే కట్టుబడి ఉండడం మంచిది. రావుగారు ఇంకొంచెం కాలం గడిపి చనిపోయాక ఒక ఏడుపు ఏడవడమే ఎవరైనా చేయగలిగేది.
    రచయితకు అభినందనలు:
    మంచి ఆలోచనాస్ఫోరకమైన కాదు రాసినందుకు, కారుణ్య హత్య వంటి కథావస్తువు ఎన్నుకున్నందుకు!
    కథలో అంతర్లీనంగా జీవితంలో వ్యాయామం పట్ల శ్రద్ధ, ఆరోగ్యం పట్ల అవగాహన ఉండవలసిన అవసరం గురించిన మెసేజ్ కొంతమంది పాఠకులకైనా హత్తుకుని వారైనా రావుగారిలా కాకుండా మంచి మాటను ఆదరించి మంచిబాటలో ప్రయాణిస్తారు అనడంలో అత్యాశ లేదేమో.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు