అమ్మమ్మోళ్లింట్లో….

మ్మమ్మ లేదు

ఆమె వున్నన్నాళ్ళు సెలవుల రాక
ఆమె చెంత వాలే పక్షులమై
ఆమె చేతి ముద్ద కై
ఆ ముద్ద లోని ఆప్యాయత
ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కానరాలే
ఆ ముద్ద లోని చింతకాయ పచ్చడి కే లోగుట్టు ఎరుక
ఆమె లేని ఇల్లు పడావు కూలిన గోడలు
అలికిన ఎర్రమన్ను
తీర్చి దిద్దిన సున్నపు బొట్లు పట్టెల నడుమ
గతకాలపు తీపి గురుతులు
మనవళ్ళతో కళకళ లాడిన ఇల్లు
బోసి నవ్వుల తాత లేక బోసి పోయింది
వాలు కుర్చీ పట్టా కర్ర తీసి
తాత ను పడేసిన మనవళ్ళ కేరింతలు
కిసుక్కున నవ్విన అమ్మమ్మ జాడ లేదు
పాటకి తెరచి ఎదురు చూసే కళ్ళు లేవు
రాత్రి బస్సు కాడికి నడిచి వచ్చిన కాళ్ళు లేవు
జల్లల నిండా చేసిన అప్పలూ లేవు
తలుపు గూట్లో దాచిన నెయ్యి లేదు
కొంగున మూట గట్టిచ్చిన పది పైసల బిళ్ళ కళ తప్పింది
గడ్డి వాములో దాచి పెట్టిన ఈత పండ్లు లేవూ
శనక్కాయ కాల్చి గుంత తవ్వి మట్టి కప్పి
తెల్లారి తిన్న రుచి ఆడనే
సబ్జాగింజల షర్బత్
కాల్చిన పచ్చి మామిడి తో రసం
ఇంటి ముందర గంగరేగు పండ్లు రాలే చందం
చేంతాడు తో బావి నీళ్ళ తోడి ఒంటి మీద గుమ్మరించుకున్న సవ్వడి ఓ కల!
ఎరువు తోలే ఎడ్లబండి తొట్టిలో సీట్ రిజర్వ్ కై
తెల్లారక ముందే లేచిన రోజులు!
కొస పొలం లో ఎరువు కుప్పలు చల్లిన కాలం
చెరువు మట్టి తోలి పూడిక తీసుకున్న నాటి ముందుచూపు!
మడికట్లల్ల  బురదే ముల్తాన్ మిట్టి మాకు!
ఇంటి ముందర అరుగు బోసి పోయింది
ముచ్చట్లు లేవు దాగుడు మూతలు లేవు
అష్టా చెమ్మా లేదు దాడీ లేదు
పచ్చీసు గవ్వల గలగలలు లేవు !
అక్కా బావ పలకరింపుల్లేవు !
దర్వాజలన్నీ గడీలేసి అంతే లేని నాటకాల లోకంలో నేడు!
గతం యాదిలో ఓ పలవరింత!!
*

గిరి ప్రసాద్ చెలమల్లు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు