అమాయకత్వమే పనికొచ్చింది!

ర్ఫరోష్ – నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు విడుదలైన సినిమా. ఇరవై ఏళ్ల తర్వాత కూడా, నాతో సహా, బహుశా చాలా మందికి ఈ సినిమా ప్రస్తావన వస్తే మొదట గుర్తొచ్చేది నసీరుద్దీన్ షా పాడుతున్నట్టు మొదలయ్యి, ఫ్లాష్ బ్యాక్ లో సోనాలి బెంద్రే పట్ల ఆమీర్ ఖాన్ కి  గల అవ్యక్తప్రేమని మనకి పరిచయం చేసే గజల్ – హోష్ వాలోఁ  కో ఖబర్ క్యా! జగ్జీత్ సింగ్ కూడా ఈ గజల్ ద్వారా అప్పటి యువతరంలో అభిమానులను సంపాదించుకున్నారు. గజల్ లో అన్ని షేర్లలో అత్యంత ప్రభావవంతమైన షేర్ ని ‘హాసిల్-ఏ-గజల్’ అంటారు. వారి వారి అనుభూతి, అనుభవాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో షేర్ ‘హాసిల్-ఏ-గజల్’ గా అనిపించవచ్చు. నా వరకు, ఒక యువతి పట్ల సమ్మోహితుడైన ఒక యువకుడు వెలిబుచ్చలేని ప్రేమని రెండు వాక్యాల్లో బంధించిన ఈ షేర్ చాలా నచ్చింది:

హమ్ లబోఁ  సే కెహ్ న పాయే ఉన్ సే హాల్ -ఏ -దిల్ కభీ 
ఔర్ వో సంఝే నహీఁ యే ఖామోషీ క్యా చీజ్ హై 
 
నేను నోరు విప్పి మనసు స్థితి ఎప్పుడూ చెప్పలేకపోయాను 
తనకి కూడా  ఈ మౌనం ఏమిటో అర్థం కాలేదు 
 
చిరస్మరణీయమైన ఈ గజల్ వ్రాసిన కవి నిదా ఫాజ్లీ.
*
నిదా రచనల్లో తాను స్వయంగా అనుభవించిన జీవనానుభూతుల ప్రభావం కనబడుతుంది. ఆధునిక గజల్ లో దైనందిన జీవిత చిత్రణ అనే పార్శ్వం అప్పటికే ఉన్నా, ఒక కవి కేవలం సృజన, కల్పనలే ఆలంబనగా కాకుండా అందులో తన స్వీయానుభవాన్ని రంగరించి వ్రాస్తే కలిగే appeal ఎలా ఉంటుందో మనకు నిదా రచనల్లో కనిపిస్తుంది. బాల్యమూ, యవ్వనమూ దాటి నిజమైన జీవితం మొదలుపెట్టిన దశలో, మిగిలిన కుటుంబ సభ్యులంతా పొరుగుదేశానికి వెళ్ళిపోతే, ఎందుకు ఉండిపోయాడో, నిదా భారతదేశంలోనే ఉండిపోయాడు. ఆ ఒంటరితనాన్ని నిత్యం తనతో పాటు మోశాడు. ఎంత దాచుకున్నా ఎక్కడో ఒక చోట బయటపడాలిగా.
సబ్ కుఛ్ తో హై క్యా  ఢూంఢ్తీ హై నిగాహే
క్యా బాత్ హై మై వక్త్ పే ఘర్ క్యూఁ నహీ జాతా
అన్నీ ఉన్నా చూపులు ఏమి వెతుకుతున్నాయో 
ఎందుకో నేను సమయానికి ఇంటికి ఎందుకు వెళ్ళనో  
 
నిదా ప్రేమించిన వ్యక్తి కూడా ఒక ప్రమాదంలో మరణించింది. ఆ లోటు కూడా తనకి ఎంతో దుఃఖాన్ని మిగిలించింది. తాను బహుశా మరచిపోవాలని ప్రయత్నించినా మరచిపోలేకపోయాడు. ఆ మరపు రాని బాధలోని మాధుర్యమే అక్కడక్కడా ఇలా కనబడుతుంది:
వో ఖ్వాబ్ జో బర్సోఁ సే న చెహ్రా న బదన్ హై
వో ఖ్వాబ్ అగర్ హై తో బిఖర్ క్యూఁ నహీఁ జాతా
 
ఏళ్ల తరబడి మోమూ దేహమూ లేని ఒక కల 
అది కలే ఐతే ఎందుకు చెదిరిపోకూడదు 
 
‘అది కలే ఐతే’ అనడంలో ఆ జ్ఞాపకాల గాఢత తెలుస్తుంది. అవి కలిగించే బాధ తెలుస్తుంది. అవి చెదిరిపోవాలని ఆశించడంలో వాటిని దూరం చేయలేని తన అశక్తత తెలుస్తోంది. ఇదే అవస్థని భరిస్తున్న వారికి ఈ షేర్ చాలా ఎంపెథెటిక్ గా కనిపిస్తుంది. ఇంకో షేర్ లో కూడా ఈ భావననే పలికించారు నిదా:
తుమ్ సే ఛూట్ కర్ భీ  తుమ్హే భూల్నా ఆసాన్ న థా 
తుమ్ కో హీ యాద్ కియా తుమ్ కో భులానే కె లియే 
 
నీకు దూరమైనా నిన్ను మరచిపోవడము సులువు కాలేదు
నిన్ను మరచిపోవడానికి కూడా నిన్నే తలచుకున్నాను
 
నువ్వు తప్ప వేరే ఏదైనా గుర్తుంటే కదా!
**
నిదా తన జీవితంలో సింహభాగం నగరాలలో గడిపారు. ఆ నగరజీవితాన్ని చాలా సునిశితంగా పరిశీలించారు. ఆ పరిశీలనలే తన రచనల్లో కనిపించే ఇంకో ప్రధానాంశం. నగరంలో ప్రతి ఒక్కరి దగ్గరా పుష్కలంగా ఉండేది లౌక్యం. అదేదో చెడు లక్షణం అని కాదు, కానీ అది మానవుని సహజలక్షణం కాదు. ఒక అమాయకత్వంతో కూడిన కుతూహలం సహజలక్షణం. అది చిన్నపిల్లల్లో ఉంటుంది. లోకం లౌక్యం అలవరుస్తుంది. మన విద్యావిధానాల్లో కూడా ఈ natural creative curiosityని, పెంపొందించడం అటుంచితే, పరిరక్షించే వెసులుబాటు లేదు. ఈ విషయాన్ని సూచిస్తూ నిదా చెప్పిన షేర్:
బచ్చోఁ కే ఛోటే హాథోఁ కో చాంద్  సితారే ఛూనే దేనా
చార్ కితాబేఁ పఢ్ కర్ యే భీ హమ్ జైసే హోజాయేంగే
 
చిన్నారుల చిట్టి చేతులను జాబిల్లీ  తారకలూ తాకనివ్వండి 
నాలుగు పుస్తకాలు చదివాక  వీళ్లూ మనలాగే మారిపోతారు 
ఈ అమాయకత్వాన్ని నిదా ఒక virtueగా భావించారు. ఇది తర్కానికి వివేచనకీ భిన్నధృవం వంటిది. మరి ఈ అమాయకత్వంతో ఏమి సాధించగలం? దీన్ని అందరూ ఒక లోపంలాగా చూస్తారే!
దానావోఁ కీ బాత్ న మానీ కామ్ ఆయీ నాదానీ హీ
సునా హవా కో పఢా నదీ కో మౌసమ్ కో ఉస్తాద్ కియా
 
మేథావుల మాట వినలేదు అమాయకత్వమే పనికొచ్చింది 
గాలిని విన్నాను నదిని చదివాను ఋతువును గురువు చేసుకున్నాను
 
ఎంత సూక్ష్మదృష్టి! గాలిని ఎవరు వింటారు? నదిని ఎలా చదువుతారు?
ఋతువు ఏమి నేర్పగలదు? ఇలా చేసిన వాళ్ళే ‘మంది’బుధ్ధిని వదిలి తమ దారిని వెతుక్కుంటారు. కొత్తగా ఆలోచిస్తారు. కొత్త విషయాలు కనుక్కుంటారు. జీవితాన్ని కొత్తదనంతో అలంకరిస్తారు. లేదా నిదా లాగా అద్భుతమైన కవిత్వం వ్రాస్తారు!
జీవితంలోని కొన్ని సమస్యలకు బహుశా ఈ అమాయకత్వం ఒక పరిష్కారం కాగలదని నిదా సూచించారు.
దో ఔర్ దో కా జోడ్ హమేశా చార్ కహాఁ హోతా హై
సోచ్ సమఝ్ వాలోఁ కో థోడా నాదానీ దే మౌలా
 
రెండు రెండ్ల కూడిక నిత్యం నాలుగు ఎలా అవుతుంది 
మేధావులకు కొంచెం అమాయకత్వాన్ని ఇవ్వు దేవుడా 
 
వినడానికి చాలా సాధారణంగా అనిపించినా ఎంతో లోతైన భావం ఉన్న షేర్ ఇది. నాకెంతో ఇష్టమైనది. జగ్జీత్ సింగ్ ని అనుకరిస్తూ అపుడపుడూ పాడుకునేది.
**
తాత్వికత. ఉర్దూ గజల్ లో ఎంతో అందంగా పలికే ఇంకో అంశం. నిదా రచనల్లో కూడా అడుగడుగునా తత్త్వం, తత్త్వసారం కనిపిస్తాయి.
ఈ ప్రపంచంలో ఎవరికీ పరిపూర్ణమైన జీవితం లభించదు. ఏదో ఒక కొరత, చిన్నదో పెద్దదో, ఉండే ఉంటుంది. ఈ వాస్తవాన్ని నిదా ఇలా చెప్పారు:
కభీ కిసీ కో ముకమ్మల్ జహాఁ నహీఁ మిల్తా 
కహీఁ జమీఁ తో కహీఁ ఆస్మాఁ నహీఁ మిల్తా 
 
ఎప్పుడూ ఎవరికీ నిండుజీవితం లభించదు 
ఒకచోట నేల ఇంకో చోట నింగీ లభించదు 
 
పైన ప్రస్తుతించినట్టు, నగరజీవితం మనిషి చేత ఒక ముసుగుని తొడిగిస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ వెళ్లలేము. లౌక్యంతో వ్యవహరించకపోతే అందరికీ దూరమవ్వాల్సి వస్తుంది.
ఉస్ కే దుశ్మన్ హై బహుత్ ఆద్మీ అచ్చా హోగా
వో భీ మేరీ హీ తరహ్ షహర్ మే తన్హా హోగా
 
తనకి శత్రువులు ఎక్కువ, మనిషి మంచివాడు అయ్యుంటాడు
తాను కూడా నాలాగే నగరంలో ఒంటరివాడు అయ్యుంటాడు
నిదా కవిత్వం పైన పాశ్చాత్త్యసాహిత్యం, గాలిబ్, మీర్, కబీర్ దాస్, సూర్ దాస్, మీరా, వీరందరి ప్రభావం ఉంది. వారి రచనల సారాన్నే తన రీతిలో నిజాయితీగా చెప్పాడు. ఒక షేర్ లో దైవప్రార్థనకి సరికొత్త భాష్యం చెప్పాడు:
ఘర్ సే మస్జిద్ హై బహుత్ దూర్ చలో యూ కర్ లే
కిసీ రోతే హుయే బచ్చే కో హసాయా జాయే
 
ఇంటికి ప్రార్థనాస్థలి బహుదూరమైతే ఇలా చేద్దాం
ఎవరైనా ఏడుస్తున్న పసివాడిని నవ్వేలా చేద్దాం
 
నిదా కళాకరవాలానికి ఉర్దూ, హిందీ రెండు వైపులా పదును ఉంది. గజళ్ళతో పాటు దోహాలు కూడా వ్రాశాడు. మచ్చుకి ఒకటి:
సీధా సాధా డకియా జాదూ కరేఁ మహాన్
ఎక్ హీ థైలీ మే భరే ఆఁసూ ఔర్ ముస్కాన్
 
మామూలుగా కనిపించే తపాలా బంట్రోతు ఎంత మాయ చేస్తాడు
కన్నీళ్లనూ చిరునవ్వులనూ ఒకటే సంచిలో మోసుకొస్తాడు
 
ఈ దోహా చదవగానే తిలక్ వ్రాసిన ‘తపాలా బంట్రోతు’ కవితలోని పద్దెనిమిదేళ్ల పడుచు అమ్మాయీ, పండుముసలి అవ్వా గుర్తొచ్చారు.
 
చివరిగా మన జీవితాన్ని రెండు వాక్యాల్లో క్రోడీకరించి చెప్పిన షేర్:
యహీ హై జిందగీ కుఛ్ ఖ్వాబ్ చంద్ ఉమ్మీద్
ఇన్హీ ఖిలౌనో సే తుమ్ భీ బెహెల్ సకో తో చలో
 
కొన్ని కలలు కొన్ని ఆశలు ఇదే జీవితం అంటే
ఈ ఆటబొమ్మలతో నువ్వూ ఊరడిల్లగలిగితే పద
 
ఈ షేర్ తో పాటు మొత్తం గజల్ ని ప్రధాని మోదీ గారు పార్లమెంటులో తన ఒకానొక ప్రసంగాన్ని ముగిస్తూ చదివారు. నిదా గజళ్లకు ఇంత quotability లభించడానికి కారణం తాను వాడే సరళమైన, సంభాషణాత్మకమైన, లయాత్మకమైన భాష. ఎక్కడో ఒకటీ అరా మినహా ఏ పదానికీ అర్థం వెతుక్కోనవసరం లేదు.
**
సంవత్సరం క్రితం 52 షేర్లను వాటి అనువాదాలను ‘వాసంతసమీరాలు’గా ఒక చిన్న పుస్తకం ముద్రించాను. ఆ సంకలనంలో బహదూర్ షా జఫర్ నుండీ పల్లవ్ మిశ్రా వరకు వివిధ స్థలకాలాలకు సంబంధించిన కవుల షేర్లు ఉంచాలనుకున్నాను. అసంఖ్యాకంగా ఆణిముత్యాలను వ్రాసి, ఏది ఎంచుకోవాలో అర్థం కాని అయోమయంలో పడేసి,షేర్ల ఎంపికని కష్టతరం చేసిన కవులు ఇద్దరు – అహ్మద్ ఫరాజ్, నిదా ఫాజ్లీ.
*

రమాకాంత్ రెడ్డి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సర్ఫరోష్ చూసినపుడు చాలా నచ్చింది.
    నసీరుద్దీన్ షా అభినయించిన గజల్..జగ్జీత్ సింగ్ గారు పాడింది. హిందీ మీద పట్టులేక అప్పట్లో అర్థం అవలేదు.కానీ నచ్చింది.బహుశా ఫీలింగ్స్ వళ్ళ ఏదో కొంచెం అర్థం అయిందేమో.ఇప్పుడిప్పుడు గజల్ గూర్చి తెలుసుకుంటున్నాను సర్. మీ సమీక్ష చదువుతుంటె ఎంతో సంతోషం కలిగింది.ధన్యవాదాలు సర్. గజల్ అంత అందంగా మీ విశ్లేషణా ఉంది.

  • నిదా ఫజ్లీ గజళ్ళను కొన్నింటిని తెలుగులోకి అనువదించి వ్యాఖ్యనాన్ని కూడా జోడించి అందించిన రమాకాంత్ రెడ్డి గారు అభినందనీయులు. వారి ఎంపిక చాలా బాగుంది. వ్యాఖ్యానం కూడా రమ్యంగా సాగింది. ఇలానే ఇతర ఉర్దూ కవుల ప్రసిద్ధ కవితలను కొన్నింటిని వరసగా అందిస్తే తెలుగు పాఠకలోకము కూడా ఆ కవిత్వ పరిమళాలను ఆస్వాదించి ఆనందిస్తుంది.

  • రమాకాంత్ రెడ్డిగారూ దయచేసి ‘వాసంత సమీరాలు ‘ పుస్తకము ఎక్కడ లభిస్తుందొ తెలియజేస్తే కొని చదివి ఉర్దూ గజళ్ళ సౌరభాన్ని ఆస్వాదించగలము.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు