తెలుగు కథాప్రక్రియ దాని రూపాన్ని అనేక విధాలుగా మార్చుకుంటా ఉంది. కథా నిర్మాణానికి సాంప్రదాయకంగా ఏర్పడిన ఫార్మేట్ వదులుకుంటా వస్తున్నాం. కథా రూపం వేగంగా మారుతోంది. చిన్న సంఘటనకూడా కథా రూపంగా పరిణమించడాన్ని చూస్తున్నాం. మారుతున్న అభిరుచులకు , కథా నిర్మాణంలోని నూతన పోకడలకి తగిన విధంగా కథ రచనలు చేయాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. ఆ దృష్టితో ఈ కథ రాయడం జరిగింది. కథావస్తువుని గురించి పాఠకులు ఎలాగూ చెప్తారు. చైతన్య స్రవంతి శైలిలో రాసిన ఈ కథ పట్ల పాఠకుల ప్రతిస్పందనకై ఎదురుచూస్తున్నా.
రెండు విమానాశ్రయాల మధ్య ఏముంటుంది.
నేల, సముద్రాలు.. ఇంకా జీవితం కూడా
ఇది ఎక్కడ మొదలైందో లేక, ఇక్కడే మొదలై ఉంటుందేమో.
ఎదురుగా పింక్ షర్ట్ కుర్రాడు.. ఏమో ఆ టైపు అయి ఉండొచ్చు అవ్వకపోవచ్చు. ఊరికే నవ్వాడు.
జీవితం ఇప్పుడు కాదు కనపడింది- కొలంబస్‌లో మంచు తుఫాన్ రోజున కిందకు జారిపడ్డప్పుడు, నాలుగడుగుల దూరంలో తప్పిపోయిన జర్మన్ షెపర్డ్ నిన్ను చూస్తూ నిలుచున్నప్పుడు. వెన్నులో పుట్టిన నల్లటి వెలుగు కళ్ళలోకి రాకుండా ఆపడానికి చేసిన విశ్వప్రయత్నం. దాని మెడలో బెల్టుని చూసి దాన్ని జాలి గా చూసినప్పుడు అది రోషంగా నామీదకి రాబోవడం. మోచేతుల కింద చీరుకుపోయి చలి కోసుకుపోతున్న మంట. చలి అంటే ఇష్టం కదా. లోలోపల ముడుచుకుపోయి, నిన్ను నువ్వు గాఢంగా వెచ్చగా హత్తుకున్నప్పుడు నీపై కలిగిన ఇష్టం, నీ శ్వాసను కౌగిలించుకున్న హృదయం. ఎవరికిష్టముండదు ఎవరిని వాళ్లు ప్రేమించుకోవడం వ్యామోహం. ఇదంతా ఏముందిలే
అనౌన్స్ మెంట్, ప్రయాణికుల్ని రమ్మని చివరిసారిగా హెచ్చరిస్తున్న అనౌన్సర్. హెచ్చరించే ఆ గొంతులో అహం చల్లారుతున్న తృప్తి.
జెన్నిఫర్, ఆడమ్ పోల్ అనౌన్స్ మెంట్స్‌ని పదే పదే వినిపిస్తూ. జెన్నిఫర్ పేరు నాకు పెట్టుంటే బావుండేది. నేను జెన్నిఫర్ లా ఉంటే బావుండేది . ఇంతకీ జెన్నిఫర్ ఎలా ఉంటదో. ఏమో అందంగా ఉండి ఉంటది. అందంగా ఉన్నవాళ్ళకి టెక్కు ఎక్కువ. నిర్లక్ష్యంగా వయ్యారంగా నడిచి వస్తా ఉంటది. మరి ఆడం ఎందుకు లేట్ అయ్యాడో..
పింక్ చొక్కా అతను పలకరింపుగా రెండుసార్లు నవ్వాడు. నాతోపాటే ఫ్రాంక్ ఫర్ట్‌కి వస్తున్నాడేమో. చాలా ఫెమినైన్‌గా ఉన్నాడు. అతను అదే అయి ఉంటుంది. అదే అయివుంటే మాత్రం తప్పేంటి? అసలు అదే నయం ఏమోలే! ఎప్పుడైనా అలా ట్రై చేయొచ్చా నేను. జెన్నిఫర్ పేరు పిలవడం ఆపేసింది అనౌన్సర్. బహుశా వచ్చే ఉంటుంది.. ఫ్లయిట్ ఎక్కే ఉంటుంది. లాస్ వేగాస్ వెళ్లే ఫ్లయిట్. జెన్నిఫర్ కచ్చితంగా అందంగా ఉండి ఉంటది. ఆడమ్ అందుకున్నాడో లేదో ఫ్లైట్.
**
అనౌన్సర్ గొంతు మొనాటనస్ గా వినిపించింది. ఫ్లయిట్ నంబర్ 2476 న్యూయార్క్ టు ఫ్రాంక్ ఫర్ట్. ఓహ్ మనదే కావొచ్చు. అప్పటిదాకా గమనించలేదు. నా పక్కన కోడి గెలికినట్లున్న జుట్టుతో నీలి కళ్ళతో, ఎవరో ముందు భాగం జుట్టు అరువుగా అడిగి తీసుకువెళ్లినట్లు ఉన్నారు. బట్టతల, పిల్లి గడ్డం. వెంకీ గాడి పిల్లిగడ్డంపైన నవ్వు బావుండేది కాదు. గడ్డం లేక ముందు బాగానే ఉండేది. నీ సంగతేంటో చూస్తాననిపించేలా వాడి నవ్వు.
జోన్ A అండ్ B అండ్ ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ వాళ్ళు మనలాగే ఉన్నారు. బ్రాండెడ్ బట్టలు, బ్యాగ్‌లు వేసుకొని ఉంటారు. తెలీట్లేదు కాని తేడా ఉంటది. సంకుచితమైన మనుషులు వీళ్ళు. బిజినెస్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటేనే అట్లే ఉంటారేమో.కొంతమంది మంచోళ్ళు ఉంటారనుకుంటా. ఎవడికి తెలుసు మంచిగా నటిస్తారనుకుంటా.మేము ఉన్నోళ్ళమైనా మంచిగా ఉంటామని చెప్పుకోడానికి .
జోన్ `E` పిలిచారు లేచి నిలబడ్డా. నా వెనుకే నీలి కళ్ళ పిల్లి గడ్డం. కళ్ళలోకి చూసానా చూసే ఉంటా నవ్వాడు. ఈ నవ్వు వెంకీగాడి నవ్వులా లేదు. ఇతని పిల్లి గడ్డం కూడా అందంగా నవ్వుతున్నట్లు ఉంది. దగ్గరగా చూస్తే తెల్లచర్మం పైనా సన్నటి నల్లటి మచ్చలు.
నడుంపైన ఎన్ని క్రీంలు రాసుకున్న మచ్చపోలేదు. మచ్చ పడేట్లు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా అదీ నడుం దగ్గర. అదెంతకీ పోలేదు. తీపిగుర్తు తరువాత అదే చేదు గుర్తు. అంతే తడి తీపి గుర్తయిందంటే ఎప్పుడో చేదైతది. గుర్తేపట్టకపొతే. అదింకా చెదరనట్టు చిన్న నల్లటి మచ్చ. అతని పెదాల్లాగానేమో. అతని కళ్ళు అంతే బావుంటాయి. ఎదో వెతుకుతున్నట్లు, ఎదో హింసని దాచి, ముసురుకున్నట్లు.
**
బోర్డింగ్ పాస్ ప్లీజ్
నవ్వలేక పెదాల్ని సాగతీసి ఇచ్చాను.
పిల్లిగడ్డం నా పక్కన మళ్ళీ నవ్వాడు నేను నవ్వాక అనుకుంటా. ఫ్లయిట్ అటెండెంట్ నవ్వుతుంది.జీవిత సమస్యై ఉంటుంది. తాను నవ్వడంలో ఆరితేరి, అసలు నవ్వుని ఎక్కడ దాచుకుందో మరి. బయట నవ్వు నిజమైన నవ్వు ఎలా ఉంటాదో ఆమెది. ఇదే నిజమా! మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తూ మెసేజ్ చూసాను, ఐ మిస్ యు. మిస్ యు నా అంటే తాను లేకపోవడాన్ని ఫీల్ అవడమా. లేక నేను లేను అన్నదాన్ని గుర్తుచేసుకోవడమా. నీలి కళ్ళు ఎదో అన్నాడు. బట్టతల కూడా బాగానే ఉంది. బెల్ట్ పెట్టుకోమని సైగ చేసాడు. ఎక్కడికి వెళ్ళిపోయాను, నిద్రపోయానా, నిద్రలోంచి ఇంకో నిద్రలోకా, కలలోంచి కలలోకి ఏమో. నీలి కళ్ళ పిల్లి గడ్డం సందిగ్ధంగా చూస్తున్నాడు .
ఫ్లయిట్ ఊగిపోయింది, టర్బులెన్స్. బెల్ట్ పెట్టుకోమని వార్నింగ్ వస్తుంది సీట్ పైన లైట్ వెలిగింది. హ్మ్మ్ .. ఇప్పుడు ఈ ఫ్లయిట్ కూలిపోతే. కూలిపోతే పోయింది, నీళ్ళల్లో కూలగూడదు. ఎవరు చచ్చిపోయినా నేను ఎదో చెట్టుకు తట్టుకొని బతికి పోవాలి, నీలి కళ్ళు కూడా బతుకుతాడు. అప్పుడు పిల్లి గడ్డం వద్దని చెప్పాలి. ఎవరికీ తెలీకుండా బతికిపోవాలి. ఎవరినీ కలుసుకోకుండా ఉండాలి. పిల్లి గడ్డం నాతోనే ఉంటాడా, లేక నేను బతికే ఉన్నానని చెప్పేస్తాడేమో అందరికీ. వాడిని ఒప్పించి నాతోనే ఉంచుకోవాలి. ఫ్లయిట్ అటెండెంట్ వచ్చింది. జెన్నిఫర్‌లా వుంది. అందంగా. ఈ ఫ్లైట్ అటెండెంట్ బతికితే ఈ పిల్లి గడ్డం ఆమెతో వెళ్లి పోవొచ్చు. ఇద్దరూ తెల్లోళ్ళు కదా. లేదులే నన్ను చూసి నవ్వాడు. నేను అమాయకురాలిని అనుకుంటా ఉండి ఉండొచ్చు. ఇదంతా నేను కోరుకుంటే జరిగిందని తెలీదుకదా.
ఎవరికీ తెలీకుండా బతికితే వచ్చేది స్వేచ్ఛేనా. అది స్వేచ్ఛకోసమేనేమో. మరి ఈ నీలికళ్ళు ఎందుకు నాతో.వాణ్నీ పంపించేయాలి. ఏం చేస్తాను అప్పుడు, వెళ్లి ఒక్కదాన్ని నది పక్కన బతకాలి చేపలు పట్టుకుంటూ. ఎవడూ అడగ్గూడదు. ఎందుకు చేపలు పడుతున్నావనీ, ఎన్ని చేపలు పట్టావనీ.. ఒడ్డునే కూర్చోవాలి చీకట్లో. వర్షం పడుతుంటే తడిచిపోవాలి. ఎవడైనా నచ్చిన వాడితో… ఛా!
సీట్ బెల్ట్ సైన్ పోయింది. పిల్లి గడ్డం నవ్వాడు. నా వైపే చూస్తున్నడేమో చాలా సేపట్నుంచి. ఇదివరకటి కంటే చాలా అందంగా ఉంది నవ్వు . ఆర్ యు ఎఫ్రాయిడ్ అన్నాడు మధురంగా. అవును కాదన్నట్లు తలూపాను. ఈ ఫ్లయిట్ కి ఏమీ కాదు . పోనీ అందరూ బతికిపోతారు. మంచిదే. ఎవరూ చచ్చిపోకూడదు అదేగా కోరుకోవాలి. ఎదో ఒక హింసాత్మక బాధ రేగుతుంది. బహుశా ఇదొక జబ్బేమో.
ఐ యామ్ ఆడమ్ అన్నాడు నవ్వుతూ. ఆడమ్ పోల్ అన్నా! నో జాన్ ఆడమ్, ఫ్లయిట్ అటెండెంట్ జెన్నిఫర్ నవ్వుతూ మాట్లాడుతోంది ఆడమ్ తో, నవ్వుకుంటున్నారు. నా వైపు తిరిగి, వేర్ ఆర్ యు గోయింగ్ అన్నాడు నవ్వుతూ. ఇప్పుడు నవ్వు అంత గొప్పగా అనిపించలేదు.
ఇండియా అన్నా . నువ్వు అన్నా ఫ్రాంక్ ఫర్ట్ అన్నాడు. ఆడమ్ వెళ్ళిపోతాడన్న మాట ఫ్రాంక్ఫర్ట్ లో. అతను జెన్నిఫర్ కి అందంగా వీడ్కోలు చెప్తున్నాడు. ఆ ఫ్లయిట్ అటెండెంట్ పేరు క్రిస్టల్. నేను క్రిస్టల్లా నవ్వి వీడ్కోలు చెప్పాను. రెండు గంటల వెయిటింగ్ టైం ఉంటే గంటన్నర లేట్ గా చేరిన ఫ్లైట్. ఇక ఇండియా ఫ్లైట్ మిస్ అయినట్లే. ఆడం బైయ్ అని చేతిని ఊపాడు. అతడు అంత అందంగా లేడనుకుంటా, నేను అనుకున్నానేమో ఉన్నాడని. వెళ్ళేవాడు వెనక్కి వచ్చి నేమ్ అన్నాడు. సత్య అన్నా. సాత్య అన్నాడు, అవును అన్నా. ఐ మిస్సెడ్ మై ఫ్లైట్ అందామనుకున్నా. అతనికెందుకు చెప్పాలి, అతను వాళ్ళింటికి రమ్మంటాడేమో . రమ్మంటే మాత్రం వెళ్లాలా. రమ్మంటే బావుండు.
ఈజ్ ఎవ్విరి థింగ్ ఓకే ? మంచులాంటి ప్రశ్న. అతను ఎందుకు అడిగాడో, నేను అతను ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుసా? అలా ఎలా తెలుస్తుంది నేను కోరుకుంటున్నానా.
ఐ మిస్డ్ మై ఫ్లైట్ , ఐ షుడ్ వెయిట్ ఫైవ్ మోర్ హౌర్స్..
ఓహ్ ఐ యామ్ సారీ. సేఫ్ జర్నీ. టేక్ కేర్. అదేంటి అలానే వెళ్ళిపోతున్నాడు. అంతేనా అతనికి నాకు ఏమి సంబంధం లేదా? అదేంటి ఇంతసేపు నాతో ప్రయాణించాడు కదా. భయపడితే, భయమవుతుందా అని అడిగాడు, నవ్వాడు, సీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడు, పేరు అడిగాడు. అవన్నీ చేస్తే ఏంటి. అతని గమ్యస్థానం వచ్చింది వెళ్ళిపోయాడు. అయినా ఆడమ్ పెద్దగా అందగాడేమీ కాదు, బట్టతల. మనతో ప్రయాణించే వాళ్ళ గురించి వాళ్ళని కోరుకోవచ్చా, కోరుకొని అడగొచ్చా. ప్రయాణం మధ్యలో వచ్చాడు కొన్ని గంటలు ఉండి వెళ్ళాడు.
అంతే గంటలు, రోజులు , నెలలు, సంవత్సరాలు ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోతారు. ఎదో ఒకటి చేస్తారని అనుకోకూడదు. అయినా ఒక సముద్రం దాటి వచ్చాను, ఫ్లైట్ కూలిపోకుండానే ఇంత దూరం వచ్చాను. వచ్చాను కదా, రాబడ్డానేమో.
జీవితం ఎక్కడ ఆగిపోయింది, మోసగించబడ్డప్పుడు. మోసం అంటే ఏంటి. హిడెన్ ట్రూత్ . అంతేనా బ్రేకింగ్ అఫ్ కమిటెడ్ లైన్స్ కాదా.
**
కౌంటర్ ఎదురుగా అతడు టోనీ అంట, స్పానిష్ లో మాట్లాడుతున్నాడు. నేను ఇండియన్ అని చెప్పాను , ఓహ్ నువ్వలా లేవే, స్పానిష్ అనిపించింది నిన్ను చూస్తుంటే అన్నాడు. ప్రశాంతత తెచ్చిపెట్టుకున్నాడు. దయ దలిచినట్లు నవ్వుతున్నాడు, బహుశా ఆడమ్ నాకు వీడ్కోలు ఇచ్చింది ఇతను ఈ కౌంటర్ నుంచి చూసి ఉంటాడేమో. అతను నవ్వుతూ చెపుతున్నాడు, మీరు అదృష్టవంతులు మీకు వెంటనే ఫ్లయిట్ దొరికింది. ఓహ్ అవునా థాంక్యూ. మీరు అప్పటిదాకా ఈ ఫుడ్ కూపన్స్ ఉపయోగించుకోండి. ఎవరో ఒకరు మన ఇబ్బందిని కనిపెట్టి మనకి సహాయం చేస్తారు. చేస్తారని అనుకుంటాం కానీ వాళ్ళు చేసే పనే అదేమో.
ఏదైనా టోనీకి ధన్యవాదాలు తెలపాలి. థాంక్యూ ఒన్స్ అగైన్. యు ఆర్ వెల్కమ్ సెనోరిటా.. కళ్ళు తమాషాగా చికిలించి నవ్వాడు. ఇతను నవ్వుతుంటే ఆడం కంటే బావున్నాడు. ఇంకొన్ని గంటల్లో ఇండియాలో ఉంటా. ఎవరు వస్తారు నాకోసం. ఎవరూ రాకపోతే బావుండు. నేరుగా వెళ్ళిపోవొచ్చు అనుకున్న చోటికి. ఎలా వెళ్తా, దాటుకొని వెళ్లడం మనకి అలవాటు కాలేదు. భయపడుతున్నానా, కాదు ఇంకిపోయిన సమాజం కుళ్లులో కొట్టుకుపోయిన మనసు అనుకుంటా. మొబైల్‌కేసి చూసుకున్నా. అది టైం మాత్రమే చూపిస్తుంది. కాళ్ళీడ్చుకుంటా వెళ్ళా.
**
అందరూ అటు ఇటు తిరుగుతున్నారు. ఎదో వాళ్ళ లోపల నదులు ప్రవహిస్తున్నట్లు.. అందరికీ వాళ్లే ప్రాణం అనుకొనే వాళ్ళు ఉంటారా. ఉన్నట్లు భ్రమపడుతూ ఆనందంగా ఉండి ఉంటారు. వాళ్ళ బాధలు మనకి తెలీదుగా, అయినా తెలీకపోవడమే మంచిదిలే. స్టార్ బక్స్ ముందు నిలుచున్నా. అక్కడ ఆమె ముఖం ప్రశాంతంగా ఏం లేదు. యుగాల తరబడి ఎదో కోల్పోయినట్లు దుఃఖాన్ని మోస్తున్న పెళుసైన మబ్బు చుట్టుకున్నట్లుంది. నా యాక్సెంట్ అర్ధం కానట్లు మొహం చిట్లించింది. సెనోరిటా నువ్వెందుకు ఇంత దుఃఖంతో ఉన్నావు. నిన్నూ ఎవరైనా ఎగతాళి చేసి వెళ్లిపొమ్మని చెప్పకనే చెప్పారా. నువ్వు ప్రేమించడానికి నీలి కళ్ళ బట్టతల ఆడమ్ లెవరూ కనిపించలేదా.
కెపాచినో వన్ స్మాల్ అన్నా మూడోసారి. నా వైపు కొద్దిగా ప్రసన్నంగా చూసింది. ఈ సారి కళ్ళతో నవ్వాను సెనోరిటాని చూసి. కూపన్ వైపు ఒక నిర్లక్యపు చూపు విసిరింది. డబ్బులివ్వలేదని ఇండియన్స్ వైపు చూసే ఒకరకమైన తక్కువ చూపా అది. నాలుకకి చేదుగా తగిలింది కాఫీ. గుండెల్లో గుచ్చుకున్న మాటల మీద వెచ్చటి చేదు కాఫీ పోసినట్లుంది. మాటలు కాదు అనుభవాలు. కాదు అవి చేదు నిజాలు. ఇలాంటి కాఫీ లా ఉన్న చేదు. నువ్వు తడబడి తట్టుకోలేనప్పుడే జారిపోయి ఉంటది లోపలున్న ధైర్యం. అవమానించి, ఛేదించి దగ్గరగా రావడంలో అంతా అహం.
టైం, నేను ఇద్దరం కలిసి నడుస్తున్నట్లు లేదు. అది చాలా వెనుక ఉంది. కొన్నిసార్లు నాకంటే ముందు ఉంటది. దానితో నాకెందుకు స్నేహం కుదరదో. మళ్ళీ అనౌన్సమెంట్
**
ఫ్లయిట్ బయలుదేరింది. ఈ సారి నా పక్కన సీట్లో గాలి. ఆడమ్ ఇంటికెళ్లి పోయి ఉంటాడు, తన గర్ల్ ఫ్రెండ్ ని దగ్గరికి తీసుకొని ముద్దు కూడా పెట్టుకొని ఉంటాడు. ఇంటి బయట పెట్టుకున్నా ఏముంటది, ఇదేమన్నాఇండియానా. నేను అలానే పెట్టుకోవాల్సింది, నల్లటి పెదవులు అయినా, కనీసం అతను వెళ్లిపోయేటప్పుడన్నా. సీట్ బెల్ట్ ఎనౌన్స్ మెంట్. ఈసారెందుకో అటెండెంట్ జెన్నిఫర్‌లా లేదు. ఇంకెలా ఉంది ఎలానూ లేదు. అసలు లెక్కలోకి వచ్చేలా లేదు. లెక్కలోకి రాలేని మనుషులు మరమనుషులా. అలా అయిపోతారేమో. వారికి ఈ లోకంతో పనిలేనట్లు.. కీ ఇచ్చినట్లు. చేయాల్సిన పని ఇలా చేయడం కనీసం సెనోరిటాలా ఉన్నా. లోపల మనిషి ఏమైపోయి ఉంటుంది.
నిద్ర వస్తే బావుండు, ఈ లోకపు అంచులనుండి జారిపోయేట్లు ఏదోలా వస్తే బావుండు. ఈసారి ఫ్లయిట్ పడకూడదు. వెళ్ళాలి ఇండియా. ఎవరికోసం వెళ్తున్నా. ఆమెని కలవాలి ఈసారైనా,
ఆమె నన్ను కలుస్తదా, నన్ను గుర్తుపడతాదా, నవ్వుతదా చూసి. అక్కడే ఉండి ఉంటదా. ఎప్పుడు ఇంకో ప్రపంచంలోకి అడుగుపెట్టానో. ఫ్లయిట్ అటెండెంట్ లేపడంతో, తనని మనిషిగా చూడకుండానే ఇచ్చిన డిన్నర్ తిని పడుకున్నా. ముంబై కి రీచ్ అయినట్లు అనౌన్సిమెంట్.
**
ముంబై ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బలంగా గాలి తీసుకున్నా. ఇండియా గాలి. ఇరుగ్గా ఉంది ఊపిరాడనట్లు, అతని శ్వాసలా వెచ్చగా చెంపలకి తాకింది. ఇండియా చేరుకున్నట్లే. ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నా, ఏదైతే అది అవుతది. ఎక్కువ టైం లేకుండానే.. ఇక్కడ మనుషుల మొహాల్లో అలజడి, నవ్వులు, బాధలు ఎందుకో అన్ని ఎమోషన్స్ అవన్నీ నిజమేనా. నిజం కానీ ఎమోషన్స్ ని తీసుకురావడం ఎంత కష్టం నటించడం. అలాగేగా నేను చేసింది. ఇప్పుడు ఎవరు ఎవరిని మోసం చేశారనే ప్రశ్న వేసుకోకూడదు. ఎవరైనా నన్ను నిలదీస్తే.. నిజం కానీ ఎమోషన్స్ తో ఉండటం మోసం అంటే. నేను ఎవరికి జవాబు చెప్పాలి.
శరణ్ వస్తాడా ఎయిర్‌పోర్ట్‌కి రిసీవ్ చేసుకోడానికి. తనతోపాటు ఎవరైనా, ఎవరైనా ఉండి ఉంటారా. ఆమె ఉండదు కదా.. ఉండొచ్చు లేక పోవొచ్చు. ఉన్నా ఏమవుతది. నేను వెళ్లి నిన్ను మిస్ అయ్యాను అని కౌగలించుకొని చెప్పాలి. చెపితే అంతా అయిపోతుందా? ఎవరి మనసులో ఏమీ లేకుండా మాయమవుతుందా?
**
హైదరాబాద్ ఫ్లయిట్ అనౌన్సమెంట్.. ఇక ప్రయాణం చివరికొచ్చింది. నేను దిగిపోతాను. అక్కడ నా కోసం ఇల్లు ఉంటదా? నా కోసం అతని ఇంట్లో ఆ రూమ్ లో పోస్టర్ అలానే ఉంచి ఉంటాడా? అయినా అది నా ఇల్లు కాదుగా.. కాకుండా ఎప్పుడు పోయింది.
నా వైపు గళ్ళ చొక్కా ఎరుపు పిల్లోడు ఇంటరెస్టింగ్ గా చూస్తున్నాడు. వీడి ఇంటరెస్ట్ నచ్చట్లేదు, వెగటుగా ఉంది. అదేంటి నేను నీలి కళ్ళ వాడిమీద అంత ఇష్టం చూపించి, వీడంటే పరమ రోతగా అనిపిస్తుంది. వీడు బాగానే ఉన్నాడు . వాడి కళ్ళు నచ్చలేదు, వాటిని తీసి విసిరిపారెయ్యాలి అన్నట్లు అనిపించింది .
వెనుక పాపని ఎత్తుకొని సెనోరీట హైరానా పడుతుంది ఎవరిమీదా? పాప మీదనా? పక్కన వాళ్ళ మీదనా? తాను కష్టపడుతున్న గొప్ప ప్రేమైక అమ్మని అని చూపించుకోవాలని పాపని ముద్దు చేస్తుందా? పాపకి అలవాటు లేనట్లుంది తల వెనక్కి జరుపుతోంది. ప్రేమైక మాతృమూర్తి నువ్వు వెళ్ళు ఫ్లయిట్ అనౌన్సుమెంట్ వచ్చింది. ఆ మాతృమూర్తి హాయ్ అనీ, పాపని కొంచం పట్టుకుంటారా అనీ.. చేతిలో పెట్టింది. పాప ఉలిక్కిపడి నా వైపు చూసింది. ఇంకా ఎక్కువగా నా కళ్ళలో భయం చూసిందేమో చిన్నగా నవ్వింది. నేను ప్రయత్నించా నవ్వడానికి. పాప కళ్ళు నవ్వుతున్నాయి కొంటెగా. తనని ఏడిపించాలనిపించింది. కోపంగా చూసా, పాప మొండిగా చూసింది నావైపు. నువ్వు నన్నేమి చేయలేవు అన్నట్లు ఉంది. పిల్లలు మంచివాళ్ళని ఎవరన్నారో. ఈ పాప మాత్రం చాలా తెలివైంది. నిర్లక్ష్యంగా పట్టించుకోనట్లు చూస్తుంది నా వైపు. అంతలోనే ఆ మాతృమూర్తి పాపను అందుకొని థాంక్యూ అంది. తన అమ్మ భుజం మీదకి వెళ్తూ చూసావా నన్నేమి చేయలేవన్నట్లు చూసింది. పాపా జుట్టు నా రింగ్ లో చిక్కుబడింది. లాగాను. పాప ఏడుపు మొహం పెట్టింది. ఓహ్ సారీ అని ఇరుక్కున్న జుట్టును తీశాను. గర్వంగా పాప మొహంలోకి చూసా. పాప నన్ను పట్టించుకోకుండా పక్కకి తిరిగింది. ఎంత పొగరు.
హైదరాబాదేనా ప్రాపర్ అంటూ తెలుగులో మొదలుపెట్టింది మాతృమూర్తి . హ్మ్మ్ అన్నా. ఇండియాలో అడుగుపెట్టాక అన్న మొదటి మాట హ్మ్. వీడ్కోలు చెప్తూ అదే మాట అన్నట్లున్నా . ఫ్లయిట్‌లో నాకంటే రెండు సీట్ల ముందు కూర్చుంది పాప. నేను వెళ్తూ పాపని దాటి వెళ్ళా. పాపే చేత్తో నా చొక్కాని పట్టుకుంది. లాగాను షర్ట్‌ని. పాప ఏడుపు మొహం పెట్టింది . ఈసారి మాతృమూర్తి కొంచం అసహనంగా చూసింది. ఓహ్ సారి అన్నా. ఈసారి మాతృ మూర్తి ఇట్స్ ఓకే అనలేదు. నా తాప్పే అన్నట్లు చూసింది. పాప కొంటెగా నవ్వుతున్నట్లు ఉంది. ఎవరన్నారు పిల్లలు అమాయకులని.
ఫ్లయిట్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. పైలట్ థాంక్స్ చెప్పాడు, గుడ్ డే అని చెప్పాడు. ఎందుకో పైలట్ గొంతు నిర్లిప్తంగా వినిపించింది. అతని భార్య కూడా అతని ప్రవర్తనకి విసిగిపోయిందేమో. లేదా అతనూ నాలాగా ఉండి ఉంటాడు. అవునా అప్పుడే వచ్చిందా హైదరాబాద్. ఇప్పటిదాకా రాకపోయి వుంటే, ఫ్రాంక్ ఫర్ట్‌లో పిల్లి గడ్డం ఆడమ్‌తో వెళ్లి ఉంటే ఇక్కడ శరణ్‌కి ఎదురుపడే పనిఉండేది కాదు. శరణ్, నీలో బుద్ధుడి లక్షణాలు ఉన్నాయి. నీ కళ్ళు అతని కళ్ళలానే ఉంటాయి. ఆత్మని అంత తేలిగ్గా ఎలా మోస్తాడో. ఎవరితో వస్తాడు ఆమెతోనేనా? ఇద్దరూ కలిసి వస్తారా? వాళ్ళని చుట్టుకొని నేను నవ్వుతూ మాట్లాడాలి. మాట్లాడాలా? నటించాలా? ఊరికే వాళ్ళతో ఉండాలా. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు. నేను ఇప్పటికీ బాగానే ఉన్నాను కదా. హా ఉన్నాను అలా .
హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. అలానే ఉంది. మాతృమూర్తి నవ్వుతూ చూసింది ఆమె లగేజ్ తీసి ఇచ్చినందుకు. ఆమె పాపని నాకు ఇవ్వనందుకు సంతోషంగా అనిపించింది. పాప నన్ను పట్టించుకోలేదు. పొగరు. లగేజ్ క్లెయిమ్‌లో కారోసోల్ మీద తిరిగే సూట్ కేసులు మనుషులకంటే వేగంగా తిరుగుతున్నాయి. శాంతిగా విచారంగా నిర్లిప్తంగా ఎదో మోస్తున్నట్లు ఎవరినో మోస్తున్నాయి. వాళ్ళ బట్టలని వాళ్ళ లోదుస్తుల్ని కూడా. కొందరు మురికిబట్టల్ని పెట్టుకొని ఉంటారు. అందరూ బహుమతులు కూడా తెచ్చి ఉంటారు. నేనేమి తెచ్చాను.. ఏదైనా తెచ్చి ఉంటే బావుండేది. ఏమి తెస్తాను శరణ్ ఏమి ఇవ్వగలను. అతనికి ఏమిచ్చినా సంతోషమే . నన్ను చూడటమే అతనికి శిక్షేమో. శిక్షేనా నిన్ను చూడటం అంటే కాదని ఆనందం అని కనుబొమ్మలతో చెప్తాడా .
ఒక సూట్ కేసు వచ్చేసింది. బయటికి అడుగు పెట్టా. దూరంగా శరణ్ చేతులు ఊపుతున్నాడు. కనుబొమ్మలు కనిపించడం లేదు. ఆమె లేదు పక్కన. వెనుక లేదు. ఇంట్లో ఉండి ఉంటదేమో. ఆ రోజు కొలంబస్లో ఆ జర్మన్ షెపర్డ్ నాపైన పడకుండా ఎందుకు వెనక్కి వెళ్లిందో. దాని బెల్ట్ వైపు చూసి జాలి పడినప్పుడు నా వైపు రోషం గా ఎందుకు చూసిందో. ఎందుకు ఆమె కనపడట్లేదో ఇప్పుడు. శరణ్ పిల్లి గడ్డం వాడిలా నవ్వుతాడు కదా. దయగా క్షమిస్తున్నట్లు. క్షమాపణ అనేపదం ప్రపంచంలో లేనట్లు. ఒకసారి నావైపు చూసుకున్నా.జుట్టు సరిచేసుకొని ముందుకునడిచా.బలంగా ఊపిరి తీసుకున్నట్లు నటించి.
*
ఎలా రాస్తారండి బాబు ఇంత సున్నితమైన భావాలు,గాడమైన పదాలు, సంక్లిష్టమైన ఆలోచనలు. మనిషి ప్రతి కదలికను, మాటను, చేతను పలు కోణాల్లో స్కానింగ్ చేసి వడకట్టి, జల్లెడ పట్టి పదాల్లో పెట్టే మీ భాష 🙏🏻 దీనిని కథ అనే కంటే పొడిగించిన కవిత అనొచ్చేమో! మనిషి జీవితంలో ప్రతి నిమిషం , నిరాశ – ప్రేమ, ద్వేషం-నమ్మకం,అనుమానం-కోరిక, వైరాగ్యం వంటివి దోబూచులాడుతుంటాయి. వాటిని మీ కధనంలో చాలా బాగా చూపించారు. బంధాలు ప్రయాణికులాంటివారే, ఒక్కోసారి ఎంత తొందరగా అల్లుకుంటాయో అంతే తొందరగా విడిచిపెట్టాల్సి వస్తుంది. కొన్ని బంధాలు ఎంత వద్దనుకున్నా , విధి రాసిన శాసనంతో ముడి పడి ఉంటాయి. ఇక స్వేచ్ఛ అంటారా అది కేవలం మేధస్సుకు మాత్రమే అందేది. ఇలాంటి నర్మగర్భిత ఆలోచలెన్నో మీ కధనంలో ఉన్నాయి. ఇలా రాయడం మీకే సాధ్యం 👏👏👏👍 మీ ఈ ప్రయత్నానికి శుభాభినందనలు
Thank you Siddhiq garu
కథ బాగుంది. ఆలోచనలు గొలుసు కాలేదేమో. నిర్లిప్తత నుండి నిర్లిప్తతలోకి.
Good effort.
చంద్రశేఖర్.
Thank you Chandra sekhar garu
చిన్న ప్రయాణంలో జీవితాన్ని చూపించిగలిగారు. మనిషి ఆలోచనల్లోని ఉద్వేగ అస్థిరతను పట్టుకోగలిగారు. మీ తొలి కథతోనే ఇలాంటి ప్రయత్నాన్ని విజయవంతంగా చేసినందుకు అభినందనలు సుధగారు.
Thank you Bhaskar garu
Human psyche ని ఎక్స్ప్లోర్ చెయ్యడం సాధారణమైన విషయం కాదు. మనం కప్పుకుని తిరిగే ఎన్నో ముసుగులని దాటుకుని అంతరాంతరాలలో మనిషి ని చూడడానికి వాడి ని సమాజానికి చూపడానికి చాలా దైర్యం కావాలి. దానికి తోడు అద్భుతమైన ప్రతిభ తో చైతన్య స్రవంతి శైలిలో రాయడం నాకు నచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి కథ చదివాను. మీ నుండి ఇలాంటి రచనలు మరిన్ని ఆశిస్తున్నాను.
Thank you Narendra garu
ముగింపు వరకు చదివించే శక్తి ఈ కథలో వుంది. ఊహలను, ఊహలనుండి యదార్థమ్ లోకి మనసు.మల్లడం ….
తీరిక లేని ఆలోచనల ప్రవాహాలను …….. ఈ కథలో బాగా చూపించారు. పదాల సవ్వడి, సరళమైన భాషా, వుద్వెగాల అలజడి….. బాగుంది
Thank you Srinivas garu
కధ ఆధునిక చిత్రంలా ఉంది (It is like a modern painting)
Thank you andi
‘విషాదం ఎక్కడి నుంచైనా వస్తుంది
ప్రయత్నమేమీ ఉండదు
ఊరకే ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కూడా
కళ్ళు తడవుతాయి’.
‘సౌకుమార్యంతో, సౌందర్యంతో, పరవశంతో, వివశత్వంతో, వేదనతో, విచికిత్సతో, తత్త్వాన్వేషణతో మానవ జీవన మార్మికతను కవిత్వమై పలవరించిన కవయిత్రి శ్రీసుధా మోదుగు ~ కవి యాకూబ్
Thank you Ramayya garu
ఆద్యాంతాలు లేని ఆలోచనా స్రవంతిలో మానవజీవన శకలాన్ని పట్టిచూపిన డిఫరెంట్ స్టోరీ.. స్ట్రీమ్ ఆఫ్ కాన్షయస్‌నెస్‌లో వచ్చిన నవీన జీవనదృశ్యమిది.. జీవితపు దు:ఖాన్ని ఒక దృశ్యంతో ఒక ఆలోచనాస్రవంతిలో ముడివేసిన కథ.. బాగుంది..
Thank you Srikanth
మీతో పాటు, మీ ఆలోచనలతో కలిసి ప్రయాణించిననట్లుగా వుంది మేడం ఈ మీ కథ చదువుతుంటే. అడుగడుగునా మీకు కలిగే భావాలను పరచుకుంటూ పోతూ మీరు మీ గమ్యాన్ని మీకు తెలీకుండానే చేరుకున్నట్టుగా వుంది. చైతన్య స్రవంతి లో సాగిన ఈ కథ, కామెంట్ బాక్స్ లో ఇదివరకే ఎవరో అన్నట్టు ఇది ఒక*అత్మశ్రయ కవితాత్మక కథ* అని చెప్పవచ్చు.
” అన్‌వాంటెడ్ అరైవల్ ” ~ శ్రీ సుధా మోదుగు కధను పున్నాగపూల సాహితీ సౌరభాల జలంధరమ్మ ( జలంధర చంద్రమోహన్ ) గారికి పంపించుకున్నాను… ఇది ఆ యమ్మ లాంటి పెద్దోళ్లు సూడాలస్నినదని నమ్ముతూ. వాట్సప్ లో వారికి పంపుతూ నేను రాసిన కొన్ని అవాకులు చవాకులూ ఇవి :
Jalandharammaa,
please have a look at this short story titled ” Unwanted Arrival ” ( అన్‌వాంటెడ్ అరైవల్ ~ శ్రీ సుధా మోదుగు ) by Dr. Srisudha Mudugu written in చైతన్య స్రవంతి శైలి – Stream of Consciousness style.
Couple of years ago, first time when I read her Short Stories book ” Rekkala Pilla ” and Collection of Poetry book ” Amoham ” I got highly impressed with her original literary talent and experience an inexplicable joy.
I understand she is working in Medical field at Jamaica ( West Indies… of cricket legends like Gary Sobers, Vivian Richards, Andy Roberts, Michel Holding ). Dr. Sri Sudha Modugu has connections / friends with our native Kanigiri town ( in Prakasam Dist ) and originally belongs to Rentachintala town near Narasaraopet, Andhra Pradesh.
I consider and adopted her as my God- given-Daughter. She got high appreciations from the noble ones in Telugu literature.
Downloading this short story from the Saaranga Web Magazine , I have spent the entire Sunday ( 19-July-2020 ) on decorating it ( or disturbing it ) with various photographs and footnotes taken from Google searchs.
Somehow, some day I want my this Telugu literature daughter Dr. Sri Sudha Modugu to get in touch with you, and get benefited from your high intellect and literary talents ( as our Kanigiri Doctor gari Ammayi Dr. Mythili Abbaraju garu and others got benefited ).
~ Yours sincerely, K.K. Ramaiah, Bangalore
Thank you so much Ramayya garu , such an unconditional encouragment.
డియర్ సత్యా!
త్రిపుర అంటాడు కదా…
“అంత నిజాన్ని నాకివ్వకు. నా దాహానికి ఉప్పనీటి సముద్రాన్ని చూపి గేలి చేయకు. చిటికెడు కాంతి తునక అడిగితే, నిబిడాంధకార ఆకాశాన్ని చూపకు. కనీసం మంచు అంటిన గడ్డి పరకనివ్వు. పక్షులు స్నానం చేసి దులిపేసిన ఒక్క నీటి చుక్కనివ్వు. గాలి విసిరే ఒకానొక ఇసుక రేణువునివ్వు. అంత నిజం నాకు వద్దు.”
హిడెన్ ట్రూత్- అంటావేంటి? దాచేస్తే దాగే సత్యమా నా దాహం, పోనీ నీ మటల్లో చెప్పాలంటే నా మోసం!
అంత నిజాన్ని అడక్కు.
బ్రేకింగ్ అఫ్ కమిటెడ్ లైన్స్ – అంటావా?
Commitment – ప్రేమనాటి వాగ్దానాలా… పెళ్ళినాటిప్రమాణాలా… అధీనం కావడమా… నిబద్ధమనే అబద్ధంలో ఖైదు కావడమా? ఒకే ప్రేయసి… ఏకపత్ని… ఒకటే బాణం… ఒకేలా చావు! అంతేనా?
అసలు మీ అమ్మాయిలంతా ఇంతేనా?
-నరేష్
(శరణ్ కి నీకు తెలీని ప్రాణమిత్రుడు)
Thank you for your valuable feedback Naresh garu
“ఫ్లయిట్ అటెండెంట్ నవ్వుతుంది.జీవిత సమస్యై ఉంటుంది. తాను నవ్వడంలో ఆరితేరి, అసలు నవ్వుని ఎక్కడ దాచుకుందో మరి. బయట నవ్వు నిజమైన నవ్వు ఎలా ఉంటాదో ఆమెది.”
“Being thrown from the blue skies to the dark abyss of reality, I pent myself in the window seat of angst, brooding over her red herring baits. But, when I genuinely recollected her scattered smiles while dissecting deep into her anatomy during my journey from New Delhi Airport to the guest house, there was a revelation in my confessional mid-career mind – that those smiles do blossom naturally with wild whiff in the privileged meadows of love, but not in the professional terrains of courtesy
(https://bit.ly/3hhIinI)”
– శ్రీసుధా! కాకతాళీయమే కావొచ్చు గాక, చూశారా మన భావాలు ఎలా కలిశాయో!
yeah , you really expressed in a beautiful way …
Very good narration. I liked it though i didn’t understand the story properly
Thank you Krishna Jyothi garu
ఫ్లైట్ ఎక్కి లాండ్ అయ్యే లోపుగా మనసు లో
కలిగే ఆలోచన స్రవంతి విహారానికి మంచి అక్షర రూపమిచ్చారు. ఒక ఆలోచన యింకొక ఆలోచనతో
ఘర్షణ పడి ఆగిపోకుండా చాలా conscious ga
కథను నడిపించారు. ఉత్కంఠతో ఆశక్తిగా చదివించిన కథ.ధన్యవాదాలు.
Thank you andi
కథ ఆలోచనల చుట్టూ తిరుగుతూ, మనసు లో దాక్కున్న అసలు భయం నించి పారిపోడానికి చేస్తున్న ప్రయత్నాలను చక్కగా చూపించింది.
ఆ భయానికి వున్న కథ ను, ఆ ఆలోచనలను, మరి కొంచెం చూపిస్తే మరింత బాగుండేదేమో..
కంగ్రాట్స్.
Thank you Ravi garu