అన్ని నీవనుచు అంతరంగమున…. … తిన్నగా వెదకి!

– చిన్నప్పుడే అంటిన Rational తుప్పు ఎంత విదుల్చుకున్నానని విర్రవీగినా, తెలియకుండానే అర్థం చేసుకోవడం, అర్థంకాకున్నా ఆరాధించడమనే మహదానుభవాన్ని ఏనాడైనా పొందానా, ఆమె సావాసానికి ముందు!

– ‘నేనెట్లా తెలుసు’ అనుమానంతో అడుగుతాడు పురూరవుడు. ‘తెలీడానికి ఎట్లా ఏమిటి? అర్థంలేకుండా మాట్లాడుతున్నావు…’ అని ఆశ్చర్యపోతుంది ఊర్వశి. ‘… తెలీడానికి చూడడమెందుకు? చూస్తే ఏం తెలుస్తుంది…’  అని జాలిపడుతుంది అతని మీద.

ఊర్వశి ఉద్బోధ నాకు సహానుభవం, చలం గారిని చదవడం చేత.

తెలియకుండానే అర్థం చేసుకోవడం, అర్థంకాకున్నా ఆరాధించడం- నాకు స్వానుభవం, నా నేస్తురాలి వల్ల.

**          **

ఆమెది తెనాలి. అయితే, తెనాలితో నా బలమైన బంధానికి మాత్రం ఆ తెలితామర కారణం కాదు. నేను పుట్టిందే తెనాలిలో, మా తాతయ్య (మాతామహులు)ది తెనాలి పక్కన పల్లెటూరు.

అలా నేను పుట్టిన తెనాలిలో ఏ 40 ఏళ్లకో అనుకోకుండా ఎదురై- తెలియకుండానే అర్థం చేసుకోవడం, అర్థంకాకున్నా ఆరాధించడం – చెబుతోంది!

‘ఇష్టపడాలంటే అర్థమవ్వాలా?’ అని పక్కున నవ్విందప్పుడు. సింటాక్స్ సరిపోయిందా, వ్యాకరణ దోషాలేమైనా ఉన్నాయా ఆమె వాక్యంలో అని ఆలోచిస్తూ, ‘కనీసం తెలుసుకోవాలి కదా’ అన్నాను.

మరింత వెడల్పాటి నవ్వులతో వెన్నెలని తెల్లని మంచు తుంపిళ్లుగా రాల్చింది నా మీద. ‘నా తెనాలి’ మొత్తంగా జలదరించిపోయింది.

ఏమి ‘నా తెనాలి’ అది? ఎటువంటి ‘నా తెనాలి’? కోస్తాంధ్రలో ఏదో ఓ మూల పట్టణమా? కాదు,  దక్షిణభారతంలోనే అనేకానేక ప్రత్యామ్నాయ ఉద్యమాల epicenter. అనేకానేక ప్రశ్నల్ని దట్టించుకున్న అమ్ములపొది. తర్కం తాండవం చేసే నేల. హేతువనే హేతివాదరలతో నిన్నటి నీడల్ని, నమ్మకాల జాడల్ని చీల్చిచెండాడిన సీమ. చార్వాక…  లోకాయత… సాంఖ్య… వైశేషిక… బౌద్ధ… జైన… నాస్తిక బుద్ధిమంతనం పేట్రేగి బుర్రల్లో భయభక్తుల బూజుని దులిపేసిన క్షేత్రం. ‘ఇచట పుట్టిన చివురు కొమ్మైన చేవ’ అన్నట్టు, ఆ కొమ్మలన్నీ చేవదేరి మూఢనమ్మకాలకీ, అంధవిశ్వాసాలకీ బడితపూజ చేసే అటువంటి ‘తెనాలి’ అనే తావున హేతువు, తర్కము, కార్యాకారణములకి ఆవల అనుభవం మాత్రమే ఆలంబన అయిన దాన్నేదో అందుకోవాలంటుందామె.

మొన్న శ్రీరామనవమిని అడ్డం పెట్టుకొని ఎందరో ప్రశ్నలరాయుళ్లు, సవాళ్ల వీరులు, నిలవేత చండామార్కులు… చెలరేగి రకరకాల రక్తక్షేత్రాల్లో మళ్లీ మళ్లీ రణనినాదాలు చేయడం చూసినప్పుడు-  నా చిన్ననాటి అదే తెనాలి గుర్తొచ్చింది.

ఉపాధికోసం ఉన్న ఊరిని వదిలేసి పట్టణానికి వచ్చేశారు మా మేనమామలు. చిన్న మామయ్య నల్లాన్ చక్రవర్తుల వారి ఇంట్లో అద్దెకి ఉండేవాడు. నల్లాన్ చక్రవర్తుల వారి ముగ్గురమ్మాయిలతో స్నేహమే గానీ, నా ఈడుదైన రెండో అమ్మాయి రజనీ బాగా దగ్గర. ముఖ్యంగా శ్రీరామనవమి పందిళ్లలో ఆ తొమ్మిదిరోజులూ మా సందళ్లే. ముఖ్యంగా బోస్ రోడ్డులో స్వరాజ్ టాకీస్ సెంటర్లో ఉండే రామాలయం దగ్గర తాటాకుల చలవ పందిళ్లు వేసేవారు రోడ్డు పొడుగూతా. ఉదయం సుప్రభాత సేవ నుంచి, రాత్రి పవళింపు సేవ వరకూ అర్చనలు, అభిషేకాలు, ఆరగింపులూ… ఇంకా నాతో కలిసి పందిళ్లలో నవ్వులు… నాటకాలు… మధ్య మధ్య జడపట్టి లాగడం వంటి చిలిపి వాదోపవాదాలు.

రాడికల్ హ్యూమనిస్టు, నాస్తిక, హేతువాదాలతో అంటకాగిన నాన్న గారి ప్రభావాలు, తీక్ష్ణ హేతు తర్క మీమాంస చార్వాకులైన తొలిగురువుల ప్రబోధాలు, తొందరపడి కూసింత ముందే ఎక్కించుకున్న త్రిపురనేని, నార్ల విలోమ, విచ్ఛేదన రచనలు… కలగలిసిన ఉరికించిన నా ఉద్రేకాల వల్ల  ఉలిపికట్టెలా కొన్ని ప్రశ్నలు వేసి, మరికొన్ని సవాళ్ళు చేసి, ఇంకొన్ని తర్కాలు రేపి తోటివారు డంగైపోతుంటే, తెల్లముఖం వేస్తుంటే ఎంత ఆధిక్యభావం నాలో.  ఎప్పటి ప్రశ్నలవి? అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్టు తాతలూ… తండ్రులూ అడిగిన ప్రశ్నలు. ఒట్టి నిష్పూచీ ప్రశ్నలని అనను; నా ముందు తరాలు కచ్చితంగా ఎంతో శోధించి, పరిశీలించి, పాట్లు పడి, కొత్త భాషలు నేర్చి, శాస్త్రాలు చదివి మరీ వేసిన ప్రశ్నలే. కానీ, నా చిన్ననాటికే పాచిపోయిన ప్రశ్నలు; ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా కత్తులుగా… కవచాలుగా వాడబడుతున్న భావదారిద్ర్యం ఆ ప్రశ్నల అంతటా.

రాహువు వదిలేశాడని గ్రహణ స్నానం చేస్తున్న మూఢ విశ్వాసిని- గ్రహణం అంటే ఏమిటో సశాస్త్రీయంగా తెలిసినవాడు గేలి చేసే అధికారం వంటి జ్ఞానాధిక్యతతో రజనీని ఆటపట్టిస్తుండేవాడిని.

“సీతని అగ్నిప్రవేశం కోరి, ఒక స్త్రీకి ప్రమేయం ఉన్నా లేకపోయినా, పరాయివాడితో ఆమె తాకబడితే అపవిత్రమైనట్టేనని, కాబట్టి అగ్నికి ఆహుతి కావల్సిందేననీ సందేశాన్ని ఇచ్చిన, దాన్నే జాతికి ఆదర్శంగా నిలిపిన రాముడు నాకు దేవుడు కాదు; ఏ అమ్మాయికీ దేవుడు కావడానికి వీల్లేదు. తన భార్య శత్రువు చెరలో ఉండటమే కాదు, ఆ శత్రువు వల్ల ఆమె ఓ బిడ్డకి తల్లి అయినా కూడా, భార్యని, బిడ్డనీ కూడా అక్కున జేర్చుకున్న చంఘీజ్ ఖాన్ ఈ విషయంలో ఆదర్శవంతుడు…” అని వాదనలు వినిపించేవాడ్ని రజనీకి, ఆమె బుర్రలో నిండిపోయిన రామభక్తిని తోడేయాలని.

పకపకా నవ్వేసి శ్రీరామనవమి పందిరిలో స్టేజ్ ఎక్కి గొప్ప తన్మయంతో పాడేది (రజని బహుశా చిన్నతనంలోనే సన్నాయిని మింగిందని నా అనుమానం):

“కోవెల లోనికి రాలేను

నువు కోరిన కానుక తేలేను

నిను గానక నిమిషము మనలేను

నువు కనబడితే నిను కనలేను…” (దేవులపల్లి)

చిత్రం: తల్లావఝ్ఝల శివాజీ

నా తలలో నిండిపోయిన తర్కం, సిరలు ధమనుల్లో ప్రవహించే అవిశ్వాసం ఏమయ్యేవో తెలీదు, “నీ పదములె చాలు రామా… నీ పద ధూళులే పదివేలు!” అని ఆత్మ సాగిలపడేది, చెక్కడం కూడా సరిగా చేతగానితనం వల్ల విరూపాలైన రాతి విగ్రహాల ముందు కూడా.

“ఏటేటా ఈ సీతారాముల పెళ్లేంటీ? మంగళసూత్రమేమిటి? మంగళసూత్రమనే సంప్రదాయం ఏ శతాబ్దాల్లో ఏ రాజకీయ- సామాజిక కారణాల వల్ల పుట్టుకొచ్చిందో తెలుసా…” అంటూ ముక్కున ఉన్న తక్షణ జ్ఞానాన్ని చీదేసేవాడ్ని రజని ముందు.

“ఆ అమ్మాయికి పెళ్లయ్యిందంటావా, ఈ పిల్ల మనువాడిందేమో… అని బెంగగా మిర్రిమిర్రి చూస్తుంటావుగా వాళ్ల మెట్టెలు, తాళీ; నీ బోటి వాళ్లకోసమే తెచ్చుంటారులే ఆ నడమంత్రపు ఆచారం…” అనేది కొంటెగా. మరీ నా ఖండనముండనల స్వైరవిహారం ఎక్కువైతే, ‘ఆపు నీ సోది…’ అంటూ పందిరి తెర మీద వేసే ‘శ్రీరామాంజనేయయుద్ధం’ సినిమా ముందు కుదేసి మళ్లీ మళ్లీ చూపించేది, ‘భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో… దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్… రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా… దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే… దండము నెక్కి చాటెదను..’ అని చెలరేగిపోయే ఆంజనేయుడితో అన్యోన్యమైపోతూ, నన్ను కూడా అందులో ఇరికిస్తూ, ఇముడుస్తూ.

ఆ తెనాలిలో అలా ఆట్లాడుతూ పోట్లాడుతున్న ఆ రోజుల్లో రజని చెప్పకనే చెప్పింది కూడా అదేనేమో- ‘తెలియకుండానే అర్థం చేసుకోవడం… అర్థంకాకున్నా ఆరాధించడం! ‘

ఆ తర్వాత అటూఇటుగా ఓ పాతికేళ్లకి, నలభయ్యో పడిలో పడ్డాక, బతుకులో ఎన్నో గతుకులు దాటుకుంటూ వస్తున్నప్పుడు అవే అర్థాలకి ఆవల ఆరాధనల గురించి తెనాలిలో స్నేహమైన కొత్త నేస్తురాలు- రజనిలా సూచ్యంగా కాకుండా, వాచ్యంగా చెప్పినప్పుడు తుప్పు పట్టి వంకరబోయిన ఇనుపముక్కల్లాంటి ప్రశ్నల్ని సైడుకాల్వల్లోకి ఊడ్చేయడం మొదలెట్టాననుకుంటా.

అయితే, ఆ ప్రశ్నలకి విలువలేదా? తరతరాల అధికారంతో తలపడి, ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి  ‘సూతాశ్రమ గీతాలు’, ‘ధూర్త మానవ శతకము’, నాటకాలు- ‘ఖూనీ’, ‘శంబుకవధ’ ల నుంచి, నార్ల వెంకటేశ్వర్రావు గారి ‘జాబాలి, ‘సీతజోస్యం, ‘నరకంలో హరిశ్చంద్ర, ‘పాంచాలి (పంచరాత్రం)’ ల నుంచి, రాంభట్ల కృష్ణమూర్తి, కల్లూరి భాస్కరం గార్ల అంత్రోపొలాజికల్ వ్యాఖ్యానాల నుంచి, సౌదా ‘అపూర్వ పురాణ కథల’ మీదుగా ఇప్పటి దాకా వేస్తున్న ప్రశ్నలకి అర్థంలేదా? కొన్ని తరాలు, ఎందరో జిజ్ఞాసులు, అన్వేషకులు వేసారక వెదికి, మథించి, శోధించి సాధించిన సమాధానాలు అంత చవకగా చెత్తకుప్పల్లోకి తోసేయడమేనా?

ఒక ఉదాహరణ చూద్దాం : పరిశోధనల కోసం జీవితాన్నే పణంగా పెట్టిన పరమశివ అయ్యర్ వంటి స్కాలర్స్ అయోధ్య నుంచి లంక వరకూ రాముడు చేసిన ప్రయాణాన్ని, వెళ్లిన ప్రాంతాల్నీ నిర్ధారించాడు. ఆయన ప్రకారం, చిత్రకూటం, సుతీక్ష్ణుని ఆశ్రమం, పంచవటి, కిష్కింద, ఋష్యమూకం, చివరికి లంక కూడా ఉత్తరభారత దేశంలోనే. అంటే రాముడు అసలు వింధ్యపర్వతాల్నే దాటలేదు.

అదేమిటీ… మన తెలుగు నేల మీద సీతారాములు అడుగుపెట్టని చోటుగాని, నడయాడని ప్రదేశంగానీ, సేదదీరని సీమ గానీ లేదు కదా. ఒక్క మన భద్రాద్రినే తీసుకుంటే, కొండ మీద నుంచి చూపు సారిస్తే అటు సీతారామలక్ష్మణుల పర్ణశాల, ఆ పక్కన చూస్తే సీతమ్మవారు చీర ఆరేసిన గుర్తులు, అక్కడే సీతారాములు వామనగుంటలు ఆడుకున్న తావు, ఇంకో పక్క చూస్తే శూర్పణక ముక్కుచెవుల్ని లక్ష్మణుడు కోసిన చోటు, దానికి ఐమూలగా అల్లంత దూరాన ఖరదూషణాదులతో సహా 10 వేల మందిని శ్రీరాముడు ఒక్కడే నిర్జించిన యుద్ధభూమి, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయాక సీతాన్వేషణలో రాముడు వగచిన ఏకశిల…. ఇన్ని జాడలున్నాయి కదా. అవన్నీ అబద్ధాలేనా?

కాసేపు స్థలకాలాదులు మర్చిపోదాం. ఒక ఇతిహాస కావ్యం రూపుదిద్దుకుంటున్న వేళ, దాన్ని సృజిస్తున్న ఆదికవి తన్మయుడై, తాదాత్మ్యుడై రచనలో లీనమైపోయి, అది చాలక తానే అందులో ఒకానొక పాత్రగా మారిపోయిన ఒక అపురూప సంఘటనని ఊహిద్దాం. దానికి కొనసాగింపుగా, యుగాలు మారే కొద్దీ, కాలాలు కడచే కొద్దీ ఆ కావ్యంతో మమేకమైన రసజ్ఞలోకం లేదా పామరజనం అందులోని సీతారామలక్ష్మణహనుమ వంటి పాత్రల్ని తమ తమ ఊళ్లలోకి, లోగిళ్లలోకి నడిపించుకున్నారు. ఎంత అపురూప సన్నివేశమది: ఒక కాల్పానిక జగత్తులోకి మనిషి పాత్రగా ప్రవేశించడం, కాల్పానిక రూపాలు ontological  తలాల మీద పాదం మోపడం. ఏదీ తెలియకుండానే అర్థం చేసుకొని, అరకొరగా అర్థమవుతున్నా అంతకంత ఆరాధిస్తూ సాగుతున్న కావ్యరచనలోకి ఎలా అయితే మహాకవి వాల్మీకి వెళ్లాడో, అటువంటి అర్థాలు చూసుకోని ఆరాధనతోనే బహుశా సీతారాముల్ని ప్రజలు మన నేలల మీదకి తీసుకొచ్చి ఉంటారనిపిస్తోంది.

అటువంటి ఆ ఇచ్చిపుచ్చుకోవడాల మధ్య త్రేత- ద్వాపర- కలి యుగాలంత సుదీర్ఘమైన కాల్పానిక కాలం లేకపోయినా, కనీసం వెయ్యీ, వెయ్యిన్నర ఏళ్ల అకల్పిత కాలపు అంతరమైతే ఉంది కదా. ఆ వెయ్యేళ్ల కాలంలో మూలకథ సహజంగానే – వాల్మీకి రామాయణం, తులసి రామాయణం, నిర్వచనోత్తర రామాయణం, కంబ రామాయణం, చంపూ రామాయణం, నిర్వచనోత్తర రామాయణం, అద్భుత రామాయణం,  వాశిష్ఠ రామాయణం,  ఆశ్చర్య రామాయణం,  మొల్ల రామాయణం,  ఆధ్యాత్మిక రామాయణం,  తొరవె రామాయణం, రంగనాథ రామాయణం,  భాస్కర రామాయణం, శారద రామాయణం, గోపీనాథ రామాయణం…. వగైరాల నుంచి విశ్వనాథ వారి ‘రామాయణ కల్పవృక్షం’ వరకూ… వందల రూపాలు తీసుకొంది, వేనవేల భావాలుగా విస్తరించింది. సత్యం ఏకశిలాసదృశం కానట్లు, కావ్యం కూడా తనకి ఒకే మూలాన్ని నిరాకరిస్తుంది (మూలానికే ప్రక్షిప్తాలు చేరడం మరో ముచ్చట/ లేదా ఎత్తుగడ). మొన్నటికి సబబుగా తోచినవి, నిన్నటి రోజున అనైతికమై సరిచేతలకి గురై ఉండొచ్చు, కొత్త ప్రతిపాదనలు మొండి ధర్మాలై కవళికలు మార్చుకొని పాతుకుపోయి ఉండొచ్చు.

అయోధ్యకాండ 96వ సర్గ:

తాం తథా దర్శయిత్వా తు మైథిలీం గిరినిమ్నగామ్.

నిషసాద గిరిప్రస్థే సీతాం మాంసేన ఛన్దయన్..

(మందాకినీ నదిని మైథిలి (సీత)కి చూపి, ఆమెని అనునయిస్తూ మాంసం తినిపిస్తుంటాడు రాముడు)

ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్తమిదమగ్నినా

ఏవమాస్తే స ధర్మాత్మా సీతయా సహ రాఘవః

(ఈ మాంసం  శుద్ధంగా ఉంది, ఇది రుచిగా ఉంది, ఇది బాగా కాలింది అంటూ రాముడు సీతమ్మకి తినిపిస్తాడు)

ఉత్తరకాండ 42 వ సర్గ:

సీతామాదాయ హస్తేన మధు మైరేయకం శుచి,

పాయయామాస కాకుత్థ్సః శచీమివ పురన్దరః

పెద్ద ఉసిరి, బెల్లం మొదలైనవి వాడి తయారు చేసిన మైరేయకం అనే మద్యాన్ని చేతితో తీసుకొని, ఇంద్రుడు శచీదేవికి త్రాగించినట్లు సీతమ్మకు త్రాగించాడు రాముడు.

మాంసాని చ సుమృష్టాని ఫలాని వివిధాని చ,

రామస్యాభ్యవహారార్థం కింకరాన్తూర్ణమాహరన్

(ఈలోగా, బాగా శుద్ధి చేసిన మాంస పదార్థాలను, అనేక రకాలైన ఫలాలను తీసుకొని వచ్చారు సేవకులు)

… వంటి ఉల్లేఖనాలు చేసి, ఆదికవిని తొలి సాక్షిగా ప్రవేశపెట్టి, సీతారాములు మందు- మాంసం బాగా తిని తాగుతారని గొప్ప అపరాధ పరిశోధనోత్సాహంతో రాసేస్తుంటారు, ఉపన్యాసాలు దంచేస్తుంటారు. రాముడు నెమలి లెగ్ పీసులు ఆరగించాడని, జెల్ల చేపల ముళ్లు తప్పించి తినడంలో రాముడు ఎక్స్ పర్ట్ అనీ వెటకరిస్తుంటే, మరో పక్క భక్తులమని భ్రమసేవారు మనోభావాల్ని గాయపరుచుకునే పనిలో బిజీ అవుతుంటారు.

వాల్మీకి తన కాలంలో తన కళ్లెదుట జరిగిన ఒక కథకి కవిత్వాన్ని కాల్పానికతతో కలగలిపి రచించిన కాలానికి మాంసం నిత్యాన్నమే గాని, ఇంకా పండగలకి పరిమితమైన పరమాన్నంగా మారిఉండకపోవచ్చు. అలానే మద్యసేవనం కూడా ఒక నైతికాంశంగా కాకుండా, కొబ్బరిబోండాలు కొట్టుకొని తాగినంత సహజమై ఉండొచ్చు. తర్వాత శతాబ్దాల కాలం దొర్లిన తర్వాత శాఖాహారం ఆదర్శమై, మద్యపానం అనైతికమైన కాలంలో పాత అలవాట్ల స్థానే కొత్తవి వచ్చేసి ఉండొచ్చు. దానికి తగ్గట్టు మార్పులు చేయడం, లేదా రీటెల్లింగ్ లో వాటిని తీసేయడం, వాటి స్థానే ఆ కొత్త రచనల కాలంలో విలువల్ని ఆపాదిస్తూ తిరగరాయడం – ఇవన్నీ సహజంగా జరిగేవే కదా.

సీతను పట్టుకొని మరీ గుహుడి నావ ఎక్కించిన లక్ష్మణుడు (స భ్రాతుః శాసనం శ్రుత్వా సర్వమప్రతికూలయన్,/ ఆరోప్య మైథిలీం పూర్వమారురోహాత్మవాం స్తతః- అయోధ్యకాండ 53వ సర్గ)-  ‘నిత్యం వదిన గారి పాదాలకు నమస్కరిస్తాను కాబట్టి అందెలు తెలుస్తాయి గానీ, చెవుల కమ్మలు, దండ కడియాలు గుర్తుపట్టలేను (నాహం జానామి కేయూరే జానామి కున్డలే/ నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివన్దనాత్- కిష్కింధ కాండ- 6 వ సర్గ)’ అంటాడు. అది అసందర్భ ప్రేలాపన మాత్రమే కాదు, అక్కడ అతికినట్టు ఉండట్లేదని, , ‘వదినని తల్లిలా చూడటం’ అనే ‘ఆదర్శా’న్ని కృతకంగా రుద్దే ప్రయత్నమని తెలిసిపోతుంది కాబట్టే అది అవాల్మీకమని తేల్చేశారు.

అయితే, గుచ్చి గుచ్చి ప్రశ్నించే ప్రత్యామ్నాయ సాంస్కృతిక యోధుల, సందేహ శూలాపాణుల అతి నైతికత ముందు ప్రక్షిప్తాలు చేర్చిన అజ్ఞాత రచయితల నైష్ఠికత చాలా అల్పమనిపిస్తుంటుంది. “అగస్త్యునికి, వశిశ్టునికీ తల్లి ఊర్వశి కాగా, తండ్రులు మిత్రవరుణులు. ఈ జాయింట్ తండ్రులు ఊర్వశి ద్వారా తమ సుపుత్రోద్వయాన్ని లోకోద్ధరణకై ఏ తీరున ప్రసాదించారో ఆ కథ అసహజమైనదే కాదు, అశ్లీలమైనది కూడా…” అని ‘సీతజోస్యం’ పీఠికలో ఎద్దేవ చేస్తారు నార్ల. ఎంతటి అల్పదృష్టి, ఎంత ఫక్తు నైతికత అనిపిస్తుంది నాకైతే? Incest సంబంధాలు లేకుండా మానవజాతి ఉనికే లేదు. పాతరాతి యుగాల నుంచి, తామ్ర యుగాల మీదుగా నాగరీకమౌతున్న ప్రయాణంలో రాజ్య విస్తరణకి అడ్డు అవుతున్న రక్తసంబంధీకుల మధ్య సంబంధాలు కట్టడి చేసిన సామాజిక రాజకీయ వ్యూహం, మరికొన్ని యుగాలకి నైతిక సమస్యగా ఉద్వేగ సంబంధి అయ్యింది. ఏ కొత్త రాతియుగంలోనో, ఐరన్ ఏజ్ గా పిలిచే మధ్య సంధి యుగంలోనో సహజమైన incest  సంబంధాన్ని గురించి అతి జుగుప్సాకరమని, అమానవీయమనీ వ్యాఖ్యానించడం, వాళ్లు ‘మాదర్చోదుల’ని, ‘బెహెన్చోదుల’నీ నిందించడం ఎంత అల్పత్వం? అదే రంధ్రాన్వేషకులు, దురాక్షేపకులు రెండునాల్కలతో మరో పక్క వేదకాలంలో గోభక్షణ చేయలేదా, రాముడు ఉడికించిన ఉడుము మాసం, తాలింపులేని తాబేలు కూర తినలేదా అని వేదాల్ని, పురాణాల్ని, రామాయణాల్నీ సాక్షాలుగా తెస్తారు. యుగము, కాలము తెచ్చిన దృష్టిభేదం వల్ల లైంగికతలో వచ్చిన మార్పులు గుర్తించగలిగిన కన్ను, అన్నపానాదుల్లో కూడా జరిగిన అటువంటి సర్దుబాటుని ఎందుకు కనలేకపోతుంది?  సీతకి రాముడు బదరీఫలం తినిపించాడనో, ఆవకాయతో పెరుగన్నం పెట్టాడనో ఒక తెలుగు కవి తనదైన రామాయణం రాస్తే, అది మూలానికి దూరంగా ఉందనీ, రాముడు తినిపించింది కుందేలు మాంసం ముక్కలంటూ వాల్మీకి రామాయణమే ప్రధాన సాక్షిగా సత్య నిరూపణ చేయడానికి అమితోత్సాహ ప్రదర్శన ఎందుకు? అసలు వాల్మీకి పరమప్రమాణం ఎందుకు అవ్వాలి? దాన్నొక అక్షర సత్యంగా ఎందుకు తీసుకోవాలి?

వాస్తవం (fact) – కల్పన (fiction) ని కలిపి Faction అనే కొత్త genre కి ఆధునిక సాహిత్యంలో Norman Mailer,  Truman Capote  మొట్టమొదటి వారని చెబుతుంటారు. కానీ, అదే genre లో రామాయణ భారత ఇతిహాసాలు రచించడమే కాకుండా అందులో తాము కూడా పాత్రలైన వాల్మీకీ వ్యాసుల కంటే ఆ ప్రక్రియలో ఆద్యులెవరు? ఆ ప్రకారం చూస్తే, వాల్మీకి మహాకవి ఓ బోయవాడు. తన కాలంలో జరిగిన కథకి కల్పనని జోడించే క్రమంలో ఆ వాస్తవ గాథలో నవనాగరీక నాయకానాయికల మధ్య ఏకాంతంలో నంగిరి నాజూకుతనం నచ్చక తనకి నిసర్గ రమణీయం అనిపించిన పరికల్పన చేసి ఉండొచ్చు. “చమ్పకాశోకపుంనాగ మధూకపనసాసనైః…” శోభితమైన అశోకవాటికలో విహారానికి వెళ్లినప్పుడు సీతకి రాముడు పనస తొనలు తినిపించడం, ఉసిరికాయ (అసన)కి కాస్తంత రాతి ఉప్పుగల్లు జోడించి కొరికించడం చేశాడనుకుందాం. వాల్మీకి ప్రమాణాల ప్రకారం ఆ ప్రేమ ప్రకటన చాలదనిపించి, తనకి నచ్చిన మాంసం, మైరేయక మద్యం సన్నివేశంలో కల్పించాడనుకోవచ్చు కూడా.

కొంగ- కలహంస మధ్య సంభాషణగా చెప్పబడే ఓ చాటువు అందరికీ తెలిసిందే. తను విహరించే మానససరోవరం విశేషాలు చెబుతూ ‘మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు-‘ అంటుంది హంస. ‘మరి నత్తలో…’ అని అడుగుతాయి కొంగలు. ఇందులో తక్కువ జాతి ఆహారపు అలవాట్లని కించపరిచే ఉద్దేశమే ఉందన్న విషయం పక్కన పెడదాం. సీతారాములనే రెండు హంసలు మానససరోవరంలో బంగారు తామరల మధ్య విహరిస్తూ,  ముత్యాలు ఆరగిస్తున్న దృశ్యాన్ని కొంగ రచిస్తే, వారి చేత తనకి ఎంతో గొప్పవైన నత్తల్ని తినిపిస్తుందని ఊహించవచ్చు కదా. కాబట్టి, మంచో, చెడో- వాల్మీకిని కూడా సత్యప్రమాణకంగా తీసుకోకూడదు.

వాల్మీకి రామాయణంలో ‘లక్షణరేఖ’ ఊసేలేదు. కానీ, దాన్ని ఒక నుడిగా, నానుడిగా జాతి దాన్ని చెరపలేనంతగా సొంతం చేసుకుంది. అంటే రామాయణం వాల్మీకిని దాటి వెళ్లిపోయింది, వాల్మీకిని మించి, అధిగమించి ఏకశిలాసదృశం కాని ఇంకా విశాలమైన ఐహిక సత్యం  వైపు పయనించింది.

“ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః

విద్వాన్ కః కస్సమర్థశ్చక శ్చైక ప్రియదర్శనః

ఆత్మవాన్ కో జిత్రకోధో ద్యుతిమాన్ కో నసూయకః

కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే”

– అటువంటి రాముడి కథ రచించడం వాల్మీకి మహాకవి ఉద్దేశం. అటువంటి సకల గుణాభిరాముడు, వీర్యవంతుడు, సర్వభూతహితుడు,  జితక్రోధుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, విద్వాంసుడు, సమర్థుడు అయిన ఒక రాజుని చూసి, లేదా ఒక తండా నాయకుడ్ని చూసి, ఆయన జీవితం ఆధారంగా ఒక కావ్యం రాయడం ఆయన లక్ష్యం. కానీ, కావ్యరచనలో ఆ ఆదికవి విస్తృతి వల్లనో, పరిమితి కారణంగానో తన కథానాయకుడిలో వెలుగునీడల్ని, మంచిచెడుల్ని, కారుణ్య కాఠిన్యాలనీ, శూరభీరుత్వాల వంటి అనేకానేక ద్వంద్వాల్ని కూడా దాచలేదు. ఆ విధంగా చూస్తే, శిల్పవిన్యాస పరంగా వాల్మీకి మహాకవిది ఉత్తమోత్తర రచనా సంవిధానమే.

అయితే, ఒక కావ్యం ఏ విధంగా అయితే ఏకశిలాసదృశం కాదో, కథానాయకుడి మూర్తిమత్వం (ఏ పాత్ర స్వభావమైనా సరే) ఒకేలా మాత్రమే అర్థం కావాల్సిన అవసరం లేదు. యుద్ధానంతరం రాముడి సమక్షానికి సీత రప్పించబడుతుంది. ఆమెతో పరుషంగా మాట్లాడతాడు, అగ్నిప్రవేశం చేయిస్తాడు రాముడు. స్థూలంగా సన్నివేశం అంతే. దాన్ని చూసే దృష్టిలోనే ఎంతో భిన్నత్వం!

సీతమ్మ వచ్చిందని వినగానే, ‘హర్షో దైన్యం చ రోషశ్చ త్రయం రాఘవమావిశత్….’ అంటాడు వాల్మీకి. హర్షము, దైన్యము, రోషమూ ముప్పిరిగొంటాయి శ్రీరాముడ్ని. కానీ, ఆమెతో పరుషంగా మాట్లాడతాడు, అగ్నిప్రవేశం చేయిస్తాడు. అన్నాళ్ల ఎడబాటు వల్ల దిగులు, అతిశయించిన ప్రేమ వల్ల సంతోషం, యుద్ధం అంతమైనా, ఆరని మంటల ఆగ్రహం- అన్నీ ఒక్క పెట్టున ముట్టడి చేసి, అతని అస్తిత్వాన్ని పట్టి కుదిపేసిన సన్నివేశం అందరికీ ఒకేలా ఎలా బోధపడుతుంది. ఒక మంచి రచనని between the lines  చదవడం వల్ల ఎన్ని వైవిధ్యాలు కళ్లకి  కనబడతాయో, ఒక పాత్ర స్వభావాన్ని పైపైన కనబడే పొరల అడుగున, ఉపరితలాల దిగువన చూడగలిగితే అంతకన్ని కోణాలు మనసుకి తెరుచుకుంటాయి.

అటువంటి దర్శనానికి, ఆవిష్కారానికీ మౌలికంగా కావల్సింది- ‘తెలుసుకోకుండానే అర్థం చేసుకోవడం, అర్థం కాకమునుపే ఆరాధించడం’.

అయితే, అటువంటి స్థితిని అందుకోవడం అందరికీ సాధ్యం కాదు. కొందరికి అక్కర్లేదు కూడా. రామాయణాన్ని మానవ వికాస పరిణామ శాస్త్రపు కళ్లద్దాలతో చూసిన నార్ల వంటి వారు- ఆహారాన్ని సేకరించుకొని కాలం గడిపే మూలవాసులకీ, ఆహారాన్ని ఉత్పత్తి చేసే నాగరీక వర్గానికీ మధ్య సంఘర్షణగానే రామాయణాన్ని అర్థం చేసుకున్నారు. ఫలసేకరణ కోసం మూలవాసులకి అడవి ఉండాలి;  రాముడు కొమ్ముగాస్తున్న నాగరీకుల వ్యవసాయానికి అనువుగా అడవులు తెగనరికి, లేదా కాల్చి బూడిద చేసి చదును చేయాలి – యజ్ఞ యాగాదుల తంతు దాన్ని ఉద్దేశించిందే. ఆ యాగం భగ్నం చేయకపోతే మూలవాసులకి ఉనికి లేదు.

– ఈ ధోరణిలో రామాయణాన్ని చదువుతున్న వర్గాన్ని- తెలుసుకోకుండానే అర్థం చేసుకోండి, అర్థం కాకమునుపే ఆరాధించండి- అనడం హాస్యాస్పదం.

వర్గ దృక్పథం ఉన్నవాళ్లని, వర్ణవివక్షని ఎదిరించే వాళ్లనీ ఎక్కడో బైట ఉదాహరణలు ఇవ్వడం ఎందుకు, నా వైపు నుంచి చూసినా రామాయణాన్ని తెలుసుకోకుండా అర్థం చేసుకునే, అర్థం కాకముందే ఆరాధించే అనుభవాత్మక స్థితిని చేరుకోలేదు, చేరుకోలేను. సాహిత్యాన్ని, ప్రపంచాన్నీ (నాదైన) స్త్రీ పరంగా చూసే నేను, తాటకి (తారక) ని చంపాడని, శూర్పణక మోహాన్ని తోసిపుచ్చాడని, చంద్రసేన ప్రేమని నిరాకరించాడని, చివరికి సీతని కూడా ప్రేమించనే లేదనే నిశ్చితాభిప్రాయాల వల్ల – అర్థం చేసుకోకుండానే ఆరాధించే తలంలోకి నేను చేరుకోలేకపోయాను.

అయితే, శ్రీరాముడి మీద నాకు ఎప్పుడూ భక్తి లేదుగానీ, రామభక్తి మీద భక్తి మాత్రం అమితం. ‘పలికెడిది భాగవతమట… పలికించెడివాడు రామభద్రుండట…’ అని కవి (పోతన) చేత కావ్యాలు రాయించిన రామభక్తి. ‘దినమొక ఏడుగా ఘనమున గడెపెద / తనయుని మీద దయలేదయ్యయ్యో…..’ అంటూ దినదినగండంగా చిత్రహింసలు పడుతూ, కఠినమైన జైలు జీవితాన్ని పన్నెండేళ్ల పాటు పడిన దుర్భర పరిస్థితుల్లో కూడా- “కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ/ కమ్మన నీ నామ మేమి రుచిరా// నవరసములకన్న నవనీతములకంటె / అధికమౌ నీ నామ మేమి రుచిరా – ఓ రామ నీ నామ మెంతో రుచిరా…” అని వాగ్గేయకారుడి (భక్త రామదాసు) నోట పలికించిన రామభక్తి. ఆ రామభక్తి అంటే నాకు హద్దులెరగని ప్రేమ.

రామకథ నేనూ చదివాను, ఒకటి కాదు, అనేకం చదివాను. మరి- ‘రామకథాసుధారస పానమొక రాజ్యము చేసునే’ (త్యాగయ్య)- అని పులకిత గానం చేసి, యావజ్జీవితాన్నంతా అదే తన్మయత్వంలో బ్రతికేసే మహదానందాన్ని అందించిన  రామకథ నాకెందుకు తారసపడలేదు? ‘ధర్మాద్యఖిలఫలితమే మనసా/ ధైర్యానంద సౌఖ్య నికేతనమే/ కర్మబంధ జ్వలనాబ్ధినామమే/ కలిహరమే త్యాగరాజవినుతుఁడగు…’ రామకథ ఆ మహా వాగ్గేయకారుడికి ఎలా దొరికింది? విషయాసక్తిని, భోగభాగ్యాల్ని, రాజప్రాపకాల్ని, నిధినిక్షేపాల్నీ కాలి ధూళితో సమానం చేసిన దిషణాహంకారం, ‘రాముని సన్నిధి సేవ…’ ముందు ఏవీ కొరగావని చెప్పగలిగిన అతీత మానుషత్వాన్ని త్యాగరాజ స్వామి వారు పొందేలా చేసిన రామకథ ఎక్కడ దొరికింది?

అవి నన్ను దశాబ్దాల తరబడి వేధించిన ప్రశ్నలు.

కానీ, ఎప్పుడైతే నా నెచ్చెలి, నా తెనాలి తేజోవిరాజ – తెలుసుకోవడానికి కళ్లు మూసేసి, అర్థం చేసుకోడానికి బుద్ధి మళ్లించేసి, ఆరాధనకి ఆత్మానుభవాన్ని తెరవాల్సిన అవసరం గురించి చెప్పిందో, అప్పుడు ఏళ్లకేళ్లు వెంటాడిన ప్రశ్నలన్నీ పటాపంచలయ్యాయి.

“…. అన్ని నీవనుచు అంతరంగమున…. తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్య”(త్యాగయ్య)!

– పీటముడి విడిపోయింది. రాముడి గురించి తెలుసుకోవడానికి వాల్మీకి రామాయణం నుంచి మొదలెట్టి అనేకానేక రామాయణ రచనల్లోకి దూరి కాదు వెదకవల్సింది, ‘అంతరంగమున తిన్నగా వెదకాలి’. అలా వెదికితే తెలిసే ‘తెలియడం’- సాధారణార్థంలో ‘తెలియడం’ కాదు; అర్థం చేయించడం కూడా అవసరంలేని ‘తెలియడం’, ‘అన్ని నీవనుచూ… ‘ అద్వైత ఆరాధనలో కలిసి, కరిగించే ‘తెలియడం’!

ఆ తెలియడం గురించి, అది చేయించే అర్థం గురించి, అది కలిగించే ఆరాధన గురించి కేవలం తెలిసినంత మాత్రాన ఆ స్థితిని అందుకోలేమనడానికి నేనే ఉదాహరణ. బహుశా రామకతల కంటే, సొంత ప్రేమవెతల మీద దృష్టి లగ్నం అయ్యుండటం వల్ల కావొచ్చునా? అది తేల్చుకోవడానికి రకరకాల రాముళ్లని తెలుసుకునే పనిలో పడ్డాను.

దిజ్ఞాగుడి నాటకం – ‘కున్దమాలా’ ద్వితీయాంకంలో చెలికత్తె వేదవతి- సీత మధ్య సంభాషణ ఇది:

వేదవతీ: (ఆత్మగతమ్) అతిమాత్రం సన్తపతి ఏషా వరాకీ। రామసదేశస్స(?) సఙ్కీర్తనేన వినిధారయిష్యామి । (ప్రకాశమ్) అయి అపణ్డితే ! తథా నిరపేక్షస్య నిరనుక్రోశస్య కృతే కీదృక్ త్వమసితపక్షచన్ద్రలేఖేవ దినే దినే పరిహీయసే

సీత:                        కథం స నిరనుక్రోశః?

వేద:                        యేన పరిత్యక్తాసి

సీత:                        కిమహం పరిత్యక్తా?

వేద:                        (విహస్య వేణీం పరిమార్జ యతి) ఏవం లోకో భణతి సత్యం పరిత్యక్తా

సీత:                        అథ శరీరేణ న పునర్హృదయేన

వేద:                        కథం పరకీయం హృదయం జానాసి?

సీత:                        కథం తస్య హృదయం సీతాయాః పరకీయం భవిష్యతి?

నీమీద ఆపేక్షగాని, దయగాని లేని వాడికోసం నువ్వెందుకు కృష్ణపక్ష చంద్రరేఖలాగా రోజురోజుకీ చిక్కిపోతున్నావు? అంటుంది వేదవతి సీతతో.

సీత: అతడు నిరనుక్రోశు డెట్లగును?

వేద: నిన్ను పరిత్యజించుటచే.

సీత: నేను పరిత్యక్తనా?

వేద: నీవు నిజముగా పరిత్యక్తవే యని జనులు చెప్పుచున్నారు.

సీత: ఐనను శరీరముచే గాని హృదయముచే గాదు.

వేద: పరకీయమగు హృదయము నీకెట్లు తెలియును?

సీత: అతని హృదయము నాకు పరకీయమెట్లగును?

(బులుసు వేంకటేశ్వర్లు గారి అనువాదం)

సీతకి రాముడు ఏమిటో సరే, నిరనుక్రోశుడిగా లోకంతో పాటు, నాకు కూడా అనిపించిన రాముడికి సీత ఏమిటి? దిజ్ఞాగుడు ఏమైనా చెప్పాడా?

బాల్యమిత్రుడైన కౌశికుడితో శ్రీరాముడి సంభాషణ

రామః: వయస్య, అస్త్యేతత్ స్మరామ్యహమవిచ్ఛేదేన వైదేహీమ్

విదూషకః: కిం దోసదో ఆదు గుణదో? కిం దోషత ఉత గుణతః?

రామః:    న దోషతోనాపి గుణతః

విదూషకః: ఏదం ఉభయం ఉజ్ఝిఅకహం సీమన్తిణీఓ సుమరీఅంతి?

ఏతదుభయముజ్ఝిత్వా కథం సీమన్తిన్యః స్మర్యన్తే?

రామః: అన్యదమ్పతీవిషయ ఏవ కారణానురోధీ ప్రేమావేశః, సీతారామయోస్తు న తథా ।

 

అదంతా సీత గురించి రాముడు, కౌశికుడి మధ్య సంభాషణ-

రాముడు: మిత్రమా, నిరంతరంగా సీతను తలచుకుంటున్నాను.

కౌశికుడు: ఏం తలుచుకుంటున్నావు? ఆమె దోషాలనా? లేక గుణాలనా?

రాముడు: గుణదోషాలను రెండింటీనీ కాదు.

కౌశికుడు: అవి రెండూ కాక, సీతగురించి ఏమని తలుచుకుంటున్నావు?

రాముడు: అన్యదంపతులు కారణాలుంటేనే తలుచుకుంటారు. సీతారాములు అలా కాదు.

అని చెప్పి, ఇలా అంటాడు రాముడు-

“దుఃఖే సుఖేష్వప్యపరిచ్ఛదత్వా-

దసూచ్యమాసీచ్చిరమాత్మనీవ

తస్యాం స్థితో దోషగుణానపేక్షో

నిర్వ్యాజసిద్ధో మమ భావబన్ధః”

‘సుఖంలో దుఃఖంలో సువ్యక్తమై చెప్పనక్కరలేనిదై సీత నా ఆత్మలో ఉంది. దోషానికి గాని గుణానికి గానీ సంబంధములేని కారణరహితమైన, అంటే కారణాతీతమైన ఒక భావబంధం నాకు ఆమె పట్ల ఉంది..’ అంటాడు శ్రీరాముడు.

(‘దిఙ్నాగాచార్యప్రణీతా – కున్దమాలా’ కు విరిపుత్తూరి శ్రీనివాసా చారి గారి తెలుగు అనువాదం)

సీతారాముల్ని దిఙ్నాగాచార్యుడు అర్థం చేసుకున్న తీరుకి పులకించిపోయాను (‘కున్దమాలా’ ప్రస్తావన, దాని మీద కవిసమ్రాట్ విశ్వనాథ వారి పీఠిక గురించి మైథిలి అబ్బరాజు గారి ద్వారా మొదటిసారి తెలిసింది).

‘నైవమధ్యవసితం-ఏకాన్తే సీతానిరపేక్షో రామ ఇతి’ (రాముడు సీతపట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని అనుకోవద్దు); ‘అన్తరితా అనురాగా భావా మమ కర్కశస్య బాహ్యేన / తన్తవ ఇవ సుకుమారాః ప్రచ్ఛన్నాః పద్మనాలస్య’ (పైకి కఠినంగా కనిపించే నాలోని మృదుభావాలు తామరతూడులోని నాళాల వలె లోపలే దాగి ఉన్నాయి) అంటాడు దిఙ్నాగుడి రాముడు. గోమతి నదీతీరంలో తాకిన పిల్లతెమ్మెర కలిగించే విడుదల భావంలోంచి నిర్ధారణకి వస్తాడు రాముడు, తన సీత ఆ పరిసరాల్లోనే ఉందని (కున్దమాలా). ఇసుక మీద పాదముద్రలు చూసి కచ్చితంగా అవి సీతవే అని చెబుతాడు లక్ష్మణుడికి. గర్భవతి సీతని అడవికి పంపించ వలసి వచ్చినప్పుడు, ఆమె పాదాల దగ్గర కూలబడి కన్నీరు కార్చిన భవభూతి (ఉత్తర రామ చరిత్ర) రాముడి కంటే మరింత ప్రేమమూర్తి దిఙ్నాగుడి రాముడు.

అటువంటి రాముడ్ని ఎక్కడ దొరకబుచ్చుకున్నాడు దిఙ్నాగుడు?

“భగవతి భాగీరథి!యద్యహం సుఖేన/ గర్భమభినిర్వర్తయామి తదా తవ దినే దినే సుష్ఠు గ్రథితయా/ కున్దమాలయోపహారం కరిష్యామి (సుఖప్రసవమైతే ప్రతిరోజూ నీకు చక్కగా అల్లిన కుంద(మల్లెపూ)మాలను సమర్పించుకుంటాను) అని గంగానదికి మొక్కుకుంటుంది (దిఙ్నాగుడి) సీత.

“సురాఘటసహస్రేణ మాంసభూతోదనేన చ/ యక్ష్యే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగతా (వనవాసం ముగించుకొని తిరిగి వచ్చాక, నీకు వెయ్యు కుండల కల్లు, మాంసాహారం సమర్పించి పూజిస్తాను..)” అని గంగానదికి మొక్కుకుంటుంది (వాల్మీకి) సీత.

కాబట్టి దిఙ్నాగుడి సీతారాములు- వాల్మీకి సీతారాములు కారు. సామాజిక అధ్యయనవేత్తలు దిఙ్నాగుడి సీతారాముల్ని సంస్కృతీకరించబడ్డ, బ్రాహ్మణ్యం బారినబడ్డవారుగా వ్యాఖ్యానించడం సహజమే గానీ, సత్యం కాదు. ఇతిహాసానికి మించిన, అవగాహనలకి ఆవల, జ్ఞానవివేకాలకి అతీతమైన మార్గాన తిన్నగా వెదకి పట్టుకున్నాడు దిఙ్నాగుడు తన రాముడ్ని.

ఆ దిఙ్నాగుడు discover చేసిన సీతారాముల విరహ పరితాపాన్ని భవభూతి సీతారాముల అద్వైత సమాగమ ఆదర్శంతో అందమైన ముడి వేస్తూ అన్నమయ్య కల్పించాడొక కీర్తన. సందర్భాన్ని ఉత్తరకాండ నుంచి, సుందరకాండకి తరలించి, పరికల్పించిన ఆ కీర్తన – రామాంజనేయుల మధ్య సంభాషణలా సాగుతుంది:

అపుడేమనె నేమను మనెను

తపమే విరహపుఁ దాపమనె

 

పవనజ యేమనె పడఁతి మఱేమనె

అవనిజ నిను నేమను మనెను

రవికులేంద్ర భారము ప్రాణంబనై

ఇవల నెట్ల దరియించే ననె

 

యింకా నేమనె యింతి మఱేమనె

కొంకక యేమని కొసరుమనె

బొంకులదేహము పోదిది వేగనె

చింకవేఁట యిటు చేసె ననె

 

నను నేమనె ప్రాణము మన కొకటనె

తనకు నీవలెనె తాపమనె

మనుకులేశ ప్రేమపుమనకూటమి

ఘనవేంకటగిరిఁ గంటి ననె

(https://share.getcloudapp.com/Blu4GPWe)

హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని (చూసిరమ్మంటే కాల్చి) వస్తాడు రాముడు దగ్గరకి. ఆమె తన ఆనవాలుగా ఇచ్చిన చూడామణిని చూసి నిలువెల్లా నీరైపోయిన రాముడు- హనుమంతుడ్ని అడుగుతున్నాడు: ‘అపుడేమనె నేమను మనెను…’

హనుమంతుడు బుదులిస్తాడు: తపమే విరహపుఁదాపమనె (రాముడికి దూరమైన వియోగ విలాపమే ఆమె తపస్సు)

ఇంకా ఏమని అన్నది? “ప్రాణము మనకొకటనె – తనకు నీ వలెనె తాపమనె…” – అదే కదా – ‘అద్వైతం సుఖదు:ఖయో రనుగతం/ సర్వస్వవస్థాసు యత్ / విశ్రామోహృదయస్య యత్ర జరసా మన్మిన్నహార్యో రస:’- అని భవభూతి సీతారాముల ద్వారా కనుగొంది!

ఇతిహాసానికి మించిన, అవగాహనలకి ఆవల, జ్ఞానవివేకాలకి అతీతమైన మార్గాన యుగాలుగా జరిగిన రామాన్వేషణలో అన్నమయ్యకి దొరికిన రాముడ్ని, అన్నమయ్య నా కంటి ముందు నిలిపిన ప్రేమార్తుడైన… బేలహృదయుడైన… దుఃఖ్ఖోపహతుడైన… ఆర్ద్రకారుణ్య ఆత్మారాముడిని తలుచుకొని ఇక నా వ్యాసాన్ని ముగిస్తాను.

మారీచుడ్ని చంపిన తర్వాత తమ్ముడు లక్ష్మణుడితో తిరిగి పంచవటిలో తమ పర్ణశాలకి వచ్చాక సీత కనబడదు. అరణ్యకాండ 58 వ సర్గ నుంచి, 63 వ సర్గ వరకూ రాముడు విలాపమే (వాల్మీకి రామాయణం). అన్ని శ్లోకాలుగా విస్తరించిన శోకాన్ని మించినదేదో చూడగలిగాడు అన్నమయ్య. ఆ సీతాన్వేషణలో రామలక్ష్మణుల మధ్య జరిగినట్టుగా ఓ సంభాషణని ఊహిస్తాడిలా:

కానకుంటి మిందాఁకా కంటి మాడకుఁ బోదము
కానీలే అందుకేమి కళవళ మేలయ్యా

 

తొంగి చూచె నదె సీత తూరుపునఁ దమ్ముఁడా

సంగతిఁ జందురుఁ డింతె సతి గాదయ్యా

చెంగట నే వెదకఁగా జేరి నవ్వీఁ జూడరాదా

రంగగు వెన్నెల లింతే రామచంద్ర చూడుమా ॥కాన॥

 

పొంచి చేతఁ బిలిచీని పొద దండ నదె సీత

అంచెలఁ దీగె ఇంతే అటుగాదయ్యా

యెంచనేల దవ్వులను యెలిఁగించీ వినరాదా

పెంచవు నెమలి గాని పిలుపు గాదయ్యా      ॥కాన॥

 

నిలుచుండి చూచె నదె నిండుఁగొలఁకులో సీత

కలువ లింతే ఆపెగాదయ్యా

కలికి శ్రీవేంకటాద్రిఁ గాఁగిలించె నిదె నన్ను

తలఁపులో నాకె నిన్నుఁ దగిలుండునయ్యా    ॥కాన॥

(https://share.getcloudapp.com/QwuEnJdX)

రాముడు: ఇప్పటిదాకా కనిపించని సీత అదిగో కనిపిస్తోదక్కడ, వెళ్దాం పద.

లక్ష్మణుడు: అలాగే, నువ్వలా కలవరపడకు.

 

రాముడు: తమ్ముడూ, తూర్పు నుంచి అదిగో సీత తొంగి చూస్తోంది.

లక్ష్మణుడు: విషయం ఏమిటంటే, అది చంద్రుడు, నీ భార్య కాదు.

రాముడు: తను ఇంత చేరువలో ఉంటే ఇలా వెదుకుతున్నానై నవ్వుతోంది.

లక్ష్మణుడు: అది వెన్నెల, ఆమె నవ్వు కాదు.

 

రాముడు: అక్కడ పొద మాటున పొంచి పిలుస్తోంది నా సీత.

లక్ష్మణుడు: అంచెలంచెలుగా అల్లుకున్న తీగ అల్లల్లాడుతోదంతే.

రాముడు: ఎక్కడో దూరం నుంచి ఎలుగెత్తి పిలుస్తోంది నన్ను.

లక్ష్మణుడు: అది నెమలి అరుపు, ఆమె పిలుపు కాదు.

 

రాముడు: ఆ నిండుకొలను చెంత నిల్చొని నా సీత పిలుస్తోంది నన్ను.

లక్ష్మణుడు: అవి కలువలు, ఆమే కాదు.

రాముడు: ఇదిగో ఈ వేంకటాద్రి మీద నా సీత నన్ను కావలించింది.

లక్ష్మణుడు: తలపులో ఆమె నిన్ను తగిలి ఉండొచ్చునయ్యా.

చేతి స్పర్శ చేత తన సీతను గుర్తిస్తాడు భవభూతి రాముడు; సీత నుంచి వచ్చే పిల్ల తెమ్మెర తాకి ఆమెని పోల్చుకుంటాడు దిఙ్నాగుడి రాముడు. తలపులో తాకిన స్పర్శలో సీతని భావిస్తాడు అన్నమయ్య రాముడు!

**       **

చిన్నప్పుడే అంటిన Rational తుప్పు ఎంత విదుల్చుకున్నానని విర్రవీగినా, తెలియకుండానే అర్థం చేసుకోవడం, అర్థంకాకున్నా ఆరాధించడమనే మహదానుభవాన్ని గురించి విన్నానా, ఆమె సావాసానికి ముందు!

విన్న తర్వాత, విన్నదాన్ని కనాలని వెదకడం మొదలెట్టాను.

రాముడా? దేవుడా? భక్తా? ప్రేమా? ఆమె?

నీ గురి ఏదో, నీ సాధన దేనికో దాన్ని – తెలియకుండానే అర్థం చేసుకోవాలి, అర్థంకానవసరం లేకుండానే ఆరాధించాలి. అంతరంగమున… తిన్నగా వెదికి తెలుసుకోవాలి!

**       **

 

నరేష్ నున్నా

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గొప్ప అనుభూతిని అందించిన ఆత్మాలాపన.ఒక విషయం మీద తనకు తెలిసిన మార్గాల గుండా పలు రకాలుగా విశ్లేషించుకుని వివేచించుకుని రాసిన ‘రామానందం’.రాముడితో రామను,రామతో రాముడిని పట్టుకునే ద్రష్టాయితం.
    పలుచోట్ల ప్రసితావించబడ్డ అర్థమయినట్టు అనిపించి అర్థం కాని వాక్యం ‘ – ‘తెలుసుకోకుండానే అర్థం చేసుకోవడం, అర్థం కాకమునుపే ఆరాధించడం’’
    పడవ నడిపేవాడి చేతిలో తెడ్డులా తోయటం బావుంది.వాల్మీకం,దిజ్ఞాగము,భవభూతీయము
    సీతరాముల నడుమ గల మనస్యైకత పోల్చటం నున్నాగారి మేథామథనానికి పరాకాష్ట.తెనాలి మానిని
    వలన తెలివిడి గొనడం చివరికి తేలుతుంది.అప్పటికి గానీ అంతరంగం అంతో ఇంతో అంతు చిక్కదు.ఒక్కటి అనిపిస్తుంది చదవటం వేరు అన్వయించుకోవటం వేరు.
    సందర్భం వచ్చినపుడు వాగ్గేయకారులను సైతం లాక్కొని రావటం నున్నా గారికి ఒక ఇష్ట కార్యం.నా కేమర్థమయిందో నాకే తెలియకపోయినా ఏదో మాత్రం అనిపించింది.ఎందుకంటే నేను అమూర్త రామ ప్రియుణ్ని గనుక .రాసిన వారికి వేసిన వారికి అభినందనలు.

    • అమూర్త రామ ప్రియులైన వాధూలస గారూ…
      ధన్యవాదాలు.

  • ఇదీ అని చెప్పలేని పోలికలకందని ప్రేమ భావన మనసంతా కమ్ముకున్నట్టైంది.

    గుణదోషాల కతీతంగా ఆమెను తల్చుకుని పరవశించే రాముడు..( అది కుందమాల తెలిసిన రోజే నన్ను లోబరచుకున్న సంభాషణ) ఆమె మాటలు పట్టుకుని తిన్నగా అంతరంగమున వెదుక్కున్న మీరూ..

    పేర్కొన్న ప్రతీ శ్లోకం, ప్రతీ కీర్తన ఒక్కో రసగుళిక.

    ..తూరుపు వాకిట వెలిగిన సౌందర్యంలో..ఆ వెన్నెల తీవెల్లో అల్లుకున్న పొదల్లో వీచే గాలుల్లో లోపలా బయటా అంతా ఆమెనే వెరుక్కుని తపించి తపించి  సీతా సీతా అని తిరిగిన ఈ రాముణ్ణా ప్రేమికుడు కాదందీ..!!

    హృదయపు ఆకలిని తీర్చిన అమృతపు బిందువుల్లాంటి అక్షరాలకు..నరేశ్ గారూ..నమశ్శతాని..!!

    • ప్రియమైన మానస!
      మీ వంటి రసజ్ఞకి హృదయపు ఆకలిదప్పులు తీరేవి కావు గానీ, నా యీ రాత ఆ మేరకు కొంత ప్రయత్నం చేయగలిగినందుకు సంతోషంగా ఉంది.

  • మళ్లీ చదివాను….ఎన్ని ప్రశ్నలు, ఎంత తపన.

    ఈ రాత, ఏళ్లుగా మీరు రాముడితో సాగిస్తోన్న సంభాషణ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు