అనేక పూవుల అలరింపు మిలన్‌!

తెలుగు సాహిత్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భిన్నాభిప్రాయాలున్న ముస్లిం రచయితలంతా ఒక చోట కలిశారు. మాట్లాడుకున్నారు. అదే మిలన్ సాధించిన విజయం!

క పువ్వు గుబాళిస్తేనే ఆనంద పారవశ్యం పొందుతాం.. అనేక పువ్వులు కలిసి అలరిస్తే.. దర్గాలో పూల చాదర్‌లపై సిజ్దా చేసినపుడు పొందే తన్మయం గుండెల నిండా!

మూడు దశాబ్దాల ముస్లిం కథా సాహిత్యంలో ముస్లిం రచయితలు ప్రత్యేకంగా ఒకచోట కూడి ముచ్చట పెట్టుకోవడం తొలిసారి! ఎన్నో సభలు, సదస్సులు జరిగినా ప్రత్యేకంగా ముస్లిం కథా రచయితలే కలవడం ఇదే మొదలు! నేడున్న పరిస్థితుల్లో ముస్లిం రచయితలు కావడమే ఒక గొప్ప విషయం. ఖాదర్‌ మొహియుద్దీన్‌, ఖాన్‌ యజ్దాని (డాని), పి.షహనాజ్‌, దాదాహయాత్‌, ఖాజా లాంటి వాళ్లను స్వయంగా చూడని, కలవని రచయితలు పహ్ లీబార్‌ కలిసి అబ్బురపడ్డారు. అలాగే రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన తర్వాతి తరం రచయితలు ఒకరికొకరు పరిచయం కావడాన్ని ఎంతో సంతోషంగా ఫీలయ్యారు. తమకు ఇష్టమైనవాళ్లతో ఫోటోలు దిగి భద్రపరుచుకున్నారు. మూడు గ్రూప్‌ ఫోటోల్లో తమను తాము ఖుషీగా చూసుకున్నారు. వాళ్ల ఆనందాన్ని మురిపెంగా చూస్తుండిపోయాం నిర్వాహకులం.

1989లో మొదలై ఇప్పటికీ సుమారుగా 250 తెలుగు ముస్లిం కథలు వెలువడడం పెద్ద విశేషం. 100 మంది దాకా ముస్లింలు తెలుగులో కథలు రాయడం మరింత విశేషం. వీళ్లలోంచి ఒక 25 మంది పెద్దలు, ప్రముఖులు, భవిష్యత్‌ కథను వాగ్దానం చేస్తున్నవారు హైదరాబాద్‌లోని డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో కలిసి రెండు రోజులు తమ ఆలోచనలు పంచుకున్నారు. భావ సంఘర్షణ పడ్డారు. ఒకచో భయకంపితులయ్యారు.. మళ్ళీ తేరుకుని మొత్తంగా ఆనంద డోలికల్లో తేలియాడారు!

నస్రీన్‌ ఖాన్‌, వేంపల్లె షరీఫ్‌, నేను (స్కైబాబ) -ఖదీర్‌బాబు సూచనలను తీసుకుంటూ ఈ మిలన్‌ ఏర్పాటు చేశాం. 40 మందిని పిలవడాన్ని ముగ్గురమూ పంచుకున్నాం. యూనివర్సిటీలో ఘంటా చక్రపాణి సహకారంతో హాలు, వసతి స్కైబాబ చూస్తే, నస్రీన్‌ ఖాన్‌ అన్న పానీయాల విషయమంతా చూశారు. ఖర్చు అంతా కవి, కథకులు, నవలాకారులు అమ్జద్‌ అలీ చూసుకున్నారు. అట్లా రెండు రోజుల మిలన్‌ దిగ్విజయమైంది.

మిలన్‌ సమయం ఇసుమంత కూడా వృధా కాకుండా నడిపించాడు ఖదీర్‌బాబు. స్కైబాబ, ఖాదర్‌, డానీ ప్రారంభకులుగా డయాస్‌ మీద మాట్లాడించి తర్వాత తన విశ్వరూపం చూపించాడు. రెండు రోజులు టాపిక్స్‌కు అనుగుణంగా రచయితలను ఎంచుకొని కొన్ని సెషన్‌గా నడిపించాడు. శషభిషలు లేకుండా పరిచయ కార్యక్రమం దాదాపు గంటన్నరసేపు ఆసక్తిగా నడిచింది. ఒక్కో రచయిత వతన్‌, బ్యాక్‌గ్రౌండ్‌, రచనలు, ప్రస్తుత స్థితి అంతా అవగతమయ్యింది. ఒకరిద్దరి పరిచయం కళ్లనీళ్లు పెట్టించింది. ముఖ్యంగా, మతాంతర వివాహం చేసుకొని వైష్ణవి శ్రీ గా కవిత్వం రాస్తున్న రోష్ని తన భావాలు పంచుకుంటుంటే, ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే నావాళ్లతో కలిసినట్లు అనిపిస్తోందన్నప్పుడు కళ్ళు చెమర్చాయి.

అందరిదీ ఇప్పుడు ఒకటే దు:ఖగీతం. ఒకటే పోరు. ఒకటే దారి. లోన అంతర్‌ పోరాటాలు సరే, బాహ్యంగా భయానక వాతావరణం. ముంచుకొస్తున్న ప్రమాదం. ఎలా నిలువరించగలమో ఏమో.. నిద్రాహారాలు మాని, సామాన్యుడు, మేధావి, రచయిత భేదాలు వీడి, మరిచి కార్యకర్తల్లా దేశ క్షేమం కోరేవారందరితో కలిసి శ్రమిస్తేనే ముంచుకొస్తున్న ప్రళయాన్ని నిలువరించగలం.. లేదంటే బతుకులు చిన్నాభిన్నమే. చెల్లాచెదురే. కాపాడే వారుండరు. ఉన్న కొద్దిమంది జైళ్ళల్లో ఉండొచ్చు.. అందుకే, మిగిలింది ఒకటే దారి.. అందరితో కలిసి పోరాటం. యుద్ధం!

**
అంతర్గత సమస్యలపై చర్చ ఘాటుగా జరిగింది. మహిళల సెషన్‌ అటెన్షన్‌ క్రియేట్‌ చేసింది- గుమ్మం లోపల ఒకరకంగా గుమ్మం బయట మరోరకంగా తమ బతుకులు ఉండడం గురించి అనేక ప్రశ్నలు గుప్పించారు మహిళా కథకులు- షాజహానా, నస్రీన్‌, రోష్ని (వైష్ణవి శ్రీ), జరీనా బేగం, సలీమ. వెరసి ఏ రచననూ నియంత్రించడం సరైంది కాదని, కాకపోతే సందర్భం ఏమిటనేది రచయితే గ్రహించి బయటికి ఇవ్వాలని, స్వీయ నియంత్రణ, ఎడిటింగ్‌ అవసరమనే కంక్లూజన్‌కు వచ్చాం.

**
ఖాదర్‌ మొహియుద్దీన్‌ పెద్దవారుగా అన్ని అంశాలను సమన్వయం చేస్తూ మాట్లాడారు. ముస్లిం సాహిత్యం ఇతర ఏ సాహిత్యానికీ తీసిపోనంతగా వెలువడిందన్నారు. డానీ ఫాసిజం గురించీ ఆ నేపథ్యంగా వచ్చిన సినిమాల గురించి వివరించారు. ఎక్కడికీ కదలని దాదాహయాత్‌ ఇష్టంగా వచ్చి కథా రచన గురించి మాట్లాడారు. తను ముందు ముందు ముస్లిం కథలు రాయబోతున్నానని ప్రకటించారు. ఒక న్యాయవాదిగా ఎన్నార్సీ వ్యతిరేక వ్యాసాల పరంపర చమన్‌ పత్రికలో రాస్తున్న విషయం ప్రస్తావించారు.

ప్రముఖ విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య ఈ అరుదైన మిలన్‌కు తనను పిలవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మీలో ఒకడిగా అనిపిస్తున్నదని అన్నారు. తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం ఇంపార్టెన్స్‌ని చెప్పుకొచ్చారు. అలాగే చిక్కనవుతున్నపాట నుంచి ముస్లిం రచయితలు ఉద్యమంలో భాగమై వస్తున్న విషయం గుర్తుచేశారు. రెండు రోజులూ ఎంతో హుషారుగా లక్ష్మీనరసయ్య ముస్లిం రచయితలను ఉత్సాహపరిచారు.

రెండు సెషన్‌లలో మాట్లాడిన ఖాజా కొన్ని ఆసక్తికరమైన పరిశీలనల్ని  పంచుకున్నారు. ముస్లిం సమాజానికి ఇవాళ మతపరమైన  మౌల్వీలు కాదు, సోషల్‌ మౌల్వీల అవసరం ఎక్కువగా ఉందన్నారు. ఒక్కో సందర్భంలో తీవ్ర స్వరంతోనూ, కొన్ని సందర్భాల్లో సంయమనంతోనూ రచనల అవసరం ఉంటుందని వివరించారు.

తొలి రోజు సాయంత్రం విమర్శకులు కె.శ్రీనివాస్‌ ఉపన్యాసం రాబోతున్న పరిస్థితులను కళ్ళకు కట్టింది. ముస్లింలు అభద్రతలో ఉన్నారని అనుకుంటున్నారు కానీ ముస్లింల వల్ల హిందువులే అభద్రతలో ఉన్నామని నమ్మేలా ప్రచారం చేశారు, అలాంటి అభద్రతలో హిందువులు ఉండకుండా ఏం చేయాలో ముస్లింలు, రచయితలు ఆలోచించాలన్న కె.శ్రీనివాస్‌ అబ్జర్వేషన్‌ ఆలోచనలో పడేసింది. రచయితలం మేధావులం అని ఊరుకోకుండా కార్యకర్తలుగా మారి రాబోయే ప్రమాదాన్ని నిలువరించడంలో భాగం కావాలని ఆయన సూచించారు.
**
హిందీ సాహిత్య విమర్శకురాలు కవి కథకులు ఎస్‌కె సాబిరా బేగం ప్రస్తుత సంక్లిష్ట సందర్భంలో హిందీలో వస్తున్న ముస్లిం కథలను గొప్పగా పరిచయం చేశారు. కలం కదలకుండా స్థాణువుల్ని చేస్తున్న నేటి ముస్లిం వ్యతిరేక రాజకీయాల నేపథ్యంలో ఈ సెషన్‌ దారిదీపంలా తోచింది. తెలుగులో ముస్లింవాద సాహిత్యం గురించి చెబుతుంటే ఉర్దూ, హిందీ ముస్లిం రచయితలు ఆశ్చర్యపోతుంటారని, ఇంతమంది ముస్లిం రచయితలు, వారి రచనలు ఒక వాదంగా దేశంలో మరెక్కడా లేదని సాబిరా బేగం చెప్పడం విశేషం.

నబి కరీమ్‌ ఖాన్‌, మహమూద్‌ షేక్‌పీర్ల, వలిహుసేన్‌, ఇనాయతుల్లా తాము రాయబోతున్న కథలను పంచుకున్నారు. కొత్తగా ఆసక్తికరంగా ఉన్న ఆ కథా వస్తువులను అందరూ ప్రశంసించారు. హనీఫ్‌, అన్వర్‌ తమ కథా రచన అనుభవాలను పంచుకున్నారు. ఇంకా ఈ మిలన్‌లో రుబీనా పర్వీన్‌, తొలి ముస్లిం స్త్రీ కథకురాలు పి.షెహనాజ్‌, వహీద్‌ ఖాన్‌, బాషా పాల్గొన్నారు.

ముగింపు సభలో లక్ష్మీనరసయ్య, ఖాదర్‌ మొహియుద్దీన్‌ మిలన్‌ అవలోకనం చేశారు. నిర్వాహకులు నస్రీన్‌ ఖాన్‌, వేంపల్లె షరీఫ్‌ ఇలా అందరినీ ఒకచోట కలిపే మిలన్ నిర్వహణ తమకు ఎంతో సంతృప్తి నిచ్చిందని మాట్లాడారు. తెలంగాణ ముస్లిం కథా సంకలనం రాబోతున్నదని, ముస్లిమేతర రచయిత్రుల ముస్లిం కథా సంకలనం షాజహానా తన సంపాదకత్వంలో వెలువరించనున్నదని స్కైబాబ ప్రకటించారు. దేశంలోనే ఏ భాషలోనూ తెలుగులో వెలువడినన్ని సంకలనాలు, సంపుటులు ముస్లింల నుంచి రాలేదని, ఎన్నో భిన్నకోణాల నుంచి వెలువడిన ముస్లిం కథ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిందని, ముస్లిమేతరులను సెన్సిటైజ్‌ చేయడంలో ముస్లిం కథ పాత్రనే పెద్దదని అన్నారు. ముస్లిం కథా రచనకు ఇంకా ఎన్నో అంశాలు మిగిలి ఉన్నాయని, దర్గా, మొహర్రం సంస్కృతులు తదితర ఇండియన్‌ ముస్లిం సంస్కృతిని రికార్డు చేసే కథలు వేంపల్లె షరీఫ్‌తో కలిసి సంకలనం చేయాలనుకున్నానని అన్నారు.

**
ముస్లిం రచయితలలో ఒకరంటే మరొకరికి పడదని, కలవరని, భిన్నాభిప్రాయాలున్నాయనే అపోహలను, ఊహాగానాలను తుత్తునియలు చేసుకుని అందరం కలవడం రెండు రోజులు నవ్వుల జల్లుగా పలకరింపుల హరివిల్లుగా షాయరీలు పూయిస్తూ గడపడం ఎంతో తృప్తినిచ్చింది. మరిన్ని మేలు కలయికలు, మిలన్‌లు జరగాలని తరువాతి మిలన్‌ విజయవాడ పరిసరాలలో ఏర్పాటు చేసుకుందామని నిశ్చయించుకుని అప్పుడే రెండు రోజులయిపోయాయే అనుకుంటూ అయిష్టంగానే ఎవరి ఊర్లకు వాళ్లం బయలుదేరాం.

*

స్కైబాబ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు