అద్దేపల్లి ప్రభు కథ “అతడు మనిషి ” వినండి

“సారంగ” ఆడియో కథలకు మీకిదే స్వాగతం. ఈ పక్షం కథ వినండి!

కధాభిమానులకు నమస్కారం.

ఈ వారం మనం వినబోయే కథ “అతడు మనిషి “. రచయిత  అద్దేపల్లి ప్రభు.

మనిషి గొప్పదనాన్ని లోకానికి చాటి చెప్పేవి ఏవి ? . మాములుగా  అంటే లోకసహజంగా ఆలోచిస్తే …..డబ్బు…హోదా,అధికారం . ఇంకొంచెం గట్టిగా ఆలోచన చేస్తే , చదువు , విజ్ఞానం , సామాజిక సంస్కారం . మరింత  లోతుగా ఆలోచిస్తే కరుణ, దయ , ప్రేమ . ఒక్క మాటలో చెప్పాలి అంటే  మనిషిని మనిషిగా చూడగలగడం.

అయితే చివర్లో చెప్పిన ఈ “మనిషిని మనిషిగా చూడగలగడానికి ” పైన చెప్పిన వాటిలో ఏది ఆవశ్యకమైన దినుసు అని ఆలోచిస్తే….డబ్బు , అధికారం , హోదా, చదువు , విజ్ఞానం , గొప్ప పరిసరాల్లో జీవించడం ఇవి ఏవీ కావు కేవలం “ఇంగిత జ్ఞానం” మాత్రమే అని మనసుని మేల్కొలిపి ,  హృదయాన్ని తట్టి చెప్పిన కథ “అతడు మనిషి “. ఒకానొక వానరాత్రి , చీకట్లో వరద వాతావరణం లో , జీవితంలో కష్టం , కన్నీళ్లు తెలీని మనిషికి ,ఒక నిరుపేద కుటుంబం,  మానవత్వపు పరిమళాలను వెదజల్లే ఆతిధ్యం ఇచ్చి , ఆతిధ్యపు విలువను వెల కట్టకూడదు అనీ…..”సాటి మనిషిని మనిషిగా చూసి కష్టకాలంలో ఆదరించగలగడం ” మాత్రమే మానవీయ విలువలను నిలబెట్టడం అని జవాబు ఆశించకుండా ఒక పేదవాడు డబ్బున్న మారాజులకు విసిరిన సవాలు ఈ కధ.

ఈ కధలో అతడు పేదవాడు కావచ్చు , కానీ అతడు మనిషి. వినండి అద్దేపల్లి ప్రభు  “అతడు మనిషి “కధ–

అతడు మనిషి

‘‘మన చుట్టూ ఉండే ప్రదేశం చాలా ప్లజెంట్‌గా ఉండాలి. చాలా ఖరీదుగా ఉండాలి. అందంగాఉండాలి. తలతిప్పి చూడ గానే కనిపించే అమ్మాయి మూతికీ బుగ్గకీ రంగుతో, విరబోసుకున్న జుట్టుతో మహా బిగుతైన జీన్స్‌లో రా అని పిలుస్తున్న ట్టుండాలి. ఎండ రాకూడదు. లైట్లే ఉండాలి. వేడి రాకూడదు. ఏసీ ఉండాలి. అదీ జీవితం. ఇలా లేని ప్రపంచం ఉంది. నేవొప్పుకుంటాను. కానీ అది మనకనవసరం. ఆ దరిద్రం గురించి ఆలోచించనే చించం… కాబట్టి దాన్లోకి వెళ్ళనే వెళ్ళం…’’ అంటాడు మిత్రుడు మహే.. అనే మహేష్‌.
తానూ అలానే అనుకున్నాడు. కానీ తప్పని సరై వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడిలా ఇరుక్కుపోవాల్సీ వచ్చింది.
ఎదురుగా గోదావరి పాయ. దూరంగా ఆవలి వొడ్డు పాశర్లపూడి. వైనతేయ గోదావరి ఎర్రటి నీళ్ళతో పరవళ్ళు తొక్కుతోంది. అద్భుతమైన దృశ్యం. భీకరమైన వాన అలా కురుస్తూనే ఉంది.
అమలాపురంలో దిగి ఆటో పట్టుకుని ఈ బోడసకుర్రు రేవుకి వచ్చేస్తుండ గానే మొదలై పెరిగిపోయింది వాన. రేవు దగ్గర దిగి ఆటో వాడికి డబ్బు ఇచ్చి గబగబా లాంచీ కోసం వస్తుండగానే పూర్తిగా తడిసిపోయాడు. రేవులో ఉన్న చిన్న బడ్డీ కొట్టు చూరు కింద నిబడి కొట్టులో అతణ్ణి అడిగాడు.
‘‘ఆవలికెళ్టానికి లాంచీ ఉంటుందా?’’ అని.
అతను ఓసారి చూసి ‘‘ఇంకీయాల్టికి ఉండవండి… యింత వాన్లో లాంచీ ఎల్లదు’’ అన్నాడు. అని ‘‘ఏవూరెళ్ళాండి?’’ అడిగాడు.
‘‘ఆదుర్రు’’ అన్నాడు వెంకటేష్‌
‘‘మీర్లెల్లలేరండి’’అన్నాడతను చల్లగా.
సాయంత్రం నాలుగు దాటింది. కానీ వాన వల్లా, మబ్బు కమ్మేసిన ఆకాశం వల్లా చీకటి పడిపోయినట్టుంది.
అలా పెరిగిపోతూ ఉంది వాన.
రోజుల తరబడి తెరపి లేకుండా కురిసేలా…
వాన అపూర్వంగా ఉంది.
దూరంగా గీత గీసినట్టు కొబ్బరి చెట్ల నేల. పైన ఆకాశం. కింద నది. రెండూ ఒకేలా ఉన్నాయి. ఇటూ ఇటూ అంతా నదే… అంతా ఆకాశమే. నింగీ నేలా ఏకమైనట్టు వాన కురుస్తోంది.
రేవులో చిన్నా పెద్దా పడవలు గుంజకి కట్టేసి ఉన్నాయి.
క్రైసిస్‌ మేనేజిమెంట్‌!
ఇలా దిక్కుతోచని స్థితిలో ఏదో ఒక దారిని వెదకాలి. మరీ ముఖ్యంగా మానసిక నిబ్బరాన్ని కోల్పోకూడదు.
వెంకటేష్‌ బ్యాగ్‌ని నెత్తి మీద పెట్టుకుని గబగబా వర్షంలోకి వెళ్ళాడు. ఒడ్డున కాస్తంత దూరంలో భూమికి జానెడెత్తు పాకొకటి కనిపించింది.
‘ఎస్‌’ అందులో కచ్చితంగా మనక్కావల్సిన వాళ్ళంటారు అనుకుంటూ చిన్నగా పరుగుతోనే ఆ పాక దగ్గరకి వెళ్ళి వొంగి లోనికి చూస్తూ
‘‘ఏమండీ.. ఏమండీ…’’ అని పిలిచాడు.
పాక లోపల పొయ్యి దగ్గర కూర్చుని ఉన్నాడు ఒక మనిషి. అతను తల తిప్పి చూశాడు. గుమ్మం ముందు రెండు కాళ్ళు కనిపించాయి. అతను లేవకుండానే..
‘‘ఎవరాలు?’’ అన్నాడు.
ఆ కాళ్ళ మనిషి వంగాడు. ముఖం కనిపించింది.
‘‘పడవ కావాలి’’ అంది ముఖం.
కూర్చున్న వ్యక్తి పైకి లేస్తూ ‘‘లోనికి రండి బాబూ ముద్దయి పోతున్నారు’’ అన్నాడు.
వెంకటేష్‌ అలా వొంగి పాకలోకి దూరాడు.
ఓ పక్కగా నులక మంచం వేసి ఉంది.
అది యించుమించు నేలని తాకేంత గొయ్యయిపోయుంది.
పాకలో మనిషి ‘‘అన్నన్నా.. శానా తడిసిపోయారే.. అలా మంచమ్మీద కూసోండి. బాబూ.. పర్లేదు..అదేం యిరిగిపోదులే’’అన్నాడు.
వెంకటేష్‌ బ్యాగ్‌ని పక్కగా పెట్టి మంచమ్మీద కూర్చున్నాడు. తలోంచి నీళ్ళ కారిపోతున్నై. కాళ్ళ మీంచి, బూట్ల మీంచి నీళ్ళు కారి నేల మీద చిన్నగా మడుగు కడుతున్నాయి. వెంకటేష్‌ ‘‘అవతలి ఒడ్డుకి వెళ్ళాలి. బోటులోనన్ను తీస్కెళ్ళాలి’’ అన్నాడు.
వర్షంలో తడుస్తున్నప్పుడు అనిపించలేదు. వెన్నులోంచి… ఎముకల్లోంచీ వణుకు బయలు దేరింది. దవడలు కటకట కొట్టుకుంటున్నై. యింత వణుకా…!
పాకలో మనిషి వెంకటేష్‌ని చూసి ‘‘చ్ఛొచ్ఛొచ్ఛొ .. ’’ అంటూ శానా తడిసి ముద్దయి పోయారు బాబూ.. ముందీ తువాల్తోటి తల తుడుసుకోండి..’’ అన్నాడు ఒక పొడిగా ఉన్న తువ్వాల్లాంటి గుడ్డ ఇస్తూ.‘‘లేల్లేదు.. నా.. బ్యా..గ్‌లో.. టవల్‌… ఉంది..’’ అంటూ బ్యాగ్‌ని తీసాడు. పైన కొద్దిగా తడిసినా లోపల పొడిగానే ఉన్నాయి. ఒక టవల్‌ని బయటకి లాగాడు. తల తుడుచుకోవడం మొదలు పెట్టాడు. ఈలోగా ఆ మనిషి పొయ్యిలోని పుల్లల్ని మండించి పొయ్యి మీద నల్లటి సత్తుగిన్నె ఒకటి పెట్టి అందులో నీళ్ళు పోశాడు.

వెంకటేష్‌ తల తుడిచేసుకుని ఆ టవల్‌తోనే పాంటు చొక్కా మీదే ఒళ్ళు కూడా తుడిచేసుకున్నాడు. నీళ్ళు ఓడడం తగ్గింది కానీ వొణుకు తగ్గడం లేదు.
కాసిన్ని నిప్పులు ఒక పగిలి పోయిన కుండ పెంకులో పెట్టి దాన్ని మంచం కింద పెట్టాడు ఆ మనిషి.
‘‘కూసో బాబూ ఎచ్చగుంటది…’’ అని పొయ్యి మీద మరిగిన టీని రెండు గ్లాసుల్లో పోశాడు. చల్లని ఆ వాతావరణంలో టీ వాసనకి ప్రాణం లేచొచ్చినట్టుంది. మంచం మీదకూర్చుని అడుగు నించి వెచ్చదనం శరీరాన్ని వేడెక్కిస్తుండగా టీని రెండు గుక్కు తాగాడు. బెల్లంవేసిన డికాషన్‌. చిరు చేదుతో చిత్రమైన రుచి.
మెల్లిగా వొణుకు తగ్గింది.
ఆ మనిషి ఒక బీడీని తీసి పొయ్యిలోని పుల్లతో ముట్టించి గుప్పుమని పొగ వదిలాడు.
గ్లాసు కింద పెడుతూ మళ్ళీ అన్నాడు వెంకటేష్‌.
‘‘నేను అర్జెంటుగా ఆదుర్రు వెళ్ళాలి. చాలా అర్జెంట్‌ .. లాంచీ పోదట. మీ బోటులో నన్ను అటువేపు తీసుకెళ్ళగరా? ఎంత డబ్బయినా పర్లేదు.’’
ఈసారి గొంతు వణకలేదు. వంటి మీద తడిబట్టలు మాత్రం చిరాగ్గా ఉన్నాయి.
ఆ మనిషి బీడీ పొగని మళ్ళీ వూదుతూ…‘‘ఏ వూరు మంది’’అన్నాడు.
కోపం వచ్చింది వెంకటేష్‌కి. ‘‘ఏ వూరైతే ఏంటి?’’
ఆ మనిషి నవ్వుతూ.. ‘‘కోప్పడకండి బాబూ నేను వూరికే అడిగా నంతే…’’అని ‘‘బైట వాన చూశారా? తుపానట సిటం ఆక్కుండా కొడుతోంది.’’ అన్నాడు.
‘‘పర్లేదు..  తడిసి పోయినా పర్లేదు.. అర్జెంటుగా వెళ్ళాలి అంతే..’’
‘‘ఎళ్ళేం బాబూ’’
‘‘ఎంత డబ్బయినా పర్లేదంటున్నా కదా’’
‘‘అబ్బే.. యిది డబ్బుల్తో తేలే యవ్వారం కాదు. గోదారి అమ్మోరమ్మలా ఉంది. యేలు పెడితే లాగేసేలా ఉంది. హాయిగా ఈ వానలో ఇలా       మునగ దీసుక్కూసోడం… వాన్నీ.. గోదార్నీ సూడ్డం తప్ప మరేటీ చైలేం..’’
నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు వెంకటేష్‌.
బైట వర్షపు హోరు భీతావహంగా వినిపిస్తోంది. చీకటి పడిపోయింది.

పాకలోని మనిషి లాంతరు వెలిగించి చూరుకి వేళ్ళాడదీశాడు.
గుమ్మం దగ్గరకి వెళ్ళి ‘‘సోవుడూ.. సోవుడూ…’’అని అరిచాడు.
మళ్ళీ లోనికి వచ్చి గుమ్మమ్మీద కూర్చుని
‘‘కాస్తంత వాన తగ్గితే అమలాపురం ఎలిపోండి బాబూ… అక్కడి నించి రాజోలు బస్సులుంటై.. ఎక్కేసి జగ్గన్న పేటలో దిగిపోయి అట్నుంచి ఆటోనో దేన్నో అట్టుకొని ఆదూరు పోవచ్చు’’అన్నాడు.
నిట్టూర్చాడు వెంకటేష్‌. త్వరగా వెళ్ళాలని ఇటొచ్చాడు తను. అందుకే అంటారు తొందర ఆలస్యానికి మొగుడని. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి?
ఎచటికి పోవాలీ రాత్రి?
ఇక్కడెక్కడా లాడ్జీలు ఉండవు. ఉన్నా ఎక్కడికెళ్తాం?
బాగా నీరసించిన గొంతుతో అన్నాడు.
‘‘దగ్గర్లో లాడ్జీలు ఉండవా?…’’
‘‘అమలాపురం పోవాలి బాబూ .. అయినా ఎలా ఎల్తారు?’’అన్నాడు.

‘‘మరి…’’
ఇంతలో బయటి నుంచి ఓ కుర్రాడు నెత్తి మీద ఒక ప్లాస్టిక్‌ సంచిని కప్పుకొని లోనికొచ్చాడు. చిన్న గోచీ తప్ప వాడి వొంటి మీద ఇంకేమీ లేదు. నల్లటి ఒళ్ళు చీకట్లో కలిసిపోయింది. వాడి చేతిలో తాటాకుతో చేసిన చిన్న బుట్టలాంటిది ఉంది.
ఏడేళ్ళుంటాయి వాడికి… వాడు లోనికొస్తూనే..
‘‘ఏం వాన్రా అయ్యా’’ అన్నాడు. అని నెత్తి మీది సంచీని బయటే పారేసి బుట్టని చూరుకి తగిలించి పొయ్యి దగ్గరకెళ్ళాడు. వాడి వెనకే ఓ ఆడమనిషి లోనికొచ్చి కొత్త మనిషిని చూసి వంటగది పక్కనున్న గదిలోకి పోయింది.
పాకలో మనిషి పొడిగుడ్డతో ఆ కుర్రాడి ఒళ్ళూ తలా తుడుస్తూ…
‘‘ఏడున్నార్రా యింతదాకా..’’ అన్నాడు.
లోపల్నించి ఆడమనిషి గొంతు..
‘‘సెప్తే యింటడా.. ఎదవ సచ్చినోడు..వొద్దురా .. వొద్దూ.. అంటున్న యినకుండా గోదాట్లోకి పోయాడు. గుండెలవిసిపోయాయనుకో.. ఎలా ఉంది గోదారి?’’ అంది.
‘‘ఏరా ఎదవా… ఈ వాన్లో… ఈ వరదలో గోదాట్లో దిగావా…’’
ఆ కుర్రాడు లేచి ఓ కాలు కొంచెం వంకరగా పెట్టి తలని ఓ పక్కకి కొంచెం వాల్చి లేని కాలర్‌ని ఉన్నట్లు అభినయిస్తూ
‘‘మనం సిరంజీవ్వోళ్ళం… మన్ని గోదారేటి చేద్ది?’’అన్నాడు.
వాడి నాన్న నవ్వాడు.
‘‘ఎదవకి సిరంజీవి పిచ్చండి’’అన్నాడు.

లోపల్నించి పొడి చీర కట్టుకుని ఆడమనిషి బయటకొచ్చి వంటగదిలోకి వెళ్ళింది. దానికి తలుపంటూ ఏమీ లేదు. గుమ్మం మాత్రం      ఉంది. లోపల ఆమె పొయ్యిలో నిప్పుని రాజేసి పుల్లలు మంట పెట్టి వంట మొదలు పెట్టింది. పాకలో మనిషి లాంతరు చిమ్నీ  పైకెత్తి ఇంకో బీడీ వెలిగించి ఒక మూలగా మునగదీసుకుని కూర్చున్నాడు. ఆ కుర్రాడు వంటగదిలో వాళ్ళమ్మ వీపు మీద ఎక్కి వూగుతున్నాడు.
వెంకటేష్‌ ఒక్కసారి మంచం మీంచి లేచి బ్యాగ్‌ని ఓ పక్కగా పెట్టాడు. కింద నిప్పులు ఆరిపోయి ఉన్నాయి.
అతను లేచి బయటకి చూశాడు.
బయట అంటూ ఏముంది?
చీకటి గుయ్యారం.
ఈ పాకలోని లాంతరు నారింజ వెలుగు ఆ చీకట్లో పడి మాయమైపోతోంది.
చిటపట చిటపట వాన చినుకులు
కొబ్బరి చెట్లు వూగిపోతున్నట్టు గాలి తెలుస్తోంది.
ఏంటి ఈ పరిస్థితి అనుకున్నాడు వెంకటేష్‌. ఆ మనిషితో అన్నాడు.
‘‘ఈ వాన యిప్పట్లో తగ్గేలా లేదు’’
అతను అలా ఆ చీకట్లోకే చూస్తూ
‘‘ఔనండి… ఎన్నాళ్ళయ్యింది ఇలాంటి వాన పడి…’’అని    ముక్తాయించాడు.
లాంతరు వెలుగులో టైము చూశాడు. ఇంకా ఏడు కూడా అవలేదు.
లోకం అదృశ్యమైపోయింది.

లోపల్నుంచి అన్నం ఉడుకుతున్న వాసన కమ్ముకుంది. ‘ఈ వాసన యింత బాగుంటుందా?’అనుకున్నాడు.
‘‘ఇప్పుడీ వానలో నేనెక్కడికి వెళ్ళ గలను’’అన్నాడు.
ఆ మనిషి గుమ్మంలో పడుతున్న చినుకుల్నీ వాటి మీద పడి మెరుస్తున్న నారింజ వెలుతుర్ని కన్నార్పకుండా చూస్తూ ..
‘‘ఎక్కడికెళ్తారు బాబూ… ఎక్కడికీ ఎల్లలేరు’’అన్నాడు.
‘‘మరి…’’
‘‘మరేటుంది బాబూ… ఉండిపోవాల… కసింత వానైనా తగ్గితే అప్పుడు చూడాలి…’’
ఆ పిల్లవాడు లోన్నుంచి గెంతుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న వీపు మీది కెక్కాడు.
‘‘సలి పెడుతుంటే గోసి గుడ్డతో ఉండిపోయావేట్రా.. పోయి సొక్కా అన్నా ఏస్కురా పో…’’అన్నాడు.
వాడు లేచి ఒక గెంతులో లోపలి గదిలోకి పోయి చొక్కా వేసుకుని ‘అయ్యా’ అంటూ వచ్చాడు.
వాడేసుకున్న చొక్కా వాడికి చీలమండ దాకా వచ్చింది. పొట్టి చేతుల చొక్కా వేళ్ళ చివరిదాకా ఉంది. అటు లాంతరు వెలుగు, ఇటు వంటగదిలోని పొయ్యి వెలుగుల్లో వాడు గ్రహాంతర జీవిలా వింతగా ఉన్నాడు.

వాళ్ళ నాన్న వాడి వంక చూసి నవ్వాడు. వాడు గెంతుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న వొళ్ళో దూరాడు.
ఈ అపరిచిత సన్నివేశంలో తన పాత్రేమిటో తెలియక అయోమయ మైపోయాడు వెంకటేష్‌. ఈ రాత్రికి ఈ పాకలో ఈ అపరిచిత కుటుంబంతో తెల్లారదియ్యాదిల్సిందే.
ఈ అగంతుకుని అస్థిత్వాన్ని వాళ్ళెవరూ అబ్బురంగా చూట్టం లేదు. నిత్యమూ అగుపించే చుట్టాన్ని చూట్టానికి అవాటు పడ్డట్టుగా ఉన్నారు.
క్రైసిస్‌ మేనేజిమెంట్‌లో తనకున్న అపారమైన తెలివి ఈ రాత్రి గింగరాలు తిరిగి ఎక్కడిపోయిందో… లక్ష్యసాధనలో ఇక్కడ ఇరుక్కుపోవడం ఒక అనివార్య సంఘటనే ` కానీ అది మన ప్రమేయం లేకుండా మన మీద వొచ్చి పడిపోతే…. ఇంక క్రైసిస్సూ లేదూ… మేనేజిమెంటూ లేదు… పువ్వుల్లా చిందుతున్న వెలుగు బుడగ చినుకుల్ని చూస్తూ కూర్చోవడం తప్ప.
లోపల్నించి చేపల పులుసు వాసన ఆకల్ని రేకెత్తిస్తూ అలముకుంది. వాసన తగుల్తున్న కొద్దీ తినెయ్యాలి తినెయ్యాలనే కోరిక చిందులెయ్యడం మొదలు పెట్టింది. లేచి వాచీని లాంతరు పక్కగా పెట్టి చూసాడు. ఏడు దాటింది. అప్పుడే ఇంత ఆకలా?
లోపల్నించి కుర్రాడి తల్లి ‘‘సోముడూ…’’అని పిల్చింది. వాడు లేచి లోపలికి వెళ్ళాడు. ఒక గిన్నెలో పొగలు చిమ్మే అన్నం.. దానిపైన చేపల పులుసూ వేసుకొని వొచ్చి నాన్న పక్కన కూర్చుని తినడం మొదలు పెట్టాడు.

ఆవిడ మరో రెండు కంచాల్లో అన్నం రెండు స్టీలు గిన్నెల్లో పులుసు వేసుకొని వచ్చి మంచం పక్కన పెట్టింది.
పాకలోని మనిషి లేచి ‘‘వణ్ణం తినేండి బాబూ… తినేసి తొంగుంటే.. తెల్లార్సంగతి భగమంతుడు చూస్కుంటాడు.’’అన్నాడు.
తనకి వద్దనలేనంత ఆకలి వేస్తుండడం వెంకటేష్‌కి చిత్రమనిపించింది. అతను లేచి బుద్ధిగా వెళ్ళి ఒక కంచం ముందు కూర్చున్నాడు. ఆవిర్లు చిమ్ముతున్న అన్నం కంచంలో రాశిపోసినట్టు నిండుగా ఉంది. యింతన్నమా అనుకున్నాడు.
గొంతు పెగలదీసి ‘‘ఇంతన్నం తిన్లేను’’అన్నాడు.
‘‘అదెంతుంది బాబూ…’’ అందామె గుమ్మం దగ్గరుండి.
‘‘లేల్లేదు.. తిన్లేనండి… కొంచెం తీసైండి ప్లీజ్‌.. ’’అన్నాడు.
ఆమె అన్నం వండిన గిన్నె తెచ్చి తెడ్డుతో కొంచెం అన్నం తీసింది. పులుసును అన్నంలో కలుపుకున్నాడు. ఆ వాసనకి నోట్లో నీళ్ళూరిపోయాయి. నోరూరిపోవడం… చిన్నప్పుడు తప్పిస్తే మళ్ళీ తనకీ అనుభవం లేదు. అన్నాన్నీ కూరనీ చూస్తే నోరూరుతుందా?
వర్రగా ఉన్న పులుసు.. చేపలు.. కొద్ది కొద్దిగా కలుపుకొని మళ్ళీ అన్నం పెట్టించుకొని తిన్నాడు. ఆకలి మొహమాటపడదు. చల్లని ఆ వానరాత్రి.. వేడి వేడి అన్నం.. వర్రగా ఉన్న పులుసు.. వొళ్లూ ముఖమూ వేడెక్కి పోయి తలో చిన్నగా చెమట కూడా పట్టింది. ఆహారం తినడం ఇంత అనిర్వచనీయమైన అనుభవాన్నిస్తుందా!

భోజనం అయిపోయింది. లేచి మళ్ళీ టైము చూసి నడుం దగ్గర్నించి సెల్‌ని బయటకు తీసి చూశాడు సిగ్నల్‌ లేదు. ఎవ్వరికీ ఏ ఫోనూ చేయలేం. ఎవ్వరూ మనకీ చైలేరు. నో సిగ్నల్‌.. ఈ సెల్లొక బొమ్మరాయి.
ఆ కుర్రాడు తింటూనే నిద్రకి పడ్డాడు. వాళ్ళమ్మ కూడా తినేసి ఆ కుర్రాణ్ణి తీసుకుని లోని గదిలో మంచం మీద పడుకుండిపోయింది.
పాకలో మనిషి తినేసి కంచాల్ని గుమ్మం అవతం పడేసి తువ్వాలుతో చేయి తుడుచుకొని బీడీ తీసి వెలిగించి కూర్చున్నాడు.
తనకి ప్రమేయం లేని ఒక చిత్రమైన పరిస్థితిలో కొనసాగిపోతున్నాను అనుకున్నాడు వెంకటేష్‌.
చిత్రంగా ఆ మనిషి కూడా అలానే ఉన్నాడు. కానీ అతనికి ఏం చెయ్యాలో తెలుసు. అతని యింట్లో ఒక అపరిచితుడున్నా అతడు అది తనకి ప్రమేయం లేని సందర్భంలానో లేక సహజమైన ఘటనలానో ఉన్నాడు.

వెంకటేష్‌ లేచి బ్యాగ్‌ తీసి షార్టుని బయటకు తీశాడు. వంటి మీద ప్యాంటు షర్టు యింకా తడిగానే ఉన్నాయి. టవల్‌ని చుట్టుకుని వాటిని తీసేసి షార్టు వేసుకున్నాడు. మరో పొడి షర్టు వేసుకుని తడిబట్టల్ని చూరులో తాటి కమ్మకి వేళ్ళాడేశాడు. అతని లాగనే కూర్చుని బయటకి చూట్టం మొదలు పెట్టాడు. ఈ చిన్న పాక .. వంటి మీద బట్టలులేని కుర్రాడు… కరెంటు లేదు.. టీవీ లేదు… సోఫాల్లేవు… డైనింగ్‌ టేబుల్  లేదు.. ఫ్రిజ్‌… లేదు… మంచాల్లేవు… ఏమిటీ బతుకు? అనుకున్నాడు. ఈ బతుక్కి ఒక లక్ష్యం లేదు. ఉన్నత స్థితికి ఎగబాకి పోవాలనే కిల్లింగ్‌ ఇన్‌స్టింక్ట్‌ లేదు. ఎలా బతుకుతున్నారీ బతుకుని? ఎందుకు బతుకుతున్నారు? ఒక జంతువులాగా … బతికున్నాం కనక తిండం… తింటున్నాం కనక బతకడం … యింతేనా… ఒక ఐన్‌స్టీన్‌ తెలీదు. న్యూటన్‌ తెలీడు.. జార్జిబుష్‌ తెలీదు.. బిల్‌ గేట్స్‌…. కనీసం సత్యం కంప్యూటర్స్‌ తెలీదు. ఈ అజ్ఞానం … అజ్ఞానం వల్ల దరిద్రం.. ఎందుకీ బతుకు.. తన ఆలోచన్లకి తనకే నవ్వు వచ్చిది వెంకటేష్‌కి. బయట వర్షపు చప్పుడు అలానే వినిపిస్తోంది. దాంతో పాటు ఒక లాంటి హోరు. నది ప్రవహిస్తున్న ధ్వని… ఉండి ఉండి నేని పేల్చేస్తాయా అన్నట్లు మెరుపు.
పాకలోని మనిషి లేచి లోనికెళ్ళి ఒక చిరిగిపోయిన చాప.. ఏ శతాబ్దం నాటిదోనో ఒక బొంత తెచ్చాడు. ఆ బొంత చాలా వరకూ పీలికలైపోయి ఉంది. అతను వాటిని మంచం పక్కగా పడేసి, ‘‘పడుకోండి బాబూ .. తెల్లారెలా ఉంటదో సూద్దాం..’’ అన్నాడు. అని అంతవరకూ కూర్చున్న చోటనే ఒక గోని పట్టా పర్చుకొని పడకుండి పోయాడు.

లాంతరు బాగా తగ్గి నిశ్చలంగా వెలుగుతోంది. నిజానికా వెలుగులో ఏమీ కనపడకపోయినా అది స్నేహితుడి స్పర్శలా ఆప్తంగా ఉంది. వెంకటేష్‌ చాపని పరిచాడు.  కానీ బొంతని మంచం పైన వదిలేశాడు. ఇందాక తను నిలబడ్డ చోటా కూర్చున్న చోటా నేలంతా చెమ్మగా ఉంది. కాస్త ఇవతలికి చాపని లాగి తన బ్యాగ్‌లోంచి ఒక దుప్పటిని తీసి పరిచాడు. ఇంకో పల్చటి దుప్పటిని తీసి బ్యాగ్‌ని తలగళ్ళా అమర్చుకుని వాలాడు.
బయట అంధకారంలోకి ఊహకూడా పోవడం లేదు. కానీ మెరుపు మెరిసినప్పుడల్లా కాస్త బంగారం కలిసిన వెండిలా ఒక అనంత నీటి ప్రవాహం తటిల్లున మెరిసి మాయమైపోతోంది. సెల్‌ తీసి టైము చూశాడు. ఎనిమిది. తను కల్లో కూడా ఈ టైముకి పడుకోలేదు.

కళ్ళు తెరవగానే కోసిన ముక్కలాగా వెలుగు కనిపించింది. అది గుమ్మం.  వాన అలానే ఉంది. చప్పుడు అలానే ఉంది. గాలి అలానే ఉంది. కొద్దిగా వెలుగు.. ఈ రాత్రి వేళ వెలుగొచ్చిందేంటి అనుకున్నాడు. లేచి కూర్చున్నాడు. రాత్రి కాదు, తెల్లారింది.
వాళ్ళ నాన్న కూర్చున్న చోట్లో పిట్టలా కూర్చుని బయటకి చూస్తున్నాడు కుర్రాడు. ఆ కాస్త వెలుగు తప్ప ఏ మార్పు లేదు.
ఆ కుర్రాణ్ణి చూస్తూ ‘‘మీ అమ్మా నాన్నా ఎటు వెళ్ళారు?’’అడిగాడు.
ఆ కుర్రాడు అతని వంక చూసి రెండు వేళ్ళు చూపించాడు.
మెల్లిగా లేచాడు వెంకటేష్‌. గుమ్మం దగ్గరగా వెళ్ళి బయటకి చూశాడు. గోదావరి యించుమించు గట్టుని తాకుతోంది. అక్కణ్నించి అలా చూస్తే ఆవలి ఒడ్డు అంటూ ఏం కనపడ్డం లేదు. నది అలా పరుచుకుని లేచి ఆకాశంలోకి పోయింది. గుమ్మంలోంచి కాలు బయట పెట్టి చూరు కిందగా నిబడ్డాడు. జల్లు మీద పడింది. గుండె ఝల్లుమంది. ఏంటిది?

ధారలుగా పడుతున్న వాన కమ్మేసి చూపు ఎక్కువ దూరం పోవడం లేదు. అంతా తెల్లరంగు తెరలు దిగవేసినట్టు చుట్టూ మూసుకొని పోయింది. ఆ తెర వెనగ్గా చెట్ల జాడ అలుక్కుని పోయి ఉంది.
తెర వెనక నుంచి ముద్దయిన కాకిలా బయటకొచ్చాడు పాకలోని మనిషి. అతడు ప్లాస్టిక్‌ సంచీని మీద కప్పుకుని ఉన్నాడు.
కానీ అదేం ఆగుతుంది? ఉరుకుతో వచ్చి అతను సంచీని చూర్లో వేళ్లాడేసి వెంకటేష్‌ పక్కకొచ్చి ‘‘పిచ్చి వానండి బాబూ.. ఈ గట్టుకింద తోటంతా మునిగిపోయింది. ఆ రేవు రేవంతా మునిగిపోయింది. గోదార్సూసారా… ఇంకొంచెం గానీ పెరిగిందా మనం ఈ పాకొదిలి పోవాల్సిందే…’’అన్నాడు గజగజలాడుతూ.. అని ‘‘మీరు బయటకి పోవాంటే ఈ సంచి మీదేస్కుని యియ్యేపెళ్ళండి. అంతా నీళ్ళే కదా.. ఎక్కూదూరం పోక్కర్లేదు…’’అని చెప్పి లోనికి వెళ్ళాడు.
‘‘అమ్మింకా రాలేదురా’’అని అతడు కొడుకును అడగడం వినిపించింది.

వెంకటేష్‌ కళ్ళు ఆరిపోయాయి. టపటప వాన గాలి హోరు…     ఉండుండి మీద పడుతున్న జల్లు. అర్జెంటుగా అయిపోవాల్సిన పని అతీగతీ లేకుండా పోయింది. అదవక పోతే కొంపలంటుకుపోతాయనుకున్నాం. ఏ కొంపా అంటుకోలేదు. కాలం వానలోనూ.. తుపానులోనూ… చిక్కుకుని పోయి కదల్టం లేదు. అర్జెంటూ లేదు… ఏమీ లేదూ.. నిర్వ్యాపకంగా ఈ అపరిచిత హోత ఇంట్లో ఆతిథ్యం.. ఈ ఇల్లు ఉంటుందా.. మునుగుతుందా…
అతను మెల్లిగా సంచిని తల మీద కప్పుకొని వానలోకి దిగాడు.
సగం తడిసీ, కాళ్ళ నిండా బురద అంటించుకునీ అతడు వచ్చేసరికి పాకలో మనిషీ, అతని భార్యా, పిల్లాడూ కూర్చుని ఉన్నారు. అతణ్ణి చూసి ఆమె కొద్దిగా వెనక్కి జరిగి కొడుకుని వొళ్ళోకి లాక్కుంది. వెంకటేష్‌ లోనికి వచ్చి తన చాప మీద కూర్చుండి పోయాడు.
‘‘కూతంత టీ యెట్రాదే..’’ అన్నాడు ఆ మనిషి.
కొడుకుని ముద్దులాడుతున్న ఆమె ఓర కంట వెంకటేష్‌ని చేసి మళ్ళీ మొగుడి వంక చూస్తూ ‘‘సిన్న బెల్లమ్ముక్కేనా లేదు’’ అని ఆగిపోయింది.
ఆ మనిషి తవూపి ‘‘పోన్లే ఉత్తదైనా ఎట్టే..’’అన్నాడు.
‘‘యిప్పుడా పొయ్యి నే యెలిగించలేను బాబూ…నువ్వే ఎట్టేస్కో…’’ అందామె.

అతను లేచి వంట గదిలోకి వెళ్ళాడు. కాసేపు చెమ్మ దేరిన పుల్లల్ని తిట్టి పోసి వుఫ్‌…వుఫ్‌.. అని వూది వూది ఎట్టకేలకి మంట పెట్టాడు. ఇల్లంతా పొగ. మంట రావడంతోనే అమ్మ వొళ్ళో ఉన్న కుర్రాడు జువ్వలా లేచి నాన్న పక్కన దూరాడు. కాస్సేపటికి పొడుగాటి స్టీలు గ్లాసులో నల్లటి రంగు నీళ్ళు .. ఆవిర్లు చిమ్ముతూ     ఉండగా వెంకటేష్‌ కిచ్చాడు. వెంకటేష్‌ దాని వంక కాసేపు చూసి మెల్లిగా ఓ గుక్క తాగాడు. ఏ రుచీ లేదు. వేడి నీళ్ళు .. నాలుగైదు గుక్కలు తాగాకా ఏదో రుచి తగిలింది. వగరు వగరుగా ఉన్న ఆ రుచి బాగున్నట్లు కూడా అనిపించింది.
టీలు తాగేశాక ఆవిడ లేచి గ్లాసుల్ని వాన నీటిలో పెట్టి తొలిచేసింది. లోనికి పోయి మంచం మీద వాలింది. పాకలో మనిషి బీడీ తీసి పొయి దగ్గర వెలిగించి బయటకొచ్చి కూర్చున్నాడు.
తన బ్యాగ్‌ మీద వెనక్కి వాలి కూర్చున్న వెంకటేష్‌,
‘‘మీ అబ్బాయి పేరేంటండీ…’’అనడిగాడు.
‘‘సోమరాజండి.. మా అయ్య పేరెట్టాను’’
‘‘కుర్రాడు మంచి చురుగ్గా ఉన్నాడు. చదువుతున్నాడా?’’
‘‘అబ్బే.. ఏం సదూతాడండీ.. పనీపాటా లేకుండా బళ్ళో కూర్చుంటానంటే మనకి గడదు కదా…’’
‘ఓర్నీ… అంటే పనీపాటా లేనోళ్ళు చదువుకుంటారా’ అనుకుని ‘‘అలాక్కాదు.. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. డబ్బు సంపాదించవచ్చు కుర్రాడు బాగుపడతాడు కదా…’’అన్నాడు.
‘‘ఆయ్‌… ఎందుక్కాదండీ.. కానీ యేట నేర్చుకోకపోతే ఎట్లా బతుకుతాడండీ…’’
నవ్వొచ్చింది వెంకటేష్‌కి. ఉద్యోగం వస్తుందిగా అంటే ఎలా బతకాలంటాడు. అందుకే వీళ్ళు పైకి రావడం లేదు అనుకొని
‘‘అది కాదండీ.. చదువుకోవడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. పెద్ద పేరు సంపాందిచవచ్చు. నాకు తెల్సిన కుర్రాడు ఒకతనున్నాడు. అతనూ ఇంతే ఉంటాడు. అతణ్ణి కూర్చొపెట్టి అడిగామనుకోండి.. ఇరవై ముప్పైదేశాల పేర్లూ .. వాటి అధ్యక్షుల పేర్లూ టకటకమని చెప్పేస్తాడు. అతణ్ణి ఒకసారి టీవీలో చూపించారు కూడా. ఇదంతా ఎలా వచ్చింది? చదువు వల్లనే కదా…’’

ఆ మనిషి బీడీని అవతలకి విసిరేస్తూ ‘‘నిజమే బాబూ సదుంకోబట్టే అన్ని తెలివితేటలు..’’  అని ఆగాడు. ఆగి మళ్ళీ ‘‘మావోడు కూడానండీ శానా తెలివైనోడేనండి.. యింతున్నాడు ఆడు.. ఎన్ని విషయాలు తెలుసో తెలుసాండీ.. గోదాట్లోనూ.. సముద్రంలోనూ దొరికే చేపల్ని బలే గుర్తుపట్టేస్తాడండి. .. మీరడగండి ఎన్ని రకాల చేపలు చెప్తాడో.. ఈ చుట్టుపక్కలెవరికీ అన్ని సేపలు తెల్నే తెల్దు.’’ అని ‘‘ఒరేయ్‌ సోవుడూ మనకి దొరికే చేపల పేర్లు చెప్పరా…’’అన్నాడు.
ఆ కుర్రాడు వెంకటేష్‌ని చూసి మళ్ళీ వాళ్ళ నాన్న వంక చూస్తూ ‘‘మట్ట గిడసలు, చేతిపరిగెలు, వంజరం, పులస, ఇలస, పండుగప్ప, వాలుగ, మోసు, బొచ్చు, ఎల్ల కొరమీను, ఇసుకదొందు, మార్పు, రొయ్య, గండమీను, గొయ్యింకలు, తాటిగిలస, బొమ్మిడాయి, గొరస, బేసిన, శీలావతి, బెత్తుపరిగ, సొరచేప, కానాగదులు, సందువ, సావిడాలు, పీతలు, టేకి, కవళ్ళు, చుక్క పీతలు..’’అంటూ వూక్కుంటూ చెప్పాడు.
‘నాన్సెన్స్‌’అనుకున్నాడు వెంకటేష్‌. నేను చెపుతున్న విషయమేంటి.. ఈ బోడి చేపల విషయమేంటి?…కొద్ది సేపటికి అతని పెదాల మీది వంకర నవ్వు లోనికి ఇంకి పోయింది. అవును .. ఆ కుర్రాడు తను ఎందులో ఉన్నాడో.. తను ఎందులో ఉంటాడో దాని గురించి అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. వరద గోదావర్ని కటిక చీకట్లో ఈదగల సాహసి. తన కొడుకు.. ఇరవై దేశా పేర్లూ… అధ్యక్షు చెప్పగలిగే వాడు.. ఆటలు పాటలూ లేకుండా ఐదేళ్ళ వయసునించీ నూరి నూరి పోస్తే చెప్తున్నాడు. కానీ వాడికి .. ఆ వయస్సులో.. ఆ దేశాలతోనూ.. అధ్యక్షులతోనూ… పనేంటి? వాడికీ వాడి బుర్రకీ అక్కర్లేని విషయాల్ని జీకె పేరు మీద అంటగడుతున్నాం. దాన్ని జ్ఞానం అనాలా… ఇంత చిన్న వయసులో తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి ఇంత అపారమైన ఎరుక సంపాదించిన ఈ కుర్రాడిది జ్ఞానం అనాలా..
ఇది విద్య కాదా.. చదువు కాదా..
అతడి ఆలోచను అలా సాగిపోతున్నాయి. తండ్రీ కొడుకులిద్దరూ అలా వాలి కళ్ళు మూసుకున్నారు. అవును, ఈ కుర్రాడు పెద్ద డబ్బు సంపాదించలేడు. పేరూ సంపాదించలేడు. కానీ నీళ్ళు నదులు సముద్రాలు చేపలు ఈ బ్లూగోల్డ్‌కి సంబంధించిన మార్కెట్లో వీడూ వీడి జ్ఞానమూ భస్మమైపోతాయి. పనికిమాలిన వాడెవడో లక్షలు పోసి ఇంజనీరింగో యింకోటో చదివి చేపల స్పెషలిస్టౌతాడు. వీళ్ళని ఇక్కణ్నుంచి గెంటేసి నీటినీ, చేపల్నీ కంప్యూటర్లో వెదికి సముద్రాన్ని జల్లెడ పట్టేస్తాడు. కోట్లు గడించేస్తాడు.
ఇంత సాహసం.. జ్ఞానం వున్న ఈ కుర్రాడు ఏ బురద గుంటనో వెదుక్కుని మట్టగిడసల్ని దేవులాడుకుంటూ బతుకుతాడు.. ఏంటో ఈ చిత్రం..
కునుకు పట్టేసింది.

మళ్ళీ కళ్ళు తెరిచేసరికి చారు పోపు వాసన కమ్ముకుని ఉంది. బయట అంతగా చప్పుడు లేదు. అతడు గమ్మున లేచి గుమ్మంలోంచి చూశాడు.
వాన తగ్గి పోయింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అయినా ఫర్వాలేదు. పోవచ్చు.
అతను చిన్న పిల్లాళ్ళా వెనక్కు తిరిగి యింట్లో వాళ్ళని చూస్తూ..
‘‘వాన తగ్గిపోయింది’’ అన్నాడు. అని మళ్ళీ నాన్సెన్స్‌ ఏంటీ వింత ప్రవర్తన అనుకుని
‘‘నేను బయలు దేరవచ్చు’’అన్నాడు.
పాకలో మనిషి తల ఊపుతూ.. ‘అవును బాబూ బేగెల్లి పోతే అమలాపురం పోవచ్చు’’ అని ‘‘వణ్ణం పెట్టేయ్యే..’’
‘‘అబ్బే ఎందుకండీ ఎలాగూ అమలాపురం పోతాను గదా…’’ అన్నాడు గానీ ఆకలి దంచేస్తోంది. అతను గబగబా రాత్రి తీసిన దుప్పట్లూ, తడిగా ఉన్న బట్టల్ని బ్యాగ్‌లో కుక్కేసి ఆ షార్టూ చొక్కాతోనే తయారై పోయాడు. చారుపోసిన అన్నం గిన్నె తెచ్చి ఆమె మంచం దగ్గర పెట్టింది. వెంకటేష్‌ గబగబా తినేశాడు. సాక్సు లేకుండానే బూట్లు తొడిగేసుకుని బ్యాగ్‌ని భుజాన తగిలించుకున్నాడు. లేచి ఒక్కసారి ఆ ఇంటిని చూశాడు.
గుమ్మం దగ్గర ఆమె ఆమె కొంగు పట్టుకుని కుర్రాడు నిబడి   ఉన్నారు. పాకలో మనిషి తనతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంకటేష్‌ అసంకల్పితంగా ఆమెకి నమస్కారం పెడుతూ, ‘‘సొంత అక్కకన్నా బాగా చూశారునన్ను మీకు … నా .. నా..థ్యాంక్స్‌… ’’ అన్నాడు.

ఆమె నల్లటి ముఖం ఎర్రబడి పోగా తల పక్కకి తిప్పుకుని బిడ్డని దగ్గరగా లాక్కుంది.
‘‘వస్తానండి’’ అంటూ బయటకొచ్చాడు.
‘‘అబ్బే .. అటెళ్ళేమండీ.. ఆ రేవంతా మునిగిపోయింది చూశారా..’’ అన్నాడు పాకలోని మనిషి.
అటు చూశాడు. నిన్న తాను నడిచొచ్చిన గట్టు కొంత దూరం కనిపిస్తోంది. ఆ పైన అంతా ఎర్రటి నీళ్ళు. పక్కని గోదావర్ని చూస్తే గుండె ఝల్లుమంది. సుడులు తిరుగుతూ ఒక ఇంద్రజాల శక్తిలా వెళ్తోంది. ఒక్క నిమిషం అలా చూస్తే మనకీ అందులోకి పోవాలనే వాంఛ కలుగుతుంది.

‘కానీ యింత అందమైనదీ… ఆత్మనీ మనసునీ కడిగేసిన అద్భుత దృశ్యాన్ని తాను జీవితంలో చూడలేదు’ అనుకున్నాడు.

పాకలో మనిషి గట్టు దిగి మోకాల్లోతు నీటిలో నడుస్తున్నాడు. వెనకే జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు వెంకటేష్‌. చినుకు వడి తగ్గింది. కానీ అలా జల్లులా పడుతూనే ఉంది. ఒక అరగంటపైన నడిచాక అకస్మాత్తుగా సన్నటి రోడ్డు తగిలింది. అక్కడ ఆగి అన్నాడు పాకలో మనిషి.

‘‘ఇదే బాబూ మీ దారి.. ఇదుగో ఇలాగెళ్ళి పోయారనుకోండి… ఆ కనపడేది సెంటరు’’అని చేతిని కళ్ళకడ్డం పెట్టుకుని చూసి ‘‘ఒక ఆటో వాడున్నట్టున్నాడు రండి వస్తాడేమో..’’ అని నడిచాడు.

ఆటో ఉంది. ఎవరూ లేరు. పాకలో మనిషి రోడ్డు పక్కగా ఉన్న ఇళ్ళలోంచి లోనికెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాడు, ‘ఆటో నట్టం లేదంట’’అంటూ.

వెంకటేష్‌ తడుస్తూ నిబడ్డాడు. ఆ మనిషి అన్నాడు.

‘‘ఇంక చేసేదేముంది బాబూ.. ఈ రోడ్డు మీంచి పోతే కాస్తంత దూరంలో పేరూరగ్రహారం వస్తది. ఇంకక్కణ్నించి ఏదో ఒకటి దొరుకుతుంది. అమలాపురం… రోడ్డలవీ బాగుంటే ఆదూరు కూడా పోవచ్చు. ’’

‘‘ఎలా వెళ్ళాలి?’’

పాకలో మనిషి ఆటోలోకి వొంగి బీడి వెలిగించి నవ్వుతూ..

‘‘నడిచి’’ అన్నాడు.

అవును… నడిచిపోవచ్చు కదా.. రెండు కాళ్ళున్న సంగతీ వాటితో నడవచ్చన్న సంగతి కూడా బుర్రకి తట్టలేదు. వెంకటేష్‌ కూడా నవ్వుకుంటూ ‘‘అవును కదా’’ అన్నాడు.

‘‘మరైతే నే ఎల్తాను బాబూ.. గోదారి గానీ పొంగిందంటే పాక లేచి పోద్ది’’అన్నాడు అతను.

వెంకటేష్‌ ‘‘అవును…’’ అంటూ ఆటో ముందు సీట్లో  బ్యాగ్‌ని పెట్టి దాని ముందు పాకెట్లోంచి పర్సు తీసి రెండు వందలు తీశాడు.

‘‘ఉంచండి’’ అంటూ ఇవ్వ బోయాడు.

అతను బీడీ విసిరేసి ‘‘ఒద్దు బాబూ…తప్పు’’ అన్నాడు.

‘‘ఫరవాలేదు. రాత్రి ఉన్న పరిస్థితిలో మీరు లేకపోతే నా పరిస్థితి ఏంటో .. తల్చుకుంటేనే భయమేస్తోంది. నేనెవరో తెలియక పోయినా సొంత చుట్టంలా ఆదరించారు గదా.. అందుకని’’

అతను నవ్వి అన్నాడు

‘‘మనిషి సుఖంగా ఉన్నప్పుడు యాపారం చేయొచ్చు బాబూ.. కస్టంలో ఉన్నప్పుడు యాపారం చైకూడదు. రాత్రి మీరు కస్టంలో వచ్చారు. మీరు మడిసి.. నేను మడిసిని.. వానకి ముద్దైన పిట్ట చెట్టు మీద వాలబోతే చెట్టొద్దంటదా.. యిదీ అంతే..’’ అని ఆగాడు.

వెంకటేష్‌ మెల్లిగా డబ్బుల్ని పర్సులో పెట్టేసుకుని బ్యాగ్‌ని భుజం మీద పెట్టుకున్నాడు.

ఆ మనిషి అంటున్నాడు.

‘‘రాత్రి ఉన్న పరిస్థితి అన్నారు కదా బాబూ.. అలాంటి పరిస్థితిలో మడిసికి మడిసి సాయపడకపోతే ఇంకాణ్ణి మడిసనెలా అంటాం… యిలాగే నాలాంటి మడిసి నీ యింటి ముంగిట నిలిస్తే లోనికి రమ్మంటావా.. బయటగ్గెంటేస్తావా… ’’అని ఆగి

‘‘సరే వస్తాను బాబూ .. జార్తగెల్లి రండి…’’అంటూ వెనక్కి తిరిగాడు.

వెంకటేష్‌ అతను వెళ్తున్న వేపే చూస్తూండిపోయాడు.

‘లోనికి రమ్మంటావా… బయటగ్గెంటేస్తావా…’

ఈ ప్రశ్నకి సమాధానం మనసులోనైనా అనుకోవడానికి అతడికి భయమేసింది.

విపుల,  ఫిబ్రవరి, 2007  

కొప్పర్తి రాంబాబు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సరికొత్త కంఠం పరిచయం కావడం సంతోషం గా ఉంది. రాంబాబు గారి గాత్రం తో ॥ గోదారిమీద కురిసిన వాన ఈ మండు వేసవిలో మా ఇంట్లో కురిసింది. కథలోని పాత్ర వెంకటేష్ మాత్రమే కాదు, నేను కూడా ఆ సరికొత్త ప్రయాణపు అనుభూతిని, రాత్రి ఆ పాకలో నిదురించి వేడి వేడి అన్నాన్ని తిన్నాను. సృష్టిలోని ప్రతీ మానవునికోక జీవన సంగీతం ఉంటుంది. దూరం నుండి లీలగా వినే(మనసుండి) మనకు , దగ్గర గా వెళ్లి వినగలిగితే స్పష్టత వస్తుంది. విషాద గీతం కూడా ఒక్కోసారి కౌగిలించుకుని వెచ్చని హాయినిస్తుంది నిరూపించిన కథ ఇది. రచయిత అద్దేపల్లి ప్రభు గారికి, కథ టెంపో మిస్ అవ్వకుండా కలకాలం చెవుల్లో రింగుమనేలా, చెవులగుండా శ్రోతల గుండెల్లోకి ఓంపిన కొప్పర్తి రాంబాబు గారికి, ప్రకటించిన సారంగ వారికి ధన్యవాదాలు.

  • వెంంకటేష్ నిస్సంందేహంంగా బయటకు గెంంటేస్తాడు.చదువుకున్న వాళ్ళు నాగరికులవ్వవచ్చు.కానీ,మానవతావాదులు అవ్వాలని లేదు.ప్రభుగారి కథ మొదటిసారి చదవడంం.ఆయన మిగిలిన కథలన్నీ చదవాలనే కుతూహలంం కలిగింంచిన కథ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు